నేనూ, పుస్తకాలూ, రెండువేల ఇరవయ్యీ…

వ్యాసకర్త: పద్మవల్లి

పుస్తకాలు చదవడం విషయంలో గత కొన్నేళ్లుగా ‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని సర్ది చెప్పుకుంటూ గడిపేస్తున్నాను. అయితే ఈ సంవత్సరం మాత్రం ఆ మాట రివర్స్ అయింది. నాకు పుస్తకాల విషయంలో 2019 అతి చెడ్డకాలం. రెండు చేతివేళ్ళతో లేక్కపెట్టుకోడానికి సరిపోయేటన్ని కూడా చదవలేకపోయాను. దానితో పోలిస్తే 2020 చాలా బావుంది. ఈ ఏడాది చదివిన వాటిల్లో సబ్జెక్ట్ పరంగానూ, రచయితల పరంగానూ వైవిధ్యం ఎక్కువగా ఉంది. ఏవో ఒకటి రెండు తప్ప, ఎప్పుడూ జరిగేటట్టుగా ఒకే రచయిత పుస్తకాలు రిపీట్ అవ్వలేదు,.  వీరిలో చాలామంది నాకు కొత్త రచయితలు. ఎప్పటిలాగే చదవాలనుకుని చదవలేకపోయినవీ, చదువుతూ మధ్యలోనే ఆగిపోయినవీ కూడా చాలానే ఉన్నాయి. ఎపుడో 2013లో కొన్న తాహిర్ షా పుస్తకాలన్నీఓపిగ్గా ఎదురుచూస్తున్నాయి. అవన్నీ పూర్తిచెయ్యాలన్న ఆశ కూడా ఇంకా అలానే ఉంది

ఇంగ్లీష్:

