కథ-2012

వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్ గార్ల సంపాదకత్వంలో ప్రతి సంవత్సరం కథా సాహితి వారు ప్రచురిస్తున్న ఉత్తమకథా సంకలనాల్లో 23 వది కథ 2012. మా డిట్రాయట్ తెలుగు లిటరరీ క్లబ్ సభ్యులు ఈ పుస్తకాన్ని నవంబర్ 17న జరిగిన సమావేశంలో చర్చించారు. చర్చలో పాల్గొన్న వారు: మద్దిపాటి కృష్ణారావు, వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, కట్టా మూర్తి, కట్టా విజయ, అడుసుమిల్లి శివ, బూదరాజు కృష్ణమోహన్‌, నర్రా వెంకటేశ్వరరావు, మారంరాజు వెంకటరమణ, ఆరి సీతారామయ్య.

ఈ సంకలనంలో 13 కథలున్నాయి. వీటిమీద జరిగిన చర్చాసారాంశం ఇదీ.

రాజారామమోహనరావు గారి ఉన్నంతలో, సత్యవతి గారి దమయంతి కూతురు. ఈ రెండు కథల్లో కొంత సారూప్యం ఉంది. రెండిట్లో భార్యలు భర్తలను వదిలేసి వెళ్ళి పోతారు. వెళ్ళిపోయిన స్త్రీలు ఇద్దరూ తల్లులే. ఈ సారూప్యం అంతవరకే. ఉన్నంతలో కథలో రామారావుకు యాద్రుచ్ఛికంగా అరుంధతితో పరిచయం అవుతుంది. ఆమె భర్త అనారోగ్యంగా, దాదాపు చివరి దశలో ఉంటాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆమెకు అండగా నిలబడి ఆమె భర్తకు వైద్యం చేయించి ఆమెకు దగ్గరవుతాడు రామారావు. ఇద్దరి మధ్యా శరీర సంబంధం ఏర్పడుతుంది. తర్వాత ఆమెను సొంతం చేసుకోవాలనే ఆశతో ఆమె భర్తను హోంలో చేర్పిస్తానంటాడు రామారావు. అరుంధతికి మరో ఆదరువు లేకపోయినా ఆ ప్రతిపాదనను ఆమె తిరస్కరిస్తుంది. భర్త ఉన్నంతకాలం అతన్ని తనే చూసుకుంటానంటుంది. తనను వదిలేసి వెళ్ళిన భార్యనూ, ఇంత హీనస్థితిలోఉండికూడా భర్తను విడిచిపెట్టడం ఇష్టంలేని అరుంధతినీ గురించి ఆలోచిస్తాడు రామారావు.

ఈ కథ చదివినప్పుడు అర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఒక స్త్రీని స్వాధీనం చేసుకోవటానికి రామారావు చేసిన ప్రయత్నం జుగుప్స కలిగిస్తుంది. అతని భార్య అతణ్ణి వదిలేసి వెళ్ళిపోవటానికి కారణం అతని స్వార్థపరత్వం కావచ్చు అనిపిస్తుంది. అవకాశం దొరికింది కదా అని అరుంధతి పరిస్థితిని అతను అనుకూలంగా వాడుకున్నాడు. ఇది అన్యాయం అనిపిస్తుంది. భర్తను వదిలేసి వెళ్ళిన భార్యనీ, భర్తకు అంకితమయ్యి సేవచెయ్యాలనుకున్న అరుంధతినీ పోల్చి రచయిత పాతివ్రత్యాన్ని సమర్థిస్తున్నాడా అనిపిస్తుంది – ఇది ఒక అభిప్రాయం.

కథలో పాత్రల స్వభావాలు మనకు అసహ్యం కలిగించినా సంతోషం కలిగించినా, వాటి ప్రవర్తన సహజంగా ఉన్నది అనటంలో ఎలాంటి సందేహం లేదు. పాత్రలను ఏదో సందేశానికి అనుగుణంగా వాడుకోవటం కాకుండా సజీవంగా చిత్రించటం ఈ కథలో ఉన్న ఉత్తమ లక్షణం అని చెప్పొచ్చు.

పరిస్థితులకు కొంతవరకు లొంగి పోయిన స్త్రీ గురించి రాయకూడదా? రాస్తే ఆ ప్రవర్తనను సమర్థించటం అవుతుందా? భర్తను చివరిదాకా చూసుకుంటానన్న స్త్రీని చిత్రిస్తే పాతివ్రత్యాన్ని సమర్థించటమా? రామారావుతో అరుంధతికి ఉన్న సంబంధం ఆర్థిక అసమానతలవల్ల ఏర్పడిన సంబంధమే. ఆ సంబంధానికి ఆమె ఎందుకు అంగీకరించింది? కోరిక తీరిస్తేగాని డబ్బివ్వడని వొప్పుకుందా? డబ్బిస్తున్నాడుకదా అని వొప్పుకుందా? నాకూ సుఖంగానే వుందికదా అని వొప్పుకుందా? తన పరిస్థితి గురించి ఆలోచించాల్సొచ్చింది అరుంధతికి. ఆ సంఘర్షణ గురించి రాశాడు రచయిత. ఆమె చివరకు భర్తను వొదిలెయ్యటానికి వొప్పుకోలేదు. రామారావునే తిరస్కరించింది. అలా చెయ్యటానికి కారణం పాతివ్రత్యమే కాదు, బాధ్యతా, మానవత్వం కూడా కారణాలే – ఇది మరొక అభిప్రాయం.

