పుస్తకం
All about booksఅనువాదాలు

August 3, 2009

Letters to Felice: Kafka

More articles by »
Written by: Purnima
Tags:

kafka“నువ్వు కథ చెప్పావా? నేను కథ విన్నానా!” అన్నట్టు ఉండక, “నువ్వు చెప్పే కథల వెనుక కథలేంటి? అసలు నీ కథేంటి? నాకు తెలియాలి” అని డిమాండ్ చేయాలనిపించింది కాఫ్కా “మెటమార్ఫసిస్” కథ చదివగానే. ఈ కథ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, మనిషిలోని “అసహాయత”ను పరాకాష్ఠకు తీసుకెళ్ళడం. చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఇమడలేక, అలా అని వాటిని వదిలెళ్ళలేక పడే పాట్లను అత్యంత సమర్థవంతంగా చెప్పిన కథ ఇది. ఈ కథ చదివేసిన తర్వాత, జాలంలో ఈ కథకు సంబంధించిన ఏవో వ్యాసాలు చదువుతుంటే తెల్సింది, కాఫ్కా ఈ కథను తన స్నేహితులకి చదివి వినిపిస్తే విరగబడి నవ్వుకున్నారట అందరూ. నేను ఈ కథ చదివి ఏదో భారీగా ఫీల్ అవుతుంటే, వాళ్ళకి నవ్వెలా వచ్చిందో అర్థం కాలేదు. అదేంటో గానీ, కాఫ్కా రచనా ప్రతిభను గురించి ఎంత వినిపిస్తుందో, అతని వ్యక్తిత్వం, మానసిక పరిస్థితిని గురించీ అన్నే చర్చలు. అందుకే లెటర్స్ టు ఫెలిస్ నా చేతికందే అవకాశం వచ్చినప్పుడు వదులుకోవాలనిపించలేదు. “Letters to Felice, written without the faintest idea that they would be published, read like a well-constructed novel — a somewhat harrowing one” అన్న వాక్యం పుస్తకం అట్ట మీదే కనిపించేసరికి, “అయ్యో.. ఓ జీవుడి “పర్సెనల్” విషయాలు నేను చదవటం..” అన్న ఆలోచన కాసేపు ఇబ్బంది పెట్టింది. “పోస్ట్ మార్టమ్ చేసేటప్పుడు బాడీకి నొప్పేమో అని “ఫీల్” అయ్యే సెంటిమెంటెల్ ఫూల్” అని నన్ను నేనే విమర్శించుకుని పుస్తకం చదవటం మొదలెట్టాను.

పుస్తకంలో ఏముందంటే:
ముందుగా కాఫ్కా, ఫెలిస్ ల గురించి ఒక్కో పేజీ పరిచయ వ్యాసం. అవి అయ్యాక ఉత్తరాలు మొదలు. ఈ పుస్తకం కాఫ్కా తన ప్రియురాలైన ఫెలిస్‍కి 1912-1916 మధ్య కాలంలో రాసుకున్న (ప్రేమ)లేఖల సంకలనం. స్నేహితులతో కల్సి ఓ ఊరెళ్ళినప్పుడు కాఫ్కాకు ఫెలిస్ పరిచయం అవుతుంది. తొలి పరిచయం తర్వాత వీరి ఇరువురి మధ్య బోలెడన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. (బోలెడన్ని అంటే నిజంగా బోలెడన్ని. రోజుకి రెండు మూడు రాసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.) వీరివురి ఉత్తరాల ప్రణయం నిశ్చితార్థం వరకూ దారితీస్తుంది. స్పర్థల వల్ల ఆ నిశ్చితార్థం చెడిపోవడం, మళ్ళీ సయోధ్య కుదరడం, మళ్ళీ స్పర్థలు వచ్చి, వివాహం జరక్కపోవడం సంభవిస్తాయి. కాకపోతే పుస్తకంలో ఫెలిస్ రాసిన జాబులు లేవు (కాఫ్కా వాటిని తగలపెట్టేశాడు అని చదివిన గుర్తు).

