The Outsiders – S.E.Hinton (Part-2)

వ్యాసకర్త: పద్మవల్లి
మొదటి భాగాన్ని ఇక్కడ చదవండి. కథను మొదటిభాగంలో చదవొచ్చు.
****

Nature’s first green is gold,
Her hardest hue to hold.
Her early leaf’s a flower;
But only so an hour.
Then leaf subsides to leaf.
So Eden sank to grief,
So dawn goes down to day.
Nothing gold can stay.
– Robert Frost

“Bob is a good guy. He was tough and everything, but he was real person too. His parents spoiled him rotten. I mean most parents would be proud of a kid like that – good looking, smart and everything, but they gave in to him all the time. He kept trying to make someone say ‘NO’ and they never did. They never did. That was what he wanted. For somebody to tell him NO. To have somebody lay down the law, set the limits, give him some thing solid to stand on. That’s what we all want, really.” – Randy with Ponyboy

కథలో పాత్రల మనస్తత్వ చిత్రణ గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది. కొన్ని పాత్రలు కథ మొదలైననుండీ చూస్తే, జరిగిన పరిణామాలతో పాటూ వాళ్ళ దృక్పథం (perception) లో వచ్చిన మార్పు, మనుషుల్ని అర్ధం చేసుకున్న తీరు గమనించదగ్గవి.

టీనేజ్ అటూ ఇటూ కానీ వయసు. పెద్దలకున్న స్వతంత్రం కావాలి, కానీ బాధ్యతలు, ఆంక్షలు ఉండకూడదు. తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులూ శత్రువులు గానూ, స్నేహితులు మాత్రమే నిజమైన శ్రేయోభిలాషులుగానూ అనిపించి, పెద్దల ఆంక్షల మధ్య Life is not fair అనిపించే వయసు.

పోనీ దృష్టిలో డేరీ ఒక హిట్లర్. తనని ఒక టీనేజర్ లా కాకుండా ఆరేళ్ళ పిల్లాడిలా చూస్తుంటాడని తన కంప్లైంట్. ఎన్నో ఆంక్షలు, సరిగా చదువుకోమనీ, ఒంటరిగా తిరగొద్దనీ, రాత్రుళ్ళు ఇంటికి తొందరగా రమ్మనీ, గొడవల్లోకి వెళ్లొద్దనీ … ఇవన్నీ పోనీ కి నచ్చవు. నాకు తెలీదా ఏం చెయ్యాలో, నాన్న కూడా ఎపుడూ ఇంత అరవలేదు నామీద అనుకుంటాడు. డేరీ కోప్పడుతుంటే, పోనీ నొచ్చుకుంటాడని సోడా అడ్డుపడి వెనకేసుకోస్తాడు. దానితో చిన్నన్నకి తప్ప, పెద్దన్నకి తన మీద ప్రేమ లేదనీ, తనతో కలిసి ఉండటం ఇష్టం లేదనీ అనుకుంటాడు. సోడాపాప్ గొడవ పెడతాడేమో అని కానీ, లేకపోతే ఎపుడో తనని ఏదో సపోర్ట్ హోమ్లో పడేసి డేరీ తన దారి తను హాయిగా చూసుకునేవాడు అనుకుంటాడు. గేంగ్ దగ్గర సమయం వచ్చినపుడల్లా డేరీకి తనంటే ఇష్టం లేదన్న విషయం గుర్తుచేస్తుంటాడు. కానీ గేంగ్లో మెంబర్స్ అంతా అది నిజం కాదు అని తనకి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు, కానీ ఉపయోగం ఉండదు. ఆఖరున చర్చి ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో ఉన్నప్పుడు, డేరీ కన్నీళ్ళు చూసి, డేరీకి కూడా నేనంటే ప్రేముందన్న మాట అనుకుంటాడు.