అరుంధతి చేసింది మంచిపనా? త్యాగంచేసి కట్టుకున్న వాడికి అంకితం కావటం మంచిదా, కాదా? మంచి స్త్రీ ఇలాగే ప్రవర్తించాలని మనం ఆశించాలా, కూడదా? ఆమె అతనూ కావాలనుకుంది, ఇతనికీ అనుకూలంగా ఉంది. ఆ ప్రవర్తన మీకు సమ్మతమేనా? మీరేమంటారూ? అంటున్నాడు రచయిత. కథలో తను జోక్యం చేసుకోకుండా, మీరే ఆలోచించండి అంటున్నాడు. పాఠాలు చెప్పటంకాకుండా (చెప్పే కథలుకూడా ఉన్నాయి ఈ సంకలనంలో) ప్రశ్నలు అడగటం సమాధానాలు వెతుక్కోవటం పాఠకులకే వదిలేసిన అరుదైన తెలుగు కథ ఉన్నంతలో.

మాతృత్వం, పాతివ్రత్యమే కాకుండా జీవితానికి మరెన్నో కోణాలుంటాయని చూపించే మరో మంచి కథ సత్యవతి గారి దమయంతి కూతురు. కథలో దమయంతి లేకపోయినా ఆమెను ఒక సుస్థిరమైన వ్యక్తి గా చూపించారు సత్యవతి గారు.

ఆమె భర్తను వదిలేసి వెళ్ళిపోవటానికి కారణం, “నేను భూలోకపు మనిషిని. ఆమె వూర్ధ్వలోకపు మనిషి. ఇక్కడ ఉండలేక ఆమె వెళ్ళిపోయింది” అని భర్తే అంటాడు. ఆమె వెళ్ళిపోయేటప్పటికి కూతురు ఇంకా చిన్నపిల్ల. తల్లి తనను వదిలేసిపోవటం ఆ అమ్మాయి తట్టుకోలేదు. తల్లికోసం తపించిపోతుంది. పెద్దదయిన తర్వాత కూడా భర్తను వదిలేసివెళ్ళిన (లేచిపోయిన) ఆమె కూతురుగా ముద్రపడి పెళ్ళిచూపులకు వచ్చేవారు అడిగే ప్రశ్నలకు బాధపడుతుంటుంది.

కూతురుకు ఇలా జరుగుతుందని తల్లికి తెలియదా? మరెందుకు వెళ్ళిపోయింది? తన సుఖం తప్ప ఆమెకు మరే ఆలోచనా లేకుండా పోయిందా? దమయంతి కూతురుకూ, కథ చదివేవారికీ ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది కథ చివర్లో. రచయిత జోక్యం లేని, సజీవ పాత్రలుగల మంచి కథ దమయంతి కూతురు.

స్కై బాబా గారి అతడు ఉద్యమాల్లో పాల్గొనేవాడు, పెళ్ళిచేసుకుని సంసారిగా మారాడు, కొన్ని సంవత్సరాల తర్వాత సంసారం విచ్చిన్నం అయింది, ఇప్పుడు మళ్ళా ఉద్యమాల్లో పాల్గొంటున్నాడు. ఇదీ కథ.

ఇదొక సందేశం కథ. ఒక్కరికోసం (భార్యకోసం) నలుగురికి (ఉద్యమాలకు) దూరం కావటం కంటే నలుగురికోసం ఒక్కరికి దూరం కావటం ఉత్తమ లక్ష్యం. ఇదీ రచయిత భావం. కథలో సూటికా చెప్పిన విషయం. “సామాజిక బాధ్యత తెలిసినవారు, తాము చెయ్యాల్సిన పని వేరే ఉందనే గ్రహింపు ఉన్న వారు కూడా ఉద్యోగాలూ, సంసారాల ఊబిలోకి మాయమై పోతుండటం బాధాకరం” అని రచచయిత కితాబిచ్చారు.

