Laughter in the dark: Nabokov

నబొకవ్ రాసిన మరో నవల “Laughter in the dark”. పోయన వారం పరిచయం చేసిన నవల గురించి ఏదో చదువుతుంటే, ఈ నవల కనిపించింది. కిండిల్ పుణ్యమా అని డౌన్లోడ్ చేసుకోవటం క్షణాల్లో అయిపోతుంది. చదవటమే తరువాయి. లోలిత, ఇన్విటేషన్ టు బిహెడింగ్ చదివాక,  ఒకట్రెండు రోజుల్లో నబొకొవ్ నవల ఏదైనా ఒకట్రెండు రోజుల్లో చదవచ్చు అంటే నేను నమ్మేదాన్ని కాను. కాని, ఈ నవల బెడ్‌టైమ్ రీడింగ్‌గా చదువుకున్నాను. చదువుతున్నంత సేపూ ఇది నబొకొవ్ నవలేనా? అన్న అనుమానం వచ్చేలా ఉంది రచన. ఆ వివరాలు చూసే ముందు, నవలలోని కథ సంక్షిప్తంగా:

ఆల్బినస్ అనే ఒక మనిషి బెర్లిన్, జర్మనిలో ఉంటుంటాడు. సమాజం లెక్కల్లో అతడు అన్ని విధాల “సక్సెస్” చూసినవాడు. డబ్బుంది. ఇల్లుంది. సంసారముంది. కొద్దో, గొప్పో పలుకుబడి ఉంది. పిల్ల ఉంది. అయినా, వాటన్నింటిని కాళ్ళరాసుకుంటూ, ఓ అమ్మడి వెనుకపడతాడు. కోలుకోలేని విధంగా దెబ్బలు తింటాడు. ఆమె మోసం చేస్తుందని తెలుస్తున్నా, ఆమెనే నమ్ముతాడు. భార్యాపిల్లల నుండి దూరమవుతాడు. కూతురు చనిపోతే,  అంత్యక్రియలకు  కూడా వెళ్ళడు.  తన డబ్బు, పలుకుబడి వాడి ప్రియురాలిని సినిమా రంగానికి పరిచయం చేస్తాడు. ప్రియురాలు తన కనుగప్పి, మాజీ ప్రియునితో తిరుగుతుందని తెలిసి, ఆమెను, అతడిని విడదీయడానికి ఆమెను తీసుకొని రోడ్డు మీద పోతుండగా, ఒక భారీ ప్రమాదంలో తన కళ్ళను పోగొట్టుకుంటాడు. అంధత్వం వల్ల ఆమె మీద పూర్తిగా ఆధారపడతాడు. ఆమె మాత్రం, తన ప్రియునితో ప్రేమాయణం సాగిస్తూనే, మరో పక్క ఇతడికి ఏదో సాయం చేస్తున్నట్టు నటిస్తూ, అతడి డబ్బునంతా సొంతం చేసుకుంటుంది. పేపర్లో ఆక్సిడెంట్ వివరాలు చూసి, బాంక్ నుండి డబ్బులు కూడా బాగా డ్రా అవ్వటం చూసి, అనుమానించి, భార్య తమ్ముడు, అతడుంటున్న చోటకి వెళ్తాడు. అక్కడ ప్రేయసి, ఆమె ప్రియుడు చేస్తున్న మోసం బయటపడుతుంది. ఆల్బినస్ మళ్ళీ తన భార్య దగ్గరకు చేరుకుంటాడు. కొన్నాళ్ళకి ఆ ఊరికి, ప్రేయసి వస్తుంది. ఆమె మీదున్న కసితో ఆమెను చంపడానికని (ఒక్కప్పుడు తాను కొని ఇచ్చిన) ఆమె ఇంటికి వెళ్తాడు. అంధుడైనా, ఆమె కదికలను బట్టి ఆమెను చంపాలని ప్రయత్నిస్తాడు. కానీ, చివరకు ఆమె చేతిలో అతడే బలి అవుతాడు.

