ధర్మవిజయ విధాత శ్రీ ధనికొండ

వ్యాసకర్త: ఏల్చూరి మురళీధరరావు
********************

దూతి! త్వం తరుణీ యువా స చపలః శ్యామా స్తమోభి ర్దిశ
స్సన్దేశ స్స రహస్య ఏవ విజనే సఙ్కేతకావాసకః
భూయోభూయ ఇమే వసన్తమరుత శ్చేతో నయ న్త్యన్యతో
గచ్ఛ క్షిప్రసమాగమాయ నిపుణం రక్షన్తు తే దేవతాః.

నాయిక ప్రియుని వద్దకు నెచ్చెలితో సందేశాన్ని పంపుతూ అంటున్నది: ఓ దూతీ! నాలుగంచుల యవ్వనంలో ఉన్నావు నువ్వు. అతనూ అంతే. అవకాశం దొరికితే అందిపుచ్చుకోక మానడు. ఎటుచూసినా చీకటి కమ్ముకొంటున్నది. ఏకాంత మందిరంలో పొందుకోసం సందేశాన్ని తీసుకొని వెళుతున్నావు. ఆమని వేళ. పి‌ల్లగాలులు మనస్సును ఎక్కడెక్కడికో నడిపిస్తాయి. నేర్పుగా కలిసి, వెంటనే వస్తావు కదూ! అని.

క్రీస్తుశకం 9-వ శతాబ్దం నాటి విద్వత్కవయిత్రి శీలా భట్టారిక కల్పించిన ఈ సన్నివేశానికి పర్యవసానం ఏమిటో మనకు తెలియదు. ప్రియునితో నాయికా ప్రణయం దూతీకృతమై యథాయోగ్యంగా అనుకూలించిందో, అనుకూలింపలేదో కాని – అంతకు వెయ్యేళ్ళ తర్వాత సౌశీల్యభట్టారకమైన శ్రీ ధనికొండ హనుమంతరావు గారి అద్భుతావహ చిత్రణలో అచ్చమూ ఇటువంటిదే కాల్పనిక సన్నివేశం సంఘటితమైంది. తెలుగు సాహిత్యంలో సత్యధర్మాలను జీవితాదర్శాలుగా తీర్చిదిద్దిన అపూర్వమైన నవలా ప్రబంధమొకటి రచితమైంది.

