‘ఆకాశం’ – నా అభిప్రాయం

వ్రాసిన వారు: చాణక్య
******

‘Genuine poetry can communicate before it is understood.’ — T.S. Eliot

శ్రీ బివివి ప్రసాద్‌గారి కవితా సంకలనం ‘ఆకాశం’ చదువుతున్నప్పుడు అక్షరాలా నిజమనిపించింది ఈ మాట! ఏ కళైనా ఉన్నతంగా రాణించాలంటే ఉండవలసిన లక్షణం.. కళాకారుడి ప్రజ్ఞ ప్రేక్షకుడి అవగాహనకు మించి ఉండడం! తన భావాల్ని కమ్యూనికేట్ చేయడానికి పూర్తిగా పాఠకుడి ఊహ మీదా, మేధస్సు మీదా ఆధారపడక తప్పని రచయితకు ఇది చాలా అవసరం. చదివేవాడి మనసు మీద ఒక అస్పష్ట చిత్రాన్ని గీసి, పూర్తి చేసే బాధ్యత వాడికే వదిలేయడం నిజమైన కవి చేసే పని. కవి అయినా, కళాకారుడైనా తన టార్గెట్ ఆడియన్స్ ని నిరంతరం అబ్బురపరుస్తూనే ఉండాలి. పాఠకుడి స్థాయి పెరిగేకొద్దీ తాను ఒక మెట్టు పైనే ఉన్నానని నిరూపించుకుంటూ ఉండాలి. అది జరగని రోజున పఠితల మనోఫలకం నుంచి చెదరిపోవడానికి ఎంతోకాలం పట్టదు. This is a rule of thumb for success in any existing business on the planet.

నేను కవిత్వాన్ని ఆస్వాదించగలననీ, కేవలం చదవడానికే చదివి అనుభూతిని అరువు తెచ్చుకునే రకం కాదనీ నాకు చాలాసార్లు నిరూపణ అయింది. అయినా కృష్ణశాస్త్రి, కరుణశ్రీ, చలం, శ్రీశ్రీ, తిలక్‌లతో ఆగిపోవడానికి ప్రధాన కారణం పైన చెప్పినదే. నేను చదివిన ఒకటీఅరా ఆధునిక కవితలు నా పాండిత్యాన్ని పరీక్షించకపోగా, సదరు ‘కవుల’ మానసిక పరిణతి మీద ప్రశ్నలు రేకెత్తించాయి. This so-called ‘Modern Poetry’ is not so ‘modern’ in thoughts and definitely not my cup of coffee అనుకుని వదిలేశాను. అయితే ఒకటీఅరా సర్వం కాదనీ, కవిత్వపు గుబాళింపులు ‘గతజన్మలోని జాజిపూల సువాసన’ కాదని ‘ఆకాశం’ గుర్తుచేసింది. ఆధునిక కవిత్వ ధోరణి పట్ల నా అభిప్రాయం మార్చుకోవాలేమో అని ఆలోచింపజేసింది.

‘ఆకాశం’లో నాకు నచ్చినది జీవితాన్ని నిర్వచించుకోవాలనే తపన! భౌతికం కాని ఏ వస్తువుకైనా నిర్వచనం మనిషి మనిషికీ మారిపోతూ ఉంటుంది. ధర్మం, విలువలు, సంస్కారం, జీవితం! ఇలాంటి వాటికి మనిషి తన ఆలోచనతో నడిచే మెదడు కన్నా, అనుభవాలతో నడిపించే మనసు మీదే ఎక్కువ ఆధారపడతాడు. శాస్త్రీయంగా ఈ రెండూ వేరు కాదు.. కానీ మనిషికి rational గా ఆలోచించే మెదడుతో పాటు, తన కోసం తను నిరంతరం నిర్మించుకునే మనసనే అస్థిత్వం లేని మార్గదర్శి కూడా ఉంటుందని నా నమ్మకం. నమ్మకాలన్నీ అంతే! అస్థిత్వం ఉండదు కానీ అనుక్షణం కనిపిస్తూనే ఉంటాయి. దేవుడు, గెలుపు, ప్రేమ, ఆకాశం!! నమ్మకానికే అస్థిత్వం లేదు!

పెద్దల సంరంభాలను మౌనంగా చూస్తూ ఎదురుచూసే పసితనం నుంచి, కలతలన్నీ కొలనులో మట్టిపెళ్లలు కలిసినట్టు జీవితంలో కలిసిపోక తప్పదని గుర్తించే పరిణతి దాకా కవి జీవితాన్ని గుర్తుంచుకున్నారు. కవి జీవితాన్ని గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, ప్రతి జ్ఞాపకాన్ని పదిలపరచుకుంటున్నారు. లేకపోతే స్వేచ్ఛను శ్వాసించే వయసు నుంచి స్వేచ్ఛను ఆశించే వయసుకు జీవితం మెల్లగా జారిపోవడాన్ని ఎలా గుర్తించగలరు? జీవితం పట్ల సునిశితమైన శ్రద్ధ ఉంటే తప్ప నిశ్శబ్దంగా జరుగుతూపోయే మార్పులను గుర్తించలేరు. ‘ముక్తికాంక్ష’ను అర్థం చేసుకోలేరు.