పేరులో ఉన్నట్టే ఇవి ఫెలిస్ కి కాఫ్కా కానీ, కాఫ్కా తరఫున మరెవరు గానీ రాసిన ఉత్తరాలు. కాఫ్కాకి చాలా సన్నిహితమైన ఒక నేస్తం, వాళ్ళ అమ్మగారూ ఫెలిస్ కి రాసిన ఉత్తరాలూ ఉన్నాయి. అలనే కాఫ్కా ఫెలిస్ స్నేహితురాలికి రాసిన ఉత్తరాలూ ఉన్నాయి. ఆపకుండా చదివించగల పుస్తకాల్లో ఇదొకటి. కాఫ్కా అక్షర మాయ వల్లనేమీ, భావ వ్యక్తీకరణ శైలి వల్లనేమీ పేజీ తర్వాత పేజీ అలా చదువుకుంటూనే పోయాను. పుస్తకం ఎడిటింగ్ కూడా చదువుకోడానికి వీలుగా ఉంది. అట్ట మీద ఉన్నట్టే, ఏ నవలకూ తీసిపోని విధంగా ఉంటుంది. అవసరమైన చోట్లల్లా నోట్సు ఇవ్వడం వల్ల పఠనం ఆగకుండా సాగుతుంది.

ఇహపోతే ఆశించినట్టే ఈ ఉత్తరాల్లో కాఫ్కా చదివిన సాహిత్యం, కాఫ్కా రచించిన సాహిత్యం గురించి చాలా కబుర్లు ఉన్నాయి. ఫెలిస్‍కి దాదాపు తన దినచర్యనంతా రాయడం అలవాటుండటంతో కాఫ్కా రసిన కొన్ని రచనలు (The Judgement Story – ఇది ఫెలిస్‍కి అంకితమివ్వబడింద, The Trial) గురించి ఏ రోజు ఆలోచనలు ఆ రోజు ఉత్తరాల్లో ఉంటాయి.  పుట్టడానికి ఓ రచన పడే వేదన కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తాడు.

నా అనుభవాలు:
తాను రాసిన ఉత్తరాల ద్వారా ఓ మనిషిని గురించి తెల్సుకోవడంలో ఉన్న సౌకర్యం ఏమిటంటే, ఉత్తరాలు ఆ మనిషిని ఆయా క్షణాల్లో ఆవిష్కరిస్తాయి. ఓ వయస్సొచ్చాక, తీరిగ్గా కూర్చుని గతాన్ని నెమరువేసుకునే ఆత్మకథల్లో “కథ” ఎక్కువైపోతుంది, గడిచిన క్షణాల్ని ఈ క్షణమనే టెలిస్కోప్‍లో చూడ్డం వల్ల. ఆ ప్రయత్నంలో ఈ క్షణపు నీడ గడిచిన వాటిపై వద్దన్నా పడుతుంది. అదే ఉత్తరాల్లో అయితే ఆ క్షణంలోని ఆత్మని బంధించటం జరుగుతుంది. అదీ కాక ఉత్తరాల్లో వలకబోసే ఆత్మీయత అయినా, అవేశాలూ అయినా తాజాగా ఉంటాయి. అందుకే లేఖల సంకలనం చదవాలంటే నాకు అమితాసక్తి.

