“యానాం వేమన ఏమనె….” అఫ్సర్ కవిత గురించి

రాసి పంపిన వారు: బొల్లోజు బాబా

*****************************************************
అనుభవం నుంచి పుట్టే కవిత్వానికి ఆయుర్ధాయం ఎక్కువ. అనుభవాన్ని వెచ్చని స్పర్శగా మలచగలిగే కవి చేతిలో పడితే ఇక అది ఓ శిల్పమై నిలుస్తుంది. టౌనుల్లో కూర్చొని రాసే విప్లవగీతాల హోరులో, సుష్టుగా భోంచేసి అల్లిన ఆకలి కేకల కవిత్వం మధ్య, మూలాల్లో నిలుచుని పలికిన “యానం వేమన ఏమనె…..” కవితా వాక్యాలు నన్ను చాన్నాళ్లు కలవర పెట్టాయి. నా జీవనయాన రెపరెపల్లో చెక్కుచెదరక మరల మరల గుచ్చుకొంటూ, అదే బాధ, అదే అశాంతిని రగిల్చే కొన్ని వాక్యాలలో ఇవి మరపురానివి.

ఈ కవితను మొదటి సారిగా ఆంధ్రజ్యోతి పత్రికలో చదివాను (1992). ఈ కవి ఎవరో మా “యానాం” గురించి రాసాడన్న కుర్రతనపు ఉత్సుకత మొదట్లో ఉండినా, పదే పదే చదివినపుడు, ఈ కవితలో జీవిత సామస్త్యాన్ని ఇముడ్చుకొన్న ఒక “రక్త స్పర్శ” కనిపించింది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. “శ్రమైక జీవన సౌందర్యం” అని శ్రీశ్రీ వర్ణించినా, “మంచియన్నది మాలయైతే మాలనేనగుదున్” అని గురజాడ ప్రకటించినా, “శ్రమకు విశ్రాంతి కంటికి రెప్పలా ఉంటుంది” అని టాగోర్ అన్నా ఏదో వెలితి. ఒక ఆలోచన ఎప్పటికీ తెగేది కాదు. లోపలి దారం కనిపించనితనం వెంటాడుతూండేది.

ఆ మహాకవుల కాలంనుంచీ ఇప్పటిదాకా సామాజిక చైతన్యం వేయి దళాలతో వికసించటం వల్లనో ఏమో, ఆ కనిపించని దారమేదో ఈ కవితలో కవికి దర్శనమయ్యింది.

సందర్భం-: కవి యానాం వెళ్లినప్పుడు మాదేటి “సుబ్రమణ్యం” అనే ఒక దళితుడు కొన్ని వేమన పద్యాలు పల్లె పాటలు వినిపించాడు. ఆ యానాం వేమన ఆ రోజు “ఇన్నాళ్లుగా రాస్తుండారు, మా కష్టాలూ, కన్నీళ్లు మీకు ఆపడ్డయా దొరా. ఒకే దారి గుండా వచ్చాం కదా మన ఆకెందుకు ఎడమయ్యింది బాబయ్యా” అని సంధించిన ఒక ప్రశ్న కవిహృదయపు బుల్స్ ఐ కి గుచ్చుకుంది. అంతవరకూ కలల లోకంలో విహరించిన కవి ఆలోచనల్ని పేకమేడలా కూల్చివేసిందా ప్రశ్న. కూలిన ఆ ఆలోచనల్లోంచి ఓ ఫీనిక్స్ పక్షిలా ఈ కవిత పైకి లేచింది. కవుల్ని “నిజం చెప్పు” అంటూ శాసిస్తూంది ఈనాటికీ.

