అక్షరానికి ఆవల – కుల్దీప్ నయ్యర్ ఆత్మ కథ

వ్యాసకర్త: అమిధేపురం సుధీర్

అనువాదం – యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

ఈ పుస్తకం, కుల్‍దీప్ నయ్యర్ అనే ఒక ప్రముఖ భారతీయ జర్నలిస్ట్ ఆత్మ కథ.  ‘Beyond the lines – An autobiography’ గా విడుదలైన ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు.

2012 లోనే ఈ పుస్తకం కొన్నా, దాని పరిమాణం చూసి, చదవడానికి బద్దకిస్తూ, వాయిదా వేస్తూ మొత్తానికి నిన్ననే ముగించాను. ఈ పుస్తకం చదివాక కుల్‍దీప్ గారి గురించి వికిపీడియాలో మరింత సమాచారం తెలుసుకున్నాను. 2018 లో ఆయన మరణించారు. ఈ పుస్తకం కొన్న వెంటనే చదివుంటే బావుండేదనిపించింది, కనీసం ఒక ఆరేళ్ళ పాటైనా ఆయనని ఫాలో ఆయే అవకాశం వుండేదేమోనని.

పేరుకి ఇది ఆత్మకథైనా, సాధారణంగా చెప్పుకునే వ్యక్తిగత విషయాలు మొదటి చాప్టర్ లోనే ముగుస్తాయి. అక్కడినుంచి మిగిలిన పుస్తకం మొత్తం భారత దేశ రాజకీయాల చుట్టే సాగుతుంది. ముఖ్యంగా భారతదేశ ప్రధాన మంత్రులందరి తో ఆయనకు వున్న అనుబంధం లేదా వారి పాలన మీద ఆయనకున్న అభిప్రాయాలు ఎక్కువగా ఇందులో వర్ణించబడ్డాయి.

ప్రస్తుతం పాకిస్తాన్ లో వున్న సియాల్ కోట్ లో జన్మించిన ఆయన, దేశ విభజన సమయంలో ఢిల్లీ కి వలస వచ్చారు. తర్వాత జర్నలిస్ట్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. మొదటి చాప్టర్ లో, చాలా వివరంగా ఆనాటి పరిస్థితుల గురించి వ్రాసారు, కానీ నేను వాటిని అంతగా అర్థం చేసుకోలేకపోయాను.  తను చెప్పిన వివిధ ఆర్గనైజేషన్స్, వాటి మధ్య సంబంధాలు,  వాటి వలన దేశ విభజనకు దారి తీసిన పరిస్థితులు, ఇలా చాలా వివరంగా వ్రాసినా, వాటిలో చాలా వరకూ ప్రస్తుతం ఉనికిలో లేకపోవడం, లేదా వాటి గురించి పాఠ్య పుస్తకాల్లో కూడా ఎన్నడూ చదవకపోవడం వల్ల, అవి పూర్తిగా కొత్తగా అనిపించాయి. దేశ విభజన మీద ఆసక్తి వుండి కొంచం బాక్ గ్రౌండ్ పని చేసి వున్నవారికి ఈ పుస్తకం చాలా ఆసక్తికరంగానూ, ఉపయోగకరంగానూ వుంటుంది.

భారత దేశపు మొదటి ప్రధాన మంత్రి,  శ్రీ జవహర్ లాల్ నెహ్రూ నుంచి శ్రీ మన్మోహన్ సింగ్ గారి పాలన వరకూ ఏర్పడ్డ వివిధ ప్రభుత్వాల గురించీ, ఆ ప్రభుత్వాల ఏర్పాటులో జరిగిన రాజకీయాల గురించి చాలా వివరంగా వ్రాసారు ఇందులో. ఈ చాప్టర్లన్నీ చాలా ఆసక్తికరంగా వున్నాయి.

ముఖ్యంగా స్వాతంత్ర్యం తర్వాత మన దేశం లో జరిగిన అతి ముఖ్య సంఘటన ‘ఎమర్జెన్సీ’, దానికి కారకురాలైన ఇందిరా గాంధీ గారి పాలన గురించి చాలా విషయాలు తెలిసాయి. 

