ఒంటరి పూలబుట్ట – 1

రాసిన వారు: స్వాతి శ్రీపాద
(ఇటీవలే, నవంబర్ మొదటి వారం లో ఆవిష్కరింపబడ్డ రాళ్ళబండి కవితాప్రసాద్ గారి కవితా సంపుటి “ఒంటరి పూలబుట్ట” పై సమీక్ష – మొదటి భాగం ఇది.)

****************************************************************************
ontari1ఈ మధ్యనే రవీంద్ర భారతిలో ఆవిష్కరింపబడ్డ అద్భుతమైన కవితా సంపుటి “ఒంటరి పూలబుట్ట.” కవిత్వాన్ని హృదయాన్ని చిలికి అమృతంలా అందించిన వారు డా. రాళ్ళబండి కవితా ప్రసాద్.

కోసిన
పూలన్నీ
కోవెలకెళ్ళి పొయ్యాయి

ఒంటరి
పూలబుట్ట తప్ప

– అంటూ ధ్వని ప్రాధాన్యత మొదటి కవితలోనే పొందుపరచారు.

పువ్వులు
ఆకుల్లా
గలగల్లాడవు
వాటిది
పరిమళ ధ్వని.

ఒక మామూలు నిజాన్ని అతి మామూలుగా వ్యక్తం చేస్తూనే అనంత మైన భావాన్ని పొదగడం ఒక్క కవితా ప్రసాద్ కే తెలిసిన విద్య. ఆకులు గలగల్లాడటం నానార్ధాలనూ సూచిస్తుంది. ఎండిన ఆకుల గలగలలగురించి అందరికీ తెలుసు. ఆకులు గలగలలాడటం అనేది ధ్వన్యనుకరణం(onomatopoeia) . దానితో పాటు పరివర్తనా విశేషణంకూడా(transferred epithet). మళ్ళీ పరిమళధ్వని అనేది పరివర్తనా విశేషణం (transferred epithet) తో పాటు రూపకసమాసం కూడా.

ఎక్కడా అర్ధం చెడకుండా క్లిష్టత తొంగిచూడకుండా అలంకారశాస్త్రాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ అతి పొదుపుగా కవిత్వం వ్రాయటం లాంటి ప్రక్రియ అలవోకగా చేపట్టి దిగ్విజయం సాధించిన కవి కవితా ప్రసాద్.

భూమి
భగవంతుడి భిక్షాపాత్ర
నింపే వాళ్ళకన్నా
దోచుకునే వాళ్ళే ఎక్కువ

-ఇక్కడ మనకు కవితా విలోమము (poetic inversion ) కనిపిస్తుంది. భూమి పాత్రను నింపటం , దోచుకోవటం ఎంత ఉదాత్తమైన భావన.

గదిలోపలి
అధికారం కన్నా
వరండాల్లోతిరిగే
“పచార్లకు”
పొగరెక్కువ.

-ఇక్కడ ప్రతీకాత్మకత (సింబాలిజమ్) కనిపిస్తుంది. గదిలోపలి అధికారం దేన్ని సూచిస్తుందో అందరికీ తెలుసు. అలాగే వరండాలో పచార్లూ, పచార్లకు పొగరెక్కువ మళ్ళీ పరివర్తనా విశేషణం. ఓ పచ్చినిజాన్ని ఇంత గుంభనగా ఇంత కవితాత్మకంగా చెప్పటం సాధ్యమా?సాధ్యమే కద!

మేఘ నాయికమీద
మెరుపు దాడి
ఉరుములు విలాపం
వర్షం కన్నీరు

-మేఘనాయిక ఓ అద్భుత ప్రయోగం. మెరుపు దాడి కి రెండర్ధాలు. ఒక మెరుపు మెరుపైతే మరొకటి హఠాత్తుగా … ఉరుములు విలాపం వర్షం కన్నీరు ఆద్యంతం రూపక సమాసాలతో కవితను అలంకరించారు. ఆధినికత జోడించారు. అసహాయత వర్ణించారు. కావ్య కన్యకను హృద్యంగా మలచారు.

కవి కన్నా
కవిత బరువెక్కువ
అందుకే త్వరగా
వదిలించుకుంటాడు

-అన్యాపదేశంగా ఒక కవితను పూర్తి చేస్తే గాని మరొకటి రాయలేని కవి నిస్సహాయత కనిపిస్తుంది. అగుపించని కవిత బరువు సూచించబడింది. పోతన చాయలు కనిపిస్తాయి.

నిరాశల గబ్బిలాలే
గతం గుహలో
నివసించాలని చూస్తాయి. ఆశల సింహాలు
వర్తమాన శిఖరం నించి
భవిష్యత్ గజాలపైకి
లంఘించాలని చూస్తాయి.

