అధ్యాపకుడి ఆత్మకథ

జనవరిలో విజయవాడ పుస్తక ప్రదర్శనలో తిరుగుతుండగా అధ్యాపకుడి ఆత్మకథ పుస్తకం కనిపించింది. రచయిత డాక్టర్ కండ్లకుంట అళహ (కె.ఎ.) సింగరాచార్యులు పేరు నేను ఇంతకు ముందు విన్న గుర్తు లేదు. విద్యారంగంలోనో, ఉపాధ్యాయోద్యమంలోనో ప్రముఖుడై ఉండి ఉంటారనుకొంటూ, కొద్దిగా కుతూహలంతో వెనుక అట్ట చూస్తే, అలాటివేవీ కనిపించలేదు కానీ “మహాపురుషులకు మాత్రమే ఆత్మకథలవసర మనేది నేనంగీకరించను. నా వంటి వారి జీవితం ఇతరుల కాదర్శప్రాయం కాక పోవచ్చు. కానీ ఈ పుస్తకం వలన నిజాం పాలనలో మా పల్లెల పరిస్థితి, అప్పటి ఆచారాలు, అలవాట్లు, సామాజికస్థితి, నైతిక విలువలు వంటి ఎన్నో విషయాలు ఇప్పటివారికి తెలిసే అవకాశముంది. చరిత్రతో పనిలేదనుకునే వారికి తప్ప ఇతరులందరికీ ఇటువంటివి అవసరమే” అన్న వాక్యాలు ఆకర్షించాయి. చారిత్రక దైనందిన జీవన విశేషాలు సమగ్రంగా తెలుసుకోవలంటే విభిన్న జీవన పథాల నుంచి వచ్చినవారి ప్రత్యక్షానుభవాలు తెలుసుకోవటం ముఖ్యమూ, అవసరమూ అన్న నమ్మిక ఉన్నవాడిని కావటంతో ఈ పుస్తకాన్ని వెంటనే కొనుక్కున్నాను. ఆశించినట్లుగానే, పుస్తకం నాకు ఆసక్తికరంగా అనిపించింది. అప్పటినుంచీ పరిచయం చేద్దామనుకుని పలుసార్లు మొదలుబెట్టాను కానీ ఎప్పటికప్పుడు వేరే పుస్తకమేదో అడ్డం వచ్చి ఇప్పటివరకూ పూర్తి చేయలేకపోయాను. ఈలోపు పుస్తకం పలుమార్లు చదవటం జరిగింది.

శ్రీ అళహ సింగరాచార్యులు నల్గొండ జిల్లా, సూర్యాపేటకు తూర్పుగా పదిమైళ్ల దూరంలో ఉన్న భక్తలాపురం గ్రామంలో ప్రమోదూత సంవత్సర జ్యేష్ట శుద్ధ త్రయోదశి (జూన్ 8, 1930) నాడు జన్మించారు (ఈ పుస్తకం రాసేనాటికి వారికి 88 సంవత్సరాల వయసు). భక్తలాపురంకు రెండు మైళ్ళ దూరంలో ఉన్న నేలమర్రి గ్రామం వారి మూలస్థానం కాని, కుటుంబపోషణార్థం, సింగరాచార్యుల తండ్రిగారు భక్తలాపురం వలస వచ్చారు. నేలమర్రి మునగాల పరగణాలో, బ్రిటిష్‌వారి అధీనంలో ఉండేది. భక్తలాపురం నైజాంలో ఉండేది. సింగరాచార్యుల గారి తల్లి, నాయనమ్మ కందాడై వంశానికి చెందిన వారు.

సింగరాచార్యులుగారు శ్రీవైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆకాలంలో శ్రీవైష్ణవ బ్రాహ్మణులు అర్చకులుగా, వైద్యులుగా, పాచకులుగా జీవించేవారు. వారి తాతగారు ప్రసిద్ధి గాంచిన ఆయుర్వేద వైద్యులు. వైద్యం చేయటానికి నేలమర్రి వచ్చి, గ్రామస్థుల కోరికపై ఆ గ్రామంలో రంగనాయకస్వామి ఆలయానికి అర్చకులుగా స్థిరపడ్డారు. అర్చకులకోసం దేవాలయానికై ఇచ్చిన భూమి, వారి సంతానం జీవనానికి సరిపడకపోవడంతో వారందరూ ఇతర ప్రాంతాల స్థిరపడ్డారు. భక్తలాపురం దొర కోదాటి వెంకటరామారావు సూర్యారావుపేటలో కాపురం ఉంటున్నా. భక్తలాపురం గ్రామంలో తమ ఇంటిని, వ్యవసాయసంబంధి వ్యవహరాలను చూడటానికి, అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చినప్పుడు వంట వంటి వ్యవహారాలు చూడడానికి ఒక వైష్ణవ కుటుంబం ఉంటే మంచిదని తలచి, సింగారాచార్యుల తండ్రిగారికి తమ ఇంటి పక్కనే ఇల్లు కాట్టించి, కొంత భూమి కూడా ఇప్పించటం వల్ల ఆయన భక్తలాపురంలో స్థిరపడ్డారు. తాటాకు కప్పిన మూడంకణాల ఇల్లు; తర్వాత పడమటిగదిని మట్టిమిద్దెగా చేశారు.