  • Finding Chika: A Little Girl, an Earthquake, and the Making of a Family – Mitch Albom:  రచయిత హైటీ లో తను నడుపుతున్న శరణాలయం నుండి, అరుదైన వ్యాధి సోకిన ఓ చిన్న అమ్మాయిని చికిత్స కోసం అమెరికా తీసుకువస్తారు. పిల్లలు లేని ఆ దంపతుల జీవితంలో ఆ అమ్మాయి రాక తీసుకొచ్చిన మార్పులు, అల్లుకున్న అనుబంధం, ఆమె మరణం మిగిల్చిన లోటు … ఎంతో మురిపెంగా చెప్పుకున్న కథ. ఎప్పటిలాగే రచయిత శైలి, కథనం ఆపకుండా చదివిస్తాయి. 
  • The Next Person You Meet in Heaven – Mitch Albom: పదేళ్ల క్రిందట వచ్చిన Five people You Meet In Heaven కథకి కొనసాగింపు. అప్పటి కథలో ఎడ్డీ తను చనిపోతూ రక్షించిన పాప ఎనీ. ఆమె పెరిగి పెద్దయి, తనూ చనిపోయి ఎడ్డీని ఇంకో నలుగురుని కలుసుకుని వాళ్ళ జీవితాల మధ్య కనెక్షన్ని, జీవితపు అంతః సూత్రాలని తెలుసుకోవడం కథ. కథ దాదాపు మొదటి భాగం లానే ఉంటుంది. రచయిత శైలి మధ్యలో వదిలెయ్యకుండా చదివిస్తుంది, కానీ పెద్దగా ఇంప్రెస్ చెయ్యదు. నాలాటి హార్డ్ కోర్ ఫాన్స్ వదలలేక చదవడం అంతే.  
  • Human Touch – Mitch Albom: కరోనా నేపధ్యంలో, విభిన్నమైన నాలుగు కుటుంబాల మధ్య చిక్కటి  స్నేహం ఎలా వీడిపోయిందో, కొన్ని జీవితాలు ఎలా చెదిరిపోయాయో చెప్పిన కథ. ఇది ఎనిమిది భాగాలుగా వ్రాసిన వెబ్ సిరీస్. చివరి రెండు భాగాల్లో కొంచెం నాటకీయత ఎక్కువైనప్పటికీ చదివిస్తుంది. కరోనా మీద వచ్చిన కథల్లో కాస్త నేను పూర్తిగా చదవగలిగింది ఇదొక్కటే.  నాటకీయత, కుమ్మరించి సెంటిమెంట్స్ లేకుండా సాగిన కథనం. కథని ఈ క్రింద లింక్ లో చదవొచ్చు.
    https://www.mitchalbom.com/human-touch-story/
  • A River in Darkness: One Man’s Escape from North Korea – Masaji Ishikawa:  రచయిత కుటుంబం అతనికి పదమూడేళ్ల వయసులో మంచి జీవితం, పిల్లలకు మంచి చదువులు అని ప్రభుత్వం చూపించిన భ్రమలకు లొంగిపోయి జపాన్ నుండి నార్త్ కొరియాకు వలస వెళ్లారు. తండ్రి జన్మతః కొరియన్. కానీ సగం కొరియన్, సగం జపనీస్ అయిన రచయిత, అతని తోబుట్టువులు ఎటూ ఏ దేశానికి చెందకుండా పోతారు. కొరియాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం పాలనలో 37 సంవత్సరాలు అతి హీనమైన బ్రతుకు బ్రతికి, చివరికి ఎన్నో కష్టాలకోర్చి ఒంటరిగా జపాన్ దేశంలోకి తప్పించుకుపోయారు. చాలా ఉత్కంఠగా చదివిస్తుంది. ఇది రచయిత జీవితంలో జరిగిన కథ. ఇది ఒరిజినల్ జపనీస్ నుండి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఇది కూడా నాకు బాగా నచ్చిన పుస్తకం.   
  • Life – Lu Yao: కథాకాలం 1980వ దశాబ్దం. చైనాలోని ఓ చిన్న పల్లెటూరిలోని చదువుకున్న ఒక యువకుడు, జీవితంలో ఎంతో ఎదగాలని ఆశలున్నవాడు. టీచర్ ఉద్యోగం చేస్తూ తొందరలోనే తన ప్రియురాలిని పెళ్ళిచేసుకోవాలని ఎదురుచూస్తుంటాడు. ఇంతలో కమ్యూనిస్ట్ రాజకీయాలు, అవినీతి కారణంగా ఉద్యోగం పోతుంది. పట్నంలో ఇంకో ఉద్యోగం దొరుకుతుంది, దానితోపాటే కొత్త పరిచయాలూ, ఆకర్షణలూనూ. జీవితంలో ఎదగాలంటే దొరికిన అవకాశాలని వదులుకోకుండా ఉపయోగించుకోవాలని వాటి వెనక పడతాడు. అతను చివరికి రెంటికి చెడ్డ రేవడిగా ఎలా మిగిలాడు అనేది కథ. ఈ రచయిత కేవలం రెండు నవలలే వ్రాసి తన 42వ ఏట చనిపోయారు. ఆ రెంటినీ కూడా చైనా సాహిత్యంలో ఉత్తమమైనవిగా లేక్కిస్తారట. ఇది చైనీస్ నుంచి ఇంగ్లీష్ అనువాదం.  