చదివేవాడికి ఉద్యమాల్లో పాల్గొనాలనే ఆసక్తి కలిగించే విధంగా కథ రాసినట్లయితే బాగానే ఉండేది. కాని రచయిత అలాంటి ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఆరున్నర పేజీల కథలో మొదటి రెండు పేజీలూ తెలుగు సినిమాల్లో హీరోకి బిల్డప్ ఇచ్చినట్లుగా “అతడి” గురించి చెప్తాడు కథకుడు. అతడు ఎప్పుడూ ఆలోచిస్తాడు. “ఆలోచనల కర్మాగారం” అతడు. ఎంత “డిఫరంట్‌గా ఆలోచిస్తాడో!”. ఈ రెండు పేజీల్లో ఆలోచన అన్న మాటను పదహారు సార్లు వాడి కూడా అతడికి వచ్చిన ఒక్క ఆలోచన గురించి కూడా వివరంగా చెప్పలేదు కథకుడు. పైగా “నా ప్రభోధం అవసరమే అతడికి రాకపోవటం అతడి మేధోశక్తికి నిదర్శనం” అంటాడు గిరీశం లాగా. దాంతో మనకు అతడి గురించే కాకుండా కథకుడి మేధోశక్తి మీద కూడా గౌరవం ఏర్పడి ఉండాలి.

కథ రాసే ముందు ఎవరి దృష్టికోణంలో రాస్తే తను చెప్పదలచినది వ్యక్తం అవుతుందో రచయిత దీర్ఘంగా ఆలోచించాలి. ఇతర పాత్రల మనసుల్లో ఏముందో ప్రకటించాలంటే రచయితకు సర్వ సాక్షిదృష్టికోణం అవసరం. “తమ సంసారం మొదలైనప్పటి జ్ఞాపకాలు ఆవరించాయి అతడిని”, “ఈ పరిస్థితిని ఇలాగే మిగుల్చుకోగలడా అని అతడు ఆలోచిస్తున్నాడు” ఇలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి ఈకథలో. ‘అతడు’ ఏం ఆలోచిస్తున్నాడో కథకుడికి ఎలా తెలిసింది? పైగా “కథ” చివర్లో “‘అతడి’ దృష్టికోణం నుంచి జరిగిన కథ కదా ఇది…” అంటాడు కథకుడు. నిజానికి కథ చెప్పింది కథకుడు. మొదటి రెండు పేజీల్లో ఊకదంపుడు అంతా కథకుడి దృష్టికోణం నుంచే. మరి అతడి దృష్టికోణం నుంచి ఎలా అవుతుంది? పైగా దృష్టికోణం నుంచి జరగటం ఏంటీ?

కథ ‘అతడి’ దృష్టికోణం నుంచి చెప్పాల్సిన అవసరం ఉందని రచయిత గ్రహించినట్లయితే, అతడి దృష్టికోణం నుంచే చెప్పుంటే బాగుండేది. ఉద్యమాల్లో పాల్గొనాలనే చైతన్యం రావటంవల్ల అతను భార్యను వదిలేశాడని కథకుడి ఉవాచ. కాని కథలో అలా జరగలేదు. “మనం విడిపోదాం” (మూడో పేజీ), “మరి చేతకానిదానికి పెళ్ళెందుకు చేసుకున్నావు, వదిలెయ్, ” (ఐదో పేజీ) అని ఆమే అంటుంది. విడిపోదామనే ప్రస్తావన మొదట వ్యక్తం చేసింది ఆమె, అతను కాదు. కాని కథ మొదట్లో (రెండో వాక్యం) “చివరికి తనను వదిలేస్తాడని అతడి భార్యే నమ్మలేకపోయింది” అంటాడు కథకుడు. ఎవర్ని ఎవరు వదిలేశారు అన్న విషయంలో రచయితకూ కథకుడికీ పొంతన లేదు.

తెలుగు కథల్లో మంచిపాత్రను చిత్రించాలంటే, సంపాదకుల దృష్టికి రావాలంటే, ఆ మనిషిని వామ పక్ష భావాలున్న వాడిగానో ఉద్యమాల్లో పాల్గొనే వాడిలాగానో చిత్రించటం అవసరం అయిపోయింది. ఇక రాముడు మంచి బాలుడు అని చెప్పదలిస్తే వూళ్ళొ ఉన్న ఉద్యమాలన్నిట్లోనూ అతడు చురుగ్గా పాల్గొనాలి. మన “కథ” లో అతడు “బాధితులు – పీడితులు – అణగారిన జాతులైన దళితులు, స్త్రీలు, బహుజనులు, ముస్లింలు” అందరి గురించి ఆలోచించేవాడు, ఉద్యమించేవాడు. సారా వ్యతిరేక ఉద్యమం వాళ్ళ వూళ్ళో జరగలేదేమో.

ఏదో ప్రయోజనంకోసం కథ రాయటం కొత్త గాదు. కాని ప్రయోజనం కథ చదివిన పాఠకులకు స్ఫురించాలిగాని పాఠంలా చెప్పకూడదు. చెప్పదల్చుకున్న దానికి తగిన పాత్రలను సృష్టించటం, సన్నివేశాలను కల్పించటం అవసరం. అంత ఓపిక లేక కార్డ్ బోర్డ్ పాత్రలను కథకెక్కించి పాఠాలు చెప్పే కథలు ఉత్తమ కథలుగా ఎందుకు ఎలా ఎంపిక అవుతున్నాయి?

