పుస్తకం
All about booksఅనువాదాలు

March 20, 2015

ఆవరణ – ఎస్.ఎల్.భైరప్ప

More articles by »
Written by: Srinivas Vuruputuri
Tags: ,
“ఆవరణ అంటే నిజాన్ని దాచివేయటం. విక్షేపం అంటే అబద్ధాన్ని ప్రచారం చేయటం. వ్యక్తి స్థాయిలో కనబడే ఈ ఆవరణ విక్షేపాలను అవిద్య అంటారు. సమాజ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కనబడితే మాయ అంటారు.” అని గంభీరంగా మొదలుపెడతారు భైరప్ప గారు ఆవరణ నవలకు రాసుకున్న ముందుమాటను.

భైరప్పగారు ఛేదించాలనుకున్న భ్రమావరణం హిందూ-ముస్లిం సంబంధాలకు సంబంధించినది. “హిందూ-ముస్లిం సమైక్యతా భవంతిని అబద్ధాల పునాది మీద నిర్మించలేము.” అన్న ఆలోచన నుంచి పుట్టిందీ నవల. మహమ్మద్ ఘజనీ కాలం నాటినుంచి టిప్పు సుల్తాన్ దాకా – ముస్లిం పాలకుల ఘాతుక చర్యలను సమర్థించే, నిరాకరించే చరిత్రకారుల మీదా మేధావుల మీదా భైరప్ప గారు మోగించిన యుద్ధభేరి ఈ నవల.

***

కర్ణాటకలోని నరసాపుర గ్రామంలో నివసించే నరసింహె గౌడ గాంధేయవాది. చుట్టుపక్కల గ్రామాల్లో పేరూ, ప్రభావమూ ఉన్నవాడు. ఆయన కూతురు లక్ష్మి పూనా నగరంలోని చలనచిత్ర శిక్షణా సంస్థలో సినీ రచన కళను అభ్యసిస్తూ తన సహవిద్యార్థీ, కాబోయే దర్శకుడూ ఐన అమీర్‌ని ప్రేమిస్తుంది. లక్ష్మి తండ్రి – సగటు హిందువులాగే – అభ్యంతరం చెబుతాడు. “ఇదేదో నీ ఒక్క దానికే సంబంధించిన వ్యవహారం కాదు రేపెన్నడో నీకు స్వయాన పుట్టినవాడో, ఆ తరువాతి తరం వాడో దేవాలయ ధ్వంసానికి పాల్పడితే ఆ పాపం నీదే అవుతుంది సుమా” అని హెచ్చరిస్తాడు. “స్వధర్మే నిధనం శ్రేయం. పర ధర్మో భయావహః” అని వారిస్తాడు తండ్రి స్నేహితుడు శేషాశాస్త్రి. కాలం చెల్లిన తండ్రి ఆలోచనలను త్రోసిపుచ్చి, తెగతెంపులు చేసుకొని అమీర్‌ని పెళ్ళి చేసుకొని రజియాగా మారుతుంది లక్ష్మి.

అమీర్ ఎందుకు హిందువుగా మారలేదు? ప్రగతిశీల భావాలున్న ఇద్దరూ మతాతీతంగా ఎందుకు జీవించలేకపోయారు? అమీర్ తర్కం పడనివ్వలేదు కనుక- “అబ్బాయి మతం అమ్మాయి స్వీకరించటమే కదా ఇప్పటి రివాజు?”, “అమ్మాయైనా అబ్బాయైనా ఇస్లాంని వదిలిపెట్టటం ఆ మతం సహించదు కనుక”, “అయినా, మతం మారటమంటే – పేరు మార్చుకోవటమే కదా, అదో పెద్ద విషయమా?”…

స్వతంత్ర భావాల లక్ష్మి రజియా పాత్రలో ఇమడలేకపోతుంది. ఓవంక అత్తా, మామా, బురఖా, ఉద్యోగం మానేయమన్న అనుచిత సలహాలు, తబ్లిగీ కార్యకర్తల నిఘా, తలాకులివ్వబోయిన మొగుడు…, మరోవంక, పురుడు కోసం పుట్టింటికి వెళ్ళలేకపోయానన్న బాధ, దగ్గరకు రానివ్వని తండ్రి మీద కోపం… అత్తా మామల ఇంట్లోంచి బయటికొచ్చేస్తుంది (అమీర్‌తో కలిసే). దళితులను, స్త్రీలను అమానుషంగా హింసించే హిందూ మతాన్ని తీవ్రంగా ఖండిస్తూ బోలెడన్ని వ్యాసాలు రాసి సెలెబ్రిటీగా వెలిగిపోతుంది. ఓ ఇరవయ్యెనిమిదేళ్ళు గడిచిపోతాయి.

