తెలుగు కథ: అక్టోబర్-డిసెంబర్, 2017

వ్యాసకర్త: రమణమూర్తి
(ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్టుగా జనవరి 20న వచ్చింది. రమణమూర్తి గారి అనుమతితో పుస్తకం.నెట్ లో ప్రచురిస్తున్నాము)
***********

జేమ్స్ వుడ్ అనే విమర్శకుడు – రచయితలు తమ రచనల్లో చూపించే సూక్ష్మవివరాల (డీటెయిల్స్) గురించి చెబుతున్నప్పుడు – జార్జ్ ఆర్వెల్ రాసిన ‘A Hanging’ అనే వ్యాసంలోని ఒక సంఘటనని ఉదహరిస్తాడు. ఉరితీయడానికి ఓ వ్యక్తిని తీసుకుని వెళ్తున్నప్పుడు, ఆ వ్యక్తికి దారిలో ఓ చిన్న బురదగుంట కనిపిస్తుంది. ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా దాన్ని దాటుకుని వెళతాడు. కాసేపట్లో మరణించబోయే వ్యక్తికి బూట్లు బురదతో పాడయిపోయినా పెద్ద తేడా ఏమీ రాదు. మరి ఎందుకు రచయిత ఆ వివరం రాసినట్టు? ఆ సంఘటనకి అర్థం చెప్పాలనుకోవడం – ఒక్క మాటలో – చాలా కష్టం. అర్థం లేనివి జీవితంలో జరుగుతుంటాయీ అని చెప్పుకోవచ్చు; అతను అలవాటు చొప్పున ఆ పని చేసాడూ అనుకోవచ్చు. లేదా మరో విమర్శకుడు చెప్పినట్టు – అతను తనని తాను కాసేపట్లో చనిపోయే వ్యక్తి కింద జమకట్టుకోవడం లేదు, అప్పటికి జీవించి ఉన్న వ్యక్తిగానే తనను తాను భావించుకుంటున్నాడనీ అనుకోవచ్చు. జేమ్స్ వుడ్ చెప్పినట్టు- రియలిజంలో ఉండే అసంగతాలని చూపించడానికి రచయితలు అలాంటి వివరాలు రాసారూ అని కూడా అనుకోవచ్చు. పాఠకుల అవగాహన విభిన్నంగా ఉండగల ఆస్కారం ఉన్నప్పటికీ, ఇలాంటి వివరాలు కథ నేపథ్యం మీదనో, పాత్రలమీదనో, పాత్రలగురించి మన అవగాహన మీదనో ఒక అదనపు వెలుగుని ప్రసరింపచేస్తాయన్నది మాత్రం నిజం.

ఈ మూడు నెలల కాలంలో అలాంటి సూక్ష్మవివరాలని ప్రతిభావంతంగా, అదనపు విలువగా ఇమిడ్చిన రెండు తెలుగు కథలు (కనీసం) నాకు కనిపించాయి. ఆ కథలేమిటో మీరూ గుర్తుపట్టగలరు. అసలు, ఇప్పుడు చెప్పబోయే కథలన్నీ చదివితే (లేదా ఇప్పటికే చదివి ఉంటే) మీరు మరిన్ని అలాంటి కథల గురించి చెప్పగలరేమో!

ఈ సమీక్షా కాలంలో (అక్టోబర్ – డిసెంబర్) 537 కథలు చదివాను. ప్రత్యేక సంచికల కారణంగా ఈసారి కథల సంఖ్య పెరిగింది. అనేక వ్యక్తిగత ఒడిదుడుకుల మధ్య చదవడంలో కొంత ఆలస్యం జరిగింది, ఈ సమీక్ష రాయడంలోనూ ఆలస్యం జరిగింది. కానీ, పట్టుజారకుండా ఈ సంవత్సరపు ఆఖరి సమీక్షని కూడా రాయగలగడం మాత్రం సంతృప్తికరంగా ఉంది.

ఇక ఈ మూడునెలల కాలంలో వచ్చిన, నాకు నచ్చిన మంచికథల గురించి చెప్పుకుందాం:

నచ్చిన కథలు

మూసిన గుప్పెట (తాడికొండ కె శివకుమార శర్మ – వాకిలి, అక్టోబర్ 01)
నేపథ్యం ప్రకారం ఇది డయాస్పోరా కథే అయినా, అన్ని ప్రాంతాలకీ వర్తించే కథ. “ఈ సంసారంలో నేను మొగుణ్ణీ, గిరి పెళ్ళామూ అయితే ఇద్దరమూ సుఖంగా వుండేవాళ్ళం,” అన్న యామిని వాక్యం కథలో చదువుతున్నప్పుడు చాలా అతికినట్టుగా అనిపించింది. కానీ, దానికి ప్రాముఖ్యత ఉంటుందని అక్కడ అనుకోలేదు. కథలో రాగల మార్పుని ఓ ఆకట్టుకునే వాక్యంతో సూచించడం రచయిత ప్రతిభ. ఈ కథ, మగదేహంలో ఉన్న స్త్రీ ఆత్మ కథ. నలభై యేళ్ల పాటు అసహజత్వంతో సహజంగా ఉంటానికి ఒక మగవాడు పడ్డ తపన, యాతన. కథలోని సున్నితత్వానికి సరిపడ్డ కథనం, భాష, వివరం కథకి సంపూర్ణత కలగజేసాయి. కథ ప్రస్తుతానికీ, గతానికీ మధ్య ఊగిసలాడుతున్నప్పుడు, గతానికి సంబంధించిన భాగాలని ఏ ఇటాలిక్స్లోనో రాస్తే చదువరికి హాయిగా ఉంటుంది కదా అని ఇద్దరు ముగ్గురు రచయితలకి గతంలో సలహా చెప్పాను. అది ఈ కథలో అలా కనిపించడం ఆనందం కలిగించింది. జెండర్‌ గురించి చాలా సున్నితంగా, సూటిగా రాసిన కథ ఇది.

