మనిషి అస్తిత్వపు పెనుగులాటకి ప్రతిఫలనాలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
[ఈ తరం కోసం … అరసం (ఆం. ప్ర) సమర్పిస్తోన్న కథా స్రవంతి సీరీస్ కోసం పాపినేని శివశంకర్ రచనల నుంచి ఎంపిక చేసిన కథలు. సంపాదకుడు ఎ.కె.ప్రభాకర్ రాసిన ముందుమాట]
**************

ఎంపిక చేసిన కథలు
మట్టి గుండె, హింసరచన, వస్తు ప్రపంచంలో, చింతల తోపు, వర్చ్యుయల్ రియాలిటీ
చివరి పిచ్చిక, సగం తెరచిన తలుపు, ఒక్క వాన కోసం, మాయాబిల రహస్యం, సముద్రం

‘జీవితం పట్ల ప్రగాఢ ప్రేమ, సామాజికాభ్యుదయం గురించిన తపన, సిద్ధాంత బలం, కళాసూత్ర జ్ఞానం గల రచయిత గొప్ప కథలు సృష్టిస్తాడు.’

మంచి కథలు రాయడానికి రచయితకుండాల్సిన మౌలికమైన అర్హతల గురించి, నిబద్ధత గురించి పాపినేని శివశంకర్ ఆలోచన యిది. ఆ అర్హతలు, నిబద్ధత శివశంకర్ లో నిండుగా వున్నాయి. సాహిత్య సృజనని సామాజిక ఆచరణగా భావించి ఆ బాధ్యతని యెంతో నిజాయితీగా చిత్తశుద్ధితో నిర్వహిస్తోన్న రచయిత శివశంకర్. రైతు కుటుంబ నేపథ్యం నుంచి, పల్లె పొత్తిళ్ళ నుంచి వచ్చిన కారణంగా రైతు జీవన సంఘర్షణా, పల్లెటూళ్ళ పరిమళం అతని కథల్లోకి చొచ్చుకువచ్చి పాఠకుల గుండెల్ని తాకి వుక్కిరిబిక్కిరిచేస్తాయి.

మనిషి అంతర్ బహిర్లోకాలు యివ్వాళ అనేకధా ఛిద్రమై వున్నాయి. కాలక్షేపం రచయితల్ని పక్కకు పెట్టినా సీరియస్ రచయితలు సైతం సామాజిక సంక్షోభాన్ని పట్టించుకొన్నంతగా మానసిక కల్లోలంపైన శ్రద్ధ పెట్టడంలేదు. బాహ్య ప్రపంచంలో చోటుచేసుకొంటున్న అలజడినీ దాని ప్రకంపనల్నీ, అవి మనసుని తీవ్రంగా కలవరపెడుతోన్న విషాద వైనాన్నీ, వాటినుంచీ బయట పడటానికి దారులు వెతికే ప్రయత్నాలనీ యేకకాలంలో సాహిత్యంలోకి అందునా కథల్లోకి తీసుకువస్తున్న అరుదైన రచయితలలో పాపినేని శివశంకర్ వొకరు.

మనిషి అస్తిత్వానికి సంబంధించిన మౌలికమైన ఆలోచనల్నీ, బహుముఖీనంగా సాగుతోన్న పరాయీకరణలో ఆధునిక మానవుడు/మానవి అనుభవిస్తోన్న అశాంతినీ, అలజడినీ, ఆందోళననీ, అభద్రతనీ పాపినేని తన కథల్లో ప్రముఖంగా చర్చకు పెట్టాడు. అంతే కాదు; పరాయీకరణ కారణాల్ని అన్వేషించి దుఃఖ మూలాల్ని సైతం బహిర్గతం చేస్తున్నాడు. జీవితాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆదర్శవంతంగా ప్రయోజనోద్దిష్టంగా గడపాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాడు.