ఇద్దరు మనుషుల మధ్య ‘హృదయం ప్రవేశించినపుడు’ ఏర్పడే పలుచని ఆర్ద్రత పొర మామూలు కంటికి కనబడదు. అంతర్లీనమైన ప్రేమను గుర్తించాలంటే హృదయం స్పందించగలిగితే సరిపోదు.. అనుభవించగలగాలి. ‘ఒకరి జ్ఞానాన్ని ఇంకొకరికి ఇవ్వడం కొంతవరకు సాధ్యం. కాని, ఒకరి అనుభవాన్ని ఇంకొకరికి తెలియచెయ్యడం అసాధ్యం, అటువంటి అనుభవం కొద్దోగొప్పో నేర్చుకునే వారికుంటే తప్ప’ అంటారు చలం. ‘హృదయం ప్రవేశించినపుడు’, ‘అంతరాత్మవంటి వాడు’, ‘వెళ్లిపోయాక’ లాంటి కవితలన్నీ ఇదే సూత్రం మీద మంచి కవితలుగా నిలబడతాయి. చదివేవాడికి ఇవన్నీ అనుభవాలు! ”అంతరాత్మవంటి వాడు’ మనం పోగొట్టుకొన్న జీవితంలా ఉంటాడు’ అంటే ఆ పోగొట్టుకున్న జీవితం పఠితకు అనుభవం కాని నాడు అది సాధారణ కవిత్వం! ‘మనిషి ఉండగా ప్రేమించలేం, ‘వెళ్లిపోయాక ఎందుకో ప్రేమించకుండా ఉండలేం’ అనగానే ఎంతమందికి ములుకులా గుచ్చుకుని ఉంటుందో! అది కవి భావప్రకటనతో పాటు పాఠకుడి అనుభవం కూడా తోడవడం వల్ల కలిగే కల్లోలం.

ప్రపంచంలో నూటికి తొంభై మందికి బ్రతకడమే వచ్చు. నిజంగా జీవితాన్ని ‘జీవించడం’ రాదు. ‘కనీసం ఈ గంట బ్రతుకు, కనీసం ఈ రోజు బ్రతుకు మళ్లీరాని లోకంలో..’ అనేంత ప్రేమ జీవితం మీద పెంచుకోగలిగిన జీవి ధన్యుడు! ‘సమర్ధుల్ని ఈతల్లో కొట్టుకుపోనిచ్చి జీవితంగట్టున ప్రశాంతంగా నిలబడిచూపించ’మనడానికి నిజమైన గెలుపుకి అర్థం తెలిసి ఉండాలి. జీవితం అంటే పరిగెత్తడం కాదు అడుగడుగు గుర్తుండిపోయే అనుభవంగా మార్చుకుంటూ నడవడం అని తెలిసిన వివేకి అయి ఉండాలి. మనిషిలో ఈ స్పృహ మేలుకొన్నప్పుడు హృదయంలో నిజమైన ప్రశాంతత పుడుతుంది. ఈ ప్రశాంతత మోసుకొచ్చే తృప్తి ‘క్షణం జీవితం చాలనిపిస్తుంది. కల్పాలు బ్రతికినా చాలదనిపిస్తుంది.’

‘కొన్ని సమయాలు’ నాకు బాగా నచ్చిన కవిత! ఇటాలియన్‌లో ‘Dolce Far Niente’ అనే ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది. Pleasant Idleness.. ‘The Sweetness of doing Nothing’. ఎలిజబెత్ గిల్బర్ట్ రాసిన ‘ఈట్, ప్రే, లవ్’ అనే నవలలో కథానాయిక నిజమైన సంతోషం కోసం సాగించే వెతుకులాటలో భాగంగా దీని గురించి తెలుసుకుంటుంది. సైకాలజిస్ట్‌లు కూడా ఈ ‘Art of doing nothing’ ను ఒక lost art గా పరిగణిస్తున్నారు. రేట్ రేస్‌లో పరిగెడుతున్న మానవజాతి ఈ ఆర్ట్‌ని ఎప్పుడో మర్చిపోయింది. కొన్నాళ్లకు శృంగారం అనే కళ కూడా ఇలాగే మారిపోతుందేమోనని అనిపిస్తుంది.