ఆట (చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతిరాజు – వాకిలి, నవంబర్ 01)
బలహీనుడిమీద గెలిచి గర్వపడి, వెంటనే ఉలిక్కిపడి – అది గర్వించాల్సిన విషయం కాదనీ, నిజానికి సిగ్గుపడాల్సిన విజయమనీ గ్రహింపులోకి వచ్చిన సూర్రాజు కథ, అక్కడితో ముగిస్తే అది మామూలు కథ అయ్యుండేది. అలాంటి నాటకీయమైన మార్పు ఎలాంటిదీ అనేది కథ చివర్లో మరో రెండు వాక్యాల్లో అదనంగా రచయిత చెప్పారు కాబట్టి ఇది మంచికథ అనిపించింది. రచయిత, తను వేసిన ఎత్తుకి తనే పై ఎత్తు వేసి పాఠకులకి చెక్ చెప్పారన్నమాట. పాతతరం రచయిత ఎవరో శ్రద్ధగా శిల్పాన్ని చెక్కినట్టు, రావిశాస్త్రి తన సహజధోరణిలో విపులంగా కథ చెప్పినట్టూ అనిపించే ఈ కథలో జాగ్రత్తగా చూస్తే రచయిత తీసుకున్న కొన్ని లిబర్టీస్ కనిపిస్తాయి. కథ మొదట్లో కనిపించే అబ్బాయీ, పెద్ద చంద్రీ, చిన్న చంద్రీ మళ్లీ కథలో ఎక్కడా కనిపించరు. సూర్రాజులో (అప్పటివరకూ మనకు కనిపించకుండా ఉన్న) ఒక కోణాన్ని చూపించడం వరకే వాళ్ల పాత్ర. కసికి ప్రతీకగా లెక్కల మాస్టారి పాత్ర కూడా కేవలం ఆ ప్రతీకని కథలో ప్రదర్శించడానికే ఉపయోగించిన పాత్ర. ఇలా పాత్రలని పొదుపుగా కాకుండా విరివిగా వాడుతూ తన కథాలక్ష్యానికి వాడుకోవడం రచయిత తీసుకున్న స్వాతంత్ర్యం. అలాగే, ‘నూకలిస్తే మేకలు కాసే తన మనుషులతోటా…?’ అనే ప్రశ్నలో ఇమిడివున్న నూకలూ, మేకలూ, తన మనుషుల గురించి కథలో ముందే విపులంగా ప్రస్తావించి ఉండటం వల్ల అక్కడ ఆ ప్రశ్న మనలో మనకే తెలీకుండా ఉన్న ఏదో ప్రశ్నలాగా సుపరిచితంగా అనిపిస్తుంది!

అవినిమయం (వాడ్రేవు చినవీరభద్రుడు – విశాలాంధ్ర దీపావళి ప్రత్యేక సంచిక, అక్టోబర్)
జీవితాలనీ, దాని వ్యధలనీ భరించినవారికి బైటికి వెళ్లగక్కాలనే ఉద్వేగపు విషయాలు చాలా ఉంటాయి. కానీ ఆ భావోద్వేగం రచనకి కావలసిన శిల్పం తగుమాత్రమైనా ఉందా లేదా అన్న విచక్షణని కొండొకచో మింగేస్తుంది. నలగని దుస్తులతో ఎకడమిక్ రీసెర్చ్‌లని గైడ్ చేసేవాళ్లూ, ఏసీ రూముల సెమినార్లలో నేరేటివ్, డిస్కోర్స్ ల గురించి చర్చించే వాళ్లూ, భద్రజీవితాలని శుభ్రంగా, అందంగా జీవిస్తున్నవాళ్ల దగ్గర బోలెడంత సైద్ధాంతిక విజ్ఞానం ఉంది కానీ, వాళ్లు ప్రజల జీవితాలనుంచి (రచయితే అన్నట్టుగా – చివరికి దోమలనుంచి కూడా) చాలా చాలా దూరంలో ఉన్నారు. ఈ అగాధం ఇప్పట్లో పూడేది కాదు. అసలు ఎప్పటికైనా పూడుతుందనైనా ఎవరూ హామీ ఇవ్వలేరు.

స్థూలంగా ఈ కథ అదీ. మెటాఫిక్షన్. కానీ, ఈ కథ, గొప్ప కథ కావడానికి పై కథాంశం ఒక్కటే కారణం కాదు. రాసిన ప్రతి పదమూ, ప్రతి వాక్యమూ, వాటి అమరికా, అవి పాఠకుడిమీద కలగజేయబోయే ప్రభావమూ – అన్నింటినీ లెక్కించి మరీ ఒక సమతూకంతో రాసారా అనిపించే రచన ఇది. అలాంటి జీవితాల పట్ల ప్రగాఢమైన సహానుభూతి లేనిదే ఇలాంటి కథలు ఇలాంటి ఫామ్‌లో రావు. మచ్చుకి కొన్ని ముఖ్యమైన వాక్యాలు.
• ‘బయటి ప్రపంచంలో అడుగుపెట్టాక, నా ప్రపంచం విస్తరించవలసింది పోయి, కుంచించుకుంటూ వచ్చిందని చెప్పాలి…’
• ‘ఇప్పుడట్లా కాదు. ప్రజలూ, రచయితలూ రెండు వర్గాలుగా ఉన్నారు సార్. రచయితలకి ప్రజల గురించి తెలీదు. ప్రజలకి రచయితల గురించి తెలీదు. ప్రజలకి రచయిత గురించి తెలీకపోతే నష్టమే కానీ, రచయితలకి ప్రజల గురించి తెలీకపోతే, అదింకా పెద్ద ప్రమాదం సార్.’
• “‘ఏమాత్రం చదువుగాని, డబ్బుగాని, అధికారంగాని దొరికినా మనుషులు తమ తోటి మనుషుల అనుభవాన్ని తమకి ముడిసరుగ్గా మార్చుకుంటున్నారు.”
ఇవేవీ కూడా కావు. ఓ కథని గొప్పకథని చేసే సూత్రం మరొకటేదో ఉంటుంది. అది దొరికినట్టే దొరికి అలా జారిపోతూ ఉంటుంది. లేకపోతే, కథ మధ్యలో “‘మా అమ్మాయి కమలాబాయి’ అని మా పెదనాన్న ఎవరికో పరిచయం చేస్తున్నట్టు ఉంది.” అన్న కళ్లు చెమరింపజేసే వాక్యం ఎలా రాసారు, వీరభద్రుడుగారూ!?