అఫ్సర్ గారి ముస్తఫా మరణం లో ముస్తఫా ఒక మౌలానా. మసీదులో ముస్తఫా ప్రసంగాలు అందరినీ ఆకట్టుకునేవి. కాని ముస్తఫాలో మార్పు వచ్చింది. ఏదో ఆధ్యాత్మిక చింతనలో పడిపోయి మసీదు వదిలేశాడు. ఎప్పుడూ ఒక చిన్న గదిలో ఉండేవాడు. అతన్ని చూడటానికి భక్తులు వచ్చేవారు. కుటుంబ బాధ్యతలు వదిలేశాడు ముస్తఫా. భక్తుల సంఖ్య పెరిగింది. పూజలూ వ్రతాలూ పెరిగాయి. మతానికీ, కుటుంబానికీ దూరమయిన ముస్తఫా చివరకు చనిపోయాడు. అతని కుటుంబం అతని గదిని పడగొట్టేసింది. అతని మార్గానికి అది ముగింపు. ఇది సులభంగా చదివించిన కథ. ముస్తఫాలో వచ్చిన మార్పును అతని కుటుంబం గర్హిస్తుంది. కానీ భరిస్తుంది. అతను చనిపోవటం ఓ విధంగా వారికి విముక్తి కలిగించింది. ఒక కుటుంబం కథగా ఇది మంచి కథ. రచయిత జోక్యం లేకుండా సాగిన మరోకథ.

మొదటిసారిగా ఈ సంకలనంలో రచయితలు తమ కథల నేపధ్యం గురించి నాలుగు మాటలు చెప్పారు. అఫ్సర్ గారు ముస్తఫా మరణంగురించి రాస్తూ, “వర్తమాన భారతీయ ముస్లింల మానసిక, తాత్విక సంక్షోభానికి అద్దంపట్టే జీవితం ముస్తఫా మరణం” అన్నారు. అలాంటి సంక్షోభం ఈ కథలో కనపడదు. “మతాన్ని ఒక భావనగా చూడకుండా ఒక ఒక ఇరుకైన విధానంగానో, సంకుచిత వ్యవస్థగానో మారిస్తే దాని పర్యవసానాలు ఆ మతం మరణానికి దారి తీస్తాయని ముస్తఫా అనే పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నమే ఈ కథ” అని కూడా అన్నారు అఫ్సర్ గారు. ఇంత విశాలమైన పరిధి ఈ కథలో లేదు. ఇస్లాం ఒక భావన అని కానీ, ముస్తఫా ఎంచుకున్న మార్గం సంకుచితమైనదనిగానీ కథ చదువుతున్నప్పుడు అనిపించదు. తమ మతాలతో సంతృప్తి చెందని వారు కొత్త మార్గాలు వెతకటం కొత్త విషయమేమీ కాదు. అలాంటి ప్రయత్నాలకు, (అవి మంచివా చెడ్డవా అనే విషయం వదిలేసి), వ్యతిరేకత ఉండటమూ సహజమే. ముస్తఫా విషయంలో అతని కుటుంబం అతన్ని వ్యతిరేకించింది. బాబాలాగా మారి డబ్బుసంపాదించి ఉంటే అలా ఉండేది కాదేమో. ముస్తఫా మాత్రం డబ్బు మనిషి కాదు. నిజంగానే తను భక్తులకు చేస్తున్న సేవ “ఆధ్యాత్మికంగా ఉన్నతమయిందనీ, పవిత్రమయిందనే భావనలో ఉన్నాడు”. ఈ కథ చదువుతున్నప్పుడు ముస్తఫా మీద సానుభూతి కలగదు, వ్యతిరేకతా కలగదు. అతను చేసిన పని సంకుచితమైనది అనిపించదు. అలా రచయితకు అనిపించి ఉంటే అది ఈ కథలో ప్రతిఫలించలేదు.

సువర్ణ కుమార్ గారి హుస్సేన్‌ మై ఫాదర్. ఇది ఒక (తెలుగు) సినిమా కథలాగ సాగుతుంది. నలభై సంవత్సరాల తర్వాత తారసపడిన బాల్యమిత్రులు, సరైన సహచర్యం దొరక్క ఒంటరిగా ఉంటున్న వాళ్ళు, పరస్పరం సడెన్‌ గా ఆకర్షితులవుతారు. “నాతో నా భాష మాట్లాడగలిగే ఒక్క మనిషి తోడూ సంపాదించుకోలేకపోయాను” అని చెప్పుకున్న డేవిడ్ కి ఆమె గురించి పెద్దగా తెలియదు. ఇంటర్నెట్ సెర్చ్ ద్వారా ఆమె గురించి కొంత సమాచారం సేకరిస్తాడు. “ఆర్టిస్ట్ గా బతకటం కోసమే నేను పెళ్ళి వద్దనుకున్నాను. నాకు అశాంతి కావాలి. నన్ను కాల్చేసే నిప్పేదో వెంట ఉండాలి” అంటాడు ఆమెతో. అశాంతీ నిప్పూ ఆమె దగ్గర దొరుకుతాయని అనుకోవటానికి కారణం అర్థం కాదు. పైగా అలాంటి ప్రతిపాదనకు ఆమె ఒప్పుకోవటానికి కారణం ఏంటో మనకు తెలియదు. చివరకు “నేను వెదుకుతున్న ప్రియురాలివి నీవేననిపించావు” అంటాడు.

