ప్రతిధ్వనించవలసిన ఒంటిదని – శివరామ్ కారంత్

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
*******
ఈ నాటి సామాజిక చిత్రాన్ని, అందులో ఉన్న భేషజాలను, యశోభిలాషను, వాగ్వైరుధ్యాన్ని, ముసుగుముఖాలను, ధనాశను, సాంఘిక ప్రతిష్ఠాకాంక్షను పరోక్షవ్యంగ్యశైలిలో ఎత్తి చూపించి, మొత్తం వ్యవస్థకూ దాన్ని ఆపాదించకుండా సానుకూల దృక్పథంతో, సహజమైన ఆలోచనాధోరణితో, స్పష్టమైన వాక్సరళితో, “ఒంటిధ్వని” గా ఉన్నామనే నిరాశ లేకుండా సాగేవారూ ఉంటారన్న ఆశావహ దృష్టికోణాన్ని చూపే నవల శివరామ్ కారంత్ గారి “ఒంటి దని”.

శీర్షిక
నవల పేరు ఒంటి దని. అంటే ఒంటి ధ్వని అని అర్థం. ఇదే అర్థం వచ్చే ఆంగ్లనామం ’లోన్ వాయిస్’ అనే పేరుతో జగన్నాథ రాయని సంపాదకత్వంలో ఒక పత్రిక నడుస్తూ ఉంటుంది ఈ నవలలో. మిగిలిన పత్రికల కన్నా భిన్నంగా సహజమైన ఆలోచనా ధోరణితో, కీర్తిప్రతిష్ఠల ప్రాకులాటకు పోని జగన్నాథ రాయడు పత్రిక తనది కాకపోయినా ఎంత సమర్థవంతంగా, గంభీరంగా, హుందాగా సంపాదకునిగా తన వ్యక్తిత్వాన్ని మలచుకుంటాడూ అంటే మిగిలిన పత్రికల సిబ్బందీ, సామాజిక బాధ్యత కలిగినవారూ, స్వార్థమే పరమావధి అనుకునేవారూ అందరూ వీరి లోన్ వాయిస్ పత్రికనూ, వీరినీ కూడా గౌరవిస్తారు.

ఈ వ్యక్తిత్వం వట్టి పటాటోపం కాదు, తన స్వంత జీవితంలో స్నేహితుని తండ్రి కరుణావాత్సల్యాలతో, ధనసహాయంతో చదువుకుని పెరిగి పెద్దయిన జగన్నాథ రాయడు తన స్వార్థాన్ని పక్కనబెట్టి, గతి తప్పిన చెల్లెలి కుటుంబసభ్యుల భవిష్యత్తును నిర్మించడానికే తన సంపాదన మొత్తం వినియోగిస్తాడు. వ్యక్తిగత బాధ్యతతో పాటు సామాజిక బాధ్యతనూ చక్కగా గుర్తెరింగి, అనవసర భేషజాలకూ, ధనికుల భజనా సంస్కృతికీ పోకుండా లోన్ వాయిస్ పత్రిక ప్రత్యేకతను నిలబెట్టడానికే అహర్నిశం శ్రమిస్తాడు. అందుకు తగిన గౌరవాన్నీ సంపాదించుకున్నాడన్నందుకు ఉదాహరణగా ఏ సందిగ్ధత ఉన్నా పరిగెత్తుకొని వచ్చి సంప్రదించే అనంతకృష్ణ, లోన్ వాయిస్ యాజమాన్యం వారసుల వల్ల జగన్నాథ రాయనికి కలగబోయే ఇబ్బంది గురించి చింతించే దీనానాథ్, ఎందరు పత్రికాధిపతులు వచ్చినా లోన్ వాయిస్ పత్రికకు ప్రాధాన్యమిచ్చి స్వయంగా వచ్చి పిలిచే నయనతార మనకు కనిపిస్తారు. ఈ విధంగా అనేకుల దృష్టిలో ప్రత్యేక ప్రతిపత్తి సాధించుకున్న వాయిస్- లోన్ వాయిస్ పత్రిక. ఇదే ఒంటి ధ్వనిని శీర్షిక గా ఒంటి దని అని పెట్టడం ఉచితంగా ఉంది.

రచనా వస్తువు-శైలి
ఇందులో ఉన్న పాత్రలన్నీ అత్యంత సహజంగా నేటిదినము సమాజంలో జీవించే మనుష్యుల ప్రతిరూపాలే. సమాజాన్ని కొత్త ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలతో నవ్యరూపంతో తీర్చిదిద్దాలని ఆరాటపడి విద్యార్థులను, సహచరులను ప్రోత్సహించే డా జయంత్ ఇంట్లో తన భార్య ఆలోచనలనే స్వాగతించలేకపోవడం, తత్ఫలితంగా వారి కాపురంలో ఒత్తిడి పెరిగి చివరకు ఆమె మరణం వరకూ, తదనంతరమూ కూడా తన భావనల నిజమైన అర్థానికి కట్టుబడకపోవడం ఈ విషయాలన్నీ రచయిత ఏమాత్రమూ నేరుగా చెప్పకుండా ఆ పాత్ర ఆలోచనలు, ప్రవర్తన మూలంగా మనకు వ్యంగ్యధోరణిలో పరోక్షంగా తెలిసేలా వ్రాయడం చదువరులకు ఉత్సుకతను కలిగించి ఆసాంతమూ చదివిస్తుంది.

