నందో రాజా భవిష్యతి

వ్యాసకర్త: Halley
********

ఈ పరిచయం విశ్వనాథ వారి “నందో రాజా భవిష్యతి” గురించి. దీనితో దాదాపు ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు రచనలు చదివినట్టు లెక్క విశ్వనాథ వారివి. నేను ఏ ఒక్క రచయితవీ ఇన్ని పుస్తకాలు చదవలేదు ఎప్పుడూ. He still continues to amaze me! కాకపోతే నా చదువుల పుణ్యమా అని నేను రచనలని కేవలం రచనలుగా చూడలేను. నాకు ఆర్థిక, సామజిక, రాజకీయ, ఆధ్యాత్మిక విషయాల పైన ఉండే సందేహాలకీ ప్రశ్నలకీ సమాధానాలు వెతుక్కుంటూ చదువుతాను ఏ రచనని అయినా. “కథ బాగుంది” అని అంటే సరిపోదు అనమాట నాకు. ఈ మిగిలిన వంటకాలన్నీ కూడా ఉండాలి. ఆ పరంగా విశ్వనాథ రచనలు నన్ను తృప్తి పరిచినంతగా మరి ఏ ఇతర రచయిత రచనలూ తృప్తి పరచలేదు. ఫిక్షన్ ని ఇలా వాడుకున్న రచయితలు నాకు ఎవరూ తెలీదు వీరు కాకుండా. అంటే ఒకటి రెండు మహా అంటే పది రచనలు చేసిన వారు తెలుసును కానీ మరీ ఇలా పుంఖాలు పుంఖాలుగా ఇదీ అదీ అని తేడా లేకుండా రాసేసిన వాళ్ళు నాకు తెలీదు. నాకు సంబంధించిన వరకు వీరి రచనలు చదవటం అన్నది కూడా ఒక రకం education అనమాట నా బోటి వాళ్ళకి. భారతీయత అంటే ఏమిటో అర్థం చేస్కోవాలంటే విశ్వనాథ వారి రచనలు తప్పక చదవాల్సిందే. ఈ విషయం పైన ఇరవయ్యో శతాబ్దపు భారతంలో చాలా మంది చాలా రాసి ఉన్నా, భావదాస్యం లేకుండా, భారతీయత అంటే ఆత్మ న్యూనత కానీ తక్కువ భావం కానీ లేకుండా, కొలోనియల్ భావజాలం ప్రభావం లేకుండా, భారతీయ ఆత్మ ఆవిష్కరింపపడటం అన్నది వీరి రచనలలో మనకి కనిపిస్తుంది. ఈ రచనలో కూడా నాకు అదే కనిపించింది.

ఇది మహా పద్మ నందుడి కాలం నాటి కథ. విశ్వనాథ వారు రాసెడి timelines కొంచెం కొత్తగా ఉంటాయి స్కూలులో చెప్పే timelinesతో పోల్చుకుంటే! (Ref: http://trueindianhistory-kvchelam.blogspot.in/2009/06/puranic-chronological-dates-of.html). ఇది 1634 b.c నాటి కథ. ప్రధానంగా నందుడు సర్వ క్షత్రియ నిర్మూలన చేసిన విధానం, రాక్షసుడి (నందుడి మంత్రి) రాజనీతి వగైరాల గురించి పుస్తకం. చాలా వరకు రాక్షసుని చుట్టూనే తిరుగుతుంది.

బౌద్ధం ప్రబలమైన కాలమూ, బుద్ధుడి బోధనల గురించీ, తర్వాత ఆయన శిష్యుల వ్యాఖ్యానాల గురించీ, వర్ణములే లేవు అన్న బుద్ధుడి బోధనల ప్రభావంకి లోనైన క్షత్రియులు “బుద్ధుడు మన వర్ణం వాడే” అని అనుకోవటం గురించీ విశ్వనాథ వారు కొన్ని వ్యాఖ్యలు చేసారు. అదొక ఊహ. అప్పట్లో నిజంగా ఇలానే ఉండేదా అని అంటే ఎవరెవరి ఊహాశక్తినీ నమ్మకాలనూ బట్టి వారు అలా అనుకోవచ్చు ఏమో. అంతా అనుకోవటం లోనే ఉంది కదా మరి!

కార్త వీర్యార్జునుడి పురాణ కథను చెబుతూ మహాభారతంలో సామ్యవాద సిద్ధాంతము మాట్లాడిన ఒక బాలకుడి ఉదంతం గురించి చెబుతూ ఒక మాట అన్నారు. నాకు చాలా నచ్చింది.

“సృష్టిలో నేదియు క్రొత్త కాదు. క్రొత్త యనిపించు కొనునదంతయు మారిన పరిస్థితులే తప్ప మానవుని మనస్సు కానే కాదు. కామ క్రోధ లోభాదులచ్చటనే ఉన్నవి, తిండి గుడ్డ సమస్య లచటనే ఉన్నవి. రాజ్యము చేయవలెయు నన్న కోరిక యచ్చటనే యున్నది. రంభాది సంభోగ వాంఛ యచటనే ఉన్నది. ఏతా దృశ బహు విషయ సమాహర భూతమైన ఈ సృష్టి తనలో తానే గిర గిర గిర తిరుగు చుండును” అని. అదనమాట!

మరొక చోట వర్ణ ధర్మము గురించి చర్చిస్తూ ఈ క్రింది మాటలు అన్నారు. ఇది విశ్వనాథ వారి ట్రేడ్ మార్కు వాదం అనుకోవచ్చు. ఆయన నవలలు అన్నిటిలో ఉంటుంది ఇలాంటిది ఎక్కడో ఒక చోట.

“మానవుడైనంతనే బ్రాహ్మణుడు కానిమ్ము, క్షత్రియుడు కానిమ్ము వానికి నోటిలో దంతములు ఉన్నవి. వానితో కొరుకగలడు. చేతులకు గోళ్ళున్నవి. వానితో రక్కగలడు. పాదములున్నవి వానితో దాడించగలడు. వానితో నాయా కార్యములు చేయవచ్చునని ఊహ కల్గుటయు, చేయక తప్పదు యన్న యోత్తిడి కలుగుటయు, జరిగిన తోడనే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు. వైశ్యుడు వైశ్యుడు కాడు. వాని వర్ణ ధర్మమంతరించి వాడాత్మ రక్షణ పరాయణుడగును. ఆత్మ రక్షణ పరాయణత్వం జంతు ధర్మం. వాడు జంతువైనంతనే వానిని హింసించెడి జంతువు వంటి వాడే అగుచున్నాడు. అప్పుడిద్దరును జంతువులే. ఇద్దరును పశువులే. ఇద్దరును క్షుద్వ్యాపారాశ్రయులే. మనస్సు, బుద్ధి, వివేకము మొదలైనవన్నియు నంతరించినవి. వివేకమన్న మాటకు శత్రువునెట్లు సంహరించవలయునన్న యాలోచనయే అర్ధముగా మిగిలినది. ఒక జాతిని నింకొక జాతి గాని, ఒక వర్ణమునింకొక పక్షము గానీ భాదించుట యొక్క ఫలితమేమనగా సర్వ మానవ కోటిని పశుప్రాయముగా చేయుటకు యత్నించుట యగును”

ఏం చెప్పారండీ! నేటి social darwinism ని చూస్తూ ఇష్టం ఉన్నా లేకపోయినా దానిలో పాలు పంచుకుంటూ ఆప సోపాలు పడే వారంతా ఏదో ఒక సమయంలో ఆలోచించేవే ఇవన్నీ. నేటి కాలంలో మనం గొప్పగా చెప్పుకొనే meritocracy ల వెనుకా ఆయన్ రాండ్ స్టైలు individualism వెనుకా ఉండే భావాలూ ఇవేనేమో! అంతా ఆత్మ రక్షణా పరాయణత్వం చుట్టూతా తిరిగేవేనేమో!