వీళ్ళిద్దరిరికీ పరస్పర అవగాహన లేదు. దానికి కావలసినంత పరిచయం లేదు. నలభై సంవత్సరాల తర్వాత కలిసిన బాల్యమిత్రుల మధ్య మళ్ళా సాన్నిహిత్యం చిగురించటం సహజం. దాన్ని అంతవరకూ చిత్రిస్తే సరిపోయేది. “ఎప్పటికీ విడిపోగూడదనుకున్నారు మనసుల్లో” అని చెప్పటానికి కావలిసినంత లోతు కనిపించదు వాళ్ళ సంబంధంలో. మా సభ్యుల్లో ఎవ్వరికీ నచ్చని కథల్లో ఇదొకటి.

సామాన్య గారి మహిత. అల్లారు ముద్దుగా పెరిగిన మహితను భర్త హింసిస్తాడు, చివరకు చంపేస్తాడు. మళ్ళా పెళ్ళిచేసుకుంటాడు. కథ కంట తడిపెట్టిస్తుంది. కాని కథలో ముఖ్యమయిన లోపం క్లుప్తత. కథకు తగిన వాతావరణం అవసరమే. కాని మితిమీరి సాగదీసినట్లు కనిపించే సన్నివేశాలు ఇలాంటి కథ చదువుతున్నప్పుడు పాఠకులనుభవించే భావతీవ్రతను పల్చబడేట్టు చేస్తాయి.

విమల గారి కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు విప్లవ మార్గాన్ని నమ్ముకుని అజ్ఞాతంగా అడవుల్లో వున్న వారు మాత్రమే రాయగల కథ. ఉత్తమ పురుషలో చెప్పిన కన్నీళ్ళు తెప్పించే ఈ కథలో “ఆమె” కొందరు యువకులను పని మీద పంపిస్తుంది. వారిలో ఇద్దర్ని పోలీసులు కాల్చి చంపేస్తారు. పంపించిన వారిలో చనిపోయిన వారెవరో ఆమెకు తెలియదు. చంపేసిన వారికి దహన సంస్కారాలు చేస్తున్న పోలీసులు ఎవ్వరినీ, బంధువులనూ భార్యా బిడ్డలనూ కూడా, చితి దగ్గరకు రానివ్వరు. చనిపోయిన కుర్రవాళ్ళను తన చేతులమీదుగా పంపించానన్న భారంతో “ఆమె” దుఃఖిస్తుంది.

చనిపోయిన వాళ్ళలో ఒకతను మాధవ కావచ్చని ఆమె అనుమానం. మాధవ ఒకమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ పెళ్ళికి సుముఖంగా లేరు. “ఆమె” చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారని మాధవ ఆశ. ఇప్పుడు మాధవ ఇక లేడేమో.

ఈ కథ సందేశాల కోసమో, నీతులు చెప్పటానికో రాసిన కథ కాదు. తనకు తెలిసిన ఒక వాతావరణాన్ని నిర్దిష్టంగా చిత్రిస్తూ, ఓ విషాద ప్రేమ గురించి నిజాయితీగా రాశారు రచయిత్రి.

రచనా శైలిలో రచయిత్రి ఒక కవయిత్రి అన్న విషయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా, చనిపోయిన కుర్రవాళ్ళెవరో తెలియని స్థితిలో, తెలిసిన వాళ్ళు పోతేనే బాధ కలుగుతుందా, తెలియనివాళ్ళు పోతే? మాధవ కలలేంటో తనకు తెలుసు, తెలియని వాళ్ళు ఏం కలలు కన్నారో తెలియదు కదా? ఎవరైతేనేం, వారిని చివరిసారిగా చూసే అనుమతి ఇవ్వరేం అని “ఆమె” దుఃఖిసున్న సన్నివేశం పాఠకుల్ని కదిలిస్తుంది. ఇది సులభంగా చదివించిన కథ. వాస్తవికంగా కనిపించిన కథ.

వేంపల్లె షరీఫ్ గారి టోపీ జబ్బార్ మరో మంచి కథ. చిన్న పిల్లలకు అందరితో కలిసిపోవాలనే ఉంటుంది. వేరుగా కనపడటం ఇష్టం ఉండదు. నమాజ్ తర్వాత టోపీ దాచేస్తుంటాడు జబ్బార్. అమ్ములు తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకు రావటం, ఎక్కిరిస్తున్న పిల్లల్ని ఆఅమ్మాయి పట్టించుకోకపోవటం, జబ్బార్ కు కనువిప్పవుతుంది. ఇది కూడా సులభంగా చదివించిన కథ. పాత్రోచితమైన భాష, సహజమైన సంభాషణలు మా సభ్యులందరినీ ఆకర్షించాయి.

