Women Writing in India, 600 B.C. to the present – Volume 1

ఇటీవలి కాలంలో ఆంధ్ర-మహారాష్ట్ర ప్రాంతాలకి చెందిన వివిధ రంగాలలోని మహిళల గురించి వరుసగా “మహిళావరణం”, “డాటర్స్ ఆఫ్ మహారాష్ట్ర” పుస్తకాల ద్వారా చదివాను. మధ్యలో కొండవీటి సత్యవతి గారు ఇటీవలే వ్రాసిన “భండారు అచ్చమాంబ సచ్చరిత్ర” పుస్తకం చదివాను. అన్నింటిలోనూ కామన్ గా ప్రస్తావించబడ్డది – సూసీ తారు, కె.లలిత లు సంపాదకులుగా ౧౯౯౧ లో వెలువడ్డ “Woman Writing in India: 600 B.C. to the present” అన్న రెండు భాగాల పుస్తకం. అచ్చమాంబ గురించి ఆసక్తి తిరిగి మొదలవడానికి కారణం ఈ పుస్తకమే అని సత్యవతి గారు వ్రాసారు. దానితో పుస్తకం గురించి కుతూహలం కలిగింది. అలాగే, సంపాదక ద్వయం ను మహిళావరణంలో కూడా ప్రొఫైల్ చేసారు. ఈ నేపథ్యంలో అసలా పుస్తకంలో ఏం రాశారు? అన్న కుతూహలం పెరిగింది. మొదటి భాగం – క్రీస్తు పూర్వం ౬౦౦ నుండి ౨౦వ శతాబ్దపు తొలి నాళ్ళ దాకా పదకొండు భాషలలోని రచయిత్రులని కవర్ చేసారు. ప్రస్తుతం నేను పరిచయం చేయబోతున్నది దాని గురించే. (రెండో భాగం నేనింకా చదవలేదు. ఇంకా చేతికి అందలేదు)

ఈ పుస్తకంలో ఏముందో టైటిల్ ని బట్టి ఊహించగలరు కదా. భారత దేశంలో మహిళల రచనా చరిత్ర చెప్పే యత్నం. క్రీ.పూ. ౬౦౦ నాటి నుండి, స్వాతంత్రోద్యమ కాలం నాటి వరకూ పదకొండు భాషలలో వచ్చిన స్త్రీ రచనల ప్రస్తావన ఉంది. ఎంపిక చేసిన దాదాపు డెబ్భై మంది రచయిత్రుల గురించి, వారి రచనల గురించి క్లుప్తంగానే అయినా, సమగ్రంగా పరిచయం చేసారు. పరిచయంతో పాటు, ప్రతి ఒక్కరి రచనల నుండీ ఎంపిక చేసిన ఒకట్రెండింటికి ఆంగ్లానువాదాలు కూడా పొందుపరిచారు. అన్ని అనువాదాలు ఈ పుస్తకం కోసం చేసినవే కాకపోయినా కూడా, ఇందులో ఉన్న శ్రమ తక్కువేమీ కాదని నా ఉద్దేశ్యం. ప్రతి భాషకీ ఒక regional language editor కూడా ఉన్నారు. కనుక, ఇది అనేకులు కలిసి అనేకుల గురించి పరిశోధన చేసి వెలువరించిన సమిష్టి కృషి అని చెప్పవచ్చు. ఇవి కాక, ప్రతి విభాగానికి ముందు నేపథ్యం వివరిస్తూ పరిచయ వ్యాసాలు ఉన్నాయి. ఇవి చదవడానికి నేను కొంచెం కష్టపడ్డాను కానీ, దానికి కారణం అవి నా స్థాయికి మించి ఉండడమే తప్ప సులభగ్రాహ్యం కాకపోవడం కాదు. పుస్తకంలో ప్రస్తావించబడ్డ రచయిత్రుల నేపథ్యాలలోనూ, ఇక్కడ పొందుపరిచిన ఆంగ్లానువాదాల లోనూ, లెక్కలేనంత వైవిధ్యం ఉంది. భక్తీ గేయాలు, వైరాగ్యం మొదలుకుని నిప్పులు చిమ్మే ఫెమినిజం దాకా అన్ని రకాల అంశాలూ వీటిల్లో చోటు చేసుకున్నాయి. ఇది ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన అంశం. అలాగే, ఈ పుస్తకం కోసం సంపాదకులు పడ్డ శ్రమ గురించి ముందుమాటలో వివరించారు. నా మట్టుకు నాకు అది స్పూర్తివంతంగా అనిపించింది. అనువాదాలు కూడా తేలికగానే అర్థం అయ్యేలా ఉన్నాయి.

