రాణీ శివశంకరశర్మ – అమెరికనిజం
వ్రాసిన వారు: Halley
********
ఈ వ్యాసం రాణి శివ శంకర శర్మ గారు రాసిన “అమెరికనిజం – Political Philosophy” అనే పుస్తకం గురించి. పుస్తకం వెనుక భాగాన “There is no spirituality in India; There is no equality in Europe; There is no freedom in America” అని రాసి ఉంది. దీనిని చూసాక రకరకాల మనుషులు రకరకాలుగా అనుకుంటారు. ఇది చూడగానే ‘తప్పక చదవాల్సిన పుస్తకం’ అని అనుకున్నా నేను. తెలుగు చదవటం రాని మిత్రుడు ఒకడు ఇంగ్లీషులో ముద్రించిన ఈ మూడు వాక్యాలని చూసి అదొకలాగా మొహం పెట్టి ‘ఇలాంటివి వాళ్ళెందుకు రాస్తారో .. నువ్వెందుకు చదువుతావో’ అని అన్నాడు నాతో నిర్మొహమాటంగా. ఇంకొక మిత్రుడు ‘ఏం చేద్దామని ఇలాంటివన్నీ చదివేసి?’ అని అడిగాడు. ఆ రెండు ప్రశ్నలకి నా దగ్గర జవాబు లేదు ప్రస్తుతానికి.
అది అలా పక్కన పెడితే రాణి శివ శంకర శర్మ గారి పుస్తకాలతో నాకున్న అనుబంధం గురించి కొంత. ఎపుడో నేను ఐ.ఐ.ఐ.టీ హైదరాబాదు లో బీ.టెక్ చదువుతున్న రోజులలో (2007) నా సీనియర్ ఒకతను “The Last Brahmin” పుస్తకం గురించి చెప్పటం జరిగింది. ఎందుకనో అప్పట్లో అయన రచనలు చదవాలనిపించలేదు. అటు తర్వాత పోయిన సంవత్సరం అక్టోబరులో అనుకుంటాను అదే సీనియర్ మళ్లీ ఒక ఈమెయిలులో రాణి శివ శంకర శర్మ తో ఐ.ఐ.ఐ.టీలో జరిగిన ప్రత్యక్ష చర్చ కార్యక్రమం గురించి చెప్పటం జరిగింది. నేను అప్పటికే వేరే పుస్తకాలూ చదువుతూ బిజీగా ఉన్న కారణాన నా పుస్తకాల పట్టీలో ఈ రచయిత పుస్తకాలను చేర్చలేదు. అయితే మొన్నామధ్యన పుస్తకం.నెట్ లో ఈయన పుస్తకం గురించి ఒక పరిచయం వచ్చిన వెంటనే అనిపించింది, అయ్యో! ఎప్పటి నుంచో వింటున్నా ఈయన గురించి మచ్చుక్కి ఒక్క పుస్తకమైనా కాని చదవనే లేదే అని! వెంటనే నా మిత్రుడిని అడిగి “అమెరికనిజం” మరియు “పురాణ వేదమ్” అనే రెండు పుస్తకాలను అరువు తీసుకున్నాను. ఈ రెంటిలో మొదటి పుస్తకం గురించి ఈ వ్యాసం. వీలు చూసుకొని రెండవ పుస్తకం గురించి కూడా నాకు తోచింది రాయటానికి ప్రయత్నిస్తాను. ఇటువంటి పుస్తకాల గురించి తీసిస్సులు రాసేంత తెలివితేటలు నాకు లేవు. ఏదో నాకు నచ్చిన నాలుగు ముక్కలు నలుగురికి చెబుదామని రాస్తున్న వ్యాసం ఇది.
