ఐదు మాయా ఏంజెలో రచనలు
మాయా ఏంజెలో (ముఖచిత్రం వికీపీడియా నుండి తీసుకున్నాను) పేరు మొదటిసారి దాదాపు పదేళ్ళ క్రితం విన్నాను. అప్పటికి నేను విన్నది కవయిత్రి అని. నాకు కవిత్వం మీద ఆట్టే ఆసక్తి లేకపోవడం మూలాన “ఓహో” అని ఊరుకున్నాను. అయితే, గత నెలలో మదర్స్ డే సందర్భంగా ఏదో వెబ్సైటు బ్రొజ్ చేస్తున్నపుడు రికమెండేషన్ గా ఆవిడ రాసిన “Mom & Me” కనబడింది. ఇపుడు నేను ఓ పిల్ల తల్లిని కనుక అలాంటి టైటిల్స్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి 🙂 దానితో లైబ్రరిలో వెదికితే అద్దెకు దొరికింది. ఆ చదవడం చదవడం వరుసబెట్టి మరో నాలుగు పుస్తకాలు చదివాను. వీటిని గురించి నా అభిప్రాయాలు పంచుకోవడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.
నేను చదివిన పుస్తకాలు (చదివిన వరుసలో):
Mom & Me
Letters to my daughter
Gather together in my name
I know why a caged bird sings
Just Give Me a Cool Drink of Water ‘fore I Diiie
వీటిలో “Letters to the daughter” వ్యాసాల వంటివి. చివరిది కవిత్వం. మిగితా మూడూ ఆత్మకథాత్మక కథనాలు.
Mom & Me: ఇది ప్రధానంగా మాయా ఏంజెలో తల్లి వివియన్ బాక్స్టర్ గురించి, ఆవిడతో రచయిత్రి అనుబంధం గురించి. రచయిత్రి తల్లిదండ్రులు చిన్నతనంలోనే విడిపోగా ఆమె తన నాన్నమ్మ దగ్గర చాలా రోజులుండి, టీనేజి వయసుకి వచ్చేసరికి తిరిగి వాళ్ళమ్మ దగ్గరికి చేరారు. ఆ తరువాత ఈమె టీనేజి తల్లవడం, ఆ సమయంలో ఆవిడ తల్లి చేయూత, తర్వాతి జీవితంలో అనుభవాలలో తల్లి పాత్ర గురించిన చిన్న చిన్న కథనాల సంకలనం ఈ పుస్తకం. మాయా ఏంజెలో ఏడు ఆత్మకథలు రాసిందంట సిరీస్ లాగా. అందులో ఈ పుస్తకం చివరిది (2013). నాకు బాగా నచ్చింది. అసలు వాళ్ళ జీవన విధానం, అనుభవాలూ అవీ నాకు అస్సలు పరిచయం లేని ప్రపంచమైనా, కొంత సార్వజనీనత ఉందనిపించింది పుస్తకంలో వర్ణించిన సంఘటనల్లో.
Letters to my daughter: ఇది కొన్ని వ్యక్తిగత వ్యాసాల సంకలనం. ఇందులో కొంత శాతం పై పుస్తకంలో చదివిన అనుభవాలే. నాకైతే కాసేపటికి బోరు కొట్టేసింది అవే చెబుతుందే, దీనికి ఇంకో బుక్కెందుకు? అని.
Gather Together in My Name: ఇది మాయా ఏంజెలో ఆత్మకథల సిరీస్ లో రెండవది. టీనేజి తల్లిగా, పిల్లాడితో ఒక్కత్తే ఉంటూ అవీ ఇవీ అని లేకుండా లెస్బియన్ ప్రాస్టిట్యూట్లకి మేనేజర్ గా చేయడంతో సహా రకరకాల ఉద్యోగాలు చేస్తూ తనని తాను పోషించుకునే దశలోని అనుభవాల సంకలనం ఈ పుస్తకం. ఇందులోనే ఒకతని ప్రేమలో పడ్డం – అతను ఈమెని ఓ వేశ్యగా మార్చడానికి ప్రయత్నించడం, ఇలాగే ఇంకొకాయన పరిచయం అవ్వడం – అతను డ్రగ్ అడిక్ట్ అయినా అదెంత తీవ్రమైన పరిస్థితో వివరించి ఈమెని అందులోకి రాకుండా కాపాడ్డం -ఇవీ ఈ పుస్తకంలో ప్రధాన ఘట్టాలు.
I know why a caged bird sings: ఇది ఈ ఆత్మకథల సిరీస్ లో మొట్టమొదటిది. రచయిత్రి చిన్నతనం నుండి దాదాపు ఓ పధ్నాలుగేళ్ళ వయసు వచ్చేవరకు కథ. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో అమెరికాలోని ఓ చిన్న ఊరులో నల్లజాతి వారి జీవితం, సామాజిక స్థితి, ఎనిమిదేళ్ళ వయసులో తల్లిని పెళ్ళి చేసుకున్నతని చేతిలో రేప్ కి గురవడం – ఇవీ ఈ పుస్తకంలో నా ప్రధానంగా అనిపించిన భాగాలు. ఈ ఆత్మకథల సిరీస్ లో ఇది బాగా పేరొందినది అనుకుంటాను. పదేళ్ళ క్రితం నేను విన్నది దీని గురించే.