ఈ అనువాదాల లో నాకు బాగా ఆసక్తి కరంగా అనిపించిన అంశాలు:
౧) తొలినాటి ఆత్మకథల్లో నుండి కొన్ని అంశాలు చాలా ఆసక్తి కరంగా అనిపించాయి. ముఖ్యంగా, గుల్బదన్ బేగం ముఘల్ కాలం నాటి రచన “హుమాయూన్ నామా”, రాససుందరి దేవి “అమార్ జీబన్”, రమాబాయి రనడే, లక్ష్మీ బాయి తిలక్ ల ఆత్మకథల నుండి ఎంపిక చేసిన భాగాలు, సుధా చౌహాన్ సుభద్ర కుమారీ చౌహాన్ దంపతుల గురించి రాసిన అంశం – చాలా కుతూహలం రేకెత్తించేలా ఉన్నాయి. బహుశా ఎటువంటి చరిత్ర పుస్తకంలోనూ కనబడని ఆనాటి ఇంటింటి కథల ద్వారా చాలా సంగతులు తెలుసుకోవచ్చేమో అనిపించింది. వీలువెంబడి, ఇవేవన్నా దొరికితే చదవాలి.

౨) అలాగే, పండిత రమాబాయి సరస్వతి, సావిత్రి బాయి ఫూలే ల గురించి చదువుతూ ఉంటే కూడా నాకు బాగా ఆశ్చర్యంగా అనిపించింది …ముఖ్యంగా రమాబాయి గురించి. ఆ కాలంలో ఇంత పేరు గల మనిషి గురించి అసలుకి నాకేమీ తెలియకపోవడం గురించి కాస్త సిగ్గుగా కూడా అనిపించింది.

౩) నాకు భక్తి కవిత్వం గురించి ఆట్టే ఆసక్తి లేకపోయినా, ఇక్కడ ప్రస్తావించిన రచనలు, వారి పరిచయాలూ చదివాక కొంచెం ఆ మైండ్ సెట్ మారి, కొందరి రచనలన్నా చదవాలి అని నిశ్చయించుకున్నాను. అక్క మహాదేవి తో మొదలుపెట్టాలి అనుకుంటున్నాను. అలాగే, ఇక్కడ ఇచ్చిన కొన్ని అనువాదాల్లో మామూలు పదాల్లోనే గొప్ప భావాలు పలికించినట్లు అనిపించింది. వెంగమాంబ వంటి తెలుగువారి రచనలన్నా తప్పకుండా చదవాలి అని తీర్మానించుకున్నాను. మొక్షోదాయిని మరొక బంగ్లా కవి రాసిన కవితకు ప్రతిగా రాసిన “బంగాలిర్ బాబు” కవితా, దానికి బంకిం బాబు రాసిన వ్యాఖ్యానం చదివాక, ఆవిడ గురించి విపరీతమైన కుతూహలం కలిగినట్లే, ఇలాంటి ప్రతికూల వ్యంగ్య విమర్శలు ఎదుర్కుంటూ వీళ్ళందరూ రాసారా! అని గౌరవ భావం కలిగింది.

౪) అలాగే, కొన్ని కథాంశాలు కూడా చాలా ఆసక్తి కరంగా ఉన్నాయి – అన్నింటికంటే నన్ను బాగా కదిలించిన కథ లలితాంబికా అంతర్జనం రాసిన ప్రతిచారదేవత కథ (ఆంగ్లానువాదం: గాడెస్ ఆఫ్ రివెంజ్). తాత్రి అన్న పేరు నంబూదిరి కుటుంబాల్లో అసలు పలికితేనే పాపం అని అనుకుంటారుట. ఆ తాత్రి రచయిత్రికి కలలో కనబడి తన కథ చెప్పుకోవడం ఈ కథలో వస్తువు. మొత్తం చదివాక ఒక రెండు మూడు రోజులు విపరీతంగా గుర్తొచ్చింది ఆ తాత్రి నాకు.