ఓ వివాహేతర సంబంధం. దాన్ని నమ్ముకున్నవాళ్ళ పతనం. దాన్ని సొమ్ముచేసుకోవాలనుకున్నవారి పబ్బం. కథ చాలా మామూలుగా అనిపించింది. పైగా నవల ప్రారంభంలోనే, “ఇదీ కథ!” అని రెండు ముక్కల్లో చెప్పేస్తాడు. చెప్పీ, కథ మొత్తం చదివించేలా చేస్తాడు – అది అసలు విషయం. ఇది లిటరల్లీ ఒక పేజ్ టర్నర్. వచనంలోనూ, కథనంలోనూ ఎలాంటి సంక్షిష్టతా ఉండదు, తొంభై శాతం.  పైగా కథల్లోనూ, సినిమాల్లోనూ ఈ సబ్జెక్ట్ చూసే ఉన్నాను గనుక, చాలా వరకూ మలుపులు ముందే అర్థమైపోయాయి. క్లైమాక్స్ తప్పించి, నబొకొవ్ మార్క్ కథనం నాకు ఎక్కువగా కనిపించలేదు. ముఖ్యంగా, మళ్ళీ మళ్ళీ చదివించే వాక్యాలు, పేరాలు చాలా తక్కువ. నబొకొవ్ చెప్తున్నది అర్థం అవుతున్నా, ఆయన చెప్పే విధానం కోసం మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపిస్తుంది. అది ఈ నవలలో చాలా తక్కువగా అనిపించింది.

నబొకొవ్ ఈ నవలను మొదట రష్యన్‌లో రాశారు. దానికి అప్పట్లో ఒక ఆంగ్లానువాదం, కెమరా అబ్‍స్క్యూరా అన్న పేరుతో వెలువడింది. అయితే, ఆ అనువాదం ఏ మాత్రం నచ్చక, నబొకొవ్ మళ్ళీ దీనికి “లాఫ్టర్ ఇన్ ది డార్క్” పేరిట అనువాదం ఆయనే చేసుకున్నాడు. ఆయన మిగితా నవలలో లాగానే, ఈ కథలోనూ ఫ్రెంచి భాష మధ్యమధ్యలో కనిపిస్తుంటుంది. అది పాత్రోచితంగా, సందర్భోచితంగా ఉంటుంది. ఇలాంటి రచనలను ద్విభాషా రచనలని అనలేము గానీ, ప్రధానంగా ఒక భాషలో కథ సాగుతున్నప్పుడు, మరో భాష కనిపించడం, కొందరికి ఇబ్బందిగానూ, అసహనంగానూ ఉంటుంది. అలాంటి వారు, అలాంటి వారిని దృష్టిలో పెట్టుకోగల రచయితలు, పాత్ర, సందర్భంతో పనిలేకుండా వాళ్ళనీ ప్రధాన భాషలో మాట్లాడిస్తారు. తెలుగు సినిమాల్లో విదేశాలలో హోటెల్ యాజమాన్యానికి, సిబ్బందికి కూడా తెలుగు వచ్చినట్టు చూపిస్తారే, అలా! దీనిపై అభిప్రాయబేధాలు ఉండవచ్చునేమో కానీ, రెండూ రెండు విధాలు. ఒకటి విమర్శించదగ్గదైతే, రెండోది కూడా అంతే!

“Death is often the point of life’s joke,” లాంటి కొన్ని లైన్లు అండర్లైన్ చేసుకోదగ్గవి. కథంతా మామూలుగా నడిపించినా, మధ్యమధ్యన నవ్వు పుట్టించే సన్నివేశాలు, నరేటివ్స్ ఉండనే ఉన్నాయి. నబొకొవ్ తాను రాసినవాటిలో ఈ నవలను అత్యంత పేలవమైనదిగా పేర్కొన్నారట. నబొకొవ్ పేరు లేకపోయుంటే నేనూ ఇలాంటి నవలను పూర్తి చేసేదాన్ని కాదు. నబొకొవ్ లాంటి రచయిత మాత్రమే ఇవ్వగల ముగింపు ఉంది. ఒకసారి చదువుకోడానికి బాగుండే పుస్తకం. చదవకపోయినా, పెద్దగా నష్టపోయేది లేదని నాకనిపించిన పుస్తకం.

 

Laughter in the dark
Vladimir Nabokov
Fiction
Vintage
ebook

You Might Also Like

Leave a Reply