మరొక చోట మతాల గురించీ సిద్ధాంతాల గురించీ ఒక మాట అన్నారు. చాలా మంచిమాట.

“మతములను నిర్మింతురు. రాజ్యములను పాలింతురు. సంఘములను సంస్కరించుటకు బయలుదేరుతురు. వారి ఇష్టము వచ్చిన సిద్ధాంతముల నిర్మించుకొందురు. మానవునకు మతమిచ్చినను సంఘ లక్షణమిదియని నిర్ణయించినను మరి ఏది చేసినను చేయవలసిన పధ్ధతి ఏదనగా మానవులున్నారు. వారి యలవాట్లున్నవి. వారి వాంఛలున్నవి. వారికి వ్యాధులున్నవి. మృత్యువున్నది. ఈ యన్నింటిని విచారించి సంఘమునో మతమునో రాజ్యమునో నిర్మింపవలయును. అట్లు నిర్మింపపడినవి చిరకాలముండును. లేనిచో నిర్మించినవాని కత్తికి పదు నెన్నాళ్ళుండునో యన్నాళ్ళుండును”

చివరాఖరున అన్న మాట మిలియన్ డాలర్ల అంత విలువ అయిన మాట! ఆ విషయం దృష్టిలో పెట్టుకొని నేటి సమాజాన్ని మన జీవితాలని అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది మన అవస్థ అసలు స్వరూపం ..దాని వెనుక ఉన్న వ్యవస్థ అసలు స్వరూపం!

ఒక చోట రాజైన మహానందికీ అతని కొడుకైన కాలా శోకుడికి మధ్యన జరిగిన సంభాషణలో వైశ్య వర్ణము గురించి అన్న కొన్ని మాటలు నాకు చాలా నచ్చాయి.

“ఓయీ! వైశ్యులనగా దేశము యొక్క జీవనము. పండిన పంట నాలుగు మూలల పంచిపెట్టు వాడు వాడు. నేసిన గుడ్డ పది మందికందించు వాడు. వాడు లేనిచో వస్తు వినిమయం అన్నది లేదు. వస్తు వినిమయం లేనిచో సంఘ జీవనం అన్నది లేదు. వైశ్యుడు వేద ధర్మము నుండి తక్కిన వర్ణముల వారి వలె నంత శీఘ్రముగా దొలగిపోడు. ఇంటిలో స్త్రీ ఎట్టిదో దేశములో వైశ్యుడట్టి వాడు. సంప్రదాయ రక్షకులు వారిద్దరును. ఒక దేశమునందున్న యొక మతమును గాని యొక సిద్ధాంతమును గాని నిర్మూలించ వలయునన్నచో తొట్ట తొలుత నది నిర్ములింప బడవలసిన చోటు వైశ్య కులము. వారిని నీవు నిర్మూలించ లేవు. అది సాధ్యము కాదు. వారిని నిర్మూలించినచో దేశమే లేదు. జాతియే లేదు.”

నిజంగా మహానంది ఈ మాటలు అన్నాడో లేదో ఎవరికీ తెలియదు. బౌద్ధ మత ప్రభావంలో ఎన్నో మార్పులకి లోనయిన అప్పటి సమాజ స్థితిని గురించి విశ్వనాథ వారు చేసిన సృజన ఇది. అయితే ఇప్పటి పరిస్థితులకి అన్వయించుకుంటే పారిశ్రామిక విప్లవం అనంతరం వస్తు వినిమయంలో వచ్చిన మార్పులను గమనిస్తే విశ్వనాథ వారు పైన చెప్పిన విషయాలు మనకు చాలా చక్కగా అవగతమవుతాయి. ఇప్పటి కాలపు అస్తిత్వ చింతనలకు ఆర్థిక వ్యవస్థ, వస్తు వినిమయ వ్యవస్థ తాలుకా కారణాలు చాలానే ఉన్నవి అని నా అభిప్రాయం. నాకు అర్థమయినంత మేర ఈ విషయంలో నాకు అనిపించింది ఇది. ఒక వైదిక జీవన వ్యవస్థ అనేటిది ఉంది అని అనుకుంటే, దాని పైన రకరకాల ఒత్తిడులు వస్తూ పోతూ ఉండేవి. అది వేనరాజు వంటి రాజు అవ్వచ్చు. బౌద్ధం కావచ్చు. తురుష్కుల దాడులు కావచ్చు. పారిశ్రామిక విప్లవం అనంతరం వచ్చిన యూరోపు కొలోనియల్ ప్రభువుల సేనలు కావచ్చు. వీరందరిలో పైన విశ్వనాథ వారు చెప్పినట్టుగా వైశ్య వర్ణాన్ని (లేదా ఆ పదం తో సమస్య ఉంటే .. ఆ వర్ణం వారు చేసెడి పనిని) కుదిపే శక్తి నాకు తెలిసి బౌద్ధానికి కానీ తురుష్కులకి కానీ లేదు. ఎందుకంటే సంఘ వ్యవస్థ విషయంలో వారి దగ్గర పెద్ద alternatives లేవు. కింద చెప్పినట్టుగా “వట్టి బతుకులు బ్రతుకుటకు పూర్వ విధానమే శరణ్యముగా” ఉండేది అనుకుంటాను, ఆయా మతాల ప్రభావానికి లోనైనా భారతంలో కూడాను. అయితే నేటి మన ఈ epoch లో విషయం అలా కాదు. ప్రధానంగా వైశ్యుల పనిలోనే ప్రధాన మార్పులు జరిగాయి గత ఒకటీ రెండు శతాబ్దాలలో (వ్యుత్పత్తి జరిగెడి విధానము వినిమయం జరిగెడి విధానములో జరిగిన మార్పులు). ఇప్పుడు వట్టి బతుకులు కూడా పూర్వ విధానంలో సాగించటం కష్టము! అది దృష్టిలో ఉంచుకొని విశ్వనాథ వారి వ్యాఖ్య చదివితే కొన్ని విషయాల పైన మన అభిప్రాయాలు మారవచ్చు అవగాహన కూడా పెరగవచ్చు. కాబట్టి ఈ పేరాగ్రాఫ్ రాసినందుకు హాట్సాఫ్ టు విశ్వనాథ!