౫) అలాగే, వ్యాసకర్త పేరు తెలియని ఒక వ్యాసంలో వితంతువుల కష్టాలను వివరిస్తూ రాసింది చదివి వొళ్ళు గగుర్పొడిచింది. తారాబాయి షిండే రాసిన వ్యాసం “స్త్రీ-పురుష తూలన” చదువుతూ ఉంటే నిప్పులు చెరగడం అంటే ఏమిటో అర్థమైంది 🙂

౬) చివరగా, తొలితరం మతం పుచ్చుకున్న వారి కోణంలో, వారి జీవితాల గురించి రాసిన కథాంశాలు కూడా ఆసక్తి కరంగా ఉన్నాయి. దానితో పాటు, పండిత రమాబాయి; లక్ష్మీబాయి తిలక్ వంటి వారు ఈ విషయమై రాసిన వ్యక్తిగత అనుభవాలు – వీళ్ళలో రెండు మతాల జీవన విధానమూ చూసాక రేకెత్తిన ఆలోచనలూ కూడా ఆసక్తికరంగా అనిపించాయి…ఇంకా వివరంగా చదవాలి అనిపించింది.

-ఇలాగ, వివిధ వృత్తుల్లోని స్త్రీలు వివిధ అంశాల గురించి కథ, కవిత, వ్యాసం, నవల ఇలా వివిధ పద్ధతుల్లో రాసినవి చదవడం ఒక మంచి అనుభవం. దీని వల్ల నేను ఎప్పటికన్నా చదవాలి అనుకుంటున్నా పుస్తకాల జాబితా కొన్ని రెట్లు పెరిగినట్లే! ఇంకా చాలా చెప్పవచ్చు ఈ పుస్తకంలో ఉన్న విషయాల గురించి – మరి అన్ని భాషలు, అంత మంది రచయిత్రులు అంటే ఎంత వైవిధ్యం ఉంటుందనీ! ఎంత చెప్పినా ఇంకా ఏదో ఉంటుంది. కానీ, ఇక్కడికి ఆపుతాను.

పుస్తకంలో ప్రస్తావించబడ్డ వారు:
Literature of the Ancient and Medieval Periods:
పాళీ: బౌద్ధ భిక్షువులు (ముత్త, ఉబ్బిరి, సుమంగళ మాత, మెత్తిక)
తమిళం: సంగం కవయిత్రులు (Venmanipputi, Velli Vitiyar, Auvaiyar, Kavar Pentu, Kakkipatiniyar Naccellaiyar, Okkur Macattiyar)
కన్నడ: అక్క మహాదేవి, సులే సుంకవ్వ, సంచియ హొన్నమ్మ
మరాఠీ: జానాబాయి, బహినాబాయి
బంగ్లా: రామి, చంద్రాబతి
గుజరాతి: గంగాసతి, రతన్ బాయి, మీరాబాయి (హిందీ కూడా)
తెలుగు: ఆతుకూరి మొల్ల, ముద్దుపళని, తరిగొండ వెంగమాంబ
పర్షియన్: గుల్ బదన్ బేగం
ఉర్దూ: మహ్లఖా బాయి చందా
వీళ్ళు కాక వివిధ భాషల నుండి ఎవరు సృష్టించారో తెలియని జానపద గీతాల అనువాదాలు ఉన్నాయి ఈ విభాగంలో.

