యశోవతి
వ్యాసం రాసిన వారు: కొత్తపాళీ
********
“కాశ్మీర రాజవంశ నవలలు” పేరిట విశ్వనాథ రచించిన ఆరునవలల్లో యశోవతి మొదటిది.
“ఈ నవల రచనాకాలం 1966. మా నాయనగారు ఆశువుగా చెపుతూ ఉండగా ఆయన శిష్యుడైన శ్రీ గరికపాటి సత్యనారాయణ లిపిబద్ధం చేశారు.” అని విశ్వనాథ పావనిశాస్త్రిగారు క్లుప్తమైన ముందుమాటలో చెప్పారు.
కథ అంతా మహాభారత కథకి సమానాంతరంగా జరుగుతూ ఉన్నది. మహాభారత ఘట్టాలు ఈ కథకి నేపథ్య దృశ్యంలా పరుచుకుని ఉన్నాయి. యశోవతి విదేహరాజకుమారి. జనకమహారాజుల వంశంలో, జానకీదేవికి పుట్టినిల్లైన వంశంలో తాను జన్మించాననే గ్రహింపు చాలా చిన్నతనాన్నుండే కలిగి ఉన్న బాలిక. కాశ్మీరాధీశుడైన గోనందమహారాజు చుట్టపుచూపుగా వీరింటికి వస్తూపోతూ, యశోవతి ముద్దుమురిపాలు చూసి ముగ్ధుడై తన ఏకైక పుత్రుడు దామోదరునికిచ్చి పెళ్ళి చేయించి తనింటికి కోడలిగా తెచ్చుకున్నాడు. కాశ్మీర రాజులకు మగధరాజులతో చెలిమి. కృష్ణుడు కంసుని వధించి మధురానగర సింహాసనం మీద తాత ఉగ్రసేనుని పట్టాభిషిక్తుని చేసిన తరువాత మగధరాజు జరాసంధుడు మధురపై దండెత్తిపోతూ మిత్రరాజులందరినీ రమ్మనగా గోనందమహారాజు కూడా ససైన్యంగా ఆ ముట్టడిలో పాల్గొని వీరమరణం చెందాడు. గోనందుడు ఎవరి చేతిలో మరణించినదీ స్పష్టంగా తెలియనప్పటికీ దీనికంతకూ కారణం కృష్ణుడేనని, దామోదరుడు కృష్ణునిపై ద్వేషాన్ని పెంచుకుని, ఎప్పటికప్పుడు ప్రయత్నపూర్వకంగా ఆ ద్వేషాగ్నిని జ్వలింపచేసుకుంటున్నాడు. యశోవతి ముందు యువరాణిగా, తదుపరి మహారాణిగా ఎదిగి, చిన్నప్పుడు ప్రదర్శించిన తెలివితేటలు ఎన్నోరెట్లుగా ప్రభవించగా ఇటు అంతఃపురాన్నీ, అటు రాజుకి సహాయంగా సకల సామ్రాజ్యాన్నీ సమర్ధంగా నిర్వహించుకుంటున్నది. అంతేకాక, పరమవేదాంతులైన జనకవంశజుల వారసురాలిగా యశోవతికి చిన్నవయసునుండే జపతపాదులయందు నిష్ఠ, తద్వారా కొన్ని ఆధ్యాత్మిక విద్యలు అలవడినాయి. అయితే, మునుపులేని విశేషమేమంటే ఈమె ఆధ్యాత్మిక సాధనలో శ్రీకృష్ణుని దర్శనము. ఎవరీ కృష్ణుడు? ఏవిధంగా ఈయన మహాపురుషుడు? కేవలము మహాపురుషుడా? నిజముగా భగవంతుడా? లేక భగవంతుని అవతారమా? ఇలా ఎన్నో ప్రశ్నలు. అటుచూస్తే, భర్త కృష్ణుని పేరు చెబితేనే మండిపడతాడు. ఇటుచూస్తే తన పుట్టినింటి వారు, గోరక్షకులైన చిన్ననాటి స్నేహితులద్వారా తనకు చేరిన కృష్ణభక్తి. కానీ యశోవతి తొణకదు. భర్తతో రాజ్యంతో ముడిపడి ఉన్న లౌకిక వ్యాపారాలను ఎంత నేర్పుతో నిర్వహించుకుంటూ ఉన్నదో, ఆధ్యాత్మికసాధనలో కృష్ణభక్తినీ అలాగే పెంచి పోషించుకుంటూ ఉన్నది.
