ఫిల్టర్ లెస్ కాఫీ: ఫిబ్రవరిలో నేను చదివిన పుస్తకాలు
వ్యాసకర్త: అరిపిరాల సత్యప్రసాద్
*********************
ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం కాబట్టి ఎక్కువ చదివే అవకాశం కుదర్లేదు. పైగా ఈ నెల నేను రాయాల్సిన వాటిపై కూడా కొంత దృష్టి పెట్టాను. అందువల్ల ఫిబ్రవరిలో రెండే పుస్తకాలు చదివాను. వాటి గురించి –
తూరుపు గాలులు ఊణుదుర్తి సుధాకర్
పెద్దాయన. పైగా బాగా చదువుకున్నాయన. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినాయన. అన్నింటినీ మించి ప్రపంచాన్ని చూసినాయన. ఇవీ కారణాలు, ఆయన పుస్తకాన్ని అందుకోడానికి. కథలు బాగుంటాయని ఎక్కడో నమ్మకం వుండింది. ఒకట్రెండు ఇంతకు ముందు చదివాను కూడా. ముఖ్యంగా ఆం.జ్యో.లో వచ్చిన వార్తాహరులు.
పుస్తకం మొదట్లో సాదా సీదా అనిపించే కథలున్నాయి. అంటే బాలేవని కాదు. అంతగా చెప్పుకోదగ్గ విశేషాలు ఏం లేవు. కానీ కాలంలో కొద్ది కొద్దిగా వెనక్కి తీసుకెళ్లే టైమ్ మెషీన్ ఎక్కానన్న విషయం “చేపకనుల రాజకుమారి” పరిచయం అయ్యాక అర్థం అయ్యింది. ఆ కథలన్నింటిని చుక్కలు చేసి గీత గీస్తే ఇదీ దారి – జమీందారీ వ్యవస్థ పతనం, శ్రీకాకుళ గిరిన ఉద్యమ పూర్వపు కథ, సిపాయి తిరుగుబాటు అనంతరం బ్రిటీషు భవితవ్యం గురించి ఇద్దరు దొరల సంభాషణ, సిపాయి తిరుగుబాటుకి ముందు అపుడే వచ్చిన కొత్త టెక్నాలజీ: సామాన్యుల సాహసం, భారత దేశంతో వర్తకం కోసం వచ్చిన ఐరోపా వాణిజ్య సంస్థలు క్రమంగా ఇక్కడ ఉత్పత్తిదారుల చేతుల్ని నరికడం, పెనుగాలిలో రెపరెపలాడిన దీపంలా భారతదేశంలో బౌద్ధం వున్నప్పటి కాలం దాకా సాగింది. అప్పటికి అర్థం అయ్యింది ఈ రచయిత గొప్పతనం ఏమిటో. ఒకటి కాదు మూడు –
మొదటిది: ఎన్నుకున్న కథా వస్తువులు ’ప్రామాణిక’ చరిత్ర పుస్తకాలలో సమాధానాలు దొరకని ప్రశ్నలకు ఒక ’మాక్రో వ్యూ’ ద్వారా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చెయ్యడం. అందువల్ల ఇలా చరిత్రలో జరిగింది జరగలేదు అన్న వాదనకు ఆస్కారం లేకుండా కథ చెప్పగలిగారు.
రెండు: కథ చెప్పడం. కథలుగా మాత్రమే చెప్పడం. చరిత్రని వికీపీడియా తెలుగులో చదివినట్లు కాకుండా కథలా చదవగలగడం వల్ల హయిగా వుంది.
మూడు : ముందుమాటలో సత్యవతిగారు చెప్పారు – చరిత్ర కథ చెప్పినా కాంటెంపరీ రిలవెన్స్ వుండేలా చెప్పడం.
ఈ పుస్తకం చదివేటప్పుడు నేను కేరళలో సముద్ర తీరంలో వుండటం, అక్కడి కలోనియల్ బంగ్లా మధ్యలో యూరోపియన్ రెస్టారెంట్లలో ఆ కాలంలో పోర్ట్ చేరిన ఓడల నమూనాలను చూస్తూ, మధ్యమధ్యలో రచయితతో సంభాషిస్తూ చదవడం భలే బాగుంది.
చెప్పొచ్చేదేంటంటే – ఈ పుస్తకం చదవండి. దాచుకోండి. ఈసారి కలిసినప్పుడు నాకున్న కాస్త చనువుతో సుధాకర్ గారికి చెప్పబోయేదేంటంటే – అయ్యా మీరు ఇలాంటి హిస్టారికల్ ఫిక్షనే రాయండి. తెలుగులో అలాంటివి రాసేవాళ్లు లేరు. ఇలా రాయగలిగేవాళ్లు లేరు. కాబట్టి అది మీకు బాధ్యత. మా డిమాండ్ కూడా.
కథా వార్షిక 2004
ఇప్పుడు వున్నట్లుండి ఈ పుస్తకం ఎందుకు తీశాను. తెలియదు. 2013 లో కొన్నానీ పుస్తకం నెల్లూరు, చంద్రలతగారి ప్రభవలో. కథావార్షిక సిరీస్ ఎన్ని దొరికితే అన్ని కొన్నాను ఒకేసారి. అప్పట్నుంచి అలాగే వుందా పుస్తకం. పదిహేనేళ్ల క్రితం కథలు. ఎవరెవరున్నారు? వాళ్లు అప్పట్లో ఏం రాశారు? అని అనిపించి అందుకున్నాను. ఈ రెండు కోణాల్లో చాలా సంతోషం కలిగించిందీ పుస్తకం.
