నందోరాజా భవిష్యతి – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీ రాధిక
*********
ఇది పురాణవైర గ్రంథమాలలో నాలుగవ నవల. శిశునాగ వంశపు రాజులు పదిమంది. వారిలో చివరివాడు మహానంది. శిశునాగ వంశము 360 ఏండ్లు రాజ్యము చేసింది. తరువాత నందుడు మగధ రాజ్యానికి రాజయ్యాడు. నందుడు మహానందికి శూద్ర స్త్రీ యందు పుట్టిన కొడుకు.

నందుడి మంత్రి రాక్షసుడు. ఆ రాక్షసుడి ప్రతిభ ఎలాంటిదో, అతడు నందుడికి రాజ్యం ఎలా సంపాదించి పెట్టాడో, మగధరాజ్యములో శిశునాగ వంశము పోయి నందవంశము ఎట్లా ఆక్రమించిందో చెప్తారు విశ్వనాథ ఈ నవలలో.

నవలాకాలం నాటికి బౌద్ధమత ప్రభావం బాగా వుంటుంది. (అప్పటికి బుద్ధుడు పుట్టి 200 ఏళ్లయింది. మరణించి 120 ఏళ్ళయింది.) క్షత్రియులందరూ బౌద్ధ మతాభిమానంతో వుంటారు. అయినా మళ్ళీ శూద్రుడైన నందుడిపై ద్వేషంతోనూ, క్షత్రియులే తప్ప శూద్రుడు రాజవకూడదన్న భావంతోనూ వుంటారు. ఆ క్షత్రియుల యొక్క బాధలకు గురైన వారంతా నందుడి పక్షంలో వుండి నందుడు రాజవ్వాలని కోరుకుంటూ వుంటారు. నందుడి ప్రతిష్ట ఒక్క మగధకే పరిమితం కాదు.

అయోధ్యని పాలిస్తున్న ఇక్ష్వాకులు, పాంచాలాన్ని పాలిస్తున్న పాంచాల రాజులు, హస్తిన ప్రాంతం లోని కౌరవులు, ఇంకా హైహయులు (మహిష్మతీ నగరం), కాలకులు, ఏకలింగులు, శూరసేనులు, మైథిలులు మొదలైన క్షత్రియులు పాలిస్తున్న పది రాజ్యాలలోనూ క్షత్రియ దౌర్జన్యం సాగుతూ వుంటుంది.

ఒక్కొక్క రాజ్యం గురించి ఒక్కొక్క అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తారు రచయిత.

మొదటిది రేవా నదీ తీరంలో వున్న మహిష్మతీ రాజ్యం. దానిని హేహయ రాజు అర్జునుడు పాలిస్తూ వుంటాడు. అతడు బ్రాహ్మణ ద్వేషి. ఆ అధ్యాయం ముగిసేసరికి అతనిని ముక్కూ మొహం తెలియని ఒక బ్రాహ్మణ యువకుడు సంహరిస్తాడు.

తర్వాత కౌరవ రాజ్యం. భారత యుద్ధములో కౌరవులందరు నశించారు. ధర్మరాజు రాజయ్యాడు. అంతకు ముందు దుర్యోధనాదులని కౌరవులనీ, యుధిష్టరాదుల్ని పాండవులనీ అన్నా, ధర్మరాజు రాజయినప్పటినుండీ వారే కౌరవులు. ఆ కౌరవ వంశంలో యుధిష్టరుని మనుమడు జనమేజయుడు. అతని కొడుకు శతానీకుడు. ఈ శతానీకుడు తన రాజధానిని హస్తినాపురము నుండి కౌశాంబికి తరలించాడు. ఆ తర్వాత వచ్చిన రాజులు కొన్నాళ్ళు హస్తినలో, కొన్నాళ్ళు కౌశాంబిలో వుంటూ వచ్చారు.

ఈ కథాకాలం నాటి కౌరవరాజు పేరు క్షేమకుడు. క్షేమకుడు కౌశాంబియందు రాజ్యం చేస్తున్నాడు. కౌశాంబీ నగరం ప్రయాగ క్షేత్రమునకు దగ్గర. యమునా నది గంగానదిలో కలవక మున్న కొంత దవ్వున నెగువ నీ కౌశాంబి యున్నది. అచ్చము యమున యొడ్డున లేదు. ప్రయాగ రెండు నదులు కలిసిన చోట వుంటే, కౌశాంబి నదులు కలిసిన ఎగువ పంగలో వుంది.

