తులసిదళాలు

వ్రాసిన వారు: తమ్మినేని యదుకులభూషణ్

(రామినేని తులసి గారికి ఇస్మాయిల్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆవిడ కవిత్వం గురించి ఒక పరిచయం)

మనలోలేని ఆధునికత మన కవిత్వాల్లోకి, జీవితాల్లోకి ప్రవేశించదు. తులసి కవిత్వం సాంతం చదవగానే నాకు కలిగిన అభిప్రాయం తనది ఎంతో ఆధునికమైన కవిత్వం. తెలుగులో ఆధునికతకు మారుపేరు గురజాడ. పాతవాసనలు లేని కొత్తదనం కవిత్వాన్ని సజీవంగా మారుస్తుంది. మనకాలాన్ని మనం ప్రతిబింబించలేకపోతే ఆ మేరకు మనం ఆధునికులం కాదు. అంతేగాదు,ఆలోచనలను, అనుభవాలను నిజాయితీగా, నిర్భయంగా వెల్లడించడం సదరు ఆధునికతలో భాగమే.మన జీవితం పరిమితమన్న విషయాన్ని వచ్చి పోయే ఋతువులు పలుమార్లు బహు సున్నితంగా సూచిస్తాయి. ఈ కాలశిల్పం అవగతం కాకపోతే కవి కేవలం లోతులేని వర్ణనకు పరిమితమవుతాడు, అంటే వచనంలో దిగబడతాడు. భావనా పరిధిని విస్తరించలేక గానుగెద్దులా తిరిగి తిరిగి చివరికి ఉన్నచోట చతికిల పడిపోతాడు.ఇక “అల్పాక్షరముల అనంతార్థ రచన” అటకెక్క వలసినదే.

నిరంతరం మనల్ని అంటి పెట్టుకుని ఉండే ఎండ ఎందరి కవిత్వాల్లో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది??

“గుమ్మం ముందు ఎండ పొడలో అదోలా
ఆదివారం మధ్యాహ్నాలు”

“సంధ్యతాలూకు ఎండ నీడ
గుమ్మంలోకి ఒరిగింది ఏటవాలుగా ”

ఎంత మందికి కవిత్వానికి జీవగర్ర అనదగ్గ ఏకాంతం అనాయాసంగా లభ్యమవుతుంది ??

“ఒక్కోసారి
కళ్ళ ముందు కాస్తున్న ఎండను
గాలి మూసుకొచ్చే పరిమళాలను
ఇదివరకెప్పుడో
అనుభవించినట్టుగా అనిపిస్తుంది.
వెంటనే
మనసు ఒంటరిదవుతుంది ”

నిశ్శబ్దం ఏమి చేయగలదో కవికి తెలియకపోతే మరెవరికి తెలుస్తుంది ??

“ఒక్క మబ్బు పట్టిన క్షణం చాలు
గతంలోనూ, వర్తమానంలోనూ
నిశ్శబ్దాన్ని నింపడానికి
అయినా
నిర్లిప్తత దూసుకెళ్ళినంత లోతుకు
సందడి తోసుకెళ్ళ లేదేందుకో ”

కిటికీ కూడా కవిత్వంలాంటిదే !!

“మంచు పడినా, మనసు బాగోకపోయినా
వాన కురిసినా, వడగాల్పువీచినా
అన్నిటికీ అదే కిటికీ
ఎన్నో నిర్వచనాలకు నిదర్శనంగా….!!”

సున్నితంగా కనిపించేదానికే బలమెక్కువ అన్నది చైనీయుల కవితాతత్వం,
అందుకే అనేక కళాకృతులు వేల సంవత్సరాలు మనగలుతాయి,వాటికి ధీటుగా –

“వెన్నెలా, వేకువా కలిసినట్టుందేమో
వాగు వయ్యారానికి
పొగమంచు
సాంబ్రాణి అద్దుతుంది.”

కొన్ని చోట్ల ఉమర్ ఖయ్యాం ను గుర్తుకు తెస్తుంది.

“చిన్న ఆకాశం ముక్క
ఓ పచ్చని పత్రం, ఒక పిట్ట
కాస్త మట్టి, ఓ వానచినుకు
ఇదేగా ప్రకృతి అనుకున్నాను.”

మన కవులు ఎప్పుడూ చీకటి కూపాల్లో పడి దొర్లుతూ ఉంటారు, కనుకనే, హాయిని గొలిపే ఒక వాక్యం కనిపించదు. తులసి సకల ఋతువుల వర్ణ వైభవాన్ని కవిత్వంలో అలవోకగా ప్రవేశ పెట్టగల భాగ్యశాలి.