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వివిధ పరిణామాలు చూసి, ఏదో జరగరానిది జరిగిపోతుంది, ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి అని అప్పుడప్పుడు బాధనిపిస్తుంది. కానీ అప్పుడు జరిగిన సంఘటనల గురించి చదివాక అనిపించింది, దేశం ఇంతకంటే ఎంతో పెద్ద పరిస్థితులను ఎదుర్కొని నిలిచిందని.

అప్పటి రాజకీయాలే బావుండేవి, ఇప్పటి రాజకీయాలు పూర్తిగా చెడిపోయాయి అని ఇక ముందు ఎవరైనా అంటే, వారిని ఈ పుస్తకం చదవమని చెప్తాను. అప్పటి వాళ్ళు కూడా అధికారం కోసం ఎన్ని రాజకీయాలు చేసారో, ఎన్ని దారుణాలు చేసారో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. 

పదో తరగతి వరకూ, హిస్టరీ అనే సబ్జెక్ట్ చదివినా, ఈ రోజుకీ మన దేశపు రాజకీయ నిర్మాణం ఏ విధంగా వుంటుంది, ఎగ్జెక్యూటివ్  బాడీ ఇంకా లెజిస్లేటివ్ బాడీ అంటే ఏమిటీ, ఫెడెరల్ స్పూర్తి అంటే ఏమిటీ ఇలాంటివన్నీ తెలీవు. వార్తలు చదవాలన్నా, చూడాలన్నా ఇప్పుడు ధైర్యం చాలదు. ప్రతీ ఒక్క పత్రిక లేక చానల్ ఏదో ఒక రాజకీయ పార్టీ తో ముడిపడి వున్నవే. నిజమైన వార్త ఏదో, పెయిడ్ న్యూస్ ఏదో, సామాన్యుడికి అర్థం కానంత బాగా వస్తున్నాయి ఇప్పటి వార్తలు. న్యూట్రల్ గా వార్తలు ప్రచురించే ఒక పేపర్ కి కానీ ఒక జర్నల్ కి కానీ చందా కడదామంటే, అలాంటివి అసలున్నాయో, లేదో కూడా తెలియట్లేదు.    

మనలో చాలా మందికి (లేదా నా వరకూ మాత్రమే), కేవలం ప్రధాన మంత్రు ల పేర్లు లేదా అప్పటి కొన్ని విషయాలు జెనరల్ నాలెడ్జ్ కోసమో లేకపోతే ఎవరో అంటుంటేనో విని వుంటాము, కానీ ఆ విషయం లేదా వ్యక్తుల గురించిన కనీస పరిజ్ఞానం వుండదు.  అంతా తెలుసనిపిస్తుంది, కానీ ఏమి తెలియదు అన్న విషయం ఇలాంటి పుస్తకం చదివినప్పుడే తెలుస్తుంది. భారత దేశ చరిత్ర మీద ఆసక్తి వున్న వాళ్ళందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. అనువాదం కాబట్టి, అర్థానికి సంబంధించి అక్కడక్కడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వున్నా కూడా విషయం ఆసక్తికరమైనది కాబట్టి, అంతగా విసుగనిపివ్వదు.

ప్రస్తుత పరిస్థితులను మనం ఎలాగూ పూర్తిగా అర్థం చేసుకోలేము. ఈ పుస్తకం చదవడం వలన కొంత పాత చరిత్ర తెలిసి, కనీసం ఒక చిన్న ధైర్యం వచ్చింది. ఇప్పటికన్నా పెద్ద పెద్ద సమస్యలనే మన ముందు తరాలు ఎదుర్కొన్నాయి. మన సమస్యలు కూడా తొలగిపోతాయి అని.

You Might Also Like

One Comment

  1. Dr pars Srinivas

    Good introduction on kuldeep nayar biography

Leave a Reply