వారి కుటుంబం వేదాద్రి నరసింహ స్వామి భక్తులు. తండ్రిగారి పేరు జ్వాలానరసింహాచార్యులు. కుమారులందరికీ వేదాద్రిలో ఉన్న పంచ (జ్వాలా, వీర, యోగానంద, సాలగ్రామ, లక్ష్మీ) నరసింహుల పేర్లు పెట్టారు. నాలుగో కుమారునికి సాలగ్రామ నరసింహులు అని పేరు పెట్టినా, ఎందువల్లనో అళహ సింగరాచార్యులు అనే పేరు ప్రచారంలోకి వచ్చి, రికార్డుల్లోనూ నమోదై, స్థిరపడిపోయింది. అళహసింగర్ అనే తమిళ పదానికి నరసింహం అని అర్థం.

సింగరాచార్యుల చిన్నతనంలో భక్తలాపురం 70 ఇళ్ళ గ్రామం. అక్షరాస్యులు తక్కువ. కుంటలు ఉన్నా, మోటబావుల మీదే ఎక్కువగా ఆధారపడిన వ్యవసాయం. ప్రధానంగా వరి పండించేవారు. ఇంటి వెనుక పెరట్లో కూరగాయలు పండించేవారు. దాపులో పెద్ద పట్నాలేమీ లేవు. పాఠశాల, రోడ్డు, వైద్యం వంటి సౌకర్యాలు లేవు. కరెంటు కూడా ఆ రోజుల్లో లేదు.

ఐదేళ్ళ వయస్సునుంచి 8వ యేటి వరకూ భక్తలాపురంలో వీధిబడిలో తెలుగులో పెద్దబాలశిక్ష చదువుకొని, లెక్కలు, ఉర్దూ నేర్చుకున్నారు. పై చదువులు చదవాలని ఉన్నా, వేరే ఊరు వెళ్ళి చదువుకునే వీలు లేక చదువు ఆపివేశారు. అర్చక విధులు నేర్చుకుని కొంతకాలం నేలమర్రి ఆలయంలో తమ వంతు వచ్చినప్పుడు ఆ విధులు నిర్వహించటం మొదలుబెట్టారు. ఒకరోజున ఆయన పెద్ద వదిన తండ్రి – వేదాంతం వెంకట నరసింహాచార్యులు గారు వారి ఇంటికి చుట్టపుచూపుగా వచ్చి, ఊరికే ఉన్న సింగరాచార్యులుని చూసి, కుర్రవాణ్ణి తనతో పంపితే సంస్కృత పాఠశాలలో చేర్పించి చదివించే ఏర్పాట్లు చేస్తామన్నారట. భగవంతుడు చూపిస్తాడని చెప్పే నిర్హేతుక జాయమాన కటాక్షం ఆచార్యులగారికి తనమీద కలిగిందంటారు సింగరాచార్యులుగారు. ఆయన అప్పుడు యాదగిరి దేవస్థానంలో స్థానాచార్యులుగా ఉంటూ విద్యార్థులకు సంస్కృత పాఠాలు కూడా చెప్పేవారు. సింగరాచార్యులు ఆయన వెంట వెళ్ళి దేవస్థానంలోనే ఒక గదిలో ఉంటూ, అక్కడ రామానుజకూటంలో భోజనం చేస్తూ, సంస్కృతం నేర్చుకోవటం ప్రారంభీంచారు. కొత్త చోట ఉండటం వచ్చిన ఇబ్బందులకు వెరసి చూడడానికి వచ్చిన తండ్రిగారితో కలసి తన ఊరు వెళ్ళిపోయి చదువు మానివేశారు సింగరచార్యులు.

