Aadhaar: A biometric history of India’s 12 digit revoution – Shankkar Aiyar

వ్యాసకర్త: అమిధేపురం సుధీర్

*******************
ఆధార్ అనేది ఇప్పుడు ప్రతీ భారతీయుడి గుర్తింపుని తెలిపే ఒక ముఖ్య సాధనం అయ్యింది. వివిధ రకాల ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సేవలను పొందడానికి ఆధార్ ఖచ్చితంగా కావాలి. ప్రజలకే కాకుండా ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ఆధార్ ఒక ముఖ్య సాధనం. అలాంటి ఆధార్ గురించి, ఒక సమగ్రమైన పరిశోధనా గ్రంథంలా ఈ పుస్తకం వ్రాశారు శ్రీ శంకర్ అయ్యర్.

130 కోట్ల జనాభా వున్న మన దేశంలో, గుర్తింపు ఎప్పుడూ ఒక పెద్ద సమస్యే. అసలు ఆధార్ లాంటి ఒక వ్యక్తిగత గుర్తింపు విధానం మనలాంటి దేశానికి ఎందుకు అవసరం అనే విషయంతో పుస్తకం మొదలవుతుంది.

ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్తాపకులు నందన్ నీలేకని గారు ఈ ప్రాజెక్టుకి చైర్మన్ గా రావడం, ప్రభుత్వం లో నుంచీ మరియు ప్రైవేటుగా కూడా ప్రతిభా వంతమైన టీం ని నియమించడం, రకరకాల బాలారిష్టాలూ, వివిధ ప్రభుత్వాలు మారినప్పుడు, వారి వారి అనుమానాలకు, ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఎదుర్కొన్న సవాళ్ళు, మొదలు పెట్టినప్పటినుంచీ ఎప్పుడు ఆగిపోతుందో తెలీకుండా కొనసాగి, చివరికి ఒక దశలో, మారిన రాజకీయ పరిణామాలతో ఇక ఆధార్ వుండదేమో అన్న స్థితి నుంచి, ప్రపంచంలోనే ఇలాంటి ప్రాజెక్టుల్లో అతి పెద్ద ప్రాజెక్టుగా నిలిచిన నేటి వరకూ, ఆధార్ యొక్క ప్రస్థానాన్ని చక్కగా వివరించారు.

ప్రభుత్వంలో ఒక పథకం, ఆలోచనాస్థాయి నుండి, అమలులోకి రావడానికి ఎన్ని అవాంతరాలుంటాయో, ఈ పుస్తకం చదువుతుంటే తెలిసింది. అసలు ఇలాంటి పథకాలు ఎన్ని అమలులోకి రాకుండా వుండిపోయాయో.

ఆధార్ కి సంబంధించి ఈ పుస్తకం ఒక డాక్యుమెంటరీలా వున్నప్పటికీ, విషయాన్ని ఆసక్తికరంగా చెప్పటం వలన, ఎక్కడా బోరింగ్ గా అనిపించలేదు. సులభమైన భాష, శైలి వలన చదవటం చాలా సుఖంగా అనిపించింది.

ఈ పుస్తకంలోని విషయాలని వివరించటం కంటే, ఇలాంటి పుస్తకం ఒకటి వుంది అని పరిచయం చేయటమే ఈ చిన్ని వ్యాసం యొక్క ఉద్దేశ్యం.

ఆధార్ యొక్క ఆవిర్భావం, కారణాలు, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా లేక పథకాల రూపకల్పనలో ప్రభుత్వాల పనితీరు లాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా, ఈ పుస్తకం చదువవచ్చు.

You Might Also Like

Leave a Reply