నవ్వండి నవ్వించండి

రాసి పంపిన వారు: స్వాతి శ్రీపాద

*******************************************
intinti1నవ్వు నాలుగు విధాల చేటని ఒకప్పుడంటే నవ్వు నలభై విధాల మేలని ఒప్పుకున్న ఈ రోజుల్లో నవ్వు తప్పిపోయిందండీ . ఎక్కడ వెతుక్కోవాలో తెలియటం లేదు. ఎవరి మొహాల్లోనో వెతుక్కుని నిరాశపడే కంటే పుస్తకాల్లో, అక్షరాల్లో వెతుక్కోవడం ఉత్తమంలావుంది. అలాగని తెలుగు సాహిత్యాన్ని జల్లెడ పడితే హాస్యం అందించేవాళ్ళను వేళ్ళమీద లెఖ్ఖ పెట్టుకోవచ్చు. ఓ పక్క ఉద్యమాల ఊపు మరో పక్క ఇజాల బలుపు – వీటన్నింటి మధ్యా హాస్యం బక్కచిక్కిపోతోంది.

మునిమాణిక్యంగారి కాంతమ్మ, మొక్కపాటి వారి సునిశిత చతురత, ముళ్ళపూడి అమాయకపు గిలిగింతలు – మనసు సున్నితంగా ఆహ్లాద పరిస్తే పానుగంటి వారి వ్యంగ్యీకరణ , గురజాడవారి సూటిదనం నొప్పిస్తూనే మెప్పిస్తుంది. ప్రయోజనాలు గణిస్తే రెండింటికీ ఉన్నాయి. ఒకటి ఆహ్లాదమయితే మరొకటి చక్కని వ్యంగ్య విమర్శ, సామాజిక విశ్లేషణ.

ఏదేమైనా హాస్య రచన సిటీలో ట్రాఫిక్ లాంటిదే.. ఏ వరదలో ఇరుక్కుపోతామో ఎవరికీ తెలీదు.

పొత్తూరి విజయలక్ష్మి గారు హాస్య రచనలో సిద్ధ హస్తులు.సరదాగా మేమిద్దరం ఓ గంట మాట్లాడితే సగం కధ చదివేసినట్టే అనిపిస్తుంది.ఓపక్క సునిశిత వ్యంగ్యం మరోపక్క అతి సుకుమారపూ చతురత కనబరచి ప్రతి కధా ఓ ఆధునిక జీవనశైలి నేపధ్యంగా ఎన్నుకునిరోజువారీ జీవనయానంలో మానవ సంబంధాలను , అతి సాధారణ విషయాలను అసాధారణమైన శైలి అనిపించేలా తీర్చిదిద్దారు. పధ్నాలుగు కధల ఈ పుస్తకం నవ్వుకోసం నిస్సంకోచంగా సూచించ వచ్చు. అందరూ నవ్వుతూ బ్రతకాలనే ఆశయం ఇలా సార్ధక పరచుకున్నారు.

“మాఇంటి రామాయణం ” కధా సంపుటి పేరు.అందులోని మొదటి కధ కూడా.

చిన్న వాక్యాలు సూటిగా కదలి వచ్చే భావన కధకు ఒక వాస్తవికత విశ్వసనీయతనాపాదిస్తాయి.

మధ్య తరగతి జీవితాల్లో రోజూ వినిపించే మాటలే సంభాషణలు. మధ్య మధ్యలో అలంకారం లా సామెతలు.కధలో తండ్రీ కొడుకుల సంభాషణ , అవస్థలు సున్నితంగా ఎత్తి చూపిన సమస్యలు సామరస్య పరిష్కారాలు నవ్వుకోడంతో పాటు ఆలోచించకుండా వుండలేరు పాఠకులు. ఈ కధ ఆవిడ నేర్పరితనానికి ఓ మచ్చుతునక మాత్రమే .ప్రతికధా ఓ గీటురాయే. పరిమైతమైన ధరలో అపరిమితమైన ఆహ్లాదాన్ని అందించే కధల సంపుటి మా ఇంటి రామాయణం.

********************
పుస్తకం వివరాలు:
మా ఇంటి రామాయణం – కథా సంకలనం
రచన: పొత్తూరి విజయలక్ష్మి
తొలి ముద్రణ: 2009
వెల: 80 రూపాయలు/10 డాలర్లు
కాపీలకు: నవోదయ, ప్రజాశక్తి, విశాలాంధ్ర – హైదరాబాదు
ప్రింటర్: విప్ల కంప్యూటర్ సర్వీసెస్, నల్లకుంట, హైదరాబాదు (040-27676910)
పబ్లిషర్లు: శ్రీ రిషిక పబ్లికేషన్స్, నల్లకుంట, హైదరాబాదు

You Might Also Like

One Comment

  1. kiran

    udyamaalanTae anta chulakanaa..?

Leave a Reply