అర్చన విధులూ, యాజ్ఞికాలూ నేర్చుకొంటూ నాలుగున్నరేళ్ళు గడిపేసిన తరువాత, మళ్ళీ నరసింహాచార్యులవారే వేరే మిషపై సింగరాచార్యుల్ని యాదగిరి తీసుకువెళ్ళి సంస్కృత పాఠశాలలో జేర్పించారు. ఈసారి ఇబ్బందులు పడకుండా శ్రద్ధగా చదువుకొన్నారు. అక్కడ చదువుకుంటున్న రోజుల్లోనే భారతదేశానికి స్వాతంత్ర్యం రావటం, రజాకార్ల గొడవలు, విమోచనోద్యమం, కమ్యూనిస్టు పోరాటం జరిగాయి. ఆయన అన్నగారు కమ్యూనిస్టుల్లో చేరి కొంతకాలం రహస్యజీవనం గడిపారు. కొంతకాలం సింగరాచార్యుల కుటుంబం భక్తలాపురం వదిలి నేలమర్రిలో కాపురం ఉన్నారు. తన 18వ యేట సముద్రాల వెంకట రామానుజాచార్యుల కుమార్తె 11 యేళ్ళ రంగనాయకమ్మని వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాతకూడా యాదగిరిలో చదువు కొనసాగించారు. పంచకావ్యాల పఠనం అయ్యాక గురువుగారి అనుమతితో హైదరాబాదులో సీతారాంబాగ్‌లో ఉన్న సంస్కృత కళాశాలలో చదువుకోవటానికి వెళ్ళారు.

సీతారాంబాగ్‌లో 1934లో ప్రారంభించిన ఒక సంస్కృత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత భోజనవసతితో విద్య నేర్పేవారు. అక్కడ సంస్కృతం చదువుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు జరిపే శిరోమణి, విద్యాప్రవీణ వంటి పరీక్షలకు కూర్చోవచ్చు. సీతారాంబాగ్‌ నలభై ఎకరాల ప్రాంగణంలో రెండు ఆలయాలు, పాఠశాల, వసతులు, తోటలు, కోనేరు ఉండేవి. సీతారామస్వామి ఆలయం పక్కనే ఉన్న సంస్కృత కళాశాల దాదాపు గురుకుల పద్ధతిలో ఉండేది. ఆ రోజుల్లో బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశం ఉండేది (తరువాత మారింది. ఆచార్య రవ్వా శ్రీహరి వంటి బ్రాహ్మణేతర విద్యార్థులు తర్వాత అక్కడ ఛదువుకున్నారు). ఉపనయనం అయిన వారికే ప్రవేశం. విద్యార్థులు అక్కడే నివసించే వారు. బండరాళ్ళ మీద పరచిన జంబుఖానా పై నిద్ర; యుద్ధకాలం కావటం చేత రేషన్ భోజనాలు. క్రాఫు లేకుండా జుట్టు, బొట్టు, ధోవతి, యజ్ఞోపవీతం తప్పనిసరి. చొక్కాలు, బనియన్లు ధరించకూడదు; ఉత్తరీయం మాత్రమే. క్రమశిక్షణ, నియమాలు, భయభక్తులు ఎక్కువ. ప్రధానోపాధ్యాయులతో (“స్వామివారి”తో) మాట్లాడాలంటే ముందు సాష్టాంగపడి నమస్కారం చేయాలి. పున్నమికి మూడు రోజులు, అమావాస్యకు మూడు రోజులు, మొత్తం నెలకు ఆరు రోజులు అనాధ్యయన దినాలు (సెలవులు). విద్యార్థుల భోజనవసతికి మార్వాడీలు ధనవంతులు విరాళాలు ఇచ్చేవారు. అధ్యాపకుల జీతానికి ప్రభుత్వగ్రాంటు ఉండేది.

సింగరాచార్యులుగారు శ్రద్ధగా చదువుకోవడంతోపాటు, నగరంలో అప్పుడు జరుపుకుంటున్న ఆంధ్రాభ్యుదయోత్సవాలలో జరిగే వార్షిక వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో పాల్గొని బహుమతులు గెల్చుకునేవారు. వ్యాకరణాన్ని అభిమాన విషయంగా చదివేవారు. తెనాలి, రాజమండ్రిలలో విద్యాప్రవీణ పరీక్ష వ్రాసి మంచి మార్కులతో పాసయ్యారు. ఆ సంవత్సరమే (1955) ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటిసారిగా ప్రాచ్యవిద్యా పరీక్షలు నిర్వహించగా, B.O.L (బాచెలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్) పరీక్షలు వ్రాశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యాప్రవీణలోనూ, బి.ఓ.ఎల్. పరీక్షలోనూ సింగరాచార్యులుగారొక్కరే ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