ఆ దళితుని ప్రశ్నకవిలో రగిల్చిన అంతర్మధనం ఈ కవిత లో కనపడుతుంది. ఏమిటీ పరిస్థితులలకు కారణం అనుకుంటూ తన లోపల్లోకంలో అన్వేషణ సాగిస్తాడు కవి. తన చదువునూ, జ్ఞానాన్ని తడిమి చూసుకుంటాడు. ఒక సమాధానంకోసం దోసిలి పట్టి అర్ధిస్తాడు కవి. ఆ వెతుకులాటలో ఎన్నోతరాలుగా మూసుకుపోయిన కనులు సాక్షాత్కరిస్తాయి. తన అంధత్వం తనకే గోచరమౌతుంది. బలవంతంగా వర్గాల మధ్య ఏర్పడిన కండిషనింగ్ తెలుస్తుంది. ఒక వర్గం సాగించిన వివక్ష కనపడుతుంది. ఆ అనుభవం ఇచ్చిన జ్ఞానంతో కవి “మాటకీ అక్షరానికీ చెమట చేతుల మోటుదనం కావాలిక” అని ప్రకటిస్తాడు. మట్టివాసనను, కన్నీటి జాడలనీ, కవిత్వం ప్రతిబింబించాలని ఒక దిశానిర్దేశం కావిస్తాడు.

కవిత్వంలో మనిషివాసన కన్నా చమట చేతుల మోటుదనం యొక్క అవసరతను ఈ కవితలోని అక్షరక్షరం ఎలుగెత్తి చాటింది. దళితకవిత్వ ఉద్యమంలో వస్తువుని నిర్ధిష్టంగా గుర్తించి వ్రాయబడ్డ కవితలలో ఈ కవిత ముందుంటుంది. ఎందుకంటే, ఈ కవితానంతర కాలంలో మహోత్తుంగ తరంగాల్లా ఎగసిపడ్డ దళిత, బహుజన, మైనారిటీ కవిత్వాలలో ఈ కవితాత్మే శత సహస్ర రూపాలతో సంచరించటం ఒక చారిత్రక పరిణామం.

నాకు ఈ కవితలో, వ్యక్తి అనుభవాన్ని కవిత్వంగా మార్చగలగటం, లోపల్లోకపు సంఘర్షణను నిజాయితీగా అక్షరీకరించటం, కవిత్వం సామజిక హితాన్ని కలిగించాలన్న దృక్పధము కనిపిస్తాయి. బహుసా మంచి కవిత్వానికి పై మూడు లక్షణాలు కొలబద్దలేమో కూడా.

నాకు నచ్చిన కవిత గురించి, ఆ కవిత కలిగించిన ఆలోచనలగురించి పంచుకొనే అవకాశాన్ని కలిగించిన పుస్తకం.నెట్ వారికి కృతజ్ఞతలు తెలియచేసుకొంటూ, అఫ్సర్ గారు వ్రాసిన యానం వేమన ఏమనె.. కవితను ఇలా మిత్రులతో పంచుకోవటాన్ని సంతోషిస్తూ……

యానాం వేమన ఏమనె……..

కలల పక్క మీంచి కలవరిస్తూ
నేల మీద దబ్బున పడిపోయినట్టు
చితికిపోయిన ఆకాశం మీంచి నువ్వు
నన్ను భూమ్మీదికి నెట్టినప్పుడు
నా ప్రపంచం మీద కొత్త సూర్యుడు పొడిచాడు
ఒకటి రెండు పదులు వందలుగా విస్తరించి నువ్వు
ఆకాశ శూన్యాన్ని నింపుకొని పోతున్నప్పుడు
నేను ఒఠ్ఠి శున్యాన్నై
శూన్య గోళాన్నయి నీ చుట్టూ పరిభ్రమిస్తూ ఉండి పోయాను.
నేను నిలబడినప్పుడు

మళ్లీ నన్నొక ప్రశ్నగా మార్చి
నా కాళ్ల కింద భూమిని తొలిచావు నువ్వు.
ఆ తర్వాత నేను
నా మొహం వెనుక
వేన వేల భూగోళాల్ని కొండకోనల్ని తవ్వుకుంటూ వెనక్కి వెళ్లిపోయాను
నేను తెచ్చుకున్న చదువునంతా పారబోసుకున్నాను
మళ్లీ దాహం తీర్చమని నీ ముందు దోసిలి ఎత్తాను

నువ్వు నీళ్లూ వొంపలేదు
నా దోసిలీ నిండలేదు
నా దాహం పిడచకట్టుకుని నేను ఎడారినయ్యాను.
నా వొడ్డున ఏ నీటి చుక్కయినా చేపపిల్లలా
విలవిల విల్లాడుతుందేమోనని
మళ్లీ మళ్లీ ఎదురుచూస్తూనే ఉంటాను నేను.

