Deep Focus – Reflections on Cinema
“డీప్ ఫోకస్” – సత్యజిత్ రాయ్ సినిమా వ్యాసాల సంకలనం. వాళ్ళబ్బాయి సందీప్ రాయ్ సంపాదకత్వంలో గత ఏడాదే విడుదలైంది. సినిమాలు తీయడం మొదలుపెట్టక ముందు నుంచీ సత్యజిత్ రాయ్ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలు అన్నీ కూర్చి తయారు చేసిన పుస్తకం. వ్యాసాలే కాక, రాయ్ తన చిత్రాల కోసం రూపొందించిన పోస్టర్లు, ఆయన గీసిన ప్రపంచ సినీ ప్రముఖుల చిత్రాలూ – ఇవన్నీ పుస్తకంలో బోనస్. క్లుప్తంగా పుస్తకంలోని విషయం ఇదీ. ఇక వివరాల్లోకి వెళ్తే:
పుస్తకం మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగం మొత్తం – “The Film Makers Craft” పేరిట, సినిమా రంగంలోని వివిధ అంశాల గురించి రాయ్ అభిప్రాయాలు, విమర్శలు, పరిశీలనలు వగైరా కలిసిన వ్యాసాలు. రెండో విభాగం “Pen Portraits” తను అభిమానించే కొందరు సినీ ప్రముఖుల గురించి రాయ్ రేఖా చిత్రాలు – పరిశీలనలు. మూడో భాగం “Celebrating Cinema” దేశీయ-విదేశీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ గురించి రాయ్ అభిప్రాయాలు-అనుభవాలు. వీటన్నింటికీ ముందు శ్యాం బెనెగల్ రాయ్ పట్ల తనకి గల అభిమానాన్ని ఏమాత్రం దాచుకోకుండా రాసిన ముందుమాట. చివ్వర్లో రాయ్ సినిమాల జాబితా-వివరాలు, ఆయన అందుకున్న అవార్డులు, రివార్డులూ గట్రా.
మొదటి భాగంలో వ్యాసాలు చాలా మట్టుకు విదేశీ, స్వదేశీ చలన చిత్ర రంగాల గురించి; తన సినిమాలు తీస్తున్నప్పటి అనుభవాల గురించీ; సినిమాలు తీసే విధానం గురించీ ఉన్నాయి. అక్కడక్కడా కురోసవా, టాగోర్, జాన్ ఫోర్డ్, ఐజెంస్తీన్ (ఈయనవి రెండు వేర్వేరు రకాలుగా గీసిన స్కెచ్ లు ఉన్నాయి) వంటి వారి స్కెచ్ లు, అలాగే వివిధ రాయ్ సినిమాల పబ్లిసిటీ డిజైన్లూ చాలా బాగున్నాయి.
“Should a film maker be original?” అన్న వ్యాసం ఈ విభాగంలో నాకు బాగా నచ్చిన వ్యాసాల్లో ఒకటి. రాయ్ తను రాసిన కథలతోనే కాక, ఇతరుల కథలతో కూడా చాలా సినిమాలు తీసారు కనుక, ఈ విషయంలో ఆయన అభిప్రాయం ఊహించడం అట్టే కష్టం కాదు. అయితే, దర్శకుడి సృజనాత్మకత ఎక్కడ బయటపడుతుందో చెబుతూ అడిగిన –
“if the film makers do not contribute an original story or an idea, what do they contribute? Well, one may just as well ask: what did Shakespeare contribute in Hamlet or Kalidasa in Shakuntala? Or, what was the contribution of the Vaishnava poets, who had only one basic situation to write their verses on – Krishna’s love for Radha?”
అన్న ప్రశ్నలోనే జవాబు లేదూ? అలాగే, పుస్తకాలని చిత్రాలుగా తీస్తున్నప్పుడు జరిగే “reshaping” గురించి రాసిన అంశాలు కూడా ఆసక్తికరంగా అనిపించాయి. సినిమా తీయడంలో సాంకేతిక అభివృద్ధి వల్ల వచ్చిన మార్పుల గురించి రాసిన “All these devices” వ్యాసం కూడా ఆసక్తికరంగా అనిపించింది.
