పుస్తకం
All about booksపుస్తకలోకం

April 29, 2015

పుస్తకాలకు, పాఠకులకు మధ్య అనుసంధానమైనది

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్
**********
ఆరువేల పుస్తకాలు.. ఆరేడు నెలలు.. వెయ్యి వికీ వ్యాసాలు.. ఒక వ్యక్తి.. కొందరు వాలంటీర్లు ఇదీ క్లుప్తంగా తెవికీలో తొలి తెలుగు ఐఈగ్రాంట్ (IEGrant) ద్వారా నేను చేసిన ఓ ప్రయత్నంలోని ఛాలెంజ్ ఇది. విషయమేంటో పూర్తిగా చెప్పమంటారా! ఇదిగోండి..

డిజిటల్ లైబ్రరీ వాళ్ళేం చేశారు..?

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనేది ఓ ఇ-గ్రంథాలయం. ఈ ప్రయత్నానికి మూలబీజాలు అక్కడ ఉన్నాయ్. భారతీయ భాషల్లోని సాహిత్యాన్ని ఇ-పాఠకులకు అందించేందుకు ప్రభుత్వం ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా అనేక లైబ్రరీలలోని పుస్తకాలను, స్కానింగ్ సెంటర్ ద్వారా స్కాన్ చేయించి వాటిని అంతర్జాలంలో dli.gov.in అనే వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. ఒక లెక్క ప్రకారం దాదాపుగా 24వేల వరకూ తెలుగు పుస్తకాలు ఇందులో ఉన్నాయి. మరొక లెక్కలో ఇంకా ఎక్కువే వుంటాయి. ఇంతకీ ఏదేమైనా వాళ్ళు వేలాది పుస్తకాలు అంతర్జాలంలో పెట్టారు.

మంచిదేగా ఇందులో సమస్య ఏముంది..?

అంటే కరెక్టే. మంచిదే. కానీ వాళ్ళు చాలా పెద్ద సమస్యలే సృష్టించారు. వాటిని లిస్ట్ అవుట్ చేస్తే –

1. పుస్తకాలను పీడీఎఫ్ లుగా పెట్టలేదు. ఒక్కో పేజీ విడివిడి ఫోటో స్కాన్లుగా పెట్టారు. ఏదో మంచి ఉద్దేశమే అయ్యుండొచ్చు కానీ జనాలు చాలా ఇబ్బందిపడతారు అలా ఒక్కోపేజీ దింపుకోవడానికి. అందుకే కొందరు ముందుకువచ్చి వాటిని పేజీలుగా కాకుండా బార్ కోడ్ ఎంటర్ చేస్తే పుస్తకం పుస్తకం పళంగా దింపుకునే వీలుగా సాఫ్ట్ వేర్లు తయారుచేసి వెబ్సైట్లలో పెట్టారు.

2. సామాన్యంగా ఎవరైనా ఏం కావాలన్నా గూగులమ్మనే అడుగుతున్నారు. ఆవిడ జవాబుల్లో మన ఈ వెబ్సైట్ రాదు. ఎందుకంటే మీరు తెలుగు పుస్తకాలు తెలుగులో వెతుక్కునే పళమైతే వీళ్ళు వివరాలేవీ తెలుగు అక్షరాల్లో పెట్టలేదు, ఆంగ్ల భాషలో లిప్యంతరీకరణ (అదేలెండి transliteration) చేసి పెట్టారు. సర్లేవో ఇంగ్లీషు అక్షరాల్లో రాసుకుని వెతుక్కుంటాం అంటారా అలాగూ కుదరదు. ఎందుకంటే సుబ్రహ్మణ్య అన్న పదం subrahmand-ya అనీ, మామిడిపూడి అన్న పదం maamid’ipuu”di అనీ వుంటుంది కాబట్టి గూగులే కాదు ఏదీ మీకే సాయం చేయలేదు.

3. పుస్తకాలను కాటగిరీల కింద వర్గీకరించిన పద్ధతి కూడా చాలా చిరాకు తెప్పిస్తుంది. ఉదాహరణకు ఆ పుస్తకం నాటకం అనుకోండి వర్గీకరణలో నాటకం అని రాస్తే వీలుగా ఉంటుంది. కానీ LANGUAGE. LINGUISTICS. LITERATURE అంటే దానికి ఏమిటి అర్థం? ఇవే మూడుముక్కలు దాదాపుగా చాలావాటికి ఓ పద్ధతి లేకుండా ఉంటాయి.