మార్క్స్ చెప్పిన మానవ శ్రమ పరాయీకరణ దగ్గర్నుంచి ఇవ్వాళ మనిషి సమస్త అస్తిత్వాల్నీ రూపుమాపి దేశాల్ని సైతం మాయం చేసున్న ప్రపంచీకరణ వికృత శిశు ప్రసవం దాకా అనేక సామాజికాంశాలు పాపినేని కథలకు వస్తువులయ్యాయి. అయితే అవేవీ వూహాజనితాలు కావు. రచయిత ‘బాహ్యాంతర అనుభవాల పరిధిలోకి వచ్చిన’వే. రచయిత స్వీయ అనుభవాలకు తాను నేర్చిన సామాజిక తత్త్వ శాస్త్రాల సారాన్ని జోడించడం వల్ల, ప్రకృతితో విడదీయరాని మనిషిని కేంద్రం చేసుకొని వాటికి సృజనాత్మక రూపం యివ్వడం వల్ల ఆయన తన కథలకి విశ్వసనీయతనీ ప్రామాణికతనీ సాధించగలిగాడు. తన ‘మనస్సు మీద చిక్కగా అల్లుకుపోయిన మానవతా వాదం, బౌద్ధం, మార్క్సిజం, అస్తిత్వ వాదం, ఎరిక్ ఫ్రాం ఆలోచనధారల నీడలు విడివిడిగా’ కలివిడిగా పాపినేని కథల్లో సాక్షాత్కరిస్తాయి. అలా అన్జెప్పి కథల్లో అవసరానికి మించిన సైద్ధాంతిక ప్రమేయం వుండదు. సమస్యలకి అసంబద్ధమైన, కాల్పనికమైన, అవాస్తవికమైన పరిష్కారాలుండవు. సందేశాలుండవు. రచయిత ఆత్మ నిమగ్నం కాని అసహజమైన ఆదర్శాలూ, ఆచరణకి వీలుగాని ప్రతిపాదనలు వుండవు.

‘రచన నాకేదో వ్యాపకం కాదు. ఒక రకంగా అది నా జీవిత సమస్య. జీవిత ప్రక్షాళన కూడా. ఒక కథో, కవితో నేను రాస్తున్నానంటే అది నా లోపలి పొరల్ని తవ్వి, శోధించి, నా సంస్కారాన్ని, జ్ఞానాన్ని పరీక్షించి, నా అల్పత్వాన్ని క్షమిస్తూ ఉన్నతంగా రూపొందుతుంది. నాకన్నా నా సాహిత్యం ఎత్తెక్కువ. అది నా ఆత్మోన్నతికి నేనెన్నుకొన్న సాధనం.’ యీ మాటలు శివశంకర్ స్వీయ రచనా వ్యాసంగం గురించి చెప్పుకొన్నప్పటికీ స్థూలంగా సాహిత్య ప్రయోజనానిక్కూడా అన్వయిస్తాయి. పాపినేని కథలు చదవడం అంటే మన లోపలి పొరల్ని తవ్వి శోధించుకొని వుదాత్తమైన సంస్కారాన్నీ, ఆచరణాత్మక జ్ఞానాన్నీ పెంపొందించుకోవడమే. పాఠకులుగా మనం రచయిత సృజించిన/గుర్తించిన కథల్లోని పాత్రల్తో యెక్కడో వొకచోట యేదో వొక రూపంలో మమేకమవుతాం. అందువల్ల జీవితాన్ని క్షాళన చేసుకొని ఆత్మోన్నతిని సాధించుకోడానికి అతని కథలు యెంతగానో దోహదం చేస్తాయి.