ఇక రాక్షసుడికీ సుమిత్రునికీ జరిగిన సంభాషణలో బౌద్ధం గురించిన కొన్ని వాదనలు నాకు బాగా నచ్చాయి. ఎప్పటి నుంచో నాకు బౌద్ధం విషయంలో ఈ సందేహాలు ఉండేవి. రాక్షసుడి సంభాషణా చాతుర్యం పుణ్యమా అని మళ్ళీ తలచుకున్నాను వాటిని.

“మీ బుద్ధుడు సృష్టి ఇట్లు జరుగునని చెప్పినట్లు లేడే. నామ రూపములు, పంచ స్కందములు, కామ క్రోధాది గుణములు లేకుండ ప్రవర్తించుట, మొదలైనవే చెప్పినాడు గానీ, సృష్టి యెట్లు జరిగినది? సృష్టి కర్త ఉన్నాడా లేడా? యన్న ప్రశ్న గానీ చెప్పినట్టు లేదు”

“సన్న్యాసము మాట సరియే. అందరును సన్యాసులైనచో భిక్ష పెట్టెడి వాడు ఎవడు? భిక్ష పెట్టుటకు కొందరుండ వలెను. భిక్ష పెట్టెడి వారి సంఖ్య ఎక్కువ యుండ వలెయును. స్వీకరించెడి వారి సంఖ్య తక్కువ యుండవలయును”

“అందరును సన్యాసులైన వారికే యెట్లు బ్రతుక వలయునో బుద్ధుడు భోదించెను గానీ తక్కిన వారి విషయము చెప్పినట్టు లేదు. తక్కిన వారందరూ ఈ దేశమున ననాది నుండి వచ్చుచున్న నొక జీవన విధానము ననుసరించు చున్నారు. ఆ విధానము వైదికమైనది. బుద్ధుడు తద్విధానమును గూర్చి యెమియు చెప్పలేదు గనుక నొక్క సన్యాసులను భిక్షకులను వదిలి తక్కిన దేశమంతయు, తక్కిన ప్రజలందరు వైదిక విధానమున మన వలయుననియే బుద్ధుని యభిప్రాయమై ఉండును. కనుక నెవ్వరు దక్కిన వర్ణముల వారిని హింసింప రాదు. వట్టి బతుకులు బ్రతుకుటకు పూర్వ విధానమే శరణ్యముగా గనిపించు చున్నది”

ఈ విధంగా అంటాడు రాక్షసుడు సుమిత్రునితో. అసలు ఈ వాదనా క్రమమంతా చాలా భేషుగ్గా ఉంటుంది. నాకైతే రాక్షసుని రూపం కళ్ళ ముందు కనపడినట్టు అనిపించింది ఈ ఘట్టం చదివినప్పుడు.

ఇవి కేవలం అక్కడా ఇక్కడా తారస పడ్డ కొన్ని వ్యాఖ్యలు మాత్రమే. ఈ పుస్తకం ఏ చరిత్రా ఏ పురాణం తెలియకుండా చదివినా కూడా ఒక political thriller గా అలరిస్తుంది. రాక్షసుడి రాజకీయ ఎత్తుగడలూ అప్పటి రాజులూ వారి వారి బలాలూ బలహీనతలు, వారి మతాలూ, ఆనాటి సాంఘిక పరిస్థితులూ ఇవన్నీ ఆగకుండా చదివిస్తాయి పుస్తకాన్ని. అయితే మధ్యలో కొన్ని చోట్ల బాగా descriptive అయిపోయి, ఎంతకీ తెగని వర్ణనలు ఎంతకీ ఆగని పెద్ద పెద్ద పదాలు (ఈ పదాలని “సమాస రగడ” అనొచ్చు!) చదివినపుడు మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే మన తెలుగు పాండిత్యం ఇలా తగలడింది అని రచయితని కూడా ఆ స్థాయికి దిగివచ్చి రాసి ఉండవలసింది అని అడగలేం కాబట్టి ఈ విషయంలో విశ్వనాథ వారిపై ఫిర్యాదు చేయటం కూడా భావ్యం కాదు. ఇంకొక కంప్లైంటు! నవల అంతా రాక్షసుడే కనపడతాడు మనకి, నందుడు చాలా తక్కువ! “నందో రాజా భవిష్యతి” చదువుతున్నానా “రాక్షసా మంత్రీ భవిష్యతి” చదువుతున్నానా అనిపించింది నాకు! మరి రాజనీతి గురించీ ఆ తంత్రాల గురించీ రాయాల్సి వస్తే మంత్రుల గురించే రాయాలేమో లెండి. ఏదైతేనేం మొత్తానికి మెదడుకు మేత దొరికింది మరోసారి! విశ్వనాథ వారి పుణ్యమా అని.

Nando Raja Bhavishyati
Viswanatha Satyanarayana

You Might Also Like

12 Comments

  1. Amarnath

    ప్రతీత్య సముత్పాదం wiki link :
    http://en.wikipedia.org/wiki/Prat%C4%ABtyasamutp%C4%81da

    నందో రాజా భవిష్యతి నుండి:

    ” నాటి మిథిలాపతి యుశీనరుడు. ఆయన వృద్ధుడు. వేద వేదాంగములు చదివిన వాడు.
    ……
    ……..

    బౌద్ధ మతము యొక్క ప్రథమ సిద్ధాంతము కార్య కారణ చక్రము. అజ్ఞ్యానము క్రియ గా పర్యవసించును. అది విజ్ఞ్యానమగును. నామ రూపములు వహించును. షడిన్ద్రియములు, స్పర్శ, అనుభూతి, ఆశ, గ్రహణము, పరిణామము, జన్మము, దుఃఖము- నిట్లు మారుచుండును. దుఃఖమును చంపినచో అజ్ఞ్యానము నశించునని వారి ప్రథమ సిద్ధాంతము. దీనిని బౌద్ధులైన యర్హతులు చెప్పగా నుశీనరుడు చిరునవ్వు నవ్వును.

    ఆరాజు కొంత చమత్కారి! ఆయన యొకసారి యిట్లనెను. ‘ఓయీ! మనమొక కూర చేసికొందుము. ఆ కూర కొక కాయ కావలయును. ఆ కాయను కాయగా తినలేము. కాన ముక్కలు ముక్కలు చేయుదుము. అప్పుడు ముక్కలు పుట్టినవి. ఆ ముక్కలు కడుగ వలయును గాన ప్రక్షాళన కర్మ పుట్టినది. పచ్చివాని కంటె నుడికినవి దంతములకు సుఖముగా నుండును గాన, దానియందు ఉష్ణకర్మ యుదయించినది. అన్ని కాయలు విస్పష్టమైన షడ్రసముల లోనికి చేరవు గావున, వానియందొక రసాధానము చేయుటకు, లవణము మిశ్రితమగుట జరిగినది. అట్లే తిరుగమూత పుట్టినది. ఆ కాయతో కూర వండవలయునని యెందుకు సంకల్పించితివి? ఆ కర్మ యెందుకు పుట్టెను? రుచియన్నది మొట్ట మొదట జిహ్వ మీద నున్నది కనుక పుట్టినది. జిహ్వ యందలి రుచినుండి శాకము, కర్తనము, క్షాళనము, పచనము, లవణాది వస్తు మిశ్రణము పుట్టినవి. లవణాది మిశ్రణమును తొలగించినచో రుచి నశించును.’