కాకపోతే కాఫ్కా ఉత్తరాల సంకలనంలో నా ఆలోచనలూ, అనుభవాలూ భిన్నంగా ఉన్నాయి. తన జీవితంతో కానీ, తన కుటుంబంతో కానీ, తన వృత్తి ప్రవృత్తిలతో కానీ, ఆఖరికి తనతో తానే ఏ కోశాన సంతృప్తి, సంతోషం లేని మనిషి. చిన్నప్పటి నుండీ “నాన్న” అనే భయపు ఛాయల్లో బతికి, ప్రాణమైన రచనా వ్యాసంగానికి సమయాన్ని ఇవ్వలేక, జీవనోపాధికై తన స్వభావం ఇమడలేని ఉద్యోగం చేస్తూ, తన పై తానే ఎంతో అసంతృప్తితో, భయాలతో, ఆందోళనతో, అయిష్టతతో ఉన్న కాఫ్కా జీవితంలో ఒక అమ్మాయి ప్రవేశించడంతో, ఉన్న చిక్కు ముళ్ళన్నీ వాటంత అవే విడిపోతున్నట్టే అనిపిస్తూనే ఇంకా గట్టిగా బిగుసుకుంటాయి.

తనలో కలిగే ప్రతీ చిన్ని పరిణామాన్ని, ప్రతీ చిన్ని కదలికనూ, ప్రతీ చిన్ని భావావేశాన్ని అక్షరాల్లో కాఫ్కా పెట్టగలిగినట్టు మరొకరు పెట్టగలరా అన్నది నాకు అనుమానమే! ఈ పుస్తకం చదువుతున్నప్పుడు, “ఇవ్వాళ నాకు ఏదోలా ఉంది”, “నాకు ఏమిటో అవుతుంది”, “నాకసల స్థిమితం లేదు” అని మనం తరచుగా వాడే వాక్యాల్లో, “ఏదో”, “ఏమిటో”లను కాఫ్కా కళ్ళకి కట్టినట్టి వర్ణిస్తాడు. అసలు ఇతగాడి అక్షరజాలం నుండి తప్పించుకోగలిగిన భావనేదైనా ఉందా అని నాకనిపిస్తుంటే, “అక్షరాల్లో మనల్ని మనం ఎప్పుడూ పట్టుకోలేం” అని తెల్చేయడం నిరాశ కలిగించింది.

కాఫ్కాని పరిచయం చేసుకోడానికి ఈ ఉత్తరాలు భలే సాధనం అనుకున్నాను. అలానే అనుకుంటూ ఉంటే, ఈ పాటికి ఒక వ్యక్తిగా కాఫ్కా అంటే నాకు విరక్తి కలిగుండేది.  సాహిత్యాన్ని అధ్యయనం చేయటం, తాను రాసుకోవటం తప్ప వేరే ప్రపంచంలో బతకలేని ఇతను, ఓ అమ్మాయిపై మనసు పారేసుకుని, ఆమెని తన జీవితంలోకి, జీవన విధానంలోకి ఆహ్వాన్నించాలనుకొని, ఆమోదించలేక పడ్డ యాతనా, ఆ అమ్మాయిని కష్టపెట్టిన తీరు నిజంగానే ఏ నావల్‍కి తీసిపోదు. కాఫ్కా స్నేహితుడు, మాక్స్ బ్రాడ్ ఫెలిస్ కి రాసిన ఓ ఉత్తరంలో కాఫ్కా గురించి ఇలా అంటాడు: Altogether, he is a man who wants absolute, the ultimate in all things. కాఫ్కా రాసే ప్రతీ అక్షరం వెనుక ఈ వాక్యం అంతర్లీనంగా కనబడుతూనే ఉంది నాకు. ప్రేమా, కోపం, ద్వేషం, అసహనం, విసుగు, అపనమ్మకం, అభద్రతాభావం, ఈర్ష్య, అనుమానం – ఏ భావనలోనైనా తీవ్రత స్థాయి హెచ్చుగా ఉంటుంది. అవి ఒక్కోసారి నన్ను ఇబ్బంది పెట్టాయి, ఒక్కోసారి ఏవగింపు కలిగించాయి. విసిగించాయి, విసిరికొట్టాలి అనిపించేంతగా.