Literature of the Reform and Nationalist Movements:
బంగ్లా: జోగేశ్వరి, భభాని, రాస్సుందరీ దేవి, హన్నా కేథరీన్ ముల్లెన్స్, మొక్షోదాయిని ముఖోపాధ్యాయ, స్వర్ణకుమారి దేవి, శరత్ కుమారి చౌధురాణి, నిరుపమ దేవి, ఆశాపూర్ణ దేబి
మరాఠీ: సావిత్రిభాయి ఫూలే, ముక్తా బాయి, తారాబాయి షిండే, కాశిబాయి కనిత్కర్, రమాబాయి రనడే, బినోదిని దాసీ, లక్ష్మిబాయి తిలక్, బహినాబాయి చౌధురి, ఇందిరా సహస్రబుద్ధే, విభావరి శిరూర్కర్, గీతా సానే
ఆంగ్లం: పండిత రమాబాయి సరస్వతి, కృప సత్తియానందన్, కార్నేలియా సొరాబ్జీ, సరోజినీ నాయుడు, రోఖేయ షెఖావత్ హుసేన్,
తెలుగు: భండారు అచ్చమాంబ, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, దరిశి అన్నపూర్ణమ్మ,
ఉర్దూ: సుగ్రా హుమాయూన్ మిర్జా, జానకి బాయి, నాజర్ సజ్జాద్ హైదర్
కన్నడ: నంజనగుడు తిరుమలాంబ, కళ్యానమ్మ, శ్యామల దేవి, సరస్వతి బాయి రాజ్వడే
మలయాళం: మేరీ జాన్ తొట్టం, లలితాంబిక అంతర్జనం
హిందీ: సుధా చౌహాన్, సుభద్రా కుమారి చౌహాన్, హోమవతీ దేవి, మహాదేవి వర్మ, కమలా చౌదరి
ఒరియా: కుంతలా కుమారి సబట్
వీరు కాక రెండు పేర్లు లేని మరాఠీ వ్యాసాల ఆంగ్లానువాదాలు కూడా ఉన్నాయి ఈ విభాగంలో.

ఇలాగ భాషల వారీగా విభజించుకుని చూసాక నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన అంశాలు రెండున్నాయి – తమిళ రచయిత్రులేవరూ లేరా ఈ కాలాల్లో, సంగం కవయిత్రుల్ని మినహాయిస్తే?? అన్నది ఒకటి. ఆంగ్ల విభాగంలో అంత మంది పేర్లు కనబడడం ఇంకొకటి. అలాగే, ఆట్టే ఆశ్చర్యం అనిపించకపోయినా, ఆసక్తికరంగా అనిపించింది – మరాఠీ, బంగ్లా భాషల్లో అంత మంది రచయిత్రులు ఉండడం. ఒక భాష అంటూ ఎంచుకున్నాక అందులో రాసిన సమస్త రచయిత్రులని కవర్ చేయాలని ఏమీ లేదు. ఈ విషయం గురించి ముందుమాటలో కొంత ప్రస్తావించారు – కొంతమంది గురించి ఎందుకు తీసేశాము, కొంతమందిని ఎందుకు చేర్చలేదు అని. అయినా కూడా, ఈ పదకొండు భాషల్లోని రచయిత్రుల గురించీ ఇక్కడ రాయని వారి పేర్లు ప్రస్తావిస్తూ ఒక చిన్న పరిచయ వ్యాసం కూడా ఉండి ఉంటే ఈ పుస్తకం మరింత సమగ్రంగా ఉండేది అనిపించింది. అలాగే, నాకు ఈ పుస్తకంలో పరిచయాలు జన్మతేదీల వరుసలో కాక, భాషల వారీగా ముందు విభజించి దానిలో జన్మతేదీల వారీగా వేసి ఉంటే బాగుండేది ఏమో అనిపించింది.

ఎలాగైనా, మీకు గానీ దొరికే అవకాశం ఉంటే తప్పకుండా చదవాల్సిన పుస్తకం. వ్యక్తిగతంగా, నన్ను బాగా ఆకట్టుకున్న పుస్తకం. వీలు, అనుమతులు దొరకదాన్ని బట్టి ఈ పుస్తకం ముందుమాటనైనా ఇక్కడ పుస్తకం.నెట్ లో పెట్టడానికి వీలు అవుతుందేమో ప్రయత్నిస్తాను (దాన్ని గూగుల్ ప్రీవ్యూలో చదవవచ్చు).

 
పుస్తకం వివరాలు:
Women writing in India 600 B.C. to the present
Volume 1: 600 B.C. to the early 20th Century
Editors: Susie Tharu, K.Lalitha
Publishers: The Feminist Press, The City University of Newyork, Newyork
Year: 1991
Google books preview Here.
Flipkart Link here.

You Might Also Like

5 Comments

  1. ఏల్చూరి మురళీధరరావు

    సమీక్షా విషయసంగ్రహం చాలా బాగుంది.