గేంగ్ లో ఎవరికీ ఇంట్లో మనుషుల దగ్గర కావాల్సిన ప్రేమాభిమానాలు దొరకవు. అందరూ వాటి కోసం గేంగ్ మీదే ఆధారపడతారు. అందరిలోనూ చిన్నవాడైన జానీ పరిస్థితి అందరికన్నా దారుణం. ఇంట్లో ఫిజికల్ ఎబ్యూజ్ కూడా పడాల్సి వస్తుంది. అందుకనే గేంగ్ అందరికీ జానీ అంటే ప్రత్యేక అభిమానం, ఆఖరికి డేలీకి కూడా. జీవించి ఉన్నంత కాలం తల్లిదండ్రుల నుండి ఒక చిన్న ఆప్యాయకరమైన మాట కోసం తపించిపోతాడు. గేంగ్ అంతా ఎంత ముద్దుగా చూసినా కూడా, అది తనకి సంతృప్తి కలిగించదు. అన్న గురించి పోనీ కంప్లైంట్ చేసినపుడల్లా నచ్చచెపుతాడు “నీకేముందో నీకు తెలీటం లేదు. నీకున్న ఫేమిలీ అనుబంధం నాకు లేదు. నన్ను చూడు, నావాళ్ళకి నేనున్నానో పోయేనో కూడా అనవసరం. నీకోసం పట్టించుకునే అన్నలున్నందుకు సంతోషించు, నువ్వు అదృష్టవంతుడివి” అని. అయినా కూడా పోనీకి అర్ధం కాదు.

పోలీసుల నుండి తప్పించుకోడానికి చర్చిలో ఉండగా, చూడటానికి వచ్చిన డేలీని జానీ అడుగుతాడు, నావాళ్ళు నాగురించి వెదుకుతున్నారా, బాధపడ్డారా అని. జానీ సున్నితమైన మనసు తెలిసిన డేలీ, లేదు అని చెప్పి బాధపెట్టలేక మాట తప్పించబోతాడు. అయినా జానీ పదే పదే ఆ విషయం రెట్టించడంతో, నిస్సహాయతతో జానీ మీద అరుస్తాడు, “ఎందుకు అంతలా బాధపడతావు. నన్ను చూడు. నేను ఈరోజు జైలుకి వెళ్ళినా, లేదా ఏ కార్ రెక్ లోనో చచ్చినా కూడా నావాళ్ళు అసలు పట్టించుకోరు. అయినా నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానా? వదిలేయ్.” అని విరుచుకుపడతాడు. కనీసం తల్లిదండ్రులు తన గురించి తలుచుకోలేదని తెలిసి జానీ మనసు విరిగిపోతుంది. జానీ హాస్పిటల్లో ఉండగా తల్లి చూడడానికి వచ్చినపుడు, తనని కలవడానికి వొప్పుకోడు. “నాకిష్టం లేదు, ఇపుడు కూడా నావల్ల వాళ్ళకెన్ని ఇబ్బందులు కలిగుతున్నాయో చెప్పి తిట్టడానికే వచ్చి ఉంటుంది కానీ నామీద ప్రేమతో కాదు” అని తిరస్కరిస్తాడు. వాళ్ళ ప్రవర్తన వల్ల ఆ పసిమనసు అంతగా విరిగిపోతుంది. తను బ్రతకడం కష్టం అని తెలిసినపుడు స్నేహితులతో ‘నాకు ఇపుడే చచ్చిపోవాలని లేదు. నా పదహారేళ్ళ వయసు ఎంత పెద్దదనీ, నేనేం చూశాననీ అపుడే చచ్చిపోడానికి’ అంటాడు. తను రక్షించిన పిల్లల తల్లిదండ్రులు వచ్చి కృతజ్ఞతలు చెప్పిన తర్వాత తన ఆలోచనా పధ్ధతి మారుతుంది. “ఆ పిల్లల జీవితాలు నాజీవితం కంటే ఎంతో విలువైనవి. వాళ్ళని ప్రేమించే తల్లిదండ్రులున్నారు. నేను వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసాను. వాళ్ళని రక్షించినందుకు నాకు చాలా తృప్తిగా ఉంది. ఇక నాకు చావంటే బాధ లేదు.” అంటాడు. నా అనే వాళ్ళ ప్రేమకోసం అల్లాడిన శాపగ్రస్తుడు జానీ. పోనీ మాటల్లో చెప్పాలంటే, if it hadn’t been for the gang, Johnny would never have known what love and affection are.”