“ఎక్కడ నుండి మొదలయానో
అక్కడికే వచ్చి ఆగినట్టుంది
ఉన్నట్టుండి ప్రతి మలుపు
వసంతానికే దారి చూపినట్టుగా”

“ఎదురుగా వున్న ఎండుగడ్డిలో కూడా
ఎదో తెలీని అందం
వాన చుక్కలన్నీ వరస గట్టి
జారుతుంటేను !”

‘కనికట్టునేదో కనిపెట్టినట్టుగా, ఇంద్రధనస్సులో ఎనిమిదో రంగైనట్టుగా’ ఉండే కవిత్వమంటే ‘రాత్రివాక్యాలకు కొనసాగింపు’ అని తులసికి తెలుసు.అంతేకాదు, వెన్నెల వీథుల్లో ఒక ‘పరిపూర్ణమైన ఏకాంతం’ అవసరమయే దాని సృజన వేళ:

“ఇంత నిస్సంకోచపు నిశ్శబ్దపు రాత్రి
మళ్ళీ మళ్ళీ వెంట రాదని తెలుసు!
ఇన్ని చీకటి దారాలు
ఒక అర్థవంతపు సాంగత్యంలా
మళ్ళీ మళ్ళీ పెనవేసుకోవనీ తెలుసు.”

అయినా కూడా,

“మధ్యాహ్నపు ఎండ,సాయంత్రపు గాలి,
రాత్రి చుక్కలు ఎప్పుడూ ఏదో ఒకటి
గుర్తుకు తెస్తూనే వుంటాయి
మనసు మెచ్చే క్షణాలెన్నెదురైనా,
అడుగు ఆగిపోయిన గతాలే ఎక్కువ!”

‘జారిపోయిన ఆలోచనలో ఒక నక్షత్రం’ లాంటి కవితలను నేను ఎన్ని ఉటంకించినా ,
‘శబ్దాల్లో సరఫరా కాని ఒంటరి సంభాషణలు’ అనేకం ఉండిపోతాయి.

మరి తులసి కవిత్వం చదవడం ఎటువంటి అనుభవం ??

“తెలిమంచు తెరల్లో సాగే తెరచాప పడవలో
నాతో ఓ సారి పయనించి చూడు!

నది లేత పరవళ్ళలో
కాలమాగిన ఒక జీవితకాల క్షణముంటుంది.
అదే నీదీ నాదీ !”

–తమ్మినేని యదుకుల భూషణ్

You Might Also Like

3 Comments

  1. గరికపాటి పవన్ కుమార్

    “జ్ఞాపకాలు…

    వాటికేం !? వచ్చిపోతుంటాయి

    గాలి వీచినప్పుడో, గులాబీలు పూసినప్పుడో

    కానీ కంటినిండా నీళ్ళే వెతుక్కుంటాయి

    తుడిచే వేళ్ళ కోసం”

    గుండె చప్పుళ్ళనే కవిత ఎక్కడో నెట్లో చదవగానే చమక్కుమనిపించి ఎవరో బాగా రాసారనుకుని పేరు చూసాను, 2010 ప్రాంతంలో, రామినేని తులసి.

    చమక్కుమనిపించే తత్వం, గుర్తుండి పోయే గుణం ఉన్న ఈ కవితలకు ఇస్మాయిల్ అవార్డ్ రావడం చాలా ఆనందకరమైన విషయం. తులసి గారికి అభినందనలు.

    ఇలా చక్కని పంక్తుల కోసం పాఠక లోకం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది.

  2. Vaidehi Sasidhar

    చక్కటి ప్రతిభ, భావుకత ,అర్హత కల కవయిత్రి తులసి మోహన్ గారికి ఇస్మాయిల్ అవార్డ్ రావటం చాలా సంతోషం.
    నా హృదయపూర్వక అభినందనలు .
    మరెన్నో మంచి కవితల తో నిరాటంకంగా ఆమె సాహితీ ప్రస్థానం సాగాలని కోరుకుంటూ

    వైదేహి శశిధర్

  3. Subrahmanyam Mula

    ఇస్మాయిల్ అవార్డు తులసి గారికి ఇవ్వడం ఎంతో సముచితం. జీవితాన్నీ, ప్రకృతినీ ఎంతగానో ప్రేమించిన వాళ్ళే అలాంటి కవిత్వాన్ని రాయిగలుగుతారు. ఋతువుల రంగులు అద్భుతంగా ఆవిష్కృతమౌతాయి ఆమె కవిత్వంలో. తెలుగుపీపుల్.కాం రోజులనుంచీ ఆమె ప్రస్థానాన్ని ఆశ్చర్యంగా గమనిస్తున్న వారిలో నేనూ ఒకణ్ణి. మరింత అందమైన, అరుదైన కవిత్వం ఆమెనుండి రావాలని ఆశిస్తూ..

Leave a Reply