శ్రీ ధనికొండ హనుమంతరావు గారి జీవితపథమంతా సత్యధర్మాలకు కట్టుబడింది. వారి పెద్దకొడుకు శ్రీధరరావు గారితో మా అక్కయ్య వివాహమైన నాటినుంచి అతిసన్నిహితంగా నేను గమనిస్తూ వచ్చిన సత్యమిది. “సత్యము శ్రేయము జనులకు, సత్యము ద క్కొండు లేదు సద్ధర్మ; మదే, య త్యలఘుతపఃఫల మిడు, నిత్యతఁ బాటిల్లు దాన నిఖిలార్థంబుల్” అన్న సూక్తితాత్పర్యవర్తనం అవశ్యాచరణీయమని విశ్వసించి, ఆ దృఢవిశ్వాసాన్ని మతాచారాలకు అతీతంగా పాటించిన కర్తవ్యపరాయణులు వారు. ఆ సత్యవాఙ్నిష్ఠలో ఆయన ఎన్ని అనూహ్యములైన విషమపరీక్షలు ఎదురైనా అణుమాత్రమూ చలింపలేదు. ఎటువంటి త్యాగానికైనా వెనుదీయలేదు. మద్రాసులో స్థిరనివాసం ఏర్పరచుకొని, యావత్కాల జీవిత సాంయాత్రికురాలై తమకు తోడునీడై నిలిచిన ధర్మపత్ని ఆత్మీయ నామంతో ‘క్రాంతి ప్రెస్’ను వ్యవస్థాపించిన తొలిరోజుల నాటి వారి ఉదంతం ఒకటి నాకు ఎప్పటికీ గుర్తుకు వస్తుంటుంది. ఆయన ఇంగ్లాండులో తయారైన డబుల్ డెమీ ఫారాల దిమ్మెలతో అచ్చొత్తింపగల ఖరీదైన డాసన్ వారి ఆటో ఫీడింగ్ ప్లేటెన్ యంత్రాన్ని కొనుగోలుచేశారు. కలకత్తా నుంచి రెయిన్ బో కంపెనీ సిరాను తెప్పించారు. జైహింద్, నెల్సన్ ఫౌండ్రీల వారి వద్ద పోతపోయించిన అక్షరాల కూర్పుతో తప్పులు లేని నాణ్యమైన ముద్రణకు శ్రీకారం చుట్టి, అచిరకాలంలో సుదూరప్రాంతాల నుంచి రచయితలు స్వయంగా వచ్చి తమ పుస్తకాల అచ్చు ఒప్పందంకోసం వారాల తరబడి వేచి ఉండేటంత ప్రసిద్ధిని పొందారు. ఏ రోజు పుస్తకాలను ఇచ్చేందుకు తేదీని ఖరారు చేశారో, అంతకు ముందురోజు సాయంతన వేళకల్లా గోదాములో ఫారాల స్టిచ్చింగు, పేస్టింగు, బైండింగులు పూర్తయి పుస్తకాలు కట్టలతో సహా డెలివరీకి సిద్ధంగా ఉండేవని పేరువచ్చింది. ఆ క్రమశిక్షణఫలంగా మద్రాసులో అప్పటికే ఎంతో ప్రసిద్ధమైన అచ్చుకూటాల ఏలుబడి ధాటీని అతిగమించి ముద్రణ రంగంలో స్వయంవ్యక్తిత్వాన్ని సంతరించుకొన్నారు. మంచి లాభాలు రాసాగాయి. కోడంబాకం స్టేషను వీథిలో విశాలమైన స్థలంలో సొంతయింటిని ఏర్పరచుకొన్నారు. అటువంటి ఉత్క్రాంతస్థితిలో ఉండగా ఒకనాడు సమయానికి డబ్బులు చేతికందక వారు ముందుగా ఇచ్చిన మాట ప్రకారం టైపు ఫౌండ్రీలో పోతపోయించిన అందమైన ఫాంటుల కొనుగోలుకైన నెలసరి వాయిదాను చెల్లింపలేని గడ్డు పరిస్థితి వచ్చింది. ముందుగా అనుకొన్న వేళకు కంపెనీ ఏజెంటు డబ్బుకోసం ప్రెస్సుకు వచ్చేసరికి – పనివాళ్ళు కేసుల నుంచి బయటికి తీసి