పెద్దింటి అశోక్ కుమార్ గారి జుమ్మేకి రాత్ మే కథకు నేపధ్యం దుబాయ్ మస్కట్ లకు వలస వెళ్ళిన వారు ఎదుర్కుంటున్న సమస్యలు. ఈ కథమీద జరిగిన కొద్దిపాటి చర్చలో ముఖ్యాశం భాష. ఈ కథలో కొన్ని సంభాషణలు హిందీలోనో ఉర్దూలోనో ఉన్నాయి. అవి మా సభ్యులకు అర్థం కానివి. తెలుగులో కథ రాస్తున్నప్పుడు సంభాషణలు తెలుగులో రాస్తే వచ్చే నష్టం ఏంటీ? రాయనందువల్ల వచ్చే నష్టం కొందరికవి అర్థం కాకపోవటం.

వారణాసి నాగలక్ష్మి గారి వారధి ఒక ప్రయాణం కథ. తనకు ఇష్టం కాని అమ్మాయిని కొడుకు చేసుకోవటం, వారికి పిల్లలు పుట్టక ఒక అబ్బాయిని దత్తు తీసుకోవటం, ఆ కొడుకు కుటుంబంతో ఈమె ఋషీకేష్ వెళ్ళటం, అక్కడ గడిపిన కొన్ని రోజుల్లో నాయనమ్మ మననడికి చేరువ కావటం కథాంశం. ఇదీ సులభంగా చదివించిన కథే. కొంచెం దూరంగా ఉంచిన కొడుకు కుటుంబానికీ మనవడికీ ఆమె నెమ్మదిగా దగ్గరవటం రచయిత్రి సమర్థవంతంగా చిత్రించారు.

స. వెం. రమేష్ గారి రయిక ముడి ఎరగని బతుకులో ముఖ్యాంశం భాష అని చెప్పుకోవచ్చు. ఆంధ్రేతర ప్రాతంలో వాడుకలోఉన్న తెలుగు పదాలను పరిచయం చేస్తూ రాసిన మంచి కథ. కన్నెమ్మ ఓ కష్ట జీవి. బుచ్చమ్మను గుర్తు చేస్తుంది ఆమె జీవితం. బాల్యంలోనే భర్త పోయిన కన్నెమ్మ తన కుటుంబంలోనే పని మనిషిగా మిగిలిపోతుంది. ఆమె చుట్టూ ఉన్న కుండా, బొట్టా, తిరగలి లాంటి వస్తువులద్వారా చెప్పించిన ఈ కథ పంచతంత్ర కథల్లగా, సాలభంజికల కథల్లాగా సాగుతుంది. మంచి కథనం. తర్వాతేమయిందో అని ఉత్కంఠ కలిగిస్తుంది.

కాకపోతే వాడుక మరుగవుతున్న తెలుగు పదాలను వెలుగులోకి తీసుకురావాలన్న ప్రయత్నంలో ఈ కథలో క్లుప్తతలోపించింది. తెలుగు మాటల వాడుక మాకందరికీ ఎంతో సంతోషం కలిగించినా కథలో అక్కడక్కడా దృష్టి కథమీదకంటే మాటలమీద ఎక్కువగా ఉన్నట్లనిపించింది. మరో విషయం. ఈ సంకలనంలోని కథల గురించి రాసిన శివశంకర్ గారు “జన విస్థాపనలు”, “అంతర్లోకచలనాలు”, “అగ్నిరాహిత్యం” లాంటి మాటలు వాడారు. సా. వెం. రమేష్ గారి లాగా తెలుగు పదాలు వాడితే ఎంత ముచ్చటగా ఉండేదో అనిపిపించింది.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి బిలం. కథకు ఉండాల్సిన గుణాల్లో చదివించే గుణం అన్నిటికంటే ముఖ్యమయింది. అవసరం లేని మాటలూ, మలుపులూ లేకుండా చూసుకుంటే, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకుండా ఉంటే, కథ చదవటం సులభం అవుతుంది. పేజీలు తిప్పేద్దాం అనిపించదు. తర్వాతేమయిందో చూద్దాం అనే ఉత్కంఠ కలుగుతుంది. బిలం పదహారు పేజీల కథ. ఇందులో రెండు కథా వస్తువులను ముడివేసే ప్రయత్నం జరిగింది. ఒకటి కోడళ్ళు తరతరాలుగా అనుభవిస్తున్న అత్తగారింటి హింస. ఇంకొకటి మూఢ నమ్మకాలు. తన భార్యకు దయ్యం పట్టటానికి కారణం ఇస్తామన్న కట్నం ఇవ్వలేక ఆమె తల్లిడండ్రులు పడిన అవస్థలు అని గోపాల్ చెప్తాడు. రమణ భార్యకు దయ్యంపట్టటానికి కారణం కూడా అదేనన్న విషయం పాఠకులకు వెంటనే అర్థం అవుతుంది. అది రచయిత గమనించి నట్లులేదు. మరో నాలుగు పేజీలు రాసి రమణకు కూడా ఆ విషయం అర్థం అయిందని చెప్తాడు. ఇక మిగతా కథలో బిలాలూ, సొరంగాలూ, గబ్బిలాలూ మళ్ళీ మళ్ళీ వచ్చి విసిగిస్తాయి. బిలంలోకి పగటిపూట వెళ్ళిన రమణ (రెండున్నరపేజీలు) మళ్ళా రాత్రికి వెళ్తాడు. పగలు వెళ్ళకపోతే కథకు ఏమీ లోపం ఉండేది కాదు. రెండు మూడు పేజీలు తగ్గేవి. మొత్తం మీద ఐదారు పేజీల్లో జరగాల్సిన కథ పదహారు పేజీల్లో విసిగించింది.

