టీచరు: కథ – కమామిషు

వ్రాసిన వారు: దేవినేని మధుసూధనరావు గారు
********
శ్రీ కత్తి నరసింహారెడ్డి సంపాదకత్వంలో వెలువడిన “టీచరు: కథ – కమామిషు” అనే పుస్తకం రెండు కాపీలు నా స్నేహితులు శ్రీ సాకం నాగరాజ మరియు శ్రీ కోట పురుషోత్తం నాకు అందచేసారు.

పుస్తకాలు వచ్చిన వెంటనే చదవటం ప్రారంభించాను. ఆశ్చర్యం, సంతోషం. ఒక్క బిగిన చాలా కథలు, వ్యాసాలు చదివాను. ఇంత మంచి పుస్తకం, అందునా ఉపాధ్యాయులను ఉత్తేజపరిచే పుస్తకం ప్రచురించిన శ్రీ కత్తి నరసింహారెడ్డి గారికి ఉపాధ్యాయలోకం ఋణపడివుంటుంది. ఈ మాటే ఆయనకు ఫోన్ చేసి చెప్పి, ఓ వంద కాపీలు వెంటనే పంపించమని కోరాను. ఆసక్తివున్న మిత్రులందరికీ ఈ పుస్తకాన్ని పంచాలని నా కోరిక.

ఇది ప్రతి టీచరూ చదవాల్సిన పుస్తకం. ఇందులోని కథలూ, వ్యాసాలు వారిని ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. సామాజిక స్పృహవున్న ప్రతివారు చదవాల్సిన పుస్తకమిది. ఈ పుస్తకంలో కొన్ని తీసివేసి, మరికొన్ని మంచి వాటిని జతపరిచి, ధర కూడా ప్రతి టీచరూ కొనగలిగినవిధంగా తగ్గించి రెండవ ఎడిషన్ విడుదలచేస్తే బాగుంటుంది.

ఫుస్తకం చదువుతున్నపుడే కథలకీ, వ్యాసాలకీ స్టార్ రేటింగ్ ఇచ్చేసుకున్నా. కొన్ని కథలు, వ్యాసాల గురించి నా అభిప్రాయం. బాపుగారంటే బొమ్మలే గీస్తారు కాని వారు రాస్తారా అని చాలమంది అనుకుంటారు. వారు మంచి రచయిత కూడా అని వారి “గాడ్ ఫాదర్ గురించి కాస్త” వ్యాసం చదివితే అవగతం అవుతుంది. ఈ వ్యాసం చాలా చక్కగావుంది. దీన్ని నేనిదివరకే చదివాను. కానీ దానిని యిప్పుడు ఈ పుస్తకంలో బాగా ఎంజాయ్ చేశా. మనసారా నవ్వుకున్నాను. డా. వెల్చేరు నారాయణరావు గారి వ్యాసం “సామాజిక…” టీచర్లందరినీ ఆలోచింపచేసేదిగా వుంది. పిల్లల మనస్తత్వాన్ని చక్కగా విశదీకరించారు. అలాగే గెద్దాడ కస్తూరి గారి “మాస్టారి కో శిక్ష” లో కూడా పిల్లల మనస్తత్వాన్ని చక్కగా తెలియచేశారు. పిల్లలను శిక్షించినవారు చివరకు ఏవిధంగా తయారవుతారో తెలియచేసే కథ ఇది. అబ్దుల్ కలాం గారి ఆత్మకథనుండి ఎంచుకున్న వ్యాసం ముఖ్యంగా ఇంజినీరింగ్ కళాశాల టీచర్లకు కనువిప్పు కల్గిస్తుంది. సింగమనేని నారాయణ గారి కథ “తరగతిలో తల్లి” అద్భుతం. పిల్లలను ఏవిధంగా ఆకట్టుకోవాలో తెలియచేసే కథ. ప్రతి టీచరూ, ఎప్పుడూ గుర్తుండేలా ప్రతిరోజూ చదవాల్సిన కథ యిది. బిడ్డలెలావుండాలో చెప్పిన ఉత్తరం “అబ్రహాం లింకన్ వారి పిల్లవాని టీచర్ కు రాసిన ఉత్తరం”. దీనిని “ఉపాధ్యాయునికి పిల్లలకు ఎలా నేర్పాలో” అని హెడ్డింగ్ మార్చితే బాగుంటుంది. ఇది యిప్పటికే చాలాచోట్ల ప్రచురితమైంది. ప్రతి టీచరూ చదవాల్సిన ఉత్తరం. లింకన్ టీచర్లకు చక్కని బోధ చేశారు. టీచర్లు పిల్లలతో ఎలా వుండాలో, వారికి చదువెలా నేర్పించాలో ఉత్తరం చక్కగా మార్గదర్శకం చేస్తుంది. ఈ పుస్తకానికి హైలైట్ శ్రీ కత్తి నరసింహా రెడ్డి గారి ముందు మాట, మరియు వారి యొక్క స్వీయ చరిత్ర వ్యాసం.