చివరిగా ‘రాసినవే రాస్తున్నానా’ అనే సందేహం నాకూ వచ్చినా ‘బ్రతికిన జీవితమే మళ్లీ బ్రతకటం లేదా’ అని సమాధానం ఇచ్చేశారు. నిజమే! రామాయణ కల్పవృక్షం రాస్తూ ‘నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ/ తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచి బ్రదుకులు తనివి గాన/ చేసిన సంసారమే చేయు చున్నది, తనదైన అనుభూతి తనది గాన/ తలచిన రామునే తలచెద నేనును’ అన్నారు విశ్వనాథవారు. అటువంటప్పుడు మర్చిపోయిన జీవితాన్ని ఎన్నిసార్లు గుర్తుచేస్తే తప్పేముంది? 🙂

చలం చెప్పినట్టు అనుభవాన్ని కవి తన హృదయం నుంచి పాఠకుడి హృదయానికి చేర్చగలిగారు. ‘ఆకాశం’ ద్వారా కవి తన కవిత్వాన్ని పాఠకుల చేత మెప్పించడంలో కృతకృత్యులయ్యారని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావాలి? చలం చెప్పినట్టు ‘గొప్ప కవిత్వంలో ప్రధాన లక్షణం, ఎవరి తాహతునుబట్టి వారికి ఏదో కొంత అనుభూతిని అందించగలగడం’. ‘ఆకాశం’ నా స్థాయికి తగ్గ అనుభూతిని నాకు అందించింది. ‘ఆకాశం’ చదివి, ఆస్వాదించదగిన కవిత్వం!

***
కవి బ్లాగు ఇక్కడ.

You Might Also Like

8 Comments

  1. చాణక్య

    శశికళగారు థ్యాంక్స్!

    ప్రసాద్‌గారు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు! మీకు హృదయపూర్వక అభినందనలు! 🙂

  2. BVV Prasad

    చాణక్య గారూ, మీ వ్యాసం చాలా నచ్చింది. మీరు తలపెట్టిన ఇలియట్, చలం ల మాటలు ఆకాశంని సరిగా పట్టుకోనేవి. ఇంకా లోతుగా ఆకాశం చాలా చెబుతుంది. అయితే ఆ లోతు శబ్ద ప్రపంచానికి చెందింది కాదు. అగాధమైన మౌనానికి చెందింది. ఆకాశం కవిత్వం లో అధిక భాగం, హైకూల లాగానే, ధ్యానానికి నడిపిస్తుంది. అయితే, మీరన్నట్టు, పాఠకుల సంసిద్ధత చాలా అవసరం. లేదూ, ఆ కవిత్వాన్ని అది ఇచ్చే క్షణికానుభవం తో వదిలిపెట్టక, జీవితంలో అనుసరిస్తే ఆకాశం సూచించే అగాధ జీవన భూమికలు మేలుకొంటాయి. మీవంటి మిత్రుల స్పందనలు చదివినపుడల్లా, ఆకాశం మరొక సరైన గమ్యాన్ని చేరిందని సంతోషం కలుగుతుంది. ధన్యవాదాలు. ప్రేమతో.. బివివి ప్రసాద్

  3. sasikala.v

    చాణుక్య …..అనుభూతే వచన కవిత పరమార్ధం.
    అందులోని ఏ ఒక్క వాక్యం తలపుల్లో నిలిచిపోయినా
    మనసుని సొగసుగా కదిలించినా ….హృదయాన్ని మెలిపెట్టి
    లోతుల్లోకి ముంచినా దాని పరమార్ధం నెరవేరినట్లే.
    నీ అక్షరాల అద్దం లో ఆ ఆకాశం ప్రతిబింబం చక్కగా
    ప్రతిఫలించింది

  4. the tree

    మంచి పరిచయం

  5. చాణక్య

    అందరికీ ధన్యవాదాలు! 🙂

  6. అఫ్సర్

    చాలా మంచి పరిచయం చాణక్య గారూ, ఇలాంటి కవిత్వం చదివినప్పుడు కవిత్వానికిది మంచి కాలమే అని నమ్మకం కుదురుతుంది. అలాగే, ఇలాంటి పరిచయ వాక్యాలు చదివినప్పుడు కవిత్వాని ఇష్టంగా చదివే పఠితలూ వున్నారన్న నమ్మకం కూడా ఇప్పుడు కుదురుతోంది.

  7. Sateesh

    చాణక్య గారూ.. ఈ పుస్తకం చదివి సాంత్వన పొందిన వారిలో నేనూ ఒకడ్ని.
    నా అనుభూతి మీరూ పంచుకోండి.
    http://blaagu.com/sateesh/?page_id=710

  8. తృష్ణ

    చాలా బావుందండి పరిచయం.

Leave a Reply