మరికొన్ని మంచికథలు

సహజాతం (జుజ్జూరి వేణుగోపాల్ – వాకిలి, అక్టోబర్ 01)
దొరగారి వేటకి సంబంధించిన ఈకథ చదువుతుంటే చాలా పాతకాలం నాటి కథేదో చదువుతున్నట్టుగా అనిపిస్తుంది. అయినాసరే, ఈ కథలో ఓ హృదయం ఉంది. కాస్త హాస్యం ఉంది, కాస్త కరుణ ఉంది, సూత్రాలకి విరుద్ధంగా అయినాసరే, ప్రేమించాలన్న ఆశ ఉంది. చివరికి సహజన్యాయాలకి తలవొగ్గవలసి రావడం కలిగించే బాధ ఉంది. మంచి ప్రయత్నం.

జ్ఞాపిక (చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతిరాజు – ఈమాట, నవంబర్ 01): ఆ పిల్లాడు దాచుకున్న పుస్తకాలన్నీ శుభ్రంగా మెంతుల్తో రుబ్బేసి, వివిధ కళాకృతులని తయారుచేసిన బామ్మ ఘోరాన్ని తట్టుకుని నిలబడ్డ కథారచయిత కథ. హాస్యమూ, గడుసుతనమూ, భాషాప్రయోగాల సమ్మిశ్రమం.
వేకువ పొద్దు (అట్టాడ అప్పల్నాయుడు – ఉత్తరాంధ్ర, అక్టోబర్ 01): ఎక్కడైనా ఏదైనా నేరం జరిగితే, అది ఎవరిమీదకు తోసేసి కేసు మూసేద్దామా అని ఆలోచించే పోలీసు వ్యవస్థ మీద రాసిన కథ. పాఠకుడిని లాక్కెళ్లి ఆ సన్నివేశంలో కూచోబెట్టగలిగిన విశేషమైన కథనంతో, పోలీసుల దురుసుతనాన్ని చివరికి అక్కడ ఉన్న సామాన్య ప్రజలు ఎలా ఎదుర్కొన్నారూ అన్న కథని, తూరుపు మాండలీకంలో చాలా సహజంగా చెప్పిన కథ.

ఒకే కథ-ఎన్నో ముఖాలు (గొల్లపూడి మారుతీరావు – స్వాతి వారం, డిసెంబర్ 01): జెఫ్రీ ఆర్చర్ రాసిన One man’s meat… అనే కథ స్ఫూర్తితో రాయబడ్డ ఈ కథ (నిజానికి ఈ రెండు కథల మధ్య పోలిక ఏమిటో అర్థం కాలేదు) ‘ప్రేమించబడటాన్ని ప్రేమించడం’ అన్న సూత్రం మీద నిర్మించాడు రచయిత. పట్టుసడలకుండా కథని నడిపించినప్పటికీ, మానసికశాస్త్రపు పరిభాషా, ఇంగ్లీష్‌లో రాసిన వాక్యాలు/పదాల్లోని అక్షర/వ్యాకరణ దోషాలూ పంటికింద రాళ్లలాగా తయారయ్యాయి. ప్రేమే ఆవిణ్ణి బతికించింది, ప్రేమే ఆవిణ్ణి మరణించేలా చేసింది అన్నది వైరుధ్యస్ఫూర్తితో బానేవున్నట్టనిపించినా, కథకి సరీగ్గా అతకలేదనీ అనిపించింది. ఇలాంటి చిన్నలోపాలు మినహా, చదివించే గుణం ఉన్న కథ ఇది.

స్కూలెల్లను! (మెహెర్ – వాకిలి, డిసెంబర్ 01): పిల్లవాడికి స్కూలు భయం, నాన్నకి ఆఫీసు అభద్రతా, అమ్మకి ఇంటిగొడవా. అప్యాయమైన ఓ స్పర్శ తప్పించి, ఒకళ్ల ప్రపంచంలోకి మరొకరు వెళ్లడం అనేది ఎంత అసంభవమో వాస్తవికమైన సన్నివేశాలలోనుంచి చక్కటి కథనంతో చెప్పిన కథ.

వ్యాపకం (కె ఎల్ సూర్య – వాకిలి, డిసెంబర్ 01): తన సెల్‌ఫోన్‌లోని ఒక్క ఆట తనకి సృష్టించి ఇచ్చిన ఊహాప్రపంచం, ‘రెస్టోర్ ఫాక్టరీ సెట్టింగ్స్’ బటన్‌తో సర్వనాశనం అయిపోయి, అత్యంత అసహనాన్ని కలగజేసింది. సమాజంలో ఇమడలేక, అలాంటి ప్రపంచాల్లో కూరుకుపోయే వాళ్లకి నిజజీవితంలో మాత్రం ‘రెస్టోర్ ఫాక్టరీ సెట్టింగ్స్’ లాంటి ఆప్షన్స్ ఉండవూ అనే అంతరార్థంతో రాసిన కథ.