కాఫ్కాని ఈ అక్షరాల్లో తూకం వేసి చూడ్డం అన్యాయం అనిపించింది నా వరకైతే. ప్రేమికులన్నాక ఒకర్నొకరు impress చేయడానికి ఎన్ని తంటాలు పడతారో, అన్నే confessions కూడా ఉంటాయి. కాఫ్కా తనలోని ప్రతీదాన్ని అక్షరాల్లో తర్జుమా చేసి, నిజాయితీగా ఆమెకి అందించాడు. కొన్ని చోట్లైతే తన మస్తిష్కంలో నన్ను తిప్పినట్టు అనిపించింది. వాటినంతా మనం భరించగలగాలి. ఉత్తరాలు భలే గమ్మత్తైన మాధ్యమాలు. కళ్ళముందు లేని అవతలి వ్యక్తి సాంగత్యంలో ఉత్తరాలు రాయబడతాయి. (It takes two to write a letter.) ఉత్తరం పూర్తయ్యినప్పటి నుండి జవాబు వచ్చే వరకూ నిలువనివ్వని ఒంటరితనం.  ఈ ఊగిసలాట మధ్య రాసే ఉత్తరాల్లో అభద్రతాభావం, భయం, సంకోచం సహజంగానే పుష్కలంగా కనిపిస్తుంటాయి. ప్రేమలేఖలు అయితే మరీనూ! కాఫ్కా లాంటి వాళ్ళు ఆ భయాల్ని, అభద్రతలనీ పూసగుచ్చినట్టు చెప్తారు కాబట్టి, తట్టుకోగలగాలి.

ఎందుకు చదవాలి ఈ పుస్తకం?
౧. కాఫ్కా అంటే ఏ మాత్రం ఆసక్తి ఉన్నా తప్పక చదవాల్సిన పుస్తకం.
౨. కాఫ్కా అంటే ఆసక్తి లేని వారు – ఓ మనిషి తనను గూర్చి ఇంత స్పష్టతతో (కనీసం ఆ క్షణంలో అనిపిస్తుంది అనిపించినట్టు) రాయగలగడం, మనిషి మనస్తత్వాలను అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్నవారూ చదవుకోవచ్చు.

ఆరొందల పేజీలున్న ఈ పుస్తకం చదివేయడానికే కాదు, మునిగాక తేలడానికి కూడా చాలా సమయం పడుతుంది.

ఈ పుస్తకంపై ఒకే ఒక్క వాక్యం చెప్పమంటే, కాఫ్కా మాటలే అరువు తెచ్చుకుంటాను.

Writing does make things clearer, yet at the same time worse.About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..5 Comments


 1. సౌమ్య

  U r making me curious! 🙂

  ““ఇవ్వాళ నాకు ఏదోలా ఉంది”, “నాకు ఏమిటో అవుతుంది”, “నాకసల స్థిమితం లేదు” అని మనం తరచుగా వాడే వాక్యాల్లో, “ఏదో”, “ఏమిటో”లను కాఫ్కా కళ్ళకి కట్టినట్టి వర్ణిస్తాడు.”
  – Interesting!!


 2. Sunil

  Lovely Review.

  Thank you for this.

  “It takes two to write a letter.”

  So true!


 3. వెంకటరమణ

  మంచి పరిచయం . ‘నేనూ-చీకటి’ అనే నవల్లో కాశీభట్ల వేణుగోపాల్ గారు , కాఫ్కా ను గురించి కొంత వ్రాసారు. అప్పుడే కాఫ్కా రచనలను చదవాలనుకున్నాను. బాగా గుర్తు చేసారు . ధన్యవాదాలు .


 4. hmm… makes me wanna read it and soon :)…
  Lovely review… I will read the letters and then get back on this post… and share my perspective too… 🙂


 5. afsar

  “ఈ పుస్తకం చదువుతున్నప్పుడు, “ఇవ్వాళ నాకు ఏదోలా ఉంది”, “నాకు ఏమిటో అవుతుంది”, “నాకసల స్థిమితం లేదు” అని మనం తరచుగా వాడే వాక్యాల్లో, “ఏదో”, “ఏమిటో”లను కాఫ్కా కళ్ళకి కట్టినట్టి వర్ణిస్తాడు.”