డిగ్రీ వచ్చాక సికింద్రాబాద్‌లో తెలుగుపండితులుగా ఉద్యోగం చేశారు. ఆరేళ్ళ తర్వాత ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి దగ్గర ఉన్న వేంసూరు గ్రామం జిల్లా పరిషత్ హైస్కూలుకు తెలుగుపండితులుగా వెళ్ళారు. అక్కడ ఏడేళ్ళు ఉన్నారు. ఈమధ్యలో సింగరాచార్యులుగారు హెచ్.ఎల్.సీ, బి.ఏ (ఇంగ్లీషు), బి.యిడి, ఎం.ఏ. (తెలుగు) పరీక్షలు ప్రైవేటుగా చదివి పాసయారు. వేంసూరు కూడా సౌకర్యాలు తక్కువగా ఉన్న చిన్న గ్రామమే. లాంతరు వెలుగులో చదువుకుంటూనే సింగరాచార్యులుగారు ఈ పరీక్షలన్నీ వ్రాశారు.

ఈ డిగ్రీలన్నీ తెచ్చుకున్నాక 1968లో బందరు హిందూ కాళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా చేరారు. ఆ సంవత్సరమే పెద్ద ఎత్తున జరిగిన తెలంగాణా ఉద్యమం ఆయన ఉద్యోగానికి ముప్పు తెచ్చిపెట్టింది. మొదటి సంవత్సరం తర్వాత ఉద్యోగం పొడిగించకపోవటాఅనికి వేరే చిన్న కారణాలు కొన్ని చూపినా, “మా వాళ్లందరిని తెలంగాణాలో తన్ని పంపిస్తున్నారు. మీ ప్రాంతంలోనే ఎక్కడన్నా సంపాదించుకోండి” అన్నాడట కళాశాల కార్యదర్శి. కొన్నాళ్ళ తర్వాత ఏలూరు ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేశారు. యాజమాన్యపు ‘అమర్యాద ప్రవర్తన’ వల్ల ఆ ఉద్యోగాన్ని వదిలేసి మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో ఉన్న ప్రాచ్యకళాశాలలో సీనియర్ లెక్చరర్‌గా ఉద్యోగానికి వెళ్ళారు. 1973లో హైదరాబాద్ ఆంధ్ర సారస్వతపరిషత్తు ఓరియెంటల్ కాలేజ్‌లో తెలుగు లెక్చరర్‌గా ఉద్యోగం రావటంతో పన్నెండేళ్ల విరామం తర్వాత మళ్ళా హైదరాబాద్ చేరారు. అప్పటి ప్రిన్సిపాల్, పూర్వ సహాధ్యాయి కె.కె.రంగనాథాచార్యులుగారు ఈ విషయంలో చాలా సహాయం చేశారు.

పరిశోధనారంగంలో ఉన్న కొంతమంది సహాధ్యాయులను చూసి ప్రేరేపితులై 1978లోనలభైఎనిమిదేళ్ళ వయసులో సింగరాచార్యులుగారు తెలుగు పి.హెచ్.డీ అభ్యర్థిగా నమోదయ్యారు. “ఆంధ్ర మహాభారతములో కృత్తధ్దిత ప్రయోగాలు” అన్న సిద్ధాంత వ్యాసంతో 1985లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి పట్టా పొందారు. 1990లో ప్రాచ్యవిద్యాకళాశాలనుంచి రిటైర్ అయి, తర్వాత మూడేళ్ళపాటు అక్కడే తెలుగుపండితుల శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ ‌గా పని చేశారు.

1991లో రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ అధ్యాపకుడిగా, 2007లో తెలుగు విశ్వ విద్యాలయం వారిచే ఉత్తమ సంస్కృత పండితునిగా సత్కరించబడ్డారు. 1973నుంచీ విరివిగా రచనలు చేస్తూనే ఉన్నారు కానీ ఈమధ్య కంటిచూపు మందగించినందున అంతగా వ్రాయటం లేదు. హైదరాబాదులోనే (అ)విశ్రాంత జీవనం గడుపుతున్నారు.