ఈ సంకలనంలో నాలుగైదు అనవసరం అనిపించాయి. వాటిని మలి ముద్రణలో తీసివేయవచ్చు. కొన్ని ఫరవాలేదు అనిపించాయి. అన్నీ మంచివే వేయలేరు కదా! వెరసి మంచి ప్రయత్నం.

ప్రతి కథ, వ్యాసం తర్వాత “గ్రాహ్యశం” అని సమ్మరీగా వేయడం చాలా బాగుంది. “గ్రాహ్యశం” బదులుగా సరళంగా గ్రహించవలసింది లేదా తెలుసుకోవలసింది అని వేస్తే బాగుండేది. పుస్తకంలో అక్కడక్కడా చురకల్లాంటి సూచనలుకూడా చేసారు. ఇవికూడా పుస్తకానికి తగినట్టుగా చక్కగా అమిరాయి.

నాకు నచ్చనివి. కథలనూ, వ్యాసాలనూ మొదటగా ఎప్పుడు, దేనిలో ప్రచురించారో చెప్పలేదు. రచయితల గురించి కొంత సమాచారం ఇస్తే బాగుండేది. రాసినవారికి ధన్యవాదాలు చెప్పలేదు. వారి అనుమతి తీసుకున్నదీ, లేనిదీ కూడా తెలియజేయలేదు. పేపర్ క్వాలిటీ కూడా పెంచాల్సిన అవసరం వుంది.

ఇంతటి మంచి కథలను, వ్యాసాలను సంకలనం చేసిన ఎస్టీయు వారు, ముఖ్యంగా సంపాదకులు కత్తి నరసింహారెడ్డి గారు అభినందనీయులు. ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్ లోని టీచర్లందరినీ ఆలోచింపజేయగలదని తద్వారా వారు విద్యార్థులకు చక్కగా చదువు చెపుతారని ఆశిద్దాం.

ప్రతి ఉపాధ్యాయుడు/ ఉపాధ్యాయురాలు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లిదండ్రులందరూ చదవాల్సిన పుస్తకం “టీచరు: కథ – కమామిషు”.

టీచరు: కథ – కమామిషు
ఆగష్టు 2012
సంపాదకులు: కత్తి నరసింహారెడ్డి
ప్రచురణ: ఎస్టీయు, హైదరాబాద్
ఫోన్ నెం: 040 – 24655753
ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌస్
పేజీలు: 231
ధర: రూ.150

You Might Also Like

11 Comments

  1. వీక్షణం-7 | పుస్తకం

    […] రాజు!” వాసిలి వసంతకుమార్ వ్యాసం, “టీచర్-కథాకమామిషు” పుస్తకంపై కె.పి.అశోక్‌కుమార్ […]

  2. చంద్రహాస్

    “టీచర్ కథ-కమామిషు” పుస్తకం తయారీలో సంపాదకుల అశ్రద్ధ ప్రస్ఫుటంగా కనపడ్తుంది. వ్యాసాల ఎంపికలో స్పష్టత కరువయింది. అసలు పుస్తకం title కరెక్ట్ కాదేమో. “టీచర్ కథా-కమామిషు” అని కదా వుండాలి. Quotation marks close చేయని సందర్భాలు కోకొల్లలు. అచ్చు తప్పులు మరీ భరించలేం. ఉదాహరణకి బాపు గారి వ్యాసం 87 వ పేజీలో ఇలా వుంది: ని ఆ మేనేజరు అరగంట…విసిరేసేవాడు).ని ఆ మేనేజరు అంటే ఏమిటి? చివర్లో bracket ఎందుకు close అయిందో అర్థంకాదు. ప్రతి పేజీలోనూ ఎన్నో తప్పులు. టీచర్ల గురించి రాస్తూ, టీచర్ల కోసం రాస్తూproof reading సరిగా చేయకపోవడం క్షంతవ్యం కాదు. అసలు విడ్డూరం ఏమిటంటే సంపాదకీయం లో టీచర్లు చేసిన కొన్ని తప్పుల్ని పేర్కొని, ఇలాంటివి టీచర్లందరికీ తలవంపులు తెస్తాయని వ్యాఖ్యానించడం.Reviewer ఉదారంగా రెండో ఎడిషన్ గురించి మాట్లాడారు. అలా కాకుండా ఇంకెవరైనా ఇలాంటి సంకలనం కాస్త శ్రద్ధ తో వేస్తే బాగుంటుంది.

