రాగం భూపాలం

కొన్నాళ్ళ క్రితం Women writing గురించి దొరికినవన్నీ చదువుతున్నప్పుడు నా కంటబడ్డది రాగం భూపాలం పుస్తకం. అప్పటికి సత్యవతి గారి కథలు కొన్ని, భూమిక పత్రికలో అనుకుంటా, ఇంటర్వ్యూ ఒకటీ చూసి ఉన్నందువల్ల పుస్తకంలో ఏముందా? అని తెరిచి చూశాను.

“పశ్చిమం నుంచి ప్రసరించినా,
తూర్పు నుంచి ప్రసరించినా
వెలుగెప్పుడూ వెలుగే.

ఎక్కి వచ్చిన మెట్లను ఒక్కసారి
వెనుతిరిగి చూసినప్పుడు
ఇన్ని మెట్లెక్కామా అని ఆశ్చర్యానందాలు సహజమే.

ఆ మెట్లై, వాటిని అధిరోహించడానికి పరిచిన
వెలుగై, భూపాల రాగాలై
నిలిచిన స్త్రీలకు
వినమ్రంగా..”

అని రాసి ఉంది మొదట్లో. అప్పటికి నాకు ఇవి ఎలాంటి వ్యాసాలో అర్థం కాలేదు. అయితే, విషయసూచిక చూడగానే, తప్పకుండా ఇది కొని చదవాలి అని నిర్ణయించేసుకున్నాను. కారణం – ఇవి “పడమటి కిటికీ”, “నల్లతేజం”, “తూర్పు వాకిలి” అన్న మూడు విభాగాలలో (ప్రధానంగా) ఫెమినిస్టు సైద్ధాంతిక సాహిత్యం గురించి, కొందరు మహిళా’మణుల’ గురించి వాళ్ళు రచయిత్రులైతే వాళ్ళ రచనల గురించి కూడా – రాసిన 20 పరిచయ వ్యాసాలు. వీరిలో సింహ భాగం రచయితలే అయినా, ఇతర రంగాల వారు కూడా ఉన్నారు. మూడు విభాగాల గురించి వరుసగా పరిచయం చేస్తున్నాను.

పడమటి కిటికీ

మొదటి వ్యాసం Vindication of the rights of woman అన్న పుస్తకం గురించి. రచన Mary Wollstonecraft. ఫెమినిస్టు ఫిలాసఫీ గురించి వచ్చిన తొలి గ్రంథాల్లో ఇదీ ఒకటిట. “స్త్రీవాద సాహిత్యచరిత్రను అధ్యయనం చేసేవారు, స్త్రీవాదాన్ని గురించి తెలుసుకొనగోరేవారు, చదువవలసిన ముఖ్యమైన గ్రంథాలలో” ఈ పుస్తకం ఒకటని అంటూ సత్యవతి గారు మొదలుపెట్టారు ఈ వ్యాసాన్ని. ఎప్పుడో 1792లో ఇలాంటి టాపిక్ తో ఒక పుస్తకం వచ్చిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ పరిచయం ద్వారా ఆ పుస్తకం గురించి ఎక్కువ అవగాహన కలుగకపోయినా మేరీ ఊల్స్టోన్ క్రాఫ్ట్ గురించీ, తరువాతి తరాలపై ఆవిడ ప్రభావం గురించీ మాత్రం అర్థమైంది (అన్నట్లీపుస్తకం ప్రాజెక్టు గూటెంబర్గ్ లో ఉచితంగా చదివేందుకు ఇక్కడ లభ్యం).

తరువాతి వ్యాసం – Virginia Woolf రాసిన A room of one’s own గురించి. ఈ పుస్తకం గురించి చాలా విన్నాను, అప్పుడెప్పుడో చదవడానికి ప్రయత్నించి మళ్ళీ ఎందుకో కొనసాగించలేదు కానీ, ఈ వ్యాసం చదవగానే మాత్రం వీలు చూసుకుని ఈ పుస్తకం చదవాలి అనిపించింది (ఈ పుస్తకం ఈబుక్ లంకె ఇదిగో.). తరువాతి వ్యాసం Simone de Beauvoir రాసిన The Second Sex పుస్తకం గురించి. ఇది చాలా వివాదాస్పదమైన, వాటికన్ నిషేధానికి కూడా గురైన పుస్తకమట. అస్తిత్వవాద తాత్విక దృక్పథం నుండి స్త్రీవాదాన్ని విశ్లేషించారట ఈ పుస్తకంలో. ఈ వ్యాసం ఈ పుస్తకంలోని వ్యాసాల్లో నాకు బాగా నచ్చిన వ్యాసాల్లో ఒకటి. సిమోన్ గురించేకాక, ఈ పుస్తకం గురించి కూడా ఒక మంచి అవగాహన కలిగినట్లు అనిపించింది వ్యాసం చదివాక. తాత్విక గ్రంథం గురించే అయినా కూడా తేలికపాటి భాష వాడి అర్థమయ్యేలా వివరించారు సత్యవతి గారు.