4. ఇక తెలుగు పుస్తకాల కిందకు బెంగాలీ, ఒడియా, తమిళ్, మలయాళం చివరాఖరికి సింహళ కూడా వచ్చేసిన సందర్భాలున్నాయి. అంటే తెలుగు అన్న పేరు పెట్టినా లోపల ఇవి ఉంటాయన్నమాట.

5. ఉదాహరణకు పుస్తకం పేరున్న మొదటి పేజీ చిరిగిపోయి రెండవపేజీ ఉందనుకోండి. ఆ పేజీలో అంకితం-పలానా రాజు అనివుంటే పుస్తకం పేరు అంకితం అనీ, రచయిత పలానా రాజు గారని ఇచ్చేశారు వివరాల్లో.

మొత్తానికి పుస్తకం తెరిచి చూసేదాకా ఏముందో ఏ గారెంటీ లేదన్నమాట.

పరిష్కారం ఏమిటి…?
పుస్తకం తెరిచి చూస్తే గానీ ఏమీ తెలియదు అన్నాము కదా తెరిచి చూడడమే పరిష్కారం అని నిర్ణయించుకున్నాం. ఆరువేల పుస్తకాలను తెరచి, వాటిలోని వివరాలు చూసి, పుస్తకం పేరు-లింకు-రచయిత/సంపాదకుని పేరు-వర్గీకరణ-క్లుప్త వివరణ-డీఎల్ఐ బార్ కోడ్-పుస్తకం ప్రచురితమైన తేదీ అనే వివరాలతో తెలుగు యూనీకోడ్ లో కాటలాగ్ తయారుచేసి వికీపీడియాలోనూ, మరికొన్ని ఇతర అంతర్జాల వేదికల్లోనూ ప్రచురించాలని ప్రణాళిక వేశాను. ఈ పుస్తకాలు వికీపీడియన్లకు అందుబాటులోకి రావడం వల్ల తెలుగు వికిపీడియాలోని పలు వ్యాసాలలో ఈ పుస్తకాల్లోని సమాచారం ఆధారంగా అభివృద్ధి అయ్యి తెవికీ నాణ్యత పెరుగుతుందనేది మరో ఆలోచన. అందుకే ఈ ప్రతిపాదనను సరిగ్గా సంవత్సరం క్రితం వికీమీడియా ఫౌండేషన్ వారి ముందుంచి తెలుగు వికీపీడియా అభివృద్ధికి మొట్టమొదటి ఐఈగ్రాంట్ సాధించిన వ్యక్తిగా ఈ ప్రయాణం మొదలుపెట్టాను.

విధానాలు-పద్ధతులు

ఈ కార్యప్రణాళికలో అనుసరించిన ముఖ్యమైన విధానాలు రెండు:

1. తెలుగు వికీ సముదాయాన్ని అన్ని విధాలుగానూ ఈ ప్రయత్నంలో భాగస్వాములు చేయాలన్నది ఒకటి. ముఖ్యమైన నిర్ణయాలు, ప్రాజెక్టులోని పలు మార్పుచేర్పులు, ప్రయత్నాలు వంటివన్నీ వీలున్నంతమంది తెలుగు వికీపీడియన్ల చొరవతోనే సాగింది. ఒక్కడినే చేయాలన్నది కాక అందరినీ కలుపుకుపోవాలన్నది ప్రయత్నం.

2. మొదట వేసుకున్న వేసుకున్న ప్రణాళిక ఏమీ పవిత్ర గ్రంథం కాదన్న స్పృహ రెండో విధానం. అంటే ప్రణాళిక స్ఫూర్తిని, లక్ష్యాన్ని అలాగే వుంచుతాం, కానీ ఎంతైనా కీబోర్డు మీద వేసుకున్న లెక్కలు నిజంగా పనిలోకి వచ్చేసరికి చెల్లకపోవచ్చు, పోవచ్చేమిటి చాలావరకూ చెల్లవు. అందుకని వేసుకున్న ప్రణాళికలో అవసరమైనంత మేరకు మార్పులు చేసుకున్నాం.

ఈ ప్రణాళికను అమల్లో పెట్టేప్పుడు వేసిన అడుగులు ఇవి:

* డీఎల్ఐ పుస్తకాల కాటలాగు తయారుచేయడం:
– డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా – అన్న పేరుతో మొదలయ్యే పేజీలు తెలుగు వికీపీడియాలో అకారాది క్రమంలో అ నుంచి చివరి అక్షరం వరకూ సృష్టించాం. ఇవిగోండి ఆ పేజీలు.

