పుస్తకం
All about booksపుస్తకలోకం

October 20, 2009

ఇటీవలి కవిత్వం

More articles by »
Written by: అతిథి
Tags:

రాసి పంపిన వారు: విన్నకోట రవిశంకర్
******************************

పారిజాతాలకద్భుత పరిమళాల్ని
పంచి యిచ్చిన వెన్నెలరాత్రి లాగా
దిగులునేలకు జీవం ప్రసాదించే సస్యరుతువు లాగా
కవిత్వం మా పేదబ్రతుకుల్నప్పుడప్పుడు కటాక్షిస్తుంది

కవి ఒక ఉన్నతమైన మానసికస్థితిలో ఉన్నప్పుడు కవిత్వం వెలువడుతుందని పై వాక్యాలు సూచిస్తాయి. దుఃఖం, ఆవేశం, ఆశ, నిరాశ, సంతోషం, సౌందర్య దర్శనం – ఇలా కవితకు ప్రేరణ ఏదైనా కావచ్చు. ఐతే, ప్రేరణ ఒక మెరుపు మాత్రమే. ఆ తరువాత దానినందుకొని, నీలి మేఘంలా మారి, తనలో కరిగిన భావాల్ని కవిత్వపు జల్లులుగా కురిసేవరకు కవి ఆ రకమైన ఉన్నత మానసికస్థితిని కొనసాగిస్తాడు. ఇది ఇతర కళారూపాలకు కూడా వర్తిస్తుంది. ఐతే, వాటికంటె భిన్నంగా కవిత్వం భాషతో ముడిపడి ఉండటంవల్ల ఒక అదనపు సౌకర్యం దానికుంది. కవిత్వం అంటే ఏమిటి, కవిత్వం ఎలా ఉండాలి, కవిత్వం రాయటానికి ఏమి కావాలి – వంటి విషయాల మీద కూడా కవులు కవిత్వం చెప్పే అవకాశం కలిగింది. పెద్దనగారి దగ్గర్నించి తిలక్ వరకు అనేకమంది కవులు కవిత్వాన్ని తమ కవితల్లో నిర్వచించే ప్రయత్నం చేసారు.

ఎనభైల తరువాత వచ్చిన కవిత్వంలో పదచిత్రాలు వాడటం ద్వారా కవితలలో గాఢత పెంపొందించే ప్రయత్నం ఎక్కువగా జరిగింది. కవి అనుభూతిని పాఠకునికి దగ్గరగా తీసుకువెళ్ళటానికి, అనుకూల భావాల్ని అతనిలో రేకెత్తించటానికి ఇవి ఉపయోగ పడతాయి. ఉదాహరణకి ఇటీవల హెచ్చార్కె రాసిన కవిత యరేజర్ లో నుంచి ఈ క్రింది వాక్యాలు చూడండి. ఇది బహుశ ఒక మరణసామీప్య అనుభవాన్ని వర్ణిస్తూ చెప్పినది కావచ్చు.

ఇటీవల నేనొక మంచి మరణాన్ని
మనసారా వరించాను
దేహం విల్లుకి ప్రాణాన్ని సంధించి లాగినట్లు
మరుక్షణంలో మరణావరణాన్ని దాటబోతుండగా
పక్కింటివాడికివ్వాల్సిన చేబదులు గుర్తొచ్చి
వార్నీ అనుకుంటూ వెందిరిగి నడిచినట్లు
ఏదో మెలకువ
చిలుకుతున్న కవ్వం చుట్టిపెట్టి
వెన్నతీయని మజ్జిగలోటాతో వచ్చిన
తడితడి చేతుల అమ్మలా
నా కన్రెప్పలను స్పృశించింది
నిజంగా నిజమైన మెలకువ
గొప్ప స్వప్నం కన్న మనోహరం

మెలకువను చల్ల చిలికి వచ్చిన చల్లని చేతులతో పోల్చటంతో కవి చెప్పే భావనలో ఆర్ద్రత, ఆత్మీయత ఏర్పడ్డాయి. మంచి పదచిత్రాల సహాయంతో ఒక అనుభవాన్ని ఎంత ప్రతిభావంతంగా చెప్పవచ్చో ఈ కవిత నిరూపిస్తుంది.