దేవుడుండే చోటు (అనిశెట్టి శ్రీధర్ – ఆంధ్రజ్యోతి ఆదివారం (ఆంధ్రప్రదేశ్), డిసెంబర్ 10): రిజర్వేషన్లూ, సమానత్వమూ లాంటి వాటిగురించి ఎంత మాట్లాడుకున్నా, ఊళ్లల్లో ఉండే కులవివక్ష గురించిన చక్కటి కథ. ఊరంతా ఊరేగించి, వాడ మొదట్లో దేవుణ్ని ఆపేసే ఆ ఊళ్లోని వాడలో ఉండే రాజు, ఊళ్లో ఉండే సుధాకర్ ఇల్లు కొంటానికి ముందుకొస్తే, ఊరు ఊరంతా ఊగిపోయింది. ఊరి పెద్దమనిషి, రాగద్వేషాలకి అతీతంగా తీసుకున్న నిర్ణయం, ప్రజలకి నచ్చకపోయినా ఆయన వాళ్లని ఇహ మారుమాట్లాడనివ్వలేదు. కథలో రాసిన చివరి వాక్యం – “ఇప్పుడు దేవుడి పల్లకీ వాడలో వీధి వీధీ తిరుగుతోందీ” – అనేది గభాలున చూస్తే, అభ్యుదయాన్ని సూచించే రొటీన్ ముగింపు వాక్యం అన్న భ్రమ కలిగించవచ్చేమో కానీ, అసలు కారణం కథలోనే ఇమడ్చడం రచయిత పన్నిన అందమైన పన్నాగం. నిజానికి ఆ చివరి వాక్యం చదివితే, దేవుడంటే బొత్తిగా నమ్మకం లేనివాళ్లకి కూడా మనసు నిండిపోయినట్టు అనిపిస్తుంది.

ఇగురం గల్లోడు (కొట్టం రామకృష్ణారెడ్డి – ఆంధ్రజ్యోతి ఆదివారం (తెలంగాణ), డిసెంబర్ 10): అరవై, డెబ్భైల నాడు చాలామంది రచయితలు విరివిగా వాడిన మల్టిపుల్ నేరేటివ్ శైలిలో, మూడు పాత్రలచేత చెప్పించిన కథ ఇది. ఈ కథలోని ఇంటిపెద్ద నోరు తెరిచి ఏనాడూ సరీగ్గా మాట్లాడింది లేదు, అతని అంతరంగం కుటుంబ సభ్యులకి అర్థమైందీ లేదు. ఒక్కో పాత్రా వాళ్ల వాళ్ల కథాభాగం చెప్తున్నకొద్దీ, మనకి ఇంటిపెద్ద ‘ఇగురం’ అర్థమవుతూ ఉంటుంది. ఆయన భార్య చెప్పే చివరి భాగంతో అతని పాత్ర ఆవిష్కరణ పూర్తవుతుంది. ఇతివృత్తం సామాన్యంగానే ఉన్నా, తెలంగాణ మాండలీకపు అమాయకత్వపు సొగసునంతా వాక్యాల్లో నింపి, కథకి కొత్త అందాన్ని సమకూర్చాడు రచయిత. కథ చివరిభాగంలో, ఇంటిపెద్ద ‘ఇగురం’ మీద ఫోకస్ ఉన్నప్పుడు ముగించాల్సిన కథని, మరొక్క పేరా మేరకు పొడిగించి, ఆయన భార్య విరక్తిమీద ముగించడం అన్నది ఒక్కటే ఈ కథలో నాక్కనిపించిన చిన్న లోపం.

నిమజ్జనం (జి వెంకటకృష్ణ – అరుణతార, డిసెంబర్ 01): జనాలని సమూహాలుగా విడగొట్టి, ఉద్వేగాలని రెచ్చగొట్టి, వాటిద్వారా సంఘటితం అయిన సమూహాలని తమ అధీనంలో ఉంచుకొని రాజకీయం చేయడం తప్పించి, జనాల అవసరాలు తీర్చడం కోసం పనిచేసే రాజకీయం అన్నది ఎక్కడా జరగడం లేదన్న విషయాన్ని, నిమజ్జనం అనే ‘ఉత్సవం’ ద్వారా మంచి కథనంతో చూపించిన కథ.

అన్యులు (పి వి సునీల్‌కుమార్ – విశాలాంధ్ర ఆదివారం, డిసెంబర్ 17): అమాయకత్వం మూలాన తమకి సంక్రమించిన కొద్దిపాటి వరాలని కూడా మాలమాదిగలు ఎలా చేజార్చుకుంటారో, ఆధిపత్య కులాల అధికారాన్ని తెలీకుండానే ఎలా నిలిపి వుంచుతారో చెప్పిన ఈ కథ, బైబిల్ లోని పాత్రల్నీ, అక్కడక్కడా కొన్ని సంఘటనల్నీ ఉదహరిస్తూ నడిపిన తీరు బాగుంది. చరిత్ర పునరావృతమౌతుందీ అని పునరుద్ఘాటించినట్టూ ఉంది.

ఇట్లు మీ స్వర్ణ (పి సత్యవతి – చినుకు, డిసెంబర్ 01): దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఆశలకీ, వాటిని నెరవేర్చుకోగలిగిన అవకాశాలకీ మధ్య దూరం ఎక్కువ, ఒక బట్టల కొట్లో పనిచేసే స్వర్ణకి, తన అందంతో సహా రకరకాల అసంతృప్తులున్నాయి. సినిమా కష్టాల్లాంటి సంసారం ఉంది. పోల్చుకుని బాధపడటానికి ఓ మేనమామ కూతురి కుటుంబం ఉంది. ఇలాంటి వలయాలనుంచి తప్పించుకుని వెళ్లిపోయి, మోసపోయిన భాగ్యం కథ హెచ్చరికగా ఉంది. విచిత్రంగా, వీటన్నింటి మధ్యనుంచీ తప్పించుకుని ఓ స్ఫూర్తి పొందటానికి అపర్ణ మేడమ్ కూడా ఉంది. కానీ, సంసార తాపత్రయానికే సమయం సరిపోయే జీవితాలలో, అలాంటి ‘ఊర్ధ్వలోకాల’ వైపు ఉరామరికగా చూపు సారించడం తప్పించి, వాటిని అందుకునే సూత్రమేదో ఎప్పటికీ దొరకనట్టుగానే ఉంటుంది. చివరికి స్వర్ణ అసంతృప్తుల బాధతోనే ముగిసిపోయే ఈ కథలో ఒక పరిష్కారాన్ని కూడా సూచనప్రాయంగా ఇమిడ్చి రాయడం ఈ కథలోని విశేషం. ఇలాంటి కథకి అలాంటి శీర్షిక చాలా కొత్తగా నప్పింది. కథనప్రతిభకి ‘అమ్మకి తిట్లే మాటలు, అవే సలహాలు, అవే ఆశీర్వాదాలు’, ‘అమ్మ చేత తిట్లూ, మళ్లీ ఆవిడమీద జాలి’ లాంటివి మచ్చుకి ఉదాహరణలు మాత్రమే!