2.
ఎవడు పుట్టినా ఆడదానికేగా
ఏ ఆడదైతేనేం
ఎవడు పుట్టినా రక్తం లోంచేగా
ఏ రక్తం అయితేనేం, మరి
నా యిస్తరి దూరంగా ఎందుకు పెడ్తివి నా దొరా నా రాజా
అని ఈ భూమి కెదురుంగా నిలబడి
సూర్యుడిలా నువ్వు నన్ను పొడుస్తూనే ఉంటావా!
ఇంత తెలిసీ ఇంత చేసీ
నీ కష్టాన్నీ, నీ కన్నీళ్లనీ చూడలేని
అంధుణ్నయిపోయినందుకు
నా కన్రెప్పలకి నీ మాటల సూదులు వేలాడ్తూనే ఉన్నాయి నా మట్టి మనిషీ!
నేను వొట్టి మనిషినే అనుకున్నా
నువ్వూ వొట్టి మనిషివే అనుకున్నా
మనిద్దరి చీమూ రక్తవూ వొక్కటే అనుకున్నా
తోలు తిత్తి ఏదైతేనేం
మనిద్దరి కష్టాలూ వొక్కటే అనుకున్నా
అంతా వొట్టిదే నా మట్టి మనిషీ!
నా వొంటి మీద చొక్కా రంగుని బట్టీ
నా పెదవి మీద మాటల వాసన్ని బట్టీ
నా తల్లీదండ్రీ నాకు పంచిచ్చిన రక్తాన్ని బట్టీ
నా చేతుల మోటుదనాన్ని బట్టీ
తలపాగా తీసి నువ్వొచ్చినప్పుడు
నీ ముందు వొంగున్న తీరును బట్టి
నా మనిషితనం ఖాయమైపోతున్నప్పుడు
నేను వొట్టి మనిషిని ఎట్లవుతా?

3
మాటకీ
అక్షరానికీ
మనిషివాసన ఉంటే సరిపోద్దా?
పోదు,
ఏ మనిషి వాసనో గట్టిగా పసికట్టనీ.
మాటకీ అక్షరానికీ
చెమట చేతుల మోటుదనం కావాలిక!
మాటకీ
అక్షరానికీ
కళ్లకింద బాధతో ఏడుపుతో
తడిసీ నానీ
నల్లబారిన నీడ కావాలిక
మాట నిజంగా మాటయితే
మనువు మాటలో చెప్పాలంటే
అది కాళ్లలోంచి పుట్టాలి
మట్టి కాళ్లలోంచి పుట్టాలి.

– అఫ్సర్

You Might Also Like

7 Comments

  1. Padmapv

    Sir..mukuAbivamdhanallu,ABINANDHANULU. .Ensarlu..chepinaparvaleddu..Anukuntuna!great..Babasir

  2. kaasi raju

    యానాం ఆ సుట్టుపక్కల ప్రదేశాలు నాకు ఎంతో నేర్పాయి . చెమట చేతుల మోటుదనమో, కళ్ళకింద
    నల్లబారిన నీడో …. బాబా గారు అన్నట్టు మనం ఏది చూడాలనుకుంటే అదే కనిపిస్తుంది. మనం రాసేది కాకుండా మనల్ని రాసుకుంటూ పోయేదయితే బతుకూ, కవిత్వమూ అవుతుంది. అది ఏనాం ఏమన ఏదో అన్నట్టే ఇలాగే ఉంటాది.

  3. vsrsr

    జీవితం సజావుగ సాగినంత కాలం ఏ వ్యత్యాశాలు మనస్సుకి గోచరించవు ,ఏ ప్రాంతం వారమయినా సాంప్రదాయాలని ,కట్టుబాట్లని దాటలేము, నేను చదివిన చూసిన రాతలు చేతలలో చాలామట్టుకు తాత్కాలిక భావోద్వేగంతో బయటపడ్డ ఆ సమయానికి తగిన మాటలే…నాగరికత దూరాలని పెంచింది…కులమతాల ఊబిలో సంస్కారం మరచిన వాళ్ళం అయ్యాము…గొప్ప బీద తారతమ్యాలు పోయిన నాడు ఈ కవితలకన్నా చేతలే మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి…