పుస్తకం మొదటి పేజీలలో ఉన్న “ఆదిత్య హృదయం” లోని ప్రతి వాక్యమూ నన్ను ఎంతగానో ఆలోచింపజేసింది. అప్పటికే ఇటువంటి భావాలు గల సాహిత్యం ఒకింత ఎక్కువగా చదివినందున కాబోలు నాకు పెద్ద తప్పుగా ఏమి అనిపించలేదు ఇదంతా. చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఇందుకు విరుద్ధ దృక్కోణం ఉన్నవారికి ఇది చదివితే మరోలా అనిపిస్తుందేమో! ప్రకృతిని జయించి మనిషి ఆధిపత్యాన్ని స్థాపించే తాత్వికతను పాశ్చాత్యులు ఆచరించటం గురించి, ఆ తాత్వికత ఎలా యంత్రాన్ని సృష్టించి ప్రపంచాన్ని మార్చిందో చెబుతూ, ఆ తాత్వికతకు చరమస్థాయే అమెరికనిజం అని చెప్పారు. ప్రాచ్య తాత్వికత మేఘాలలో ప్రభాకరుని వలె మరుగున పడిపోయింది అని, ఆ దివ్యకాంతిని సాక్షాత్కరింపజేసే ప్రయత్నమే ఈ గ్రంథ లక్ష్యమని తెలిపారు.
“ఆధునికత వినసొంపైన ఆదర్శాలని మన ముందు వుంచి, వాటి వెనుక తన దుర్మర్గాలని దాచేసుకుందని” చెబుతారు రచయిత. పరమాత్మయైన లేని స్థలమైన ఉండవచ్చు కానీ అమెరికన్ భావజాలం లేని స్థలం వుండదు అన్న రచయిత మాటతో తప్పక ఏకిభవించాలి. “దేవుడు సరే .. మానవుడూ మరణించాడు”, “రామాయణ కల్పవృక్షం – మార్క్సు విషవృక్షం” అన్న వ్యాసాలలో మార్క్సిజం గురించి, క్రైస్తవం గురించి కొన్ని చేదు నిజాలే చెప్పారు రచయిత. ఇంకొక వ్యాసంలో “క్రీస్తు లేడు .. రాముడూ లేడు .. చివరికి మానవుడు లేడు .. కేవలం మార్కెట్టు ఉంది.. అదే అమెరికనిజం” అని అన్నారు.
ఇక నన్ను ఒకటికి రెండు సార్లు చదివింపజేసి చాలాసేపు ఆలోచింపజేసిన వ్యాసం “లౌక్యాభిరామాయణం“. బాపురమణల అభిమానులకి బహుశశా వ్యాసం చదవగానే పుస్తకం చించి అవతల పారేయాలని అనిపిస్తుందో ఏమో. ప్రాచీనులు పురాణ ఇతిహాసాల ద్వారా కథారూపములో తత్వశాస్త్రాన్ని సామాన్యశ్రోతలకి అందజేసారని, అదే వాటి పరమార్థమని చెబుతూ, ఆ పరమార్థం పోయి కథ మాత్రమే మిగిలితే, కాలక్షేపమే పరమార్థమైపోతే, ఆధునిక విద్యావంతుల తీరిక సమయపు బఠానీగా మారిపోతే అదే బాపురమణల రామాయణం అని అన్నారు. అది పటం కట్టుకొని గోడకి తగిలించుకోవడానికి మాత్రమే పనికి వస్తుందని అన్నారు. ఇది మొదలు మాత్రమే! ఈ వ్యాసం నిండా ఇటువంటి వాదప్రతివాదనలు ఎన్నో ఉంటాయి. బాపురమణల గురించి భజన వ్యాసాలనే చదివిన నాకు ఇంత భారీ విమర్శనాత్మక వ్యాసాన్ని చదివి అర్థం చేసుకోటానికి కాసేపు పట్టింది. ఇందులో ఎన్.టీ.రామారావుగారిపై విశ్వనాథ వారి ప్రభావం గురించి చెబుతూ, అయన తీసిన సినిమాలకి బాపురమణల సినిమాలకి గల తేడాల గురించి చర్చిస్తూ రాసిన భాగాలు అర్థం చేసుకోటానికి ఇంట్లో పెద్దవాళ్ళతో కాసేపు చర్చాగోష్టి పెట్టాల్సి వచ్చింది నాకు!