అనేకరకమైన సామాన్య జీవితాంశాల్ని, చిన్నచిన్న సంఘటనల్ని తీసుకుని కవిత్వం రాయటం కూడా ఇటీవలి కాలంలో అధికమయింది. ఇవి నిత్యజీవితం లో అందరికీ ఎదురయేవే కాబట్టి, పాఠకుడు వాటితో సంస్పందించి, తనను వాటికి దగ్గర చేసుకో గలుగుతాడు. ఉదాహరణకు, ఒక చిన్న పూల మొక్కను తెచ్చి, పెరట్లో నాటి, దాని ఎదుగుదలకు ఆనందించటం గురించి శిఖామణి “నల్లగేటు నందివర్థనం చెట్టు” అనే కవితను రాసాడు. ఇందులో మొక్క పాతిన తొలి రోజుల్లో “పసిపిల్లాడు ఎత్తుకోమని చేతులు చాచినట్టు – కొమ్మచేతులు పైకెత్తి నిగనిగలాడుతూ నవ్వింద”ని, తరువాత కొంచెం పెరిగాక, “పిల్లల స్కూలు ఆటో గురించి ఆత్రంగా ఎదురుచూసే తల్లిలా” గేటు మీద తలానించి చూసేదని, పూర్తిగా ఎదిగాక ఆ చెట్టు తన కన్న తల్లిలా “ఆకుల కళ్ళతో వొళ్ళంతా తనివితీరా నిమురుతున్నట్లే ఉందని” రాస్తాడు. ఈవిధంగా, ఎదిగే మొక్కను మొదట తన పిల్లలతో, తరువాత తన తల్లితో, చివరికి తన తల్లితో పోల్చటంలో ఎంతో ఔచిత్యం ఉంది. సామాజికస్పృహ స్థానంలో ఇటువంటి “సాంసారికస్పృహ” చోటు చేసుకున్న పద్యాలు అనేకం ఇటీవలికాలంలో వెలువడుతున్నాయి.

భాష, పదాల ఎంపిక, ఊహావైచిత్రి వంటివాటితోబాటు కవికి కావలసిన మరొక లక్షణం చేతనా సౌకుమార్యం.

“ఒక కన్నీటికణం బరువుకి చిగురుటాకులా ఒదిగిపోవాలి
ప్రపంచ దుఃఖాన్నంతా అట్లాస్ లా భుజాలకెత్తుకోవాలి”

ఈ రెండు కవి స్వభావంలో భాగాలే. స్త్రీవాదం ప్రభావంతో కవిత్వం రాసిన అనేకమంది కవయిత్రులు స్త్రీలకు మాత్రమే పరిమితమైన శారీరిక సమస్యలు, వారి ఇంద్రియానుభవాలు, వారి కెదురయే ఇబ్బందులు – ఇటువంటి వాటిగురించి రాసిన కవితలే ఎక్కువ. స్త్రీ సహజమైన చేతనా సౌకుమార్యం ప్రదర్శించే కవితలు తక్కువగానే ఉంటాయి. ఇంద్రాణి రాసిన
“పూబాల” అనే కవిత ఇటువంటి సౌకుమార్యానికొక ఉదాహరణ. స్త్రీలకు సహజంగానే పూలతో చెలిమి ఉంటుంది. అందుకే కవయిత్రి తనను తానొక పూబాలగా భావించటం ఎంతో సమంజసమైన ఊహ.

పూల కొమ్మలా వంగి నడుస్తాను
పుప్పొడి అన్నివైపులా ఎగురుతుంది

పసిమొగ్గలా ముడుచుకుపోతాను
సుగంధం లోలోపలే బందీ అవుతుంది

పూలజడలా కదలక నిలబడతాను
తుమ్మెద ఒకటి వచ్చివాలుతుంది

మల్లెదండలా ఒరిగి నిద్రపోతాను
దిండంతా సువాసన అద్దుకుంటుంది.