మనిషి జీవితాన్ని దుఃఖభాజనం గావించే కోరికల్ని పెంచుకోవడం, కోరుకొన్నది దొరక్క అశాంతికి గురికావడం, కోరుకున్నవన్నీ వున్నా జీవన సౌందర్యాన్ని ఆస్వాదించలేకపోవడం, అవసరానికి మించి సంపద పోగేసుకోవాలని వెంపర్లాడటం, కలిగి వుండడాన్నే జీవన పరమార్థంగా భావించడం, దాన్ని సాధించడం కోసం రాగ ద్వేషాలకు లోనుకావడం, వీటినుండి బయటపడే దారిలేక విలవిల్లాడడం … యిలా మనిషిలోని బలహీనతలు వ్యక్తికీ సమాజానికీ కీడు చేస్తోన్న వైనాన్ని యీ కథల్లో బహుముఖీనమైన పాత్రల ద్వారా శివశంకర్ బహిర్గతం చేస్తున్నాడు. సామాజిక జీవిగా సమూహంలో వుండాల్సిన మనుషులు స్వార్థంతో వ్యక్తులుగా విడిపోతున్న సంక్లిష్ట సందర్భాన్ని అతను విమర్శకు పెడుతున్నాడు. మనిషిని సమాజంలోనూ ప్రకృతిలోనూ అవిభాజ్యమైన అంగంగా చూస్తున్నాడు. కథని నెపం చేసుకొని జీవితానికి చెందిన అనేక తాత్త్విక కోణాల్ని మన ముందు వుంచుతున్నాడు. ‘కథని తాత్త్విక స్థాయికి తీసుకెళ్లటం’ అతనికిష్టం. అయితే నిజ జీవితంలో యెదురయ్యే వ్యక్తుల్నీ, సంఘటనల్నీ కథలోకి తీసుకురావడంలో సౌందర్య దృష్టిని వదులుకోలేదు. కథకి సంబంధించిన కళా విలువల విషయంలో యెక్కడా రాజీ పడలేదు. కేవలం వస్తుబలంతో సిద్ధాంతాలతో కథలు నిలబడవని అతనికి తెలుసు. అదే సందర్భంలో సిద్ధాంత రాహిత్యం విశృంఖలతకి దారితీస్తుందని అతను నమ్ముతాడు. ‘విలక్షణమైన వస్తువును అంతే విలక్షణమైన శిల్పంతో ఆవిష్కరించగలిగినప్పుడే గొప్ప కథ రూపొందుతుంద’ని శివశంకర్ అభిప్రాయం. కానీ యెక్కడా పనిగట్టుకొని ప్రయోజన రహితమైన ప్రయోగాలకు పూనుకోలేదు. వస్తువుని మింగేసే శిల్ప నిర్మాణం కోసం వెంపర్లాడలేదు. నూతనత్వం కోసం వైవిధ్యం కోసం ప్రయత్నించాడు తప్ప హద్దులు మీరి వాటి కోసం పాకులాడలేదు. ప్రతిపాదించదల్చుకొన్న వస్తువు అంతర్గత శిల్పంలో వొదిగిపోతుంది. అందువల్ల అతని కథల్లో కళ్ళు మిరుమిట్లు గొల్పే శిల్పం వుండదు. వస్తువుని వున్నతీకరించడానికి మాత్రమే శిల్పం పనిముట్టుగా తోడ్పడుతుంది.

భిన్న అస్తిత్వాలతో, అనేక వైరుధ్యాలతో నిండిన వ్యక్తుల మధ్య – లోపల చోటుచేసుకొనే సంఘర్షణకి మూలాల్ని కథలో యిమడ్చడానికీ, సామాజిక పరిణామాల వెనక వుండే దృశ్యాదృశ్య శక్తుల్ని ఆవిష్కరించడానికీ, ఆధునికత యెప్పటికప్పుడు ద్రవ స్థితిలో వుంటూ భౌతిక – మానసిక సంక్లిష్టతలకి కారణమౌతోన్న విషమ పరిస్థితిని వర్ణించడానికీ, ఆచరణలో వైయక్తిక – సామాజిక వైఫల్యాల్ని అధిగమించడానికి అవసరమయ్యే దార్శనికతని ప్రతిపాదించడానికీ సందర్భోచితమైన, అవసరానుగుణమైన శిల్ప రీతుల్ని స్వీకరించడం వల్ల శివశంకర్ కథలు పాఠకుణ్ణి గందరగోళానికీ, తబ్బిబ్బుకీ గురి చేయవు. అందువల్ల కథల్లో జీవన తాత్త్వికతని వ్యాఖ్యానించే బరువైన, సంక్లిష్టమైన అంశాలు సైతం సరళమై పాఠకుల మనస్సుల్లోకి తేటగా సూటిగా చొచ్చుకుపోతాయి. అడుగడుగునా ఆలోచనల్ని ప్రేరేపిస్తాయి. బుర్రకి మంచి పదునుపెడతాయి. ఎద లోతుల్లో బలమైన ముద్ర వేయగల్గుతాయి. పదికాలాలు గుర్తుండిపోతాయి.

