పుస్తకం
All about booksపుస్తకభాష

December 5, 2012

విశ్వనాథ – “దమయంతీ స్వయంవరం”

వ్రాసిన వారు: Halley
*******
ఈ పరిచయం విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన “దమయంతీ స్వయంవరం” గురించి. అప్పుడెపుడో “వేయి పడగలు” చదివాక నేను పెద్దగా విశ్వనాథవారి రచనలు ఏవీ చదవలేదు. ఈ మధ్యన రకరకాల కారణాల వలన తిరిగి వారి రచనలు చదవటం ప్రారంభించాను. ఆ పరంపరలో నేను చదివిన మూడో పుస్తకం ఈ “దమయంతీ స్వయంవరం” (తక్కిన రెండు “బద్దన్న సేనాని”, “వీర పూజ”). ఇటువంటి శైలి లో నేను ఇప్పటి దాకా ఏ పుస్తకమూ చదవలేదు, ఏవో చిన్న కథలు చదివినట్టు జ్ఞాపకం అంతే. 166 పేజీలు ఉన్న ఈ పుస్తకంలో 108వ పేజీ నుంచే ‘దమయంతీ స్వయంవరం’ అనే కథ ప్రారంభం అయ్యేది. అక్కడి దాకా గవర్నమెంటు ఆఫీసర్లు , ప్రజాస్వామ్యం, కాఫీ హోటళ్ళు, ఆధునిక నాగరకత, ఆసుపత్రులు మరియు మోడరన్ వైద్యం, ఆధునిక రాజ్యంగాలు, ఇండాలజిస్ట్లు, పన్నులు వేసే విధానాలు ఇలా రక రకాల విషయాల గురించి ముచ్చటిస్తారు మనతో రచయిత.

ఈ క్రమంలో ఒక చోట నల్ల అంగడి అన్న మాట గురించి చెబుతూ ఇలా అంటారు “నల్ల అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది. తెలుగు భాష అయితే దొంగ అంగడి, చాటు అమ్మకం అనే మాటలు వస్తాయి. దొంగచాటు అన్న శబ్దానికి నల్ల అన్న శబ్దం వాడటం మన నాగరకత, మన బ్రదుకు, మన రాజ్యం, ఇంగ్లిషువాడి ఆధీనం అయిపొయింది అనడానికి మొదటి సాక్ష్యం”. ఆ విషయం గురించే చెబుతూ కవుల గురించీ గ్రంథ కర్తల గురించీ ఈ క్రింది మాటలు అన్నారు. “ఫ్రెంచి దేశంలో రషియా దేశంలో రాజకీయ విప్లవాలు తెచ్చిందెవరో తెలుసున నీకు? కవులయ్యా, కవులు. గ్రంథకర్తలు. అందుచేత మనదేశంలో కూడా ఏం చేయాలంటే, కవులు ఆరగ దీసిన పిన్నులు కాకూడదు. చెల్లని నాణేలు కాకూడదు. పాత ఉసిరికాయ పాత చింతకాయల్లే కుర్చుండగూడదు. గరం గరం తాజామాల్ గా పని చెయ్యాలి”.

మరొక చోట రెండు పాత్రల మధ్య జరిగే వాద ప్రతివాద క్రమంలో ఈ క్రింది మాటలు అన్నారు. ఆ విషయం పక్కన పెడితే ఈ మాటలు నేటి సమాజంలో రోజు రోజుకి తగ్గుతూ వస్తున్న సహిష్ణుతా భావానికి మనం అన్వయిన్చుకోవచ్చును.
“అజ్ఞానంలోంచి మొదట ఉత్పత్తి అయ్యే సరుకు కోపం. అందుచేత నీకు అన్నింటికీ కోపమే వస్తుంది. సామరస్యమనేది నీలోంచి వెళ్ళిపోయింది. సామరస్యం అంటే ఏమిటి? తొమ్మిది రసాలూ, అంటే అన్ని కలిసీ , ఒకదానికొకటి యెడమిస్తూ యేరసాన్ని ఆ రసంగా స్వీకరించగల లక్షణం సామరస్యం. మన దగ్గర ఉన్నది ఒకటే రసం. అప్పుడు సామరస్యం తో అవసరమేమున్నది. ఆ రసం పేరు ఆధునిక నాగరకతా రసం. అందులో పుట్టాం అందులో పెరిగాం. దాని కోసం జీవిస్తున్నాం. దాని కోసమే చస్తాం. దానికోసం ఇతరులని చంపుతాం.”