క్షేమకుని కొడుకు నిరమిత్రుడు. అతడు వైదిక మతానికి వ్యతిరేకి. అతను కూడా మహిష్మతీ రాజు అర్జునుడి లాగా కౌశాంబిని గగ్గోలుకు తెచ్చేవాడే. కానీ తండ్రి క్షేమకుడు అందుకు అడ్డుగా వుంటాడు. వృద్ధుడైన క్షేమకుడు మరణించి తాను రాజయితే తన ప్రతాపం చూపించాలని వేచి వుంటాడు నిరమిత్రుడు.

అతడు గదావిద్య లో ప్రవీణుడు. అతనిని జయించగలవారు ఎవరూ లేరన్న అహంకారం. అందరూ ఆ విషయాన్ని అంగీకరిస్తారు కూడా. అయితే ఎక్కడో హిమవత్పర్వతములో నేపాళ దేశమునకు వెనుక పర్వతములలో ఈ విద్యనభ్యసిస్తున్న ఒక ఆటవికుడు తనని లెక్క చేయడని విని అతడిని జయించాలని బయలుదేరతాడు.

తండ్రితో బదరీ నారయణుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి వెళ్ళి అక్కడ అడవులలో ఆ అనామకుడైన ఆటవికుడితో యుద్ధం చేసి మరణిస్తాడు. ఆ వార్త విని క్షేమకుడూ తక్షణమే ప్రాణం విడుస్తాడు.

తర్వాత పాంచాల రాజ్యం. భారత యుద్ధములో త్రిగర్త కాంభోజాభిసార మద్ర కేకయాధిపతులు వధించబడ్డారు. ఇంచుమించుగా ఆ రాజ్యాలన్నీ పాంచాల దేశంలో కలిశాయి. శకుని వధతో గాంధార దేశం ప్రాబల్యమూ తగ్గిపోయింది. దశార్ణ దేశములు రూపుమాసి పోయాయి. పాంచాలరాజ్యమొక్కటే పెద్ద రాజ్యం. భారత యుద్ధం తర్వాత దృష్టద్యుమ్నుడి వంశం వారు దాన్ని పాలిస్తున్నారు. అయితే ఇన్నాళ్ళ తర్వాత అంటే దాదాపు 1500 ఏళ్ళ తర్వాత బాహ్లిక దేశంలోని నలగిరి అనే జనపదం నుంచి వంశధరుడు అనే వాడు నేను పాంచాల రాజ్యానికి అసలైన వారసుడిని అంటూ వస్తాడు.

దృష్టద్యుమ్నుడు, ద్రౌపది ద్రుపదుడికి పుట్టలేదనీ, అగ్ని లోనుంచి వచ్చారనీ తన పూర్వీకుడు ద్రుపదుడికి ఒక స్త్రీ వలన పుట్టినవాడు కనుక తనకే రాజ్యం దక్కాలనీ అంటాడు. వాడికి ఎక్కడినుండో వత్తాసు దొరుకుతుంది. వాడు సభాభవనంలోకి వచ్చి సవాలు విసిరితే పాంచాల రాజు కత్తి దూసి వాడి మీదకి వెళ్తాడు.

తులాయుద్ధంలో నా సేనాపతిని గెలిస్తే నేను వెళ్ళిపోతానంటూ ఎవరో మహావీరుడిని చూపిస్తాడు వంశధరుడు. రాజు తులా యుద్ధం చేస్తాడు. వధించబడతాడు. వంశధరుడు రాజవుతాడు.

తర్వాత మిథిలా నగరం. దాని రాజు ఉశీనరుడు. వేదవేదాంగాలు చదివినవాడు. జ్ఞాని. ఆయనకు సంతానం లేదు. ఆయన తరువాతి సంగతేమిటన్నది ప్రశ్న.
మరొక పక్కన కొంచెం వెనక్కి వెళ్తే, బుద్ధుని కాలంలో కోసల రాజైన ప్రసేనజిత్తు భార్య శాక్య రాజుల ఆడుబిడ్డ. అతని కొడుకు విదుధవుడు. శాక్య వంశ క్షత్రియులకి బుద్ధుడు తమ వంశంలో పుట్టాడు కనుక తాము అధికులమన్న భావన. ఒకప్పుడు కృష్ణుడిని చూసుకుని యాదవులు గర్వించినట్లు. కనుక వారొకసారి తమ యింటికి వచ్చిన విదుధవుడ్ని అవమానిస్తారు. ఆ కోపంతో అతడు కపిలవస్తు నగరంలోని సర్వరాజవంశాన్ని సంహరిస్తాడు. విదుధవుడి అన్నగారు కాహుద్రకుడు. అతని కొడుకు కుందకుడు. అతని కొడుకు సురధుడు. సురధుని కుమారుడు సుమిత్రుడు. ఈ సుమిత్రుడు కథాకాలం నాటి కోసల రాజు.