నాల్గవ వ్యాసం Kate Millett రాసిన Sexual Politics గురించి. ఈ పుస్తకాన్ని ఒక ground breaking book అన్నారు సత్యవతి గారు. స్త్రీ పురుష సంబంధాలలోని రాజకీయ కోణం ఈ పుస్తకంలో ప్రధానాంశం. సాహిత్యంలోని పితృస్వామ్య భావజాలాన్ని ఎత్తిచూపి విశ్లేషించిన ఈ గ్రంథానికే కేట్ మిల్లెట్ కు పీ.హెచ్.డీ వచ్చిందట. పుస్తకంలోని సారాంశాన్ని చాలా చక్కగా సంక్షిప్తీకరించారు సత్యవతి గారు. కాల్పనికేతర సాహిత్యానికి ఇంత చక్కటి పరిచయాలు ఎలా రాస్తారో!

తరువాతి వ్యాసం Germaine Greer రాసిన Female Eunuch అన్న పుస్తకం గురించి. పుస్తకంలోని అసలు విషయం గురించి నేనేమీ వ్యాఖ్యానించలేను కానీ “స్త్రీశక్తి అంటే స్త్రీల నిర్ణయ శక్తి. పితృస్వామ్యానికి సంబంధించిన బరువులన్నీ దింపేసుకుని, తన ఔన్నత్యాన్నీ, నైపుణ్యాలనూ కాపాడుకునే స్వంత నైతిక విధానాన్ని ఏర్పాటు చేసుకోగల సమయాన్నీ, స్వాతంత్ర్యాన్నీ స్త్రీలు సాధించాలి. మనోవైౙానిక శాస్త్రవేత్తలు తనకి ఆపాదించిన ఆత్మిక వైకల్యాన్ని (spiritual cripple) సమర్థవంతంగా తిప్పికొట్టాలి” అన్న గ్రీర్ వ్యాఖ్యలు మాత్రం నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

తరువాతి వ్యాసం Betty Friedan రాసిన The Feminine Mystique గురించి. అమెరికాలో second wave of feminism మొదలవడానికి కారణమైన పుస్తకాలలో ఇదొకటట. ఈ పదజాలం అంతా నాకు కొత్తే అయినా, ఈ వ్యాసంలో పుస్తకపరిచయానికి ముందు నేపథ్యాన్ని వివరిస్తూ సత్యవతి గారు చెప్పిన మాటలని బట్టి ఈ పుస్తకం వచ్చిన నాటి పరిస్థితులు అర్థమయ్యి – ఆశ్చర్యంగా అనిపించింది ఆ కాలంలో అంతకు ముందు తరంలో మొదలైన ఫెమినిజానికి వచ్చిన అడ్డంకులు, వ్యాఖ్యానాల గురించి తెలుసుకుని.

Shulamith Firestone రాసిన The Dialectic of Sex పుస్తకం గురించి చదువుతూంటే మాత్రం కొంచెం భయమేసింది – ఇంత రాడికల్ ప్రతిపాదనలు చేస్తే (“స్త్రీలు సహజ పునరుత్పత్తి ధర్మాల నుండి బయటపడాలి. న్యూక్లియర్ కుటుంబాలు రద్దు కావాలి. పిల్లల పెంపకం రాజ్యం బాధ్యత కావాలి” ) అసలుకి “ఆనందమయ జీవితం” అన్నది స్త్రీకైనా, పురుషుడికైనా ఎవరికైనా సాధ్యమేనా?అని సందేహం కలిగింది. “అయితే, దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సమాజంలో శాస్త్ర విజ్ఞానపరంగా, ఆర్థికపరంగా, రాజకీయపరంగా వచ్చిన మార్పు చేర్పులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ పుస్తకాన్ని మనం చదవాలి. అంతేకాక ఈ పుస్తకం వ్రాసినప్పటి స్త్రీల పరిస్థితులలో రచయిత్రి ఇంత విప్లవాత్మకంగా ఆలోచించడాన్ని అభినందించాలి.” అన్న సత్యవతి గారి ముగింపు వాక్యాలు చదివాక కొంచెం శాంతించా!