“అర్థం వ్యర్థం” మరియు “అపజయోస్తు” అనే రెండు వ్యాసాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నా మిత్రులు చాలా మంది నాతో చాలా సార్లు “Why did India miss industrial revolution / If we were so smart why didn’t we invent any big technology” అని అదేదో మహా పాపం జరిగి పోయినట్టు చాలా సార్లు బాధ పడ్డారు. అలాంటి వారందరూ తీరికగా చదవాల్సిన వ్యాసాలు ఈ రెండూను. ఆధునిక వ్యవసాయ విధానాల వలన వచ్చిన పెనుమార్పుల గురించి మరొక వ్యాసంలో వివరించారు. క్రైస్తవం గురించీ కాటనుదొర కోస్తాకు తెచ్చిన “అభివృద్ధి” గురించీ కొంచెం కటువుగానే రాసారు ఇందులో. ఈ అభివృద్ధిని తీవ్ర ప్రకృతి విధ్వంసంగా వేయిపడగలు నవలలో విశ్వనాథవారు చిత్రీకరించిన వైనం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు.
మరొక చోట ఆధునిక మానవుడికి ప్రకృతి మీద మక్కువ లేదనీ ఆధునిక మానవుడు గోమాతని ఆరాధించలేడనీ, రావిచెట్టుకి వేపచెట్టుకి పెళ్లి చేసి సంతోషించలేడనీ, అతని హేతుబుద్ధికి ఇది విరుద్ధం అని అన్నారు. మరో చోట పర్యావరణ పరిరక్షణ ధనిక వర్గాల హాబీగా మారిన వైనం గురించీ దాని గురించి మాట్లాడటం ఫాషనుగా మారిన తీరు గురించీ ప్రస్తావించారు. ఈ వాదం పర్యావరణానికి తీవ్రంగా ముప్పుతెచ్చిన పాశ్చాత్య దేశాలనుంచి దిగుమతి అయిందని అభిప్రాయపడ్డారు. ఆ మధ్యన రామచంద్ర గుహ రాసిన “How much should a person consume” అనే పుస్తకంలో పాశ్చాత్య ప్రాచ్య పర్యావరణవాదాలలో తేడాల గురించి గుహ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేయటం గుర్తు (i.e., environmentalism of the west being a full-stomach or post-materialist phenomenon). ఆర్గానిక్ ఫుడ్ గురించి చెబుతూ ఇలా అన్నారు “ఒకప్పుడు అందరు ఎరువులు వాడని ఆహారాన్నే స్వీకరించేవారు. ఇపుడు అటువంటి ఆహరం అధిక ధరలకి లభిస్తోంది, ఆర్గానిక్ ఫుడ్ పేరుతో వ్యాపారం మొదలైంది. అంటే సహజత్వం కూడా ఖరీదైన వ్యాపారంగా మారింది. నీరు కూడా వ్యాపారంగా మారింది. క్రమేపి గాలి కూడా వ్యాపార వస్తువులుగా మారే సూచనలు కనపడుతున్నాయి. ఇలా పంచ భూతాలు పరాయివిగా మారిపోతున్నాయి” అని అన్నారు. మరొక చోట “ఇప్పుడు ప్రకృతి సిద్ధంగా సహజంగా జీవించటానికి చాల ధనం అవసరం. సహజత్వం అరుదైన సరుకుగా మారింది. అందువల్ల అది సహజత్వం కాకుండా పోయింది” అని అన్నారు. నిజమే కదా!
