“ఈనాడు కార్టూన్లు” – మన శ్రీధర్ కార్టూన్లు

రాసి పంపిన వారు: అరిపిరాల సత్యప్రసాద్
***********************
ఈనాడు తెలుగు దినపత్రిక గురించి కార్టూనిస్ట్ శ్రీధర్ గురించి పరిచయం అవసరం లేదనుకుంటాను. ఈనాడు కొనగానే హెడ్లైన్స్ వెంట చూపు పరిగెత్తించడం ఎంత సహజమో, వెనువెంటనే ఎడమచేతి వైపు మూలగా వుండే “ఇదీ సంగతి” చూడటం అంతే సహజమైన అలవాటుగా మారిన ఆంధ్ర పాఠకులకు శ్రీధర్ సుపరిచితుడు. ఒక్క పరిచయమే కాదు – తెలుగువారి అత్యంత ఆప్తుడైనవాడు, తెలుగువాడి ఆస్థి కూడాను. తెలుగులో పొలిటికల్ కార్టూనిజానికి ఒక స్థాయిని, ప్రత్యేకతను తెచ్చిపెట్టినవాడు శ్రీధర్. అతని బొమ్మలో వ్యంగ్యం వుంటుంది, రక్తి కట్టించే క్యాప్షన్ వుంటుంది వెరసి అతని కార్టూన్ల వెనక ఎంతో విషయ పరిజ్ఞానం కనపడుతుంది.

ఇలా శ్రీధర్ ఈనాడులో 1982 నుండి 1999 వరకూ వేసిన రాజకీయ కార్టూన్లు ఒక సంకలనంగా తెచ్చారు ఉషోదయా పబ్లికేషన్స్. (1999లో ముద్రించబడిన ఈ పుస్తకం పునర్ముద్రణకి నోచుకుంది లేనిది తెలియరాలేదు. మళ్ళీ ఆ పుస్తకం నాకు ఎక్కడా కనిపించలేదు.) ఇందులో అనేక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విషయాలపై శ్రీధర్ వేసిన వ్యంగ్యాస్త్రాలు వున్నాయి. అయితే ఎక్కువగా రాష్ట్ర రాజకీయాలపైన గీసిన కార్టూన్లే కనిపిస్తాయి.

అసలు ఈ కార్టూన్లు వేసిన సంవత్సరాలే ఎంతో ముఖ్యమైనవి. రాజకీయ రంగంలో ప్రభంజనంలా లేచిన ఎన్.టీ.ఆర్ ఈ పదిహేడుసంవత్సరాలలోనే ఉథానపతనాలను చూశాడు. ఎన్.టీ.ఆర్ సంచలనాన్ని ఆసరాగా ఈనాడు ఎదిగిందో, ఈనాడు ఆసరాగా ఎన్.టి.ఆర్ ఎదిగాడో చెప్పటం అంత సులభం కాదు కాని – ఈ రెండు పెనవేసుకోని వున్నాయని చెప్పవచ్చు. ఇదే సమయంలో ఆంధ్ర ప్రజలలో రాజకీయ స్పృహ పెరిగిందనేది కూడా నిర్వివాదాంశం. ఇలా పెరగటంలో ఎన్.టీ.ఆర్, ఈనాడు రెండూ ప్రముఖ పాత్ర పోషించాయని నేను నమ్ముతాను. అందుకే ఈ కాలంలో గీసిన పొలిటికల్ కార్టూన్లకు చాలా ప్రాముఖ్యత వుంది.

ఈ పుస్తకం ఎప్పుడు తిరగేసినా నాకు ఆంధ్ర రాజకీయాలలో ఎలా మార్పులు జరిగింది, ఏ ఏ పార్టీలు, నాయకులు ఎలా వ్యవహరించారు అనే విషయాలు తెలుస్తాయి. రామారావు ముఖ్యమంత్రి కావటం, నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు, ఎన్.టీ.ఆర్. సినిమా-రాజకీయ జోడు గుర్రాల స్వారి, కాంగీలో – కోట్ల, నేదురుమల్లి, చెన్నారెడ్డీల శకం, వై.యస్ వర్గం అసమ్మతి, సారా వుద్యమం, లక్ష్మి పార్వతి ప్రాభవం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇలా రాష్ట్ర రాజకీయ చరిత్ర వెంట చిరునవ్వులతో విహారం చేసెయ్యచ్చు. అలాగే కేంద్రంలో ఇందిరా గాంధితో మొదలై, రాజీవ్ నాయకత్వం, వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవగౌడ హయాముల మీదుగా బీజేపి పాలన వరకూ ఒక ప్రయాణం సాగుతుంది.