“స్త్రీవాదోద్యమ ద్వితీయ దశ” – టైటిల్ చూసి ఒక సింహావలోకన వ్యాసం ఊహించాను కానీ, పైన చెప్పిన ద్వితీయ దశ గ్రంథాలు వచ్చిన 60స్-80స్ కాల పరిస్థితులని వివరిస్తూ, స్త్రీవాదం మూడో దశలోకి వెళ్ళిందని చెప్పి క్లుప్తంగా ముగించేసారు వ్యాసాన్ని. తరువాతి వ్యాసం “గర్ల్ పవర్” థర్డ్ వేవ్ స్త్రీవాదం (అంటే ప్రస్తుతం నడుస్తున్నదట) పరిచయం. నాకు రెండో దశ నుండి మూడో దశకి వచ్చేసరికి “గొంతూ మనసూ విప్పమంటూ” వచ్చిన మార్పు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. “అలంకరణ అనేది స్త్రీలను నిర్భందంలో వుంచడానికని 70లలో స్త్రీవాదులంటే, అది మా యిష్టం, మేము అమ్మాయిల్లాగానే ఉంటాం అంటారు 60, 70లలో పుట్టిన అమ్మాయిలు” అన్న సత్యవతి గారి వాక్యం ఈ తేడాని అర్థమయ్యేలా చెప్పిన వాక్యం అనిపిస్తుంది.

తరువాతి వ్యాసం Susan Faludi రాసిన Backlash పుస్తకం గురించి. ఒకపక్క ఫెమిజం హవా నడుస్తూంటే ఒక పక్క దాని గురీంచి అబద్దపు ప్రచారాలు గట్రా జరగడం, దీనికి ప్రసార మాధ్యమాల సహకారం – అదీ “అభివృద్ధి” చెందిన దేశాలని చెప్పుకునే చోట్ల – అని చదువుతూ ఉంటే గొప్ప ఆశ్చర్యం కలిగింది. “అమెరికన్ స్త్రీలలపై అప్రకటిత యుద్ధాల సంగతి అట్లా పెడితే, 1980లలో మన వార్తాపత్రికలన్నీ స్త్రీల పేజీలలో స్త్రీ సమస్యల్నీ, స్త్రీవాద దృక్పథంతో రాసిన వ్యాసాలని కవితల్ని విరివిగా ప్రచురించాయి. అవే పత్రికలిప్పుడు స్త్రీలపేజీల్లో వంటలు, ఫ్యాషన్లు, సౌందర్యపోషణకు తప్ప గంభీర విషయాలకు చోటు పెట్టడంలేదు. … … మరి మన మీద హమేషా జరిగే ఈ అప్రకటిత యుద్ధం మాటేమిటి?” – వ్యాసం చివర్లో సత్యవతి గారి ఈ పరిశీలనకి ఆవిడకి నమస్కారం పెట్టాలనిపించింది! మొత్తానికి ఈ విభాగంలో ఇక్కడిదాకా ఉన్న వ్యాసాలు చదివితే ఫెమినిజం తొలి రోజుల నుండీ ఇప్పటి రోజుల దాకా ప్రధాన గ్రంథాల గురించి అవగాహన కలుగుతుంది.

Emma Goldman ఆత్మకథ Living my Life పుస్తకం గురించిన రాసిన వ్యాసం చదివితే ఎమ్మా జీవితం గురించి తెలుస్తుంది కానీ, ఇంతకీ ఆ వ్యాసం ఎమ్మా గురించా, లేక ఆమె ఆత్మకథ గురించా? అన్నది తేల్చుకోలేకపోయాను నేను :-). Alexandra Kollontai గురించి చదువుతూ ఉంటే, రష్యాలో రాజకీయనాయకురాలిగా ఆవిడ స్త్రీల హక్కుల కోసం చేసిన కృషి గురించి తెలుసుకుంటూ ఉంటే గొప్పగా అనిపించింది. సిద్ధాంతాలు ఒక ఎత్తు, వాటిని ఆచరణలో పెట్టించగలగడం ఒక ఎత్తూ కదా! చివరి వ్యాసం Doris Lessing గురించి ఒక పరిచయం. ఇక్కడితో ఈ విభాగం ముగిసింది. అడుగడుగునా రచయిత్రికి ఆయా ఫెమినిస్టు రచయిత్రుల మీద ఉండే గౌరవాభిమానాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నా కూడా, ఎక్కడా అవి superlatives లోకి వెళ్ళలేదు. ఇది కూడా నాకు ఈ పుస్తకంలో నచ్చిన అంశం. ఇక రెండో భాగం లోకి వెళతాను.