దామోదరునికి మేనమామ అయిన గాంధారరాజుకు వృద్ధాప్యములో లేకలేక ఒక కూతురు పుట్టినది. ఈ గాంధారరాజుకి తమ్ముడే శకుని. ఆ లెక్కన దామోదరుడు, దుర్యోధనాదులు పినతల్లి పెదతల్లి బిడ్డలు. కానీ ఎందువల్లనో హస్తినకూ కాశ్మీరానికీ అనుబంధము లేదు. అన్ని ఇతర రాజ్యాలను గురించి వార్తలను సేకరిస్తున్నట్లే (ఈ పరరాజ్య వార్తలని సేకరించే నీలకఠుడనే రాజోద్యోగి – ఇతను గూఢచారి కాదు – ప్రత్యక్షంగానే వివిధ రాజ్యాలు తిరిగి వార్తలు సేకరించి తన ప్రభువుకి అందిస్తుంటాడు – ఈ రోజుల్లో foreign correspondent లాగా) హస్తినలో జరుగుతున్న దాయాదుల విభేదాలను గురించికూడా వార్తలు తెలుస్తున్నాయి. అదలా ఉండగా, గాంధారరాజుకి పుట్టిన కూతురు స్వయంప్రభని, వరసకి మేనమరదలు అయినా, దామోదరుడు తన స్వంత కూతురిలాగానే పెంచుకుంటున్నాడు. ఐతే, ఆయనకి తెలియకుండానే స్వయంప్రభ కృష్ణభక్తి తత్పరురాలైంది. ఇంతలో ఆమెకి యుక్తవయసు వచ్చింది. వివాహం చెయ్యాలి. దామోదరుడే పూనికవహించి స్వయంవరం చాటించాడు. కృష్ణునికి కబురు తెలియకుండా ఉండేందుకు ఒక రాజు చెయ్యగలిగిన ప్రయత్నాలన్నీ చేశాడు. అయినా కృష్ణునికి తెలియనే తెలిసింది. ఆయన రానే వచ్చాడు. వెళ్ళిపొమ్మని దామోదరుడు సందేశం పంపాడు. ఈ సందేశం కాదు, తాడో పేడో మనిద్దరమే తేల్చుకోవాలి రమ్మని కృష్ణుడు తిరుగు సందేశం పంపాడు. శస్త్రాస్త్రధారియై దామోదరుడు వచ్చాడు, కృష్ణుని చక్రాయుధంతో తలతెగి చచ్చాడు. స్వయంవరం ఆగిపోయింది. కృష్ణుడు వెళ్ళిపోయాడు.
అక్కడ కాశ్మీరంలో యశోవతీదామోదరులకి నడివయసులో కలిగిన కొడుక్కి గోనందుడని తాతపేరే పెట్టుకుని, యశోవతి తానే సాకుతున్నది. స్వయంప్రభని కూడా తనవద్దకు రప్పించుకున్నది. ఇంతలో మహాభారత యుద్ధం జరిగి కౌరవులు నశించారు. కౌరవులేకాదు, ఇరుపక్కలా అశేష జననష్టం జరిగింది. ఎందరో రాజులు మరణించారు. ఒకవిధంగా భారతయుద్ధానికి పూర్వమే దామోదరుని చంపి కృష్ణుడు ఆ రాజ్యానికి మేలు చేసినట్లే. కాశ్మీర సైన్యం యుద్ధంలో పాల్గొనకపోవడం వలన దేశం సుభిక్షంగానే మిగిలింది. యశోవతి కొడుకుని పెంచి పెద్దవాణ్ణి చేసింది కానీ వాడి బుద్ధిని నియంత్రించలేక పోయింది. బహుశా ఇది రాబోతున్న కలి లక్షణం కావచ్చును. అంతకు మునుపటి తరాలలో ఎన్నడూ లేనట్లుగా గోనందుడు కాముకుడై బహుభార్యలను చేపట్టాడు. వారెవ్వరూ రాచకుమార్తెలు కారు – రాజప్రాపకానికై పాకులాడుతున్న మంత్రుల సేనాపతుల కూతుళ్ళు. వారి మధ్య మత్సరాలు, అంతఃకలహాలు, చిన్న బుద్ధులు అంతఃపురాన్నీ, రాచనగరునీ, రాజ్యాన్నీ పెనవేసుకుంటున్నాయి. యశోవతి రాచనగరులోనే నివాసమున్నా పూర్తిగా సన్యాస జీవితం గడుపుతున్నట్లే. ఇంతలోనే శ్రీకృష్ణుని నిర్యాణము, యాదవ వంశనాశనము, పాండవుల వానప్రస్థము జరిగినాయి. ఆమె కొడుక్కి హితం ఉపదేశించినా అతను వినడు. తన తండ్రి కృష్ణుని పట్ల అకారణద్వేషాన్ని పెంచి పోషించుకొన్నట్లే, ఇతడు పాండవుల పట్ల అటువంటి ద్వేషాన్ని పెంచుకోవడమే కాక, దానికి తోడు కొత్తగా రాజ్య విస్తరణ కాంక్ష, సార్వభౌమాధికారం పై మమకారం పెచరిల్లి, పాండవుల మనుమడైన పరీక్షిత్తును యుద్ధానికి పిలువగా కురుక్షేత్రంలోనే ఇరు సేనలు తారసిల్లినాయి. హస్తిన బలం ముందు కాశ్మీరం నిలువలేకపోయింది. గోనందుడు పరీక్షిత్తుచేతిలో నిహతుడైనాడు. ఈ పరిణామాన్ని ముందే ఊహించిందో యన్నట్లు యశోవతి పెద్దకోడలితో, పసిగుడ్డైన మనుమడితో కాశ్మీరం విడిచి ఒక యోగభూమి (బహూశ నైమిశారణ్యము కావచ్చును)కి వెళ్ళి అక్కడ రహస్యజీవనము చేస్తున్నది.
