భాష-దాని తత్వం-అధ్యయనం : చరిత్ర

ఆ మధ్యన కొన్నాళ్ళ క్రితం Understanding Linguistics అని, ప్రాథమిక స్థాయిలో భాషాశాస్త్రం కాన్సెప్టులు పరిచయం చేసే పుస్తకం ఒకటి చదివాను. ఆ తరువాత, చదువు కొనసాగించడానికి అనువైన పుస్తకాల కోసం వెదుకుతూ ఉన్నప్పుడే యూనివర్సిటీ లైబ్రరీలో ఈ పుస్తకం కనబడింది. ప్లాటో నుండి పింకర్ దాకా భాషా తత్వం గురించిన ఆలోచనల క్రమం అనగానే కుతూహలం కలిగింది. ఒక పక్క అర్థం కాదేమో అన్న భయం ఉన్నా కూడా, మొదలుపెట్టాను. ఈ పుస్తకం కొంచెం క్లిష్టమైనదే అయినా, వికీ పేజీలు, ఇతర వెబ్-పేజీల సాయంతో మొత్తానికి నాక్కావలసిన విషయాలు గ్రహించగలిగాను అనే అనుకుంటున్నాను. కనుక, నిజానికి ఈ పుస్తకం గురించి “ఇది చదవండి, బాగుంటుంది” అని చెప్పే సాహసం చేయలేకపోయినా కూడా – దీన్నుండి నేను చాలా నేర్చుకున్నాను కనుక, ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను.

ఎప్పుడో బీసీ కాలం నాటి నుండీ, ఇప్పటి దాకా భాషను గురించి అధ్యయనం చేసిన తత్వవేత్తలూ, తదనంతరకాలంలో పాశ్చాత్య దేశాల్లో భాషాశాస్త్రం అంటూ ఒకటి ఏర్పడ్డానికి పునాదులు వేసిన భాషావేత్తలూ – వీళ్ళందరి ఆలోచనల్లో భాష అంటే ఏమిటి? దాన్ని ఎలా అధ్యయనం చేయాలి?? అన్న ప్రశ్నలకి సమాధానం ఎలా పరిణామం చెందుతూ వచ్చిందో, ఈ క్రమంలో ఆధునికయుగంలో భాషాశాస్త్రం ఎలా రూపాంతరం చెందిందో మనకి పరిచయం చేయడం ఈ పుస్తకం లక్ష్యం. ఇందుకు రచయిత ఎంచుకున్న మార్గం: ప్లాటో నుండి ఇప్పటి కాలం దాకా ఒక పది మందిని, వారి ఒక ప్రసిద్ధ రచననీ తీసుకుని, ఒక తూలనాత్మక దృష్టితో వాటిని విశ్లేషిస్తూ, తన ప్రకారం వాళ్ళు వ్యక్తపరచిన అభిప్రాయాల ప్రభావం భాషాశాస్త్రంపై ఎలా ఉందో చెప్పడం.

ఈ పదిమందిలో – భాషాశాస్త్రవేత్తలు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, తత్వవేత్తలుగా భాష తత్వాన్ని గురించి కొంచెం ఎక్కువగా ఆలోచించిన వారూ ఉన్నారు. భాషావేత్తలు – Saussure, Bloomfield, John Searle, Noam Chomsky, Steven Pinker. తత్వవేత్తలు – ప్లాటో, బెర్ట్రాండ్ రసెల్, Willard Van Orman Quine. తత్వవేత్తలైనా భాషను గురించి ఎంతోకొంత సీరియస్ గా ఆలోచించిన వారు: అరిస్టాటిల్, Wittgenstein. (ఇక్కడ జతచేసిన వికీ పేజీల్లో ప్లాటో, అరిస్టాటిల్, రసెల్ లాంటి విభిన్నరంగాల్లో కృషి చేసిన వారివి తప్ప, తక్కిన పేజీలు ఒకసారి చదివితే, ఆయా వ్యక్తుల రచనల సారాంశం కూడా తెలుస్తుంది. అందుకే ఇచ్చాను.)

