శతాబ్ది వెన్నెల – డా.కె.గీత

వ్రాసిన వారు: సి.బి.రావ్
*******
ఉరుకులు, పరుగులతో నిండిన రోజులలో, ఒక్కసారి ఆగి, జీవితంలో వెనక్కు చూస్తే ఆ జ్ఞాపకాల ఊసులు మధురంగా ఉంటాయి కదా. అట్లాంటి అనుభూతిని, స్వాంతనను ఇచ్చే కవిత్వమే ఈ”శతాబ్ది వెన్నెల” పుస్తకం.

భారతదేశం, హైదరాబాదు నుంచి 13,600 కిలో మీటర్ల దూరం లో, అమెరికాలో, కాలిఫోర్నియాలోని, మౌంటైన్ వ్యూ లో ఉంటున్నా, 0 కిలో మీటర్ మైలు రాయి దగ్గరే ఉంటుంది రచయిత్రి మనస్సు. “జ్ఞాపకాల వలస పక్షులు” కవితలో అక్కడ జీవిస్తున్నా, ఇక్కడి జ్ఞాపకాలు ఎలా ముసురుకుంటాయో వివరిస్తారు.

“కళ్ళు నులుము కుంటూ నిద్రలేచానా
పేము బెత్తంతో నాన్న తయారు
యోగర్టు కప్పు మూత తెరిచానా
మీగడ పాల వెన్న బువ్వ గోరుముద్దల అమ్మ ముఖం
జాంకాయ కాకెంగిలికున్న రుచి స్టాబెర్రీకుంటుందా!
బఠానీలతో బరువెక్కిన లాగు జేబు, జీన్స్ పాంటుకుంటుందా!”

ప్రేమించి, మమైకమయ్యాక, నువ్వు నాకొద్దు అంటే, మనసు ఎలా చిన్నపోతుంది! హైదరాబాదులో స్థిరపడిన కోస్తాంధ్ర ప్రజలను సంక్రాంతి సెలవుల తరువాత తెలంగాణాకు రాకుండా సరిహద్దు గోడ కడతామని అంటే మనసు విలవిలలాడదా!

“సరిహద్దు ప్రేమ” కవితలో
“అతడు నన్ను ఏనాడు అడగలేదు
ఎక్కణ్ణించి వచ్చావని?
అతడి సంస్కృతి వంటపట్టించుకున్నాను
ఒకరోజు ఏమైందో నాకే తెలియదు
హఠాత్తుగా వచ్చి నా కారు అద్దాలు పగలగొట్టాడు
నా ప్రాంతంలో నీ ఉనికి ఉండగూడదన్నాడు
నా ప్రాంతం – అతని ప్రాంతం
నేనెందుకు అతన్ని వదలి వెళ్ళాలో
నా ప్రేమంతా ఏమి చేసుకోవాలో అర్థం కావడం లేదు”

దేశాలు మారినా, కాలాలు మారినా మనుషుల మనస్తత్వం ఒక్కటే. ఎక్కడివారైనా మనుషులు మారరని షేక్‌స్పియర్ తన పాత్రల ద్వారా చెప్పాడు. అమెరికా లో కూడా మన చర్మపు రంగు మనమెవరో చెప్తుంది. అమెరికా లో జాతి వివక్షత నివురుగప్పిన నిప్పులా కనపడదు కాని……… కవయిత్రి గీత ఈ విషయమై తన అభిప్రాయం వెళ్ళడిస్తూ “Identity” అనే కవితలో అంటారు

“నిన్ను చూడగానే గుర్తించే రంగు
నీ ముఖాకృతి – నీ ఐడెంటిటి
నువ్వు అమెరికన్ ఇండియన్ వా
ఏషియన్ ఇండియన్ వా
……………………………………………
నీ శరీరం పైన వొలిస్తే లొపలేం ఉంది?
………………………………………………………
నీ భాషని కూడా ఈసడించే చూపు
నువ్వు ఇంగ్లిష్ మాట్లాడితే ఆఫీసరూ
స్పానిష్ మాట్లాడితే నౌకరూ ఎలా అయ్యేవసలు?”