– ఆ పేజీల్లో టేబుల్స్ చేర్చి వాటిలో పుస్తకం-లింక్, రచయిత/సంపాదకుడు, కాటగిరీ, పుస్తకం డిస్క్రిప్షన్, డీఎల్ఐ బార్ కోడ్, ప్రచురణ సంవత్సరం వంటి వివరాలతో సహా ఒక్కో పుస్తకాన్నీ చేర్చుకుంటూ పోయాము.

– డీఎల్ఐ పుస్తకాలు జెపిజి ఫార్మాట్ లో ఉంటాయని చెప్పుకున్నాం కదా. ప్రాజెక్టులో కృషిచేసే వాలంటీర్లు ఒక్కో పేజీ డౌన్లోడ్ చేసుకుంటూ పుస్తకాన్ని అవగాహన చేసుకోవడానికి సరిపోయేన్ని పేజీలో తెరిచి, కావాల్సిన సమాచారం కోసం చదివి నిర్థారించుకుని వాటి వివరాలు పట్టికలో చేర్చారు.(భవిష్యత్తులోనూ కొనసాగుతుందండోయ్)

– పై వివరాలు చేర్చేందుకు డీఎల్ఐ వాళ్ళు అందించిన ఉడికీ ఉడకని సమాచారంపై మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆధారపడలేదు. పుస్తకాన్నే నమ్మాము తప్ప మెటాడేటా నమ్మలేదు. అది పాలసీ.

* తెలుగు వికీప్రాజెక్టులకు కాటలాగును ఉపయోగించుకోవడం

– కాటలాగులో చేరుతున్న వందలు, వేలు పుస్తకాలు వినియోగపడుతున్నాయని తెలిసినప్పుడే కృషికి సార్థకత అందుకే ఈ పుస్తకాలను ఉపయోగించి తెవికీలోని పేజీలను అభివృద్ధి చేయడం చేశాం.

– తెలుగు వికీపీడయన్లలో వేర్వేరు ఆసక్తి కలిగిన వాలంటీర్లు డాక్టర్ అంగజాల రాజశేఖర్, స్వరలాసిక(కోడిహళ్ళి మురళీమోహన్), మీనా గాయత్రి, నేను, ఇంకా మరికొందరు ఈ పుస్తకాలు ఉపయోగించి తెవికీలో కొత్తగా 100కు పైగా వ్యాసాలు తయారుచేశాము. ఆయా పుస్తకాలను సోర్సులుగా అందించి 1000కి పైగా ఉన్నవ్యాసాలను అభివృద్ధి చేశాము (వికీపీడియాలో వ్యాసాన్ని సృష్టించాకా వాటిని ఎవరైనా అభివృద్ధి చేస్తారు, దాన్నే వికీ పద్ధతిలో అభివృద్ధి చేయడం అంటారు. ఉదాహరణకు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి వ్యాసం మొదట్లో ఇలావుండేది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇప్పుడు ఇంత అయ్యింది. అరడజను మంది వికీపీడియన్లైనా దాన్ని అభివృధ్ధి చేయడంలో చేయివేసి వుంటారు. ఇంకా అభివృద్ధి చెందవచ్చను కూడా. అదీ సంగతి)

– ఈ క్రమంలో కొన్ని థీమ్స్ తయారుచేసుకుని ఆ కృషి చేశాము. అటువంటి వాటిలో కొన్ని:
a) తెలుగులో తొలి యాత్రాచరిత్ర గ్రంథంగా ప్రసిద్ధికెక్కిన రచన ఏనుగుల వీరాస్వామయ్య గారు రాసిన కాశీయాత్రాచరిత్ర. వీరాస్వామయ్య గారు 1830-31ల్లో బళ్ళలో, పడవల్లో, పల్లకీల్లో మజిలీలు వేసుకుంటూ చేసిన కాశీయాత్రను వర్ణించారు. ఆయన వెళ్ళడం ఇటు నేటి చిత్తూరు, కర్నూలు, కడప, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి మీదుగా ఆదిలాబాద్, అటుపై నాగపూర్, అలా త్రివేణీ సంగమం వెళ్ళి, అటుపై కాశీ చేరుకున్నారు. వచ్చేప్పుడు ఇటు కలకత్తా, పూరీ, గంజాం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు పశ్చిమ గోదావరి నుంచి తూర్పు తీరం వైపుగా చెన్నై చేరుకున్నారు. అంటే ‘‘రౌండ్ ట్రిప్’’ అన్నమాట. ఈ దారిలోని చిన్న చిన్న మజిలీ గ్రామాలు మొదలుకొని మజిలీ కూడా వెయ్యని దార్లో కనిపించిన ఊళ్ళు సహా అనేక గ్రామాల గురించి, నాటి రాజకీయ సాంఘిక స్థితిగతుల గురించి రాశారు. దీన్ని ఉపయోగించి తెలుగు వికీపీడియాలో చిత్తూరు నుంచి ఆదిలాబాద్ వరకూ ప్రస్తుతం ఉన్న గ్రామాల్లో పేరుమార్పులు సహా పరిశీలించి ఆయన ప్రస్తావించిన గ్రామాలన్నిటిలోనూ ఆయన చెప్పిన నాటి విశేషాలు గ్రామచరిత్రలో చేర్చి దీన్ని ఆధారంగా ఇచ్చాను. ఆ ఊళ్ళపేర్లు గుర్తుపట్టడం చాలా కష్టమైనంత దాకా మారిపోయాయి. కానీ ఆయన మజిలీ వేసినకా వెళ్ళివుండే దారిని గూగుల్ మాప్ ద్వారా పట్టుకుని ఈ మార్పుచేర్పులు చేశాను. దాని గురించి వివరంగా మరో పెద్ద వ్యాసమే రాయాల్సివుంది. ఎప్పుడైనా తర్వాత రాస్తాను.