ఇంకో చోట యురోపియనిజంకు అమెరికనిజంకు గల తేడాని చెబుతూ ఇలా అన్నారు. “క్రైస్తవ వలస వాదులకి ఉన్న ‘వైట్ మేన్స్ బర్డెన్’ అమెరికన్లకి లేదు. అమెరికన్లు రెడ్ ఇండియన్ తెగలని ఉద్దరించబడవలసిన వారుగా చూడలేదు…. యూరోపీయ వలసవాద దృష్టిలో మతం, కరుణ ఉన్నాయి. పాలితులు అధములని వారిని ఉద్ధరించాలనే తపన ఉంది. అమెరికనిజం అటువంటి భావాలని ముగించి వేసింది. అది స్వేచ్ఛ అనే భావాన్ని వాడుకలోకి తెచ్చింది” అని చెబుతూ వారు రెడ్ ఇండియన్సుని నిర్మూలించిన తీరు గురించి చెప్పుకొచ్చారు. అమెరికన్ జీవిత విధానంలో, రాజ్యాంగంలో భారతీయ ఋషులు ప్రవచించిన బహుళత్వం ఉందని ప్రవచించిన స్వామి వివేకానంద, రెడ్ ఇండియన్ తెగల వైవిధ్య సంస్కృతిని, జీవన విధానాలని చివరకు ఆ తెగలని మూలమూలలకి తరిమి కొట్టి నిర్మూలించి ఆధునిక అమెరికా ఆవిర్భవించిందన్న విషయాన్ని ప్రస్తావించనే ప్రస్తావించాడని అన్నారు.
“బాబాల షాపింగ్ మాల్” అనే వ్యాసంలో నేడు మన దేశంలోని ఆధ్యాత్మిక నిలయాలు “చట్టాలకి అతీతంగా న్యాయవ్యవస్థకి అతీతంగా తెల్లదో, నల్లదో, ఏ రంగుదో తెలియని ధనం అడ్డు, అదుపు లేకుండా ప్రవహించటానికి స్విస్స్ బ్యాంకులని మించిన సురక్షిత నిలయాలు”గా మారిన తీరు గురించి ప్రస్తావించారు.
ఈ పరిచయంలో పుస్తకం మొదటి సగంలోని వ్యాసాల గురించే ఎక్కువగా చెప్పటం జరిగింది. రెండవ సగంలో ఉన్న విషయాలు కొంచెం తీవ్ర విమర్శలనే అనాలి. చాలా వరకు విషయాలలో రచయిత అభిప్రాయాలతో నేను ఏకిభవించడం వలన నాకు అవి పెద్ద తప్పుగా అనిపించకపోయినా, భిన్నాభిప్రాయం కలవాళ్ళు మరోలా రియాక్టు అవ్వవచ్చునేమో అని వాటిని ఇక్కడ ప్రస్తావించట్లేదు. గాంధీజీ జీవన విధానంలోని గొప్పతనాన్ని మరింతగా అర్థం చేసుకోటానికి కొన్ని వ్యాసాలు ఉపయోగపడతాయి. అభివృద్ధి గురించి, టెక్నాలజీ గురించి, సైన్సు గురించి, మతం గురించి, భారతీయ తత్త్వం గురించి, అమెరికనిజం గురించి మనకి ఇప్పటికే ఉన్న అభిప్రాయాలను తవ్వి బయటకి తీసి కోర్టు బోను లో పెట్టి క్రాస్ ఎక్జామినేషన్ చేసినట్టు ఉంటుంది ఈ పుస్తకం చదివితే.
ఈ వ్యాసం కేవలం ఇది ఏ తరహా పుస్తకం అని అర్థం చేసుకోటానికి రాసినది. రచయిత గురించి కాని అయన రచన గురించి కాని తప్పొప్పులు ఎత్తిచూపటం దీని ముఖ్యోద్దేశం కాదు. నాకు ఇంకను బోలెడన్ని సందేహాలు ఈ పుస్తకం చదివాక, కాబట్టి విమర్శ మాట దేవుడెరుగు అసలు మొత్తం పుస్తకం అర్థమే అవలేదు ఇంకా!