యు.కె.లో చదువుకొని, బ్రిటిష్ కాథలిక్ భార్యతో తిరిగివచ్చి, విశ్వవిద్యాలయాచార్యుడుగా పని చేస్తున్న శేషాశాస్త్రిగారబ్బాయి నరసింహశాస్త్రి – లక్ష్మి కన్నా ఓ పదేళ్ళు పెద్ద – రజియా విప్లవభావాలకి దన్నుగా ఉంటాడు. ఆయనో రోజారంగు అభ్యుదయవాది. నోట మార్క్సు జపం, ఉద్యోగమూ-పేరుప్రతిష్ఠల ఉట్టి మీద ధ్యాస.

ప్రభుత్వం పనుపున జాతీయ సమైక్యత కోసం డాక్యుమెంటరీలు తీసే పని మీద అమీర్‌తో కలిసి బయల్దేరిన రజియా, హంపిలో ఉగ్రనరసింహుడి ఖండితవిగ్రహాన్ని చూసి కదిలిపోయి, లక్ష్మితనంలోకి ఒంటరిగా పునఃప్రయాణం ప్రారంభిస్తుంది. తండ్రి మరణవార్తను విన్నలక్ష్మి తన స్వగ్రామానికి వెళ్ళటంతో, కథ ఓ పెద్ద మలుపు తిరుగుతుంది.

తాను వెళ్ళిపోయాక, తన తండ్రి బాహిర వ్యాపకాలనన్నింటినీ వదులుకొని ఇంటి తలుపులు వేసుకొని ఎప్పుడూ ఏదో చదువుకుంటూ శేష జీవితం గడిపాడని తెలుసుకుంటుంది లక్ష్మి. అది కేవలం ఉబుసుపోక చదువు కాదనీ, నిఘంటువులను పక్కన పెట్టుకొని దీక్షగా ఇస్లాం మతం గురించీ, ఇండో-ముస్లిం రాజుల చరిత్ర గురించీ చేసిన సుదీర్ఘాధ్యయనమనీ గ్రహిస్తుంది. కుతూహలం కొద్దీ – బహుశా, కొంత అపరాధభావనతో – ఆ పుస్తకాలను చదవటం మొదలుపెడుతుంది లక్ష్మి. ఆ చదువు కోసం బెంగుళూరునొదిలేసి నరసాపురలో ఉండిపోతుంది. తన అభిప్రాయాలను సమూలంగా మార్చేసుకొని, తన కొత్త ఎరుకను ప్రకటిస్తూ, ఔరంగజేబు కాలం నేపథ్యంగా ఓ నవలిక రాస్తుంది లక్ష్మి.

ఇంతకీ లక్ష్మి ఏం నేర్చుకున్నది? తను రాసిన పుస్తకం కథేమిటి? అమీరేమయ్యాడు? వాళ్ళబ్బాయి నజీర్ ఏమవుతాడు? శేషాశాస్త్రి తన కొడుకును క్షమిస్తాడా? ప్రొ.శాస్త్రి నిర్వహించిన సెమినారుల్లో లక్ష్మి ఏం చెబుతుంది? పై ప్రశ్నలకు సమాధానాలను మొత్తం నవలను చదివి పాఠకులు తెలుసుకొందురుగాక. 🙂

***
ఈ నవలలో నన్ను ఆకట్టుకున అంశాలు – ఉద్విగ్నకరమైన ప్రారంభాధ్యాయం, లక్ష్మి పాత్ర చిత్రణ, శేషాశాస్త్రి కోపప్రకటనం, గంగా తీరంలో సాధువుతో సంభాషణ…

స్టీరియోటిపికల్‌గా అనిపించినా లక్ష్మి తన కొత్త మతంలో ఇమడకపోవటం గురించి plausibleగానే రాసారనిపించింది.