ఈ క్రింది రెండు వాక్యాలు నాకు Joseph Stiglitz “Globalisation and its discontents” పుస్తకాన్ని గుర్తుకు తెచ్చాయి.
“ప్రపంచంలో ఒక నాగరకతా తరంగంలో జాతీయత అని ఉంటుంది. ఆ తరంగం వెళ్ళిపోయి ఇంకొక తరంగం వచ్చింది. దాని పేరు అంతర్జాతీయత. మరి ఆ తరంగం మన దేశం మీదనే పడ్డది. ఇతర దేశాలలో పెద్ద పెద్ద వాళ్ళందరూ మన దేశం వంటి దేశాలను మోసం చేసేందుకు వాడుతుంటారు దీన్ని. మనవాళ్ళు నిజంగా ఆచరిస్తారు. మనది చాల ఆధ్యాత్మికమైన జాతి కదూ అందుకని.”

ఇక పుస్తకం ముఖ్యంగా దేని గురించో చెప్పాలంటే, కథలో భాగంగా వచ్చే ఈ క్రింది వాక్యము ఒక్కటి చాలునేమో.
“పరరాజులు పాలించిన దేశం యెట్లా ఉంటుందో ఆ దేశం అట్లా ఉంది అన్నాను. మా అమ్మాయి “అంటే అందరు ఉద్యోగాల మీద బ్రతుకుతున్నరన్నమాట” అన్నది”
దానిదేముంది, ఇప్పుడు అన్ని దేశాలు ఉద్యోగాల మీదనే కదా బతుకుతున్నాయి, ప్రత్యేకించి దాని గురించి ఒక పుస్తకం కూడా రాయాలా అని అనుకొనే వాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం!

మరొక చోట మన తెలుగు వారి భాషాభిమానం గురించి చెబుతూ ఇలా అన్నారు. ఎపుడో 1960 లోనే ఇలా అన్నారంటే మరి ఈ కాలపు తెలుగు భాషా స్థితిని గురించి ఏమనేవారో ఏమో మరి. (నా మటుకు నేనే తెలుగు కంటే ఇంగ్లీషు ఎక్కువగా చదువుతానూ రాస్తానూ! చాలా కాలం వరకు నన్ను నేను ఆ “జగదేక కుటుంబం” అనే సిద్ధాంతంతోనే సమాధాన పర్చుకున్నాను కూడా! ఏదో ఇపుడిపుడే నా అంతరాంతరాలలో మగ్గి పడి ఉన్న తెలుగును తట్టి లేపటానికి ఇలాంటి పుస్తకాలు చదువుతున్నాను!)