భాష, శైలి, కథనం
భాష సరళగ్రాంధికానికీ వ్యావహారికానికీ మధ్యస్థంగా ఉన్నదనవచ్చు. నేను చదివిన ప్రతిలో అరసున్నాలు, బండిరలు లేవు. వాక్య నిర్మాణ పద్ధతి కూడా వ్యావహారికం వేపే మొగ్గుచూపుతున్నది కానీ, గ్రాంధికశైలికి ఉండే ఒక బిగువుని పూర్తిగా వదిలి పెట్టలేదు, ముఖ్యంగా క్రియా రూపాల వాడుకలో. అలాగే సంభాషణలలో కూడా. మరీ ఇప్పటి మాట్లాడే తీరునే చదవడానికి అలవాటు పడినవారికి కొంచెం కష్టంగా అనిపించవచ్చేమో కానీ, చదవడానికి కొంత అలవాటైతే, కష్టమనిపించదు. మధ్యమధ్యలో – నిజానికి, అందుకే – ఇటువంటి వ్యావహారికమైన వాడుకలుకూడా తోంగిచూశాయి అక్కడక్కడా.
మధ్యమధ్యలో, ఆయనకి తోచినప్పుడు ప్రబంధాల్లోని వర్ణనలు కొన్ని చేశారు, ఉదాహరణకి కాశ్మీర దేశవర్ణన, అక్కడి పురజనుల వర్ణన, అలాగే, స్వయంప్రభకి వయసొచ్చినప్పుడు ఆమె సోయగపు వర్ణన – అన్నీ ప్రబంధాల్లో జరిగే వర్ణనలని తలపించాయి, ఒక్కొక్కటీ రెండేసి లైన్లు పొడవుండే సుదీర్ఘమైన సంస్కృత సమాసాలతో సహా! ఐతే, అది కూడా కథకి ఒక అలంకారమే.
కథని చాలా మట్టుకు సంభాషణలుగా నడిపించారు. ఈ సంభాషణల్లో వివిధ పాత్రల అభిప్రాయాలుగా చెప్పబడే వాక్యాలు, భావాలు ఆయా పాత్రల ఆలోచనలు, మనోభావాలని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా కొన్నికొన్ని చోట్ల రచయితే తాను చెప్పాలనుకున్న భావాల్ని ఆయా పాత్రల చేత పలికిస్తున్నారా అని సందేహం రాక తప్పదు. ముఖ్యంగా ధర్మాన్ని గురించి, దైవాన్ని గురించి, పరబ్రహ్మ తత్త్వం గురించీ యశోవతి పాత్ర చెప్పే మాటలు బోధల్లాగా ఉన్నాయి. కానీ తెలుసుకో దగిన విషయాలే, ఆలోచించవలసిన విషయాలే. ఇది కాక, కథనశైలిలో భాగంగా ఆయాప్రాంతాల భౌగోళిక చరిత్ర, రాజకీయ చరిత్ర చెబుతూ వచ్చారు. ఈ చరిత్ర కొంత భారత భాగవతాది పురాణాల ఆధారంగా ఉన్నట్లుండగా, కొంత ఆధునిక అవగాహనకు దగ్గరగా ఉన్నట్లుంది – ఉదాహరణకు ఒకానొక కాలంలో హిమాలయాలు సముద్రగర్భంలో ఉండేవనే విషయం. సంభాషణలలో చాలాచోట్ల కుటుంబం పట్ల భార్యా భర్తల బాధ్యతలు, రాజ్యం పట్ల రాఝు బాధ్యతలు, ఇటువంటి సాంఘిక ధార్మిక అంశాలను గురించి జరిపిన చర్చలు ఆసక్తికరంగా ఉన్నాయి. విశ్వనాథ మహాకవి, గొప్ప మేధస్సు ఉన్న రచయిత అనడానికి ఈ చర్చలు చిన్న మచ్చుతునకలు. సరే మనోవికారాలను గురించి ఆయన చేసే మానసిక విశ్లేషణలు మామూలే. నిజం ఒప్పుకోవాలంటే, విశ్వనాథ నవలని చేతబట్టగానే ఈ కథలో ఈయన ఏమి కొత్త మానసిక విశ్లేషణలు చేస్తారా అని ఒక కొత్త ఆసక్తి మొదలవుతున్నది నాకు. ఇవన్నీ ఇలా ఉండగా, ఈ కథలో ఆధ్యాత్మిక విషయాల ప్రస్తావన, కొంత విపులమైన చర్చతోబాటు కొన్ని అలౌకిక సంఘటనలు – అంటే బొత్తిగా చందమామ కథల్లో కనబడేటటువంటి మంత్రాలు మాయలు కాదుగానీ – లౌకికమైన తర్కంతో వివరించలేని సంఘటనలు కొన్ని కూడా ఉన్నాయి. ఇవి కూడా నాకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి.