    అని యాయన చెప్పి నవ్వగా ఆయన తో వాదించుటకు పోయిన యర్హతుడు వెలతెల పోయెను. అది వాదముగా కనిపించలేదు. వాదమును వ్యర్థము చేయుటకు హాస్యము కంటె నధికమైన యాయుధము లేదు. అంతటి వాదనా పద్ధతియు హాస్యమును జోడించి వికృత వాదము ప్రారంభించినచో అది వ్యర్థమై పోవును. పరిహాస భాజనమగును. అది న్యాయమైన వాదము కాదు. కాని ప్రతి స్పర్థి యొక దుష్ట సిద్ధాంతమును ప్రతిపాదించినపుడు, ప్రాత వస్తువునే క్రొత్త వస్తువుగా దీపింపజేయ బోయినపుడు పండితుడైన వాడేమి చేయును? దిగ్భ్రాంతి పొందును.

    అజ్ఞ్యానము, కర్మ, దుఃఖము మొదలైనవి వేదములయందున్నవి. ఉపనిషత్తుల యందున్నవి. శాస్త్రముల యందున్నవి. పురాణముల యందున్నవి. అవి యేవో క్రొత్త విషయములుగా నర్హతులు వచ్చి ఊశీనరుని వద్ద చెప్పినప్పుడు, ఊశీనరుడేమి చేయును?………”

  2. Santwana

    Thoroughly enjoyed this article as your earlier ones.. Keep going andi! I am aspiring to reach the count of twenty six one day.. 🙂

  3. S. Narayanaswamy

    Very nice. విశ్వనాథవారు రాజవంశాల కథలుగా రాసిన వాటిల్లో యశోవతి తరవాత నేను బాగా ఎంజాయ్ చేసిన కథ ఇది.

  4. మంజరి లక్ష్మి

    రవిగారు మీరు నందో రాజ భవిష్యతి గురించి రాశారు కదా. దాని మీద ఇంకా బాగా విమర్శతో ఏమైనా వ్యాసాలు ఉన్నాయా? విశ్వనాధ సత్యనారాయణ గారి నవలల మీద విమర్శనా వ్యాసాలేమైనా ఉన్నాయా? ఉంటే తెలియజేయగలరు.

    1. రవి

      లక్ష్మి గారు, పొద్దుటే సరిగ్గా ఇదే ప్రశ్న పోస్ట్ చేయబోయి ఆగిపోయాను. నాకు తెలిసి విశ్వనాథ మీద విమర్శలు కాదు కదా, కనీసం ప్రశ్నించే సాహసం చేసిన రచనలూ ఇప్పటి కాలంలో లేవు.

      అయితే వేయిపడగలు, ఏకవీర, చెలియలికట్ట – ఈ మూడు నవలల మీద ఆర్. ఎస్ సుదర్శనం గారు చాలా యేళ్ళ క్రితం భారతిలో చక్కని విమర్శలు వ్రాశారు. ఆయన పద్యకవిత్వం మీద అయితే చాలా పెద్ద పెద్ద విమర్శలే ఉన్నాయి.

  5. Admin

    వ్యాఖ్యాతలకు మనవి:
    దయచేసి వ్యాఖ్యల్లో సంయమనం పాటించగలరు. అలాగే, వస్తు విషయం మీద దృష్టి పెట్టి, వ్యక్తిగత నిందలకు దూరంగా ఉండగలరు.

  6. Halley

    మీకు దర్శనాల గురించి తెలుసో తెలిదో నాకు తెలీదు . విశ్వనాథ వారు అడిగిన ప్రశ్నలు న్యాయ వైశేషిక సాంఖ్య జైన వేదాంత మీమాంస దర్శనాలలో ఎన్నో కనిపిస్తాయి . ఇదేదో ఆయన మాత్రమే అడిగిన ప్రశ్నలు అని అనుకోని మీకు మీరు ఏదో చెప్పారు . నాకు అర్థం కాలేదు .

    మీరు విశ్వనాథ ని ఒక మనిషిగా చూసి ఏదో వ్యక్తీ పూజ చేస్తున్నానేమో అన్న అనుమానంతో చెబుతున్నారు . నేను ఆ రచనలలో ఒక ఫలానా ఆలోచనా స్రవంతిని చూస్తున్నాను . వారు ఒక పరంపరకు ప్రతినిధి, నేను ఆ పరంపరను అభిమానిస్తున్నాను ఆ argumentative traditionని అభిమానిస్తున్నాను .

    “మీకు బౌద్ధంలో సందేహాలు వస్తే బుద్ధబోధ/బౌద్ధంమీద పుస్తకాలు చదివితే చక్కగా సమాధానాలు దొరుకుతాయి కదా?”

    నేను దర్శనాలు చదువుతున్నాను . అందులో బౌద్ధం గురించి చాలానే ఉన్నది . ఇప్పటి దాకా నేను చదివిన పుస్తకాలలో ఈ విషయాలే ఉన్నవి .అది అయ్యాక , బుద్ధి పుడితే ఇంకా ప్రశ్నలు సమయం మిగిలితే బౌద్ధం గురించి చదువుతాను . వెరసి నేను చెప్పొచ్చేది ఏంటి అంటే these are not new questions! మీరు అనట్టు “అన్ని” విషయాల గురించీ “అన్నీ” నేనే చదివి తెల్సుకోవాలి అని అనేంత విశాల దృక్పథం నాకు లేదు . అది practical అని కూడా నేను అనుకోవట్లేదు .

    మీరు చెప్పిన సదరు నేటి బుద్ధుడు జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన ఆ మాటకు ఒక కాంటెక్స్ట్ అన్నది ఉండి ఉంటుంది అని అనుకుంటున్నాను . నేను చదివినంతవరకు నాకు జిడ్డు కృష్ణముర్తి భావాలు అంతగా మింగుడు పడలేదు .

    “నిజాయితీగా సమాధానం వెతకమంటున్నాను”

    మీరు మరి ఇలా కేజ్రివాల్ లాగా మా నిజాయితీలను శంకించేస్తే ఏమీ చేయలేను . అసలు నన్ను మీరు ఎరుగుదురా ? నేనేమి చదువుతానో మీరు ఎరుగుదురా ? నేను నిజాయితిగా వెతకట్లేదు అని మీకు మీరు జడ్జిమెంటు ఇచ్చేస్తారా ?