ప్రధాన లోపాలు – ఇది భైరప్ప గారు అనుభవం/పరిశీలన నుంచి కాకుండా తను చదివిన పుస్తకాల్లోంచి పుట్టుకొచ్చిన కథ కావటం, తన ప్రతిపాదనలకు పేలవమైన ప్రతివాదనలను సృష్టించటం, ఉపన్యాసాలు/అభిప్రాయాలు కథను మింగేయటాన్ని గమనించకపోవటం…

“మతాంతర వివాహము-దాని పర్యవసానాలు” అన్న ఇతివృత్తం దగ్గరే ఆగిపోయి ఉంటే ఈ నవల బిగి చెడకుండా ఉండేదేమోనని నాకనిపించింది. అలాక్కాకుండా భైరప్పగారు దీన్ని చరిత్ర చర్చలోకి విస్తరించినందున ఇది మరో “స్వీట్‌హోం మూడోభాగం”లా తయారయ్యింది.

యండమూరి “ఆనందో బ్రహ్మ” నవలలో ఎంతో సమర్థవంతంగా వాడుకున్న “అంతర్నవల” ప్రక్రియ ఈ నవలలోనూ కనిపిస్తుంది అయితే భైరప్పగారి అంతర్నవలలో కళా కౌశల్యం కనబడదు. ఆ విషయాన్ని రచయితే లక్ష్మి ద్వారా చెప్పించటం ఓ విచిత్రం.

ముగింపు విషయంలో బాగా తొట్రుబాటు పడ్డారు రచయిత. కథలో అప్పటికే loose ends ఎక్కువైపోయాయి. ఈ నవలను ప్రయోగాత్మకంగా “అసమాప్తం” చేయాలని అనుకున్నారేమో, లేక ఐదో పదో అధ్యాయాల కథ అచ్చుదాకా రాకుండా ఎక్కడైనా జారిపోయిందేమో… ఆవరణ రెండోభాగం కూడా వెలువడుతుందేమో ఎప్పుడో. 🙂

అధస్సూచికలను కూడా చేర్చేస్తే ఇది నవల కాదు వ్యాసమని పాఠకులు పసిగడతారని కాబోలు అంత పని చేయలేదు గానీ అందుకు పరిహారంగా ఓ రెండు పేజీల పొడవున్న ఉపయుక్త గ్రంథసూచికను పదహారో (చివరి) అధ్యాయంలో ప్రకటించేసారు రచయిత. ఇంత చెప్పేసాక కూడా వివేకానందుడు మహమ్మద్ ప్రవక్త గురించి చెప్పిన సుదీర్ఘాభిప్రాయాన్ని ఎక్కడా వాడుకోలేక పోయానన్న బెంగ వదల్లేదేమో, దాన్ని చివరి పేజీలో ఉపసంహారంలా సర్దేసారు.

***

కన్నడ సాహిత్యావరణంలో, మన దేశపు బౌద్ధికావరణంలో రాజ్యమేలుతున్న అభిప్రాయాలకు ఎదురీది తాననుకున్నది నిర్భయంగా చెప్పటం ఈ నవలలో చెప్పుకోదగ్గ సుగుణం. రచయితకు సగటు ముస్లిం మీద సానుభూతే ఉన్నదని స్పష్టంగానే అర్థం అవుతుంది. ఇస్లాం మతాన్ని నిజాయితీగా విమర్శించాలనుకున్నారనీ, సెక్యులర్/మార్క్సిస్టు మేధావుల “మొహమాటం“ ఆయనకు నచ్చదనీ అర్థమవుతుంది.

ఈ నవలలో కనిపించే భైరప్పగారి తర్కాన్ని, ఆయన ప్రస్తావించిన “సత్యాల” గురించి రాసేందుకు నాకు శక్తి చాలదు. “నా అభిప్రాయాల మీద కూడా వాయిస్ ఆఫ్ ఇండియా రచయితల ప్రభావం, అరుణ్ శౌరీ ఇస్లాం విమర్శ ప్రభావం కొంత ఉన్నాయి. అయితే, ఈ నడుమన రెండోవైపు వాదనను అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను” అని చెప్పి ఊరుకుంటాను.

2007లో వెలువడ్డ ఈ కన్నడ నవల 2014 నాటికి నలభై ముద్రణలు పూర్తి చేసుకొని సంచలనాన్ని సృష్టించింది. నవ్యసాహిత్య రచయితల తీవ్ర విమర్శకి గురయ్యింది. ఈ పుస్తకం అమ్మకాలు చూస్తుంటే భయం వేస్తుందన్నారు యు.ఆర్.అనంతమూర్తి. వంశవృక్ష సినిమాలో నటించి తప్పు పని చేసానని వాపోయారు గిరీశ్ కర్నాడ్. ఎన్.ఎస్.శంకర్ అనే రచయిత “ఆవరణద అనావరణ” అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ వాదోపవాదాలన్నీ పుస్తకం అమ్మకాలను పెంచటానికే ఉపయోగపడ్డాయనుకుంటాను.