పోతపోసిన సీసపు అక్షరాలను రాశిగా పోసి అమ్మే ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఆయన దిగ్భ్రాంతి చెంది, “ఏమిటిక్కడ జరుగుతోంది?” అని అడిగితే, “సమయానికి చేతికందలేదు. ఇవన్నీ అమ్మివేస్తున్నాను. మీ పైకం ఇదిగో” అని ఇవ్వవలసిన మొత్తాన్ని నిర్మమంగా అతని చేతిలో ఉంచారు. ఏజెంటు కళ్ళనీళ్ళు పెట్టుకొని, “ఏమిటండీ యిది, డబ్బంటారా! వస్తుంటుంది, పోతుంటుంది. ఒక్కరోజు అటూ యిటూ అయినంత మాత్రాన – మాటంటే ఇంత పట్టింపా! మీ వంటివారు చల్లగా ఉంటే మాకు అదే ఆశీర్వాదం కాదూ?” అంటూ ఆ అమ్మకాన్ని నిలుపుచేయించి, “మాటకు ప్రాణము సత్యము” అని త్రికరణశుద్ధిగా నమ్మిన వారి వ్యక్తిత్వాన్ని గురించి పిల్లాపాపలకు చెప్పుకొన్నాడట.

“ఎంత నష్టం వాటిల్లినా సరే, మాటకు కట్టుబడి తీరాలి. ఎంత కష్టం ఎదురైనా సరే, స్వధర్మాన్ని తప్పకూడదు” అన్న వారి ఆదర్శాన్ని గురించి చిన్నప్పుడు నాకు మా నాన్నగారు చెప్పిన ఉదంతం ఇది. అప్పటి నుంచి అదే ఆదర్శ నేపథ్యాన్ని, సత్యనిష్ఠను, సద్వర్తనను వారి జీవితంలోనూ, రచనలలోనూ తిలకించటం నా వంతయింది.

సర్వకాల సర్వావస్థలలోనూ తథ్యవంతమైన ఆ సత్యస్వరూపాన్ని, ధర్మస్వభావాన్ని శ్రీ ధనికొండ చిన్నవయస్సులోనే ఆకళింపు చేసుకొన్నారు. ఎటువంటి ఒడిదుడుకులకు చలింపని ఓరిమిని అలవాటు చేసుకొన్నారు. మనోవాక్కాయములతో ఎవరినీ నొప్పింపని ప్రియస్వభావం సహజంగానే అలవడింది. ఏ పరిస్థితిలోనైనా యథార్థం మాత్రమే చెప్పాలని నిశ్చయించుకొన్నారు. తెనాలిలో పెరిగినందువల్ల ఆనాటి హేతువాదోద్యమప్రభావపరిధి వారిపై ప్రసరించి ఉండటం సహజమే. బాల్యయౌవనవయోఽవస్థల నాడు ఎప్పుడు ఏమి అధ్యయనించారో తెలియదు కాని, మానవతా వాదాన్ని మించిన మతమేదీ లేదని నమ్మకం కుదిరింది. పరలోకమన్నది ఎక్కడో ఉండటం వైజ్ఞానిక విశ్వాసం కాదని నిశ్చయించుకొన్నారు. నాస్తిక ధర్మాన్ని అవలంబించారు. అందువల్లనే వారి రచనలలో చార్వాక మాధ్యమిక యోగాచార సౌత్రాంతిక వైభాషిక దిగంబర నాస్తిక దర్శనాలలోని వాక్యాలు విరివిగా మనకు కానవస్తుంటాయి. ‘ఆధ్యాత్మికత’ అన్న ఒక్క పారలౌకిక భావానికి లోను కాకుండా అచ్చమూ ఋషితుల్యమైన ఆదర్శజీవనాన్ని గడిపారు. తాము నమ్మినదానినే తూచా తప్పకుండా ఆచరించి, తమ రచనలలో ప్రబోధించారు. ఇరవైయవ శతాబ్ది హేతువాద కాల్పనిక రచయితలలో ఆ తత్త్వావగాహనను యథాదృష్టార్థకథనంగా బహుభంగుల చిత్రీకరించటంలో అగ్రశ్రేణికులయ్యారు.