డేలీ గేంగ్ అందరిలోనూ రాటుతేలినవాడు. చిన్నతనంలోనే జైలుకెళ్ళి రావటం, రోడ్ల మీద, గేంగ్ గొడవల్లోనూ బ్రతకటంతో జీవితం మీద విపరీతమయిన నిర్లక్ష్యం. ఎవరి మీదా అభిమానం గానీ, దేని మీదా భయం గానీ ఉండదు. దేన్నీ లెక్క చెయ్యడు, కానీ గేంగ్ లో అవసరమైనపుడు రక్షణగా నిలుచుంటాడు. ఆనిర్లక్షాన్ని, దేన్నయినా ఎదుర్కొనే ధైర్యాన్ని చూసి గేంగ్ అందరికీ గౌరవం, భయం తనంటే. ఎవరన్నా లెక్కచెయ్యని డేలీ జానీని మాత్రం విపరీతంగా అభిమానిస్తాడు. సినిమా థియేటర్లో జానీ, అమ్మాయిలని విసిగించవద్దని గట్టిగా మాట్లాడినపుడు, ఆశ్చర్యంగా చూసి వెళ్ళిపోతాడు గానీ ఏమీ అనడు. ‘అదే మాలో ఇంకెవరైనా అయితే ఈపాటికి తల ఎగిరి పోయేది’ అని అనుకుంటాడు పోనీ.

బాబ్ హత్య తరువాత, పోలీసులకి తెలిస్తే తను జైలుకి వెళ్ళాల్సి వస్తుందని తెల్సి కూడా జానీ పారిపోటానికి సాయం చేస్తాడు. ఎవరేమైనా పట్టించుకోనివాడు, జానీ తను పోలీసులకి లొంగిపోతాను అన్నప్పుడు మాత్రం, “చిన్న వయసులో జైలుకు వెళితే ఏం జరుగుతుందో నీకు తెలీదు. ఆ క్రూరత్వాన్ని నువ్వు తట్టుకోలేవు. నువ్వు కూడా నాలా రాటు తేలిపోతావు. నువ్వు కూడా నాలా తయారవటం నేను భరించలేను.’ అని నచ్చచెపుతాడు. మంటల్లో స్కూల్ పిల్లలు ఉన్నారని తెలిసి కూడా లెక్కచెయ్యడు, పైగా రక్షించడానికి వెళ్ళబోయిన పోనీ, జానీ లను కూడా ఆపడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళిద్దరూ లోపలికెళ్ళి పిల్లలని బయటకి ఇచ్చినపుడు, బయటనుండే అందుకుంటాడు కానీ లోపలికి వెళ్ళడు. కానీ జానీ లోపల చిక్కుపోయినపుడు మాత్రం లోపలికి వెళ్ళి, అతనిని బయటకి తెచ్చే ప్రయత్నంలో తను కూడా గాయపడతాడు. జానీ చనిపోయిన తర్వాత డేలీకి జీవితం మీదే విరక్తి వస్తుంది. కావాలని చావుని ఆహ్వానిస్తాడు. మొదటినించీ పోనీకి, డేలీ అంటే భయమే తప్ప ఇష్టం కానీ, గౌరవం కానీ ఉండవు. గేంగ్ అంతా డేలీని హీరోలా ఎందుకు చూస్తారో, జానీకి అంత ఆరాధనెందుకో పోనీకి అర్ధం కాదు.