ఇక శ్రీధర్ కార్టూన్ల గురించి, అందులో బొమ్మల గురించి – నవ్విస్తాయి – ఇది అందరికీ తెలుసు. అయితే బొమ్మ చూడగానే ఇది ఫలానా వ్యక్తిదని వెంటనే తెలిసిపోయేంతలా బొమ్మలు గీయడం శ్రీధర్కే సాధ్యం అంటే అతిశయోక్తి కాదేమో. అందుకే అతని బొమ్మ చూడగానే ఒక సన్నివేశం చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఎన్టీయార్ మీద కార్టూన్లు చూస్తున్నప్పుడు వెనకాలే వున్న చంద్రబాబు, దగ్గుబాటి – అలాగే కాంగ్రేస్ మీద వేసిన కార్టూన్లలో ముఖమంత్రి పక్కనో వెనకో కనిపించే రోశయ్య, వై.యస్ మనకి ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. శ్రీధర్ సునిశిత పరిశీలనకు అవి మచ్చు తునకలు.

రామోజీరావుగారు ముందుమాటలో చెప్పినట్లు – “కాలంతో పోటిపడి ఈ లైనూ బెసగకుండా పర్ఫెక్ట్ రాజకియ వ్యంగ్య చిత్రాన్ని రక్తికట్టే క్యాప్షన్తో అత్యంత వేగంగా అందించగలిగే నేర్పు మాత్రం శ్రీధర్దేనని చెప్పగలను”

అయితే ఈ శ్రీధర్కి ఇన్ని వేల కార్టూన్లకి ఆలోచనలు ఎలా వస్తాయి? అనే ప్రశ్నకు సమాధానం శ్రీధర్ మాటల్లోనే – “.. అనేకనేక మహానాయకులూ వాగ్దానాలూ కొనసాగుతున్నంతకాలం ఈ దేశాంలో కార్టూనిస్టులకు మృష్టాన్నమే. ఐడియాలకు కొదవుండదు. మేం నిరుద్యోగులుగా వుండం..” (అందునా ఈ కార్టూన్లు వేసిన కాలంలో ఎన్.టీ.ఆర్ వున్నాడు, ఇక ఐడియాలకు కొదవేమి – క్రింద కొన్ని కార్టూన్లు చూడండి)

ఈ పుస్తకాన్ని ఒక ఆల్బంలాగ బౌండ్ అట్టతో కలెక్టర్స్ పీస్గా మలచిన ప్రకాశకులు అభినందనీయులు. అయితే మరీ పేజికి ఒక కార్టూనే వుండటం వల్ల దాదాపు 200కి మించి కార్టూన్లు వుంచలేకపోయారు. మొత్తం మీద కాలక్షేపానికి, కాస్సేపు హాయిగా నవ్వుకోడానికి ఎలాగూ పనికొచ్చే పుస్తకమే అనుకోండి కాకపోతే రాష్ట్ర/జాతీయ రాజకీయా చరిత్రని వ్యంగ్య దృష్టితో ఒకసారి మననం చేసుకొడానికి కూడా ఈ పుస్తకం ఎంతో బాగుంటుంది.

(ఇందులో వున్న కొన్ని కార్టూన్లు – అంతర్జాలంలో దొరికినవి)

1. డిసెంబర్ 1989 తెలుగుదేశం వోటమి, కాంగ్రెస్ గెలుపు. ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి ప్రమాణ స్వీకారం
2. 14 జులై 1985 గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక పథకం
3. 5 ఆగస్టు 1985 పెట్రోలు ధర పెంపుకు నిరసనగా ముఖ్యమంత్రి ఎంటీఆర్ బస్సులో ఆఫీసుకు వెళ్తానన్నారు
4. 18 జూన్ 1989 మహర్షి విశ్వామిత్ర షూటంగూ, ప్రతిపక్షాల సమావేశం ఒకే రోజున ప్రారంభం
5. 12 నవంబర్ 1985 చంద్రబాబుని విమర్శించినందుకు మంత్రి శ్రీనివాసులురెడ్డికి ఉద్వాసన
6. 14 జూన్ 1983 మహాకవి శ్రీశ్రీ అస్తమయం
7. 12 ఫిబ్రవరి 1996 రూపయి విలువ మరింత తగ్గింపు
8. 19 జనవరి 1996 సకలాంధ్ర ప్రజా నీరాజనం అందుకున్న మహానటుడు, స్వాప్నికుడు ఎన్టీఆర్ మరణం

**********************************************************************
శ్రీధర్ కార్టూన్లు మరిన్ని ఈ బ్లాగులో చూడవచ్చు.

You Might Also Like

7 Comments

  1. jagadeshwar

    srdhar cartunuiu chala baguntaye

  2. Umasankar

    వ్యాసం బావుంది.