రూట్ కెనాల్ (జి లక్ష్మి – చినుకు, డిసెంబర్ 01): కుటుంబంలో భర్తా, కొడుకూ ప్రదర్శించే మగ అహంకారం మీద మరో కథ రాయడానికి చాలా సాహసం ఉండాలి. అలాంటి సాహసం చేయడానికి పూనుకున్నవాళ్లకి అందుకు తగ్గ పరికరాలు కావాలి. ప్రత్యేకమైన కథనశైలితో, బయటకి హాస్యాన్ని ప్రదర్శిస్తూ, అంతర్లీనంగా కథాంశంలో ఉన్న మౌనహింసని అంతే లాఘవంగా ప్రదర్శింపచేస్తూ, ఏకకాలంలో రెండు ప్రవాహాల అల్లికకు రచయిత్రి సిద్ధపడి, విజయవంతమయ్యారు. ఇలాంటి రొటీన్ కథాంశాన్ని సైతం ఆపకుండా చదివించే శక్తి ఆ కథనంలో ఉంది. కథ చదువుతున్నంతసేపూ (ముఖ్యంగా ఆ బ్రాకెట్లలో రాసిన వాక్యాలూ, పదాల వల్ల) నవ్వుకుంటూ ఉండే మనం, కథ సగంలోకి వచ్చేసరికి అందులో ఉన్న సీరియస్‌నెస్‌కి విచలితులమవుతాం. మంచికథ అని చదివితే మీరూ ఒప్పుకోవచ్చు!

శ్రేయోభిలాషి (అట్టాడ అప్పల్నాయుడు – చినుకు, డిసెంబర్ 01): భారతచరిత్ర మీదా, వర్తమాన భారతం మీదా ఒక ఎలెగారీ. జనాల్లో దేశభక్తి నింపి, వాళ్ల చేతుల్తో వాళ్ల ఒక కన్నుని ఇప్పటికే పొడిపించిన నాయకత్వం, వాళ్ల రెండో కంటిని పొడిపించే విషయం కూడా దృష్టిలో పెట్టుకుందనీ, అంధప్రజలని సులువుగా ఏలుకోవచ్చన్న ఎత్తుగడతో ఉందన్న హెచ్చరికని కథలో పొదిగిన పద్ధతి, తగుమాత్రంగా ధ్వనించిన వ్యంగ్యం వల్ల రాణింపుకి వచ్చింది.

మరికొన్ని చదివిచూడతగ్గ కథలు

ఈసారి చాలా ఉన్నాయి. కథాంశంలోనో, కథనంలోనో ఏదో ఒక విభిన్నతని ప్రదర్శించిన కథలు ఇవి.

