కాశీభట్ల వేణుగోపాల్ రచన ‘నికషం’

వ్రాసిన వారు: ఎ.ఎస్.శివశంకర్
********
కాశీభట్ల వేణు నాకిష్టమైన రచయితలలో ఒకరు. ఈయన రాసిన అన్ని కథలూ, నవలలూ చదివాను. ‘In search of unknown you’ అన్నట్టు, ఈయన రచనలలో ఏదో ఒక చోట తనని తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తూన్నట్టు కనిపిస్తుంది. జీవితానికి అర్థం యేమిటి? సమాజానికి మనిషి ఆలోచనలకి మధ్య గల నిర్మాణం ఎంత వరకు నిజం, ఎంత బలమైనదో, ఎంత బలహీనమైనదో అన్న విషయ పరిశీలన, తెలుసుకోవాలనే తపన స్పష్టంగా కనబరుస్తారు. ఈయనకి భాష మీద మంచి పట్టు ఉంది. సంగీతం ఎరిగిన వారు, సంస్కృతం తెలిసిన వారు. ఈయన రచనల్లో నన్ను బాగా ఆకట్టుకున్న విషయాలు తత్వ విచారణ, సౌందర్యాన్వేషణ.

అదే కోవకు చెందినదే ఈయన కొత్త రచన ‘నికషం’. నికషం అంటే ఏమిటో అని అర్థం Dictionary వెతుక్కొని చదవటం మొదలు పెట్టాను. నికషం అంటే ‘గీటురాయి’.

“నీతీ..
నియమం…
మంచీ…
చెడూ..
ఒక మనోహర భ్రమ, కాంక్షగా రూపాంతరం చెందితే …చర్మం కింద ప్రవహిస్తూన్న ఓ విద్యుత్తరంగం కాంక్షను కొన్నివేల శకలాలుగా ఛిద్రం చేస్తే…
కాంతినీ, కాంతి రాహిత్యాన్ని కొలుచుకునేందుకు శూన్యాకాశ పలకమ్మీద రుద్ది…
బంగారాన్నీ
కాకి బంగారాన్నీ
దాన్నీ దీన్నీ…దేనికై దాన్ని విడివిడిగా చూపేందుకు గీచే నికషం అబద్దాలని అలవోకగా ఆడినప్పుడు.
ఏది గీటురాయి?
ఏది సక్రమం?
ఏది క్రమం?
మిథ్యా న్యాయాల మధ్య చిక్కు పడ్డ ఏకాంతం..బిక్కుబిక్కు మంటూ దొంగగా మిగిలినట్టు…”

-అనే వాక్యాలతో మొదలవుతుంది. కధలో ముగ్గురు స్నేహితులు ఉంటారు. అందులో ముఖ్య పాత్ర ‘అలెక్స్ రామసూరిది’. ఈయన పుట్టుకతో అనాథ. ఇతనికి ఒళ్ళంతా బొల్లి. గొప్ప చిత్రకారుడు. గొప్ప భావికుడు. అతని జీవితంతో, లోకంతో, శరీరంతో, అలెక్స్ నిత్య అంతర్ యుద్ధం చేస్తూ ఉంటాడు. మిగతా ఇద్దరూ దుర్గ, కథకుడు. వీరు అలెక్స్ కి మంచి స్నేహితులు. కధ అంతా అలెక్స్ జీవితం మరియు ఆతని ఆలోచనల వరవడితో ముడిపడి అల్లుకొని ఉంటుంది. రచయిత తన తత్వ విచారణ కథకుడి ద్వారా తెలియపరుస్తూ ఉన్నట్టు నాకు అనిపించింది. కథలో ప్రతీ వాక్యం మెదడుకి పని పెట్టి మనస్సుతో అలోచింప జేసాయి. మచ్చుకి ఈ క్రింది వాక్యాలు.