“Optimism is life while pessimism is death” అని సంజీవదేవ్ ఒక చోట వ్రాస్తారు. గీత నిస్సందేహంగా గొప్ప ఆశావాది. మృత్యువులో కూడా జీవితాన్ని చూస్తుంది. రాలే ఉల్క ఏ అశుభానికి సూచనమో అని పెక్కుమంది తల్లడిల్లితే తను మటుకు “కిటికీ లేని గది”అనే కవితలో

“రోజూ కిటికీ వైపు చూస్తూనే ఉన్నాను
రాలిపడే నక్షత్రపు అదృష్టం కాస్తయినా తలకు రుద్దుకుందామని”

డా.గీత మనుషులను, మనస్సులను, అకాశాన్ని, నక్షత్రాలను మాత్రమే కాదు వన్యప్రాణులనూ తన కవితలలో స్పృసించకుండా వదలలేదు. కజిరంగా అభయారణ్యం (అస్సాం) గురించి వ్రాస్తూ-


(ఫొటో: సి.బి.రావు)

“ఏనుగంత గడ్డిలో ఏనుగెక్కి సవారి
ఈ అకాశానికెన్ని జింకల అడుగుజాడలు !
ఎన్నెన్ని తెల్ల కొంగల మబ్బు మరకలు !!
ఖడ్గమృగాలు నిర్భయంగా కొమ్ము తలెత్తే సువిశాల మైదానం
గగనానికెక్కుపెట్టిన గడ్డిబాణాలు
ఏనుగుపాదం మునిగే నునుపైన బురద నేలలు”

జన్మ దినాన్ని అబ్దుల్ కలాం గారు ఇలా నిర్వచించారు – “నువ్వు రోదిస్తున్నప్పుడు, నీ తల్లి ప్రమోద భరితమయిన ఏకైక దినమే, నీ జన్మదినం”. గీత తన పుట్టిన రోజు అనుభూతులను “హేపీ బర్త్‌డే” అనే కవితలో వ్రాస్తారు

“సంవత్సరంలో ఏదో వింతజరిగిపోయినట్లు
భూమ్మీద మరెవరూ ఎప్పుడూ జన్మించనట్లు
ఒక కొత్త ఆనందం ”

పిల్లలయితే ఎప్పుడు పెద్దవారమవుతామా అనే తొందరలో కొత్త జన్మదినాల్ని సాదరంగా ఆహ్వానిస్తే, పెద్దవారు ఇంకో సంవత్సరం పెద్దవారమయ్యామా అని ఖేద పడటమూ కద్దు. గీత మాటలలో

“ఇంకా ఎన్ని పుట్టిన రోజులు?!
అయ్యో! వయసొచ్చేస్తుంది!!
అసలింకా బర్త్‌డేలు చేసుకుంటారా?!
అంతా నాకు శుభాకాంక్షలు చెప్పేస్తే బావుణ్ణు”

ఇంకా ఎన్నో వైవిధ్యమయిన, డయాస్పరా గీతాలు, కవితలతో నిండినదీ కవితల పుస్తకం. సరిహద్దు ప్రేమ లాంటి కవితలు చదివిన చాన్నాళ్ళ తరువాత కూడా వెంటాడుతాయి. డా.గీత జ్ఞాపకాల ఊసుల సమారోహమే ఈ శతాబ్ది వెన్నెల. ఈ పుస్తకం అట్టపై చిత్రాన్ని డా|| గీత కూతురైన వరు గీస్తే, ముఖపత్ర రూపచిత్రణ కొడుకు కోమల్ చేయటం ముదాహవం. కవితలను ఆస్వాదించేవారిని అలరించగలదీ చిన్న పుస్తకం.

ప్రథమ ప్రచురణ: డిసంబర్ 2012
1/8 డెమి: పుటలు 108
ధర: రూ129/-
సత్య ప్రచురణలు, హైదరాబాదు.
లభ్యత: విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, దిశ పుస్తక దుకాణాల్లో.
Blog: http://kalageeta.wordpress.com/

You Might Also Like

Leave a Reply