దరిమిలా, ఈ నవల మరాఠీ, హిందీ, బెంగాలీ, తమిళ, ఆంగ్ల, సంస్కృత భాషల్లోకి అనువదించబడింది. తెలుగు అనువాదకులు ఇంకా ఎందుకు చెయ్యి చేసుకోలేదో?

***

అదనపు వివరాలు:

 1. ఫ్లిప్‌కార్ట్‌ లింకు; అమెజాన్ లింకు
 2. ఔట్‌లుక్ పత్రికలో వచ్చిన సుధీంద్ర కులకర్ణి సమీక్ష
 3. ఇంకాస్త సమగ్రమైన సమీక్ష
 4. ముగింపు కోసం వెదుక్కుంటున్న కథకుడి కథ (అరవింద్ అడిగ వ్యాసం)
 5. భైరప్ప – సాహితీ జీవిత పరిచయం
Avarana

S.L.Bhyarappa
About the Author(s)

Srinivas Vuruputuri

శ్రీనివాస్ వురుపుటూరి; హైదరాబాద్‌లో నివాసం; సాఫ్ట్‌వేర్ ఉద్యోగం; చదవడం హాబీ; చర్చించడం సరదా; రాయాలంటే బద్ధకం, బోలెడన్ని సందేహాలున్నూ.7 Comments


 1. varaprasaad.k

  నాటి నుండి నేటి వరకు ఇదే చరిత్ర,ప్రేమ పెళ్ళిలో లో కచ్చితంగా వధువు హిందువే కావటం ఆమెను మతం మార్చుకొని పేరు మార్చి పెళ్లి చేసుకోవటం,మహా అయితే నాలుగేళ్లు కాపరం చేసి ఓ ఇద్దరో ముగ్గురో పిల్లల్ని కానీ వదిలెయ్యటం ఎక్కువ శాతం జరిగేదిదే..కొంత మంది విడిపోకుండా బాగానే ఉన్నవాళ్లు కూడా వున్నారు.అయితే ఇందులో ముఖ్యంగా ప్రేమించినపుడు మతం,కులం అడ్డు రానప్పుడు,పెళ్ళికి ఎందుకు అడ్డు వస్తుంది అనే.


 2. padmaja

  భైరప్ప గారి పర్వ,ధాతు, గృహభంగ్ పుస్తకాలు తెలుగు లో చదివాను. ఏకబిగిని చదివించే పుస్తకాలు. ఇప్పటి మీ సమిక్ష చూసిన తర్వాత, ఆవరణ తెలుగు అనువాదం కోసం ఎదురు చూస్తాను.


 3. రవి గారు, తెలుగు అనువాదం మీరే చెయ్యండి.


 4. మంజరి లక్ష్మి

  “మహమ్మద్ ఘజనీ కాలం నాటినుంచి టిప్పు సుల్తాన్ దాకా – ముస్లిం పాలకుల ఘాతుక చర్యలను సమర్థించే, నిరాకరించే చరిత్రకారుల మీదా మేధావుల మీదా భైరప్ప గారు మోగించిన యుద్ధభేరి ఈ నవల.” – వీలైతే దీన్ని ఇంకొంచం వివరంగా చెపుతారా శ్రీనివాస్ గారు. తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.


  • Srinivas Vuruputuri

   మంజరి లక్ష్మి గారికి

   క్షమించాలి, బాగా ఆలస్యం చేసాను. మీ ప్రశ్నకు సమాధానంగా ఆవరణ నవలలో ప్రస్తావించబడ్డ చారిత్రికాంశాలను క్లుప్తంగా రాద్దామని అనుకున్నాను. అయితే, ఇదే విషయం పై రచయిత రాసిన ఓ వ్యాసం నెట్‌లో చదివాకా దాన్నే మీ ముందుంచితే సరిపోతుందేమోననిపించింది.