నల్లతేజం

మొదటి విభాగంలో ఆ పరిచయాలకి, చక్కటి రీడబిలిటీ ఉన్న ఆ శైలికీ మురిసిపోయిన నేను ఇక్కడ మొదటి రెండు వ్యాసాలు చదివాక కాస్త నిరాశ పడ్డాను. రోసా పార్క్స్, ఆలిస్ వాకర్ ల గురించిన వ్యాసాలు నాకు అసమగ్రంగా అనిపించాయి. ముఖ్యంగా రోసా పార్క్స్ గురించిన వ్యాసం కొంచెం కంప్యూజ్ చేసింది కూడానూ. పైగా, నేనింకా అప్పటికి ఆవిడ రాసిన వాటి గురించి ఏవన్నా చెప్తారని ఆశిస్తున్నందుకో ఏమో – కొంచెం నిరాశపడ్డాను. ఆలిస్ వాకర్ గురించిన వ్యాసం వల్ల నాకు ఆవిడెవరో, ఏం రాసారో! అన్న కుతూహలం కలిగినా కూడా, వ్యాసం చాలా అసమగ్రంగా అనిపించింది. మొత్తం జీవిత చరిత్ర ఒక్క వ్యాసంలో రాయాలనేం లేదు కానీ, వ్యక్తిగతంగా నాకు సరిగ్గా అనిపించలేదీ వ్యాసం. మాయా ఏంగిలో, టోనీ మారిసన్ ల గురించిన వ్యాసాలు – ఇంచు మించు పై వ్యాసాల నిడివి గలవే అయినా, సమగ్రమైన పరిచయాలు అనిపించాయి. ఆయా రచయిత్రుల జీవిత విశేషాలు, వాళ్ళ రచనల గురించి ప్రాథమిక అవగాహన కల్పించడంలో సఫలమయ్యాయి.

ఇక నేను రచనల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే పుస్తకం మొదలుపెట్టాను కనుకా, అందునా సెరెనా, ఓప్రా ఇద్దరూ జగమెరిగిన ప్రముఖులు కనుకా, నాకు ఈ రెండు వ్యాసాలు మామూలుగా అనిపించాయి. చదివాక ఏ భావమూ కలుగలేదు. అయితే, ఓప్రా గురించిన వ్యాసంలో – “అతి బాల్యం అమ్మమ్మ దగ్గర గడిచింది” అన్న వాక్యం భలే గమ్మత్తుగా అనిపించింది. అతి బాల్యం అంటే మరీ చిన్నప్పుడు అని కాబోలు.

తూర్పు వాకిలి


“అంతర్జాతీయ మహిళాసంవత్సరానంతర స్త్రీల కథలు – ఒక సమీక్ష”
వ్యాసం 1975 తరువాత తెలుగులో వచ్చిన స్త్రీవాద కథల గురించి ఒక విహంగ వీక్షణం. ఈ క్రమంలో స్త్రీత్వం నుంచీ ప్రపంచీకరణ దాకా రకరకాల కథాంశాల గురించి, రచయిత్రుల గురించి చదువుతూ ఉంటే ఎప్పుడూ లేని విధంగా – వీళ్ళ రచనలు ఏవన్నా చదవాలి అని కొంచెం బలంగా అనిపించింది. ఈ పేర్లు అన్నీ తరుచుగా పత్రికల్లో చూసేవే అయినా, ఏమిటో నేను చదవగలనో లేదో అన్న అనుమానం ఒకటీ, మామూలుగానే ఫిక్షన్ అంటే ఈమధ్య కలుగుతున్న జడుపు ఒకటీ – రెండూ కలిసి వీళ్ళ రచనలు చదివే అవకాశాలు కలిగించలేదు నాకు. ఈ కథలూ అవీ నేను చదవలేదు కనుక నిర్థారణగా చెప్పలేను గానీ, వ్యక్తిగతంగా నాకు ఇది చాలా సమగ్రమైన వ్యాసంగా తోచింది.