  • The Diary of a Snake Charmer – Sandeep Saxena: భరత్ IIT లో చదువుకుని, కొన్నేళ్ళు పెద్ద కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగం చేసి కొంత డబ్బు కూడబెట్టాడు. అది పెట్టుబడిగా పెట్టి రూరల్ ప్రాంతాల్లో రైతులకి ఉపయోగపడే పరిశ్రమ పెట్టాలనుకున్నాడు. కల్లాకపటం తెలీని ట్రైబల్స్, ఫ్యూడల్ భూస్వాములు, వారికి మద్దతుగా స్వార్థపరులైన రాజకీయనాయకులు … వీళ్ళ మధ్య ఇరుక్కుని, ఉన్నది పోగొట్టుకోవడమే కాక అప్పులూ, కేసులూ, భయపెట్టి తరిమేయాలని దాడులూ … ఇన్ని చెడు అనుభవాల మధ్య నుండి ఎలా పడి లేచి నిలదొక్కుకుని తెలివిగా అనుకున్నది సాధించాడో, ఆ క్రమంలో అతనికి తోడు నిలిచిన ట్రైబల్ గురువు నాగబాబా ఇతర స్నేహితులూ… చాలా ఆసక్తిగా చదివించే కథా కథనం. ఇది రచయిత స్వంత అనుభవాల ఆధారంగా రాసిన ఫిక్షన్. ఈ ఏడాది నచ్చిన ఇంకో పుస్తకం.  
  • Without a Country – Ayse Kulin: హిట్లర్ కాలంలో కొందరు యూదులు జర్మనీ వదిలి పరాయి దేశాలకు  వలసపోయారు. ఒక మెడికల్ ప్రొఫెసర్ కుటుంబం, మంచి ఉద్యోగ అవకాశాలు రావడంతో టర్కీలో స్థిరపడుతుంది. అయితే అక్కడయినా వాళ్ళూ. వాళ్ళ తర్వాతి తరాలూ అది నాదేశం అని ప్రశాంతంగా స్థిరంగా ఉండగలిగారా? కొన్ని నిజజీవితాలలోని సంఘటనల ఆధారంగా వ్రాసిన నవల ఇది.  
  • Ten Women – Marcela Serrano – తొమ్మిదిమంది చిలీ దేశపు స్త్రీలు వివిధ వయసులు, వివిధ జీవిత అనుభవాలూ ఉన్నవాళ్లు. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. అందరినీ కలిపిన సూత్రధారి వాళ్ళ మెంటల్ హెల్త్ థెరపిస్ట్. ఆమె ఏర్పాటు చేసిన రిట్రీట్ లో అందరూ కలిసి, తమ కథలు చెపుతారు. 
  • In the House of the Interpreter – Ngũgĩ wa Thiong’o : ఇది రచయిత గూగీ నైరోబీలోని బ్రిటిష్ బోర్డింగ్ స్చూల్లో అనుభవాలు, తను బ్రిటిష్  టీచర్ల నుండి నేర్చుకున్న డిసిప్లన్, అదే సమయంలో కెన్యా స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న విప్లవాల్లో అన్న అజ్ఞాతంలోకి  వెళ్ళడం, పోలీసులు అతని కుటుంబాన్ని హింసలు పెట్టడం, అన్నని అరెస్ట్ చేసి కాల్చి చంపడం మొదలైన విషయాలు ఉంటాయి. ఆ సమయంలో ఓ పక్క తన జాతి బ్రిటిష్ చేతిలో కష్టాలు  పడుతున్నా, నెగెటివిటీ ఛాయలు లేకుండా సంయమనంతో రాసిన మెమోయిర్.  
  • Mom & Me & Mom – Maya Angelou: మాయా ఏంజిలో తల్లితో తన అనుబంధం, తల్లి బలమైన వ్యక్తిత్వం, యవ్వనంలో తను తీసుకున్న నిర్ణయాల్లో కొట్టుకుపోతుంటే ఆమె ఎలా తనకి ఆసరా అయ్యిందో చెపుతారు. మాయాకి ఆమె అన్నతో అనుబంధం కూడా మనసుని తాకుతుంది. ఈ సంవత్సరం చదివిన వాటిలో నాకు బాగా నచ్చినది. 