కాలం ఈ నవలలో ఒక ప్రధాన పాత్ర పోషించినట్టు కూడా అనిపించింది నాకు. నవల మొదటి పేరా అంతా ఈ కథ ద్వాపరయుగం అంతమై కలి ప్రవేశానికి ఎనభైనాలుగేళ్ళ ముందు మొదలైంది అని నొక్కి వక్కాణించేందుకే సరిపోయింది. అది చాలనట్టు మధ్యమధ్యలో ఈ వయసుల సంవత్సరాల లెక్కలు మళ్ళి మళ్ళీ చెబుతూనే వచ్చారు. చివరకి ఒక చోట ఒక చర్చలో – బహుశా యశోవతికి దామోదరునికి జరిగిన అనేక చర్చల్లో ఒకదానిలో యశోవతితో “భగవంతుడు కాలస్వరూపుడు” అనిపించారు. అంతేకాదు, ద్వాపరం అంతరించడంతో ఒక యుగం .. అంటే ఒక లాంటి జీవనం, ఒక పద్ధతి కలిగిన ఆచార వ్యవహారాలు, ఒకలాంటి సమాజపు తీరు అంతమై, ఇంకో పద్ధతి మొదలవుతున్నది అనే సూచన కూడా ఉన్నది.
కొన్ని విశేషాలు, కొన్ని ఆలోచనలు
మనం జీవించి ఉన్న సమయంలో, మనం మసిలే సమాజంలోనే ఒక మహాపురుషుడు, ఒక భగవంతుని అవతారము ఇప్పుడు జీవించి ఉన్నాడు అనుకుంటే ఎలా ఉంటుంది? భారత భాగవత గాధలు కృష్ణుని చుట్టూ బలంగా పెనవేసుకుని ఉన్నవి. ఈ ప్రస్తుత కథలోని పాత్రలు కాని, సంఘటనలు కాని నేరుగా కృష్ణునికి సంబంధించినవి కావు. కథ మొదటినించీ చివరి వరకూ కృష్ణుని ప్రస్తావన నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నా కృష్ణుడు నేరుగా కనిపించేది రెండేరెండు దృశ్యాల్లో. దామోదరుని మరణం తప్ప కృష్ణుని వలన నేరుగా కథలో జరిగిందిగానీ ఈ కథపాత్రలకి ఒరిగింది కానీ ఏమీ లేదు. దామోదరుడైనా సామాన్యుడు కాదు – ఒక గొప్ప రాజవంశానికి వారసుడు, స్వయంగా శస్త్రాస్త్రాలు సాధించినవాడు, మూర్ధాభిషిక్తుడైన రాజు. అటు యశోవతి జనకమహారాజు వంశజాత. మరి ఈ ఇద్దరూ తమ సమకాలీనుడైన, మహాపురుషుడనీ, సాక్షాత్ శ్రీమన్నారాయణుడనీ కొనియాడబడిన శ్రీకృష్ణుని ఎలా చూశారు? కృష్ణునితో తనకు నేరుగా వైరం లేకపోయినా దామోదరుడు కృష్ణుడనే భావం పట్లనే మత్సరం పూనాడు. అదే కృష్ణభావాన్ని యశోవతి ప్రేమించింది. వీరిద్దరినీ మించిన కాంట్రాస్టుగా స్వయంప్రభ కేవలమూ ఆ ప్రభువు సేవకే అన్నట్టు జన్మించి మధురమైన కృష్ణతత్త్వాన్ని నిస్వార్ధంగా ప్రేమించి గానంచేసి పాడుతూపాడుతూనే అంతర్హితమైపోయింది.
ఐతే ఇందులో తమాషా, ఈ చర్చలు జరిగినప్పుడు కానీ, కృష్ణుని ప్రస్తావన వచ్చినప్పుడు కానీ రచయిత తానుగా కృష్ణుడు భగవంతుడా కాదా అన్న ప్రశ్నకి ఎక్కడా నేరుగా తానుగా సమాధానం చెప్పరు. కొన్ని విచిత్రమైన సంఘటనలు అలా జరుగుతాయి. జరిగిన వాటిని బట్టి కొన్ని పాత్రలు కృష్ణుడు భగవంతుడని నమ్ముతాయి. కొన్ని నమ్మవు. అంతే. కథాకథనం దృష్ట్యా ఇటువంటి కథన ప్రక్రియ, ఇటువంటి గడుసుదనం చాలా ఆధునికం. పాతకావ్యాలు, పురాణాలు ఇటువంటి శషభిషలకి తావియ్యవు. అంచేత, ఈ నవల దృష్టిలో వస్తువు పౌరాణిక నేపథ్యం కలదైనా, కథనం ఆధునికంగా ఉన్నది. మిగతా కథ అంతా వాస్తవికంగా ఉండడంతో విచిత్రమైన విషయాలు జరిగి, ఆ జరిగిన పరిస్థితి కొన్ని పరిణామాలకి సూచనప్రాయంగా ఉండడంతో ఆధునిక కథన ప్రక్రియ – మేజిక్ రియలిజం – స్ఫురణకి వచ్చింది నాకు. కానీ ఎంతైనా పౌరాణిక నేపథ్యమున్న కథ కదా, దాని ఆధునికతని ఒకపట్టాన ఒప్పుకోనివ్వదు మనసు. ఇక్కడే ఉన్నది విశ్వనాథ మేధస్సు విశేషం.