సింగరాచార్యులుగారి జీవనాన్ని సింహావలోకనం చేస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కుగ్రామంలో, ఆర్థిక వసతి పెద్దగా లేని కుటుంబంలో పుట్టి పెరిగి, చదువు మానివేసి, మామూలు పాఠశాలలో అడుగైనా పెట్టని సింగరాచార్యులుగారు రెండు విశ్వవిద్యాలయాల పరీక్షల్లో ప్రథముడుగా రావటం, ఉపధ్యాయ వృత్తిలో చేరటం, ఉత్తమ అధ్యాపకుడిగా గుర్తింపు పొందటం, ఎం.ఏ., పి.హెచ్.డీ పట్టాలు సంపాదించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ పుస్తకం చదువుతుంటే ఆయన సౌమ్యులుగాను, వివాదాలకు దూరంగా ఉండదలచేవారిగాను, ఇతరుల పట్ల గౌరవంతో వ్యవహరించేవారిగా, సున్నిత మనస్కులుగా, ఆత్మాభిమానం మెండుగా ఉన్నవారిగా కనిపిస్తారు. తెలుగు, సంస్కృతాల పట్ల చాలా అభిమానం ఉందని, అభిరుచి, తపన, మేధ, క్రమశిక్షణ ఉన్నవని అనిపిస్తుంది. దువ్వూరి వేంకటరమణశాస్త్రి జ్ఞాపకం వచ్చారు.

ఈ పుస్తకంలో ముఖ్యమైన విషయం, రచయిత ముందు మాటలోనూ, వెనుక అట్ట పైనా చెప్పినట్లుగా తాను జీవించిన వాతావరణాన్ని, పరిస్థితులను పాఠకులకు పరిచయం చేయటం. భక్తలాపురంలో చిన్నతనాన్ని, యాదగిరి, హైదరాబాదులలో తన విద్యాభ్యాసాన్ని, వేంసూరు గ్రామంలో ఉద్యోగాన్ని వర్ణించేటప్పుడు స్వంత కథే కాకుండా, పని గట్టుకుని అప్పటి ఆచారాలు, సాంప్రదాయాలు, నియమాలు, సామాజిక పరిస్థితులను విశదంగా వివరించారు. తరువాతి రోజులకి వచ్చేటప్పటికి ఉద్యోగమూ, స్వవిషయాలు చెప్పటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటంతో మిగతా విషయాల ప్రస్తావన అంతగా లేదు.

ఆయన బాల్యంలో ఉన్న భక్తలాపురం, యాదగిరి ఇప్పుడు లేవు. శ్రీవైష్ణవులైనా, మరొకరైనా, అప్పటిలా బ్రతకటానికి ఇప్పుడు అవకాశం లేదు. సింగరాచార్యులు గారు చూసిన ఎనిమిది దశాబ్దాలలో ఆయనతో పాటు, ఆయన చుట్టూ ఉన్న ప్రపంచపు తీరుతెన్నులు కూడా మారిపోయాయి. నైజాం నవాబు, బ్రిటిష్ కలెక్టర్లు, మునగాల జమీందారులు ఇప్పుడు లేరు. చిన్న పిల్లలు బళ్ళో చేరినప్పుడు ఉర్దూ పాఠాలు నేర్చుకోవటం లేదు. సంస్కృత పాఠశాలలూ, గురుకులాలూ, కులాచారాలూ చాలా మారిపోయాయి. మారిపోయిన, మాయమైన విషయాలను మనకు పరిచయం చేయటంలో ఆచార్యులుగారు కృతకృత్యులయారు. శ్రీవైష్ణవ సాంప్రదాయల గురించి నాకు ఇంతకు ముందు తెలీని చాలా విషయాలు (అధ్యయనోత్సవం, రామానుజ కూటం వంటివి) తెలిశాయి. ఆచార్యులవారు ఉద్యోగంలో చేరిన కొత్తలో కొనుక్కున్న (బ్యాటరీ, కరెంటు అవసరం లేని) హెడ్‌ఫోన్ రేడియో ముచ్చట ఆశ్చర్యాన్ని కలిగించింది. టేబుల్ రేడియో కొనుక్కున్నప్పడు ఆయన పొందిన ఆనందం సంగతి ముచ్చట వేసింది.

