శ్రీశ్రీ హృదయగానం
వ్యాసకర్త: డా.వై. కామేశ్వరి(9441778275)
ఆధునిక కవిత్వంలో పరిశోధన చేస్తున్న రోజుల్లో కీ.శే . మల్లవరపు విశ్వేశ్వరరావు గారిని, ఆయన భార్య కీ.శే శ్రీమతి మల్లవరపు విజయలక్ష్మిగారిని తరచు కలుస్తూ ఉండేదాన్ని. ప్రేమమయ కవిత్వం రాసే భావకవులంటే (వ్యక్తులుగా) శ్రీమతి విజయలక్ష్మిగారికి అంత మంచి అభిప్రాయం ఉండేదికాదు. కానీ ఆవిడ విప్లవ కవి శ్రీశ్రీ గారి గురించి ఎంతో ఉన్నతంగా, తన భార్యను ఆయన పువ్వుల్లో పెట్టి ప్రేమగా చూసుకొనేవారని ఎంతో అభిమానంగా చెప్పేవారు. శ్రీశ్రీ అనగానే విప్లవం, జ్వాలలు, ఎత్తిన పిడికిళ్ళు , మహోగ్ర నినాదాలే గుర్తుకు వస్తాయి.అంత ప్రేమాస్పదుడయన వ్యక్తి రచనల్లో సామ్యవాద భావాలతో పాటుగా ఏవైనా సౌమ్యభావాలు కూడా కనిపిస్తాయా అని పరిశీలిస్తే దొరికిన సుమసౌరభాలివి. చెట్టంటే చెట్టుకవి ఇస్మాయిల్ కేకాదు విప్లవ కవి శ్రీశ్రీకి కూడా ఎంతో ఇష్టం.
ప్రయాణం
అందుకే చెట్టంటే ఎంతో నాకిష్టం. ఎక్కడికీ చెట్టు ఎప్పుడూ వెళ్ళదుకాబట్టి.
ఇవాళఉదయ ట్రాముకోసం తపస్సుచేస్తూ చెట్టుకింద నిలబడ్డాను. …..చెట్టులో నువ్వుచూసే నిశ్చలత్వం శిలదీకాదు, శవానిదీకాదు. అది కదలదనుకోవడం భ్రమ. క్షణం క్షణం చెట్టుకదుల్తూనే ఉంటుంది. అయితే దాని ప్రయాణం ఔన్నత్యం వేపు. ఆకాశాన్ని అందుకోవాలని ప్రతిచెట్టూ ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది.
ధ్వనికన్నా ఎక్కవవేగంతో ప్రయాణం చేసే విమానం ధన్యమైనదే! కాని శ్రావణ మంగళవారపు నోమురోజున సెనగగింజలో నుండి ఎదిగే మొక్క సాధించే వేగానికి నేను ఆశ్చర్యం పొందకమానలేను. చిన్నప్పుడు నేను పారేసిన చింతపిక్క ల సంతానం ఇప్పుడు సకలప్రపంచంలో నిండిపోయిందన్న తలంపు కేవలం నిరాధారమైనది కాదు. శ్మశానాలమీద వాన కురిసినప్పుడు ఎంతవేగంగా పచ్చగడ్డి ఎదుగుతుందో , ఎందుకు నేను వేరే చెప్పడం!
నీ నీ ఒక్కొక్కఉదాహరణకి ఒక్కొక్క చెట్టుని చూడగలవు.
కోరికలెల్ల ధూళిబడ గోల్పడి
దిక్కుల శూన్య దృక్కులం జీరి
యెటో వృథా శిశిర జీవనభారము
బుచ్చుచున్న భూమిరుహ మేను…
అన్నాడొక కవి
శ్రీ మంతంబుగ స్వాంతముల్ వికసిలన్
సేమంతి సీమంతినుల్
హేమంతుడను కాంతురాక కొరకెం
తేవింత మీరన్ వనీ
భూమిన్ మేననలంకరించుకొను కెం
పుల్ ,నీలముల్,వజ్రముల్
గోమేధంబులు నాచెలంగె పలు రం
గుల్ గల్గు పుష్పావళుల్. అన్నాడు ఇంకో కవి.
ఇక్కడ నాఉద్దేశంలో కొమ్మా, రెమ్మా, మొగ్గా, ముల్లూ, ఆకూ అన్నీ చెట్టే.
అందుకే చెట్టంటే ఎంతో నాకిష్టం. ఎక్కడికి చెట్టు ఎప్పుడూ వెళ్ళకపోతేనేం? ఏరోప్లేనులో ఎక్కినా ఎక్కడికి వెళ్ళగలం మనం? ఎక్కడికి వెళ్ళినా చెట్టు ఎప్పుడూ మనతో, మనలోనే ఉంది. ఇందుకే నాకు నాకంటే చెట్టెంతో ఇష్టం.
-తెలుగు స్వతంత్ర,వారపత్రిక,29-10-48.
సన్నిహిత మిత్రుడు శ్రీ మల్లవరపు విశ్వేశ్వరరావు రచన ‘మధుకీల’ కు సమీక్షవ్రాస్తూ ‘భావకవిత్వం. ఒక అనుభవం. దీన్ని ఒకడు మరి ఒకడికి బోధపరచడానికి వీల్లేదు. పరిమళం ఇలా ఉంటుందని ఏమిచెప్పగలం? దాన్ని అనుభవించగల ఇంద్రియాలు ఉండాలి. వాటిని సున్నితంగా ఉంచుకోవాలి. నీఅర్హతను బట్టి , సంస్కారాన్ని బట్టి నీకది గోచరిస్తుంది. అందుకే భావకవిత్వానికి ‘సార్వత్రిక చట్టాలు’ లేకపోవడం. అసలే రూల్స్ లేవని కూడా , అందుచేతనే అపోహలు వ్యాపించాయి. కాని భావగీతాల మంచిచెడ్డలు నిర్ణయించే వాళ్లు లేకపోలేదు. రత్న పరీక్షకులకు తప్ప రత్నాన్ని చూచిన ప్తివ్యక్తికీ దానివిలువ చెప్పగలిగే శక్తి ఉండనట్లు ఒకగీతం విలువ సాహిత్యవేత్తలకు తెలిసినట్లు ఆవ్యాసంగం లేనివాళ్లకు తెలియదు’. ఇలా కొనసాగే వ్యాసం భావకవిత పట్ల శ్రీశ్రీకి గల సహృదయతను నిరూపిస్తోంది. అలా అనుకూల దృక్పథం ఉండబట్టే ఆయన తొలినాళ్ల కవిత భావకవిత్వ ప్రభావంతో వెలువడింది. ఈ వ్యాసం1937 నవంబరు భారతి సంచికలో ముద్రితమైంది.
