శ్వేత విప్లవ పితామహుడు డా.వర్గీస్ కురియన్ ఆత్మకథ “నాకూ ఉంది ఒక కల”

(శ్వేతవిప్లవ పితామహులు డా.వర్గీస్ కురియన్ నేడు అనారోగ్యంతో మరణించారు.)
వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్
*********
కొన్ని దశాబ్దాల ముందు నగరాల్లో, కాస్త పెద్ద పట్టణాల్లో చిరపరిచితమైన దృశ్యం ఒక మిల్క్ బూత్ ఎదుట తెల్లవారుతూండగానే క్యూలో జనం. ఆ పాలబూత్ లలో కొనుక్కున్న పాలే కుటుంబ అవసరాలకు సరిపెట్టుకునేవారు. ఈనాడు ఆ దృశ్యం అదృశ్యమైంది. పాలకి రేషన్ ఉండటం బహుశా నా తర్వాతి తరానికి ఊహకి కూడా అందదు. ఇది స్థానిక దృశ్యం. అంతర్జాతీయస్థాయి వార్తాకథనాలు పరిశీలిస్తే డైరీపరిశ్రమకి అర్థశతాబ్దికి పైగా ప్రథమస్థానంలో నిలచిన న్యూజిలాండును దాటి భారతదేశం పాల ఉత్పత్తిలో ప్రపంచాన అగ్రస్థానం పొందింది. ఈ పరిణామం ఓ నలభై యేళ్ల క్రితం ఎవరూ ఊహించివుండరు. ఈ రెండుపరిణామాలకీ కారకులు శ్వేతవిప్లవ పితామహులు డా.వర్గీస్ కురియన్. ఆయన నేడు తెల్లవారుజామున తన తొంభయ్యవయేట స్వల్ప అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ వార్త చూడగానే నాకు ఙ్ఞప్తికి వచ్చిన పుస్తకం “నాకూ ఉంది ఒక కల”. “I too had a dram”అన్న ఆయన ఆత్మకథకి తెలుగు అనువాదం ఇది.

ఈ పుస్తకానికి ముందుమాట ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా వ్రాశారు. పుస్తకం మొదటే పరిచయం అంటూ కురియన్ తన మనవడికి వ్రాసిన లేఖలో ఆయన ఆలోచనలు పంచుకుంటూ చివరగా “సిద్ధార్థా, ఈ పుస్తకాన్ని నీకూ, ఇంకా మనదేశంలో నీ తరానికి సంబంధించిన లక్షలాది మంది పిల్లలకి కూడా అంకితం ఇస్తున్నాను. మీరంతా ఈ పుస్తకం చదవడం వల్ల ఉత్తేజితులై ప్రపంచంలోకి ధైర్యంగా వెళ్లి, మీరు ఎంచుకున్న రంగాలలో, ఈ దేశవిస్తృత ప్రయోజనాల కోసం, ఎక్కువమంది ప్రజల మంచికోసం, అవిశ్రాంతంగా పనిచేస్తారనే ఆసతో ఈ అంకితం ఇస్తున్నాను.” అంటారు.

కేరళలోని కాలికట్ లో 1921లో సంపన్న విద్యావంతులైన సిరియన్ క్రిస్టియన్ల ఇంట జన్మించాడు. ఇంజనీరింగ్(మెటలర్జీ) చదివిన కురియన్ టాటా స్టీల్ ప్లాంటులో అప్రెంటిస్ గా చేరతాడు. తర్వాత ప్రభుత్వం నుంచి అనుకోనివిధంగా డైరీ ఇంజనీరింగులో స్కాలర్ షిప్ పొంది అమెరికా వెళ్లారు. ఆపైన భారతదేశం వచ్చాకా ప్రభుత్వం బలవంతాన ఆనంద్ లో చిన్న ప్రభుత్వడైరీలో ఉద్యోగిగా వెళ్తారు. అప్పుడు పరిచయమైన కైరా జిల్లా పాల సహకార సంఘం, వారి నాయకుడు త్రిభువన్ దాస్ పటేల్ లు పరిచయమౌతారు. ఆ పరిచయం ఆయన జీవితాన్ని మలుపుతప్పింది, అలానే ఈ దేశ పాల ఉత్పత్తి రంగాన్ని కూడా.

