The Promise of Canada – Charlotte Gray

గత ఏడాది కెనడా దేశం ఆవిర్భవించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా వెలువడిన పుస్తకాలలో ఇది ఒకటి. ఈ మధ్య కెనడా వలస వచ్చాక ఈ దేశం గురించి ఏమన్నా పుస్తకాలు ఉన్నాయేమో అని చూస్తూంటే లైబ్రరీలో ఈ పుస్తకం కనిపించింది. మామూలుగా చరిత్ర పుస్తకమంటే తేదీలు, పాలకులు, ఆ యుద్ధం,‌ ఈ యుద్ధం – ఈ తరహాలో సాగుతాయి కనుక నేను చదవలేనంత సమాచారం, చదవలేని అకడమిక్ భాషలో ఉంటుందేమో అని నా భయం. అయితే, ఈ పుస్తకం గురించి సీబీసీ లో చదివినపుడు ఇది అలాంటిది కాదు, చదవొచ్చు అనిపించి, తెచ్చుకున్నాను. దీని గురించి ఒక పరిచయం, నా అనుభవం ఇది.

పుస్తకం పూర్తి పేరు: “The Promise of Canada: 150 years- people and ideas that have shaped our country”. ఒక దేశ చరిత్రని తొమ్మిది వ్యక్తుల జీవిత చిత్రాలతో చెప్పే ప్రయత్నం. వివరం వినగానే – “ఆ తొమ్మిదిమందే ఎందుకు? ఫలానా ఇంకోళ్ళు ఎందుకు లేరు? అసలు వాళ్ళకి ఉన్న క్వాలిఫికేషన్ ఏమిటి? రచయిత్రికి ఉన్న క్వాలిఫికేషన్ ఏమిటి?” ఇలాంటి అనుమానాలన్నీ వస్తాయి మనకి. ఈ అనుమానాలన్నీ ప్రస్తావిస్తూనే, ఇది తన సొంత ఎంపిక అని చెప్పుకుంటూనే, తన ఎంపికకి కారణాన్ని ఇలా వివరిస్తుంది రచయిత్రి ముందుమాటలో:

“Individual lives can be a petri dish for seeing what is going on in the larger society. These particular individuals – all products of their culture and times – helped shape not just the character of Canada we live in today, but also the way we think about ourselves and our future. One way or another, their reflections on being Canadian have become embedded in out collective subconscious. Their lives take a reader deep into the experience of the past. What was it like to exist in eras so different from our own? By bringing some long-dead figures back to life and by approaching from new angles a handful of living Canadians, I am reminded that people didn’t always think the way we do these days. … “

రచయిత్రి ఎంపిక చేసిన తొమ్మిది మందిలో: ముగ్గురు రాజకీయ నాయకులు, ఇద్దరు కళాకారులు, ఒక ఆదివాసీ నేత, ఒక సైన్యాధిపతి, ఒక ఆర్థికవేత్త, ఒక న్యాయమూర్తి ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళలు.వీళ్ళ గురించి చెబుతూ కెనడాలో గత 150ఏళ్ళలోనూ, అంతకు ముందూ పలు రంగాలలో జరిగిన ముఖ్య ఘట్టాలను పరిచయం చేశారు. పుస్తకం మూడు భాగాలుగా విభజించారు:

మొదటి భాగం: “Laying the foundations”. ఈ భాగంలో కెనడా తొలి ప్రధానుల్లో ఒకరైన George Étienne-Cartier (అవును, వీళ్ళకి తొలి ప్రధానులు ఇద్దరు), కెనడా సైన్యంలో, ముఖ్యంగా ఆదివాసీలు ప్రముఖంగా నివసించే north-west territories వద్ద ఉన్న దళాలలో పనిచేసిన Samuel Steele, కెనడా దేశపు ఆర్థిక చరిత్రను గురించి, ఇక్కడి నాగరికత అభివృద్ధి చెందడంలో ఆదివాసీ జాతుల పాత్ర గురించి పరిశోధనలు, ప్రతిపాదనలూ చేసిన Harold Innis, ఆదివాసీ జాతుల స్ఫూర్తితో గీసిన చిత్రాలతో కెనడా దేశపు కళకి అంతర్జాతీయ గుర్తింపుని తెచ్చిన చిత్రకారిణి Emily Carr – ఈ నలుగురి పరిచయాలూ ఉన్నాయి. వీళ్ళలో ఎమిలీ కార్ ని చేర్చడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అందులోనూ ఆవిడ కథ చదువుతూంటే జీవితంలో చాలా ఆలస్యంగా ఆవిడ కొంచెం పేరు వచ్చిన చిత్రాలు గీయడం మొదలుపెట్టిందనీ, చాలా కాలం స్పష్టత లేకుండా ఉందనీ అనిపించింది. అయితే, రచయిత్రి దీనికి రాసిన వివరణ – కళకి సంబంధించినంత వరకు కెనడా ఒక ఎడారిలా ఉన్న సమయంలో ఆవిడ తన చిత్రాలతో ప్రజలని ప్రభావితం చేసిందని.

“Of all the artists who made the wilderness a powerful element in the Canadian identity, I view Carr as the most important: she acknowledged that the landscape was peopled and alive before Europeans arrived, not vast and empty as most settlers liked to pretend. She was the first to try to capture the spirit of Canada in a modernist style. Her formidable canvases of skies, forests, and First Nations carvings are not macho records of discovery and conquest, but haunting and occasionally erotic paintings of mystery. Her perceptions and images have slowly seeped into the national memory bank”.