ఉద్యోగం వల్ల నెల నెలా వచ్చే జీతం పై ఆధారపడే మధ్య తరగతి జీవితమే ఐనా, తన జీవితాన్ని ఆయన మలచుకున్న పద్ధతి, చిన్న చిన్న విషయాలలో ఆనందపడగల శక్తి ఆదర్శప్రాయంగా అనిపంచాయి. నెలకు అయిదు వందల రూపాయల జీతంతో ఎనిమిది మంది సభ్యుల కుటుంబాన్ని ఎలా నడిపారో గాని, “అయినా మా పిల్లల విషయంలో నా ఆదాయానికి మించి పరిస్థితిని బట్టి చదివించినాను. నలుగురికి డిగ్రీ వరకు, ఇద్దరకు ఎం.ఏ వరకు చదివించినాను. ఖరీదైన బట్టలు, సౌకర్యాలు కల్పించకున్నా, నా చిన్నతనపు స్థితికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా పోషించినాను. వాళ్ళను క్రమశిక్షణలో పెంచటానికి ప్రయత్నించినాను” అని సంతృప్తిగా, గర్వంగా చెప్పుకోగలగటం మెచ్చుకోదగ్గ విశేషమే కదా. కాని, “నా విషయంలో నా స్థాయికి తగ్గ గుర్తింపు, గౌరవం కూడా లభించలేదు” అని ముగింపు వాక్యాలలో అనడం మాత్రం అపశృతిగా ధ్వనించింది. సింగరాచార్యులుగారి రెండో కుమారుడు, మిత్రుడు, కె. శ్రీనివాస్ ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంపాదకుడుగా, కవిగా, రచయితగా పుస్తకం పాఠకులకు సుపరిచితుడే. ఈ విషయం ఈ పుస్తకం చివర్లో తెలిసింది.

పుస్తకం చాలావరకు సరళంగా, ఒక పేద పిల్లవాడు నాయకుడిగా ఉన్న నవలలాగా సాగిపోతుంది. మొదటి పేజీలలో చాలా మంది మనుషుల (పూర్వీకుల), ఊళ్ళ వివరాలు చెప్పడం వల్ల కొద్దిగా గందరగోళంగా అనిపిస్తుంది కాని, ఆ ప్రకరణం దాటిన దగ్గరనుండీ ఇబ్బంది లేకుండా చదివిస్తుంది. సింగరాచార్యులు గారు రేడియోలో వార్తలు వినడము, సహోద్యోగులతో రాజకీయ విషయాలు చర్చించుకోవటం గురించి ప్రస్తావించినా, తన జీవిత కాలంలో జరిగిన భారీ రాజకీయ పరిణామాల గురించి రేఖామాత్రంగానే ప్రస్తావించటం ఆశ్చర్యంగానే ఉంది. ముందు విశాలాంధ్రవాదిగా ఉంటూ తరువాత తెలంగాణావాదిగా మారటానికి కల కారణాల విషయం తప్పించి మిగతా రాజకీయ, ఉద్యమాల గురించి తక్కువగా ఉంది. పుస్తకం మొదటి భాగం చదువుతుంటె దాశరధి రంగాచార్య ఆత్మకథ -జీవనయానం – గుర్తుకు వచ్చింది. ఇంకో విషయం – దాశరధి కృష్ణమాచార్యగారు ఆయన ప్రథమ పత్ని ద్వారా సింగరాచార్యుల బంధువట. ఈ ఆత్మ కథలో సింగరాచార్యుల ధర్మపత్ని గురించి వివరాలు తక్కువగానే ఉన్నాయి.

పుస్తకం అందంగా ముద్రించారు. అచ్చుతప్పులు అడ్డం తగలలేదు. 20వ శతాబ్దాపు మధ్యకాలపు మన పరిస్థితులను తెలుసుకోవటానికి ఉపయోగించే పుస్తకం. 232 పెజీల పుస్తకానికి 100 రూ.ల ధర ఈమధ్య అరుదైన విషయమే. 1952లో మచిలీపట్నం (బందరు)లో విద్యాప్రవీణ పరీక్షలు వ్రాశానని ముందొకసారి పేర్కొని, మళ్ళీ 1968లో ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు బందరు మొదటిసారి వెళ్ళినట్టు వ్రాయటం పొసగలేదు.

సహస్ర చంద్రోదయ దర్శన సమారోహమును నిర్వహించుకొన్న డాక్టర్ కండ్లకుంట అళహ సింగరాచార్యులు గారు సామాన్యులు కాదు మాన్యులని భావిస్తూ, వారి శేషజీవితం ఆనందంగా గడవాలని కోరుకొంటున్నాను.