Just give me a cool drink of water ‘fore I Diiie: ఇది కవిత్వం. ఇది మాయా ఏంజెలో తొలి కవితా సంపుటి (1971). కొన్ని పాటల తరహాలో సాగేవీ, కొన్ని కవితలూ. సాధారణంగా నాకు కవిత్వం అర్థం కాదు, ఆసక్తి లేదు. ఎప్పుడో ఏదో కదిలిస్తే దాన్ని పట్టుకుని కొన్ని చదువుతానంతే. ఈ పుస్తకంలో కూడా కొన్ని అర్థం కాలేదు. కానీ, కొన్ని అలా బలంగా తాకాయి. ముఖ్యంగా పుస్తకంలోని రెండో భాగంలో జాతి గురించి రాసిన కవితలు. మరీ ముఖ్యంగా వీటిల్లో “The Calling of Names”…
ఈ కవిత కింద పేస్ట్ చేస్తున్నాను (ఇక్కడ నుంచి)
“He went to being called a colored man
after answering to “hey, nigger.”
Now that’s a big jump,
anyway you figger.
Hey, Baby, watch my smoke.
From colored man to Negro,
With the N in caps,
was like saying Japanese
instead of saying Japs.
I mean, during the war.
The next big step
was a change for true,
From Negro in caps
to being a Jew.
Now, Sing, Yiddish Mama.
Light, Yellow, Brown
and Dark-brown skin,
were okay colors to
describe him then.
He was a Bouquet of Roses.
He changed his seasons
like an almanac.
Now you’ll get hurt
if you don’t call him “Black.”
Nigguh, I ain’t playin’ this time.”
ఈ ఐదు పుస్తకాలు మూడు రకాల (ఆత్మకథలు, వ్యక్తిగత వ్యాసాలు, కవిత్వం) సాహిత్యం అయినా కూడా నాకు అన్నింటిలోనూ కొంత కల్పన ఉందనిపించింది. ఆవిడ జీవితంలోని నాటకీయతతో పాటు, ఆవిడ మరింత నాటకీయంగా తన అనుభవాలని వర్ణించడం ఇందుకు కారణం కావొచ్చు. అయితే, నాకు ఆవిడకి భాషపై ఉన్న పట్టు నచ్చింది. ఆ వాక్యాలు, వర్ణనలు అలా చదివే కొద్దీ ఇక్కడ భలే రాసిందే, అక్కడ ఎంత బాగా చెప్పింది తన అనుభవం – ఇలా చాలా సార్లు అనుకున్నాను. ఏదైనా సరే చదివించేలా రాసే శైలి ఆమె సొంతం అనిపించింది. కవిత్వం అయితే మిగితా అన్నింటికన్నా బాగా బలమైన ప్రభావం కలిగించేదిలా తోచింది. ముఖ్యంగా, అమెరికాలో జాతి విద్వేషం గురించి అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఆవిడ అవే అంశాల గురించి రాసిన కవిత్వం చదవడం వల్లనేమో, కొన్నిరోజులు ఆ ప్రభావం వెంటాడింది.
ఇకపోతే, ఇంతకీ ఆవిడో పర్పస్ తో సిరీస్ రాసింది, అడ్డ దిడ్డంగా ఏ ఆర్డర్లో పడితే ఆ ఆర్డర్లో చదవకు, సరైన వరుసలో చదువు, లేకపోతే ఆవిడ చెప్పదల్చుకున్నది నీవు తెల్సుకోలేవు అని లెక్చర్లు దంచకండి. నిజానికి ఆవిడేం చెప్పదల్చుకుందో ఆవిడకి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఎవ్వడేది రాసినా అది వాళ్ళ interpretation మాత్రమే. ఇది నా interpretation, అంతే. సందర్భం వచ్చింది కనుక ఇదే అంశం మీద నా రెండు మాటలూ అనేసి పోతా – ఒక పుస్తకం ఇలాగే చదవాలి అని శాసించే హక్కు ఎంత గొప్ప చదువరికైనా లేదు, ఎంత గొప్ప అభిమానికైనా లేదు. ఆఖరికి ఆ రచయితకి కూడా నువ్విలాగె చదవాలని చెప్పే హక్కు లేదు – నేనిలా అనుకుని, ఈ ఉద్దేశ్యంతో రాశానని మాత్రమే చెప్పగలరని నా అభిప్రాయం.
పుస్తకం.నెట్లో నేను చివరిగా రాసిన వ్యాసం ఏప్రిల్ 2019 మొదటివారం నాటిది. ఏడాది తరువాత ఏంజెలో రచనలు నాచేత మళ్ళీ ఇక్కడ ఓ వ్యాసం రాయించాయనమాట!
Leave a Reply