శ్రీనివాస ప్రబంధ ప్రశస్తి – సువ్యాఖ్యాన గ్రంథము
వ్యాసం రాసిపంపిన వారు: లక్ష్మి దేవి
శ్రీనివాస ప్రబంధం అను పద్యకావ్యమును శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు రచించారు. ఇది సుమారు రెండున్నర వేల పైచిలుకు గద్యపద్యాలు గల బృహత్ కావ్యము.
కథా వస్తువు ముఖ్యంగా తిరుపతి కొండలు, పుష్కరిణి మొదలైన తీర్థస్థానాల మాహాత్మ్యాన్ని గురించిన వర్ణనతో ఉంటుంది. ఐదు ఆశ్వాసాలలో కొన్ని పురాణాంతర్గతమైనవీ, కొన్నికల్పితమైనవీ అయిన కథల రూపంలో పీయూష ధార వంటి ఈ పద్య కావ్యాన్ని “శ్రీనివాసప్రబంధ ప్రశస్తి” అనే గ్రంథం ద్వారా సంక్షిప్తంగా వ్యాఖ్యానమనే బంగారు దొన్నెలతో తోడి వ్యాఖ్యాత భారతీ సంహిత అందించారు.
కావ్యములో కఠిన సమాసాలతో కూడిన పద్యములెన్నో! అలవోక తెలుగుపలుకుల సరులెన్నో!
ఘనదంతావళ గండమండల మదాక్రాంతిన్ కషాయంబులై
వనజాతౌఘ వినిస్సరద్బహు రజోవ్యాప్తిన్ పిశంగంబులై
రణదుత్కంఠ మరాళ, కాంస్యరవధారా చక్రనిస్వాన సే
చనముల్గల్గిన వారితోడిదగు కాసారంబు గన్పించినన్.
ఇట్టి కఠిన పద్యముల అర్థములను, ఆయా అన్వయ ప్రతిపాదనలకు ప్రాచీన కావ్యములలోని తార్కాణాలను అందిస్తూనే, సరళంగా సాగే పద్యముల
వ్రతియై, నియమిత సాత్విక
మతియై, ముని నికరపాద మంగళ సేవా
దృతియై, వైష్ణవ నిగమా
కృతియై, యా శంఖణుండు కేశవుఁ గొలిచెన్.
లోని అంతర్గత భావపరిమళాలను పరిచయం చేస్తారు వ్యాఖ్యాత.
ప్రాచీన వ్యాఖ్యానశైలి వలె అర్థము, అంతరార్థము, భావము తో పాటు, పద్యాంతర్గత అలంకారాలను, వివిధ సందర్భాలలో ఆవిష్కృతమైన రసానందాన్ని, శబ్దగుణములైన ప్రసాదాదుల ద్వారా రీతిని, శబ్ద మరియు అర్థముల యందు తోచు ధ్వనిని కావ్యప్రకాశాది గ్రంథాల రెఫరెన్సులతో నిరూపిస్తూ వ్యాఖ్యాత సులభశైలిలో పరిచయం చేస్తారు.
ఆధునిక వ్యాఖ్యాన శైలి వలె నేటి కార్పొరేట్ సంస్థల క్రైసిస్ మేనేజ్ మెంట్, అప్రైజల్ వంటి రీతులలో కావ్యరచన సాగిన విధానాన్నీ వ్యాఖ్యాత పోల్చి చూపిస్తారు.
ప్రాచీన సంస్కృత, తెలుగు కవుల ఛాయలు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయో ఆయా పద్యాల ఆధారంతో నిరూపణచేస్తూ, ప్రహ్లాదుని మాటలలో వర్ణింపబడిన నవవిధభక్తులలో దాస్యభక్తి ఒకటి కానరాలేదని గమనిస్తూ, అభిజిత్ మరియు శింశుమారము వంటి పదాల అర్థాన్ని గణనపూర్వకంగా వివరిస్తూ, కొన్ని పద్యాలను సాకల్యంగా వ్యాఖ్యానం చేస్తూ, మధ్యలో లంకె విడివడకుండా సరళమైన వాక్యాలతో కథను సంక్షిప్తంగా తెలుపుతూ ఈ వ్యాఖ్యానం సాగుతుంది.