అలా గుర్తుండిపోడానికి పాపినేని ప్రతి కథనీ బహుముఖీనంగా తీర్చిదిద్దాడు. భూమికీ మనిషికీ మధ్య వున్న ఆత్మిక సంబంధాన్ని విప్పి చెప్పే ‘మట్టిగుండె’ , ఆసుపత్రిని నెపం చేసుకొని రోగ గ్రస్తమైన వ్యవస్థలోని దుర్గంధాన్ని బహిత్గత చేసిన ‘హింస రచన’, సర్వ ప్రాణి ప్రేమతో నిండిన మైత్రీ తత్త్వం మాత్రమే లుప్తమౌతోన్న మానవీయ సంవేదనల్ని – సున్నితత్వాలనీ కాపాడగలదని ప్రతిపాదిందే ‘వస్తుప్రపంచంలో’, సంపాదనకి బానిసలై జీవితాన్ని జయిస్తున్నామన్న భ్రమలో కూరుకుపోయి క్షణిక సుఖాలకోసం జీవితాల్ని నాశనం చేసుకొంటున్న ఆధునిక యువత ఆర్తిని దృశ్యమానం చేసిన ‘వర్చ్యుయల్ రియాలిటీ’, డాలర్ వేటలో యెండమావుల వెంట పరుగెత్తే క్రమంలో కోల్పోతున్న విలువలపై – మానవ సంబంధాలపై దృష్టి సారించిన ‘ఒక్క వాన కోసం’, విధ్వంసమోతోన్న రైతు జీవితంలోని సంఘర్షణని రాజకీయార్థిక అంశాలతో ముడిపెట్టిన ‘చింతల తోపు’, నగర జీవితంలో పరాయీకరణకు గురైన మనిషి ప్రకృతితో మమేకమైనపుడు మాత్రమే స్వీయ అస్తిత్వాన్ని నిలుపుకోగలడని నిరూపించే ‘సగం తెరచిన తలుపు’, జ్ఞానానికి వారసుల్లేకపోయారని ఆవేదన చెందే మేధావి అంతర్మథనాన్ని ఆవిష్కరించే ‘సముద్రం’ … యీ కథలన్నీ కేవలం వొక సామాజికాంశానికో మానసిక సంఘర్షణకో పరిమితం కావు. స్వీకరించిన వస్తువూ తదనుగుణమైన శిల్పమూ పరస్పర పూరకాలై కథని దీప్తిమంతం చేస్తాయి. చివరికి కథ జీవితానికి దారిదీపమౌతుంది.

వాదాల కోసమో, వుద్యమాల కోసమో శివశంకర్ తనవికాని రచనలు చెయ్యలేదు. అలా అని సమకాలీన వుద్యమాలతో అలీనంగా కూడా వుండలేదు. మనిషినీ ప్రకృతినీ కేంద్రం చేసుకొన్న అన్ని వుద్యమాలకీ వాదాలకీ అతని హృదయం ప్రతిస్పందించింది. జీవపర్యావరణాన్ని దెబ్బతీస్తోన్న నాగరికతని సూటిగా తిరస్కరించిన ‘చివరి పిచ్చిక’ , రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యమే కాళ్ళకింది నేలని మాయం చేసి మనిషి జీవించే హక్కుని సైతం హరిస్తోన్న ప్రత్యేక ఆర్ధిక మండళ్ళని వ్యంగ్యంగా వ్యతిరేకించిన ‘మాయాబిల రహస్యం’ కథల్ని అందువల్లే అతను ‘ఆత్మని నిమగ్నం’ చేసి రాయగలిగాడు. ఆ రెండు కథలూ దాపరికాలకి తావులేకుండా రచయిత రాజకీయ తాత్త్విక దృక్పథాల్ని స్పష్టం చేస్తాయి.