-మళ్ళీ ఈ కవిత మొత్తం అత్యాధునుక రూపక సమాసాల సమూహం.

నిరాశల గబ్బిలాలు, గతం గుహ , ఆశల సింహాలు , వర్తమాన శిఖరం , భవిష్యత్ గజం, ఆశల సింహాలు లంఘించాతమ్.. కవితా భావుకతలోనే అవసరమున్నంత స్పష్టత. ఆశనిరాశల ఊగిసలాట.

పువ్వుకు తెలియదు
పరిమళం ప్రమాదమని
స్త్రీకి తెలియదు
సౌందర్యం ప్రమాదమని

-రెండు సమానార్ధక వాక్యాలు , పువ్వు స్త్రీ రెండూ అమాయకతకు ప్రతిరూపాలే. పరిమళం, సౌందర్యం రెండూ ప్రమాద భరితాలే. అయితే కనిపించే మాటల వెనక పదాల మధ్యన కనిపించని భావాలెన్నో..

ఆక్షరాల గదిలో
ఆలోచనల సంకెళ్ళతో
అతడు బందీ
ఇంతకూ చేసిన నేరం
కవిత్వం

-కవి పరిస్థితి వివరణా మళ్ళీ రూపక సమాసాల్లో అక్షరాల గది , ఆలోచనల సంకెళ్ళూ , నేరం కవిత్వం వీటన్నింటిమధ్యా దాగిన అతడూ -కవి. నేరం కవిత్వం వ్రాయడం.

ప్రతి నరమూ
తీగగా మోగాల్సిన
ఆమె శరీర వీణ
ఏ ఉత్సవానికీ పాడటం లేదు.
మెడలో తాళి లోపలి తంత్రుల్ని తెంచిందేమో?!

-ఆమె శరీరం వీణ , ప్రతి నరమూ తీగగా మోగాల్సినది మోగలేదు… ఏ ఉత్సవానికీ పాడటం లేదు. శరీర వీణ పాడటం కొత్త ప్రయోగం. మెడలో తాళి లోపలి తీగలను తెంపటం వల్ల శరీరం పాడలేకపోవడం ఎంత సునిశితమైన విశ్లేషణ!

ఓహ్!
ఈ పద్యాన్ని
గుర్తుపట్టాను
ఇది మారువేషంలో వచ్చిన
ప్రేయసి

-పద్యం మారు వేషంలోవచ్చిన ప్రేయసి కావడం కవి గుర్తుపట్టడం ఎంత చక్కని భావన.

{ సశేషం }

*******************
పుస్తకం వివరాలు:
“ఒంటరి పూల బుట్ట” – రాళ్ళబండి కవితాప్రసాద్
ప్రచురణ : నవంబర్ 2009
వెల: 200/-
ప్రచురణ కర్తలు: కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాద్ (040-27426666)
ప్రతులకి: డా. రాళ్ళబండి కవితాప్రసాద్, 203, Timbu Enclave, Motinagar, Hyderabad-18.
email: kavithaprasad@yahoo.com

You Might Also Like

7 Comments

  1. sailajamithra

    perulone kavithwanni daachukunna kavitha prasad gari kavitha samputi ONTARI PULA BUTTA ane pere oka kavithwam. Ika andulo kavitha pravaaham kaaka maremuntundi..?

  2. srujana

    chaduvutunte chalabagundi. oka challani pillagali manasunu melliga takutu vellina anubhooti.

  3. బొల్లోజు బాబా

    మంచి కవిత్వానికి మంచి పరిచయవాక్యాలు.

    కవిత్వంలోకనిపించే అలంకారాశాస్త్రవిషయాల్ని వివరిస్తూ పరిచయం చేయటం చాలా చాలా బాగుంది.
    విశ్లేషణ ప్రతిభావంతంగా ఉంది.

    రచయిత్రి అభినందనీయులు.

    బొల్లోజు బాబా

  4. సన్నపురెడ్డి

    అద్భుతమైన కవిత్వం . ఇలాంటి రచన నలుగురికీ తెలియ వలసిన అవసరం ఎంతైనా వుంది. పరిచయం చేసిన వారికి పుస్తకం నెట్ వారికి అభినందనలు. రాళ్ళబండి వారికి నెనర్లు

  5. budugoy

    quote chesina phrases baagunnayi kaani vela 200 roopaayala? kavitvamE ammuDupOdaMTE iMtEsi vela peDitE gOviMdaa gOviMda.

  6. అరిపిరాల

    క్లుప్తత, స్పష్టత ఒకటిగా కలపడం ఒక యోగం. ఇవి పదాల కవిత్వాలు కాదు.. పదాలే కవిత్వాలు. మంచి కవిత్వాన్ని పరిచయం చేశారు. అభినందనలు.

Leave a Reply