The Little Prince
వ్యాసం రాసిపంపినవారు – కోడూరి గోపాలకృష్ణ
ఇది చాలా చిన్న పుస్తకం ఐనప్పటికీ, మనసు మీద అది వేసిన ముద్ర జీవితాంతం ఉండిపోతుంది. మా ప్రొఫెసర్, వాళ్ళావిడా 2011 డిసెంబర్లో చెన్నై కర్ణాటక సంగీత ఉత్సవాలకి వచ్చినప్పుడు మా మధ్య ఒక చిన్న సంభాషణ జరిగింది. ఎయిర్‌పోర్ట్లో ఉండగా చుట్టూ ఉన్న జనాన్ని చూస్తూ అక్కడ చాలా మంది సూట్లలో ఉండటం గమనించింది. ఆవిడ స్పెయిన్ కళ్ళకి, నా ఇండియా కళ్ళకి ఆ ఊదారంగు సూట్లకంటే కళకళ్ళాడే మన బట్టలు చాలా అందంగా తోచాయి. ఒకవేళ సూటంటూ వేస్కోవాల్సి వచ్చినా ఎంతోకంత భారతీయత కనబడాలని ఆవిడ అభిప్రాయం (ఒక పోస్టర్లో షారుఖ్ ఖాన్ వేస్కున్న కాలర్ లేని సూటు వైపు చూపిస్తూ ఇది కొంచెం నయం అంది). నేను ఎప్పుడూ రెడీగా పెట్టుకుని అవసరం వచ్చినప్పుడల్లా టేపేసే నా వివరణ ఇవ్వడం మొదలుపెట్టాను, క్లుప్తంగా చెప్పాలంటే మన బానిస బ్రతుకుల్లో రాజకీయంగా కొన్ని మార్పులొచ్చినా సామాజికంగా ఇంకా అలాగే ఉన్నట్టు నా ఉద్దేశ్యం అని. ఇది గుర్తుపెట్టుకుని తర్వాత ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు నాకు ఈ పుస్తకం గురించి చెప్పి,చదవమంటూ బహూకరించింది.
ఈ పుస్తకం ఇదివరకు ఎంతమందికి ఎలా అర్థమయిందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు – ముందు నాకేమనిపించిందీ రాద్దామని. అంతకంటే ముందో పిట్ట కథ చెప్పాలనుంది – ఎక్కడ చదివానో సరిగ్గా గుర్తులేదు – ఫేస్బుక్కో, మెయిలో మరేదో…
ఒక గదిలో ఒక కోతిని ఉంచి, అందులో నిచ్చెన ఎక్కితే అందేలా అరటిపండు వేళాడకట్టి తాళం పెట్టారు. కొన్ని రోజులపాటు ఆకలేసినప్పుడల్లా నిచ్చెనెక్కి, ఆ అరటిపండు తీస్కుని తినేది. ఆ తర్వాత ఇంకో కోతిని తెచ్చి జతచేశారు. ఈసారి, ఆకలేసిన కోతి నిచ్చెనెక్కి అరటిపండు లాగిన వెంటనే కిందున్న కోతికి షాక్ కొట్టేలా ఏర్పాటు చేశారు. కొన్నాళ్ళకి ఒక కోతి నిచ్చెనెక్కుతుంటే ఇంకో కోతి చచ్చినా ఎక్కనిచ్చేది కాదు. ఈ సారి ఇంకో కోతిని జతచేశారు. మూడో కోతి నిచ్చెనెక్కాబోతే ముందునుంచున్న రెండు కోతులు దాని చెవడాలూడదీశేయి. ఇలా కొన్నాళ్ళు జరిగింది. ఈ సారి పాత రెండు కోతుల్లో ఒకదాన్ని బయటకు పంపి ఇంకో కోతిని తెచ్చి పెట్టారు. మళ్ళీ అదే తంతు! ఆశ్చర్యమేంటంటే, మూడోకోతికి అసలు ముందున్న రెండు కోతులు దాన్నెందుకు కొట్టేయో తెలీదు, అయినాసరే కొత్తగా వచ్చిన నాలుగో కోతిని నిచ్చెనెక్కనిచ్చేదికాదు. ఇలా పాత కోతుల్ని ఎన్నిసార్లు మార్చినా తంతు మాత్రం మారలేదు.
కథయిపోయింది. ఇక ఇప్పుడు పుస్తకం గురించి. ఎక్కడో చిన్న గ్రహం మీదనుంచి ఒక బుల్లి రాకుమారుడు మిగతా చిన్న చిన్న గ్రహాలన్నీ చూసుకుంటూ వాటిల్లో ఎదురైన అనుభవాలతో భూమి మీదకొస్తాడు – ఆఫ్రికాలో సహారా ఎడారిలోకి. విమానం కూలి ఆ ఎడారిలోనే చిక్కుకుపోయిన మన గ్రహవాసితో తన అనుభవాలన్నీ పంచుకుంటాడు. పెద్దయ్యేకొద్దీ అక్కర్లేని (లేదా తప్పని?) చాదస్తాలన్నీ నెత్తిన వేస్కుని పరిసరాల్ని ఎటువంటి పక్షపాతం లేకుండా గమనించే అదృష్టాన్ని దూరం చేసుకుంటాం, ఇది (కొద్దోగొప్పో ఆత్మావలోకనం చేసుకునే) అందరికీ బాగా తెలిసిందే. ఒక అబద్దాన్ని కప్పడానికి ఇంకోటాడినట్టు మనం నమ్మే ఒక చాదస్తపు సిద్దాంతం చుట్టూ మిగతా జనానికి “అర్థమయ్యేట్టు” చెప్పడానికి ఇంకొన్ని చాదస్తాలు సృష్టిస్తాం. ఉదాహరణకి ఒక టర్కీ శాస్త్రవేత్త తను కనుక్కున్న ఒక నక్షత్రం/గ్రహం గురించి యూరోపియన్ కాన్ఫరెన్సుకి టర్కీలో సాధారణంగా వేస్కునే సంప్రదాయ దుస్తులు వేస్కుని వెళ్ళి చెప్తే అపనమ్మకంతో ఆమోదించరు, అదే విషయం ఆ తర్వాతి సంవత్సరం సూటేస్కుని వచ్చి చెప్తే వెంటనే నమ్ముతారు (యూరోపియన్లలో అదో రకం చాదస్తం!).
ముందు చెప్పిన కథకి ఈ పుస్తకానికి దగ్గర సంబంధం ఉంది. మనం చేసే చాలా పనులు ప్రశ్నించకుండా, ఆలోచన లేకుండా చేసుకుపోతాము (కొత్తగా వచ్చిన కోతి కూడా కొట్టడం నేర్చినట్టు!). చాలానే విషయాల్లో తెలియకుండానే precondition అయి ఉంటాం. ఈ విషయాన్ని చాలా హృద్యంగా చెప్పే ప్రయత్నమే ఈ పుస్తకం.
పుస్తకం వివరాలు:
The Little Prince
Antoine de Saint-Exupéry
తెలుగు అనువాదం కూడా ఉంది:
చిన్నారి రాకుమారుడు
(ఎక్కడ దొరుకుతుందో వివరాలు తెలియదు)
Leave a Reply