అంతేకాక మొదటిభాగంలో జరిగే ముఖ్యమైన సంఘటన దామోదరుని రాచగృహంలో సాగరిక అనే గొల్లస్త్రీ నిర్బంధం – ఈ సంఘటన అంతా ఒక మంచి అపరాధపరిశోధన కథలో ఉండవలసిన సస్పెన్సుతో బిగువుతో నడిపించారు రచయిత. యశోవతియొక్క లౌకికమైన తెలివితేటలను, కర్రవిరక్కుండనే పాముని కొట్టగల నేర్పునూ ఎత్తిచూపుతూనే, అదే నేపథ్యంలో కృష్ణుని మహిమ అనే అద్దాన్ని మధ్యలో పట్టి ఆ ప్రతిబింబంలో యశోవతి మనస్తత్వానికీ, దామోదరుని మనస్తత్వానికీ మధ్య ఉన్న తేడాని కూడా ఎత్తిచూపించారు రచయిత. ఐతే, కథని వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆశువుగా చెప్పుకుపోవడం వల్ల దొర్లిన పొరబాట్లు కొన్ని లేకపోలేదు – మొదట్లో సాగరిక మరిదిని నిర్బంధించిన అధికారి పేరు నీలకంఠుడు అని చెప్పారు. సాగరిక ఇతివృత్తం ఒక కొలిక్కి చేరిన తరవాత అథాట్టున సాగరిక మరిదియే నీలకంఠుడై పోయాడు. ఇక చర్విత చర్వణాలు, పునరావృత్తాలు మామూలే. విశ్వనాథ నవల చదవడం అంటే వీటి ఉనికిని అంగీకరించ వలసిందే.
ఏదేమైనా, విశ్వనాథని ఇంకా లోతుగా చదవాల్సి ఉంది.
కొత్తపాళీ
రవీ, మీ ప్రశ్నలకి ప్రస్తుతానికి నా వద్ద సమాధానం లేదు. ఈ నవలలు కొన్ని చదివినాక ఏమన్నా దొరుకుతుందేమో చూద్దాము.
రవి
విశ్వనాథ రచనలు, ఆ రచనల వెనుక ఆయన ఉద్దేశ్యాలు, వాటికి వివరణలూ కూడా ఎన్నడూ, ఏ విధంగానూ అర్థం కావు నాకు.
ఇదివరకు పురాణవైరి గ్రంథమాలను ’సరైన చరిత్ర’ చెప్పడం కోసం వ్రాశారని అన్నారు. (ఆ పని కోట వెంకటాచలం ఎలానూ చేశారు. మరి దానికి ఈ రకమైన వత్తాసు ఎందుకన్నది మరొక ప్రశ్న) ఇప్పుడు ఈ రచనలు ఫిక్షన్ అని అంగీకరించాలని అంటున్నారు. లోతుగా చదవాలంటున్నారు. ఫిక్షన్ ను లోతుగా చదవడమెందుకు?
ఇక ఆయన అధ్యాత్మిక చర్చలు, తాత్త్విక చింతనలు వీటిలో చాలా వైరుధ్యాలు అడుగడుగునా కనిపిస్తాయి. (బహుశా నాకొక్కడికేనేమో!). ఆధ్యాత్మికత – అధి ఆత్మికత – అంటే ఆత్మ ఔన్నత్య దోహద కారి అని ఒక వ్యుత్పత్తి. ఆధ్యాత్మికతకు, సామాజిక అంశాలకు ముడిపెట్టడం విశ్వనాథ చర్చల్లో కనబడుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్న భార్యభర్తల శృంగారం బ్రహ్మానంద సబ్రహ్మచారి అని ఒక చోట అంటాడాయన. పెళ్ళి సామాజికమైన వ్యవహారం. సమాజం కట్టుబాట్లలో ఉండటం కోసం పెట్టుకున్న తంతు. దీనికి ’అహం బ్రహ్మస్మి’ అన్న నిర్వాణానుభూతికి ఏమి లంకె? ఆ నిర్వాణానుభూతికి భార్యాభర్తల శృంగారంతో ఏమి పని? అందులోనూ భార్యాభర్తలు పెద్దల అనుమతితో పెండ్లి ఆడి ఉండటంలో నిర్వాణానుభూతి పాత్ర యేమిటి? ప్రేమవివాహం చేసుకున్న దంపతులకు ఆ ’ఫెసిలిటీ’ ఎందుకు లేదు?
“చాకలి వానిని బట్టలు ఉతుకుటకు సమాజము నియమించినది. ఆ పని చేయుట అతని కర్తవ్యము. ఆ కర్తవ్యం వల్ల కర్మ పరిపాకం నశించి ముక్తి కలుగుతుంద”ట! చాకలి అన్న కాన్సెప్టు సమాజంలోనే లేని యే అన్యసమాజం వారికో ’ముక్తి’ అన్నదే లేదు కాబోలు! అసలు తాత్త్వికత అని విశ్వనాథ అభిమానులు దేనిని అంటారో స్పష్టంగా తెలియట్లేదు.
పురాణ వైరి గ్రంథమాల/కాశ్మీర రాజుల చరిత్ర లో నాగసేనుడు, దిండు కింద పోకచెక్కఇత్యాది నవలల నిండా బౌద్ధం మీద నిందలు, వ్యంగ్యము, అవహేళనా, వక్రీకరణలూనూ. నాగసేనుడు నవలలో విశ్వనాథ సంధించిన ప్రశ్నలకు సాక్షాత్తూ నాగసేనుడు రచించిన మిళింద పన్హలోనే సమాధానాలు ఉన్నాయి. ఆ పుస్తకం ఆయన చదవలేదు. ఆయన అసలు బౌద్ధాన్నే ఏ మాత్రం చదివి ఉండలేదన్నట్టు తెలుస్తూంది.