జయభేరి, ఒకరాత్రి మొదలైన మహాప్రస్థానగీతాలు వెలువడిన చాలా సంవత్సరాలకు 1940 అక్టోబరు భారతిలో ముద్రింపబడిన ‘ప్రభాతపూజ’ లో…
అప్రతిమాన మీ ఉదయహర్ష సమీర విహారకేళి!నా
కీ ప్రకృతిప్రతోళికల నెల్లెడల తోచు పవిత్రభావనా
దీప్రమధూళులే! అనుమతింపుము నీచరణాబ్జ సేవకున్
కప్రపు కమ్మవాసనలు క్రమ్మ నొసంగెద నానివాళులున్.
లలితమనస్కుడన్,తళతళల్ పొడసూపగనే విహాయసాం
చలముల చంచలాలతల సఖ్యము నాసయొనర్తు,అట్టినా
అలరుటెడంద నీ ఉదయహాస మరీచులు సాగి సోత్సవో
జ్జ్వల సుఖనీయగానము దెసల్ ప్రసరించగ ప్రోత్సహించెడున్…
అంటూ తన ‘లలిత మనస్కత’ను చెప్పుకొనే భావుకుడు సాక్షాత్కరిస్తాడు. ఈ కవిత ముద్రణాకాలమే కాని రచనాకాలం తెలియదు. శ్రీశ్రీకి సామ్యవాదానికి సంబంధించిన అవగాహనే కాదు, సనాతన ధర్మపు సగుణ, నిర్గుణ బ్రహ్మోపాసన, విగ్రహారాధనలోని సమంజసతల గూర్చిన అవగాహన చక్కగా ఉంది అనటానికి వాహినీ వారి యోగివేమన (1947, జనవరి)’ చిత్రపు ప్రివ్యూ చూసి రాసిన సమీక్ష తెలుపుతోంది. ఈ అవగాహన ఆయన రచనల్లో ప్రతిఫలించటాన్ని కూడా మనం గమనించ వచ్చు.
‘..ఎవరికీ తలవంచని వేమన చేత సాష్టాంగ నమస్కారం చేయించటానికి జ్యోతివంటి సెంటిమెంటల్‌డాల్‌ను కల్పించాలా? విగ్రహారాధనలోని సబబులు చూపించటానికి జ్యోతి చిత్రపటం అవసరమైందా?సగుణబ్రహ్మోపాసనలోని సామంజస్యం వేమనకి తెలియకపోయిందా? అసలు హిందూమతానికి విగ్రహారాధన పునాది కానేకాదు.ఈనాడు మొదలైన వారిని కలవరపరుస్తున్న నిర్గుణ పరబ్రహ్మ పదార్థాన్ని మనవాళ్ళు ఏనాడో అందుకున్నారు. ఇవాళ మన సమస్య మతంకాదు. ప్రపంచపు మతసమస్యలన్నింటినీ పరిష్కరించే సరంజామా మనకి సమృద్ధిగా ఉంది. పాశ్చాత్యుల పారలౌకిక సమస్యల్ని మనం పరిష్కరించ గలం. మన పాంచభౌతిక సమస్యల విషయంలో మాత్రం మరింత శ్రద్ధవహించటం మన తక్షణ కర్తవ్యం’.
–శ్రీశ్రీ కదంబ ప్రస్థానం, వ్యూలు రివ్యూలు-పుట:104
ప్రత్యేక జనరంజని కార్యక్రమం కోసం సుధామ గారు, 1982 మార్చిలో శ్రీశ్రీని చేసిన ఇంటర్‌వ్యూలో, స్త్రీలపై జరుగుతున్న పీడనకు ఆయన ఎందుకు స్పందించలేదని గుచ్చి గుచ్చిఅడిగారు. తాను ప్రత్యేకించి స్త్రీ సమస్యల గూర్చి రాయకపోయినా, ‘భిక్షవర్షీయసి’లో బిచ్చగాడిని కాక బిచ్చగత్తెను చిత్రించానని చెపుతూ, ‘ పురుషాధిక్యం వున్నప్పుడు పురుషుల జబర్దస్తీకి లేకపోతే వాళ్ళు జరిపించే అన్యాయాలకి అన్నింటికి కూడా స్త్రీలు ఆహుతి అవుతున్నారు. …నేను ఫెమినైన్ డామినేషన్ రావాలని ఎప్పుడూ కోరను. అదీ డామినేషనే! అట్లాకాకుండాను స్త్రీకి మొగవాడిమీద ఆధారపడ వలసినటువంటి ..అతిగా అవసరం లేనటువంటి ఆర్థిక ప్రతిపత్తి రావాలి. మొగవాడితో సమానం అయినటువంటి సామాజిక స్థాయికి ఆమె ఎదగాలి. మరివారి పరిస్థితి బాగుపడాలంటే ఈవ్యవస్థే మారాలి. ఈ వ్యవస్థమారి సామ్యవాద వ్యవస్థవచ్చి అందులో స్త్రీపురుషులకి మానదండం, కొలమానం, కొలబద్ద ఏమిటంటే ఆర్థికస్వాతంత్ర్యం . స్త్రీ తన జీవితాన్ని , తనభవిష్యత్తుని తానే నిర్ణయించుకో గలగాలి. అటువంటి ఆర్థికబలం ఆవిడకి కలగాలి’ అంటూ స్త్రీ పట్ల,ఆమెకు సమాజంలో ఉండ వలసిన స్థానం పట్ల తన అభిప్రాయాన్ని చెప్పారు శ్రీశ్రీ.