“బెంగాలుకు వెళ్ళు. వాడు బెంగాలీ తప్ప మాటాడడు. బీహారు వెళ్ళు, హిందీ కాక ఇంకొకటి మాటాడావా, నీ శాల్తీ తిరిగి మళ్ళీ మన ఊరు రాదు. అరవవాళ్ళకి కజక్కం ఉంది. ఎందుకు పనికి రాని వాళ్ళు ఒక్క తెలుగు వాళ్ళే. వీళ్ళు తెలుగువాళ్ళేనా? వీళ్ళ మాతృభాష ఇంగ్లీషు. వాళ్ళు పుస్తకాలలోనే ఇంగ్లీషు మాటలు రాస్తుంటారు. వీళ్ళ ప్రగతిలో అదొక భాగం. ఇదంతా ఏదో దోషమల్లే కనిపిస్తుంది తప్ప నిజానికిది చాల గొప్ప గుణం. ఎందుచేతనంటే ప్రపంచకమంతా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళుతూంది. ఎక్కడకు వెళుతున్నది? ‘జగదేక కుటుంబం’ అన్న మహా సిద్దాంతానికభిముఖంగా వెళ్ళుతూంది. అన్ని రాజ్యాలు కలిసి ఒక్కటే రాజ్యం. ఒకటే భాష. ఒకటే నియమావళి. అప్పుడు యుద్ధాలుండవు. విడివిడిగా ప్రతి రాజ్యానికి వాళ్ళ వాళ్ళ సైన్యాలు వాళ్ళ వాళ్ళకుండవు. కలిసికట్టుగా అన్ని రాజ్యాలకు కలిపి ఒకటే ఉంటుంది. యుద్ధాలు లేనప్పుడు సైన్యమెందుకనుకుంటారేమో! ఏదైనా దేశంలో ఒకానొక విప్లవం జరిగితే ఆ విప్లవాన్ని అణచేందుకు మాత్రమే సైన్యం. అరే! అంత మంచి ప్రపంచకంలో విప్లవాలు పుడతవా అంటారేమో మీరు. పుట్టతవి అనుకోని మన జాగ్రత్త మీద మనముండాలె. అందుచేత ఏకభాష కోసం, ఏక రాజ్యం కోసం, ఏక సౌహార్దం కోసం మన నాగరకత ప్రయాణం చేస్తున్నది. అటువంటి సిద్దాంతానికి అనుకూలంగా వున్నది ఒక్క మన తెలుగు దేశమే”

ఇక దమయంతీ స్వయంవరం అనెడి కథలోని ప్రధాన పాత్ర సి.పురుష్ అనే మంత్రిది. ఈ సి.పురుష్ కి ఆ పేరు పెట్టటం గురించి పెద్ద కథే ఉంది ఈ పుస్తకంలో! ముందు “కలి” అనుకొని తర్వాత అది “కేలే” అయ్యి “కేలే పురుష్” అయ్యి చివరకు “సి.పురుష్” గా నామకరణం జరుగుతుంది కథలో మంత్రి పాత్రకు. సి.పురుష్ అంటే “Sea” పురుష్, అనగా సముద్రాలని దాటి వచ్చిన వాడు అని కూడా భాష్యం చెబుతారు రచయిత. ఈ మంత్రి చేసే పనుల గురించి తెల్సుకోవాలి అనుకుంటే పుస్తకం చదివి తీరాలి మరి!

మరొక చోట ఈ క్రింది మాట అన్నారు విశ్వనాథ వారు. ఈ పుస్తకమంతా ఈ రెండు పదాల చుట్టూనే తిరుగుతుందని చెప్పచ్చునేమో – “దేశమంతా సుభిక్షం అయింది అని అనేవాళ్ళం పూర్వం.. ఇపుడు సుఉద్యోగమైంది అని అనాలే”

దమయంతీ స్వయంవరం కథ ద్వారా ఈ ఉద్యోగాల గురించీ, ఆధునిక సమాజంలో ఉద్యోగాల పుట్టు పూర్వోత్తరాల గురించీ, ఎన్నో విషయాలు చెబుతూ ఈ క్రింది మాటలతో పుస్తకాన్ని ముగించారు.
“దమయంతి స్వయంవరమని పురాణాల్లో ఒక్కటే ఉన్నది. సి. పురుష్ రాజ్యం లో ప్రతి ఊర్లో ప్రతి పెద్ద ఉద్యోగానికి ఈ స్వయంవరాలు జరుగుతూనే ఉన్నవి. ఈ తంతు జరుగుతూనే ఉంది. ప్రతి నల మహారాజు తానుపోతే ఈ దమయంతికి తగిన మొగుడు ఇంకొకడు దొరకదు అనే అహంకారంతోనే ఉన్నాడు”