b) ఇందులో దొరికిన కాశీయాత్రచరిత్ర, కథలు గాథలు పుస్తకాలు వాడి కర్నూలు నవాబుల చరిత్రను వికీకెక్కించాను. కర్నూలు నవాబుల్లో ప్రతివారికి విడిగా వికీ పేజీ తయారుచేసి, అభివృద్ధి చేసి, ఉమ్మడిగా కర్నూలు నవాబులు అని తయారుచేసిన పేజీలు మొత్తంగా వారి పాలన, చరిత్ర వంటివన్నీ రాసి ఓ రౌండ్ ఎబౌట్ కృషి చేశాను. ఇందులోని ఏడు వ్యాసాలే అయినా అన్నిటినీ పెద్దవ్యాసాలుగా, ఆధారాలున్న నాణ్యమైన వ్యాసాలుగా పై పుస్తకాలు వాడి చేయగలిగాను.

c) విశ్వనాథ సత్యనారాయణ గురించి అనేక విమర్శ గ్రంథాలు దొరకడమూ, ఆయన 120వ జయంతి కావడమూ అన్న కారణాలతో ఆయన గురించి వున్న సమాచారాన్ని వీలున్నంత ప్రామాణికంగా, సమగ్రంగా అభివృద్ధి చేశాను. ప్రతి లైనుకూ రిఫరెన్సు ఇచ్చేలాంటి కృషి ఆయా వ్యాసాల్లో జరిగింది.

d) స్వరలాసిక అనే పేరిట మార్పులుచేసే కోడిహళ్ళి మురళీమోహన్ గారు గతంలో విద్వాన్ విశ్వం వంటి రచయిత గురించి ప్రత్యేక సంచిక వెలువరించిన వ్యక్తి. ఆయన తెవికీలో ఈ ప్రాజెక్టులో దొరికిన పుస్తకాలు ఉపయోగించుకుని సాహిత్య పరమైన వ్యాసాల్లో కృషిచేశారు. ఆయన ఆసక్తి అలా అభివృద్ధి చెందుతూ తెవికీలో పత్రికల గురించి ఓ ప్రత్యేకమైన వికీ-ప్రాజెక్టు (అంటే సమగ్రమైన అభివృద్ధి చేసేందుకు ఒక్కో విషయానికి తెవికీపీడియన్లు వేసుకునే ప్రణాళిక కృషి) ప్రారంభించారు. దాని ద్వారా ఎన్నో పత్రికల గురించి వ్యాసాలు అభివృద్ధి చేస్తున్నారు.

e) డాక్టర్ రాజశేఖర్ గారు ఈ ప్రాజెక్టు ద్వారా డీఎల్ఐలో దొరికిన అనేక విలువైన పత్రికల సంచికలు స్వీకరించి వాటిలో కాపీహక్కుల పరిధిలో లేని పత్రికలను తీసుకుని ప్రస్తుతం తెలుగు వికీసోర్సు (స్వేచ్ఛా హక్కులు కల పుస్తకాలుండే ఇ-లైబ్రరీ)లో చేరుస్తున్నారు. ఆ క్రమంలో పుస్తకరూపంలోకి రాని అనేకమైన విలువైన వ్యాసాలు, ఇతర రచనలు అంతర్జాలంలో తేలికగా అందుబాటులోకి వస్తోంది.