    నేను కూడా పేపరు చేతికిరాగానే శ్రీధర్ కార్టూన్ ని ఆసక్తిగా చూస్తాను..తన గీతలో అందరు నాయకులూ చక్కగా ఇమిడిపోతారు..ముఖ్యంగా గడ్డం కాస్త ముందుకు వచ్చినట్టుండే ఎన్టీఆర్.

    అయితే నాకు ఆయన కార్టూన్లలో మొనాటనీ ఎక్కువ కనపడుతుంది..బహుశా చిన్నప్పటినుంచి క్రమం తప్పకుండా నేను గమనించిన ఏకైక కార్టూనిస్టు కావడం వల్లనేమో.. 🙂

    పొత్తుల విషయంలో రాజకీయనాయకులకు ఆడవాళ్ళ వేషాలు వేయడం, రెండు బోట్ల మీద కాళ్ళు పెట్టడం, వళ్ళంతా బేండేజీ ఉన్నవాళ్ళని దుడ్డుకర్రతో ఇంకా బాదటం, ముళ్ళకుర్చీ, ఏదో ఒక జంతువు వెనకనుంచి మింగటానికి సిద్దంగా ఉండటం..పులిమీద స్వారీ లాంటివి..ముఖ్యంగా ఈనాడు ఆదివారంలో..

  3. pappu

    అబ్రకదబ్ర గారి వ్యాఖ్యే నాది కూడా,కాకపోతే చిన్న సవరణ.10,000 ల కు పైగా కార్టూన్లు వేసిన నిర్లిప్తత కాదేమోనండీ…ఇలాంటి చెత్త రాజకీయాల గురించి వేయాల్సి/రాయాల్సి వస్తోందేమో అని నా అభిప్రాయం…

  4. సచిన్

    శ్రీధర్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. నేను వీరాభిమానిని. అతనిమీద వ్యాసానికి అభినందనలు. ఈరోజు ఈనాడులో కార్టూన్ ( లోపలి 4వ పేజీలో)వ్యాఖ్య అదిరింది. ‘రాజకీయాలంటే మరేం లేదు, దండలు, దండకాలు, దండుకోవడాలూ.

    పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. ఈ పదేళ్ళ కార్టూన్లపై కూడా పుస్తకమొస్తే బావుండు.

    @అబ్రకదబ్ర – శ్రిధర్ సంతకం ఇరవై ఏళ్ళైనా మారని రాజకీయ పరిస్థితుల మీద నిస్ప్రుహతో
    చేస్తున్నదనుకుంట! మీ పరిశీలన బావుంది.

  5. అబ్రకదబ్ర

    వ్యాసం చాలా బాగుంది. పుస్తకం ఎటూ బాగానే ఉంటుందనుకోండి. శ్రీధర్ లేనిదే ఈనాడుని, ఈనాడు లేకుండా శ్రీధర్‌ని ఊహించుకోలేమేమో.

    కొన్నేళ్లుగా శ్రీధర్ రేఖల్లో చాలా తేడా కనిపిస్తుంది. పదేళ్ల కిందటి మన సంతకానికీ, ఇప్పటి సంతకానికీ తేడా చూసుకుంటే కనిపిస్తుందే – అలాంటి తేడా. కొత్తలో పొందికగా, ఎంతో మోజుగా చేసే సంతకం కాలక్రమేణా కొంత అసహనంతో, హడావిడిగా, ‘చేసేస్తే ఓ పనైపోతుంది’ అన్నట్లు చేస్తాం చూడండి – అలాంటి మార్పు శ్రీధర్ కార్టూన్లు వేసే ధోరణిలోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పదివేలకు పైగా కార్టూన్లేశాక వచ్చే నిర్లిప్తతేమో!

  6. chavakiran

    హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో పొయిన సంవత్సరం ఈనాడు స్టాల్ లో ఉంది. ఈ సారి కూడా ఉండవచ్చు. డిసెంబర్ 17 వరకు ఆగాలి.

  7. రవి

    ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందండీ? ఖరీదెంత?

Leave a Reply