విశ్వనాథ సత్యనారాయణచే రచింపబడిన ఇతర పుస్తకాల లాగానే నన్ను ఎంతగానో ఆలోచింపజేసిన పుస్తకం ఇది.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.6 Comments


  1. varaprasaad.k

    విశ్వనాథ వారు అనగానే వేయిపడగలు అంటారు,ఆయనలో చాలా పార్శ్యాలు ఉన్నాయని చెప్పటానికి ఇదొక మచ్చు తునక ,అయన రాసే శైలి ఆయనకే మాత్రమే సాధ్యం. ఆనాటి గొప్ప రచయితలను నేటి తరానికి అందిస్తున్న మీకు అభిననందనలు.


  2. పుస్తకాల్లాగే పుస్తక సమీక్షల్లోనూ చదివించేవీ ఆ పుస్తకాన్ని చదివింపచేసేవీ ఉంటాయి.ఈ సమీక్ష చదవగానే ఇంతవరకూ చదవని ఈ పుస్తకాన్ని చదవాలనిపించింది.


  3. […] స్వయంవరం (Damayanti Swayamvaram) : I wrote a telugu review of this book here. This is primarily on one of my pet topics … the job market of today … i always used to […]


  4. పుస్తకాన్ని, రచయిత ఆలోచనా సరళిని పరిచయం చెయ్యడానికి మచ్చులుగా మీరెంచుకున్న వాక్యాలు బాగున్నాయి. విశ్వనాథ తిరోగమన వాది కాదు అనడానికి ఇదొక మంచి ఉదాహరణ కావచ్చు. నెనర్లు.


  5. SIVARAMAPRASAD KAPPAGANTU

    మంచి పరిచయం. ఈ పుస్తకం గురించి తెలియని వారికి, ముఖ్యంగా విశ్వనాథ వారి మీద, వారి పుస్తకాలు ఏమీ చదవకుండానే దురభిప్రాయం ఏర్పర్చుకున్నవారు, ఏర్పరుచుకుందామని సిధ్ధపడుతున్నవారికి ఎంతగానో పనికి వచ్చే వ్యాసం.


  6. నేను విశ్వనాథవారి గ్రంథాలు చాలా చదివాను.కాని యీ పుస్తకాన్ని చదవలేదు.పేరునిబట్టి పౌరాణికం అనుకొన్నాను కాని సాంఘికనవల అని తెలిసింది.ఈ పుస్తరిచయం చేసినందుకు అభినందనలు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
3

 
 

రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు

వ్యాసకర్త: Halley ******************* ఈ పరిచయ వ్యాసం ఎమెస్కో వారు ప్రచురించిన “రాళ్ళపల్లి సాహిత్య సం...
by అతిథి
2

 
 

విశ్వనాథునకు వివిధ కవి నాథుల పద్య నివాళి

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు, ఇందు కిరణ్ కొండూరు ****************** ముందు మాట ఈ నెల (అక్టోబ...
by అతిథి
0

 

 

శతపత్రము – గడియారం రామకృష్ణశర్మ ఆత్మకథ

వ్యాసకర్త: Halley *************** ఈ వ్యాసం గడియారం రామకృష్ణ శర్మ గారి ఆత్మకథ “శతపత్రం” గురించి. ...
by అతిథి
4

 
 

Douglas M Knight Jr’s “Balasaraswathi: Her art and life”

వ్యాసకర్త: Halley ************* ఈ పరిచయం ‘డగ్లస్ ఎం నైట్ Jr’ రాసిన “బాలసరస్వతి: హర్ ఆర్ట్ అండ్ ల...
by అతిథి
0

 
 

విశ్వనాథ చిన్న కథలు

విశ్వనాథ గారివి ఇదివరలో నవలలు కొన్ని, ఆత్మకథాత్మక వ్యాసాలు/ఇంటర్వ్యూలు చదివాను కాన...
by సౌమ్య
1