జీవితంలో పుస్తకస్థములైన ధర్మపన్నాలను వల్లించటం కంటె యుక్తసదాచరణను మించిన ఆచారధర్మం మరొకటుండదు. సత్యము, శౌచము, దయ, దానము అన్నవి ఆ ధర్మముయొక్క లక్షణాలనుకొంటే – ఆ నాలుగింటినీ మతవిశ్వాసాలకు అతీతంగా ఆచరణలో పాటించి చూపినవారని ఆ రోజులలో శ్రీ ధనికొండ వారితో ఏ కొద్దిపాటి పరిచయం ఉన్నవారికైనా ఇట్టే అర్థమయ్యేది. విశ్వేతిహాసాల అధ్యయనం వల్ల, విస్తారమైన లోకపరిశీలనం మూలాన ఆయన ప్రతివ్యక్తి జీవితంలోను ఆచరణీయ అనాచరణీయ ధర్మాధర్మాలకు జరిగే మానసిక సంఘర్షణను, తుదకు అధర్మంపైని సంభవించే స్వధర్మవిజయాన్ని పరిపరివిధాల చిత్రీకరించే ఉద్యమప్రయత్నం చేశారు. ఆయన సాహిత్యసర్వస్వమూ ఆ ఆదర్శ వ్యక్తీకరణకే అంకితమైంది. తమ కాలంనాటి రాజకీయ సాంఘిక ఆర్థిక పరిణామాలను గమనిస్తూనే ఆయన ఆయా వాదాల పడికట్టురాళ్ళ ప్రభావానికి లోనుకాక తనదైన ఒక విశిష్టవ్యక్తిత్వాన్ని సంతరించుకొన్నారు. ధర్మాధర్మాల విచికిత్స ఏర్పడేసరికి న్యాయవర్తనులూ, అన్యాయవర్తనులూ సైతం ఆ ఘర్షణకు గురికాక తప్పదని గుర్తించి తన రచనల ద్వారా అందుకు పరిష్కారమార్గాలను అన్వేషించారు. సత్యప్రబోధాత్మకములైన కథలను, నవలలను, నాటకాలను వ్రాసి సామాన్యప్రజానీకానికి సత్యాచరణలో అభిరుచిని, అభినివేశాన్ని కలిగించేందుకు కృషిచేశారు. వైజ్ఞానిక భావాల వ్యాప్తికై పత్రికలను స్థాపించి ప్రతి రచనలోనూ ప్రజాహితానికై నిర్విరామంగా కృషిచేశారు. తెనాలిలో ఉండగా ‘రేరాణి’ పత్రికకు సంపాదకత్వం వహించి అశ్లీలత లేని పరిభాషలో యువతీయువకులు తెలిసికొనవలసిన వైజ్ఞానిక, శాస్త్రీయ విషయాలను పరిచయం చేశారు. స్వయంగా ‘అభిసారిక’ పత్రికను తెనాలిలో ప్రారంభించారు. 1952లో మద్రాసు నివాసానికి మారిన తర్వాత ‘అభిసారిక’ను కొనసాగిస్తూ ‘జ్యోతి’ మాసపత్రికను కూడా నిర్వహించారు. 1957 ప్రాంతాల తమకు అత్యంతమూ ఆభిమానికుడైన ఫ్రెంచి రచయిత బాల్జాక్ వలె సాహితీవ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ముద్రణరంగంలోకి అడుగుపెట్టారు. ‘క్రాంతి ప్రెస్’ను వ్యవస్థాపించారు. క్రమంగా పత్రికలకు స్వస్తి పలికి ‘అభిసారిక’ పత్రికను రాంషా గారికి, ‘జ్యోతి’ పత్రికను వి.వి. రాఘవయ్య గారికి వ్యాపారపరంగా ఒక్క రూపాయిని కూడా ఆశించకుండా నిఃస్వార్థ మిత్రధర్మంగా ఇచ్చివేశారు. తెలుగు సాహిత్యంలో అందమైన అచ్చుకూర్పుకు పేరుపడిన పెక్కు పుస్తకాలను ముద్రించారు. ముద్రణాలయంలోని కార్మికులను ఒక పెద్ద సంస్థలోని ఉద్యోగుల వలెనే చూసుకొన్నారు. ఏ వాణిజ్య లాభాలు, ఆదాయపు పన్ను మినహాయింపులు లేని రోజులలో తమవద్ద పనిచేస్తున్నవారందరికీ ప్రావిడెంటు ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టి వారివారి ఉద్యోగాంతంలోనూ, పలుమార్లు ఎదుర్కొనవలసివచ్చే కష్టసుఖాలలోనూ ఆవశ్యకమయ్యే విధంగా ఆదుకొన్నారు. ఒకవైపు యాతాయాత మిత్రమండలి రాకపోకలతో, నిర్విరామంగా మ్రోగుతుండే టెలిఫోనులో సంభాషణలతో, ముద్రణాలయంలోని సమస్యలతో, గ్యాలీ ప్రూఫుల ఒప్పుతప్పులతో సతమతమవుతూనే ఒక అనన్యసాధ్యమైన చిత్తసమాధిని సమకూర్చుకొని ఏ మాత్రమూ భంగంలేని పట్టుదలతో సాహితీవ్యాసంగాన్ని కొనసాగించారు. పాఠకుల మానసిక పరిధిని వికసింపజేసే ఉదాత్తములైన రచనలను చేశారు. ఆ విధంగా వ్యగ్రావస్థలో ఏకాగ్రతను కల్పించికొన్న వేళలలో రచితమైనవే వారికి చిరంతన కీర్తిప్రతిష్ఠలను ఆర్జించిపెట్టిన ‘జగదేకసుందరి క్లియోపాత్రా’ నవల, ఇదిగో – ఇప్పుడు మీ చేతులలో ఉన్న ‘దూతికా విజయం’.