  • A Drop of Midnight – Jason (Timbuktu) Diakite:  రచయిత స్వీడన్ లో “Timbuktu” అనే పేరుతో ప్రసిద్దిపొందిన రాప్ ఆర్టిస్ట్. తండ్రి ఆఫ్రికన్, తల్లి అమెరికన్. పూర్వీకుల్లో ఆఫ్రికన్, రష్యన్, జర్మన్ ఎన్నో జాతుల మిశ్రమం ఉంది. బానిసత్వానికీ, జాత్యాంతర వివాహం మూలంగా వివక్షకూ దూరంగా పోవాలని జేసన్ తల్లిదండ్రులు అతను పుట్టకముందే అమెరికా నుండి స్వీడన్కు వెళ్ళిపోయారు. పెద్ద గాయకుడిగా గుర్తింపు పొందినా, జేసన్ కు స్వీడన్ తన దేశం కాదనీ, తన అస్థిత్వానికి మూలం తన తాతల వద్దే ఉందనీ తరచూ వేధించేది. ‘తన తాత తండ్రులు బానిసలుగా అమెరికాలో ఎలాంటి జీవితం గడిపారు, వాళ్ళ మూలాలు ఏమిటి, తమ మిగిలిన బంధువులు ఎలాంటి జీవితం గడుపుతున్నారు’ లాంటి ప్రశ్నలు వెంటాడేవి. అతి కష్టం మీద తండ్రిని ఒప్పించి, అమెరికాకు వచ్చి సౌత్ కేరోలైనాలో తాతలు బానిసలుగా గడిపిన ఎస్టేట్లు, వాళ్ళ సమాధులు చూసి, కొందరు బంధువులను కలుసుకొని, తనవారు అనుభవించిన  దుర్భరత్వాన్ని, సివిల్ వార్ తరువాత వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులు తెలుసుకుంటారు. చాలా ఆసక్తిగా చదివించే మెమోయిర్ ఇది. తండ్రీ కొడుకుల మధ్య రిలేషన్, తండ్రి ఒంటరితనం, కొడుకు తోడు కోసం ఆరాటం లాంటి విషయాలు సున్నితంగా దృష్టికి తీసుకొస్తారు.     
  • Not That Bad: Dispatches from Rape Culture – Roxane Gay: రేప్/చైల్డ్ అబ్యూస్/ మొలెస్టేషన్ కి గురయిన కొంతమంది స్త్రీలు, ఆ అనుభవాలు మానసికంగానూ సామాజికంగానూ తమని బాధించి తమని అవమానానికీ నూన్యతకి గురిచేసిన విధం, వాటినుంచి బయటపడటానికి తమతో తాము ఎంత యుద్ధం చెయ్యాల్సి వచ్చిందో వ్రాసిన అనుభవాల వ్యాసాల సంకలనం. ప్రసిద్ధి పొందిన రచయితలూ, నటులూ, ఇతర కళాకారులూ ఈ వ్యాసాలు వ్రాసినవారిలో ఉన్నారు. ఇది ఒకరకంగా ‘Mee Too’ టైప్ లో ఉన్నా, ఫైనల్లీ ‘Only Me & Myself’’ అనేది ముఖ్యమని చెపుతాయి.   
  • Difficult Women – Roxane Gay: ఇందులో ప్రధాన పాత్రలు స్త్రీలు. చదువుకున్నవాళ్లూ, చదువుకోనివాళ్ళూ, చక్కని సంసారాలున్నవాళ్ళూ, సంసారంలో చక్కగా నటిస్తున్నవాళ్ళూ, సిరిలో ములిగితేలుతున్నవాళ్ళూ, బీదరికంలో నానుతున్నవాళ్ళూ, ప్రేమించబడినవాళ్ళూ, ప్రేమకోసంతపిస్తున్న వాళ్ళూ … రకరకాల స్త్రీలు difficult women – వీరి ప్రేమలూ, బంధాలూ, వ్యధలూ, అవమానాలూ, హింసా, అసూయలూ ఈ కథాంశాలు.  
  • Ayiti – Roxane Gay:  Haiti నుంచి అమెరికాకు వలస వచ్చిన వారి డయాస్పోరా కథలు. ఆసక్తికరంగా చదివించి ఆలోచింపచేసే కథలు. 
  • Nothing Like I Imagined – Stories by Mindy Kaling:  కూతురి పెంపకం, హాలీవుడ్ జీవితం & ఫ్రెండ్స్ ఇలా వివిధ అంశాల మీద వ్రాసిన వ్యాసాలు. ఆసక్తిగా చదివిస్తాయి.
  • 40 Retakes – Avijit Ghosh: బాలీవుడ్లో ఒకప్పుడు హిట్ అయినప్పటికీ, ఇప్పుడు అంతగా జనాలు గుర్తుంచుకోని 40 సినిమాలు తీసుకొని, వాటి నిర్మాణ సమయంలో జరిగిన  విశేషాలను, సంబంధిత వ్యక్తుల నుంచి సేకరించిన ఇంటరెస్టింగ్ విషయాలతో ఒక్కో సినిమా గురించీ వివరంగా వ్రాసారు. ఎప్పుడో దూరదర్సన్లో చూసిన చాలా సినిమాల గురించి చదవడం, ఆ జ్ఞాపకాలను గుర్తుకు చేసుకోవడం … హిందీ సిన్మాలూ, పాటలూ, నాస్టాల్జియా ఇష్టపడే వాళ్లకు నచ్చుతుంది.
  • The Sun and Her Flowers – Rupi Kaur:  ఇది కవితల సంకలనం. ఇది ఆమె ఇంకో కవితల పుస్తకం Milk and Honey లాగానే బాగా హైప్ ఇచ్చినవి. చదవలేక మధ్యలోనే వదిలేసిన పుస్తకం. 