స్త్రీల పట్ల శ్రీశ్రీకి ఉన్న ఈ సమభావం, హిందూ మతంలోని అద్వైత సిద్ధాంతం పట్ల ఉన్న అవగాహన పెనవేసుకొని ఆ తరువాతికాలంలో ఆయన రచించిన చిత్రగీతాలలో ప్రేమకవిత్వానికి జవజీవాలను అందించాయి.
1953నాటి ప్రపంచం చిత్రంలో జ్ఞానమణి,పూర్ణానందం సంగీత దర్శకత్వం వహించిన పాటలో కాపురంలో ఎవరి ఆధిక్యం లేకుండా ఉండాలంటూ ఇలా రాశారు శ్రీశ్రీ.
రాము: ఆడదంటు పక్కనుంటే
అన్నిపనులుజయం జయం
ఆడదేమొగాడికంటే
అన్నిందాల నయం నయం
భార్య: బండికి వుండేటి రెండుచక్రాల్లాగా
తాపీగాపోవాలి సంసారం
కొరడాతో తోలేటి కరమం లేకుండానే
సాఫీగా సాగాలి సంసారం
1962 నాటి మంచిమనసులు చిత్రంలో కె.వి. మహదేవన్ స్వర పరచిన ’ఆగవోయీ ఆగవోయీ’ అనే అనే పాటలో భార్యాభర్తలు ఎలా ఉండాలో చెపుతున్నాడు కవి.
రేయిపవలు కంటికిరెప్పగా
మేను మనసు మాట ఒక్కటిగా
జీవితమంతా చెంతనిలచి ఉండాలి
త్యాగమదే త్యాగమదే…
ఇదేభావం 1959లో విడుదలైన మాంగల్యబలం చిత్రంలో, మాష్టర్‌వేణు స్వరపరచి శ్రీమతి సుశీల, సరోజిని, కోరస్ కలిసిపాడిన జనాదరణ పొందిన పాట ‘హాయిగా ఆలూమగలై కాలం గడపాలి’.. అనే పాటలో
ఇల్లాలే ఇంటికి వెలుగని
యెల్లప్పుడు తెలియాలి
సంసారపు బండికిమీరే
చక్రాలై తిరగాలి
శరీరాలు వేరేగానీ
మనసొకటై మసలాలి
సుఖమైనా కష్టమైనా
సగపాలుగ మెలగాలి’
అని చెప్పారు. ఇంటికిదీపం ఇల్లాలు అనే చిత్రం 1961లో విడుదలైంది. సంగీతం విశ్వనాథం రామ్మూర్తి చేకూర్చగా శ్రీమతి పి. సుశీల గానం చేసిన ‘వినుముచెలి తెలిపెదనే పరమరహస్యం అది మరియెవరూ తెలయరాని మధుర రహస్యం’ అనే పాటలో ‘హృదయములు నయనములు ఏకమాయెనే మా ఇరువురికి భేదమింక లేకపోయెనే’ అనే మాటలు భార్యాభర్తల ఏకత్వాన్ని చూపుతోంది. 1965నాటి ఇల్లాలు చిత్రం లో కెవిమహదేవన్ స్వరపరచి, శ్రీమతి పి. సుశీల గానం చేసిన ‘నీవు నావూహలందే నిలిచావు, నేనునీకళ్ళలోనే వెలిశాను.. అనే పాటలో
‘నీవొకసగము-నేనొకసగము-మన
వేదనకూడా చెరిసగమౌను
ఆనందమైనా-ఆపదలైనా-ఏదెటులైనా
నీవూనేనూ ఒకటేలే
నీమనసే ,ఒక కోవెలకాగా
నావలపే-ఒకదీపము కాగా
దీపమునేనే-దీవెననీవే
దేవుని సాక్షిగ –నీవూ
నేనూ-ఒకటేలే
ఇలా భార్యభర్తల అద్వైతాన్ని మాత్రమేకాదు మంచిమనుషులమధ్య, ప్రేయసీ ప్రియుల మధ్యస్నేహాన్ని చాలా మృదువుగా, హృదయంగమంగా కవిత్వీకరించిన చిత్రగీతాలను ఎన్నింటినో శ్రీశ్రీ రచించారు. ఎంతో హృదయమార్దవం ఉంటేగాని ఇంత సున్నితమైన భావాలను అంత జనరంజకంగా రచించటం సాధ్యం కాదు.
ఉదాహరణకు 1964 నాటి డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం శ్రీశ్రీ రచించి, ఎస్ రాజేశ్వరరావు స్వరపరచి, ఘంటసాల గానం చేసిన ‘మనసునమనసై, బ్రతుకున బ్రతుకై …అనేపాట ఎప్పటికీ అందరికి నచ్చి నిలచిపోయే పాట.
మనసునమనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదేభాగ్యము అదే స్వర్గము
ఆశలుతీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటిమూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదేభాగ్యము అదేస్వర్గము
నిన్నునిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగపలికే
తోడొకరుండిన అదేభాగ్యము అదే స్వర్గము
చెలిమియె కరువై వలపె అరుదై
చెదరిన హృదయము శిలయైపోగా
నీ వ్యథతెలిసీ నీడగ నిలిచే
తోడొకరుండిన అదేభాగ్యము అదే స్వర్గము
పునర్జన్మ (1963)చిత్రం కోసం, టి, చలపతిరావు సంగీత దర్శకత్వంలో ఘంటసాల గానం చేసిన ‘ఓ సజీవ శిల్ప సుందరీ-ఎవరివో నీవెవరివో’ అనే పాట, బొబ్బిలి యుద్ధం (1964) చిత్రంలో ఎస్. రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో ఘంటసాల, సుశీల గానం చేసిన ‘అందాలరాణివే నీవెంతజాణవె’ పాట, ప్రేమించిచూడు (1965)చిత్రంలో మాష్టర్ వేణు సంగీతంతో ఘంటసాల ,సుశీల గానం చేసిన ‘దొరికేరు దొరగారు-ఇక నన్నువిడలేరు’ అనే పాట, జగపతి వారి ఆరాధన (1962)కోసం ఎస్.రాజేశ్వరావు సంగీతదర్శకత్వంలో ఘంటసాల గానం చేసిన ‘నాహృదయంలో నిదురించే చెలి.., నర్తన శాల ( 1963) చిత్రం కోసం సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో ఘంటసాల, సుశీల గానం చేసిన ‘ఎవ్వరికోసం ఈమందహాసం .. అనే యుగళగీతం..ఇంకా ఇంకా ఎన్నెన్నోగీతాలు శ్రీశ్రీ మృదుభావనలను తెలియజేస్తాయి.