అందమైన ఎన్నో పద్యాలలో ఒకటై, పద్యముకన్నా అబ్బురంగా ఆకట్టుకున్న వ్యాఖ్యానమున్న పద్యమిది.
ఉ. తూరుపు నందుఁ దోచె శుకతుండ నిభంబగు కాంతి, దిక్కొలొ
ప్పారె ఖగావళీ వితతవల్గు రుతంబుల, పద్మినీ మనో
హారి దివాకరుండుదితుఁడయ్యెఁ గరంబులుఁ జేసి, యద్రి కాం
తార నదీ నదంబులకు దారసువర్ణ రుచుల్ ఘటింపుచున్.
తా. రామచిలుక ముక్కులా ఎఱ్ఱగా ఉన్న కాంతి తూర్పు దిక్కున కనిపించింది; పక్షి సమూహముల యొక్క చెవికింపైన కూతలతో దిక్కులు నిండినవి; పద్మముల మనస్సును హరించు వాడైన రవి, కిరణాలు ప్రసరింపజేసి, పర్వతముల, గుహల, నదీనదములకు, ఘనమైన పసిడి రంగును అలది, ఉదయించినాడు.
{వివరణ- శుకతుండ నిభంబు-ఉపమాలంకారము; చిలుకముక్కు కాంతితో చక్షురింద్రియ సౌందర్యాస్వాదనను, పక్షుల వల్గురుతములతో చెవులకు గల సౌందర్యాపేక్షను, పద్మినీ ప్రస్తావనతో నాసికకు ఒనగూడు ఆహ్లాదాన్ని, దివాకరకరంబులతో నదీనదుల పసిడివర్ణరుచుల సంఘటితత్వాన్ని స్పర్శరుచిప్రస్తావనతో – ఇంద్రియములను పరోక్షంగా తడవినాడు కవి}
ఈ విధంగా కాంతి, రుతము, సుమగంధము, నదిని తాకిన పసిడి రంగు వీటితో వరుసగా నయన,శ్రవణ,ఆఘ్రాణ,స్పర్శానందాలను కవి ప్రస్తావించాడని వ్యాఖ్యాత సునిశితమైన పరిశీలనద్వారా మనకు అవగతం చేస్తున్నారు.
ఇంకా ఈ వ్యాఖ్యాన గ్రంథములో విశేషాలెన్నో ఉన్నాయి. మన సమకాలీకులలో పద్యకావ్యాలకు ఈ విధమైన వివరమైన వ్యాఖ్యానం చేయగల పండితులు కొందరు ఉండడం చేత మనకు వినసొంపైన పద్యాలలోని మదికింపైన భావనా గంధాలు సాహిత్యలోకాన్ని నిత్యనవీనంగా పరిమళింపజేయగలుగుతున్నాయన్న విషయంలో ఏ మాత్రం సంశయం లేదు. ఇటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు సాహిత్యలోకంలోని పద్యకావ్యరుచులను పాఠకులపై ప్రసరింపజేస్తాయి. వ్యాఖ్యానం చేయబడిన కావ్యం చదవాలనే ఆసక్తి కలిగింపజేస్తాయి.
పుట్టపర్తి ప్రణీత శ్రీనివాస ప్రబంధ ప్రశస్తి
వ్యాఖ్యానం: భారతీసంహిత
వెల: రూ.200.. పేజీలు: 151
ప్రతులకు: ఎన్.సి.హర్షవర్థన్, ప్లాటు నెం.37
వంశీ నిలయం, తరుణ ఎవెన్యూ
లక్ష్మీనగర్, ఈస్ట్ ఆనంద్‌బాగ్
మల్కాజ్‌గిరి, హైదరాబాద్-47
Leave a Reply