– తన చర్యలన్నింటికి పువ్వుకు సంబంధించిన పోలికలనే చెప్పటంవల్ల కవితకు మంచి అందం వచ్చింది.

కొన్ని దశాబ్దాలపాటు తెలుగు కవిత్వాన్ని మౌలికమైన జీవితావసరాలు లేకపోవటం, వాటికోసం జరిగే పోరాటం వంటివి డామినేట్ చేసాయి. కాని, ఇటీవలి కాలంలో ఎక్కువ కవితలు మానవసంబంధాలు దెబ్బతినటం, కెరీరిజం జీవితాల్ని అదుపుచెయ్యటం వంటి వాటిమీద వస్తున్నాయి. ఈ మార్పుని భారతదేశం సాధించిన ఆర్థిక ప్రగతికి దాఖలాగా తీసుకోచ్చుననిపిస్తుంది. కాలపరిణామం లో కవితావస్తువుల్లో వచ్చిన మార్పులు ఆధారంగా దేశ ఆర్థిక ప్రగతిని అంచనావేసే ప్రయత్నం ఎవరైనా చెస్తే అసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకు బ్లాంక్ కాల్ గురించి ఒకరు కవితరాసారనుకోండి. బ్లాంక్ కాల్ రావాలంటే ముందు టెలిఫోన్ ఉండాలి గదా. అలాగే వాహనం ఆగిపోయి, దానిని తోసుకొంటూ పోవలసిన దయనీయపరిస్థితి గురించి ఒకరు పద్యం రాసాస్తారు. బండి ఆగిపోయినవాడి బాధ తెలియాలంటే ముందు బండి ఉండాలి గదా. ఇలాగే అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. “మనిషి” అనే నిర్వచనానికి సరిపోయే, తనతో కలిసి స్పందించగలిగే వ్యక్తిని కనుక్కోవటానికి కవి చేసే విఫల ప్రయత్నాన్ని సూచించటానికి “మీరు డయల్ చేసిన వ్యక్తి కవరేజి ఏరియాలో లేరు – లేదా ప్రస్తుతము స్పందించుటలేదు.” అనే సెల్ ఫోన్ మెసేజిని ఒక కవి తన కవితలో ఉపయోగించుకున్నారు. ఇందులో ఉద్దేశించిన భావం ఎంతోమంది పాఠకులకి చేరుతుందని కవి భావిస్తున్నాడంటే, సెల్ ఫోనుల వాడకం విస్తృతి మీద కవికున్న నమ్మకం మనకు తెలుస్తోంది.

ఇటీవలి కవితలలో మానవ సంబంధాల విషయంలో కోల్పోతున్న సహజత్వం, లేదా ఏర్పడుతున్న కృత్రిమత్వం గురించి కవులు ఎక్కువగా బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. అందువల్లనే వారి ఊహలు తరచు సహజత్వం నిండి ఉండే బాల్యం, తల్లి, సొంత ఊరు వంటివాటివైపు దారితీస్తూ ఉంటాయి. మరొక విధంగా చెప్పాలంటే సంబంధాల విషయంలో ఒక స్వచ్చతను ఈనాటి కవి ఆశిస్తున్నాడని తోస్తుంది.

ఈ వాదాన్ని మరికొంత పొడిగించి, ఏ కాలంలోనైనా ఏదో ఒక స్వచ్చతని కవి కోరుకుంటాడని చెప్పుకోవచ్చు. పోతన, అన్నమయ్య వంటివారి విషయంలో స్వచ్చమైన భక్తి, భగవంతునికి పూర్తి ఆత్మనివేదన వారి కవిత్వాన్ని నడిపించిన చోదకశక్తులు. అలాగే, భావకవులు ప్రేమ విషయంలో స్వచ్చత, ప్రేయసికి నివేదన కోరుకున్నారు. అభ్యుదయ, విప్లవ కవులకి స్వచ్చమైన నిద్ధత, ఆశయం పట్ల నివేదన అత్యంత అవసరమైన విషయాలు. ఇలా కవి ఏ సమయంలోనైనా ఒక స్వచ్చతను ఆశిస్తూ కవిత్వం చెబుతున్నాడు. స్వచ్చత ఏ విషయంలో అన్నది మాత్రం మారుతూ వస్తుంది.