    “నిజమైన రచన మీకు ప్రశ్నలు పుట్టించాలి”

    అన్ని రచనలు ప్రశ్నలు పుట్టించేవే అయితే సమాధానాలు చెప్పేది ఎవరట ? మనిషి perennial sceptic గా ఉండాలి అన్న వాదన అర్థం వేరే . దేనిని నమ్మద్దు దేనిని ఆచరించద్దు అన్నిటినీ ప్రశ్నిస్తూనే ఉండు అని అంటే కష్టమే . కొన్ని సమాధానాలు చెప్పే రచనలు కూడా ఉండాలి అని నా అభిప్రాయం

    “ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఉంది”

    చెప్పండి మరి . ఎందుకు ఆగిపోయారు ? మళ్లీ చెబుతున్నాను, ఈ ప్రశ్న విశ్వనాథ వారు మాత్రమే వేసారు అని అనుకోటం మన అజ్ఞానం అవుతుంది . బౌద్ధం అన్నది ఈనాటిది కాదు . బౌద్ధానికి ప్రతిగా వచ్చిన ప్రశ్నలు ఈనాటివి కావు . చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు బౌద్ధం గురించి రాసిన వ్యాఖ్యల్లో కూడా నేను విశ్వనాథ వారి వ్యాఖ్యలతో సామ్యం గమనించాను . ఆయన పీఠాధిపతులు మరి . అయన కూడా చవకబారు విశ్లేషణలే చేసి ఉంటాడంటారా ? అనే అనుకుందాం! ఏ ప్రాతిపదికన అవి చవకబారు అని అంటున్నారు ? చెప్పాలి కదా ? లేదంటే ఇది ఇంకొక చవకబారు కామెంటు అవ్వదా ? ఆలోచించండి

    “పాఠకుడికి స్వీయసంస్కారోన్నతి లక్ష్యం కావాలే తప్ప రచయిత గొప్ప వాడు కాబట్టి లేదా “తెలుగు” వాడు కాబట్టి అతని రచనలు గొప్పవని స్థిరీకరించి అక్కడితో ఆగడం మంచిది కాదని నా ఉద్దేశ్యం

    సంతోషం . మంచి మాట చెప్పారు . మీకు అలా అనిపిస్తే అలానే అనుకోండి . మీకు అయన చెప్పినవి నచ్చలేదు .. నాకు నచ్చింది . నేను నచ్చింది ఫలానా ఫలానా అని చెప్పాను . దానితో నేను ఆగిపోయాననీ నేను ఆలోచించట్లేదనీ నా ఆలోచనలో నిజాయితీ లేదనీ ఏవేవో అనేసారు . మీకు నచ్చని విషయం చెప్పినందుకు ఇన్నేసి మాటలు ఇన్నేసి ఉచితానుచిత సలహాలూ ఇవ్వాలా ! కావాలంటే నా ఈమెయిలు ఐడి ఇస్తాను నా personality developmentకి సూచనలు అందులో ఇవ్వండి .

    సెలవు !

    1. రవి

      హేలీ గారు,

      పుస్తకం వారు: నా వ్యాఖ్యల్లో దూషణ దొర్లితే తొలగించగలరు.

      మీ మీద వ్యక్తిగతంగా నాకు ఏ అభిప్రాయాలు లేవు. పుస్తకం ఒక పబ్లిక్ ఫోరం కాబట్టి, ఇక్కడ వ్యాసాలను ప్రపంచం చూస్తున్నది కాబట్టి, ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు తెలిసో తెలియకో సార్వజనీనం అయే అవకాశం ఉంది అని భావిస్తున్నాను కాబట్టి వ్యాఖ్య వ్రాయవలసి వచ్చింది.

      >>మీరు మరి ఇలా కేజ్రివాల్ లాగా మా నిజాయితీలను శంకించేస్తే ఏమీ చేయలేను . అసలు నన్ను >>మీరు ఎరుగుదురా ? నేనేమి చదువుతానో మీరు ఎరుగుదురా ? నేను నిజాయితిగా వెతకట్లేదు అని >>మీకు మీరు జడ్జిమెంటు ఇచ్చేస్తారా ?

      మీకు నిజాయితీ లేదు అని నేననలేదే? అలా వ్యక్తిగతంగా చెప్పినట్టు అనిపిస్తే తప్పు నా రాతలదే అనుకోండి. సరే విషయానికి వద్దాం. మీరు విశ్వనాథ చెప్పిన రెఫరెన్సు ను ఉటంకించారు ఆయన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారు కాబట్టి – ఆయన ప్రశ్నలోనే నిజాయితీ లేదు కాబట్టి – నేను నిజాయితీలేమి ని ప్రశ్నించాను. విశ్వనాథే చెబుతాడు – బౌద్ధం నాస్తికమతమని, అందులో దేవుడు లేడు అని. దేవుని ఉనికిని గురించి బౌద్ధం మౌనం వహిస్తుందని స్పష్టంగా తెలిసి మీ మతం లో దేవుడు లేడు కాబట్టి, సమాధానాలు చెప్పలేదు కాబట్టి బుద్ధబోధ invalid అనడం ఎంతవరకు న్యాయం? ఇదొక్కటే కాదు. ఇంకా వివరంగా వ్రాయవచ్చు ఈ విషయం మీద.

      >>అన్ని రచనలు ప్రశ్నలు పుట్టించేవే అయితే సమాధానాలు చెప్పేది ఎవరట ? మనిషి perennial >>sceptic గా ఉండాలి అన్న వాదన అర్థం వేరే . దేనిని నమ్మద్దు దేనిని ఆచరించద్దు అన్నిటినీ >>ప్రశ్నిస్తూనే ఉండు అని అంటే కష్టమే . కొన్ని సమాధానాలు చెప్పే రచనలు కూడా ఉండాలి అని నా అభిప్రాయం

      ఆచరణాత్మకమైన మతవిషయాల గురించి వ్యక్తిగత నమ్మకాల గురించి నేను ప్రస్తావించలేదు గమనించగలరు. నా పరిధి “రచన” లేదా “సాహిత్యం” అన్నదాని గురించి మాత్రమే.

      >>ఈ ప్రశ్న విశ్వనాథ వారు మాత్రమే >>వేసారు అని అనుకోటం మన అజ్ఞానం అవుతుంది . బౌద్ధం >>అన్నది ఈనాటిది కాదు . బౌద్ధానికి ప్రతిగా వచ్చిన ప్రశ్నలు ఈనాటివి కావు .

      ఆ ప్రశ్నలకు అన్ని వేల సంవత్సరాలలో సమాధానమూ దొరికే ఉంటుంది అని మీకు అనిపించలేదా?

      >>చెప్పండి మరి . ఎందుకు ఆగిపోయారు ?

      మజ్జిమ నికాయం లో వత్స గోత్రుడనే వ్యక్తీ బుద్ధుణ్ణి ఈ ప్రశ్న అడుగుతాడు. దానికి సమాధానమూ ఉంది. ఇంకా వివరమైన సమాధానాలూ వెతికితే దొరకగలవు. మీకు సమాధానం చెప్పి ఒప్పించటం నా లక్ష్యం కాదు. వెతికితే జవాబులు దొరకగలవని చెప్పడం మాత్రమే నా ఉద్దేశ్యం. (నా వద్ద సమాధానం లేదని అనుకోండి. పర్వాలేదు)

      >>ఏ ప్రాతిపదికన అవి చవకబారు అని అంటున్నారు ?