జి. వెంకటకృష్ణగారి దేవరగట్టు. విగ్రహాలను పల్లకిలో వూరేగించే గుంపొకటి, వారికి విరుద్ధంగా మరొకటి, వీటి మధ్య ఘర్షణ, ఆ ఘర్షణలో కొందరి తలలు పగలటం – ఇది ప్రతి సంవత్సరం దేవరగట్టులో జరిగే జాతర. ఇది అనాగరికరం అని ప్రజలకు బోధించే ప్రయత్నంలో ఒక ఉద్యమకారుడూ అతని మిత్రులైన ఒక భార్యా భర్తా. భర్త (దేవేంద్రుడు) భార్యను హింసిస్తుంటాడు తాగుడుకు డబ్బు ఇవ్వమని. హింస గురించి ఈ దేవేంద్ర గారికి ఒక తాత్విక దృక్పథం ఉందట, ఒక మనిషి ఇంకొక మనిషిని హింసించటం ఆత్మ విముక్తి కోసం అని. హింసించినా విముక్తి పొందలేక పదేపదే హింసిస్తూ అందులో కూరుకుపోతారట మనుషులు. “హింసకు ఉన్న మూలాలను తాత్విక స్థాయిలో చర్చించే ప్రయత్నంలో రూపొందిందే ఈ కథ” అని రచయిత చెప్పుకున్నాడు.

చర్చలు వ్యాసాల ద్వారా జరగాలి. రచయితకు హింస గురించి తాత్విక దృక్పథం ఒకటి ఉంటే దానిమీద ఒక వ్యాసం రాయాలి. అర్హత ఉన్న వారు దానిమీద చర్చ జరపవచ్చు. కాని అలాంటి చర్చలు కార్డ్ బోర్డ్ పాత్రలద్వారా కథల్లో జరిపినందువల్ల ప్రయోజనం ఏంటీ?

హింస గురించి తాత్విక చర్చ జరపటానికి రచయితకు ఉన్న అర్హత ఏంటీ? దేవేంద్ర పాత్ర ద్వారా రచయిత చేస్తున్న బోధ ఏంటీ? తాగుబోతు దేవేంద్రగారు భార్యను హింసించటం విముక్తి కోసం అంటాడు. తన విముక్తి కోసం జనంలోకి దూకి దెబ్బలు తిని, బయటకొచ్చి హింసను జయించాను అంటాడు. దాంతో ఉక్కిరిబిక్కిరి అయిన ఉద్యమ మిత్రుడు అడవిలోనే కాదు మైదానంలో (సమాజంలో)గూడా మనం హింసను జయించాలి అంటాడు. శుభం. రచయితకు హింస గురించి శాస్త్రీయ జ్ఞానం ఏమైనా ఉందా? ఈ కథ చదివి ఎవడైనా విముక్తికోసం పెళ్ళాం బిడ్డలను చితగ్గొట్టేస్తే దానికి బాధ్యత ఎవరిది? సంపాదకులదా?

మొత్తం మీద కథ 2012 లో వచ్చిన కథల్లో ఎక్కువ భాగం మంచి కథలని చెప్పుకోవచ్చు. కథ 2011 లోకంటే ఈ సంకలనంలో ఎక్కువ మంచి కథలున్నాయని మా సభ్యుల అభిప్రాయం. కాని కొన్ని కథలు చదువుతున్నప్పుడు కథల మంచిచెడ్డలకు మించిన మరేవో కారణాలవల్ల ఎంపిక జరుగుతుందనే అభిప్రాయం కలుగుతుంది.