తెలుగులో నేను పుట్టాక రాసిన రచనలలో ఇంత పదునైన వాదనలు ఉన్న పుస్తకం నేను చదవలేదు. ఈ పుస్తకం చదివాక విశ్వనాథ వారి “వేయిపడగలు” మళ్లీ శ్రద్ధగా అక్షరంకూడా వదలకుండా చదవాలని అనిపించింది. ఆధునికత గురించి లోతైన అధ్యయనం చేసిన విశ్వనాథ వారి రచనలను పదే పదే ప్రస్తావించారు రాణి శివ శంకర శర్మ గారు ఈ పుస్తకంలో. ఈ పుస్తకం చదివాక నాకు నేను ఇచ్చుకున్న హోం వర్కు అదే!
జూలై 2011, మొదటి ముద్రణ , సంస్కృతీ పబ్లికేషన్స్, గుంటూరు.
పుస్తకం కొనుగోలుకు ఏ.వీ.కె.ఎఫ్. వారి వెబ్సైటులో ఇక్కడ లభ్యం.
A.Surya Prakash
అమెరికనిజం పుస్తకం వెంటనే చదివెయ్యాలనే పరమ ఉత్సుకత మీ పుస్తకపరిచయం చదివాక కలిగింది !
శర్మ రాణి
డియర్ రాణి శివశంకర శర్మ గారు, మీ బ్లాగ్ చదివాను. చాలా బాగుంది. నేను మిమ్మలిని కలవచునా? కలిసి ఒక ఫోటో తీస్యున్చుకోవాలి.
మీరు ఎక్కడ ఉంటారు.. నేను ఇండియా లో ఉంటాను. అందునా భాగ్య నగరం లోనే
మీరు ఇండియా లో ఉంటే నేను కలుస్తాను. అమెరికా లో ఉంటే మా అన్నయ్య కలుస్తారు.
ఇట్లు
శర్మ రాణి
SIVARAMAPRASAD KAPPAGANTU
ఒక మంచి పుస్తకాన్ని సూచించారు. అమెరికనిజం అంటూ వ్రాస్తున్న ఈ పుస్తకాన్ని చదివాలన్న ఆసక్తి కలిగింది. ధన్యవాదాలు.
srikanth
The Last Brahmin
http://www.logili.com/books/last-brahmin-rani-siva-sankara-sarma/p-7488847-85119503440-cat.html#variant_id=7488847-85119503440
pavan santhosh surampudi
మరలనిదేల రామాయణంబన్నట్టుగా ఉంది. రామారావుగారి రామాయణాలకు విలన్లే హీరోలు. అది ఆయన దృక్పథం. బాపూరమణలకు రాముడు హీరోల్లోకెల్లా హీరో అది వారి దృక్పథం. ఏం చెయ్యగలం రెంటినీ పోల్చి.
రవి
ఈ పుస్తకం చదవాలనిపిస్తూంది.:)
బాపు రమణల సినిమాలలో, బాపు బొమ్మల్లో, రమణ గారి రచనల్లో ‘ఫలానా’ అంటూ చెప్పలేని ఒక అసంబద్ధతను రచయిత కనుక్కుని వెలికి తీసి చూపించడం బావుంది.
హిందీలో అతనెవరో దర్శకుడు – పొద్దస్తమానం పెళ్ళి సినిమాలు తీస్తూ ఉంటాడు. గుజరాత్ పెళ్ళి, మరాఠీ పెళ్ళి, పంజాబ్ పెళ్ళి ఇలాగన్నమాట. బాపు సినిమాల్లో (పురాణ పాత్రలు కూడా) పాత్రలు తెలుగు తనాన్ని అవసరానికి మించి పాటిస్తాయి. తెలుగు అమ్మాయి జడ, ఆమె బొట్టు, తెలుగు వాడి నడక, నిలబడ్డం, కూర్చోవడం, ఇంట్లో వస్తువులూ వగైరా వగైరా. (‘తెలుగూ అంటే ‘గోదావరి ‘ జిల్లా లో మాట్లాడేది, అక్కడి మనుషులు బ్రతికే జీవన విధానమూనూ అన్నమాట).