      వివరంగానే చెప్పాలని ఉంది. అదొక పెద్ద వ్యాసమవుతుంది. ఇక్కడ కుదరదు.క్లుప్తంగా చెబుతాను. “ప్రతీత్య సముత్పాదం” అన్నది ఒక “సిద్ధాంత”మనీ అందునా దుష్టసిద్ధాంతమనీ మీరు భావిస్తారా? ఆ ప్రతీత్య సముత్పాదం నుండి నాగార్జునుడనే ఆయన క్షణిక వాదాన్ని ప్రతిపాదించాడు. ఒక యువరాజు, ప్రపంచాన్నే ప్రభావితం చేసిన ఒక కరుణాస్పదుడైన వ్యక్తీ జీవితాన్ని పణంగా పెట్టి ఆవిష్కరింపజేసుకున్న అంతర్దృష్టి – ఈ నవల్లో వంకాయ కూర వండడం తో పోల్చటం – ఇదొక గొప్ప విశ్లేషణగా మీరు భావిస్తారా?. ఆర్య నాగార్జునుడూ, గౌతముడు వంటి వ్యక్తులు బుద్ధిహీనులు కారండి. ఆలోచించాలి మీరు.

      విశ్వనాథ వారి ఆ విశ్లేషణలో అతి గొప్ప విషయం ఏదీ నాకు కనిపించలేదు. పీఠాధిపతులు ఆ పని చేసినా నాకు వారి మీద గౌరవం కలుగదు. మన్నించాలి.

      >>మీకు నచ్చని విషయం చెప్పినందుకు ఇన్నేసి మాటలు ఇన్నేసి ఉచితానుచిత సలహాలూ >>ఇవ్వాలా

      ఇది “నేను” మీకు చెబుతున్నది కాదండి. పాఠకుడు – భిన్నాభిప్రాయాన్ని, పుస్తక పరిచయ పధ్ధతి ని గురించి చెబుతున్న సూచన మాత్రమే. ఇందులో నిర్బంధమేమీ లేదే. పుస్తకం మీదే కాదండీ, పాఠకులమైన మాది కూడానూ.

    2. Halley

      “వివరంగానే చెప్పాలని ఉంది. అదొక పెద్ద వ్యాసమవుతుంది. ఇక్కడ కుదరదు.”

      మనం ఈ విషయంలో ఒక Truce కి వద్దాం అండీ . నాకు వివరంగానే తెల్సుకోవాలని ఉంది . మీ వీలుని ఓపికని బట్టి , అది పెద్ద వ్యాసం అయినా పర్లేదు నాకు ఈమెయిలు చేయండి (halley DOT kalyan AT gmail DOT com) . నేను చదువుతాను .

      “విశ్వనాథే చెబుతాడు – బౌద్ధం నాస్తికమతమని. అందులో దేవుడు లేడు అని. దేవుని ఉనికిని గురించి బౌద్ధం మౌనం వహిస్తుందని స్పష్టంగా తెలిసి మీ మతం లో దేవుడు లేడు కాబట్టి, సమాధానాలు చెప్పలేదు కాబట్టి బుద్ధబోధ invalid అనడం ఎంతవరకు న్యాయం? ఇదొక్కటే కాదు. ఇంకా వివరంగా వ్రాయవచ్చు ఈ విషయం మీద.”

      ఇదే నవలలో బౌద్ధ భిక్షువుల గురించి రాస్తూ “వారందరూ తపస్వులు . వారిలో నెక్కువ మంది నింద్రియ జేతలుందురు . వారు నిర్వాణమందురు . అది మన మోక్షము వంటిదే . అట్టి వారిని వేయి మందిని సంహరించినచో నాకు బుట్ట గతులుండవు . ఈ యార్యవర్తములోని వైదిక మతమునకు కూడా నది క్షేమకరమైన విషయం కాదు” అని అన్నారు (మంత్రి అన్న మాటలు ఇవి ). కాబట్టి విశ్వనాథ వారికి బౌద్ధ భిక్షువుల మీద విషం కక్కే ఉద్దేశ్యం లేదు నాకు తెలిసి . ఈ విషయం పైన వారు రాసిన ఇతర నవలలో కూడా నాకు తెలిసి విషయమల్లా ఏంటయ్యా అంటే .. బౌద్ధం వెనుక ఉన్న సంఘ వ్యవస్థ గురించిన ప్రశ్నలు విమర్శలు మాత్రమే . ఆ సంఘ వ్యవస్థలో ఏమంత గొప్ప ఉందని వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థను పక్కన పెట్టేసి కుదిరితే రూపు మాపేసి దాన్ని అనుసరించాలీ అని . ఈ ప్రశ్నలకు నాకు సమాధానం మీ వ్యాసం ద్వారా లభిస్తుందని ఆశిస్తున్నాను .

      “ఆచరణాత్మకమైన మతవిషయాల గురించి వ్యక్తిగత నమ్మకాల గురించి నేను ప్రస్తావించలేదు గమనించగలరు. నా పరిధి “రచన” లేదా “సాహిత్యం” అన్నదాని గురించి మాత్రమే”

      రచనకి సాహిత్యానికి ఆచరణకి మత విషయాలకి వ్యక్తిగత నమ్మకాలకి సంబంధం లేదంటారా ? వీటన్నిటిని ఇన్ఫ్లుయన్స్ చేసే లక్షణం సాహిత్యానికి లేదంటారా ? సమాధానాలు కూడా సాహిత్యం లో దొరుకుతాయి అని అంటున్నాను నేను .

      “ఆ ప్రశ్నలకు అన్ని వేల సంవత్సరాలలో సమాధానమూ దొరికే ఉంటుంది అని మీకు అనిపించలేదా?”

      దర్శనాల నిండా నాకు కనిపించినవి ప్రశ్నలూ ప్రతి ప్రశ్నలూ సమాధానాలే ! అయితే ఏ సమాధానం మనల్ని తృప్తి పరుస్తుంది అన్నది మన చేతుల్లో లేదనుకుంట .

      చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి ఉపన్యాసాలలో ఇది ఒకటి ఉంది రెఫ్:http://www.kamakoti.org/hindudharma/part12/chap4.htm . అందులో .. “But for the Buddhist bhiksus(monks), all householders followed the Vedic path” అని అన్నారు . ఇది విశ్వనాథ వారు చెప్పిన మాటే “వట్టి బతుకులు బ్రతుకుటకు పూర్వ విధానమే శరణ్యముగా గనిపించు చున్నది” అన్న మాట.

      దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి . ఏదో ఒక రోజు చెప్పండి నాకేమి తొందర లేదు . మీకు నచ్చిన ఫోరం లో రాయండి . లేదా ఈ విషయం పైన మీకు తెల్సినంతలో కూలంకషంగా విశ్లేషణ చేసిన ఏదన్నా మంచి రిఫరెన్స్ చెప్పండి .

      సెలవు !

    3. రవి

      >>మనం ఈ విషయంలో ఒక Truce కి వద్దాం అండీ . నాకు వివరంగానే తెల్సుకోవాలని ఉంది . మీ >>వీలుని ఓపికని బట్టి , అది పెద్ద వ్యాసం అయినా పర్లేదు నాకు >>ఈమెయిలు చేయండి (halley >>DOT kalyan AT gmail DOT com) . నేను చదువుతాను .

      మీరు నిజానిజాలు చదివి తెలుసుకొమ్మంటే – practical కాదు కాబట్టి తెలుసుకోరు. శ్రీమాన్ విశ్వనాథ వారు “వంకాయ” అని మరొకటని చవకబారు వ్యాఖ్యానాలు చేశాడు, వాటిని గమనించండి అంటే – కనీసం acknowledge చేయరు. “ఏ సమాధానం నన్ను తృప్తి పరుస్తుందో నేను చెప్పలే”నని మీరే అంటారు. ఇప్పుడు మీ కోసం నేను శ్రమపడి వ్యాసాలు వ్రాసి మిమ్మల్ని ఒప్పించాలంటారా?