* * *
అధ్యాపకుడి ఆత్మకథ
డాక్టర్ కండ్లకుంట అళహ సింగరాచార్యులు
అక్టోబరు 2011
ఎమెస్కో బుక్స్
1-2-7 బానూ కాలనీ
గగన్‌మహల్ రోడ్, దోమలగూడ,
హైదరాబాద్, 500 029
ఫోన్: 40 23264028
emescobooks@yahoo.com/ www.emescobooks.com
232 పేజీలు, 100 రూ

You Might Also Like

12 Comments

  1. Sudarshan

    mee book chala bagundi.

  2. sivasankar ayyalasomayajula

    మీ సమీక్ష విపులముగా,సరళముగా ఉన్నది. అళహ సింగరాచార్యులు వారి పరిచయం మరియు ఆయన జీవిత విశేషాలను తెలియపరిచి నందుకు ధన్యవాదములు. నేను ఈయన పేరు ముందెన్నడూ వినలేదు. ఇప్పుడు మీ పరిచయం ద్వారా తెలుసుకున్నాను. ఆయన జీవితం ఒక స్ఫూర్తి దాయకం.

  3. Sreenivas Paruchuri

    I am not a big fan of this genre “autobiography”, but am aware that its a popular one in Telugu book world. Needless to say auto-biographies are individual, highly subjective and needs careful interpretation if one wants to use them as primary sources of information.
    Also, IMO, its not an easy rather a thankless job to review/introduce such books. My question is: is there an attempt in Telugu that talks about this genre in general? I am aware of (and have) Akkiraju Ramapatirao’s “telugulO sweeyacharitralu” (Yuvabharati, 1984), but it mainly gives raw data. Rajagopal made an attempt in his thesis, but its not easily accessible and is in English.

    How about introducing తిరుపతి వెంకట కవుల “జాతకచర్య”?, which is unique, only-of-its-kind in the world literature to my knowledge? Its narrated in third person!! Regards, — Sreenivas

    1. సౌమ్య

      జాతకచర్య – ఇప్పుడే దిగుమతి చేశా డీ.ఎల్.ఐ. నుండి. ఇంత పద్య భాష చదివి అర్థం చేసుకునే తెలుగు నాకు తెలుసునని నేను అనుకోవడం లేదు. చేతులెత్తేస్తున్నాను!!

  4. srikanth

    http://www.logili.com/books/aadhyapakudi-atma-kadha-kandlakunta-alaha-singara-charyulu/p-7488847-96144544729-cat.html#variant_id=7488847-96144544729

    అచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ visit :

    http://www.logili.com/

    మీకు బాగా నచ్చిన పుస్తకాల గూర్చి మీ అభిప్రాయాలను,
    రివ్యూ లను వ్రాసి ఈ మెయిల్ అడ్రస్ కు పంపించండి
    review@logili.com
    నచ్చిన రివ్యూ లను మీ పేరు లేక మీ కలం తో ప్రచురింపబడును.

    1. సౌమ్య

      నేరుగా పుస్తకం.నెట్ కే వచ్చి, మీకు బాగా నచ్చిన పుస్తకాల గురించి మీ అభిప్రాయాలను ఫలానా చోటుకి పంపండి అంటున్నారు – ఏమన్నా బాగుందీ? 🙂

  5. muthevi ravindranath

    సమీక్ష చాలా బాగుంది. తమకి ఉన్న పరిమితులను అధిగమించి, వ్యక్తులు స్వయం కృషితో, పట్టుదలతో ఎలా
    ఉన్నత స్థాయికి చేరుకోవచ్చో సింగరాచార్యులు గారు నిరూపించారు. తన స్థాయికి తగ్గ గౌరవం, గుర్తింపు లభించలేదని బాధపడడం ఎవరిలోనైనా ఉండేదే. ఉండదగిన లక్షణం కూడా. అప్పుడే ఆ వ్యక్తి మరింత పట్టుదలతో కృషిచేస్తాడు.శ్రీ వైష్ణవులలో అర్చక, వైద్య వృత్తులతోపాటు పాచక వృత్తి కూడా ఉండేదని ఇది చదివే తెలుసుకున్నాను. సీతారాం బాగ్ సంస్కృత విద్యాలయం వైశిష్ట్యం గురించి ఒకసారి ప్రముఖ విప్లవకవి జ్వాలాముఖి గారు చెప్పగా విన్నాను. మాన్యులు కె.కె.రంగనాథాచార్యులు గారు(కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వపు డీన్) తాను కూడా అక్కడే చదివానని ఒకసారి చెప్పారు.ఇది చదవగానే వారితో ఫోన్లో సంభాషించి, ఆ విద్యాలయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాను. ఆత్మకథకునికి కథన కౌశలం ఉంటే ఆత్మకథలు ఎప్పుడూ చదువరులను ఆకట్టుకుంటాయి. నాటి దేశ,కాల పరిస్థితులను కళ్ళముందు నిలప గలిగితే ఆత్మకథ చారిత్రక ప్రయోజనం కూడా సిద్ధించినట్లే.మరో విద్వన్మిత్రులు డా.కె.శ్రీనివాస్ (ఆంద్ర జ్యోతి సంపాదకులు) గారి తండ్రే సింగరాచార్యులు గారని ఇది చదివాకే తెలిసింది.మొత్తమ్మీద చక్కటి సమీక్షను అందించిన డా.జంపాల గారికి ధన్యవాదాలు. — ముత్తేవి రవీంద్రనాథ్, తెనాలి.