ఈ భాగంలో Harold Innis మీద రాసిన వ్యాసం నన్ను అన్నింటికంటే ఆకట్టుకున్నది. ఆర్థిక సూత్రాలకీ, ఒక దేశ నాగరికత/సాంకేతికత అభివృద్ధికీ ఆదివాసీ జాతులకీ సంబంధం ఉంటుందని నాకెప్పుడూ‌ అనిపించలేదు (నేను అంత క్లిష్టమైన విషయాలను ఆలోచించను. పుస్తకం.నెట్ కి ఇంకో మంచి వ్యాసం ఎప్పుడొస్తుంది? ఎవర్రాస్తారు? లాంటి ముఖ్యమైన ప్రశ్నల గురించి మాత్రమే ఆలోచిస్తాను). ఈ వ్యాసంలో ఈ అంశాల గురించి ఆసక్తికరంగా‌ పరిచయం చేశారు – ఇన్నిస్ జీవితం గురించి చెబుతూనే. వీలైతే ఆయన ఆలోచనలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అనిపించింది.

రెండో భాగం: “A different kind of country”. ఇందులో – దేశవ్యాప్తంగా public health care రావడంలో కీలక పాత్ర పోషించిన Tommy Douglas, కెనడా దేశ సాహిత్య చరిత్రనూ, అందులోని ప్రత్యేకతనూ గురించి రాసిన రచయిత్రి Margaret Atwood, కెనడాలోని మొదటి సుప్రీం కోర్ట్ మహిళా న్యాయవాది, అనేక చారిత్రక మానవ హక్కుల కేసుల్లో ప్రముఖ పాత్ర వహించిన Bertha Wilson – ఈ ముగురి గురించీ రాశారు. ఇందులో కూడా నాకు Atwood గురించిన వ్యాసం మిగితా ఇద్దరితో ఎందుకు చేర్చారో అర్థం కాలేదు. సాహిత్యం ముఖ్యం కాదని కాదు – వీళ్ళతో కలిపి ఒక భాగంగా వేయడం అర్థం కాలేదంతే. ఇక బెర్తా విల్సన్ కెనడాకి తన భర్త ఉద్యోగం వల్ల వలస వచ్చి, కొన్నాళ్ళు ఉద్యోగం దొరక్క చిన్న చిన్న పనులు అవీ చేసిన మనిషి. తరువాత లా చదివి, న్యాయవాదిగా ఎదిగారు. ఈ కథ కూడా స్ఫూర్తివంతమైనదే. టామీ డగ్లస్ అందరికీ ఆరోగ్య భీమా అని తన రాష్ట్రం కోసం పోరాడి, అది దేశ స్థాయికి తీసుకువచ్చిన కథ కూడా గొప్పగా అనిపించింది.

మూడో భాగం: “Straining at the seams” లో దేశ రాజకీయాల్లో అంత ప్రముఖంగా కనబడని రెండు ప్రాంతాల/జాతులకి చెందిన నాయకుల గురించి. వాళ్ళు – ఆదివాసీల నేత Elijah Harper, ఆల్బర్టా కు చెందిన రాజకీయ నాయకుడు Preston Manning. ఎలిజా హార్పర్ గురించిన వ్యాసం ఇక్కడి ఆదివాసీల గురించి, వాళ్ళ జీవితాల గురించీ, వాళ్ళ గురించి కెనడా ప్రభుత్వం తీరు కాలక్రమేణా ఎలా మారింది, ఇప్పటి పరిస్థితి ఏమిటి? అన్న అవగాహన కలిగిస్తే, ప్రెస్టన్ మానింగ్ గురించిన వ్యాసం బాగా liberal liberal అని ఎక్కడా చూసినా కెనడా గురించి వినబడే వార్తలకి ఆట్టే చిక్కని conservative రాజకీయ నాయకుల గురించి, వాళ్ళ ఆలోచనల గురించీ తెలియజేసింది. (అన్నట్లు, నేను ఆట్టే వార్తలూ అవీ చదవను. నేను చదివినంతలో లిబరల్ అన్న పదమే తరుచూ వినిపిస్తూ ఉంటుందంతే.)

చివరి వ్యాసం ఈ వ్యాసాల నేపథ్యంలో సమకాలీన అంశాలను, ఇప్పటి కొందరు ప్రముఖ కెనెడియన్ లను ప్రస్తావిస్తూ ముగుస్తుంది. మధ్య మధ్యలో చరిత్రల ఘట్టాల చిత్రాలు, పాత ప్రకటనల రీప్రింటులూ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మొత్తానికి నా దృష్టిలో ఇది కెనడా గురించి ఏమాత్రం ఆసక్తి ఉన్నా చదవదగ్గ పుస్తకం. రచయిత్రి బ్రిటన్ లో పుట్టి, డెబ్భైల దశకంలో కెనడాకి వలస వచ్చి స్థిరపడిన కెనెడియన్ పౌరురాలు. గతంలో అనేక జీవిత చరిత్రలు, చరిత్ర సంబంధిత పుస్తకాలు రాసినావిడ. మంచి వచనం. భాష కూడా సూటిగా ఉంది. ఈ పుస్తకం చదివాక ఆవిడ రాసిన ఇతర పుస్తకాలేవైనా దొరికితే చదవాలని అనిపించింది. ఆవిడ రాసిన విధానం పుణ్యమా అని ఇతరత్రా చాలా పుస్తకాల గురించి, రచయితల గురించి, కెనడాలోని ఆదివాసీల వ్యవస్థల గురించి కూడా చాలా విషయాలు తెలిశాయి, ఆసక్తీ కలిగింది. ఆ విధంగా పుస్తకం, పుస్తకం రాసినావిడా ఇద్దరూ నాకు నచ్చారు. ఇతి వార్తాహ.

You Might Also Like

Leave a Reply