ఇవన్నీ ఒక ఎత్తు. 1961లో విడుదలైన అన్నపూర్ణావారి వెలుగునీడలు చిత్రానికి పెండ్యాల సంగీత దర్శకత్వంలో ఘంటసాల గానం చేసిన ఈ పాట మరొక ఎత్తు. ఇది శ్రీశ్రీ కాంతా సమ్మితంగా చెసిన జీవన ఉపదేశం.
‘కలకానిది, విలువైనది-బ్రతుకు
కన్నీటిధారలలోనే బలిచేయకు//
గాలివీచిపూవులతీగ నేలరాలిపోగా
జాలివీడి అటులే దాని వదలివైతువా
చేరదీసి నీరుపోసి చిగురించనీయవా//
అలముకొన్నచీకటిలోనే అలమటించనేలా
కలతలకే లొంగిపోయి కలవరించనేలా
సాహసమనుజ్యోతిని చేకొని సాగిపో//
అగాథమౌజలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాలమరుగునదాగి సుఖమున్నదిలే
ఏదితనంతతానై నీదరికిరాదు
శోధించిసాధించాలి, అదియే ధీరగుణం//
ఈ పాట విని ఒకరు ఆత్మహత్యాయత్నాన్ని విరమించారట. ఈ విషయాన్ని శ్రీశ్రీ పేర్కొన్నారు. ఇంతే కాదు ఇదే చిత్రంలో చల్లని వెన్నెలసోనలు…., చిట్టిపొట్టి చిన్నారి పుట్టిన రోజు... అనే పాటలు శ్రీశ్రీకి స్వంతమైన శబ్ద ప్రభుత్వాన్ని, మృదుభావశబలతను తెలియజేస్తున్నాయి. పాడవోయి భారతీయుడా.. అనే పాట ఇప్పటికీ భారతదేశరాజకీయ, సామాజికస్థితిని అద్దం పట్టి చూపే నిత్యసత్యమైన వాస్తవిక గీతం. ఇందులో ఆయన చిరకాల స్వప్నమైన సమసమాజ స్థాపన గూర్చి ప్రస్తావించారు.
చాలామందికి తెలియని విషయమేమిటంటే శ్రీశ్రీ శివలీలలు (1967) అనే డబ్బింగ్ చిత్రానికి రాసిన పాటలో శక్త్యాద్వైతం చెప్పే సృష్టిరహస్యం అంతా ఇమిడి ఉంది. ఈ చిత్రానికి, కె.వి మహదేవన్, టి. చలపతిరావు సంగీతదర్శకత్వం వహించారు. శ్రీమతి పి.లీల గానం చేసిన ఈ పాట ఇలా ఉంది.
ఒకటైతివి రూపున రెండైతివి
పొలుపారుకాలముల మూడైతివి
నలువారువేదాల నాల్గైతివి
నమశ్శివాయ యను ఐదైతివి
ఇంపైన రుచులందు ఆరైతివి
సొంపైనస్వరముల ఏడైతివి
సిద్ధులందెనిమిది గానైతివి
చెన్నారు నవరస విజ్ఞానివి
ప్రజ్ఞానిధీ సకలవిద్యానిధీ
ప్రార్థించు వారలకు భాగ్యానివి
మూలానివే మూలపురుషుండవే
మునులందు మణులందు నిలచినావే
భువనాల కాపాడు నవశక్తివే
శ్రీశ్రీనికాపాడు శివశక్తివే
ఆడది మగవాడు చెరిసగముగా
అర్ధనారీశ్వరుడవైనావులే
గాలైతివే, వెలుగైతివే ,నీరైతివే ,అనలమైతివే
నిన్నగా నీడగా అన్నికాలాలలో
జ్యోతిగా నిలచినావే –సర్వలోకాలలో నిండినావే//
సరళమైన పదాలతో ఆదిపరాశక్తి తనను తాను సృష్టిగా ఎలా మలచుకొందో చెప్పిన ఈపాట నిజంగా అపురూపమైంది. ఇందులో వాగ్గేయకారులు వేసే ముద్రలాగా తనపేరును కవి ఇముడ్చుకోవటం చాలా నవ్యంగానూ, ప్రతిభావంతంగాను ఉంది.
కవిగా శ్రీశ్రీ కి తాను మనుషులుమారాలి చిత్రంకోసం రచించిన పాటలు ఇష్టమని ఒక ఇంటర్‌వ్యూలో చెప్పారు. మనుషులుమారాలి అనే చిత్రం 1969లో విడుదలైంది. ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ సంగీతం కూర్చారు. ఈ చిత్రంలోని అరుణపతాకం ఎగిరింది, , మారాలి మారాలి- మనుషులు మారాలి అనే పాటలు విప్లవనినాదాన్ని స్వచ్ఛంగా వినిపించాయి. విషాదగీతమైన చీకటిలో-కారు చీకటిలో అనేపాట చాలా జనాదరణను పొందింది. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల గానం చేసిన తూరుపు సింధూరపు అనే పాట శ్రీశ్రీ సంపూర్ణ కవితావ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తోంది.
తూరుపు సింధూరపు
మందారపు వన్నెలలో
ఉదయరాగం,హృదయగానం
మరలమరల ప్రతియేడూ
మధుర మధురగీతం
జన్మదిన వినోదం//
వేన వేల వత్సరాల కేళిలో
మానవుడుదయించిన శుభవేళలో
వీచె మలయమారుతాలు
పుడమి పలికె స్వాగతాలు
మాలికలై తారకలే మలిచె కాంతి తోరణాలు//
వలపులోన పులకరించు కన్నులతో
చెలినిచేరె , పలుకరించె మగవాడు
మనసులోన పరిమళించు వెన్నెలతో
ప్రియునిచూచి పరవశించె ప్రియురాలు
జీవితమే స్నేహమయం
ఈ జగమే ప్రేమమయం
ప్రేమంటే ఒకభోగం
కాదుకాదు అది త్యాగం.
