శప్తభూమి – బండి నారాయణస్వామి నవల
వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్
(వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకునేందుకు అనుమతించిన వ్యాసకర్తకు ధన్యవాదాలు)
******************
కృష్ణదేవరాయలు చిన్నవయసులోనే పరమపదించడానికి ఒక కారణం పుత్రుని మరణం మూలాన బయలుదేరిన తీవ్ర మనోవేదన కాగా, ఆయన సాముగరిడీ ముందు చేసే ఒక అలవాటు అని ఒక భావన ప్రచారంలో ఉంది. ఒక పైంట్ వరకూ నువ్వుల నూనె తాగి అంతే మొత్తం వంటికి పట్టించి అది మొత్తం చెమటరూపంలో బయటికొచ్చేసుందనే నమ్మకంలో కసరత్తులు చేసేవాడు. సంతృప్త కొవ్వుకణాలు పేరుకుపోయి గుండెజబ్బుతో పరమపదించాడనేది ఒక వివరణ. (కృష్ణరాయలు బొద్దుగా ఉండేవాడు, ఎప్పుడూ నవ్వుతూ, ముఖంపైన స్పోటకపు మచ్చలతో, చామన ఛాయతో, మధ్యస్థంగా ఎత్తులో కనిపించేవాడని చరిత్రకారులు రాశారు. రాబర్ట్ సీవెల్ వర్ణించిన రాయలూ, ఈ కృష్ణరాయలూ ఒక్కరేనా అనేది తెలీదు. తన దేవేరులతో తిరుమల రంగమంటపం దగ్గర కనబడే రాయలకి, మనం చదివిన వాటికీ, రాయల వంటిపై కొల్లాయి, తలపై కుళ్ళాయి తప్ప ఇంకో పోలిక కనబడదు)
శప్తభూమి నవల చదవడం పూర్తయ్యింది. పుస్తకం గురించి స్వర్ణ కిలారి గారు, Mani Vadlamani గారు, సవివరంగా వారి వారి రెవ్యూల్లో పేర్కొన్నారు కాబట్టి వారు చేసిన ఈ పుస్తక పరిచయాన్ని చదవగలరు. తెలుగులో చారిత్రకాంశాల ఆధారంగా వచ్చిన పుస్తకమైనా, విడువకుండా చదివించడంలో ఈ రచన అత్యంత గొప్ప రచనలకు ఏ మాత్రం తీసిపోదు.
అటు గోల్కొండ నుంచి ఇటు తంజావూరు దాకా అప్పటి చారిత్రక వివరాలని నేర్పుగా, కథలో నాటకీయతని ఉద్వేగభరితంగా, కులాలు పుట్టిన తీరును, కులాలు ఒక్కో మెట్టే సామాజిక నిచ్చెనమెట్లను ఎలా ఎక్కి ఇప్పుడు భూస్వామ్య, ఫ్యూడల్ వ్యవస్థలుగా ఎలా రూపాంతరం చెందాయో అనేదానికి అనేక సోదాహరణమైన వివరణల్ని సూటిగా, చదువరి సమాంతరంగా తనకు తెలిసిన సంగతుల్ని బేరీజు వేసుకునేలా, కొత్త అభిప్రాయాలకి చోటిస్తూ నడిచిన నవల. రాయలసీమ కథ. అనంతపురం-కడప-కొద్దిగా చిత్తూరు, ఒంగోలు ప్రాంతాలని తడుముతూ ఎక్కువగా ఆరేడొందల ఏళ్ళుగా కరువు నాట్యమాడుతూనే ఉన్న ప్రాంతపు జీవితాలని చూపడానికి కాలయంత్రంతో వెనుకకు తీసుకెళ్ళే పుస్తకం.
గుర్రమెక్కినోడే రాజౌతాడు. రాజ్యం స్వతంత్రం అని ప్రకటించుకున్న మరుక్షణం అతను క్షత్రియుడౌతాడు. కొన్నిచోట్ల సామాజిక వర్ణనలని చూస్తే, కమ్యూనిస్టు దృక్పథాన్ననుసరించే నడిచిందనిపించింది. నిజమే, రూఢీ లేని నిజాలు. నమ్మగలమా? నమ్మకుండా వదిలేయడమూ సాధ్యమయ్యే పనేనా? మనకు తెలిసిన చరిత్ర మొత్తం లెఫ్టిస్టు దృక్కోణంలోనే చెప్పబడింది కాబట్టే మనలో పేరుకుపోయి ఉన్న సెల్ఫ్ లోథింగ్ భావజాలాలని వదిలి ఈ వాస్తవాలని చెప్పబడుతున్న వాటితో విభేదించడం దుస్సాధ్యం. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. అవును, అప్పటి ప్రతి ఒక్క సామాజిక లోటుపాట్లకు కారణం బ్రాహ్మణీయ భావజాలాలే. వాటిని నెత్తిన పెట్టుకుని ఊరేగిన ప్రతీ రాజుదీ కూడా. రాచరికంలోకి మారిన ప్రతి ఒక్కరి కులానిది కూడా. క్షత్రియుడనిపించుకోవాలని ఉబలాటపడి ఆవిధంగా చేసే అధికారం కలిగి ఉండిన(?) వర్గాన్ని మాన్యాలతో కొనగలిగిన ఒక కాలపు రీతి. These people are God Men, King’s Men and the ‘King’ Makers. అంతెందుకు, రామరాయల నిర్యాణం అనంతరం హంపీని కొల్లగొట్టిన తెగల్లో బాగా వినబడిన పేరు మురారీరావు అని చెప్పబడే బ్రాహ్మణ దోపిడీ ముఠా నాయకుడిది. మరట్వాడా రాచరికమే పీష్వాల (పీష్వాలు బ్రాహ్మణులు) చేతిలో ఉండగా, ఇలాంటి దండ్లు ఉండడం అతిశయం కాదు. వదిలేద్దాం.