“The question of reality” వ్యాసంలో నాకు ఒక పట్టాన ఏం చెప్పదలచుకున్నారో అర్థం కాలేదు.
“The sharpest revelations of the truth in cinema come from the details perceived through the eyes of the artists. It is the sensitive artist’s subjective approach to reality that ultimately matters, and this is true as much of documentaries as of fiction films. Details can make both of them real, in the same way and to the same degree, while lack of details can turn both in to dead matter inspite of all the verisimilitude that camera and microphone can impart.”
-అన్నారు వ్యాసం చివర్లో. రాయ్ కి ఈ డీటెయిల్స్ విషయంలో పట్టింపు గురించి ఇదివరలో కొన్ని వ్యాసాలు చదివేసరికి అర్థమైంది కానీ, కేవలం డీటెయిల్స్ వల్ల వాస్తవికత వచ్చేస్తుందా? పైగా, అంత నిశితంగా సగటు ప్రేక్షకుడు అసలు గమనిస్తాడా? అని సందేహం కలిగింది.
పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థుల స్నాతకోత్సవం లో చేసిన ప్రసంగం – “A film must achieve its objective” కూడా ఈ సంకలనం లో నాకు బాగా నచ్చిన వ్యాసాల్లో ఒకటి. మన దేశంలో దర్శకుడిగా నిలదోక్కుకోవడంలోని సాధక బాధకాలు, నేర్చుకునే విషయాలూ – వంటివి ఈ ప్రసంగంలో ముఖ్యాంశాలు. భారతీయ నిశబ్ద చిత్రాల గురించి రాసిన “I wish I could have shown them to you”, నిశబ్ద చిత్రాల యుగం గురించి రాసిన “The Art of Silence” -రెండు వ్యాసాలూ చాలా ఆసక్తి కరంగా అనిపించాయి. “New Cinema and I” వ్యాసంలో అప్పటి సమకాలీన భారతీయ భాషా చిత్రాలపై రాయ్ అభిప్రాయాలు కనిపిస్తాయి. “Our Films-Their Films” సంకలనంలో ఇంతకంటే వివరంగానే రాసారు కనుక, ఈ వ్యాసం అంత ప్రత్యేకంగా అనిపించలేదు కానీ – ఈ క్రింది వాక్యం చదివాక, ఇప్పుడు వస్తున్న సినిమాలు చూసి రాయ్ ఏమంటారో అని కుతూహలం కలిగింది:
“…..films from Madras which are openly outlandish and escapist.”
-మరి అప్పుడే అలా అంటే…ఇప్పుడు వస్తున్న తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు చూస్తే ఏమనే వాళ్ళో! ఇంతకీ, నాకు ఏ సినిమాతోనూ ఏ సమస్యా లేదు కానీ, ఒక్కొక్కమాటు ఆట్టే విమర్శనా దృష్టి లేకపోవడం వల్ల ప్రపంచంలో ఎన్ని ఎంజాయ్ చేయొచ్చో కదా అనిపించింది మళ్ళీ! ఇలాంటిదే – అజ్ఞానం ఎంత హాయో కదా అన్న భావన దీని తర్వాతి వ్యాసం, పుస్తకంలో అన్నింటికంటే పెద్ద వ్యాసమూ అయిన “Under Western Eyes” చదివినప్పుడు కలిగింది.