   1969-70లలో భైరప్ప జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ (NCERT)లో పనిచేసేవారు. విద్యా బోధన ఆధారంగా జాతీయ సమైక్యతను సాధించేందుకు అప్పట్లో జి.పార్థసారథి అనే ఓ ఉన్నతాధికారి అధ్యక్షుడిగా ఏర్పరచిన ఒక కమిటీలో భైరప్ప సభ్యుడిగా ఎంపిక అయ్యారట.

   “జాతీయ సమైక్యతకు ప్రతిబంధకాలుగా మారగలిగే అవకాశం ఉండే కంటకప్రాయమైన భావాలను ఎదిగే పిల్లల మనస్సులో ప్రవేశపెట్టకుండా జాగ్రత్త పడటం మన కర్తవ్యం. చరిత్రకూ, భాషకు సంబంధించిన పాఠ్య గ్రంథాల్లో ఇలాంటి ముళ్ళను ఏరివేసే బాధ్యత ఈ కమిటీ స్వీకరించింది” అని చెప్పారట తన తొలి అధ్యక్ష ప్రసంగంలో.

   ఒకట్రెండు ఉదాహరణలిమ్మని భైరప్ప అడిగినప్పుడు, “ఘజనీ మహమ్మదు సోమనాథాలయాన్ని ధ్వంసం చేయుట, ఔరంగజేబు కాశీ మథురలలో దేవాలయాలను కూలద్రోసి మసీదులు కట్టుట, హిందువులపై జజియా పన్నును విధించుట” వంటి ఎందుకూ పనికిరాని నిజాల గురించి తాను మాట్లాడుతున్నానని చెప్పారట పార్థసారథి.

   ఆ సందర్భంలో చెలరేగిన చర్చ “ఏది సత్యం ఏదసత్యం? అసలు సత్యము అనేదొకటుంటుందా లేక మనము సత్యము అని భ్రమించేదంతా మన మన వ్యాఖ్యానాల సారాంశమేనా?” అంటూ సాగి, సాగి చివరికి భైరప్పను ఆ కమిటీనుంచి తొలగించటంతో సద్దు మణగిందట.

   దరిమిలా, ఆ సంస్థ వారు ప్రచురించిన పాఠ్య పుస్తకాలు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల “లైను” మేరకే రాయబడ్డాయన్నారు భైరప్ప.

   (మిగతా వివరాలకు ఈ లింకులో చూడండి.)

   శ్రీనివాస్


 5. రవి

  బావుంది. తెలుగు అనువాదం కోసం ఎదురు చూస్తాను.


  • Srinivas Vuruputuri

   రవి గారికి,

   లక్ష్మీదేవి గారన్నట్లు మీరే అనువదించవచ్చునేమో. నన్నడిగితే, ఆయన ఆత్మకథ “భిత్తి”ని ఎంచుకొమ్మని చెబుతాను. నేనిప్పుడు చదువుతున్న ఆంగ్లానువాదం కాస్త విసిగించే విధంగా ఉంది. ఎవరైనా తెలుగు చేసి ఉంటే బావుణ్ణని ఎన్ని సార్లు అనుకున్నానో…

   శ్రీనివాస్  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

సార్థ

“సార్థ” – ఎనిమిదవ శతాబ్ద ప్రథమ పాదం నాటి భారతదేశ చరిత్రలో పొదగబడ్డ కథ. “మన దేశ ...
by Srinivas Vuruputuri
2

 
 

భైరప్పగారి ‘దాటు’

1975లో కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతిని అందుకున్న భైరప్పగారి దాటు నవలను ఓ నాలుగేళ్ళ క్...
by Srinivas Vuruputuri
8

 
 

గృహభంగం

ప్లేగు భయం సద్దు మణిగి రేపో, మాపో షెడ్డులనొదిలేసి రామసంద్రం గ్రామస్థులు మళ్ళీ ఊళ్ళో...
by Srinivas Vuruputuri
3

 

 

కులాలను అధిగమించే దాటు ఎప్పుడు?

‘గతం నీకు చూపించే దారి బ్రతుకు మీద కులం గుర్రాల సవారీ!’ అంటారు వాస్తవిక దృష్టితో ...
by అరుణ పప్పు
10

 
 

మహాభారతానికి ఒక పంచనామా – పర్వ

ప్రసిద్ధ కన్నడ రచయిత ఎస్.ఎల్.భైరప్ప గారి ‘పర్వ’ నవల చదవడానికి నాకు ప్రేరణ కలిగించ...
by nagamurali
44