  6. pavan santhosh surampudi

    మంచి ఆత్మకథ. ఇలాంటివి కొన్ని ఆత్మకథలు నా వద్ద ఉన్నాయి. ఊరికి పెద్దగా ఉన్నవ్యక్తి, కరణీకం చేసి బ్రిటీష్ కాలంలో పౌరుషంగా వారికి తలవంచకుండా జీవించిన వ్యక్తి, క్రమశిక్షణాయుతంగా జీవించిన ఓ కుటుంబపెద్ద ఇలా ఆ ముగ్గురూ న్యాయంగా వారివారి రంగాల్లో ఓ ఇరవై, ముప్ఫై మందిని ప్రభావితం చేసిన మార్గదర్శకులే. కాని వారేమీ మహానుభావులూ, మహాపురుషులూ, మహాకవులూ కాదు. ఇలాంటివారి జీవితాలే ఒక కాలాన్ని అర్థం చేసుకోవడానికి బాగా పనికివస్తాయని నా నమ్మిక. పైగా ఆత్మకథలు కలెక్షన్ గా వుంచుకునే అలవాటు ఉన్నవాణ్ణి కావడంతో ఇవన్నీ చదివి దాచిపెట్టుకున్నాను.

    1. సౌమ్య

      >> ఇలాంటివి కొన్ని ఆత్మకథలు నా వద్ద ఉన్నాయి.
      వివరాలు తెలుపగలరా??? లేదంటే ఈ పుస్తకాల గురించి వీలువెంబడి మీరే పరిచయం చేయవచ్చు కదా!

    2. pavan santhosh surampudi

      వ్రాద్దామని చాలా పెద్ద లిస్టే పెట్టుకున్నానండీ. అన్నీ వ్రాస్తున్నాను. వరుసవెంబడి అవీ వ్రాస్తాను.

    3. pavan santhosh surampudi

      అందులో ఒకదానికి నేనే ముందుమాట వ్రాశాను. రమణరావుగారనే పెద్దమనిషి వ్రాసుకున్న డైరీలాధారంగా ఆయన భార్య వ్రాశారు ఓ పుస్తకం. ఆ కుటుంబానికి మా కుటుంబానికి బాగా చనువుంది. ఆయన గురించి నాకు మా పెద్దల ద్వారా చాలామంచిగా తెలిసినవాణ్ణి కావడంతో నాచేత వ్రాయించారు ముందుమాట. ముందుమాట వ్రాసేందుకు తగను అని నేను వారి మాట త్రిగ్గొట్టబోతే మా గురువుగారి మాటకు ఒప్పుకుని వ్రాశాను.
      మీకు అనౌచిత్యం కాదనిపిస్తే అదే పంపుతాను. కాని నాకు తెలియనితనం వల్ల కాస్త అతిశయోక్తులున్నాయి.

  7. పంతుల గోపాల కృష్ణ

    మంచిపుస్తకాన్ని విపులంగా పరిచయం చేసారు.అళహ సింగరాచార్యుల వారు వారి జీవిత చరిత్ర వ్రాయడం మంచిదే.ప్రముఖులే కాదు ప్రతి ఒక్కరు వారి జీవించిన ప్రదేశాన్ని అప్పటి జీవన విధానాన్ని గుర్తు చేసుకుంటూ వివరంగా రికార్డు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.ఆచార్యుల వారు కె.శ్రీనివాస్ గారి తండ్రిగారని తెలిసి సంతోషంగా ఉంది.బ్లాగులో శ్రీనివాస్ గారి రచనలలో గొప్పదనానికి మూలం ఎక్కడుందో తెలిసి నట్లయ్యింది.మంచి పుస్తకాలను పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.

Leave a Reply