“Pen Potraits” విభాగంలో Godard, Antonioni, Uttam Kumar, Ingmar Bergman, Chaplin ల గురించి చిన్న చిన్న వ్యాసాలు ఉన్నాయి. గోడార్డ్ గురించి రాసిన వ్యాసం సరిగ్గా రాయ్ శైలిలో – నిశిత పరిశీలన, సూటిగా తేలిగ్గా అర్థమయ్యే శైలి, అనవసర ప్రసంగం ఏదీ లేకుండా : “Our Films Their Films” వ్యాసాలని గుర్తుకు తెచ్చింది (ఎటొచ్చీ వ్యాసం లో రాయ్ గీసిన పికాసో స్కెచ్ ని పెట్టడమే అసంబద్ధంగా అనిపించింది). బెర్గ్మాన్ గురించి ఇంకాస్త వివరంగా రాసి ఉంటే బాగుండు అనిపించింది. ఉత్తమ్ కుమార్ గురించి రాసిన వ్యాసం నాకు అతని గురించి కుతూహలం కలిగించింది. ఆరోజే “నాయక్” చూడలనుకున్నా, ఇంకా చూడలేదన్నది వేరే విషయం! ఈ వ్యాసంలోనే ఒక చోట రాయ్ అన్న మాట (ఇదే మాట ఇంతకుముందు కూడా రాసారు ఏదో వ్యాసంలో) మరొక్కసారి నాకు నచ్చింది:
“I found out early on that he belonged to the breed of instinctive actors. I have worked with the other kind too, the cerebral one, the one that likes to take a part to pieces and probe in to background, motivations etc., in order to “get beneath the skin of the character”. But the fact is, there is no guarantee that a cerebral actor will make a more substantial contribution than an instinctive one”.
ఇక మూడో భాగం: ఫిల్మ్ ఫెస్టివల్స్ గురించి రాసిన వ్యాసాల్లో మాస్కో పర్యటన గురించి రాసిన వ్యాసం (రచనా కాలం: ౧౯౬౩) ఆసక్తి కరంగా అనిపించింది. ముఖ్యంగా, ఎయిర్పోర్ట్ లో దిగాక రాయ్ దంపతులకి కలిగిన అనుభవాలు. వాళ్ళని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకువెళ్ళడానికి వచ్చిన టాక్సీ డ్రైవర్ ఉదంతం ఆశ్చర్యం కలిగించింది. నాకే కాదు, రాయ్ కి కూడా. అందుకే : “I tried to envisage an equivalent situation in India where top ranking Indian film workers would be transporting foreign film delegates from airports to hotels, and found it difficult.” అని వ్రాసారు :-). మరొక వ్యాసంలో వివిధ ప్రాంతాల్లో ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎలా జరుగుతాయో రాసారు (రచనాకాలం: ౧౯౭౪). ఈ సందర్భంగా వచ్చే ప్రేక్షకుల స్పందనల గురించి రాసిన అనుభవాలు ఆసక్తికరంగా అనిపించాయి.
“Each of the four or five major film festivals in Europe is marked by its own unique brand of audience. In Moscow, they are polite to the point where they will not only sit through almost anything without a murmur, but applaud heartily at the end. In Berlin, while the rest of the audience observes decorum, a small group at the back will keep hurling invectives at whatever unfolds on the screen. In Venice, if a film is not liked, the audience will pulverize the film maker with their boos and cat calls. These go on throughout the screening, reaching a bloodcurdling pitch the moment the spotlight is turned on the director at the end. Since he is already bowed in abject misery, there is no question of the director taking a bow”
చివరగా, మన దేశంలో జరిగే చలన చిత్రోత్సవాలని, విదేశీ చలన చిత్రోత్సవాల్నీ పోలుస్తూ రాసిన వ్యాసం ఒకటుంది (రచనా కాలం: ౧౯౮౨). ఇందులో చాలా వరకూ రాయ్ కి వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఎదురైన అనుభవాలనే మళ్ళీ రాసినట్లు అనిపించినా (ముందు వ్యాసానికి ఇది రెండో భాగంలా అనిపించింది నాకు), చివ్వర్లో మాత్రం ఒక్క ముక్క అంటారు మన దేశంలో జరిగే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇచ్చే “గోల్డెన్ పీకాక్” గురించి:
“Let’s face it, it simply does not have the same prestige or utility as the grand prizes offered by Berlin, Cannes, Venice and Moscow. A top award from any of these major festivals adds greatly to a film’s market value; the Peacock doesn’t. What’s more, the entries in the competitive section on New Delhi are usually of a substandard quality. This may on occasion apply to some of the major festivals as well; but isn’t it obvious that India being no market for European films, foreign producers are unlikely to earmark their worthier products for New Delhi?”