భర్త నిజాయితీ, ముక్కుసూటితనం ఆ భార్యకి బతకనేర్చిన లక్షణాలుగా కనబడవు సరి కదా, అలానే తయారవుతున్న కొడుకు భవిష్యత్తు ఏమిటో అన్న ఆందోళనని భార్య వెలిబుచ్చే కథ ఎట్లా బతకబోతాడో (జి ఉమామహేశ్వర్ – అడుగు, అక్టోబర్ 01); భార్యకీ, తదనంతరం దగ్గరైన ఒక అమ్మాయికీ దూరమైన ఒంటరి తండ్రి, తన కూతురు పెంపకం గురించి పడ్డ సున్నితమైన కథావ్యధ ప్రవహించే పాట (దగ్గుమాటి పద్మాకర్ – అడుగు, అక్టోబర్ 01); ఆ అక్రమసంబంధాన్ని కనిపెట్టడంలో చిరంజీవి ‘చిరంజీవి’ పాత్ర పెద్దగా ఏమీ లేదు కానీ, ఆ సంబంధాన్ని అరికట్టడానికి సూరిగాడికి నారాయుడు ఇచ్చిన సలహా సూరిగాడికి మహా సంబరాన్నిచ్చింది. ఆ సంబరం చూసిన నారాయుడి కళ్లల్లో ‘అయ్యో పాపం’ కదలాడటం ద్వారా అసలైన మెరుపు చూపించిన కథ శిక్ష (చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతిరాజు – ఈమాట, అక్టోబర్ 01); పాప్‌కార్న్ (వి మల్లికార్జున్ – వాకిలి, అక్టోబర్ 01) కథలో ఉన్న రెండు భాగాల్లో మొదటిభాగం – ఈనాటి ప్రేమకథ – ఆధునిక నైతికతలనీ, భావావేశాలనీ వ్యాఖ్యానాలు లేకుండా చాలా పదునుగా, గొప్పగా చూపించగా రెండోభాగం మాత్రం కొద్దిగా తేలిపోయి, మొదటి భాగానికి వేసిన అదనపు అతుకు లా మిగిలిపోతుంది; ఆత్మాభిమానం కోసమూ, నమ్మిన సిద్ధాంతాల కోసమూ పోరాడే జీవితాలు కొన్నైతే, భద్రజీవితం ఒక్కటి చాలు అనుకునే అభాగ్యులూ ఉంటారు అన్న విషయం మళ్లీ చెప్పిన కథ ఆవలి గట్టు (అద్దేపల్లి ఉమాదేవి – చతుర, అక్టోబర్ 01); భార్యపోయిన భర్త, భర్తపోయిన భార్య – ఇద్దరూ వయసు మళ్లినవాళ్లే – పెళ్లిచేసుకున్న ఉదంతంలోని హాస్యంతో వచ్చిన కథ అడ్డం తిరిగిన కథ (పొత్తూరి విజయలక్ష్మి – తెలుగు వెలుగు, అక్టోబర్ 01); మనిషి చనిపోయిన ఇంట్లో ఉండే గందరగోళాల్లో ఒక సహాయపు అవసరాన్ని గుర్తించి దానికై కృషి చేస్తున్న అన్నపూర్ణ కథ అఖండదీపం (నండూరి సుందరీనాగమణి – తెలుగు వెలుగు, అక్టోబర్ 01); రోజుకి పదిహేను వందలతో, ఏడేళ్లలో మూడు కోట్లు సంపాదించిన (ROI: 48%!) గుమాస్తా కథ చెల్లని నోటు (పుట్టగంటి గోపీకృష్ణ – ఆంధ్రభూమి వారం, అక్టోబర్ 05); భర్తకీ, ఆయనతో ముందే పరిచయం ఉన్న తన స్నేహితురాలికీ మధ్య జరిగినదానిగురించి తనకి రెండు విభిన్నమైన కథనాలు తెలిసాయి కానీ సత్యం ఏమిటో బోధపడలేదు. ఇంకో వ్యక్తినీ కనుక్కోవాలనుకుంటూ ముగిసిన కథలోని కథాంశం ఆసక్తికరం, కానీ కథకి కావలసిన ముగింపే రాలేదు సత్యం ఏవిటో (రాజీవ్ కొసనం – గో తెలుగు, అక్టోబర్ 13) కథలో; చైతన్య స్రవంతి ధోరణిలో ఆసక్తికరమైన కథనంతో అనగనగా ఒక వాన (రామదుర్గం మధుసూదనరావు – గో తెలుగు, అక్టోబర్ 13); ప్రేమికుల డైరీలో ఓ రోజు, ప్రేమికుల భాషలో మంచి కథనం ఎంతెంత దూరం నుంచో.. ఇంతింత దగ్గరకు (అజు – సాక్షి ఆదివారం, అక్టోబర్ 22) కథలో; గూగుల్, ఫేస్‌బుక్ రోజుల్లో ఇహలోకపు బంధాలను వదిలించుకోవడం అంత సులభం కాదని తెలుసుకుని ఉసూరుమన్న సూరిబాబు కథ డిజిటల్ అత్మ (కె ఎల్ సూర్య – ఆంధ్రజ్యోతి ఆదివారం, అక్టోబర్ 29); “కేవలం ఒక ఘటనకే పటాపంచలయ్యే పరువుకోసం పాకులాడ్డం అవసరమా?” అనే ప్రశ్నతో శాస్త్రిగారిలో కలిగిన వివేచనని బిగువైన కథనంతో చెప్పిన కథ ప్రేమ గోదావరి @ 2000 (రాయదుర్గం మధుసూదనరావు – ఆంధ్రప్రభ ఆదివారం, అక్టోబర్ 29); ఊరికే వచ్చి విసిగించే బంధువులు బహుశా ఏ డబ్బునో ఆశించకపోతూ ఉండొచ్చు, వాళ్లు కోరేది కాస్త ఆత్మీయత అయివుండవచ్చు అనే కథాంశంతో ఆత్మీయతా స్పర్శ (ఆర్ వి రాఘవరావు – ఆంధ్రభూమి వారం, అక్టోబర్ 26); కలలోకి వెళ్లడానికీ, బయటపడటానికీ మంత్రం డాక్టర్ రాసిచ్చాడు కానీ, తీరా కలలోనించి బయటపడదామంటే ఏం జరిగిందో తెలుసుకోవడానికి చదవాల్సిన కథ స్వప్నబంధం (రచయిత/త్రి పేరు లేదు – ఆంధ్రభూమి వారం, అక్టోబర్ 26); సరికొత్త (హెచ్చరిక: ‘హాస్యకథ’ అన్న శీర్షిక ఉండదు కానీ, జాగ్రత్త!) సినబ్బ కథ నా కొచ్చొక్కాయి టెరీకాటనుది (నామిని సుబ్రమణ్యం నాయుడు – విశాలాంధ్ర దీపావళి ప్రత్యేక సంచిక, అక్టోబర్); ఓ పావురం కాలికి కట్టివున్న కాగితం ఆధారంగా ఓ ముస్లిం వృద్ధుణ్ణి అన్యాయంగా పోలీసులు హింసించడం వెనకవున్న స్టీరియోటైప్ భావజాలాన్ని ఎత్తిచూపిన లోహముద్ర (సలీం – విశాలాంధ్ర దీపావళి ప్రత్యేక సంచిక, అక్టోబర్).