ఉలిపికట్టె మనిషిని, ఉలిపికట్టెగా మిగల్నీని సమాజం…వాడిని అనుక్షణం నిఘా చూపుల క్రింద నిలుపుకుంటుంది.
ఎవడు అసలైన మనిషి..
చర్మం కింద మనిషీ.. ఆలోచనల్లో మనిషీ…
ఇద్దరూ బాహాబాహీయై పైకీ క్రిందకీ అనుక్షణం స్థానాలు మార్చుకుంటారంతే..
ఎవడు ఎవడూ? అసలైన మనిషి?
చర్మం కింద వాడా అలోచనల్లో వాడా?
ఎవడైనా సరే కొలబద్దలేని ఈ సమాజం దగ్గర? తూచే బరువులేవి?
అసలైన మనిషి రూపు రేఖలేవి?
అనుక్షణం అలెక్స్ లాగా తనను తాను చెరిపేసుకుంటూ ఈ వెర్రి సమాజానికి దొరక్కుండా, దాన్ని యెప్పటికప్పుడు వెక్కిరిస్తూ అసలు అలెక్స్ నిజ స్వరూపమేది?
అలాంటి వాళ్ళని చిత్రించే కుంచలేవి..రంగు లేవి? క్యాన్వాస్లేవి?
ఏది ? ఏది అసలైన నికషోపలం?

కధలో చాలా మట్టుకు రచయిత మంచి భావుకుడు అని తన వర్ణన తీరును బట్టి తెలుసుకోవచ్చు.

“అక్కడ ప్రతీ ప్రదోష సంధ్యా ఒక అద్భుత కావ్యమే..
నిజానికి ఈ అంతులేని కాలంలో ఈ మహా సృష్టిలో ఎన్నెన్ని అద్భుతాలో..
అద్భుతాల పురా సంధ్యలో! ఎన్నెన్ని కోట్ల భవిష్యత్సంధ్యలో!
ప్రతీ సంధ్యా…. నవ్యం!
దివ్యం!
భవ్యం!
కాలాన్ని గుండెలనిండా పీల్చుకొనే ప్రయత్నం చేసా.. ప్రాణాయామం..
అనులోమ శ్వాస ప్రభాత సంధ్య ప్రత్యనులోమం మధ్యాహ్న సంధ్య విలోమ స్వాస ప్రదోష సంధ్య….
మొత్తం జీవితాన్ని కుదుంచి ఈ సాయంత్రం గా మార్చి ఘన్నీభవించాలని వెర్రికామన…”

అక్కడక్కడ కొన్ని వెగటు వాక్యాలు, కథకుడి వెగటు అలోచనలు పాఠకుడిని కొంచెం ఇబ్బంది పెడతాయని నేను అనుంటున్నాను. ఇది ఒక Psycho Analysis Story లా నాకు అనిపించిది. అలాంటి కథలని తత్వంతో పొందు పరచి, దానిని ఒక క్రమంగా పాఠకుడికి తెలియపరచటం చాలా కష్టతరమైన విషయమే మరి. కాశీభట్ల వేణు ఇందులో నిష్ణాతులనే చెప్పుకోవచ్చును. కథలో చాలా మట్టుకి వాడిన English పదాలకు తప్పని సరిగా Dictionary పక్కన పెట్టుకో వలసిందే మరి. కథలో ఆఖరి భాగంలో కథకుడికి అలెక్స్ గదిలో తాను సగం కాల్చేసిన డైరీ దొరుకుతుంది. నాకు ఈ భాగాన్ని అర్ధం చేసుకోవటానికి చాలా టైం పట్టింది.

కథ చివరి భాగం ఈ క్రింది వాక్యాలతో కొనసాగుతుంది.

“ఈ ప్రపంచంలో అందరూ ఎవరెవరి స్వార్ధంతో వాళ్ళ వాళ్ళ కోసం బ్రతుకుతోంటే… కనీసం తనకోసం తను కూడా బ్రతకలేక ఏవో దూరతీరాలకు వెళ్ళీపోయిన మా ప్రియుడు బొల్లిముండాకొడుకు.
చెడ్డవాడా? మంచివాడా?
ఏది గీటురాయి …ఒరగల్లు…నికషం ?”

ఎందుకో ఈ పుస్తకం పూర్తి అయ్యాక శివ నిర్వాణాష్టకం గుర్తుకు వచ్చింది.