* వికీపీడియన్లను ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేయడం
– ఈ ప్రాజెక్టు జరిగే పరిధి మొత్తంగా స్వచ్ఛంద సేవకుల కృషితోనన్నది గుర్తిస్తే దీనిలోని కాంప్లికేషన్ అర్థమవుతుంది. ఎందుకంటే స్వచ్ఛంద కృషి వాలంటీర్ ఇష్టపూర్వకంగా చేస్తారు. వారిని ఉత్తేజపరిచి చేయించాలి. నిజానికి కాటలాగ్ చేయడం అందరికీ ఆసక్తి ఉండకపోవచ్చు, కానీ పని జరగాలి కదా. అందుకే ఎవరికి ఆసక్తో తెలుసుకుని వారిని కోరి చేయించగలగాలి. ఇప్పటికే వికీపీడియన్లుగా ఉన్నవారిని కదిపి వారికి ఆసక్తికరమైన వ్యాసాలను అభివృద్ధి చేయడంలో ఈ పుస్తకాలేమైనా పనికివస్తాయేమోనన్నది చూడాలి. ఆ క్రమంలో కొన్ని అవగాహన సదస్సులు, ఎడిట్-అ-థాన్స్ (మారథాన్ విన్నారా? దానికి వికీరూపం. అంటే అందరూ పరుగులా కొన్ని వ్యాసాలపై పనిచేయడం అనుకోవచ్చు. ఓ థీమ్ ఉంటుంది దానికి అనుగుణంగా కృషి జరగుతుంది.), శిక్షణ కార్యక్రమాలు వంటివి చేశాము. ఇక్కడ మనం వాలంటీర్లమే కనుక వారితో పనిచేస్తూనే వారిని ఉత్తేజపరిచి ప్రాజెక్టు లక్ష్యాల వైపుగా నడపాల్సివుంటుంది. కానీ అవతలివారి ప్రాధాన్యతలు వారు ఎప్పుడైనా మార్చుకోవచ్చని, ఏ నిమిషమైనా ఈ ప్రాజెక్టు నుంచి వారు వేరే పనిలోకి వెళ్ళిపోవచ్చని అంగీకరించగలిగివుండాలి.

– ఈ కృషిలో భాగంగా తెలుుకున్న విషయమేంటంటే ఏ సభ్యుడైనా ఒక రకం వ్యాసాలమీద పనిచేస్తున్నారనుకోండి, అటువంటి వ్యాసాలు అభివృద్ధి చేేసేందుకు తగ్గ పుస్తకాలు మన డీఎల్ఐలో దొరికితే వారికి ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అలానే ప్రాజెక్టు మీద ఇష్టం పెంచుకుని లోతుగా పనిచేస్తున్న వారున్నారనుకోండి వారికి ఈ పనుల్లో కలుగుతున్న అవసరాలు గుర్తించి వారికి పనికివచ్చే వ్యక్తులతో చిన్న మీట్ లాంటిది ఏర్పాటుచేయడమో, కాంటాక్ట్ పాస్ చేయడమో చేయవచ్చు. అలానే ఇందులో గట్టి కృషి చేస్తున్నవారి మధ్య సమన్వయం కోసం స్కైప్ కాల్స్ వంటివీ ఏర్పాటుచేశాను.

* విస్తృతమైన ప్రచారం కల్పించడం
– ఈ కృషి మీద ఎవరికి ఆసక్తివుందో మనకేమీ తెలియదు. అందుకే వీలున్నంతలో ప్రాజెక్టుకు ప్రచారం కల్పించడం, ఆలోచనను వివరించగలగడం ద్వారా చాలామందికి చేరుతుంది. పైగా ప్రాజెక్టు ఫలితాలు పొందే పరిశోధకులు, పుస్తకప్రియులు కూడా తెలుసుకుని వాడుకోగలుగుతారు.

– ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడే సాక్షి పత్రికలో, ఈటీవీ యువ కార్యక్రమంలో ప్రముఖంగానూ, మరికొన్ని పత్రికల్లో జిల్లా ఎడిషన్ల స్థాయిలోనూ వార్తాకథనాలు ప్రచురితమైనాయి.