  మూడు ముక్కల్లో కాఫ్కా అంతే!కాఫ్కాని నేను వూరికే చదవడం మొదలెట్టాను అప్పట్లో – అలా వూరికినే అనుకున్న వాడు అరబ్బు ఒంటె అయి కూర్చున్నాడు ఇప్పటికీ – నేను ఆ ‘అస్తిమితత్వం’ నించి బయట పడలేకపోయాను అని చెప్పడానికి దిగులు లేదు.

  సరే, నా గొడవ అలా వుండనివ్వండి, ఇది మరో మంచి సమీక్ష. కాఫ్కా నించి మీరు అంత త్వరగా బయటపడలేరు. కాముకి దారి చూపిస్తాడు మెల్లిగా.

  కొన్నాళ్ళ క్రితం వీళ్ళ గురించి మాట్లాడ్డమే భయంగా వుండేది తెలుగు దేశంలో.- కాము “outsider” ని ‘అపరిచితుడు’ అనే శీర్షిక కింద చాలా కాలం కింద నేను ఆంధ్ర జ్యోతి సాహిత్య వేదికలో అచ్చు వేసినప్పుడు చాలా మంది కన్నెర్ర చేసారు, సంబద్ధ యుగంలో అసంబద్ధ ప్రేలాపన చేస్తావా అని!

  కాములని, కాఫ్కాలని చదివి, వొంట బట్టించుకొని వాటిని తెలుగు పాఠకులకి వివరించే వోపిక మీ వాక్యాల్లో చూస్తున్నా. అందులో ఈ కాలం / ఈ తరం వ్యాదుల్ని నయం చేసే మందులున్నాయి.

  పూర్ణిమా, ఇప్పుడే కొంచెం మీకూ సౌమ్యకి ఫరక్ చూస్తున్నా. మీరిద్దరూ వోక్కలాగే రాస్తున్నారని నేనే ఎవరికో చాడీ చెప్పాను కూడా!

  కాని, ఈ సమీక్షల లోంచి ఆ రచనల అనువాదాల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నా.మనకి అలాంటి అనువాదాలు అవసరం అని సామాజిక స్ప్రహ పాఠాలు చెప్పను కానీ, మా లాంటి కొందరికి ఆ అనువాదాలు అవసరం అని మటుకు చెప్పగలను.

  .  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

నా కథ – చార్లీ చాప్లిన్

వ్యాసకర్త: Sujata Manipatruni ******** నా కథ – చార్లీ చాప్లిన్ అనువాదం : శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార...
by పుస్తకం.నెట్
0

 
 

నరదేవుడి కథ

ఇజ్రాయెల్ కు చెందిన చరిత్రకారుడు యువల్ నోవా హరారీ వ్రాసిన Sapiens, Homo Deus అన్న రెండు పుస్తకా...
by nagamurali
6

 
 

ఇమ్మడి పులకేశి – చారిత్రక నాటకం

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ******** “పండురంగడు అనే చాళుక్యసేనాని పండ్రెండు ...
by అతిథి
0

 

 

Night – Elie Wiesel

వ్యాసకర్త: Nagini Kandala ******* ‘We must always take sides. Neutrality helps the oppressor, never the victim. Silence encourages the tormentor, never the tormented.’ – Elie Wiesel బ్ర...
by అతిథి
1

 
 

Man Tiger – Eka Kurniawan

వ్యాసకర్త: Nagini Kandala ************ On the evening Margio killed Anwar Sadat, Kyai Jahro was blissfully busy with his fishpond. A scent of brine wafted through the coconut palms, the sea moaned at a high pi...
by అతిథి
0

 
 

సార్థ

“సార్థ” – ఎనిమిదవ శతాబ్ద ప్రథమ పాదం నాటి భారతదేశ చరిత్రలో పొదగబడ్డ కథ. “మన దేశ ...
by Srinivas Vuruputuri
2