తెలుగులో అనువాదాలు:

  • ఆవరణ – బైరప్ప (అనువాదం అరిపిరాల సువర్ణ): ఒక హిందూ యువతీ, ముస్లిమ్ యువకుల ప్రేమా, పెళ్ళీ, సామాజిక వ్యతిరేకతా, బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత వచ్చిన మత రాజకీయ పరిణామాలతో వారి జీవితంలోనూ అనుబంధాలలోనూ మార్పులూ గురించిన కథ. కథ చాలావరకూ ఆసక్తి గానే సాగింది.  అనువాదం బాగానే ఉన్నప్పటికీ, కథనం అప్పటికప్పుడే ప్రధమపురుష ఉత్తమపురుషల మధ్య ఇష్టం వచ్చినట్టు మారిపోవడం చదివేవాళ్ళని అయోమయంలోకి నెడుతుంది. ఎడిటింగ్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.
  • కొన్ని సమయాలలో కొందరు మనుషులు – జయకాంతన్: గంగ అనే టీనేజ్ అమ్మాయి జీవితంలో జరిగిన ఒక పొరపాటును తల్లి దాచిపెట్టి రక్షించకుండా రచ్చ చేసుకోవడం,దాని తర్వాత ఆ అమ్మాయి జీవితం తిరిగిన మలుపులు. దీనికి కొనసాగింపుగా ‘గంగ తపస్సు’ (గంగా ఎంగె పోగిరళ్) వచ్చిందట. చదవాలి.  
  • మోహనస్వామి – వసుధేంద్ర (అనువాదం రంగనాధ రామచంద్రరావు): కన్నడ రచయిత వసుధేంద్ర తన జీవితం ఆధారంగా వ్రాసిన పది కథలు. ఒకరకంగా అతని ఆత్మకథ లాంటిది. ఒక్కో కథా మనసుని మెలితిప్పి, మనలోని డొల్లతనాన్ని మనకే చూపిస్తాయి. అతని బాధ చూసి మనసు విలవిలలాడిపోతుంది. ఒక్క వాక్యం కూడా ఎక్కడా వికారం, ఏహ్యత, చులకన లాంటి భావాలు కలగనివ్వవు. చదివితీరాల్సిన జీవితం.   
  • ప్రసిద్ధ సమకాలీన కన్నడ కథలు – రంగనాథ రామచంద్రరావు: వివిధ రచయితలూ వ్రాసిన పన్నెండు కథలకు రంగనాథరావు గారు చేసిన అనువాదం. ఆయన భాష సరళంగా నేటివిటీకి దగ్గరగా ఉంటుంది. ఈ సంకలనంలో మంచి కథలు ఉన్నాయి. 
  • నలుపు, తెలుపు, కొన్ని రంగులు (ప్రసిద్ధ కన్నడ రచయిత్రుల కథలు) – రంగనాథ రామచంద్రరావు: కన్నడ రచయిత్రుల కథల అనువాద సంకలనం. 
  • చినరావూరులోని గయ్యాళులు-కన్నడ కథలు – మూలం: పూర్ణచందర్ తేజస్వి(అనువాదం: శాఖమూరు రామగోపాల్ )