నిరంతరాయితమైన శ్రీ ధనికొండ వారి సాహితీవ్యాసంగమంతా సత్యధర్మప్రతిబోధకే అంకితమైనదని అనుకొన్నాము. అందుకు ఈ దూతికా విజయానికి పూర్వోత్తరసంహితగా వారి రచనావళిలో ఎన్ని రచనలనైనా ఉదాహరింపవచ్చును. జీవితంలో సత్యానికి విలువ నశించి, సత్యాన్ని చెబితే నమ్మటం లేదని అసత్యమే చెప్పి క్షణికలాభాన్ని పొందజూసిన ఒక పసివాడి ప్రవర్తనతో ఇంటిల్లిపాదీ ఏ విధంగా తలక్రిందైనదీ విశ్లేషించే వారి సుప్రసిద్ధమైన ‘సత్యవ్రతుడు’ కథలోనూ ఆసాంతం ఈ సత్యనిర్వర్ణనమే కనబడుతుంది. సత్యమార్గానికి కట్టుబడి ఉండటం సత్యవ్రతమా? సత్యంకోసం అసత్యాన్ని ఎరవేసి అసత్యాన్ని సత్యంగా నిరూపించటం సత్యవ్రతమా? అటువంటి సత్యవ్రతం పరిణామాలేమిటి? అన్న విచికిత్స ఒక్క ఈ కథలోనే గాక శ్రీ ధనికొండ వారి సాహిత్యమంతటానూ ఏకోన్ముఖంగా విస్తరిల్లింది. “అధర్మదేవత లోకమంతటా విహరిస్తున్ననాడు, ఏలికలకు మాత్రం న్యాయమెక్కడుంటుంది?” అని ‘అశ్వత్థామ’ నాటికలో దుర్యోధనుడంటాడు. ఆ మాటను పురస్కరించుకొని ధర్మాధర్మాల గంభీరమైన తత్త్వచింతన భారతంలో వలె పాత్రముఖీనంగా సాగుతుంది. ఆ పూర్వపక్ష సిద్ధాంత విజిగీషలో ఎవరి వాదపక్షం వారిది. “ఆపదల్లో పడ్డ మానవుడు – నిలకడ లేని హృదయంతో తనది ధర్మపథం కాదేమోనని భయపడటం సహజమేగా” అని కృపాచార్యులతో అశ్వత్థామ అంటాడు. అధర్మవర్తనులకు ఆత్మవిశ్వాసం బీటలువారటం, ఆ బలహీనక్షణాలలో భయాందోళనలు కలగటం ఎంతటివారికైనా తప్పవని అందులో నిరూపింపబడుతుంది. ఇతరులను మోసం చేయాలనుకొనేవారు అంతరాత్మ వేసే ప్రశ్నలను అణచివేసి తమను తాము మోసం చేసుకోక తప్పదు కదా. ‘ప్రొఫెసర్ బిండ్సన్’ నాటికలో ప్రొఫెసరు, “ఇతర్లను మోసంచేసేముందు, మన అంతరాత్మను మనమే మోసం చేసుకోవాలి” అని మేరీతో తన భవిష్యత్కుతంత్రానికి పథకాన్ని రచిస్తాడు. మోసం చేసేవాడు చివరికి మోసపోక తప్పదన్న పరిణామ సత్యాన్ని కథాఫలంగా ప్రతిపాదించేందుకు ఈ కథనమంతా ఉద్దేశింపబడుతుంది. ఇవన్నీ పాఠకులకోసం శ్రీ ధనికొండ వారి సందేశాలే అనటంలో విప్రతిపత్తి ఉండకూడదు. పాపపుణ్యాల వాస్తవిక స్వరూపాన్ని గురించీ, భక్తిపరుల పాపభీతిని గురించీ చర్చిస్తూ, “తను పాపి అనే నమ్మకం లేనివాడికి అసలు దేవుడి ధ్యాసే అనవసరం” అంటుంది ఇందిర ‘చికిత్స’ నాటకంలో. ఆ ఇందిర ధనికొండ వారి అంతరంగప్రతిఫలనమే అని మనకు ఇట్టే అర్థమవుతుంది. ఆత్మీయత వికటించిన భావబంధాలు, భౌతికదృష్టి, ప్రేమ పేరిటి ఇంద్రియవ్యామోహం, మనోవిశృంఖలత్వం, మోసపు టాలోచనలు, స్వార్థపరత్వం, నీతిబాహ్యమైన రహస్యవర్తనం మొదలైన ఆకర్షణలన్నీ చూస్తూ ఉండగానే వికర్షణలుగా మారి వ్యక్తులలో శాశ్వతికమైన సత్యదర్శనానికి దారితీయటాన్ని స్వసమర్థంగా చిత్రింపగలగటం వల్లనే శ్రీ ధనికొండ సాహిత్యానికి సాహిత్యికులలో అత్యంత విశిష్టమైన అంతటి గౌరవం సిద్ధించింది. ఈ అన్నింటికి అన్నింటిలోనూ మానవజీవితాన్ని అనంత దృక్కోణాల నుంచి నిశితంగా పరిశీలించి, ఆ సారాన్ని కథారూపంలో అందించటమే అగుపిస్తుంది. ప్రమాదంలో చూపుకోల్పోయి, కన్నులు తిరిగివచ్చిన తర్వాత కన్నులుండీ చూడలేకపోయిన దివాంధుని కథగా చిరస్మరణీయమైన వారి ‘గుడ్డివాడు’ రచనలో ప్రతిపాదితమైనది ఈ పార్యంతిక సత్యదర్శనమే. ‘సేవిక’ నవలా ప్రతిపాదనమూ ఇటువంటిదే. ఒక జీవితంలో జరిగే ఒకే ఒక్క పొరపాటుతో చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలు కూడా తలక్రిందులై, ఊహింపరాని సంఘటనలకు ఆహుతి కావటం మనము చూస్తూ ఉన్నదే. ఈ నగ్నసత్యానికి అభినవ కల్పనాత్మక నిరూపణకు ఒక పార్శ్వం ‘మగువ మనసు’ నవల కాగా, వేరొక పార్శ్వం 1967లో ప్రకటితమైన ఈ ‘దూతికా విజయం’లో కనబడుతుంది. శ్రీ ధనికొండ వారి రచనలన్నింటిలోనూ ప్రస్ఫుటించే ఆర్జవం ఈ నవలాప్రబంధంలో ఎన్నడూ లేని క్రొత్తదనాన్ని సంతరించుకొన్నది.