అలాగే పురాణ పాత్రలు తమ డిఫైండ్ ‘ఫిలాసఫీ’ ని సాధ్యమైనంత బాధ్యతగా నిర్వహిస్తుంటాయి. నిన్నే టీవీలో వచ్చిన రామరాజ్యంలో రాముడు ఎవరో పరాయి స్త్రీ ‘నీడ ‘ పడితే సైడుకు జరగడం ఒక ఉదాహరణ.ఇది తెలుగు హీరో వందమందిని చితకబాదే సీనుకు సరిపోలుతుంది.
తెలుగుతనాన్ని ప్రతిబింబించడం మంచిదే కానీ, అంతకంటే గొప్ప విషయాలు భూకైలాస్ వాంటి సినిమాల్లో తెలుస్తాయి..
రామారావు సినిమాల్లో గాఢత గురించిన వివరణల్లో కొంచెం బలవంతంగా అతికించిన తత్త్వం ఉంది కానీ సమగ్ర సహేతుక సమీక్ష లేదు. నిజానికి రామారావు సినిమాల్లో గాఢతలో సగం ఆయన ఆహార్యం, రూపం, వాచికం వల్ల వచ్చినవి. ఇది వదిలి ఈ రచయత గాఢతను వివరించేందుకు ‘వేయి పడగలు ‘ ను తీసుకురావడం సరిగ్గా అమరనట్లు నాకు అనిపించింది. (కల్పవృక్షం బదులు వేయి పడగల ప్రస్తావణ ఎందుకో?)
“రామాయణ విషవృక్షానికి లక్ష్యశుద్ధి ఉంది”, “ఒక గ్రంథాన్ని పొగిడే వాళ్ళు చేసే కీడు, తిట్టే వాళ్ళు చెయ్యరు” – 🙂 – బాగా రాశారు. But these things are conveniently ignorable ones.
కామేశ్వరరావు
Halleyగారి పరిచయం చదివి యీ పుస్తకం చదవాలని చాలా ఆసక్తి కలిగింది. కాని శ్రీనివాస్‌గారిచ్చిన లింకులో “లౌక్యాభిరామాయణం” చదవగానే ఆ ఆసక్తీ ఉత్సాహం పూర్తిగా నీరుగారిపోయింది! (నేను బాపూరమణల వీరాభిమానిని కాను కాబట్టి చించెయ్యాలన్న కోపం రాలేదనుకోండి :)) ఆ వ్యాసంలో ఎక్కడా నాకు సరైన తార్కికత కనిపించ లేదు. రామారావుగారి పౌరాణికాలను, బాపూరమణల పౌరాణికాలనూ పోల్చదలుచుకున్నప్పుడు, వారి సినిమాలన్నిటినీ తీసుకొని వాటిలోంచి స్పష్టమైన ఉదాహరణలిస్తూ, తమ అభిప్రాయాలను, నిర్ధారణలను సమర్థించాలి. అలాంటి ప్రయత్నం ఏమాత్రం జరగలేదు. తమ అభిప్రాయాలని నిర్ధారణలుగా మళ్ళిమళ్ళీ చాటిచెప్పడం ఒక్కటే కనిపించింది. సంపూర్ణరామాయణం అన్న పేరుకి పూర్తిగా తమదైన భాష్యం చెప్పి దాన్ని తప్పుబట్టారు. మధ్యలో విషవృక్షం, విశ్వనాథ, వేమన, వీరబ్రహ్మేంద్రస్వామి, బాపూ బొమ్మల ప్రస్తావన తెచ్చారు. కాని వాటి మధ్య సంబంధం చాలా అస్పష్టంగా అనిపించింది.
శివశంకరశర్మగారు తులసీదాస్ రామచరితమానస్ గూర్చి ఏమంటారో (ఏమైనా అన్నారో) తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది!
Srinivas Vuruputuri
లౌక్యాభిరామాయణాన్ని, రాణి శివశంకర శర్మతో ఓ పెద్ద సంభాషణను ఇక్కడ చదవవచ్చు.