      రెఫరెన్సు అడిగారు కాబట్టి కౌముదిలో 2012 లో సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ మాసాలలో బౌద్ధం దుష్ప్రభావాలు ఒక ఖండన – అన్న పేరుతో నేను వ్రాసిన వ్యాసాలు చదవండి. అక్కడ నాకు దొరికిన రెఫరెన్స్ లు ఇచ్చాను. వీలు దొరికితే చదవండి.

      >>కాబట్టి విశ్వనాథ వారికి బౌద్ధ భిక్షువుల మీద విషం కక్కే ఉద్దేశ్యం లేదు నాకు తెలిసి . ఈ విషయం >>పైన వారు రాసిన ఇతర నవలలో కూడా నాకు తెలిసి విషయమల్లా ఏంటయ్యా అంటే .. బౌద్ధం >>వెనుక ఉన్న సంఘ వ్యవస్థ గురించిన ప్రశ్నలు విమర్శలు మాత్రమే . ఆ సంఘ వ్యవస్థలో ఏమంత >>గొప్ప ఉందని వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థను >>పక్కన పెట్టేసి కుదిరితే రూపు మాపేసి దాన్ని >>అనుసరించాలీ అని . ఈ ప్రశ్నలకు నాకు సమాధానం మీ వ్యాసం ద్వారా లభిస్తుందని >>ఆశిస్తున్నాను .

      విషయాన్ని బౌద్ధ “భిక్షువుల” కేసి మళ్ళించడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు. విశ్వనాథకు బౌద్ధం మీద, బుద్ధబోధ మీద విషం కక్కే ఉద్దేశ్యం లేదా? – సరే అలానే తృప్తిపడండి.

      ప్రతీత్య సముత్పాదాన్ని దుష్టసిద్ధాంతమని, వంకాయ అని గేలి చేయడం పట్ల మీ సమాధానం లేదెందుకో? ఆ ఒక్కటి కూడా మీకు చూడ్డం ఇష్టం లేనప్పుడు ఇక వివరణాత్మక వ్యాసాలు వ్రాసి ఏం చేయాలో చెబుతారా?

      >>సమాధానాలు కూడా సాహిత్యం లో దొరుకుతాయి అని అంటున్నాను నేను

      సమాజమే చలనశీలి. చలనశీలమైన సమాజం నుండి ఏర్పడే సాహిత్యంలో అన్నిటికి సమాధానాలు దొరకడం సాధ్యమా? సరే మీకు వచ్చిన అన్ని ప్రశ్నలకూ పూర్తీగా సమాధానం చెప్పిన “సాహిత్య శకలం” గురించి చెబుదురూ?

      >>దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి . ఏదో ఒక రోజు చెప్పండి నాకేమి తొందర లేదు . మీకు నచ్చిన ఫోరం లో రాయండి .

      బౌద్ధ సమాజం గురించి ప్రశ్నలు ఉదయించినప్పుడు బుద్ధుణ్ణి, బుద్ధబోధను వెకిలిగా చిత్రించటం, శాకయ్య అని అతని పేరు మీద నవలలు వ్రాయటం, యముడికి పని లేకుండా పోయింది. అతడికి పని కల్పించడానికి విష్ణువు బుద్ధుడిగా పుట్టాడని వ్రాయటం – ఈ విషాన్ని ఐదవ తరగతి పిల్లల పాఠంలో పెట్టటం – ఇవన్నీ విశ్వనాథ వారి నిర్వాకాలేనండి. అదివరకే ఒక biased opinion అన్నది ఏర్పడినప్పుడు గడిచిపోయిన చరిత్ర తాలూకు nuances ను, అర్థమయ్యేలా చెప్పడమెలా సాధ్యమంటారో చెప్పండి?

      >>మీకు నచ్చిన ఫోరం లో రాయండి . లేదా ఈ విషయం పైన మీకు తెల్సినంతలో కూలంకషంగా >>విశ్లేషణ చేసిన ఏదన్నా మంచి రిఫరెన్స్ చెప్పండి .

      మజ్జిమనికాయం గురించి ఇదివరకే చెప్పాను కదండి. “ప్రయోజనమనుద్దిశ్య మందోऽపి న ప్రవర్తతే.” కనబడిన ప్రతివాడిని సన్యాసం పుచ్చుకొమ్మని బుద్ధుడు చెప్పలేదండి. ఏ సమాజమూ ప్రయోజనం లేక, తనంతట తానే ఉట్టి మునిగే బోధలను స్వీకరించదు.

      వీలైతే పుల్లెల రామచంద్రుడు గారి ధమ్మపదం పుస్తకపీఠిక చదవగలరు. మిళిందపన్హలో చాలా ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. మీరు ఒక్క అడుగు వేయకుండా విశ్వనాథతో ఆగిపోతానని చెబితే – నేనెందుకు వ్యాసాలు వ్రాసి మిమ్మల్ని ఒప్పించే బాధ్యత తీసుకోవాలో నాకు అర్థం కావటం లేదు.

      మీ దృష్టికోణం వేరని నాకు అర్థమయ్యింది. బహుశా వ్యాఖ్యలు వ్రాయడం నాదే తప్పు. మన్నించండి. సెలవు.

    4. Halley

      బాబోయి మీరు మళ్ళీ generalisations చేసేస్తున్నారు . సరే కానివ్వండి . అలా వదిలెయ్యండి . నేను పుల్లెల శ్రీరామచంద్రుడు గారి పుస్తకాలే చదువుతున్నాను ఇప్పుడు దర్శనాల విషయం లో . వారి పుస్తకాలూ ఒకటి రెండు వేరేవి కూడా చదివాను .

      “మీరు నిజానిజాలు చదివి తెలుసుకొమ్మంటే – practical కాదు”
      అంటే అన్నీ నేనే చదవాలి అంటే నా వల్ల కదండీ . నేనొక్కడినే శతాబ్దాల సకల సాహితీ వాజ్ఞ్మయాన్నీ చదివేయగలను అని అనుకోవట్లేదు .

      కౌముది లోని వ్యాసాలు చదువుతాను . ధన్యవాదాలు ఈ ముక్క చెప్పినందుకు .

      “ప్రతీత్య సముత్పాదాన్ని దుష్టసిద్ధాంతమని, వంకాయ అని గేలి చేయడం పట్ల మీ సమాధానం లేదెందుకో? ఆ ఒక్కటి కూడా మీకు చూడ్డం ఇష్టం లేనప్పుడు ఇక వివరణాత్మక వ్యాసాలు వ్రాసి ఏం చేయాలో చెబుతారా?”

      మీరేదో చెప్పాలి అనుకుంటున్నారు అని వివరం అడిగాను . మీరు పరీక్ష పెట్టి పాస్ ఔతేనే చెబుతాను అంటే వద్దు లెండి . పర్లేదు .