– ఫేస్ బుక్లో పుస్తక ప్రియులుండే గ్రూపుల్లో ఈ ప్రాజెక్టు ద్వారా లభించిన అరుదైన పుస్తకాలు లింకులతో చిన్నగా పరిచయం చేయడం వల్ల దీని గురించి కొందరికి తెలిసేలా ప్రయత్నించాము. దీన్ని నారాయణస్వామి గారు, తూలిక మాలతి గారు వంటి మరికొందరు షేర్ చేశారు. అలా ప్రాజెక్టు గురించి తెలుసుకున్న లక్ష్మీదేవి గారు ఈ ప్రాజెక్టు లాంటి దాన్లో పనిచేయడం గొప్ప విషయమని పేర్కొంటూ కాటలాగింగ్ ఇష్టంగా చేశారు. ఫలానా డీఎల్ఐ బుక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అదే పోస్టులో అడిగిన కట్టా శ్రీనివాసరావు గారు తర్వాత్తర్వాత మంచి వికీపీయన్ గా చక్కని వ్యాసాలు అభివృద్ధి చేస్తూ కొనసాగుతున్నారు.

– అంతర్జాతీయ స్వేచ్ఛా సాఫ్ట్ వేర్ కాన్ఫరెన్స్ అయిన స్వతంత్ర-2014లో ఇలాంటి ప్రాజెక్టులు చేయడం వల్ల ఎలా పలు భాషల్లో సమాచారం పెరగడం, పరిశోధకులకు మరిన్ని పుస్తకాలు అందుబాటులోకి రావడం వంటివి సాధ్యపడతాయో అనుభవపూర్వకంగా వివరిస్తూ ప్రెజంటేషన్ ఇచ్చాను. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కృషి చేసిన మీనా గాయత్రి బెంగళూరులో జరిగిన ట్రైన్ ద ట్రైనర్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వివిధ భాషల వికీపీడియన్లకు ఈ ప్రాజెక్టు గురించి వివరించి వారికీ ఇటువంటి ప్రాజెక్టులు తమ భాషల్లో చేయాలనే ఆసక్తి కలిగించింది. అలాంటి ప్రయత్నాలు ఇంకా జరిగినట్టు తెలియదు కానీ భవిష్యత్తులోనైనా ఇటువంటి కృషి మిగిలిన భారతీయ భాషల్లో జరుగుతుందని భావించవచ్చు.

ఫలితాలు

ప్రాజెక్టు ద్వారా 43 కేటలాగ్ పేజీలను 6,010 పుస్తకాలతో (21 మార్చి 2015 నాటికి) అభివృద్ధి చేశాము. వెయ్యి వికీపీడియా వ్యాసాలను తెలుగు వికీపీడియాలో ఈ పుస్తకాల్లోని సమాచారం మూలంగా అభివృద్ధి చేయగలిగాము. వాటిలో 100 వ్యాసాలు కొత్తగా తయారుచేసినవే. వీటిలో తెలుగు గ్రామాలు, తెలుగు సాహిత్యాకారులు మొదలుకొని వివిధ రకాల టపాసుల వరకూ ఎన్నో రకాల వ్యాసాలున్నాయి. కాపీరైట్ ఫ్రీ పుస్తకాలను చేర్చే ఇ-గ్రంథాలయం వికీసోర్సులో దాదాపుగా 150 పుస్తకాల వరకూ (21 ఏప్రిల్ 2015 నాటి మొదటి పేజీ గణాంకాల ప్రకారం) ఉంటే వాటిలో 45 పుస్తకాలు ఈ ప్రాజెక్టు ద్వారా డీఎల్ఐలో దొరికిన పుస్తకాలే కావడం దీని ప్రభావం ఏంటో చెప్తోంది. మొత్తంగా చెప్పుకోవాలంటే తెవికీపీడియా, తెవికీసోర్సుల్లో ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చిన సమాచారం 11,404,222 బైట్లు. ఈ ప్రాజెక్టులో చాలామంది వికీపీడియన్లు, ఇతరులు కృషిచేశారు. వారికోసం ఎడిట్-అ-థాన్లు, అవగాహన సదస్సులు, స్కైప్ కాల్స్, నిపుణులతో మీట్-అప్స్ వంటివి ఏర్పాటుచేశాను.