అనేకవిధాల ‘దూతికా విజయం’ నవల శ్రీ ధనికొండ సాహిత్యాదర్శాలన్నింటికీ మేలి ప్రతినిధి అని చెప్పవచ్చును. వారి ఊహశాలితకు, లోకధర్మానుశీలనకు, పాత్రనిర్మాణకౌశలానికి, వాకోవాక్యవైదగ్ధికి, అఘటన సన్నివేశ ఘటనానైపుణికి, అనల్పశిల్పకల్పనకు, క్షణక్షణం మలుపులు తిరుగుతుండే కథాకథనరౌచికతకు ప్రథమోదాహరణీయ విశిష్టమైన కృతి యిది. మూడంటే మూడు పాత్రలతో మూడు వందల పుటల పర్యంతం నిరాఘాటంగా సాగిపోయే విలక్షణమైన రచన.

సంక్షేపతః ఇందులోని ప్రధానేతివృత్తం ఇది: అవంతీ దేశపు మహారాజు ధర్మపాలుని చిన్నరాణి మాధవీదేవి సంతానకాంక్షతో దిగులొందుతుంటుంది. సంతానం కలుగకపోతే అది స్త్రీ లోపమే గాని పురుషుని లోపం కావచ్చునన్న భావం సమాజంలో నెలకొనే రోజులు రాలేదని ఆమెకు విచారం కలుగుతుంది. సంతానం కలుగలేదన్న భావంతో పెద్దరాణిని అనాదరించి రాజు తనను వివాహం చేసికొన్నట్లే, తనకు కూడా సంతానం కలుగకపోతే మరొకరిని వివాహం చేసుకొంటాడని భయపడుతుంది. ఒకానొక ఉత్సవ ప్రదర్శనలో వీరభద్రుడనే బ్రాహ్మణ ధీరుని రూపబలపరాక్రమాలను చూసి ఆమెకు చక్షూరాగం, సంతాన ప్రాప్తికాంక్ష ఉదయిస్తాయి. ఆ కార్యసాఫల్యంకోసం తన కూర్మిచెలికత్తె సరస్వతిని దూతికగా నియోగిస్తుంది. క్షణికోద్రేకాలు దారుణమైన పరిస్థితులకు దారితీయవచ్చునని సరస్వతి ఆమెను పరిపరివిధాల హెచ్చరిస్తుంది. చివరికి స్వధర్మానికి లోబడి రాణికై దౌత్యానికి ఒప్పుకొంటుంది. రాణివాసపు సప్తదర్పణ మందిరంలో వారి కలయికను సంధానింపజేయాలని పూనుకొంటుంది. తన ప్రయత్నం విఫలమై కార్యవిఘ్నం సంభవించి ఈ విచిత్ర నాటకంలో పాల్గొన్నవారందరికీ శిక్ష తప్పదని మనస్సులో కలవరపాటు ఉదయిస్తుంది. చూస్తూ ఉండగానే అనుకోని పరిణామాల వల్ల సుపరీతం విపరీతం కావచ్చునని అంతరంగం హెచ్చరిస్తుంటుంది. మనము చదువుతున్నది స్వప్నమో సంభవిష్యమాణమో తెలియని ఒక ఆవేశస్థితిలో పాఠకులుంటారు. సాహసం చేసి రాజ్ఞీదూతిక సరస్వతి వీరభద్రుని మందిరానికి వెళుతుంది. తాను తలచినదాని కంటె అత్యధిక వేగవంతంగా వీరభద్రుని విజ్ఞానవాహిని ప్రవహిస్తున్నదనే గాఢాభిప్రాయం ఆమెకు ఏర్పడుతుంది. ఆ విజ్ఞానతటాకంలో తాను తలమునకలు కాకుండా తన విజ్ఞానాన్ని తెప్పగా మార్చుకొని జలవిహారం చేయవలసి ఉంటుందని తనను తాను హెచ్చరించుకొంటుంది. వీరభద్రుని కండబలాన్ని, గుండెబలాన్ని మించిన ధర్మబలం ఒకటి తమకై విధి విధింపనున్నదని తెలియక ఆమె చేసిన ప్రయత్నాల పరిణామమే ఈ అద్భుతావహమైన దూతికా విజయం నవలగా రూపుదిద్దుకొన్నది. దౌత్యవేళ ఆమె ఎదుర్కొన్న ఉద్విగ్నావస్థలను, పాత్రల అంతరంగ బహిరంగ విమర్శరూపములైన గుణావగుణ విచికిత్సలను, కర్తవ్యాకర్తవ్యాల తర్జనభర్జనలను, ప్రకాశవిమర్శరూపములైన సంభాషణలకు పూర్వోత్తరాలను ఇంత విపులంగా చిత్రీకరించిన రచన తెలుగు సాహిత్యంలో వేరొకటి లేదంటే అది అతిశయోక్తి కాదు. ఒకానొక సన్నివేశాన్ని ఎంత సర్వతోముఖంగా, ఎంత సర్వాంతర్వర్తనీయంగా, ఎన్ని దృక్కోణాలనుంచి సూక్ష్మ సూక్ష్మతరంగా అనుశీలించి, తన్మూలంగా ఒక్కొక్క సంభాషణకు ఎన్నెన్ని తీరుల అనూహ్య పరిణామాలను చిత్రీకరింపవచ్చునో, ఎన్నెన్ని విధాల పెర్మ్యుటేషన్ కాంబినేషన్ లను పాఠకులకు వివరిస్తూ కథను ఎంతగా బహుళచిత్రవర్ణకిర్మీరితం చేయవచ్చునో ఇందులోని అభివ్యక్తుల మూలాన మనకు తెలిసివస్తుంది.

ఒక్కొక్కప్పుడు రచయిత తానై పూనుకొని చెప్పకపోతే సృజనాత్మక రచనయొక్క నైపథ్యానుసంజనం ఏమిటో పాఠకులకు తెలిసే అవకాశం ఉండదు. పార్యంతికమైన కథాసందేశం ఒక్కటే రచయితల రచనోద్దేశమని ఊహించటం సబబు కాకపోవచ్చును. 1987 ఏప్రిల్ 22-వ తేదీనాటి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో “నేనెందుకు రాశాను?” అన్న ప్రస్తావికలో శ్రీ ధనికొండ ఈ ‘దూతికా విజయం’ నవలారచనకు పూర్వరంగాన్ని పేర్కొన్నారు:

వాస్తవం (రియాలిటీ), వార్త (న్యూస్), వాస్తవికత (రియలిజం) నిజానికి కళారూపమవుతుందని నా నమ్మకం.
మిత్రుడు విశ్వప్రసాద్ వాత్స్యాయన కామసూత్రాలు ఇంగ్లీషు పుస్తకం ఇచ్చి తెలుగు రాయమని కోరాడు. సరే అన్నానే కాని రాసే ప్రయత్నం చేయలేదు. ఆయన చక్కగా రేపర్ కూడా ప్రింటు చేసి చూపాడు. అయినా నాలో రాసే ఉత్సాహం రాజుకోలేదు.
ఏమీ తోచక ఒకనాడు కామసూత్రాలు తెరిచాను. వాత్స్యాయనుడు రాజులు, రాణుల వ్యభిచారాన్ని గూర్చి చెబుతున్న ప్రకరణమది. రాణి ఎంతో తెలివైన, అందమైన వాక్చాతుర్యం గల, అతి నమ్మకమైన చెలికత్తె ద్వారా ప్రియుణ్ణి ఆడవేషంలో పిలిపించుకోవాలి – వాత్స్యాయనుడు చెప్పిన విషయమిది.
బుర్రలో ఒక్క మెరుపు మెరిసింది. ఆ కాంతిలో నేను చూడగలిగిన వైశాల్యాన్ని గూర్చి రాయలేను. ముఖ్యాంశం ఏమిటంటే రాణి ఆహ్వానాన్ని అందించేందుకు వచ్చిన దూతిక చేతికి చిక్కిన పిట్ట, దాన్ని వొదిలి ముళ్ళపొదల్లో ఉన్న పదిపిట్టల కోసం పాకులాడటం దేనికి? ఈ ఊహ ఫలితమే దూతికా విజయం నవల.
ఇక ఈ రచనకు నేను పడిన ఆవేదన ఇంతా అంతా కాదు. లోపల అగ్నిపర్వతమే పేలినట్లయింది. రాయకుండా ఉండలేకపొయ్యాను. ఊహిస్తుంటే అనుకోని అనేక సంఘటనలు, అన్నీ అతితెలివిగా ప్రవర్తించే పాత్రలు కావటంతో మరీ జాగ్రత్త పడవలసివొచ్చింది.

అని. 1968లో శ్రీ ధనికొండ ‘పన్నాగం’ కథల సంపుటిని ప్రకటించినప్పుడు చివర ప్రకటనల పత్రంలో ‘దూతికా విజయం’ నవలను గురించి ఈ మాటలున్నాయి:

నవరస భరితమైన జనపథం, టక్కుటమారాలూ, ఇంద్రజాలాలూ ఇందులో లేవు. సర్వసాధారణ పాఠకుడే నాయకుడైతే ఎలా ప్రవర్తించేవాడో ఇందులోని పాత్రలు కూడా అలాగే కదలాడుతవి. తెలివితేటలకు గీటురాళ్ళయిన ఆ యా పాత్రల పోకడలు మైమరపిస్తవి.

అని. “సర్వసాధారణ పాఠకుడే నాయకుడైతే”, “తెలివితేటలకు గీటురాళ్ళయిన పాత్రలు” అన్న దళాలు రెండూ శ్రీ ధనికొండ రచనాదర్శాలు. ఇవి రచనలోని సన్నివేశాల క్రమపరిగతిని కన్నులకు కట్టినట్లు మనకు పరిచయంచేస్తాయి. వాత్స్యాయన కామసూత్రాలలోని దూతికా నిర్వర్ణనమే గాక ‘దూతికా విజయం’లో కళ్యాణమల్లుని ‘అనంగరంగము’ యొక్క ప్రస్తావనము కూడా ఉన్నది. ఇవన్నీ రచయిత వ్యుత్పత్తిగౌరవానికి ప్రత్యక్షనిదర్శనలు.

కామోత్తేజకత సాధ్యనిర్దేశంగా కలిగిన ఈ కథలోని సుశీలత అశ్లీలతగా పరిణమింపకుండా రచనాక్రమాన్ని శ్రీ ధనికొండ ఎంత సంయమనంతో నిర్వహింపగలిగారో పుస్తకాన్ని చదివి ముగించిన తర్వాత పాఠకులకు ఆశ్చర్యంగా ఉంటుంది. మహారచయిత బాల్జాక్ అన్నట్లు, కథలోని పాత్రల ప్రేమసంబంధి నైతికవర్తన (Sexual Morality) అన్నది కేవలం ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాలను పురస్కరించుకొనే గాక ఆ కథ జరుగుతున్న దేశ-కాల-వస్తువులపై కూడా ఆధారపడి ఉంటుంది. అంతేకాక అది ఫ్రెంచి తత్త్వవేత్త జార్జెస్ బాటైలే అన్నట్లు, “Desire in eroticism is the desire that triumphs over the taboo. It presupposes man in conflict with himself” అన్నప్పటి స్థితి. అది కేవలం ఒకానొక వ్యక్తి శరీరంపైని అధికార సాధనకు, రత్యంతావస్థ నాటి ఆనందానికై ఉవ్విళ్లూరటం మాత్రమే కాదు. అటువంటి భౌతిక శృంగారిక భావాల వల్ల కథాకథనం కలరూపును కోల్పోకుండా నవల అంతటా దేవాలయశిల్పాలలో వంటి కళాత్మకమూర్తులను సాక్షాత్కరింపజేయగలగటం రచయిత విజ్ఞానవైభవమే.