బుద్ధుడి బోధలు భిక్షువులకే పరిమితం కాబట్టి, అన్యులందరూ వైదిక మతం అనుసరించాలని బుద్ధుడి ఉద్దేశ్యమని విశ్వనాథ అభిప్రాయం. (ఇంత స్పష్టంగా తీర్పు చెప్పిన తర్వాత బుద్ధుడి బోధలు విని నీరసించి, యుద్ధాలు మానేసిన రాజులెవ్వరు అని ప్రశ్న). ఈ అభిప్రాయానికి స్పష్టమైన సాక్ష్యమూ, ఆధారమూ లేవు.
ఇలా వారి రచనల్లో వైరుధ్యాలను, ఆయన శైలిని అంగీకరించి తీరాలని అభిమానుల తీర్పు. ఎందుకు అంగీకరించాలి?
ఒక రచన అర్థం కాకపోతే – మనకు ఆ రచనను అర్థం చేసుకునే స్థాయి లేదన్నది ఒక సూచన అయితే రెండవ సూచన – ఆ రచన/అందులో అంశాలు అర్థవంతమైనవి కావు అని. విశ్వనాథ విషయంలో యేది నిజం?
ఏతావతా ఈయన రచనలకున్న స్పష్టమైన ఉద్దేశ్యమేమిటో, వాటి వెనుక నిజాయితీ పాలు ఎంతో, ఎంత ప్రయత్నించినా అర్థం కాని వాళ్ళల్లో నేను ఒక మందభాగ్యుడిని.
ఏల్చూరి మురళీధరరావు
శ్రీ రవి గారికి,
మీ లేఖలో చర్చనీయాంశాలు అనేకం ఉన్నాయి. అంగీకర్తవ్యాలు, అనంగీకర్తవ్యాలు ఏకసూత్రంగా కలిసిపోయి ఉన్నాయి. వాటిని అధికరించి సమర్థులైనవారు చర్చింపగలరు.
అన్న ఒక్క విషయాన్ని గురించి:
1971లో విశ్వనాథ ఢిల్లీకి వచ్చినపుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని కలిశారని, వారి సంభాషణలో “మీరు ఇప్పుడేమి వ్రాస్తున్నారు?” అన్న మాటకు సమాధానంగా, “పురాణవైరగ్రంథమాల”లో “నాగసేనుడు” నవల వ్రాస్తున్నానని విశ్వనాథ చెప్పారని; అది మిళింద పన్హాలోని భదంత నాగసేనుని పాత్రేనా? అని శ్రీ సర్వేపల్లి ఆడిగారని; “నేను ఆ పుస్తకంలోని ప్రశ్నలన్నిటిని చదివి, బౌద్ధధర్మాన్ని గురించి నాకేర్పడిన అభిప్రాయాలను అందులో వెల్లడిస్తున్నాను” అని శ్రీ విశ్వనాథ చెప్పారని – శ్రీ విశ్వనాథే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
“నాగసేనుడు” నవలను చదువుతున్నపుడు ఆయనకు బౌద్ధవాఙ్మయంతో గల పరిచయం స్పష్టంగానే తెలుస్తుంది. పాళీ సాహిత్యం, “మిళింద పన్హా”, “మహావంశం”, ఇంకా “దీపవంశం” అప్పటికే గిడుగు రామమూర్తి గారు, మల్లాది రామకృష్ణశాస్త్రి గారు మొదలైనవారి మూలాన ఆంధ్రదేశంలో ప్రచారంలో ఉన్నాయి. విశ్వనాథకు అవి అప్రాప్యగ్రంథాలు, అందని మ్రానిపండ్లు కావు.
ఆయన అభిప్రాయాలతో ఏకీభవింపలేకపోయినా, ఆయన వ్యుత్పత్తిని, బహుగ్రంథాధ్యయనశీలితను సందేహింపలేము.
ఏల్చూరి మురళీధరరావు
కంప్యూటర్లో ఏ సాంకేతికలోపం వల్లనో, ఐదవ పంక్తిలో నా లేఖలోని శ్రీ రవిగారి వాక్యోదాహరణం తొలగిపోయి, “అన్న ఒక్క విషయాన్ని గురించి:” అని పొరపాటుగా ప్రకాశితమైంది. అక్కడ ఇలా ఉండాలి:
“నాగసేనుడు నవలలో విశ్వనాథ సంధించిన ప్రశ్నలకు సాక్షాత్తూ నాగసేనుడు రచించిన మిళింద పన్హలోనే సమాధానాలు ఉన్నాయి. ఆ పుస్తకం ఆయన చదవలేదు. ఆయన అసలు బౌద్ధాన్నే ఏ మాత్రం చదివి ఉండలేదన్నట్టు తెలుస్తూంది.” అన్న ఒక్క విషయాన్ని గురించి:
రవి
ఏల్చూరి వారు, మీతో విభేదించేంత వ్యుత్పత్తి నాకు లేదు. అయితే నేను చెప్పిన వాక్యానికి ఆధారం నాగసేనుడు నవలలో విశ్వనాథ సంధించిన ప్రశ్నలే. ఒక్కట్రెండు చిన్న ఉదాహరణలు. ‘బౌద్ధధర్మం కేవలం భిక్కువులకే, అన్యులు వైదికమతం పాటింపవలెనని బుద్ధుని అభిప్రాయము గావచ్చును.’. ఇదే ప్రశ్నను మిళిందుడు నాగసేనుణ్ణి (‘ధూతాంగ ప్రశ్న ‘) అడిగితే ఆయన స్పష్టంగా సమాధానం చెబుతాడు. అంతవరకూ కూడా అవసరం లేదు. సిరిమ, సుజాత, మల్లిక ఇత్యాది బౌద్ధసాహిత్య పాత్రల ద్వారా సమాధానం సుస్పష్టంగా తెలియవచ్చు.