కమలా దాస్ గురించిన వ్యాసం కూడా పైన నల్లతేజంలో వచ్చిన వ్యాసాల లాగా జీవిత చిత్రణ. నాకు చాలా informativeగా అనిపించింది. “అర్థ శతాబ్దపు సామాజిక చరిత్ర -ఆ నాలుగు నవలలు” కుటుంబరావు గారు రాసిన కొన్ని నవలల గురించిన విశ్లేషణ. ప్రపంచ యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, జాతీయోద్యమం -వంటి చారిత్రాత్మక ఘట్టాల మధ్య మధ్యతరగతి జీవితాలను ఈ నవలలు (చదువు, అరుణోదయం, గడ్డురోజులు, జీవితం, అనుభవం – ఐదున్నాయి మరి!) ఎలా చిత్రించాయో విశ్లేషించారు. అయితే, చదువు, అరుణోదయం, అనుభవం – ఈ మూడింటిని మాత్రమే తీసుకుని వ్యాసం మొదట్లో ప్రస్తావించిన మిగితావి ఎందుకు వదిలేసారు? అన్నది నాకర్థం కాలేదు. వ్యాసం మాత్రం ఆసక్తికరంగా సాగింది. నేను “తూర్పు వాకిలి – అంటే ఇతర ఆసియా, మిడిల్ ఈస్ట్ దేశాల ప్రస్తావన కూడా ఏమన్నా ఉంటుందేమో అని ఆశించాను కానీ, అదేమీ లేకుండా ఈ విభాగం, పుస్తకం ముగిసిపోయాయి! 🙁

ఈ పుస్తకం ప్రస్తావించిన రచయిత్రులలో ఏవో ఒకట్రెండు పేర్లు తప్ప నాకు ఎవ్వరి గురించీ తెలియదు. ఇక రచనలైతే అసలే చదవలేదు. కానీ సత్యవతి గారు ఆ సిద్ధాంత గ్రంథాల మొదలుకుని కథావస్తువుల దాకా సులభంగా అర్థమయ్యే విధంగా రాయడం మూలాన ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను! అలాగే, పుస్తకాల గురించి చెబుతున్నప్పుడు వాటిపై ఇతర విమర్శకుల అభిప్రాయాలు కూడా సమ్మరైజ్ చేసారు చాలా చోట్ల – దీని వల్ల సత్యవతి గారిదే కక ఇత్తర దృక్కోణాలు కూడా పరిచయం అయ్యాయి. ఆట్టే ఫెమినిస్టు సాహిత్యం గురించి పరిచయం లేని వారు, అలాగే వారంటే అభిమానం సంగతి అటుపెడితే (అభిమానులైతే ఆల్రెడీ వీళ్ళందరూ తెలిసే ఉంటారుగా!) ప్రత్యేకంగా ద్వేషం అంటూ లేనివారికీ – ఇది తప్పకుండా చదవాల్సిన పుస్తకమే నా అభిప్రాయంలో!

ఇంతకీ ఇవన్నీ చదివి కూడా సత్యవతి గారు నిప్పులు చెరగకుండా ప్రశాంతంగా చెప్పాల్సినవన్నీ ఎలా చెప్పేయగలుగుతున్నారో అవిడ రచనల్లో అని మాత్రం నాకు ఆశ్చర్యంగానే ఉందింకా! 🙂

******

పుస్తకం వివరాలు:
రాగం భూపాలం – వ్యాస కదంబం
పి.సత్యవతి
ప్రచురణ: నవోదయ పబ్లిషర్స్, ఫిబ్రవరి 2012.
వెల: 50 రూపాయలు
పేజీలు: 104