కీర్తికాంక్షతో, ధనాశతో వ్యవహరించి తనలో తప్ప అన్యులందరిలో లోపాలను వెదుకుతూ, నిరూపించాలనే ప్రయత్నంలో నిరంతరమూ ఉంటూ పరుల విజయాలను ఏ మాత్రమూ హర్షించలేని ఇంకో పాత్ర నయనతార. తన బాల్యము గడచిన విదేశాల్లో, అక్కడి సంస్కృతీ సంప్రదాయాల నేపథ్యాలలో తన వ్యక్తిత్వం మొగ్గలు తొడిగినా, భారతీయుడైన తండ్రిని తల్లి మరణానంతరం ఆశ్రయించి, ఇక్కడి నృత్య పరంపరలపై విశేషమైన అభిమానాన్ని పెంచుకొని, కథక్, భరతనాట్యం, మణిపురి నృత్యాలను అభ్యసిస్తుంది. ముంబయి మహాపట్టణంలో పెద్ద ప్రదర్శనను ఏర్పాటు చేసుకున్నప్పుడూ పత్రికల యాజమాన్యాన్ని ఆదరంతో పిలవడం మర్చిపోని ప్రచారాసక్తి గల స్వభావాన్నీ, నృత్యసంప్రదాయాల కన్నా ప్రేక్షకుల ఆకర్షణీయమైన చమత్కారాలపైన ఎక్కువ దృష్టితో తన ప్రతిభకు మెరుగులు దిద్దుకునే తత్వాన్నీ రచయిత చక్కగా ఆవిష్కరించగలిగినారు.

భారత దేశపు నృత్యరీతులను ఇక్కడే ప్రదర్శిస్తే కళలో నిష్ణాతులైన వారిని తానెంత వరకూ మెప్పించగలదో నయనతారకు తెలుసు. విదేశాల్లో భారతీయనాట్యానికి ఉన్న పలుకుబడీ తెలుసు. అక్కడి వారు ఇష్టపడే బృందనృత్యపు రీతులూ తెలుసు. కాబట్టి గురుస్థానంలో ఉన్న నందమహరాజ్ వంటి వారినీ పక్కనబెట్టి విదేశీ రీతులనూ, దేశీ నృత్యాలనూ కలగాపులగం చేసి విదేశ ప్రదర్శనలకై స్వంతంగా నృత్యాంశాలను తయారుచేసుకుంటుంది. విదేశాల్లో ప్రదర్శనలిచ్చి కావలసినంత ధనము సంపాదించుకున్నా, కావలసిన చోట నృత్యపాఠశాల స్థాపించి సకలసౌకర్యాలు సమకూర్చిన నాగిన దాసు వంటి ఆరాధకులున్నా తననుకున్న లక్ష్యాలు అనారోగ్యంవల్ల పూర్తిగాలేదని అసంతృప్తితో రగిలి ఆ విషాన్ని సఫలీకృతులైన ఇతరులపై జల్లే ఆమె స్వభావాన్ని రచయిత అద్దం పట్టి చూపిస్తారు.

వీరివురే కాక కళాభిరుచికీ, దైనందిన వ్యస్తతకూ సమతౌల్యతను సాధించలేక అవస్థపడే అనంతకృష్ణ, సమాజంలో నూతన ఆలోచనాస్రవంతితో కూడిన చర్చావేదికల ఆవశ్యకతను గుర్తించి నిబద్ధతతో పాటుపడే దీనానాథ్, జయంత్ సమయానుకూల విశ్లేషణలను ఖండించడానికే వ్రాసే జానకీనాథ్, భౌతికాకర్షణను, రాజకీయానుకూలతలను దృష్టిలో ఉంచుకొని ఇతరుల అవసరాలను తీర్చడానికి వెనుకాడని నాగినదాసు, డబ్బు కోసమో కీర్తికోసమో నృత్యాభ్యాసపు తీరుతెన్నులను మార్చుకొని రాజీ పడడానికి ఏమాత్రమూ ఇచ్చగించని నందమహారాజ్ దంపతులు- వీరి వ్యక్తిత్వాలు కూడా ఆవిష్కరించడంలో రచయిత సఫలమయినారు.కన్నడ భాషకు చెందిన ప్రముఖ రచయితల్లో జ్ఞానపీఠ పురస్కారం పొందిన వారిలో శివరామ్ కారంత్ పేరు తెలియనివారుండరు.

పాత్ర చిత్రణ
చాలా నవలల్లో ఉన్నట్టు ఈ నవలలో ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం ఉత్థానపతనాలు కాకుండా సమాజపు హెచ్చుతగ్గులను, సామాజికుల (సమాజంలో ఉండేవారు) వైయక్తిక, సామాజిక బాధ్యతలను, బాధ్యతారాహిత్యాలను, వ్యక్తుల ఆలోచనలు, మనోవృత్తులు కాలగతిలో ఎటువంటి సంఘర్షణలకు గురియై, మారుతుంటాయో ఆ సామాజిక చిత్రాన్ని రచయిత ప్రదర్శిస్తారు.

రచయిత తను ఎక్కడా కనిపించకుండా, తన మాటలు గా ఏవీ వినిపించకుండా పాత్రల మనసుల్లో చేరి వారి మనోగతాలను వినిపిస్తుంటారు. కాబట్టి ఎవ్వరి విపరీత చేష్ట గురించీ, అమాయకత్వం గురించీ, ప్రజ్ఞ గురించీ, దుర్మార్గం గురించీ, గుంభనత గురించీ, ఆడంబరం గురించీ, దుర్నడత గురించీ రచయిత వ్యాఖ్యలుగా ఉండవు. వారి వారి కోణాల్లోంచి చూస్తున్నట్టుగా ఉండడంతో పాటు పరోక్ష వ్యంగ్యం తొంగి చూస్తుంటుంది. అందువల్ల హాస్య సన్నివేశాలు అంటూ లేకపోయినా చదువరుల పెదవులపై చిరునవ్వులూ ఒలుకుతుంటాయి.

You Might Also Like

Leave a Reply