    క్రీ.పూ. ౬౦౦ నుంచి అన్నారు కాబట్టి – అందులో సంస్కృతంలో శీలా భట్టారిక, వాచక్నవి, విజ్జుల;

    దేశంలో స్త్రీ విద్య వెనుకబడక మునుపు – క్రీ.శ. ౨-వ శతాబ్దికి పూర్వం – ప్రాకృతంలో కృషిచేసిన అణులక్ష్మి, వహయీ, మాధవి, రేవ, ససిస్సహ మొదలైన కవయిత్రుల గుఱించి చెప్పారో? లేదో?

    ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి “ఆంధ్ర రచయిత్రులు” ప్రాతిపదికంగా ఆ తర్వాత ఆండ్ర శేషగిరిరావు గారు “ఆంధ్ర మహిళామణులు” లో కొంత మంచి కృషిచేశారు. వారికంటె మానవల్లి రామకృష్ణకవి గారు ఎన్నో మౌలికమైన ఆకరాలను గతశతాబ్ది ప్రథమపాదంలోనే Bihar Historical Research Journal మొదలైనవాటిలో ప్రకటించారు. అవన్నీ సమగ్రంగా సంపుటీకరింపబడక పోవటం వల్ల కాలయవనిక వెనుక మఱుగునపడి పోతున్నాయి.

    తెలుగులోనూ క్రీ.శ. ౧౦౦౦ నాటి గూడూరు శాసన కవయిత్రి విరియాల కామసాని (“అనుపమదుర్జయాన్వయసుధాబ్ధి ననేకులు రాజనందనుల్, సనిన బొరంటి వెన్నఁ డనుసంభవుఁ డయ్యె” ఇత్యాది శైలి) – మొదలైన వారున్నారు. మహిళా కవులు చెప్పిన చాటువు లున్నాయి. కావ్యకర్త్రిగా తాళ్ళపాక తిమ్మక్క పేరు లేకపోవటం సమంజసమే.

    పైని పేర్కొన్న కవయిత్రుల వస్తుస్వీకరణ, దృష్టికోణం, పదసంపద – పరిశీలనీయాలు.

    1. సౌమ్య

      మురళీధర రావు గారికి:
      పైన వ్యాసంలో ఇచ్చిన లిస్టులో వారు తప్ప ఆ కాలాల వారు ఇంకెవరూ ఈ పుస్తకంలో లేరు. మీరు అందిన రిఫరెన్సులకి ధన్యవాదాలు. ఏవన్నా చదివేందుకు దొరుకుతాయేమో చూస్తాను. లక్ష్మీకాంతమ్మ గారి పుస్తకం అయితే అర్కైవ్.ఆర్గ్ సైటులో ఉంది.

    2. ఏల్చూరి మురళీధరరావు

      ప్రాకర నిర్దేశంలో పొరపాటుకు క్షమించాలి: శ్రీ ఆండ్ర శేషగిరిరావు గారి గ్రంథం “ఆంధ్ర విదుషీమణులు” – “మహిళామణులు” కాదు.

    3. ఏల్చూరి మురళీధరరావు

      జర్మనీలోనే ఉన్నారు కాబట్టి, మహావిద్వాంసుడు వెబర్ పరిష్కరించిన “Saptaçâatakam des Hâla “లో ప్రాకృత కవయిత్రుల వివరాలు కొన్ని ఉన్నాయి – చూడండి. మహామహులు, ఋషితుల్యులు Jan Gonda గారి సంపాదకత్వంలో వెలువడిన Siegfried Lienhard గారి A History of Indian Literature (Volume III) లోనూ; ఆ పరంపరలోని Jan Gonda గారి తక్కిన సంపుటాలలోనూ కొందరు కొందరు కవయిత్రుల కొన్ని కొన్ని వివరాలను పేర్కొనటం కనుపిస్తుంది, చూడండి.

      అటువంటి సర్వాంగీణమైన వాఙ్మయచరిత్ర తెలుగులో ఉంటే ఎంత బాగుండును!

  2. తృష్ణ

    ఆసక్తికరంగా ఉంది పుస్తకం. మంచి పుస్తకం గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.

Leave a Reply