You Might Also Like

3 Comments

  1. కొత్తపాళీ

    చాలా ఆసక్తికరమైన పుస్తకం, సరైన సమయంలోనే వచ్చింది. సమకాలీన స్త్రీ – ఫెమినిజం అనే విషయమ్మీద ఒక పూర్తి నిడివి టపా రాయాలి. కమ్యూనిజం విషయంలో కొడవటిగంటి లాగా, తన రాజకీయ విశ్వాసాలని సిద్ధాంతాలని తన కథల్లో చొప్పించని రచయిత సత్యవతిగారు. ఆవిడ తన కథల్లో స్త్రీ పాత్రలు తమ ఉనికిని తెలుసుకోవడానికి, చాటుకోవడానికి, సుస్థిరం చేసుకోవడానికి పడే సంఘర్షణలని చాలా సమర్ధవంతంగా చిత్రించారు గాని, ఫెమినిస్టు సిద్ధాంతాన్ని, రాజకీయాల్ని రానీయలేదు. కథాశిల్పం దృష్ట్యా ఇది మంచి విషయం. కానీ కొకు వంటి రచయితలు విరివిగా వ్యాసాలు రాశారు ఆరోజుల్లో అనేక విషయాల మీద. సత్యవతిగారితో పాటుగా ఈనాటి కథారచయితలెవ్వరూ కథల్ని గురించిగానీ సాహిత్యాన్ని గురించిగానీ ఇతర విషయాల్ని గురించి గానీ వ్యాసాలు ఎక్కువగా రాయలేదు, రాయట్లేదు. ఇది లోటు. ఈ పుస్తకం ద్వారా ఈ లోటు కొంతవరకైనా తీరినందుకు సంతోషం.
    స్త్రీ విషయకమైన చర్చ ఏదైనా సీరియస్‌గా చర్చించే పరిస్థితుల్లో ఈనాటి యువతులు – నేను ఫెమినిస్టుని కాదుగానీ .. అని సంభాషణ మొదలు పెట్టడం తరచూ గమనించాను. ఆ యువతులందరికీ నా ప్రశ్న – ఎందుకు మీరు ఫెమినిస్టు కాదు??

    1. సౌమ్య

      తక్కిన వారి సంగతి నాకు తెలియదు కానీ – కోటేశ్వరమ్మ గారి ఆత్మకథను, ఆవిడనీ అర్థం చేసుకోవడానికి, అభిమానించడానికి మనం కమ్యూనిస్టులు ఎలాగైతే కానక్కరలేదో, అలాగే, ఫెమిస్టుల గురించి తెలుసుకోవడానికి కూడా మనం ఫెమినిస్టు కానక్కర్లేదు అని నా అభిప్రాయం. ఇకపోతే, ఫెమిజం అనే గొడుగు కింద అతివాదం నుండీ, మితవాదం దాకా, (బహుశా రెంటి పాళ్ళూ గల మధ్యస్థ వాదంతో సహా) అన్ని రకాల భావజాలాలు ఉన్నట్లు తోస్తోంది నాకు ఆ పదం మొదటి సారి విన్న నాటి నుండీ, వాళ్ళ ప్రస్తావన టీవీ, పేపర్, పుస్తకాల ద్వారా తెలిసినప్పుడల్లా. ప్రతి యువతిలోనూ ఒక ఫెమినిస్టు ఉండొచ్చు కానీ, నేను ఇంకా విషయాలు తెలుసుకునే దశలోనే ఉన్నాను; ఒక భావజాలానికి సబ్స్క్రైబ్ అయ్యే దశలో లేను. అందు వల్ల నేను ఫెమినిస్టును కాను అనే చెబుతాను.

      -ఇంతకీ, ఇదంతా నేను ఎందుకు నన్ను నేను ఫెమినిస్టు అని పిలిపించుకోదలచలేదో చెప్పడానికి మాత్రమే! ఈ విషయమై నేనేమీ యువతులందరి తరపునా వకాల్తా తీసుకోవడం లేదు!

  2. M.V.Ramanarao

    నేను నా ‘ఉదయకిరణాలు ‘అనేవ్యాససంపుటిలో ‘ముద్ర ‘అనే స్త్రీవాద కవితల సంపుటిని గురించి సమీక్షించాను.అది చదవండి.విశాలాంధ్ర బుక్ స్టాల్సులో దొరకవచ్చును.లేకపోతే ఒరిజినల్ ‘ముద్ర ‘పుస్తకం ఐనా చదవండి ((కీ’శే.డా.భార్గవీరావు సంపాదకత్వం ) అందులో 100 స్త్రీల కవితలు ఉన్నవి(తెలుగు కవితలు ) .ఆంధ్రదేశంలో స్త్రీవాదం గురించి తెలుస్తుంది.

Leave a Reply