ఇక బాబ్ విషయానికొస్తే, తల్లిదండ్రులు కావాల్సినంత స్వేచ్చ ఇచ్చారు, కానీ అది హద్దులు దాటినపుడు నియత్రించలేకపోయారు. బాబ్ మితిమీరి తాగి వచ్చినపుడు కూడా తనని మందలించరు సరికదా, తమ వల్లనే కొడుకు అలా తయారయ్యాడని తమని తాము నిందించుకుంటారు. అదే చేతులు దాటి పరిస్థితి విషమించే వరకు వెళ్ళింది. బాబ్ ఫ్రెండ్ రేండీ, పోనీతో “బాబ్ తప్పు చేసినపుడు తండ్రి ఒక్కసారి గనక శిక్షించి ఉంటే ఈరోజు బాబ్ బ్రతికుండేవాడేమో” అంటాడు. చెర్రీ కూడా “బాబ్ మరణానికి దారితీసిన గొడవల ప్రారంభానికి కారణం బాబ్ కావచ్చు కానీ, అతనేమీ చెడ్డవాడు కాదు. After all he is a kid” అంటుంది. తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యానికి, అప్రయోజకత్వానికీ, వాళ్ళిచ్చిన హద్దులులేని స్వేచ్ఛకి బలైపోయిన అభాగ్యుడు బాబ్.

ఒక వారం రోజుల వ్యవధిలో, తన బెస్ట్ ఫ్రెండ్ జానీతో సహా ముగ్గురి మరణం, పోనీకి అంతులేని విచారాన్ని కలిగిస్తుంది.అదే సమయంలో జీవితం మీదా, మనుషుల మీదా అవగాహనని కూడా పెంచుతుంది. నల్లనివన్నీ నీళ్ళు, తెల్లనవన్నీ పాలు అన్నట్టుగా మనుషుల్లో కేవలం మంచీ చెడూ అని మాత్రమే కాకుండా, వాళ్ళకి ఎదురైన అనుభవాలు వాళ్ళని మధ్యరకంగా కూడా మారుస్తాయనీ అర్ధమవుతుంది. డేలీ కూడా స్వతహాగా మంచివాడేననీ, జీవితంలో అతను అనుభవించిన కష్టాలు, ఎదురుపడ్డ పరిస్థితులు అలా మార్చాయే తప్ప, తను కావాలని ఆదారి ఎంచుకోలేదనీ అనుకుంటాడు. అతనిలోని మంచితనం, హీరోయిజం జానీని రక్షించడానికి చేసిన ప్రయత్నాల్లో కనిపిస్తుంది.

“డేలీకి ప్రేమగా చూసుకొనే ఫేమిలీ అనేది లేకపోవటం వల్లనే అలా తయ్యరయ్యాడనీ, ఒకరికి ఒకరు లేకపోతే మనం కూడా డేలీ లానే తయారవుతాం. అది మరణం కన్నా కూడా దారుణమైన పరిస్థితి” అని సోడా వివరించినప్పుడు ఫేమిలీ విలువా, అన్న డేరీ తమ మీదా చూపించే ప్రొటెక్షన్ అర్ధమవుతాయి పోనీకి. తల్లి దండ్రులు పోయిన తర్వాత తమని చూసుకోడం కోసం డేరీ ఇరవయ్ ఏళ్లకే పెద్దరికాన్ని నెత్తినేసుకుని, చదువు మానేసి కష్టపడాల్సి వచ్చిందనీ, నిజానికి life is unfair with him అని తెలుసుకుంటాడు. డేరీ తను పడుతున్న కష్టాలు తమ్ముడు పడకూడదనే చదువు విషయంలోనూ, గేంగ్ గొడవల్లో పోలీసుల రికార్డులకి వెళ్ళి భవిష్యత్ పాడుచేసుకోకూడదనీనూ, తల్లిదండ్రులని కోల్పోయిన తను తమ్ముళ్ళని కూడా కోల్పోతానేమో అనే భయంతోనే కఠినంగా ఉన్నాడనీ అర్ధమవుతుంది. డేరీ కావాలంటే తననీ సోడానీ ఎక్కడైనా వెల్ఫేర్ హోమ్లో జాయిన్ చేసేసి, తన కాలేజీ చదువు తను చూసుకుని జీవితంలో స్థిరపడగలిగే అవకాశాలున్నాకూడా, కేవలం తమకోసమే కష్టపడుతున్నాడని అర్ధం అయ్యి, తనని ఇన్నాళ్ళూ అపార్ధం చేసుకున్నందుకు సిగ్గుపడతాడు.