ఈ పాట ఒకానొక ప్రేయసీ ప్రియుల ప్రేమగీతంలా వినిపిస్తున్నప్పటికీ ఇది వ్యక్తిగత అనుభవం, విశ్వజనీనంగా ఎదగటాన్నిప్రదర్శిస్తోంది. ఒకరి జన్మదినవేడుక, భూలోకంలో మానవుడు ప్రభవించిన సందర్భాన్ని , పుడమిపలికే స్వాగతాన్ని ప్రస్తావించగానే మానవాళి జన్మదినవేడుకగా ఉన్నతపరిణామాన్ని పొందింది. చిన్నప్పటినుండి, మానవుడు ప్రకృతితో పోరాడి , నాగరికతను పెంపొందించుకున్నాడని చదువుకున్న మనకు, మానవుడు ఉదయించిన సందర్భాన్ని, పకృతి, మానవుని ప్రభవాన్ని ,మనం మన పిల్లల పుట్టి రోజును జరిపినట్లు జరిపిందని, శ్రీశ్రీ చేసిన వర్ణన ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
సృష్టి జరిగిన క్రమాన్ని, దానికి ఆధారమైన స్త్రీ పురుషుల పరస్పర అనురాగాన్నీ మూడో చరణం చెపుతోంది. మగవాడు, ప్రియురాలు, ప్రియుడు వంటి సాధారణీకరించిన పదాలను వాడటం వల్ల భావం విశ్వజనీతను సంతరించుకుంది. స్నేహం, ప్రేమ ఈ జగత్తుకు మూలం అని చెప్పే నాలుగో చరణంలో ‘ ప్రేమంటే ఒక భోగం, కాదు, కాదు అది త్యాగం’ –అనే రెండు నిర్వచనాలు, వ్యక్తిగతానుభవం విశ్వజనీనం కావాలంటే త్యాగం తప్పదని స్పష్టం చేస్తున్నాయి. భోగించిప్పుడు అది వ్యక్తిగతమైన అనుభవం. ఆప్రేమ విశ్వవ్యాప్తమైన అనుభవం రావాలంటే త్యాగమే మార్గం మరి. స్పష్టతకోసం అందరికీ తెలిసిన ఉదాహరణ- సీతారాములు ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా రాజ్యమేలి ఉంటే అది భోగం. ప్రజాభిప్రాయాన్ని తలదాల్చి, శ్రీరాముడు రాజ్యంలో సీత అరణ్యంలో గడిపితే అది త్యాగం. స్పష్టతకోసం ఈ ఉదాహరణ , దీన్ని శ్రీశ్రీ కవితకు ఆపాదించటంలేదు. ఒక నక్సలైటు తన కుటుంబంతో ఉంటే అదిభోగం, అతడు తుపాకిపట్టి అడవిబాట పడితే అది త్యాగం. అప్పుడు అతని ప్రేమ విశ్వజనీనమై, అతని కుటుంబ పరిధిని దాటుతుంది. అతడు, తన కుటుంబ సంక్షేమమేకాక ఇంకా విస్తృతమైన సమాజ సంక్షేమంకోసం పాటుపడతాడన్నమాట. అది సమసమాజ ఉదయరాగం అవుతుంది. ఇది నిజమైన శ్రీశ్రీ హృదయరాగం.
( ఈ వ్యాసంలో పేర్కొన్న శ్రీశ్రీ రచనలన్నింటినీ, మనసు ఫౌండేషన్ వారు, 2010లో శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ప్రచురించిన, శ్రీశ్రీ ప్రస్థానత్రయం అనే సర్వ లభ్యరచనల సంకలనమైన మూడు గ్రంథాలనుండి గ్రహించాను)
SRINIVAS SATHIRAJU
తెలుగు సాహిత్యం ఈ రోజుల్లో కాపీ కొట్టు కవిత్వాలు అనువాద రచనలుగా ముఖ చిత్ర పుస్తకంలో మారి పోవడం చూసి కడుపు మంటతో రాస్తున్న నా విమర్శనా దృష్టికి మీ రచనలు చాలా ఆలస్యంగా రావడం నా దురదృష్టం. కానీ ఒక మంచి పరిశీలనాత్మక వ్యాసం చదివాము అనే ఆత్మ తృప్తి కలిగింది. ఎంతో అలవోకగా ఒక భావం వ్యక్త పరిచే నేను మీ రచనలు ముందు చదివి అర్ధం చేసుకో గల స్థాయి సంపాదించుకోవాలి అనే ఒక తపనకు గురి చేశాయి. ముందుగా ఒక పరిశోధన పత్రం తెలుగులో రాస్తే ఎలా ఉంటుందో చాలా చక్కగా చూపించారు. నాకు అర్ధం కానీ విషయాలు ఇవి…మీరు నాకు తెలియచేస్తారు అని భావిస్తాను. సాధారణంగా ఒక ఉపోసద్ఘాతమూ పరిచయ క్రమం చెప్పా బోయే విషయం పై ఒక కాల క్రమం అనే విషయాలు మీరు వ్యక్త పరిచిన తీరులో …చెట్టు కవిత రాసిన ఇస్మాయిల్ గారు పీ ఆర్ కళా శాల కాకినాడ వారేనా..వారు వేయరు వీరునా.. ? ఇంకా నాకు అర్ధం కానీ విషయం..శ్రీ శ్రీ గారి హ్రదయాగానం…అంటే వారు రాసిన సినిమా పాటలా కవిత్వాలా…అనేది నాకు ఒక స్పష్టత కలగలేదు. ఆయనకిష్టమైన పాటలా లేక మీకిష్టమైనవా అనేది నిర్ధారణకు రాలేక పోయాను. నాకెందుకో చాలా అసంపూర్ణంగా ముగిసింది వ్యాసం అనే భావం కలిగింది.. కానీ ఉన్నంతలో మీ విశ్లేషణ మీ హ్రదయం గానంలా ఉంది తప్పా శ్రీ శ్రీ గారి హ్రదయాగానంలా లేదు…ఎందుకంటే చాలా మంది రచయితలూ కవులు కళాకారులు తమ వృత్తిలో ఒకలా ప్రవృత్తిలో ఒకలా ఉండటం నేటి నేను దర్శించిన కోణం శ్రీ శ్రీ నుంచి నేటి వరకు. ఎందుకో వ్యాసం అసంపూర్తిగా ఉంది అనిపించింది. మీరు ఇంకో రెండు మూడు భాగాలుగా రాస్తే చాలా బావుంటుంది. తరువాత శ్రీ శ్రీ కవిత ఒక సమీక్ష అని ఇంకా రాస్తే చదవాలని ఉంది.