పుస్తకంలో నాకు నచ్చని అంశాలు లేకపోలేదు. ఉదా – నేను రాయ్ కి వీరాభిమానినే అయినా కూడా, అక్కడక్కడా ఆయన వ్యక్తపరచిన అభిప్రాయాలు నాకంత నచ్చలేదు. కొన్ని చోట్ల, మరీ ఆత్మకథ లాగా కూడా అనిపించింది. అంటే, సినిమా గురించి కాకుండా, తనకి ఎదురైన అనుభవాల గురించి రాసిన భాగాలు. ఇది నాకు నచ్చలేదని కాదు. నేను బాగా ఆసక్తితో చదివినది ఈ స్వీయ అనుభవాలనే. కానీ, పుస్తకం పేరు చూసి నేను ఇందులో ఈ వ్యాసాలు ఊహించలేదంతే. (అందులో చాలా లోతుంది. నీకే అర్థం కాలేదు – అనే వాళ్లకి నేను చెప్పేదేమీ లేదు. కామోసు అని అనుకోవడం తప్ప). ఈ పుస్తకం కూర్పు కూడా ఇంకా బాగా ఉండి ఉండవచ్చు అనిపించింది.
మొత్తానికి పుస్తకంలోని వ్యాసాలు చాలా వరకు నాకు మంచి పఠనానుభూతిని కలిగించాయనే చెప్పాలి. అయితే, ఇదివరలో చదివిన రాయ్ సినిమా వ్యాసాలు -“Our films, their films” గానీ, పిల్లల కోసం రాసిన “Making Films” గానీ అనిపించినంత గొప్పగా అనిపించలేదు. కనీసం నాకు వ్యక్తిగతంగా ఆ సంకలనాల లోని వ్యాసాలు నిశితమైన పరిశీలన గలవి గానూ, అదే సమయంలో తేలిగ్గా అర్థమయ్యేలాగానూ ఉన్నట్లు అనిపించాయి. ఈ ప్రస్తుత సంకలనం రాయ్ కూర్చినది కాకపోవడం కొట్టొచ్చినట్లు కనబడే లోటు (నా అభిప్రాయంలో). కేవలం ఆయన రాసారు – అవన్నీ మళ్ళీ ప్రింటులో ఉండాలి అన్న కారణంతో దొరికినవన్నీ చేర్చేసారా? అనిపించింది. అయితే, ఈ అసంతృప్తి తో కూడా నా ఉద్దేశ్యంలో ఈ పుస్తకం రాయ్ అభిమానులు తప్పకుండా కొనవలసిన పుస్తకం అనిపించింది – ఎందుకంటే, రాయ్ గీసిన చిత్రాలు, రూపొందించిన పోస్టర్లూ అద్భుతంగా ఉన్నాయి కనుక. అలాగే, షూటింగ్ సమయాల్లో తీసిన ఫోటోలు కూడా కొన్ని జతచేశారు. చాలా బాగున్నాయి.
పుస్తకం వివరాలు:
Deep Focus: Reflections on Cinema
Satyajit Ray (Edited by Sandip Ray)
Published by: Society for the preservation of Satyajit Ray films, 2011
Rs 450/-
Satyajit Ray’s Ghar-Bhaire « sowmyawrites ….
[…] out of it again in “Should a Film Maker be Original?” (Filmfare 1959, Republished in Deep Focus). Although I loved reading both the essays, it is only now after watching “Ghar-Bhaire” […]