వీటి తరువాత, అనుబంధ వ్యాసాలుగా -శాస్త్ర తత్వాన్ని (philosophy of science) అధ్యయనం చేసిన ఇద్దరు తత్వవేత్తల రచనలు పరిశీలిస్తూ – వాళ్ళ ప్రాతిపదికలో భాషకు సంబంధించి ఒక “సైన్సు” సాధ్యమా?? అన్న ప్రశ్నకి జవాబు వెదుకుతారు రచయిత. ఈ విభాగంలో “భాషా శాస్త్రాన్ని “శాస్త్రం”, అదే సైన్సు అనవచ్చునా? అసలు సైన్సు అని దేన్నైనా అనడానికి కావాలసిన లక్షణాలు ఏమిటి?” అన్న రెండు అంశాలను తీసుకుని, శాస్త్ర తత్వం గురించి రాసిన Karl Popper, Thomas Kuhn ల సిద్ధాంతాల ఆధారంగా భాషాశాస్త్రాన్ని విశ్లేషించారు రచయిత. ఈ సిద్ధాంతాలను బట్టి చూస్తే – భాషాశాస్త్రం – హ్యుమానిటీస్ అవుతుంది కానీ సైన్సు కాదనీ, అలా సైన్సు అనబడడానికి ఇంకా సమయం పడుతుందనీ తేల్చారు మొత్తానికి. అయితే ఇక్కడనే కాదు, ఈ పుస్తకంలో మొదట్నుంచీ కూడా – ఒకటి (Science) ఎక్కువ, ఇంకొకటి (Humanities) తక్కువ అన్న ధోరణిలోనే సాగడం నాకంతగా రుచించని అంశం. Logic is greater than language అన్న ధోరణిలో సాగిన Bertrand Russell వంటి వారి రచనలని కొంచెం తీవ్రంగానే విమర్శించిన రచయిత ఈ విషయంలో తన అభిప్రాయాలూ అలాగే ఉన్నాయి అన్న సంగతి గుర్తించకపోవడం ఆశ్చర్యంగానే అనిపించింది నాకైతే.

అసలుకి పుస్తకంతో ముందుకుసాగే కొద్దీ ఇతర భాషాశాస్త్రవేత్తల రచనల సారాంశాలు చదువుతున్నప్పుడే – ఈ logic-language, language-science ల మధ్య ఈ ఎక్కువ-తక్కువల నిర్ణయాలు ఎందుకు? దేన్నైనా రెండోదానికంటే గొప్పదని నిర్ణయించగలిగే అవకాశం ఉందిగా? అన్న సందేహం కలిగింది. చివరి రెండు వ్యాసాలకొచ్చే సరికి – ఆ సందేహం మరింత ఎక్కువై, ఆఖరుకి ఈ అంశాల గురించి వీళ్ళ మీమాంసలను పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాను. అయితే, పుస్తకం మొదట్లో నాకు చేసిన వాగ్దానాన్ని (అదే, ముందుమాట ద్వారా!) నిలుపుకుంది.

“Consequently, what the reader has to expect is a review of what the philosophy of language/linguistics and the discipline of linguistics itself have achieved so far, and an outlook of what seems to be possible and desirable for these academic studies in the future”

-అని పుస్తకం మొదలయ్యే ముందు రచయిత రాసిన వాక్యాలు మాత్రం పుస్తకానికి అతికినట్లు సరిపోతాయి. వీరిలో దాదాపుగా ప్రతి ఒక్కరి గురించీ రచయిత పాజిటివ్ గా చెప్పిన అంశాల కంటే నెగటివ్ గా చెప్పినవే ఎక్కువగా ఉన్నాయి. అయితే, వీటి మధ్య కూడా, ఈ పుస్తకం నుండి నేను తెలుసుకుంటానని నేను ఊహించింది – తెలుసుకోగలిగాను అనే అనుకుంటున్నాను కనుక, ఈ తీవ్ర విమర్శల వల్ల నేను నష్టపోలేదనే చెప్పాలి. పైగా వాటి మధ్య కూడా వీరిలో కొందరి రచనలు నేరుగా చదవాలి అనే అనిపించింది నాకు. కొన్ని వ్యాసాలు సరిగ్గా అర్థం కాకపోయినా, చాలామట్టుకు అర్థమయ్యేలాగానే రాశారు. నాకు అర్థం కాకపోవడం ఈ నేపథ్యం ఎక్కువగా లేనందువల్ల అనిపించింది.

నిజానికి ప్రాచీన భారతీయ భాషావేత్తలు ఈ విధమైన అధ్యయనాల్లో పాశ్చాత్యులతో పోలిస్తే చాలా ముందున్నట్లే లెక్క. కానీ, పుస్తకం పాశ్చాత్యుల పరిశోధనలకే పరిమితం చేయడం కొంచెం నిరాశ పరచిందనే చెప్పాలి. అందువల్ల, ఆ వివరాలు తెలిపే The word and the world: India’s contribution to the world of language అన్న పుస్తకం చదువుతున్నాను. పూర్తిచేసాక దాని గురించి కూడా త్వరలో పరిచయం చేస్తాను.

***
పుస్తకం వివరాలు:

Philosophies of Language and Linguistics
Plato, Aristotle, Saussure, Wittgenstein, Bloomfield, Russell, Quine, Searle, Chomsky and Pinker on Language and its systemic study (నిజంగానే ఇంత పెద్ద టైటిల్ ఉంది!)
Ralph A. Hartman.
Haralex Publishing House, Edinburgh, 2007.

You Might Also Like

Leave a Reply