yaddanapudi kameswari
ముందుగా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. “స్త్రీల పట్ల శ్రీశ్రీకి ఉన్న ఈ సమభావం, హిందూ మతంలోని అద్వైత సిద్ధాంతం పట్ల ఉన్న అవగాహన పెనవేసుకొని ఆ తరువాతికాలంలో ఆయన రచించిన చిత్రగీతాలలో ప్రేమకవిత్వానికి జవజీవాలను అందించాయి.’ ఈ వ్యాసంలో నేను చెప్పదలచుకున్నది అది. ఆవిషయాన్ని కాల క్రమానుగతంగా నిరూపించటంతో వ్యాసాన్ని ముగించాను. ఆ విధంగా సమగ్ర వ్యాసమనే అనుకుంటున్నాను . ఇంకా వ్రాయవలసినది ఉంది. తప్పక వ్రాస్తాను.
akella raviprakash
కామేశ్వరి గారు మీ వ్యాసం చాలా బావుంది
గొప్ప కవుల గురించి చర్విత చర్వనాలు కాకుండా కొత్త కోణాలు కావాలి
నిబద్త త కలిగిన ప్రపంచ ప్రఖ్యాత కవులు చాల మంది రాసిన ప్రేమ కవితలు నాకు చాల ఇష్టం
ఉదాహరణకి నాకు ప్రియమైన పాబ్లో నెరుడా ప్రేమ కవితల్లో అతని soul నాట్యం చేస్తుంది .
Kameswari yaddanapudi
ధన్యవాదాలండి రవి ప్రకాష్ గారూ , నేను ఇప్పుడే మీ స్పందనను చూశాను . ఆలస్యానికి క్షమించండి.
గొప్ప వాళ్ళ రచనల్లో కొత్తకోణాలను అచ్చువేసే ధైర్యం అందరికి ఉండటంలేదండి. అదే నాబాధ.ఈ వ్యాసం వెలుగు చూడటానికి చాలా కాలమే పట్టింది.
s.radhakrishnamoorthy
I feel certain observations of k.v.ramana garu on dr.kameswari’s article on sri sri call for comment.
I am not interested in the personal life of writers.Whether sri sri loved his wife ,or how much,are matters of concern to sri sri’s wife,and not to his critic.It is not necessary that what a writer writes should correspond to what he practises in his life.One may be an indifferent husband and write lyrics on wronged women that bring tears.
1.Ramana garu seems to be unable to tolerate anything said about sri sri other than what has been ‘decided by the elders’.To see anything other than revolution in sri sri is conspiracy (‘kutra’) for him.Such a dictate is possible only in a totalitarian culture.Sri sri’s dream is dead in Russia.It refuses to die in India.It is still roaring here (‘garjinchu’, ‘gaandrinchu’).
2.Sri Ramana says that dr.Kameswari’s article on sri sri ‘conceals the special’)
On the contrary,to see only revolution in sri sri is to conceal the special,and to say what has been said a thousand times.It is special(‘vishesha’) to see revolution in Viswanatha and tradition in Sri sri.
3.To point out the advaita content in Sri sri ‘s works is not to say that it is the dominant theme in his work.To say that it is an attempt to distort his image is to insult the intelligence of the readers.No one would be misled into thnking that Sri sri was a traditionalist in disguise.
4.Is it an offence to say that Sri sri had a deep understanding of advaita thought?Would it be alright to say that he knew nothing about advaita,and wrote about it
just for money?
5.Does Sri Ramana think that what a poet wrote for money should not be treated as his work?What about writing for fame?Some one might say:’The contemporaries of Viswanatha realised that they could not beat him at his own game,and so chose different themes with an eye on the reader-bank.Chalam chose sex,and Sri sri chose revolution’.It may be a fact or not.But it would be wrong to say that Why a writer writes is irrelevant.What he writes is.One may write for pelf or fame.It is all the same.(Sorry for the rhyme.) What Sri Dhira has made is a good and very relevant point about the motivations of a writer.
6.Two of Sri Ramana’s observations reveal his skewed understanding.He does not like the two statements about the advaita thought impacting the conduct of a person and,the pointing out that revolutionary writers are soft tempered in their lives.
Do these mean,by any logic,that all those that are not advatins are unloving,and that revolutionary writers are by nature not to be expected to be soft and tender hearted in their lives?Is this not like the king’s younger wife’s response to the remark about the older wife?
7.Lastly,about the right to determine what a text says.It is the text alone that decides what it should mean.And,as long as the text supports, the critic can and should make the text yield the meaning he sees in it.No one has the right to deny the meaning that the text itself yields.Not even the writer,’patiently’ or ‘impatiently’.
–srkmoorthy
ధీర
సినిమాపాటలన్నీ ఆయన భావాలు కావు, డబ్బుకోసం వ్రాశారని రమణ గారు అన్నారు. వ్యాసరచయిత్రీ ఆమాట ఒప్పుకున్నారు. కానీ అలా ఆలోచిస్తే ప్రతి రచనకీ నేపథ్యాలు వుంటాయేమో! కొన్ని డబ్బు కోసం, కొన్ని పేరు కోసం, కొన్ని ప్రత్యేకత కోసం.. యిలా రకరకాలుగా. (శ్రీశ్రీ గారి గురించి కాదు, అసలు మామూలుగా చెప్తున్నా..)
సరే పోనీ సినిమా పాటలు పక్కన పెట్టినా నాకొకటి రెండు సందేహాలు..
వ్యాసంలో “ధ్వనికన్నా ఎక్కవవేగంతో ప్రయాణం చేసే విమానం ధన్యమైనదే! కాని శ్రావణ మంగళవారపు నోమురోజున సెనగగింజలో నుండి ఎదిగే మొక్క సాధించే వేగానికి నేను ఆశ్చర్యం పొందకమానలేను.” అన్న వాక్యాన్ని ఉదాహరించారు కదా!