న మే ధ్వేషరాగౌ న మే లోభమోహౌ
మధో నైవ మే నైవ మాత్సర్యభావహ్
న ధర్మో న చర్థొ న కామో న మోక్షహ్
చిదానందరూప శివోహం శివోహం.
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఖ్యం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానందరూప శివోహం శివోహం.

పుస్తకం చదవడం ముగించేక నా మనస్సు చాలా ప్రశ్నలతో బరువెక్కింది. మనస్సు నిజ స్వరూపన్ని తెలిపే నిజమైన గీటురాయి ఏది అని అనుకున్నాను. నిజమే మనస్సు కి మంచీ చెడూ ఉండవు ఒక్క బుద్ది లేదా విచక్షణ కి మాత్రమే అది వర్తిస్తుంది అనుకుంటాను. పుస్తకం చివర్లో తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి గారి, డా.చంద్రశేఖరరావు గారి విమర్శలు, పరిశీలనలు చాలా బాగున్నాయి. తెలుగులో కాశీభ్ట్ల వేణు లాంటి తత్వ విచారణ జరిపే రచయితలు అరుదు. ఈ పుస్తకం కూడా ఆయన రాసిన ముందు పుస్తకాల కోవకే చెందుతుంది అనుకుంటాను.

పుస్తకం వివరాలు:
Navodaya Publishers
Karlmarx Road, Vijayawada-2, Ph: 0866-2573500
Online: Kinge.com

కాశీభట్ల గారి ఇతర నవలల సమీక్షలు తృష్ణ గారి బ్లాగులో: తపన, దిగంతం.
“నేనూ-చీకటీ” గురించి ఇదివరలో పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇదిగో.

You Might Also Like

5 Comments

  1. SEKHAR

    నికషం పై శివ శంకర్ గారు వ్రాసినది పరిచయమో వ్యాసమో సమీక్షో అర్థం కాలేదు. జీవితమొక ICEBERG. ఈ ప్రపంచం గురించి మనకు తెలిసింది గోరంత. జీవితం అనేక పొరలుగా కుహరాలుగా ఉండే వెలుగు చీకట్ల దోబూచులాటల సమాహారం. వొక “X” ను చూడగానే మన మదిలో మనం చేసే తూలికే ప్రపంచంలోని అనేక అనర్థాలకు కారణం.

    ఏ ఒక్కరి జీవితంలోని ఏ ఒక్క క్షణాన్నైనా కనిపెట్టగలిగిన, నిర్ధారించ గలిగిన గీటు రాయి ఏదీ?

    ALEXKAFKARAMASURIBAZAROVKOMPELLAJANARDHANARAO లు ఎంతమందో?

    రచనకూ జీవితానికీ మధ్యన ఉన్న సంబంధాన్ని జీవితాన్ని పేలవంగానైనా పట్టుకోగలిగిన రచనలనీ విజ్ఞులైన చదువరులు పాఠకులకు సరిగ్ఘా పరిచయం చేస్తే కాశీభట్ల, చంద్రశేఖర్ రావు, చండీదాస్, కాఫ్కాలు తెలుగు పాఠకులకు ఇంకొంచం దగ్గరవుతారు.

    Sekhar

  2. నేనూ, పుస్తకాలూ, రెండువేలపన్నెండూ … | పుస్తకం

    […] కొన్ని పరిచయాలు/ఆలోచనలు ఇక్కడ.. పుస్తకం.నెట్లొ , తృష్ణవెంట బ్లాగులో మరియు […]

  3. srikanth

    most of the telugu books are available in

    http://www.logili.com

    thank you

  4. తృష్ణ

    ఈ పుస్తకం కొనుక్కుని చదవగానే బ్లాగ్ కోసం నే రాసిన టపా పొరపాటున డిలీట్ అయిపోయింది… మళ్ళీ ఆలోచనలన్నీ సమీకరించుకుని రాసే ప్రయత్నంలో ఉండగా మీ వ్యాసం ఇవాళ చూసాను.
    నా బ్లాగ్ పోస్ట్ లింక్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  5. chavakiran

    I almost agree with almost every-word of this review 🙂

Leave a Reply