తెలుగు రచనలు:

  • జీనా హైతో మర్‌నా సీఖో – కాత్యాయని : జార్జ్ రెడ్డి సినిమా చూసి తర్వాత ఈ పుస్తకం గురించి తెలిసి చదవడం మొదలుపెట్టాను. ఇంకా పూర్తికాలేదు. 
  • ఒక్క వాన చాలు – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి – రాయలసీమ రైతుల బ్రతుకులు నేపధ్యంగా, వలసపోయిన రైతులు ఒక్క వాన కురిస్తే తిరిగి ఊరికి పోయి పంటలు పండించుకోవచ్చని ఆశగా ఎదురుచూడటం, వలస బ్రతుకులో కూలీలుగా గడిపిన జీవితం.    
  • జరుగుతున్నది జగన్నాటకం – అరిపిరాల సత్యప్రసాద్: ఇది ఓ ఫాంటసీ కథ. అనుకోకుండా ఓ విచిత్రదీవిని చేరుకున్న యువకుడు, అక్కడ విచిత్రంగా ప్రవర్తించే మనుషులూ, వాళ్ళ వింత రూల్స్ … కష్టపడి సగం వరకూ చదవగలిగాను, ఆ తర్వాత పూర్తిచెయ్యడం నా వల్ల కాలేదు.  
  • ఒకరికొకరు – శ్రీవల్లీ రాధిక: ఈ రచయిత్రి రచనల గురించి చాలా విని ఉండటంతో, ఏమీ తోచని ఓ రోజున చదివాను.  ఓ భర్త తన ప్రియురాలిని తీసుకొచ్చి ఇంట్లోనే పెడితే, భార్య ఆమెతో సర్దుకుపోయి, ఆమెను స్వతంత్రంగా ఆలోచింపచేయడానికీ,  ప్రయత్నిస్తుంటుంది.  కథలో ఏం చెప్పాలనుకున్నారో అస్సలు అర్ధం కాలేదు. ఒక్క పాత్రకీ వ్యక్తిత్వం లేదు. ఓపికగా చదవాల్సి వచ్చింది. ఇది ఓ ఎప్పుడో ఇరవయ్యేళ్ల క్రితం వ్రాసిన నవల.   
  • ప్రియురాలు పిలిచె -యండమూరి వీరేంద్రనాథ్ : రచయిత మిగిలిన పుస్తకాల్లాగే వదలకుండా చదివిస్తుంది.  సీరియస్ రీడింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకోడానికి చదివాను. 
  • జీవితానికో సాఫ్ట్వేర్ – కె.ఎన్. మల్లీశ్వరి: భార్యాభర్తల మధ్య అపార్థాలూ, విడిపోవడం, మళ్ళీ కలుసుకోవడం. ఒక మామూలు ప్రేమ కథ. ఇది కూడా సీరియస్ రీడింగ్ నుంచి బ్రేక్ కోసం చదివినది.    
  • చేదుపూలు -మెహర్: ఇరవై కథల సంకలనం. కొన్నికథలు వివిధ పత్రికల్లోనూ బ్లాగులోనూ ప్రచురించినవి. జీవితంలోని సంఘర్షణలను క్లుప్తంగా నేర్పుగా చెప్పడం మెహర్ శైలి. కథల్లో మంచి వస్తువైవిధ్యం ఉంది. 
  • రచయిత్రుల కొత్త కథలు – వంశీ ప్రచురణ (డా. సి. నారాయణరెడ్డి స్మరణలో): కొత్తా పాతా రచయిత్రులు కలిసి వ్రాసిన 33 కథల సంకలనం. అతి తక్కువ కథలు పర్లేదు బావున్నాయి అనిపించాయి. పుస్తకం పూర్తయిన తర్వాత ఏ ఒక్క కథా గుర్తు లేదు.
  • నలుపెరుపు – తల్లావఝ్ఝల పతంజలి శాస్త్రి:  పన్నెండు కథల సంకలనం.  
  • సరికొత్త వేకువ (కథలు) – కోసూరి ఉమాభారతి