      “అన్నిటికి సమాధానాలు దొరకడం సాధ్యమా .. అన్ని ప్రశ్నలకూ పూర్తీగా సమాధానం”

      అని నేను ఎక్కడ అన్నాను ! .. సాహిత్యం ద్వారా సమాధానాలు కూడా దొరకవచ్చు . ప్రశ్నలు ఉదయించటం మాత్రమే జరగదు అని అన్నాను అంతే .

      “వీలైతే పుల్లెల రామచంద్రుడు గారి ధమ్మపదం పుస్తకపీఠిక చదవగలరు. మిళిందపన్హలో చాలా ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి.”
      మళ్ళీ థాంక్సు

      “మీరు ఒక్క అడుగు వేయకుండా విశ్వనాథతో ఆగిపోతానని చెబితే”
      ఇదిగో మళ్ళీ ! నేను ఇది తప్పితే వేరే చదవను అని నేను ఎక్కడన్నా చెప్పానా ? అసలు చదవటం ఇష్టం లేకపోతే నేను ఎందుకు అడుగుతాను చెప్పండి ?

      “నేనెందుకు వ్యాసాలు వ్రాసి మిమ్మల్ని ఒప్పించే బాధ్యత”
      మీకు ఇష్టం లేకపోతే వద్దు లెండి . మీరేదో వివరంగా చెప్పాలి అని అనుకుంటున్నాను . ఇక్కడ కాదు అని అంటేనూ ఒక ఆప్షన్ ఇచ్చాను . మరి మీరు ఏదో రాసేసి వెంటనే నేను ఒప్పేసుకోవాలి అని అంత తొందరలో ఉంటే ఎందుకు లెండి .

  7. రవి

    ఈ పుస్తకాన్ని గురించి చాలా వ్రాయాలనుకున్నాను కానీ అది విరమించి ప్రస్తుతానికి రెండు రెండు చిన్న ప్రశ్నలతో ఆపుతున్నాను.

    >>ఇక రాక్షసుడికీ సుమిత్రునికీ జరిగిన సంభాషణలో >>బౌద్ధం గురించిన కొన్ని వాదనలు నాకు బాగా >>నచ్చాయి. ఎప్పటి నుంచో నాకు బౌద్ధం విషయంలో ఈ సందేహాలు ఉండేవి. రాక్షసుడి సంభాషణా >>చాతుర్యం పుణ్యమా అని మళ్ళీ తలచుకున్నాను వాటిని.

    మీకు బౌద్ధంలో సందేహాలు వస్తే బుద్ధబోధ/బౌద్ధంమీద పుస్తకాలు చదివితే చక్కగా సమాధానాలు దొరుకుతాయి కదా? అదివరకే బుద్ధుని మీద, బౌద్ధం మీద biased opinion పెట్టుకున్న విశ్వనాథ సమాధానాలతో తృప్తి పడ్డం మంచిదేనంటారా? రామాయణంలో అనుమానం వస్తే వాల్మీకి రామాయణం చదువుతారా లేక రంగనాయకమ్మ గారి విషవృక్షం చదువుతరా?

    >>మీ బుద్ధుడు సృష్టి ఇట్లు జరుగునని చెప్పినట్లు లేడే. నామ రూపములు, పంచ స్కందములు, కామ >>క్రోధాది గుణములు లేకుండ ప్రవర్తించుట, మొదలైనవే చెప్పినాడు గానీ, సృష్టి యెట్లు జరిగినది? >>సృష్టి కర్త ఉన్నాడా లేడా? యన్న ప్రశ్న గానీ చెప్పినట్టు లేదు”

    సృష్టి కర్త ఉన్నాడు అంటే అతణ్ణి సృష్టించిన వాడెవ్వడు అన్న ప్రశ్న వస్తుంది. సృష్టి కర్త లేడు అనుకుంటే అసలదెలా మొదలయ్యింది అన్న ప్రశ్న వస్తుంది. ఏదో ఉపనిషత్తుల్లో ఇలాంటివి మాట్లాడారు, అంచేత వైదికమతం గొప్పది అంటే – గొప్పతనం సంగతి అటుంచండి. మీకు సమాధానం తెలిసిందా లేదా? తెలియలేదు కదా అడగవలసి వస్తుంది. బుద్ధుడు/నిజమైన బౌద్ధం ప్రకారం కొన్ని ప్రశ్నలు అవ్యాకృతాలు. కోడి ముందా గుడ్డు ముందా వంటివి. కొన్ని ప్రశ్నల వలన నిజమైన సమస్యలకు, జీవితంలో existential dilemmas కు సమాధానం దొరకదు. మీరు దీని గురించి బుద్ధుడి వరకు వెళ్ళనవసరం లేదు. నేటి బుద్ధుడు జిడ్డు కృష్ణమూర్తి చెబుతాడు – If u have sorrow and confusion, then look at your sorrow. Why do you go and ask questions to others? Why Sankara, Buddha are needed?

    ఇక్కడ నేను బుద్ధుణ్ణి నమ్మమనట్లేదు, లేదా ఆయనకు propaganda ఇవ్వట్లేదు. నిజాయితీగా సమాధానం వెతకమంటున్నాను. నిజానికి బుద్ధుడే తన మాటలను గుడ్డిగా నమ్మవద్దన్నాడు. నిజమైన రచన మీకు ప్రశ్నలు పుట్టించాలి. ఆ ప్రశ్నలను రగిలించడం ద్వారా మీరు చదువుతున్న రచన అవసరాన్ని పాఠకుడు అధిగమించేలా చేయగలగాలి. భగవద్గీత అయినా సరే మనం మనకోసమే కదండీ చదివేది?

    >>సన్న్యాసము మాట సరియే. అందరును సన్యాసులైనచో భిక్ష పెట్టెడి వాడు ఎవడు? భిక్ష పెట్టుటకు >>కొందరుండ వలెను. భిక్ష పెట్టెడి వారి సంఖ్య ఎక్కువ యుండ వలెయును. స్వీకరించెడి వారి సంఖ్య >> తక్కువ యుండవలయును

    Is it a genuine question or mud slinging? ఆలోచించండి.

    ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఉంది. మీకు సమాధానం కావాలంటే – వెతకాలి మరి. విశ్వనాథతో ఆగిపోయి ఆయన చెప్పే చవకబారు విశ్లేషణలతో ఆగుతారో లేక ముందుకు సాగుతారో అన్నది మీ ఇష్టం.నిజానికి ఈ పుస్తకంలో బుద్ధుడితో విభేదించడమో, వ్యతిరేకించడమో కాదు, మహా విషబుద్ధితో వక్రీకరించడం, అవహేళన చేయడం చేశాడీయన. అది ఖచ్చితంగా తప్పు.

    Intellectual honesty is much more important than intellect.

    పాఠకుడికి స్వీయసంస్కారోన్నతి లక్ష్యం కావాలే తప్ప రచయిత గొప్ప వాడు కాబట్టి లేదా “తెలుగు” వాడు కాబట్టి అతని రచనలు గొప్పవని స్థిరీకరించి అక్కడితో ఆగడం మంచిది కాదని నా ఉద్దేశ్యం. ఆపై మీ ఇష్టం.

Leave a Reply