అప్పట్లో నేను రచయితగా ఎవరికీ తెలియదు. కానీ అప్పుడు ఈ సంకలనంలోకి ఎక్కిన వాళ్ల పేర్లు చూసి, ఈ రోజు వాళ్లందరితో ’స్నేహం’ వుందని అనుకుంటే భలే అనిపించింది. అక్కిరాజు, పెద్దింటి, గోపిని, రమణజీవి, జి. వెంకటకృష్ణ లాంటి పేర్లు చూసి అరే మనోడి కథ వుందే అనుకోవడం చాలా బాగుంది. ఏం రాశారు? అనడంతో పాటు సంపాదకులు (మధురాంతకం నరేంద్ర, వి.ఆర్. రాసాని) ఎలాంటి కథలను ఎన్నుకున్నారు? అనేది కూడా మంచి ప్రశ్నే అవుతుంది. ఎనభైలకు కొంచెం ముందు వెనుకలుగా స్త్రీవాదం, ఆ తరువాత వచ్చిన దళిత వాదం క్రమంగా ఇతర వర్గాలలో అస్థిత్వవాద గొంతు విప్పే మార్గాన్ని చూపించాయనుకుంటాను. (ఇదంతా నా చిన్నప్పటి ఆం.జో. పఠన పరిశీలన ఫలితం). అలా వచ్చిన గొంతుల్లో కొన్ని ఈ పుస్తకంలో వున్నాయి.
ఎరుకలసాని (మంత్రసాని: కె వరలక్ష్మి), యాచక వృత్తి (గరుడస్థంభం: జి. వెంకటకృష్ణ), హలాల్ చేసే ముస్లిం (జిద్దూ: పెద్దింటి), వడ్రంగి (కుట్ర: జాతశ్రీ), దళితక్రిష్టియన్ నర్స్ (దాది: కేతు విశ్వనాధరెడ్డి) వంటి కొత్త కులవృత్తుల/చేతివృత్తుల వారి కథలు చదవడానికి కుదిరింది. అలాగే కరువు రైతులు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి “దెబ్బ”, సుంకోజు దేవేంద్రాచారి “అన్నదాత” లో వున్నారు. “ఉత్తీత పాట” గోపిని మాత్రమే రాయగలిగిన జానపద కథ, అందులో కూడా రైతే వస్తువు. తాయమ్మ కరుణ “కవులమ్మ ఆడుదేనా” అంటూ స్త్రీ కథ రాయడం సరే కానీ అక్కిరాజు (అంటుకొమ్మ), ఆరెమ్ (వొంటేప మాను) కూడా స్త్రీ కథ రాయడం విశేషం. రమణజీవి కథ కొంత మిస్టీరియస్ గా కొంత అబ్సర్డ్ గా నడిచింది ఆయన పంథాలో.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాడ్రేవు చినవీరభద్రుడు ’ట్రాపికల్ ఫీవర్’ గురించి. గ్లోబల్ పరిణామాలను గుర్తించి, గమనించి, వాటిని కథా వస్తువు చేసుకోవడం ఒకటి. అలా చెప్పేటప్పుడు వ్యాసంగా మారకుండా భూమిలో నుంచి పుట్టిన మొలక లాంటి కథ రాయడం రెండోది. ఆ కథని చదివించేలా రాయడం మూడు. అందులో మరెన్నో సంగతుల్ని అలవోకగా ఇమడ్చడం నాలుగో విశేషం. అవగాహన, ఆలోచన తో పాటు కథారచన అనే కిటుకు కూడా తెలుసు కాబట్టే వీరభద్రుడు కథ ఒక లెవల్ పైన వుంటాయి.
అవన్నీ అటుంచండి. పదిహేనేళ్ల క్రితం కథలను ఎంత తీరుబడిగా చెప్పారు? చాలా నెమ్మదిగా మొదలౌతాయి ఈ కథలన్నీ. క్రమక్రమంగా పేజీలు పేజీలు దాటుతూ వుంటే కథలోకి వెళ్లిపోతాం మనం. చెప్పాల్సిన వివరాలన్నీ వివరంగా చెప్తూ ఆ కథ జరుగుతున్న ప్రాంతాన్ని, కాలాన్ని చూస్తాం. వింటాం. అక్కడే వుంటాం. ఇప్పుడిలా చెప్పట్లేదు మనం (అంటే ఇప్పుడు రాస్తున్న మా లాంటి వాళ్లు). కథా వస్తువుని లీలగా చూపిస్తూ అందులో డెప్త్ కొలవలేని అశక్తతనో, అవగాహనా లేమినో క్లిష్టమైన కథనం చాటున దాచిపెడుతున్నామా అనిపించింది.
చివర్లో చదువవలసిన కథల లిస్ట్ లో కూడా మంచి కథలు వున్నాయి. అందులో చాలావరకు నేను చదివినవి వున్నాయి. ముఖ్యం అందులో వి. చంద్రశేఖరరావు ’ద్రోహవృక్షం’ వంటి కథలు సంకలనం లోపలికి ఎందుకు చేరలేదా అనుకుంటూ పుస్తకం ముగించాను.
Leave a Reply