  • అరుణతార కథలు సంకలనం 1 – ముడిమనిషి
  • అరుణతార కథలు సంకలనం 2 – చేపలు 
  • అరుణతార కథలు సంకలనం 3 – కథ అడ్డం తిరిగింది
  • అరుణతార కథలు సంకలనం 4 – కో…బలి
  • ఒక భార్గవి – డా. భార్గవి: భార్గవి గారు వివిధ సందర్భాల్లో రాసుకున్న వ్యాసాల లాంటి ఫేస్ బుక్ పోస్టులు. స్నేహితులూ, పాటలూ, నటులూ, సంగీత దర్శకులూ, ఇల్లూ వాకిలీ ..ఏదీ నాస్టాల్జియాకి అతీతం కాదు. చక్కటి సరళమయిన భాష వదలకుండా చదివిస్తుంది. హిందీ నటులూ, సంగీత దర్శకుల మీద రాసిన వ్యాసాల సిరీస్ నాకు బాగా నచ్చింది. 
  • రంగంటే ఇష్టం – సాహితీ చింతనలు – చాగంటి తులసి:  ఈ పుస్తకానికి ముందుమాటలో విన్నకోట రవిశంకర్ గారు “ప్రతి భాషకు తనదైన ఒక సొగసు ఉంటుంది. అందులో మాట తీరులాగానే రాసిన వాక్యానికి కూడా ఒక తీరు, పద్ధతి, తళుకుబెళుకులుంటాయి. ఆ ఒడుపు తెలిసినవారిలో తులసి గారు కూడా ఒకరని మనకీ వ్యాసాలు చదివితే అర్థమౌతుంది.” అంటారు. ఈమాటలు పూర్తిగా నిజం. కొన్ని పుస్తకాల గురించీ, శ్రీ శ్రీ, శ్రీరంగం నారాయణరావు, చాసో, పురిపండా అప్పలస్వామి లాంటి రచయితలతోనూ, కొందరు స్నేహితులతోనూ తన జ్ఞాపకాల గురించి వ్రాసుకున్న వ్యాసాలు. ఈవిడ ఒడియా నుండి అనువాదాలు చేసారట. దొరికితే చదవాలని ఉంది.  
  • ఖ్వాబ్ – అరుణాంక్ లత: ఇవి రచయిత ప్రేమ, విరహం, నాస్టాల్జియా, విప్లవం, రాజకీయాలు ..ఇలా వివిధ విషయాల మీద రాసుకున్న (ప్రేమ)లేఖలు. మ్యూజింగ్స్. కొన్నిటిని అప్పుడప్పుడూ ఫేస్బుక్ లో చదివి నచ్చడంతో పుస్తకాన్ని చదివాను. చాలావరకూ నాకు నచ్చాయి. 
  • ఒంటరి చేల మధ్య ఒక్కతే మన అమ్మ – వాడ్రేవు చినవీరభద్రుడు: ఇది రచయిత 1987 – 1991 మధ్య వ్రాసిన కవితల సంకలనం. ఈయన తరువాతి కాలంలో వ్రాసిన రచనలు ఇప్పటికే చాలా చదవటం వలన, వాటితో పోలిస్తే ఈ కవితలు అంతగా ఆకట్టుకోలేదు. ఐదారు మాత్రమే నాకు నచ్చాయి. 
  • I – శ్రీకాంత్ : శ్రీకాంత్ కవితలు, వచన కవితలు, లోలోపలి సంభాషణలు కలగలిసిన సంకలనం. దాదాపు పదేళ్ల క్రితం మొదటిసారి శ్రీకాంత్ కవితలు అతని బ్లాగ్ లిఖిత ద్వారా పరిచయం. అతనేం రాసినా ఇష్టపడతాను. ఓ ఫార్ములాకి లొంగని ప్రత్యేక శైలి శ్రీకాంత్ గారిది. 

You Might Also Like

One Comment

  1. leol

    నా దృష్టిలోకి రాని చాలా కొత్త పుస్తకాల గురించి తెలిసింది. ధన్యవాదాలు!

Leave a Reply