శప్తభూమి

(తానా నవలలపోటి లో(2017) బహుమతి పొందిన నవల )
వ్యాసకర్త: మణి వడ్లమాని
****************
రాయలసీమ చరిత్రను నేపథ్యంగా రాసిన నవల ఇది. చాలా శతాబ్డాల నుంచి సామ్రాజ్యవాదుల నిరంతర ఆక్రమణలో ఈ రాయలసీమ సమాజం తన రూపాన్ని పోగొట్టుకుంది. అయితే ఇక్కడ ఉండే అనేక సామాజిక నైసర్గిక విపరీతాల వల్ల రాయలసీమ ప్రాంతలోని చాల మంది రచయతలు పీడిత జనుల పక్షాన నిలబడ్డారు. అట్టడుగు వర్గాల వారిలో ఉండే కష్ట కార్పణ్యాలని, దుస్థితిని, సుఖ దుఃఖాలని అక్షరాలలో పొదిగారని ప్రఖ్యాత కన్నడ రచయత డా.కుం.వీరభద్రప్ప ఈ నవల గురించి తన ముందు మాటలో పేర్కొన్నారు.

ఇక కథలోకి వెళితే రాయలసీమ లో జరిగిన కొన్ని చారిత్రాత్మక సంఘటనలకు కొన్ని కల్పిత లాను జోడిస్తూ నవలను మలచిన తీరు అద్భుతంగా అనిపిస్తే కొన్ని పాత్రలు నడిచిన తీరు చాల గొప్పగ ఉంది. నిజానికి ఇది ఒక విభిన్నమైన నవల.

శప్తభూమి అంటే శపించబడిన భూమి. ఈ చారిత్రాత్మిక నవల ను మలచడానికి నారాయణ స్వామిగారు శిలా శాసనాలు, అప్పటి సామాజిక నమ్మకాలను, ఆచార వ్యహారాలను అధ్యయనం చేసారని తెలిపారు. ఈ నవల రాజ్యాధిపత్యంగురించి రాసినది కాదు. అప్పటి కాలం లో జరిగిన ఘట్టాలను, వాటితో ముడిపడిన మరికొన్ని విషయాలకు సంబధించిన నవల ఇది. అందుకే ఈ రచన పద్దెనిమిదో శతాబ్దం నుంచి మొదలవుతుందని రచయిత రాసారు.

ఇందులో ఇంకో విషయం గమనించ తగ్గది- రచయత చెప్పే కాలఘట్టాలలో ఒక సామ్రాజ్యం నుంచి మరో సామ్రజ్యం మార్పు చెందుతూ అభివృద్ధి చెందిన సంగతి కనిపిస్తూ ఉంటుంది. అది ఒక గొలుసు అల్లికలా ముందుకు సాగుతున్న తరుణం లో ఈ నవల హండె రాజుల కాలఘట్టంతో అనంతపురంలో ప్రారంభం అవుతుంది.

కురుబ వంశానికి చెందిన బిల్లే ఎల్లప్ప తో కథ మొదలవుతుంది విచిత్రం ఏంటంటే ఏ హండే నాయకుడి వల్ల ఇతను సామజిక అంతస్తును పెంచుకుంటాడో, అదే నాయకుల కామవాంఛకు ఆ ఊరి వర్తకుడు అనంతయ్య తన ప్రియపుత్రికను పోగుట్టుకుంటాడు. ఇక ఇక్కడ నుంచి ఒక్కొక్క పాత్ర మనకు పరిచయం అవుతుంటే చదివే ప్రతి పాఠకుడు కూడా టైం మెషిన్ లో వెనక్కి వెళ్లి కళ్ళతో చూస్తున్నట్లుగా అనుభూతిని పొందుతాము.

వీర నారాయణరెడ్డి, అతని కొడుకులు – యెర్ర రెడ్డి, నల్ల రెడ్డి, నాగప్ప ప్రెగడ, అతని వదినగారు ఇమ్మడమ్మ, కోడనీలుడు, గురవడు, బాలకొండ బీరప్ప, సిద్దప్ప నాయుడు, పద్మాసాని, మన్నారుదాసు, నాగసాని, తిమ్మప్ప నాయుడు, వీరవనిత హరియక్క, తండ్రి కొడుకుల చేతిలో బలి అయిన గొల్ల పడుచు ఇలా ప్రతి పాత్ర మన చుట్టూ ఉంటారు.

కొన్ని పాత్రలను చూస్తే బాధ, జాలి, మరి కొన్ని పాత్రలను చుస్తే కోపం వస్తుంది. ముఖ్యంగా వీర నారాయణ రెడ్డి బసివి సంప్రదాయంతో కూతురు వయసున్న మహిళలని అనుభవించటం -ఇలాంటి దిక్కుమాలిన సంప్రదాయాల పేరుతో కొన్ని వర్గాల వారిని ఏ విధంగా అణచి వేసారో చదవుతుంటే ఆవేదన, ఆక్రోశం, కోపం కలుగుతాయి.