You Might Also Like

6 Comments

  1. ఆరి సీతారామయ్య

    రాఘవరెడ్డి గారు, మంజరి లక్ష్మి గారు: మీ అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు.
    తిరుపాలు గారు: “పాత్రలను ఏదో సందేశానికి అనుగుణంగా వాడుకోవటం కాకుండా సజీవంగా చిత్రించటం” – మా అభిప్రాయం ఈ మాటల్లో సంపూర్ణంగా వ్యక్తం అయిందనే నేను అభిప్రాయపడుతున్నాను. పాత్రలకు గానీ విమర్శకులకు గానీ దృక్పధాలు ఉండవని మేము అనుకోవటం లేదు. కేవలం తమ సందేశాన్ని పాఠకులకు వినిపించడంకోసం పాత్రల సహజ ప్రవృత్తులను లెక్కచెయ్యకుండా రాయటాన్నే మేము ఇష్టపడనిది. ఉదాహరణకు రాజారామమోహనరావు గారి కథ చూడండి. రామారావూ, అరుంధతీ అట్టబొమ్మల్లాంటి నీతులు బోధించే పాత్రలు కావు. ఉదాత్తమైన పాత్రలు. రాముడు మంచి బాలుడు అన్నరీతిలో రాయటం సులభం. సందర్భాన్ననుసరించి అయాపాత్రల్లోని బలహీనతలను కూడా ఆవిష్కరించగలగటం రచయిత ప్రతిభకు నిదర్శనం అని మా సభ్యుల అభిప్రాయం.

    స్కైబాబా గారు: కథ ఎవరు చెప్పారా అన్న విషయంలో అర్థం కానంత క్లిష్టత ఏమీ లేదు. కథ చివర్లో, ” అతడి అంతరాత్మగా నేనే ముందుండాలి” అని ఉంది. అంటే అంతరాత్మ చెప్పిన కథ అని కథకుడు చెప్తున్నాడు. కానీ ఈ కథ అంతరాత్మ నేరేటివ్ గా ఏ మాత్రం లేదు. ప్రథమ పురుషలో సాగే వివరణ లాగా ఉంది. మొదటి రెండు పేజీల్లో ఉన్న హీరో బిల్డప్ చూస్తే చాలు ఇది తెలియడానికి.

  2. Thirupalu

    మిత్రులారా! మీ మిత్ర మండలి చర్చ కధా సాహిత్య సమీక్ష బాగా ఉంది! మీరు ఈలాంటి చర్చ చేస్తున్నందుకు ధన్య వాధాలు! అయితే…

    ” కథలో పాత్రల స్వభావాలు మనకు అసహ్యం కలిగించినా సంతోషం కలిగించినా, వాటి ప్రవర్తన సహజంగా ఉన్నది అనటంలో ఎలాంటి సందేహం లేదు. పాత్రలను ఏదో సందేశానికి అనుగుణంగా వాడుకోవటం కాకుండా సజీవంగా చిత్రించటం ఈ కథలో ఉన్న ఉత్తమ లక్షణం అని చెప్పొచ్చు. ”

    ఏ దృక్పధం లేని సజీవత అనేది ఒకటి ఉందా? మనిషన్న వాడు అలా ఉండటం సాధ్యమే నంటారా? మీరు కూడా మీదైనా ఒక దృక్పధం నుండి సమీఖను చేస్తున్నారు మరిచి పోకండీ. మీ ది పలానా అని చెప్పటం లేదు కాని మీరే మీ సమీక్షను తరచి చూసుకోండి తెలుస్తుంద్‌. మనిషి పుట్టి పెరగటంళొనే ఏదో ఒక తాత్విక దృక్పధం అతనికి/అమెకు వస్తుంది. దాన్నుండే వారు ప్రపంచాన్ని చూడగలుగు తారు. మీరనుకున్న్ట్లు సజీవ పాత్రలుండవు. అలా అనుకోవడం కూడా ఒక దృక్పధమే. మానవ సమాజం ఎన్ని రీతులు పోతుందో మనిషి కూడా అన్ని రీతులు పోతాడు. సజీవిత నిర్జీవితా అంటూ ఎమీ ఉండదని అని నేను అనుకుంటున్నాను. ఇది తాము ఎటూ కాకమధ్యస్తులు- అంటే బ్యాలంస్డ్‌ గా ఉన్నాము అనుకోనే వారు సృష్టించుకున్న మాట!

    1. skybaaba

      Thirupalu గారి అభిప్రాయం బాగుంది.. నిజానికి విమర్ష, సమీక్ష లు, కడుపు నిండిన వారు చేసినప్పుడు ఒక తీరుగా, కడుపు మండిన వారు చేసినప్పుడు మరో రకంగా ఉండడం కూడా గమనించాలి..

  3. skybaaba

    నా కథ ‘అతడు* పైన అంత చర్చ జరిగినా, కథ ఎవరు చెప్తున్నారో కూడా అర్దం కాలేదంటే ఆశ్చర్యమేసింది..!

  4. raghava reddy

    wonderful analysis-అయితే “ఉన్నంతలో” అనే కధ పైని అభిప్రాయం..?అది అంత బాగా ఉన్నట్టు లేదు.

  5. మంజరి లక్ష్మి

    “రచయితకు హింస గురించి శాస్త్రీయ జ్ఞానం ఏమైనా ఉందా? ఈ కథ చదివి ఎవడైనా విముక్తికోసం పెళ్ళాం బిడ్డలను చితగ్గొట్టేస్తే దానికి బాధ్యత ఎవరిది? సంపాదకులదా?” ఈ వాక్యం చాలా బాగుంది

Leave a Reply