మనస్సులో కామచేతన రగుల్కొన్నప్పటి స్థితి పాత్రల శరీర మనస్సులను దహించివేస్తుంటే ఎప్పుడెప్పుడు ఏమి జరుగుతుందో ఏ మాత్రం ఊహించేందుకు వీలులేని పరిణామాలతో ఈ నవలలోని కథాకథనం మనను ఊపిరాడనీయని వేగంతో ముందుకు నడిపించుకొనిపోతుంది. శ్రీ ధనికొండవారే అన్నట్లు, విజ్ఞాన, వినోద, వికాస, విచిత్ర, విషాద, విలాస, ప్రణయ, సరస, శృంగార జనపథం ఇది. ముగింపు ఊహింపరాని ఈ కథాపరిగతిలో స్థగితములైన పెక్కు రమణీయ సన్నివేశాల విమర్శోపక్రమణిక ఇంతకంటె సమంజసం కాదు. వారే పాత్రముఖంగా ఒకచోట, అవంతీ దేశపు చిన్నరాణి మాధవీదేవి సరస్వతితో –

“పరార్థదూతికగా బయలుదేరావు; స్వార్థదూతికగా రూపొందావు. అంతతో ఆగక యిప్పుడు భార్యాదూతికగా మారావు. రెండు రోజుల్లోనూ మూడు అవతారాలు – బాగుంది…బాగుంది!”

అని పలికించిన ఒక్క వాక్యసంక్షేపంలో కథాసూత్రమంతా ఇమిడి ఉన్నందువల్ల, ఆ ఒక్కదానిని మాత్రం మీకోసం ముక్తాముక్తంగా అనుఘటింపదలిచాను.

ఫ్రెంచి రచనల అభిమానం వల్ల, స్వయంగా మొపాసా కథలను అనువదించినప్పటి అనుభవం వల్ల వారు తమ మూడవ కొడుకు నరసింహారావు ఫ్రెంచి భాషాధ్యయనం మొదలుపెట్టినప్పుడు, “పెద్దయ్యాక నువ్వు దూతికా విజయాన్ని ఫ్రెంచిలోకి అనువదించావంటే దీని సొగసేమిటో లోకానికి వెల్లడవుతుంది” అన్నారంటే, ఈ నవలా రచనపై వారికి గల ప్రత్యయం ఎంతటిదో తెలుస్తుంది. ఇప్పుడైనా విశ్వజనీనమైన యీ కృతిని ఫ్రెంచిలోనికి పర్యావర్తించే ముందు ఆంగ్లంలోనికైనా అనువదింపవలసిన బాధ్యత సాహిత్యికులపై ఉన్నది.

శ్రీ ధనికొండ హనుమంతరావు గారు సర్వవిధాల ఆదర్శవర్తనులై, ఋషితుల్యులైన ధన్యాత్ములు. నిండైన జీవితాన్ని, జవజీవాలు తొణికిసలాడే సాహిత్యజీవితాన్ని నిస్తులంగా, నిర్మమంగా, నిరాక్షేపణీయంగా నిర్వహించి, సత్యదయాధర్మాలకు కట్టువడి, ఆత్మీయులకూ ఆశ్రితులకూ పదికాలాలపాటు పదిలంగా గుర్తుండిపోయే ప్రేమను పంచియిచ్చి, మనీషిప్రజ్ఞుడైన ఆ మహనీయునికి స్మరణోత్సవమైన నివాళిగా ఈ కృతి ఇంతకాలానికి పునఃప్రకాశితం కావటం సాహిత్యాభిమానులందరూ స్వాగతింపదగిన ఆనందనీయ సన్నివేశం. ఇది శ్రీ ధనికొండ సాహిత్యంలో పదవ సంపుటం. అచిరకాలంలో ఇది సద్విమర్శకు పాత్రమై అశేష పాఠకాదరణకు నోచుకోగలదని ఆశిస్తున్నాను. స్వయందూతిక అయిన ఈ ఉదాత్త రచనకు, భవ్యరసానుభవసిద్ధికై ప్రతీక్షిస్తున్న మీకు నడుమ ఇంతకంటె ఆభ్యంతర యవనికావసరం ఉండదన్న నమ్మకంతో మిమ్మల్ని ఆ ధర్మవిజయ విధాత కథాద్వారంలోనికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను.

ప్రతులకు:
సాహితి ప్రచురణలు,
33-22-2, చంద్ర బిల్డింగ్స్,
సి.ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ – 520004.
స్థిరవాణి: 0866-2436642/43; చరవాణి: 8121098500
వెల: రూ.175/=
శ్రీ ధనికొండ హనుమంతరావు గారి రచనల 12 సంపుటాల పూర్తి సెట్టు: రూ. 1800/=

You Might Also Like

One Comment

  1. ముకుంద రామారావు

    అద్భుతంగా ఉంది ..వారి పుస్తకాలను ప్రచురించిన వారికి, మురళీ ధర రావు గారికి అభనందనలు ..

    ముకుంద రామారావు

Leave a Reply