  4. బొల్లోజు బాబా

    రవికిరణ్ గారికి
    కామెంటినందుకు ధన్యవాదములు

    బహుసా

    “మనం దేన్ని చూడాలనుకొంటామో అదే కనపడుతుంది కవిత్వంలోనైనా, జీవితంలోనైనా”

    బొల్లోజు బాబా

  5. బొల్లోజు బాబా

    కొత్త పాళీ గారికి

    ధన్యవాదములు
    స్పెల్లింగు మిష్టేకుల విషయం:
    మీరున్నారన్న ధైర్యం నాకు :-))
    ఇదివరలో కూడా చాలా సార్లు సవరించారు. నేను మరచిపోలేను.
    మీరు ఏమాత్రం పట్టుకోలేని రేంజులో ఎప్పటికయినా రాయాలనే నా ప్రయత్నం 🙂

    మరో జోకు ఏమిటంటే, ఆ మూడో వాక్యంలో ఏం తప్పుందో ఇప్పటికీ అర్ధం కావటం లేదు. మీరంటున్నారంటే ఏదో ఉండే ఉంటాదనే నా విశ్వాసం.

    థాంక్యూ

    బొల్లోజు బాబా

  6. ravikiran timmireddy

    బాబా గారు,

    శ్రీశ్రీ లో దొరకని జవాబేదో నాకిక్కడ దొరికిందని నేచెప్పలేను గాని. నాక్కావాలిసిన జవాబు మాత్రం దొరికింది. నా బతుకు నేను మార్చుకోనవసరంలేని జవాబు. నా ఉద్యోగాలు, నా ఆదాయాలు, నా సంసారాలు, నా మార్టుగేజ్లు, నా శనాదివారాల మానసిక, శారీరిక వ్యాహ్యాళిలు, నా పెళ్ళాం పిలకాయల ఇష్టాఇష్టాలు, కష్టానష్టాలు, మొత్తం నా బతుకంతా నా బతుకులాగే వుండగలిగే జవాబు నాకు దొరికింది. నా మందు నేను తాక్కోవచ్చు, నా సిగరెట్ నేను కాల్చుకోవచ్చు, మడత నలగిన (మా దేశంలో నలిగనవే అందంలే) నా బట్టల్లో నేను గొంతు దిగే వెచ్చని ద్రావకంలోంచి ఒక గొప్ప లిబరల్ గా అప్పుడప్పుడూ వెలిగిపోవచ్చు, ఒక కవితని వ్రాసేసుకోవచ్చు. వ్రాసిన కవితని చదువుకుంటూ, అప్పుడప్పుడూ ఇచ్చే దానాలతో నన్ను నేను ఊరడించుకోవచ్చు. పొద్దనే లేసి నా డాలర్ల వెనుక నేను జాగింగ్కి మలినం అంటని హృదయంతో పోనూవచ్చు. ఎందుకంటే నా నలిగన బట్టల్లో నిగ్గుతేలుతున్న నా లిబరరల్ గుండెని, ఆటుపోట్ల నా మధ్య తరగతి బతుకులో నేరక్షించుకునే నా బతుకు సేఫ్టీనీ శ్రీశ్రీలాగా ఈ అవ్వే చనిపోతే ఆ తప్పెవరిదని నా గుండెని కోసి, నా బతుకుని కకావికలు చేసే ప్రశ్న ఈ కవితలో లేదు కదా.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  7. కొత్తపాళీ

    పద్యం చాలా బావుంది. దాన్ని అనుభవించి ఆర్ద్రంగా మీరు పరిచయం చేసిన తీరూ బాగుంది. బాబాగారూ మీరు కొంచెం స్పెల్లింగుల మీదా, మాటల వాడుక మీదా, వాక్య నిర్మాణం మీదా కొంచెం శ్రద్ధ వహించాలి.

    స్పెల్లింగు – చాలాచోట్ల అవసరం లేని వత్తులు చోటు చేసుకున్నాయి .. ఉదా. నిర్దిష్టం.

    మాటలు – అవసరత? ఆవశ్యకత అని మీ అర్ధం.

    వాక్యం – వ్యాసం మొదట్లో మూడో వాక్యం గందరగోళంగా ఉంది.
    ఏదేమైనా, అనేక అభినందనలు.

Leave a Reply