శివశంకర్ కథల్లో అస్తిత్వకాంక్షతో మూలాల కోసం వెతుకులాడే మనిషి వ్యక్తి కాదు; సామాజికుడు. అంతరంగాన్ని శాసించే బాహిర కారణాల్ని పట్టించుకోని వ్యక్తివాదం అతని కథల్లో కన్పించదు. వ్యక్తుల జీవితాల్ని శాసించే శక్తుల్ని పట్టుకోవడంలో రచయితగా తనదైన ప్రాపంచిక దృక్పథాన్ని కల్గి వుండడం పాపినేనికెంతో తోడ్పడింది. అందువల్ల వైయక్తిక వేదనకీ సామాజిక సంవేదనకీ మధ్య వున్న సంబంధాన్ని అతను గతితార్కికంగా నిర్దుష్టంగా అంచనా వేయగలిగాడు. స్వీకరించిన వస్తువు లోతుల్లోకి వెళ్లి పొరలు పొరలుగా విడమర్చి నిజాల్ని నిక్కచ్చిగా ప్రత్యక్షం చేయగలిగాడు. సమాజంలో వస్తున్న మార్పులు వ్యక్తుల ఆచరణపైనా, ఆలోచనా విధానంపైనా యెటువంటి ప్రభావాన్ని చూపగాలవో భిన్నకోణాల నుంచి విశ్లేషించగలిగాడు. ఆ విశ్లేషణ మనిషికి వెలి చూపునీ లోచూపునీ అందిస్తుంది – మనిషికీ సమాజానికీ ప్రకృతికీ మధ్య వుండాల్సిన భౌతిక ఆత్మిక సమన్వయాన్ని బోధపరుస్తుంది –మానవ దూరాల్ని అధిగమించేలా చేస్తుంది – అంతిమంగా మానవ జీవిత సారాన్ని ఆవిష్కరిస్తుంది – జీవితాన్ని వెలుగుల ప్రస్థానం చేస్తుంది. అందుకే శివశంకర్ తన తరంలో విశిష్ట రచయితగా మన్నన పొందాడు – యీ తరానికీ ప్రాసంగికంగా వున్నాడు.

జీవితం పట్ల ప్రేమనీ, సంక్షోభానికి గురౌతోన్న మనిషి మనుగడ పట్ల ఆర్తినీ, మానవీయ సంవేదనలపట్ల అనుకంపనీ, మంది శ్రేయస్సు పట్ల నిబద్ధతని పెంపొందించేవీ – పెరిగిపోతున్న మానవ దూరాల్ని తుడిచేసి మనుషుల మధ్య సౌహార్ద భావననీ, సౌభ్రాత్రాన్నీ నింపగలిగేవీ – జీవితాన్ని సార్థకం చేయగల వుదాత్తమైన సంస్కారాన్ని అందించేవీ – హృదయాన్ని తాకి లోపలి సున్నితత్వాల్ని తట్టిలేపేవీ – మానవావరణంలో వెల్లివిరియాల్సిన ప్రేమ కరుణ వంటి సార్వకాలీన విలువల్ని ప్రతిపాదించేవీ మంచి కథలు అనుకొన్నప్పుడు అటువంటి మంచి కథల్ని పదింటిని శివశంకర్ రచనలనుంచి యెంపిక చేసి కథా స్రవంతి ద్వారా యీ తరం కోసం అందిస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఇవి పాపినేని సాహిత్య వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ప్రాతినిధ్య కథలని నా నమ్మకం.