పోయాక దొరికే స్వర్గంకోసం, బ్రతుకుని నరకప్రాయం చేసుకున్న సోమేశ్వరశర్మ చివరికి స్వర్గానికి చేరుకున్నాడు కానీ… తరవాతేమైందో స్వర్గం-నరకం (బాచి – నవ్య, నవంబర్ 01) కథలో; సత్యాన్వేషణలో వేలసంవత్సరాల క్రితం ఎక్కడున్నామో ఇప్పుడూ అక్కడే ఉన్నాం, ఇలా అజ్ఞానంలో జీవితాలు తెల్లారిపోతున్నాయి అన్న తాత్విక భావనతో, పూర్తి సంభాషణలతో నడిచిన కథ భోక్త (అనామకుడు – కౌముది, నవంబర్ 01); వయసుల్లో తేడాలున్న భార్యాభర్తల కథలోని హాస్యం పోను పోనూ విచ్చుకుని, “ఈ పిల్ల పాకాన పడేసరికి ఆయన లోకాలు వదిలేసాడు…” లాంటి సందర్భోచిత హాస్యంతో ముగుస్తుంది భిన్నధృవాలు (బులుసు సరోజినీదేవి – కౌముది, నవంబర్ 01) కథ; దేవదూతల ధైర్యం వేరూ, దౌర్జన్యకారుల ధైర్యం వేరూ అని చిన్నపిల్లల నేపథ్యంలో చెప్పిన కథ దేవదూతలు (ఉణుదుర్తి సుధాకర్ – ఆంధ్రప్రదేశ్, నవంబర్ 01); చాలా ఏళ్లుగా మిస్సయి, ఎక్కడా కనిపించకుండా పోయిన కన్‌సైన్‌మెంట్ ఏవిటా అని ఆరా తీస్తే తేలిన విషయం బండలు (కృష్ణ వేణి – ఈమాట, నవంబర్ 01) కథలో; అవీ ఇవీ – బుడుగు తరహా – సొంత గొడవలూ, హాస్య కథనంతో బబ్లూగాడి చెల్లిపాప (సురేష్ – ఈమాట, నవంబర్ 01); కేవలం ఓ హాస్య సంభాషణతో Breakrooమోపాఖ్యానము: డబ్బింగు ఢమాల్ (పాలపర్తి ఇంద్రాణి – ఈమాట, నవంబర్ 01); మొదటగా కథ చెప్పబోతున్న ఉత్తమ పురుష కథకుడిని పక్కకు తోసేసి (ఈ భాగం నిజానికి అనవసరం), తన కథని తనే (ఉరితీతకి గురికాబోతున్న వ్యక్తేమో అనే భ్రమ కలిగేలా) చెప్పుకున్న తలారి. వివరాలలో కొన్ని లోపాలు ఉన్నా, ఉరితీతకి సంబంధించి ఈ కథ ఎవరిది? (కె ఎన్ మనోజ్ కుమార్ – సాక్షి ఆదివారం, నవంబర్ 05) కథ కొంత విభిన్నంగా ఉంది; పండగలన్నీ మగవాళ్లు ఆడవాళ్లని నియంత్రించడానికి ఉద్దేశించినవే అని చెప్పే కథ నీ పండక్కి రాను! (సడ్లపల్లె చిదంబరరెడ్డి – మాతృక, నవంబర్ 01); ఇంకోపని చేసి బతకలేనా అన్న ధైర్యంతో బయటకి నడిచిన సెక్స్ వర్కర్ కథ కొలిమి (హెచ్ ఆర్ కె – నవ్య, నవంబర్ 15); మన భయాలతో నిమిత్తం లేకుండా మృత్యువు తన పని తను చేసుకుంటూపోతుంది, అందర్నీ ముందూవెనకగా కలుపుకుపోతుంటుందన్న విషయం చెప్పిన కథ చివరి నీడ (బి అజయ్ ప్రసాద్ – సాక్షి ఆదివారం, నవంబర్ 12); ఉద్యమ కార్యాచరణలో వైఫల్యాలూ, అభిజాత్యాల గురించిన కథ కలల్ని జీవించవచ్చు (ఎస్ జయ – ఆంధ్రజ్యోతి ఆదివారం, నవంబర్ 19); టైలర్ల విన్యాసాల గురించి మధ్యమపురుష కథనంతో ఓహో గులాబిబాల! (సాంత్వన చీమలమర్రి – సాక్షి ఆదివారం, నవంబర్ 19); జీవితపు చరమాంకంలో కలిగే అపోహలూ, భయాలూ; తొలిగే భ్రమలూ, దొరికే అభయాల గురించి క్షేత్రపాలకుడు (వేదగిరి రాంబాబు – నవ్య, నవంబర్ 29); స్టాక్‌మార్కెట్ లీలల గురించి హాస్యోపన్యాసం మాయ..మార్కెట్..మనీ..మనిసి (డి శాయిప్రమోద్ – సాక్షి ఆదివారం, నవంబర్ 26).

ఒక చిన్న షిఫ్ట్ ద్వారా ఓ మోస్తరు టిస్ట్ సాధించిన కథ భూమి (రవి కొప్పరపు – కౌముది, డిసెంబర్ 01); సింగినాథం తాళవిన్యాస ప్రక్రియ గురించి సరదాగా రాసిన కథ టైము చెప్పిన నగారా (పులిగడ్డ విశ్వనాథరావు – మన తెలంగాణ ఆదివారం, డిసెంబర్ 03); అబ్బాయికీ, అమ్మాయికీ ఉన్న సమస్యలని ‘కప్పెట్టి’ పెళ్లిచేసుకుంటే, ఆ తర్వాత ఉత్పన్నమయిన సమస్యల్ని హాస్యపరిధిలో హాయిగా చెప్పిన కథ దొందూ దొందే! (బి ఆర్ కె వి భాస్కరరావు – ఆంధ్రభూమి మాసం, డిసెంబర్ 01); మెతుకుల వెతుకులాటలో ఆకలి బతుకుల పోరాటాల్నీ, రాజీలనీ చిత్రిస్తూనే ‘ఆడదానికి ఇన్ని పాఠాలు ఏ బడి మాత్రం నేర్పగలదు, ఒక్క మగాడు తప్ప’ అని ఒక ఏఫరిజం అందించిన కథ నాగూర్ బీ (మన్నెం సింధుమాధురి – అడుగు, డిసెంబర్ 01); పక్కింటివాళ్లు ఎవరో తెలుసుకోవడం కాదు, ఎలాంటివాళ్లో తెలుసుకోవాలి అని చెప్పే కథ అపరిచితులు (అలోక్ నాగ్ – నమస్తే తెలంగాణ ఆదివారం, డిసెంబర్ 17); పనిముట్లు సైతం మారణాయుధాలుగా అనుమానించబడుతున్న పాపపు కాలపు కథ పనిముట్లు (అట్టాడ అప్పల్నాయుడు – సాక్షి ఆదివారం, డిసెంబర్ 17); లేనప్పుడు దిగులుగా, ఉన్నప్పుడు బరువుగా అనిపించే కొన్ని బంధాల కథ నిర్లక్ష్యం (వి రాజారామమోహనరావు – నవ్య, డిసెంబర్ 27); చదువు, స్వాతంత్ర్యాల మీద ఎంత మక్కువున్నా, సంసారపు సంకెళ్లలో చిక్కుకుపోయిన బామ్మ సరస్వతి కథ సరస్వతీ నమస్తుభ్యం (వాడ్రేవు వీరలక్ష్మీదేవి – చినుకు, డిసెంబర్ 01); భూమిని నమ్మొద్దు అనే విభిన్నమైన సందేశంతో కథ శ్రీ సూర్యనారాయణా! (అద్దేపల్లి ప్రభు – చినుకు, డిసెంబర్ 01).

పై కథలని చదవండి. మీకు నచ్చిన కథలేవైనా ఉంటే ఆయా రచయితలని అభినందించండి!