మీనాగాయత్రి ఈ ప్రాజెక్టుకు ఆయువుపట్టు లాంటి కాటలాగ్ పేజీల్లో అతి ఎక్కువ కృషి చేశారు. దాదాపుగా 4500 వరకూ పుస్తకాలు ఆమె తెరచి చదివి చేర్చారంటే ఆ కృషి ఏమిటో తెలుస్తుంది. మిగిలిన పుస్తకాల్లో అధికభాగం నేను చేర్చాను. ఇక మరో అతిముఖ్యమైనవారు-డాక్టర్ అంగజాల రాజశేఖర్. ఆయన తన వృత్తిలో ఎంతగానో బిజీగా ఉన్నా వికీ ప్రాజెక్టులకు వాలంటరీ కృషి చేయడమన్న యజ్ఞాన్ని త్రికాలాల్లోనూ చేస్తూనేవుంటారు. ఇంకా చెప్పాలంటే వారిలో ఆ అగ్ని చల్లారనే చల్లారదు. ఆయన ఈ ప్రాజెక్టులో అన్నిటా కృషిచేశారు. మరీముఖ్యంగా వికీసోర్సులోకి పనికివచ్చే విలువైన కాపీహక్కులు లేని పుస్తకాలు ఎంపికచేయడం, వాటిని ఎక్కించడం, వాటికి విషయసూచిక వంటివి చేర్చడం లాంటి పనున్నీ ఒక్కరే చక్కబెట్టారు. అలానే కాటలాగ్ తయారీలో కూడా కొంతవరకూ కృషిచేశారు, వ్యాసాల అభివృద్ధిలోనూ కృషిచేశారు. ప్రాజెక్టు గతిని నిర్ణయించే చర్చలు చేయడంలోనూ ముందున్నారు. వ్యాసాలను ఈ పుస్తకాలు వాడి అభివృద్ధి చేయడంలో నేనూ, స్వరలాసికగారూ చాలావరకూ కృషిచేశాము. చివర్లో వైజాసత్య గారు ప్రాజెక్టు పనులు చేపట్టినా అత్యంత విలువైన ఉపకరణాలు తయారుచేసి అందించారు. అలానే కొన్ని పుస్తకాలనూ చేర్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరువేల వరకే పరిధి ఉన్న ఈ ప్రాజెక్టును 23వేల పుస్తకాల వరకూ తీసుకుపోదామని ముందుకువచ్చారు. ప్రాజెక్టులో పాల్గొనేందుకే తెవికీకి వచ్చిన లక్ష్మీదేవి గారు అందించినదొక గొప్ప నైతికోత్తేజం. మొత్తానికి ఇదో సమిష్టి కృషి. నేను చేసినదల్లా ఈ పనుల్లో కొన్నిటికి ముందుండి, కొన్నిటిని పక్కనవుండి, కొన్నిటిని వెనుకవుండి నడిపించడం. చుక్కాని, దిక్సూచి పట్టుకుని ఏ దిశగా పోతున్నామో సరిజూసుకోవడమూను.

ముళ్ళూ-రాళ్ళూ

ఏ బాటైనా పూలబాట కాదు, రాళ్ళూ ముళ్ళూ ఉండనే ఉంటాయి. అలాంటివి చెప్పుకోవాలంటే ముందు ప్రస్తావించాల్సింది డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఇచ్చిన సాంకేతిక సమస్యలు. ఆ సమస్య ఏమిటో కానీ గంటల నుంచి మొదలుపెట్టి వారం పదిరోజుల వరకూ సైట్ తెరుచుకునేది కాదు. దానివల్ల ప్రాజెక్టుపై పనిచేస్తున్న వాలంటీర్లలో ఉత్తేజం పోయి, వారు ఈ కృషి మానుకోవడం మళ్ళీ వారు పనిచేయడానికి ఇంకొన్నాళ్ళు పట్టడం ఇలావుండేది స్థితి. మధ్యలో కొందరు ఇతర ప్రాంతాల వికీపీడియన్లు దీనికి మిర్రరింగ్ సైట్ తయారుచేసి ఆ సైట్ నడిపడం ద్వారా పనిచేసుకుందాం అని ఆలోచించినా, అది నైతికం కాదు కనుక ఎవరికీ మనస్కరించక సమస్య అనుభవించాలనే నిర్ణయించుకుని ముందుకు సాగాం. అందుకే ఆరునెలల్లో పూర్తికావాల్సిన ప్రాజెక్టు మరో మూణ్ణెల్లు సాగింది.