You Might Also Like

4 Comments

  1. varaprasad

    ఈమధ్య ఓ నాలుగు నెలలు వేరే పనుల్లో పడి,పుస్తకం చూడలేదు,ఈమధ్య కాలంలో పద్మవల్లి గారు చాలా రాసి ఉంటారనుకొన్నాను,కానీ ఏమీ కనిపించలేదు,మీరు సీజనల్ రైటర్ ని కాదని గతంలోనే చెప్పారు,మీరు వ్రాసే శైలి బావుంది,వీలైతే అపుడపుడు రాస్తుండండి.

  2. నిషిగంధ

    వ్యతిరేక దిశల్లో తల్లితండ్రులు చూపించిన బాధ్యతారాహిత్యానికి ప్రతీకలు బాబ్, జానీ!
    నేను సినిమా చూసినప్పుడు చాలా లైటర్ టోన్‌లో అర్ధం చేసుకున్నట్లున్నాను.. కానీ, ఇప్పుడు ఈ సమీక్ష కొంచెం ఎక్కువగానే ఇమోషనల్‌ని చేసింది. మే బీ అది శైలిలోని మహత్యమేమో!?
    మొదటి పార్ట్ చదివినప్పుడు కధ అంతా అంత విపులంగా చెప్పడం, ఆ పైన ముగింపు కూడా చెప్పేయడం అంత నచ్చలేదు. కానీ, రెండో పార్ట్ చదివాక ఇలా పాత్రల విశ్లేషణకు అలా రాయడమే బెటర్ ఏమో అనిపిస్తోంది!
    మొన్నామధ్య వచ్చిన శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ‘ కూడా చాలావరకూ ఇలానే ఉంటుంది.. ఏ బ్లాక్, డి బ్లాక్ అని రెండు గ్యాంగ్స్! 🙂

    1. పద్మవల్లి

      ఈ పుస్తకంలో నావరకూ, ఈ మనస్తత్వ చిత్రీకరణే కీలకమయింది అనిపిస్తుంది. లేకపోతే ఓక మామూలు టీనేజ్ గేంగ్ గొడవల కధ గానే మిగిలిపోతుంది. దాని గురించి మాట్లాడాలి అంటే కధ, పాత్రల ప్రవర్తన మొత్తం చెప్పి తీరాలి.

      నాకున్న బలహీనత కధ మొత్తం చెప్పాలో, వద్దో కూడా తెల్చుకోలేకపోవటం. ఒక్కోసారి ఇటువంటి పుస్తకాలు చదవాలని ఉన్నా అందరికీ దొరికించుకుని చదివే అవకాశం ఉండదు, ముఖ్యంగా US బయట. (ఇక్కడయితే కనీసం లైబ్రరీ లోనయినా దొరుకుతాయి.) అటువంటప్పుడు వీలయినత విపులంగా చెప్పకపోతే, ఒక మంచి పుస్తకం గురించి వివరం అసంపూర్తిగానే ఉండిపోతుంది. చెప్పేస్తే చదివే అవకాశం ఉన్నవాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. పెద్ద డైలమా.

      సినిమా అంత గొప్ప దర్శకుడి చేతిలో పడి కూడా, కధకి పూర్తిగా న్యాయం చెయ్యలేక పోయింది.

  3. varaprasad

    very good naration,keep it up madum,we r expecting more and more novels from u.

Leave a Reply