పునర్ముద్రణలు పునరావృతం

కారణాలు ఏవైనా, ఒకే రచన రెండు పత్రికల్లో ప్రచురింపబడటం అనేది జరుగుతూనే ఉంది. కథల శీర్షికల్లో మార్పు ఉండటం కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంది!

ఏక్సిడెంట్ (ఆనంద్ వేటూరి – కౌముది, నవంబర్ 01) అనే కథ, నవంబర్ 2015 కౌముదిలోనే ప్రచురింపబడింది.

భావ కవి (లాస్యప్రియ కుప్పా – ఆంధ్రప్రభ ఆదివారం, డిసెంబర్ 17) అనే కథ, ‘కిచకిచలు’ అనే మరో పేరుతో సూర్య ఆదివారం, డిసెంబర్ 3, 10 సంచికలలో ప్రచురింపబడింది.

రేటింగ్ (రెహనా బేగం – ఆంధ్రజ్యోతి ఆదివారం, డిసెంబర్ 24) కథ, డిసెంబర్ 17 ‘నవ తెలంగాణ ఆదివారం’ లో ‘చావుకూడా పెళ్లిలాంటిదే బ్రదర్…’ అనే పేరుతో ప్రచురింపబడింది

ప్లాట్లు అమ్మబడును! (ఎస్ వివేకానంద – వార్త ఆదివారం, డిసెంబర్ 24) కథ, డిసెంబర్ 3, నవతెలంగాణ ఆదివారంలో ఇదే పేరుతో ప్రచురింపబడింది.

చివరి నీడ (బి అజయ్ ప్రసాద్ – సాక్షి ఆదివారం, నవంబర్ 12) కథ, ‘చినుకు’ డిసెంబర్ సంచికలో మళ్లీ ప్రచురింపబడింది.

పరదేశీ సాహిత్యం

ఈ సమీక్షాకాలంలో చదవాల్సినన్ని ఇంగ్లీష్ కథలు చదవలేదన్నది మాత్రం నిజం!

Cat Person (Krishten Roupenian – The New Yorker, Dec 11) అనే కథ, ఒక యుక్తవయసు అమ్మాయి నడివయసు పురుషుడితో నడిపే డేటింగ్, తత్సంబంధిత శృంగారం వ్యవహారం. ఈ కథ పెద్ద దుమారం రేపి, ఒక దశలో ట్విట్టర్‌లో దీని మీద చర్చోపచర్చలు జరిగాయి. తనకంటే పెద్దవాడయిన మనిషితో కొంతదూరం దాకా వెళ్లి, జరుగుతున్నది సరీగ్గా లేదని గమనించుకొని, చేస్తున్న పనిని విరమించుకున్న అమ్మాయిని, భంగపడ్డ మగవాడు మెసేజ్‌ల రూపంలో వేధించడం ఈ కథ ఇతివృత్తం. అద్భుతమైన డిటెయిలింగ్‌తో రాయబడ్డ ఈ కథ, నిజానికి ఓసారి చదవడానికి బానేవుంది- విపరీతమయిన డీటెయిల్స్ కొంతమందికి కొంత అభ్యంతరకరంగా ఉండవచ్చుగాక!

జె. ఎమ్. కట్సీ రాసిన రెండు కథలు ఈ సమీక్షాకాలంలో వచ్చాయి. రెండూ చాలా మంచికథలు.

The Dog (J.M. Coetzee – The New Yorker, Dec 04) కథలో ఓ అమ్మాయి ఆ తోవన వెళుతున్న ప్రతిసారీ, ఓ ఇంటికుక్క ఆమెను చూసి భయంకరంగా అరుస్తూవుంటుంది. తనని చూసి రోజూ మొరిగే కుక్క తనలో కలిగించే భయం, అవమానకరంగా ఉంది ఆవిడకి. ఆ ఇంట్లోకెళ్లి యజమానులతో మాట్లాడితే, వాళ్లు కుక్కకంటే కూడా అన్యాయంగా ఉన్నారు, అన్యాయంగా మాట్లాడుతున్నారు. కుక్కని ప్రతీకాత్మకంగా చిత్రిస్తూ, లైంగిక వేధింపుల పట్ల సమాజం ఎలాంటి ధోరణి అవలంబిస్తుందోనన్న విషయాన్ని చక్కటి కథనంతో ప్రదర్శించిన అతి చిన్నకథ ఇది.

Lies (J.M. Coetzee – New York Review of Books, Dec 21) అనేది మరో మంచి చిన్న కథ. ముసలితనం గురించీ, సమీపించే మృత్యువుని అంగీకరించడానికి నిరాకరించే ముసలివాళ్ల గురించీ శక్తివంతమైన కథ!

అమెరికన్ కథలే కాకుండా సమకాలీన యూరోపియన్ కథలు కూడా చదవాలననే సదుద్దేశంతో The Best European Fiction 2018 అనే పుస్తకం తెప్పించాను కానీ, చదవడానికే సమయం దొరకలేదు. ఆ కథల గురించి మరోసారి ప్రత్యేకంగా రాయడానికి ప్రయత్నిస్తాను.

ఇప్పటికి ఇవీ విశేషాలు.

చదవడం ఓ ఎత్తైతే, వాటిని క్రోడీకరించి ఓ వ్యాసం రాయడం ఇంకా పెద్దపని. ఓ సంవత్సర కాలమైనా అలాంటి పనిని నిర్విఘ్నంగా నిర్వహించగలనా లేదా అని నన్ను నేను పరీక్షించుకున్నాను. పర్లేదు, చేయగలననే నమ్మకం కలిగింది.

తీరికా, ఓపికా ఉంటే 2018 కథల మీద సమీక్షతో ఈ పరంపరని కొనసాగిస్తాను. ప్రస్తుతానికి ఇంకా ఏమీ అనుకోలేదు!

You Might Also Like

One Comment

  1. Chandra Naga Srinivasa Rao Desu

    తనకు నచ్చిన మంచి కథల గురించి చక్కగా వివరించారు

Leave a Reply