ఇటీవలి కవిత్వంలో తాత్విక ధోరణిలో వస్తున్న కవితలు కూడా లేకపోలేదు. వీటిలో మృత్యువు గురించి చెప్పే కవితలు అధికంగా ఉంటాయి. ఈ కవితలు చదివినప్పుడు అనాదిగా ఉన్న ఒక కవితావస్తువును కవి ఎంత భిన్నంగా చూస్తున్నాడో అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకు ఎమ్మెస్ నాయుడు ఒక కవితలో మృత్యువునొక అసహాయగా, పసిపాపగా భావిస్తాడు.

మరిక పాలచుక్క కోసం
పెదవులు తెరుచుకొనుంది
మృత్యువు

– ఇతనే మరొక కవితలో “నోరులేని మృత్యువు” అని, “మెత్తని మృత్యువు” అని కూడా వాడాడు. రమణజీవి, వంశీకృష్ణ వంటి వారి కవితల్లో కూడా తాత్వికమైన కవితలకి ఇటువంటి ఉదాహరణలు దొరుకుతాయి.

వీటాన్నిటితోబాటు రోజువారీ సమస్యల గురించి వచ్చే కవితలు ఎప్పట్లాగే విరివిగా వస్తూనే ఉన్నాయి. వార్తాపత్రికల్లో పతాకశీర్షికలెంత సహజమో వాటిమీద మన తెలుగుకవులు స్పందన పద్యాలు రాయటం కూడా అంతే సహజం. అరాఫత్ మరణం, సద్దాం హుసేన్ మరణం, ఒబామా ఎన్నిక, ప్రభాకరన్ మరణం, మైకెల్ జాక్సన్ మరణం – ఇలా ఏ సంఘటన జరిగినా మన తెలుగుకవులు వెంటనే స్పందిస్తారు. ఏ మాత్రం లోతు లేకుండా రొటీన్ గా రాసే ఇటువంటి కవితల వల్ల మేలు కంటె కీడే ఎక్కువ జరుగుతుంది.

ఐతే రాజకీయభావాలు, ఉద్యమ నేపధ్యం తో కూడా మంచికవిత్వం ఎలారాయవచ్చునో నిరూపించిన రచనలు లేకపోలేదు. మోహన్ వెలువరించిన “కిటికీ పిట్ట” కవితాసంకలనం అందుకొక ఉదాహరణ. వామపక్షభావాల కారణంగా గడిపిన కొన్ని రోజుల జైలుజీవితం గురించి అందులో మంచికవితలున్నాయి. ఒంతరితనంలో ఎవరితోనైనా మాట్లాడాలనే తీవ్రమైన కోరికను వ్యక్తీకరిస్తూ, “ఎవరైనా కాసేపు పలకరించరో – ప్రేమే అక్కర్లేదు – పొడిమాటలైనా చాలు” అని, “ప్రేమగానే అక్కర్లేదు, వొట్టి ధ్వనిమయ పదాలైనా చాలు” అని అంటారు. కేవలం నినాదాలు వల్లించటం కాకుండా, ఒక మంచి కవి అనుభవం నుంచి రాసిన కవిత్వం ఎంత మెరుగ్గా ఉంటుందనేది ఇటువంటి సంకలనాలు నిరూపిస్తాయి.

తెలుగుకవిత్వానికి ఇవి మంచిరోజులా, చెడ్డరోజులా అంటే ఖచ్చితంగా సమాధానం చెప్పలేం. రాసే కవులు ఎక్కువగారాయటం, కవిత్వం రాసేవారి సంఖ్య కూడా పెరగటం వల్ల, కవితలు, కవితాసంకలనాలు అనేకం వెలువడుతున్నాయి. ఐతే, వాటిలో మంచిని ఎన్నుకోవలసిన బాధ్యత మాత్రం పాఠకునిదే. నా ఉద్దేశంలో ఏకాలంలోనైనా, మంచికవిత్వం అరుదుగానే లభిస్తుంది. కాని, అదే జీవధారలా, కవిత్వ స్ఫూర్తిని, కవిత్వంపై కొత్త తరాల ఆసక్తిని సురక్షితంగా నిలబెడుతుంది.