ఈ వ్యాసం చదవకముందే, చాలా ఏళ్ళ క్రిందటే “శ్రావణ మంగళవారపు నోమురోజున సెనగగింజలో నుండి ఎదిగే మొక్క” అన్న పోలికలో విశిష్టత ఏమిటా అని నేనూ ఆలోచించాను. ఎదిగే మొక్క అంటే చాలు కదా, శ్రావణమంగళవారమూ, నోమూ అని ఎందుకన్నారు? అనుకున్నాను.
ఇలాంటివాటిని బట్టి ఎవరైనా ఆ కవి హృదయానికి ఆ పోలిక దగ్గర కాబోలు అనుకుంటే అది మన ఇష్టాన్ని ఆయనకి ఆపాదించడం అవుతుందా? (పోలిక కనిపిస్తోందిగా ఎదురుగా!)
మల్లెతీగ చిగురించినట్లు, మందారం వికసించినట్లు, దావానలం వ్యాపించినట్లు.. ఇంకా ఇలాంటి లక్షల పోలికలలో నుంచి కవి వేగానికి శ్రావణమాసపు నోము రోజున పేరంటాలికి ఇచ్చిన సెనగ గింజని పట్టుకున్నాడంటే దానిని మరి పాఠకులు విశ్లేషించే ప్రయత్నం చేస్తారు కదా!
అది వక్రీకరించడమూ, ఆ ప్రయత్నంలో ఆయన విశేషాన్ని మరుగుపరచడమూ అవుతుందా! ఈ మాత్రానికే మరుగునపడితే అసలది “విశేషం” అవుతుందా!
kameswari yaddanapudi
వ్రతకథలాగా, ఎక్కడ, ఎవరైనా శ్రిశ్రి గురించి విప్లవకవి అని తప్ప మరొకటి మాట్లాడకూడదా? కళారూపంలో ఋజువు ఉన్నప్పుడు విమర్శకులకు ఆ హక్కు ఎప్పుడూ ఉంటుంది.ధీరగారూ మీరు చెప్పింది నిజం
kv ramana
కామేశ్వరి గారూ…శ్రీ శ్రీ కి సనాతన, అద్వైత తాత్వికతలో ఎంత జ్ఞానం ఉందో చెప్పడమే మీ ఉద్దేశం అని మీ జవాబును బట్టి అర్థమవుతోంది. అదేమంత గొప్పవిషయం అంటారా? ఈ నేలమీదా, ఇక్కడ సంప్రదాయంలోనూ పుట్టి పెరిగిన శ్రీ శ్రీకి ఈ తాత్వికత తెలిసి ఉండడం విశేషమంటారా? అలా అయితే, ఆయనకన్నా అవి బాగా తెలిసినవారు, వాటిలో బాగా కృషి చేసినవారు చాలామంది ఉన్నారు. కనుక శ్రీ శ్రీ గొప్పతనం అందులో లేదు. ఆయనను యుగకవిగా, మహాకవిగా నిలబెట్టిన ఆయన కవితావస్తువులోనూ, డిక్షన్ లోనూ, భాషలోనూ, భావజాలంలోనూ ఉంది. సనాతన, అద్వైతతత్వాలను శ్రీ శ్రీ కూడా అవుపోసన పట్టాడని మీరు చెప్పబోవడంలో వాటి మీద మీకున్న ఇష్టాన్ని ఆయనకు ఆపాదిస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఆయన విశేషాన్ని మరుగుపరుస్తున్నారు. దీనినే నేను వక్రీకరించడం అంటున్నాను. మీ వ్యాసంలో అవగాహనా లోపం కూడా ఉంది. స్త్రీలపట్ల శ్రీశ్రీలో ఉన్న సమభావం, హిందూమతం లోని అద్వైత సిద్ధాంతం పట్ల అవగాహన పెనవేసుకున్నాయని మీరన్నారు చూడండి. అద్వైత సిద్ధాంతం పట్ల అవగాహన ఉండడంవల్ల హిందూమతంలో స్త్రీల పట్ల సమభావం ఉంటుందన్న తప్పుడు అవగాహనను ఇది వెల్లడిస్తుంది. అద్వైతం తెలియని హిందూమతేతరులకు స్త్రీలపట్ల సమభావం ఉండదన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది.