శ్రావస్తి, కపిలవస్తు, కాశీ నగరము, గిరివ్రజము మొదలైన సర్వభాగముల యందున్న బౌద్ధులు వజ్జిభిక్షుకులని పిలవబడతారు. కోసలములోని బౌద్ధులు తాము వజ్జిభిక్షుకుల కంటే అధికులమని అనుకుంటారు. సుమిత్రుడిదీ అదే అభిప్రాయము.

కోసల రాజు సుమిత్రుడు, మిథిల రాజు ఉశీనరుడూ తలపడతారు. నిజానికి యుద్ధం చేయాలన్న ఆలోచన వారికేమీ వుండదు. అయితే దానికి పథకం ఎవరి చేత రచించబడిందో, అదంతా ఎలా జరిగిందో వాళ్ళకే తెలియకుండా వాళ్ళ మధ్య యుద్ధం జరిగిపోతుంది. సుమిత్రుని సేనలు భల్లట, ఉశీనర రాజ సైన్యములను వధిస్తాయి.

ఆ తర్వాతి అధ్యాయంలో కాలక, ఏకలింగ, శూరసేన రాజ్యములు మూడూ ఒకేసారి క్షత్రియకుమారుడన్న వాడు మిగలకుండా సమసి పోతాయి. ఆ అధ్యాయం, పథక రచన అంతా క్లుప్తంగా చెప్పడానికి కుదరనంత అద్భుతంగా వుంటుంది. ఆ తర్వాత మిగిలింది అటు కోసల రాజు సుమిత్రుడు. ఇటు మగధ మహారాజు మహానంది కొడుకయిన కాలాశోకుడు.

చివరి అధ్యాయాలలో వాళ్ళిద్దరితో రాక్షసుడి సంభాషణా, వాళ్ళిద్దరినీ ఇక ఏమీ చేయలేని ఇరకాటంలోకి నెట్టేసే చమత్కారం చాలా బాగుంటాయి. చదివి తీరవలసినదే. ఆసరికి కాలాశోకుడికి విషయం చాలావరకూ అర్ధమవుతుంది. కానీ తన చేతుల్లో ఏమీ మిగలదు. అప్పటికే చేయి దాటిపోతుంది.

చివరికి మహానంది కుమారులైన రిపుంజయుడు, కాలాశోకుడు, విధుసారుడు వీళ్ళు ముగ్గురూ కూడా చిత్రమైన పరిస్థితులలో మరణిస్తారు. ఎలా చనిపోయారో ఎవరికీ స్పష్టంగా తెలియదు. చివరికి మహారాజు మహానంది మరణమూ అలాగే జరుగుతుంది. రకరకాల కథలు వినిపిస్తాయి. నందుడు రాజవడం తనకి యిష్టమేనని చనిపోయేముందు మహారాజు చెప్పినట్లుగా సాక్ష్యాలు పుడతాయి.

నందుడు రాజవుతాడు!!
ఇలా ఆద్యంతమూ ప్రతి అధ్యాయమూ చాలా ఉత్కంఠభరితంగా నడుస్తుంది కథ.
నవలలో ఆసక్తికరంగా అనిపించిన సంఘటనలు, సంభాషణలు చాలా వున్నాయి. ఒకటి రెండిటిని ఇక్కడ ఉదహరిస్తున్నాను.

మిథిల రాజు ఉశీనరుడి గురించి చెప్తూ సర్వ బౌద్ధమత సిద్ధాంతాలనీ ఆయన విమర్శిస్తాడనీ, అయితే ఆయనంతట ఆయన వాని విమర్శకు పోడనీ, ఎవరైనా అర్హతులు వెళ్ళి ఆయన్ని కదిలిస్తే మాత్రం ఆయన చెప్పే వాదనలకి సమాధానం చెప్పలేక తిరిగి వస్తారనీ అంటారు రచయిత.