  3. కొత్తపాళీ

    సమీక్ష బావుంది. సంపాదకునిగా సాకం నాగరాజుగారు కొన్ని వింత ప్రయోగాలు చేస్తున్నారు. వారు ఇదివరకు సంకలించిన రెండు కథా సంకలనాలు చదివాను. నాకు పెద్దగా నచ్చలేదు గాని, ఈ పుస్తకం ఆసక్తి రేకెత్తిస్తున్నది.

  4. pavan santhosh surampudi

    బాపుగారంటే బొమ్మలే గీస్తారు కాని వారు రాస్తారా అని చాలమంది అనుకుంటారు
    అని ఆశ్చర్యపోయేవారికి మరింత ఆశ్చర్యాన్ని కలిగించగలిగినది ఆయన ఏనాడో వ్రాసిన “మబ్బూ వానా మల్లెవాసన” కథ. ఆ కథ చదివిన అనుభూతి అద్భుతం. చాలామంది సుప్రసిద్ధులైన తెలుగుకథకుల కథలకన్నా ఆ కథే బావుంటుంది. ఆయన తరచుగా వ్రాసి ఉంటే తెలుగులోని గొప్ప కథకుల సరసన చేరి ఉందురు.

    1. Madhu

      Can you mail this story?

  5. yaramana

    మంచి పుస్తకానికి చక్కటి పరిచయం. నిర్మొహమాటంగా, సూటిగా, క్లుప్తంగా.. బాగుంది.

  6. chandra sekhara azad

    read your article. It is nice

  7. leo

    మంచి పుస్తకం పరిచయం చేసారు.

  8. ముత్తేవి రవీంద్రనాథ్

    దేవినేని మధుసూదనరావు గారి సమీక్ష ఈ పుస్తకాన్ని వెంటనే కొనిపించి, చదివించేలా ఉంది.సమీక్ష చాలా క్లుప్తంగా ఉన్నా, తనకు నచ్చిన, నచ్చని అంశాలను చాలా నిర్మొగమాటంగా పేర్కొన్నారాయన.ఉత్తమాభిరుచిగల చదువరులే ఉత్తమ రచనలకు బీజప్రాయమైనవారు. బహుముఖ ప్రజ్ఞావంతులైన బాపు గారు, దశాబ్దాలుగా విద్యార్థులు, టీచర్ల మనోభావాలను కాచి వడపోసిన అబ్దుల్ కలాం, వెల్చేరు నారాయణరావు, సింగమనేని నారాయణ గార్ల వంటి ఉద్దండులు రాసిన కథలు అద్భుతంగా కాక మరెలా ఉంటాయి ? అవి ఏ స్థాయిలో ఉండి ఉంటాయో ఎవరైనా ఇట్టే ఊహించుకోవచ్చు. ఉపాధ్యాయులకు కరదీపిక వంటి ఇలాంటి పుస్తకాలు మరిన్ని వచ్చి, విద్యార్థి-ఉపాధ్యాయ
    సంబంధాలు మరింత మెరుగుపడగలవని ఆశిద్దాం.– ముత్తేవి రవీంద్రనాథ్.

  9. BHANDARU SRINIVAS RAO

    సమీక్ష క్లుప్తంగా, పొందికగా వుంది.- భండారు శ్రీనివాసరావు

  10. చంద్రహాస్

    పరిచయం క్లుప్తంగా బాగుంది. పుస్తకం విడుదలైన వెంటనే రెండో ఎడిషన్ గురించి ఆలోచన చేస్తున్నారు విశ్లేషకులు. తెలుగు పుస్తకాలకు అంత వైభవమా? నమ్మలేకపోతున్నాను.

Leave a Reply