ఈ పుస్తకంలో మొదట్లోనే చాలా నైపుణ్యంగా రచయిత ఒక పేరాలో వర్ణిస్తారు. కృష్ణరాయల అనంతరం ‘రామరాయల’ కాలం లోకి వచ్చేసరికి హంపీ రాజ్యంలో మళ్ళీ పాలెగాళ్ళకు బలం పెరిగింది. (కృష్ణరాయలు రాచనగరి లోనే లక్ష సైన్యాన్ని నిర్వహించేవాడని రాయవాచకంలోనూ, అనేక చారిత్రకాంశాల వివరణలోనూ తెలుస్తూంది). ఆ రాచనగరిలో రాజుల అలవాట్లను ఇక్కడి పాలెగాళ్ళు సరాసరి అనుసరించడం. ఈ పోస్ట్ మొదటి పేరాలో వర్ణించినట్లు నూనె తాగి నూనె వంటికి పట్టించి సాముగరిడీలూ, కసరత్తులూ చేసి దేహ దారుఢ్యాన్ని పరిరక్షించుకోవడం. పాలెగాళ్ళు అలా చేశారో లేదో కానీ, అట్లాంటి ఆసక్తికరమైన రాచరికపు అలవాట్లని పాలెగాళ్ళకి అన్వయించడంలో రచయిత చూపిన నైపుణ్యంలో చాలా ఒప్పుదల కనిపించింది. సృజనాత్మకత అనమాట. నిజమో, కాదో, అన్వయం మాత్రం బహు చక్కగా కుదిరింది. కేవలం నా పరిశీలన అంతే 🙂
రెండు. అంతే చాకచక్యంగా వర్ణించిన ఇంకో విషయం,అనేక విశేషాల్లో అక్కడక్కడా మనం ఇంతకు పూర్వం చదివిన రీతిలో ‘తెలుగు వారి భోజన అలవాట్లలో ( ఎక్కడ, ఏ రచనలో చదివానో గుర్తు లేదు) ఒకదాన్ని సరాసరి ఈ పుస్తకంలోకి తీసుకొచ్చెయ్యడం. వేసవి కాలంలో మామిడికాయలతో కలిపి వేయించిన చేపలను భోజనం చేసిన అనంతరం వచ్చే త్రేన్పుల నుండి ఉపశమనానికి ఇసుకలో పూడ్చిన కొబ్బరి కాయల నీళ్ళని తాగేవారనే ఒక వర్ణన. మాకు తొమ్మిదిలోనో, ఎనిమిదిలోనో తెలుగులో పాఠంగా వచ్చిన సంగతి అది, ఏ పుస్తకం తాలూకు భాగమో గుర్తు లేదు. దాన్ని ఇక్కడ మన కథానాయకుల్లో ఒకరైన ‘ఎల్లప్పజెట్టి’ జీవితంలో ఒక రోజు జరిగిన సంఘటనగా తీసుకొచ్చేరు. ఆయన్నే అడగాలి దాని మూలం ఎక్కణ్ణుంచి తెచ్చారని. ఇంకొకటి, రాయల సీమలో చెరువుల్లో ఎంతగా చేపలు దొరికినా, ఆ విధమైన సొఫెస్టికేషన్ అయితే ఎప్పుడూ లేదనేది నా అభిప్రాయం. వివాదం అక్కరలేదు కానీ ఎవరైనా రచయితనే అడిగి తెలుసుకుంటే అందరికీ ప్రయోజనకరం.
పుస్తకం గురించి చివరగా ఒక్క వాక్యంలో నా అభిప్రాయం చెపుతా. ఇప్పుడు మనకి Game of Thrones (ఇదేంటో తెలీకపోతే మీరు రాయల కాలం నాటి వారని జనులెందరూ పరిగణించే ప్రమాదం ఉంది. తెలుసని అనెయ్యండి. గూగుల్లో తెలుసుకోవచ్చు తరువాత :)) స్థాయిలో ఒక గొప్ప కాల్పనిక సాహిత్యం అయితే దొరికింది. దీని హక్కుల్ని తీసుకుని సరిగ్గా తీయగిలిగితే యాభై వారాలకు సరిపడా మెటీరియల్ చారిత్రకాంశాల ఆధారంగా మనముందే ఉంది. తప్పక చదవండి.
రచయిత బండి నారాయణ స్వామి గారి శైలి ఆయనకే ప్రత్యేకం. చారిత్రక కల్పనా సాహిత్యాన్ని ఎలా నడపాలో అనేదానికి ఇదొక మంచి ఉదాహరణ.
Leave a Reply