‘యజ్ఞాలలో పశువధ గురించి భిక్కువులకేల? వాళ్ళు పశుమాంసం తింటున్నారుగా’ – ఇది మరొక ప్రశ్న. దీనికి వినయపిటకం చుల్లవగ్గలో సమాధానం స్పష్టంగానే ఉంది. నిర్వాణాభిలాషి అయిన భిక్కువుకు శాకాహారం, మాంసాహారమని నిర్ణయించుకునే అధికారం లేదు. ఆహారం కేవలం భుక్తి కోసమే. అదృష్టము, అశ్రుతము, అపరిశంకితము అయిన మాంసభక్షణ దూష్యం కాదు. అయితే యాగాలలో చేసే జంతువధ అర్థరహితమని బుద్ధబోధ.
pavan santhosh surampudi
//ఆ పని కోట వెంకటాచలం ఎలానూ చేశారు. మరి దానికి ఈ రకమైన వత్తాసు ఎందుకన్నది మరొక ప్రశ్న//
ఛెంఘిజ్‌ఖాన్ రచించిన తెన్నేటి సూరి అప్పటికే జరిగిన వేరే చారిత్రిక పరిశోధనలను ఆధారం చేసుకుని, “ఛెంఘిజ్ ఖాన్ అనే మహాపురుషుణ్ణి ఆవిష్కరించేందుకు” రాశారు. మరి అప్పటికే చేసివున్న చారిత్రిక పరిశోధన ఉండగా మరో వత్తాసు దేనికి? మీరు చారిత్రిక నవలల రచన అన్న విషయంపై అదేదో కేవలం కొత్త ఆవిష్కరణల కోసమేనన్నట్టుగా పొరబడుతున్నారేమో.
చంద్ర మోహన్
>>> నేను ఈ “చారిత్రక” నవలల పరంపరని ఫిక్షనుగానే చదువుతున్నాను.
విశ్వనాథ వారి నవలలను చరిత్ర అని నమ్మి ఎవరైనా చదువుతున్నారని అంటే నేను నిజ్జంగా బోల్డంత ఆశ్చర్యపోతాను. అలా అనేవారెవరైనా ఉంటే వారికి దూ…రంగా నిలిచి ఓ నమస్కారం!
కొత్తపాళీ
ఏల్చూరివారికి,
మాస్టారు, మీరు సహృదయంతో రాసిన సుదీర్ఘ వ్యాఖ్యని ఇప్పుడే చూశాను.
నేను రాసింది విమర్శ కాదు. పరిచయానికెక్కువా, సమీక్షకి తక్కువానూ. విశ్వనాథవారి నవలల సెట్టు చేతిలో ఉందికాబట్టి, వరసబెట్టి అన్నీ చదువుదామని, చదినదానిని నాకర్ధమైన మేరకు సమీక్షించుకుందామని ఈ చిన్న ప్రయత్నం.
మీరు సాహిత్య, పౌరాణిక, చారిత్రక దృష్టితో లేవనెత్తిన ప్రశ్నలు సముచితములే. నేను పరిశోధకుణ్ణి గాను గనక వాటిపై నేనేమి చెప్పలేను.
నేను ఈ “చారిత్రక” నవలల పరంపరని ఫిక్షనుగానే చదువుతున్నాను. కచ్చితంగా ఇవి విశ్వనాథ ఊహాశక్తికి, మేధస్సుకి మంచి ఉదాహరణలు.
సౌమ్య
>>నేను ఈ “చారిత్రక” నవలల పరంపరని ఫిక్షనుగానే చదువుతున్నాను.
-అలా అన్నందుకే ఒకసారి నాకు బాగా తలంటారు చాలా మంది. మీరు కొంచెం పెద్ద వారు కనుక మిమ్మల్నేమీ అనకపోవచ్చు లెండి 😉 😉
ఏల్చూరి మురళీధరరావు
శ్రీ నారాయణస్వామి గారి విమర్శ చాలా ఆలోచనలకు ప్రేరేపకంగా ఉన్నది. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఈ కథంతా చారిత్రికదృష్టితో కాని, కాశ్మీర వంశచరిత్రల నేపథ్యంతో కాని సాగినట్లు కనబడదు. కేవలం విశ్వనాథ వారి స్వోపజ్ఞకమైన కల్పనగా మాత్రమే భావించాలని అనిపిస్తున్నది.