kameswari yaddanapudi
రమణగారు,
మీకు ఒక సిద్ధాంతంపై ఇష్టం ఉండటంలో ఎలా తప్పులేదో అలాగే నాకు మరొకసిద్ధాంతంపై ఇష్టం ఉండటంలో అలాగే తప్పులేదు. ఇక్కడ విషయానికి మన ఇష్టానిష్టాలతో సంబంధంలేదు. కవి ఎలా విజయవంతంగా, సులువుగా క్లిష్ట విషయాన్ని కవిత్వీకరించాడో పరిశీలించాను. ఇక్కాడ పుట్టిన వాళ్లందరికీ ఈ విషయాలపై అవగాహన సరిగా ఉండేటట్లైతే మీరు అద్వైత సిద్ధాంతం గురించి ఇలా వ్రాసి ఉండరు. అదైత సిద్ధాంతంపై సరైన అవగాహనకోసం చాలా కృషి చేయవలసి ఉంటుంది. అభినందనలతో- కామేశ్వరి
kv ramana
మీ అవగాహనలో లోపం ఉందని వ్యాసరూపంలో ఋజువు ఉన్నప్పుడు దానిని ఎత్తి చూపే హక్కు పాఠకులకు మాత్రం ఉండదా కామేశ్వరి గారూ…’శ్రీ శ్రీ లో కూడా’ మృదుభావనలు ఉన్నాయని చెప్పడానికి మీరు పడిన తాపత్రయం ఏం చెబుతుందండీ? విప్లవకవుల్లో మృదు భావనలు ఉండవనే ఓ తప్పుడు అవగాహనతో మీరు ఉన్నారు కనుక, శ్రీ శ్రీ అనే విప్లవకవిలో మృదుభావనలు కనిపించేసరికి మీరు పొందిన ఆశ్చర్యాన్ని కాదా మీ వ్యాసం వ్యక్తం చేస్తున్నది? అలాగే, విప్లవకవులకు హిందూమతంలోని అద్వైత తత్వం తెలియదనే (తెలియక పోవడం వల్లనే విప్లకవిత్వం రాశారని) తప్పుడు లేదా అమాయకపు అవగాహన మీకు ఉన్నందువల్లనే కాదా శ్రీ శ్రీ లో మీకు కనిపించిన అద్వైతభావాలకు మీరు ఆశ్చర్యంతో తబ్బిబ్బు అయింది? మీ అవగాహనా లోపానికి శ్రీ శ్రీలో సామ్యవాద భావాలేకాక సౌమ్యభావాలు కూడా ఉన్నాయన్న మీ వ్యాఖ్య ఒక్కటి చాలదా? సామ్యవాదంలో సౌమ్యత ఉండదనే మీ అవగాహనకు ఈ వ్యాఖ్య సాక్ష్యం కాదా? “మీరు అద్వైత సిద్ధాంతం గురించి ఇలా రాసి ఉండరు” అన్నారు. నేను ఎలా రాశాను? నేను రాసిందాల్లో మీకు కనిపించిన అభ్యంతరం ఏమిటి? అద్వైత సిద్ధాంతం గురించి మీకున్న సరైన అవగాహన ఏమిటి? మీ వాక్యాలలో ఎలాంటి అర్థమూ కనిపించడం లేదు. అంతిమంగా చెబితే ఇక్కడ ప్రధానం మీ సిద్ధాంతం, నా సిద్ధాంతం కాదండీ; కవి సిద్ధాంతం. ఆయన ఉద్దేశించని మీ ఇష్టాలను ఆయనకు ఆపాదించడం న్యాయమా చెప్పండి? విశ్వనాథవారిలో విప్లవాన్ని వెతికితే ఎలా ఉంటుందో ఇదీ అలాగే ఉంటుంది. చివరిగా ఒక తెలిసిన జోక్ చెబుతాను. మిరియాల రామకృష్ణ గారు శ్రీ శ్రీ కవిత్వంపై పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్నారు. మీలానే శ్రీ శ్రీ కి తెలియనివి, ఉద్దేశించినవీ ఆపాదించారు. ఆ గ్రంథం చూసిన శ్రీ శ్రీ “డియర్ డాక్టర్, యువర్స్ పేషెంట్లీ అని సంతకం చేశారు.
kv ramana
శ్రీశ్రీ తొలి రోజుల కవిత్వంలోంచి, సినిమా పాటల్లోంచీ ఆయనకు ఉన్న సనాతన ధర్మ, అద్వైత, శక్త్యాద్వైత అవగాహనను వెతకడం అంతటి మహాకవికి వక్ర భాష్యం, వికృతభాష్యం కూడా. ఆయన కవిత్వానికి గల ముఖ్య స్వభావాన్ని మరుగు పుచ్చి, ఆయనకు సంప్రదాయ ధోరణులను అంటించే కుట్రలా కూడా ఇది కనిపిస్తుంది. శ్రీశ్రీలో సామ్యవాద భావాలే కాక సౌమ్యభావాలు కూడా ఉన్నాయనడంలోఈ రచయిత్రి ప్రాస కోసం పడిన ప్రయాస కనిపిస్తోంది తప్ప అవగాహన కనిపించడం లేదు. సామ్యవాదంలో సౌమ్యత ఉండదని ఈమె చెప్పదలచుకున్నారా? శ్రీశ్రీ సినిమా పాటలు డబ్బుకోసం, కథను బట్టి, దర్శకుడి సూచనలను బట్టి రాసినవనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఆయనే చెప్పారు. కొన్నిసార్లు తనవైన భావాలు ప్రకటించుకునే అవకాశం ఆయనకు లభించింది. దానిని ఆయన ఉపయోగించుకున్నారు. అంతే తప్ప అన్ని పాటలూ అలా రాసినవి కావు.
kameswari yaddanapudi
SIr ,
In the above article, I have not said that SriSri ‘s poetry doesnt have communist outlook. My aim of this article is to bring out how deep his knowledge about other philosophies also. I accept he worte those songs as per the requirement of film situation and other demands. But one should have understanding of the subject to write successfully. When we consider rhyme, as long as it is meaningful it is not a crime. Please read my article once again with out any prejudice.
Regards,
Kameswari
Sreenivas Paruchuri
Kameswari-gaaru,
Interesting that you start your writeup with a reference to Mallavarapu Vijayalakshmi gaaru and her opinion about bhaavakavulu. Here is a lot of unwritten history that exists only in oral circulation. Could you please send a mail to: sreeni @ gmx.de or share your e-mail address here. Thanks and Regards, Sreenivas
kameswari yaddanapudi
My Email ID kajuyy@yahoo.com
kameswari yaddanapudi
కెక్యుబ్ వర్మగారికి, గంగా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.
కెక్యూబ్ వర్మ
Good review with a new out look on great Poet.. Thanks a lot Madam..
Ganga Sreenivas
శ్రీ శ్రీ గురించి ఎన్నో విషయాలను తెలియచేసారు.
మీ పరిశోధన, వివిధ భావాలను మీరు సమన్వయపరిచిన విధానం బాగుంది.
ఒక మహాకవిని అర్థం చేసుకోవడానికి రంగు అద్దాలనుంచి చూడడం సరి కాదు.
పరిపూర్ణ వ్యక్తిత్వంలో ఉన్న అన్ని కోణాలను చూడాలంటే ఓపెన్ మైండ్ కావాలి.
చాలా బాలన్స్‌డ్ గా రాసారు. శుభాభినందనలు.
mani vadlamani
బావుంది కామేశ్వరి గారు. శ్రీశ్రీ గారిలోని అవతలి కోణం గురుంచి బాగా ఆవిష్కరించారు . అందరం సహజంగా వారి విప్లవ కోణం మాత్రమె ఎక్కువగా తెలుసుకొంటారు . వారిలో ని సున్నితమైన అందమైన భావకవిత్వం స్త్రీలగురించిన కోణం కూడా వుంది అని చక్కగా తెలియ చెప్పారు
kameswari yaddanapudi
Dhanyavadaalandi mani vadlamani garu.