కొన్ని వాక్యాలు వెంటాడుతాయి:
‘ఓ రొట్టె కోసం, మూడు కాసులకు పిల్లను అమ్ముకుంటారు. అప్పుడు అది కరువు కాలము’ అంటే ఆకలి అంత భయంకరమైనది.
‘మానవుడు మధ్యలో బట్టలు కట్టడం నేర్చి ఉండకపోతే ఉత్తబిత్తల (నగ్నంగా), బూతుల వంటిపదాలు భాషలోకి చేరి ఉండేవి కాదు’
‘రణం కుడుపు అంటే శత్రువు ఓడిన స్థానంలో వక్దిని చంపి ఆ నెత్తురు తో అన్నం వండి చీకట్లో ఊరంతా తిరిగి కులదేవతకి కోబలి అంటు సమర్పిస్తారు.
చదవుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది’

‘గాలి దేవర జాతర ఇదో వింత ఆచారం. జాతర జరిపించే నిర్వహణని ఒక వ్యక్తి కి అప్పగిస్తారు గ్రామ పెద్దలు. ఇది జరిగే సమయంలో ఎవరయితే ఆ ఫలాన్ని తెస్తాడో, వాడు మొనగాడు. వాడికి కట్టుబాట్లు వర్తించవు, ఏ ఇంట్లో అయిన వెళ్ళవచ్చు, ఆడువారి మీద పడచ్చు, ఎవరి మీద నయినా చేయి చేసుకోవచ్చు, ఎవ్వరు ఏమి అనకూడదు. కాని ఒక నియమం ఉంది – దేవర మనిషిగా మారినవాడు నోరు తెరచి మాట్లాడకూడదు, సైగలు చేయరాదు’

నిడుమామిడి స్వామి వర్ణన చదవుతుంటే ఎందుకో భగవాన్ సత్య సాయి గుర్తొచ్చారు.. అతని గురువు తిక్క స్వామి ‘సత్యాన్ని కనుక్కోవడానికి దేవుడి తో పని ఏంటి అని’ ఇలాంటి వాక్యాలు ఎన్నో.

అదే విధంగా నవలలో ఎన్నోగగుర్పాటు చెందే సంఘటనలు ఎన్నో ఉన్నాయి అవి చదువుతుంటే మనుష్యులలో ఉండే అనుకూల ప్రతికూల భావాలూ, వాటిని ప్రకటించటం లో వాళ్ళు నడిచిన విధానం… ఉదహరణకి రైతు భార్య లని, తండ్రి కొడుకులు ఎలా దారుణంగా హింసిచారో, అలాగే కొన్ని చాంధస భావజాలం వల్ల బాధలకు గురై అన్య మతం లో కి వెళ్ళిపోవడం, ఇవన్ని చుస్తే కోపం బాధ వేస్తోంది. సతి సహగమనం, పిల్లలకోసం రెండు మూడు పెళ్ళిళ్ళు జరగడం ఇవన్ని అతి మాములుగా పరిగణిస్తారు ఆ కాలం లో. అంటే స్త్రీ దృక్కోణం లో చూస్తే మహిళలను అణచి వేయడం అప్పుడు ఎలాగు ఉండేదని తెలుస్తుంది. కాని అదే సమయం లో కొంత మంది మహిళలు పరిస్థితి ని ఎదుర్కునే ధీర లు ఉన్నారు ని కొంత ఉపశమనం కూడా కలుగుతుంది.

ఏంతో ఘన చరిత్ర ఉన్న రాయల సీమ ఎలా శాపగ్రస్త అయిందో రచయిత నారాయణ స్వామి గారు అక్షరబద్దం చేసిన తీరు చాల గొప్పగా ఉంది. చరిత్ర గా మారిన ఆనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా వ్రాసారు.

రచయత చివరలో ఈ నవలను రాయించిన క్రమం గురుంచి ఇలా అంటారు ‘ఒకగాలిదేవర మనిషి సమాధిని చూసాను, శతాభ్దాల రాయల సీమ కరువు కాటకలకు, వర్షాభావానికి అతని మరణం ఒక ధాఖలా! అలాగే తమ గ్రామాలను కాపాడే ప్రయత్నం లో అసువులు బాసిన వీరుల జ్ఞాపకార్థం ఉన్న వీరగల్లులు రాయలసీమ వీరుల త్యాగ నిరతికి దాకలా! అప్పుడనిపించింది ఈ పద్దెనిమిదో శతాబ్దపు చరిత్రను నవలగా రాయాలని, నిజానికి చారిత్రక వ్యక్తులను ముందుపెట్టి , వ్రాయడం కంటే చారిత్రక సంఘటనల నుండి, పాత్రలను కొత్తగా సృష్టించి వ్రాయడం బుద్ధికి శ్రమే కాని, కొత్తగా ఉన్నప్పటికి అదో బాధనందం” అని అన్నారు

నవలకి ఆదరణ తగ్గలేదన్న మాట నిజం. అంతే ప్రాభావం ఉంది అనిపించింది.

నిజానికి ఇలాంటి చారిత్రాత్మక విషయాలు విద్యార్థులకి తెలియచెప్పడం ఎంతైనా అవసరం అనిపించింది. అందరిని చదివించే విధముగ రాసిన రచయత నారాయణ స్వామిగారి నైపుణ్యత అమోఘము. రచయత ఏంతో లోతుగా ప్రతి ఘటనను, ప్రతి పాత్రని మలిచారు ఇంత విషయ పరిజ్ఞానం ఉన్న నవల అందరూ తప్పక చదవాలి.

You Might Also Like

One Comment

  1. Bhavani Phani

    చాలా బాగా రాశారండీ

Leave a Reply to Bhavani Phani Cancel