“శ్రీకృష్ణుడు కంసుని వధించి మధురా నగర సింహాసనం మీద తాత ఉగ్రసేనుని పట్టాభిషేకం చేసిన తర్వాత మగధరాజు జరాసంధుడు మధురపైకి దండెత్తి పోతూ మిత్రరాజులందరినీ రమ్మనగా గోనందుడు కూడా ససైన్యంగా ఆ యుద్ధంలో పాల్గొని వీరమరణం చెందాడు.” అని వ్రాశారు.
మహాభారతంలో గోనందుని కథ లేదు. ఒకానొక కాశ్మీరకుని ప్రస్తావన మాత్రం రెండు మూడు సార్లు వచ్చింది. అది ఈ కథకు ఉపస్కారకం కాదు.
గోనందుని కథకు మూలమైన “నీలమత పురాణం” ఈ విధంగా అంటున్నది: రుక్మిణీ స్వయంవరానికి వచ్చిన రాజులలో కాశ్మీర దేశపు రాజు కూడా ఉన్నాడు. రుక్మితోపాటు శ్రీకృష్ణుని ఎదిరించి ఆ యుద్ధంలో శ్రీకృష్ణుని చేతిలో హతమారాడు. శ్రీకృష్ణుడు ఆ సమయంలో గర్భవతిగా ఉన్న అతని భార్యకు పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని ఆమెకు అప్పగించాడు. కొంతకాలానికి ఆమెకు గోనందుడు పుట్టాడు – అని. ఆ గోనందుడు శ్రీకృష్ణ భక్తుడని నీలమత పురాణం అంటున్నది. (విశ్వనాథ వారి గోనందుడు కొడుకుకు “దామోదరుడు” అని పేరు పెట్టాడు కదా). అతని కొడుకు “దామోదరుడు” అని; దామోదరుని కొడుకు రెండవ గోనందుడని ఈ వృత్తాంతమేదీ నీలమత పురాణంలో లేదు.
భారత భాగవతాలలోని కథను చూద్దాము: శ్రీకృష్ణుని మేనమామ కంసుడు. కంసునికి పిల్లనిచ్చిన మామ జరాసంధుడు. ఆ లెక్కన జరాసంధుడు శ్రీకృష్ణునికి రెండు తరాల మునుపటివాడు. భీముడు గిరివ్రజంలో జరాసంధుని వధించే నాటికి అనిరుద్ధుడు పెద్దవాడయ్యాడు. అంటే, అనిరుద్ధుడు మొదటి గోనందునికి వయసులో కొంత చిన్న. అర్జునుని కొడుకు అభిమన్యుడు ఈ గోనందునికి చాలా చిన్నవాడు కావాలి. గోనందుని కొడుకు దామోదరుడు పరీక్షిత్తుకంటె పెద్ద అనుకొంటే, అతని కొడుకు రెండవ గోనందుడు పరీక్షిత్తు చేతిలో నిహతుడయ్యాడని విశ్వనాథ వారి కథనం.
జరాసంధుని కొడుకు సహదేవుడు భారతయుద్ధంలో పాండవుల పక్షాన పోరాడి, పదమూడవ రోజున ద్రోణుని చేతిలో మరణించాడు. అతని కొడుకు మార్జారి (లేదా, సోమధి అని కొన్ని ప్రతులు) పరీక్షిత్తుకంటె వయసులో కొంచెం పెద్ద అని భారతం అంటున్నది.
కల్హణుని రాజతరంగిణిలోని కథతో పోల్చినా ఈ వృత్తాంతం సరిపడదు. కల్హణుని ప్రకారం అభిమన్యుని కాలానికి ఉన్నది మూడవ గోనందుడు. పరీక్షిత్తు కాలానికి ఉన్న గోనందీయుడు కాశ్మీర దేశపు రాజు కాడు. గోనందుని కొడుకు దామోదరుని శ్రీకృష్ణుడు సంహరించి, అతని భార్యకు పట్టాభిషేకం చేశాడని రాజతరంగిణి కథనం (“అన్తర్వత్నీం తస్య పత్నీం వాసుదేవో౽భ్యసేచయత్ భవిష్యత్పుత్త్రరాజ్యార్థం తస్య దేశస్య గౌరవాత్.”). ఇదే శ్లోకం వేఱొక భావంతో నీలమత పురాణం (1-9)లో ఉన్నది.
ద్వాపరయుగం ముగిసి, కలి ప్రవేశానికి ఎనభై నాలుగేళ్ళ మునుపు – అంటే, అప్పుడు శ్రీకృష్ణునికి నలభై ఒక్క సంవత్సరాలు. అప్పటికి పరీక్షిత్తు మాట దేవుడెఱుగు, శ్రీకృష్ణునితో అయినా – మొదటి గోనందునికే యుద్ధం సాధ్యం కాదు. రెండవ గోనందుని ప్రసక్తే లేదు.
ఈ కథలో చారిత్రిక సంవాదం కోసం చూడకూడదన్నది మొదటి సంగతి. కేవల కల్పనాకథ అయితే, కాశ్మీర రాజ వంశచరిత్రతో ముడివేయటం ఎలా? అన్నది వేఱొక సంగతి.
ఇంకా ఆలోచించాలేమో!