ఈ పది కథలూ వస్తు స్వీకరణలోని వివిధతకీ, శిల్ప నిర్మితిలోని విన్నాణానికీ, రచయిత ప్రాపంచిక దృక్పథానికీ వెరసి పాపినేని కథా రచన నైపుణ్యానికీ తార్కాణంగా నిలుస్తాయి. మనిషి ఆచరించాల్సిన వైయక్తిక విలువల గురించి, అనుసరించాల్సిన సామాజిక నీతి గురించి, పెంచుకోవాల్సిన సంస్కారం గురించి, మాయమౌతోన్న బాల్యాల గురించి, లుప్తమౌతోన్న సున్నితత్వాల గురించి, కాపాడుకోవాల్సిన ప్రేమానుబంధాల గురించి, మితిమీరిన స్వార్థాల గురించి, క్షాళనం చేసుకోవాల్సిన కల్మషాల గురించి, పెచ్చుపెరిగి పోతోన్న వస్తు వినిమయ వ్యామోహాల గురించి, అవినీతి వంతెనల మీద అధికారం అందలాలెక్కి వూరేగుతోన్న రాజకీయాల గురించి, సాధించుకోవాల్సిన స్వేచ్ఛ గురించి, ధ్వంసం చేయాల్సిన వ్యాపార సంస్కృతి గురించి, నిర్మించుకోవాల్సిన జీవన స్థైర్యం గురించి … యిలా మన చుట్టూ వున్న సామాజిక వాతావరణం గురించి – లోపలి వుక్కపోత గురించి లోతుగా వ్యాఖ్యానించి చర్చించిన కథలు యింకా అనేకం వున్నప్పటికీ యివి నా మనసుకి నచ్చిన ఆలోచనలకి దగ్గరగా వున్న కథలు. నచ్చడం యెప్పుడూ సాపేక్షమే.

కవిగా – కథకుడిగా – విమర్శకుడిగా – పరిశోధకుడిగా శివశంకర్ సాహితీ చతుర్ముఖుడు. ప్రాచీనాధునిక వాంగ్మయాన్ని అవలోడనం చేసినవాడు. సంప్రదాయం నుంచి ఆధునికత దాకా నిర్విరామంగా అవిచ్ఛిన్నంగా పయనిస్తోన్న సాహస పథికుడు. ఒక సారాంశం కోసం నిరంతరం అన్వేషిస్తోన్న దార్శనికుడు. అతని కథల్ని చదవడమంటే మనం నడయాడే యీ మట్టి గుండె చప్పుడు వినడమే.

వస్తు శిల్పాల్లో గొప్ప వైవిధ్యంతో కూడిన అపురూపమైన, విశిష్టమన యీ కథలు కేవలం రచయితగా పాపినేని హృదయ స్పందనలు కావు. అస్తిత్వపు పెనుగులాటలో వుక్కిరిబిక్కిరై సమస్త బంధాల నుంచీ బయట పడటానికి సంఘర్షించే వ్యక్తుల, సామూహిక శక్తుల ఆర్తికీ ఆవేదనకీ ప్రతిరూపాలు. పరాయీకరణకి బలైన సామాజిక జీవులు పెడుతోన్న కేకలకు ప్రతిధ్వనులు. మనసు పెట్టి చూడగల వినగల సత్తా వుంటే లోపలి పేజీల్లోకి వెళ్లి విముక్తి మార్గాలు వెతుకుదాం పదండి.

You Might Also Like

2 Comments

  1. ఎ కె ప్రభాకర్

    థాంక్యూ శ్రీధర్!

  2. Veldandi Sridhar

    Papineni Kathalu chadavadam ante nadyadutunna matti gunde chappudu vinadme. Naakistamaina Kathkullo Dr. Papineni garu kuda okaru. Naakistamaina vimarsakullo Dr. A. K. Parabhakar gaaru okaru. Papineni Kathalloni tatvikathani chaalaa bagaaa vislesincharu. Kathalni raktamlo inkinchukunna taruvatha rasina vaakyalu ela untaayo ee essay chadivithe telustundi. ee tharam pathkula kosam chesina maro prayatnaniki swagatham. chaal manchi mundu mata rasina A. K. P. gariki hrudaya poorvaka abhinandanalu..

Leave a Reply