బౌద్ధమతము యొక్క ప్రధమ సిద్ధాంతము కార్యకారణ చక్రము. అజ్ఞానము క్రియగా పర్యవసించును. అది విజ్ఞానమగును. నామరూపములు వహించును. షడింద్రియములు, స్పర్శ, అనుభూతి, ఆశ, గ్రహణము, పరిణామము, జన్మము, దుఃఖము – నిట్లు మారుచుండును. దుఃఖమును చంపినచో అజ్ఞానము నశించునని వారి ప్రధమ సిద్ధాంతము. దీనిని బౌద్ధులయిన అర్హతులు చెప్తే విని ఉశీనరుడు చిరునవ్వు నవ్వుతాడు.

కొంత చమత్కారంగా ఒక ఉదాహరణ చెప్తాడు. మొట్టమొదట జిహ్వ మీద రుచి అనేది ఉన్నది కనుక కూర చేసుకోవాలి అనే సంకల్పం పుడుతుంది. దానినుండి ఒక శాకము, దానిని ముక్కలుగా తరుగుట, కడుగుట, వేడి చేయుట, తిరుగమూత, లవణాది మిశ్రమమును కలుపుట, – యివన్నీ పుట్టాయి. జిహ్వయందలి రుచి నుంచి యివన్నీ పుట్టాయి. కాబట్టి లవణాది మిశ్రమమును తొలగించినచో రుచి నశించును. – ఈ వాదన విని చర్చకు వెళ్ళిన అర్హతుడు వెలతెల పోతాడంటారు విశ్వనాథ.

అయితే ఇలా హాస్యంగా తేల్చేయడం సరైన వాదనా పధ్ధతి కాదని అంటూనే కాని ప్రతిస్పర్ధి యొక దుష్టసిద్దాంతమును ప్రతిపాదించి నపుడు, పాత వస్తువునే కొత్తవస్తువుగా దీపింపచేయబోయినపుడు పండితుడైన వాడేమి చేస్తాడు? అని అడుగుతారు.

“అజ్ఞానము, కర్మ, దుఃఖము యివన్నీ వేదాల్లో వున్నాయి. ఉపనిషత్తులలో వున్నాయి. శాస్త్రాల్లో, పురాణాలలో వున్నాయి. అవి ఏవో కొత్త విషయాలుగా అర్హతులు తెచ్చి ఉశీనరుడి దగ్గర చెప్తే మరి అతనేం చేస్తాడు?” అని ప్రశ్నిస్తారు. నిజమే కదా అనిపించింది నాకు.

మరొక చోట చెప్తారు. సృష్టిలో యిద్దరుంటారట. ఒకడు విద్య ప్రదర్శించెడి వాడు. రెండవవాడు ఆనందించెడి వాడు. “విద్యా ప్రదర్శనము చేసెడి వాడు స్వాహంకార నిష్ఠుడు. విద్యను చూచెడి వాడు స్వానందనిష్ఠుడు. వీరిద్దరిని మించి సృష్టి లేదు. సర్వసృష్టియు వీరినాశ్రయించియే జరుగుచున్నది. వీరిద్దరిలో స్వానందనిష్టుడు నిష్క్రియుడు. వాడు చేసెడిదేమియు లేదు. ఆ స్వానందనిష్టతా లక్షణము భిక్షుక లక్షణము, సన్న్యాసి లక్షణము! స్వాహంకారనిష్టతా లక్షణము సంసారి లక్షణము. స్త్రీ ధనాధికార వాంఛాదుల లక్షణము! మానవుడు స్వానందనిష్టతా లక్షణము నందు వ్యగ్రుడు కాడు. స్వాహంకారనిష్టతా లక్షణము నందు వ్యగ్రుడు. ఇదియే లోకమునకు పరలోకమునకు భేదము. …. ఈ ధర్మములు భిన్నములుగా కనిపించినను ఒక్కొక్కప్పుడొక్కడే పురుషుడు స్వాహంకారనిష్టుడు, మరియొకవేళ స్వానందనిష్టుడు! స్వానందనిష్టత యందుకంటె స్వాహంకారనిష్టత యందు మానవులకు నభిరుచి ఎక్కువ. లోకముయొక్క కీడంతయు నచ్చటనున్నది.”
*****
ఈ పుస్తకం గురించిన తెలుగు వికీపీడియా పేజీ, పుస్తకం.నెట్లో ఈ పుస్తకంపై గతంలో వచ్చిన హేలీ వ్యాసం.

విశ్వనాథ వారి రచనల కోసం :
Sri Viswanadha Publications
Vijayawada & Hyderabad…
8019000751/9246100751/9246100752/9246100753

(ముఖచిత్రం అందించినందుకు మాగంటి వంశీ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

Nando Raja Bhavishyati
Purana Vaira Granthamala
Viswanatha Satyanarayana

You Might Also Like

Leave a Reply