***************************About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.5 Comments


 1. హెచ్చార్కె

  ఎంత బాగా రాశారు. వ్యాసం చదువుతుంటే, మంచి కవిత్వం చదివినప్పుడు కలిగే అనుభూతి కలిగింది. ఎక్కడో, కళ్లకు బాగా వెనుక, చెమ్మ కదిలింది. నాకెందుకో ఇలా అనిపిస్తుంది. ఇష్టంగా కవిత్వం రాసే వారో, ఇష్టంగా కవిత్వం చదివే వాళ్లో… వాళ్లు రాస్తేనే బాగుంటుంది, కవిత్వ-విమర్శ. ఆ రెండూ చేయని ‘ప్రొఫెషనల్‍’ విమర్శకుల లంబాచోడా వ్యాసాలూ, తమ అసలు పనుల మధ్యలో సాహిత్యానికి కొంచెం సమయం ‘కేటాయించే’ రాజకీయార్థిక విశ్లేషకుల వ్యాసాలూ చదివి… సాహిత్య-విమర్శ అంటేనే మొహం మొత్తిన నాబోటి వారికి ఇలాంటి వ్యాసాలు గొప్ప ఉపశమనం. …. హెచ్చార్కె


 2. akella ravi prakash

  vinnakota ravi sankar visleshana bagundi

  kani telugu kavitvapu teeru tennulni pattukodam
  na lanti pravasandhrulaki kastam ga vundi


 3. మంచి విశ్లేషణనందించారు. కవిత్వ రూపం బతికుండాలంటే దానిపై ఆసక్తి పెరిగేట్లు రాసే కవులుండాలి. సత్యం.


 4. చాలా బాగా చెప్పారు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

కవి,ప్రేమికుడు..

రాసిన వారు: తమ్మినేని యదుకులభూషణ్ ******************************* అనుకోకుండా ఒక రోజు ఈ కవితను ఆంధ్రప్రభ ...
by అతిథి
8

 
 
కవి చలం…వజీర్ రెహ్మాన్ అద్దంలో…!

కవి చలం…వజీర్ రెహ్మాన్ అద్దంలో…!

రాసి పంపిన వారు: కల్పన రెంటాల ************************* మీకు బాగా నచ్చిన కవి ఎవరూ? అంటే కవిత్వ అభిమాను...
by అతిథి
12

 
 

నాకు నచ్చిన కవిత – మరువపు పరిమళాలు

మానవుడికి ఉన్న ఒక అధ్భుతమైన సౌలభ్యం   భావవ్యక్తీకరణ.  అది మామూలు పదాలతో చేసే వచనమైనా...
by జ్యోతి
16

 

 
నిద్రిత నగరం – ఒక స్వాప్నిక లోకం

నిద్రిత నగరం – ఒక స్వాప్నిక లోకం

రాసి పంపిన వారు: భైరవభట్ల కామేశ్వరరావు (డా. వైదేహి శశిధర్ గారికి ఇటీవలే ప్రచురితమైన క...
by అతిథి
4

 
 
ఆకెళ్ల రవి ప్రకాష్ – “ఇసక గుడి”

ఆకెళ్ల రవి ప్రకాష్ – “ఇసక గుడి”

రాసి పంపిన వారు: బొల్లోజు బాబా ******************************** రవి ప్రకాష్ నైష్టికుడు. కవిత్వానికో నీతి ...
by అతిథి
3

 
 

ప్రేమలేని లోకంలో నిర్గమ్య సంచారి ఇక్బాల్‌చంద్‌

వ్యాసం రాసిన వారు: మూలా సుబ్రమణ్యం [ఈ వ్యాసం మొదట తెలుగుపీపుల్.కాంలో 2006 లో ప్రచురితమై...
by అతిథి
2