అదృష్టవశాత్తూ జనవరి 2015 నుంచి ఈ సమస్య దాదాపు లేకుండా పోయింది. కనీసం గట్టి ప్రభావం అయనా చూపలేదు. మరో సమస్య వ్యక్తిగతమైన అడ్డంకులు రావడం. ప్రాజెక్టును లీడ్ చేస్తున్న నాతో సహా ప్రతివారూ వేర్వేరు రంగాల్లో పనిచేస్తూ, వేర్వేరు వృత్తులు కలిగినవారు. ఎంత నిశ్చితంగా పనిచేసినా కొన్ని వారాలపాటు ఇటువైపు చూడనివ్వనంత పని వృత్తిజీవితంలో తగులుతూండడంతో కొన్నినాళ్ళు అడ్డంకి అయ్యింది. అయతే దీన్ని పెద్ద సమస్యగా భావించేందుకు లేదు. ఎందుకంటే స్వచ్ఛంద కృషిలో పనిచేసేవారందరూ దీన్ని ఎదుర్కొనేవారే. ముందుగా దీన్ని ఎవరికి వారు ఎక్సెల్ షీట్లలో పనిచేసి అదంతా వికీపీడియాలో చేరుద్దాం అనుకున్నాం. కానీ ఎక్కడెక్కడో ఉండే వాలంటీర్లు ఏం చేస్తున్నారో వికీపీడియాలో పనిచేస్తేనే తెలుస్తుంది. అప్పుడు ఒకరు చేసిన పని మరొకరు చేస్తూ రెండు సార్లు ఒకేపనిచేసే పొరబాట్లు తగ్గిపోతాయి. అందుకే ఈ పనిని తెవికీలోనే చేద్దామని నిర్ణయించుకున్నాం. ముందుగా ప్రణాళికలో వికీపీడియాలోనూ, ఇతర వెబ్సైట్లలోనూ, బ్లాగులోనూ ప్రచురించాలనుకున్నాం. అలా రాసుకున్నాం కూడా. కానీ వికీపీడియా గూగుల్ సెర్చిలో మొదటి స్థానంలో వస్తుంది. అంతేకాక వికీపీడియాలో చేసిన ఈ కృషి అంతా CC BY SA 4.0 అనే ఫ్రీ లైసెన్సులో ప్రచురణ జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ప్రచురించుకోవచ్చు. ఆ మాత్రానికి మళ్ళీ మనమే చేయాల్సిన అవసరం లేదని ఈ పని వదిలేశాం.

ఈ ప్రాజెక్టు ద్వారా జరిగిన పనులివి. ఇది ఇక్కడితో ముగియట్లేదు, దీన్ని డీఎల్ఐలోని అన్ని పుస్తకాలకూ విస్తరిస్తానని తెవికీలోని ముఖ్యులు ముందుకురావడం దీనికి గొప్ప విజయం. ఒక మంచి కృషి చేశానన్న సంతృప్తి దక్కింది, పదిమందితో పనిచేయగల నైపుణ్యం వచ్చింది, తెలుగు భారతి మెళ్ళో ఓ చిన్న దండ వేసిన అదృష్టమూ వరించింది. ఇదీ ఈ ప్రాజెక్టు కథ.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.4 Comments


  1. మీ బోటివారు, ఎంతోమంది ఈ మన తెలుగు – సారస్వతమునకు నిరవధికంగా చేస్తూన్న సేవ అద్భుతమైనది.సర్! – కావ్యకాదంబరి


  2. Sitha mytreyi

    Hats off !


  3. ఈ యజ్ఞంలో పాల్గొంటున్న సహచర మిత్రులందరికీ శుభాభినందనలు.
    వారి నుంచి ఇంకొంచెం ఎక్కువ పని చేసే స్ఫూర్తి కలుగుతున్నది.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

భార్యని వర్ణించిన కవులున్నారు

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ************* కవులేల తమ భార్యను వర్ణించరని ఎల్లేపెద్ది వెంక...
by అతిథి
5

 
 

విశ్వనాథ వారు ఎలా చెప్పారు?

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ******** విశ్వనాథ సత్యనారాయణ గారు నవలలు ఎలా చెప్పారు? అన్...
by అతిథి
17

 
 

సప్తవర్ణాల కరచాలనం

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ****** తెలుగువారిలో ఏ లలిత కళలోనైనా మంచి కళాకారులకులోటు...
by అతిథి
2

 

 

పోలీస్ సాక్షిగా

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్ ************* సాధారణంగా నూటికి ఎనభైమందికి పోలీస్ స్టేషన్ ...
by అతిథి
2

 
 

వెలుగు నీడలు -ముళ్ళపూడి కళ్ళకి కట్టించిన వెండితెర నవల

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్ ************ ముళ్లపూడి వెంకటరమణకు తెలుగువచనం సహజాభరణం. త...
by అతిథి
0

 
 

రెండు దశాబ్దాలు-కథ 1990-2009

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్ *************** నాలాంటివాడికి కథల గురించి చెప్పడం అంత కష్ట...
by అతిథి
5