ఆపైన జరిగే కథంతా చాలా ఆసక్తికరం. ఆ కథ కురియన్ దే కాదు.. ఈ దేశ సహకార పాలవ్యవస్థ ఎదుగుదలది కూడా. ఆ క్రమంలో దేశాన్ని ఎదగనీయకుండా చేసే బ్యూరోక్రాట్ వ్యవస్థ, ఒక్క మంచిమార్పు తీసుకువద్దామంటే ఎదురయే వందలాది అడ్డంకులూ, వాటిని ఎదుర్కోవడంలోని ఒడుపులూ అన్నీ ఆసక్తి కలిగించేలా ఎదురవుతాయి. అంతర్జాతీయంగా మిగులు పాలపొడి మనకు ఉచితంగా అంటకట్టి దేశంలో మార్కెట్టును సృష్టించుకుని, ఆపై నచ్చిన రేటుకు భారతమార్కెట్లో పాలపొడి, డైరీ ఉత్పత్తులూ అమ్ముకునేందుకు ఐరోపాదేశాల ప్రయత్నంతోనే దేశంలో పాలవెల్లువ ఎలా సృష్టించారన్నది ఆయనమాటల్లో చూడండి.

“ఒక దశలో యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ(ఇ.ఇ.టి.) వాళ్ళకి, పర్వతాల్లా పోగుబడిన పాలపొడీ, సరస్సుల్లా తయారైన బటర్ ఆయిలూ గోప్పసమస్యనే తెచ్చిపెట్టాయి. దాంతో మన పాడిపరిశ్రమ పూర్తిగా దెబ్బతినేదే. ఇవి, ఉన్నకొద్దీ విలువపెరిగే వస్తువులు కాకపోవడంతో యూరోపియన్ దేశాలవారు ఈ అధిక ఉత్పత్తులకు ఒక పరిష్కారం వెతుకుతున్నారు. ఎవరో దయగల యూరోపియన్ పెద్దమనిషికి, ఈ వస్తువుల్ని భారతదేశంలో ఉన్న కోట్లాది అన్నార్తులకి అందించడం పరిష్కారంగా తోచడానికి ఎంతోకాలం పట్టదనిపించింది. అదే జరిగితే, మన పాలరైతుల్లో పెరుగుతున్న ఆశల్ని, ఆకాంక్షల్నిశాశ్వతంగా నలిపేసినట్టవుతుంది. ఉచితంగానో, తక్కువ రెట్లకో వచ్చే పాలూ, బటర్ ఆయిల్ తో మన రైతులు ఎలా పోటీ పడగలరు? ఆ పాలు, బటర్ ఆయిల్ అయిపోయాకా పెరిగిన దేశీయ మార్కెట్, నాశనమైన పాల రైతులూ మిగిలిన దేశం ఐరోపా, న్యూజిలాండ్ పాలడైరీలకు ఎదురులేని మార్కెట్ అయ్యేది.

ఎన్.డి.డి.బి.లో వుండి, భారతదేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి బాధ్యులైన మేం వేగంగా ఓ కార్యక్రమం రూపొందించాం. ఈ అధికోత్పత్తి అయిన మొత్తం సరకుని యూరప్ నుంచి తీసుకుని ఉపయోగించడం ద్వారా నిధుల్ని సంపాయించి, భారతదేశంలో ఆనంద్ తరహా సహకార సంఘాల విస్తరణకు, డైరీ అభివృద్ధికి ఉపయోగించాలని, అందుకు కావలసిన ఆరువందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడి ఆ పాలతో సమకూర్చవచ్చన్న ఆలోచన నా మనస్సులో మెదిలింది. అదే పాలవెల్లువ”

ఆ ఆలోచన గురించి కురియన్ “మనం జాగ్రత్తగా చూస్తే ప్రతి సంక్షోభంలోనూ ఒక అవకాశాన్ని గుర్తించవచ్చు” అంటారు.

కురియన్ ఆత్మకథని సంఘటనల వారీగా చూస్తే.. మొదట అమూల్ కోసం ప్రైవేటు డైరీలతో పోటీ, బొంబాయి నగర పాల అవసరాలు సహకార రైతులు తీర్చగలిగినా న్యూజిలాండ్ డైరీల పాలపొడి దిగుమతి చేసే అవినీతి అధికారితో పోరాటం, అమూల్ ని సాంకేతికంగానూ, మార్కెటింగ్ పరంగానూ అభివృద్ధి చేయడం ఒక దశ. ఆపై ఆ సహకార పాల సంఘం వ్యవస్థని దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసేందుకు పాలవెల్లువ ప్రారంభించడంతో మలుపుతిరిగిన ఆయన ప్రస్తానం ఆపై దేశమంతటా పాడిపరిశ్రమ అభివృద్ధికి తన అమూల్ అనుభవాలు ఉపయోగించారు. ఈ సంఘటలన్నీ సహజంగానే ఆసక్తికరంగా ఉంటాయి. కావాల్సినంత నాటకీయత వాటిలో పుష్కలంగా ఉంటుంది. పైగా ఇవన్నీ తన వ్యాపారసామ్రాజ్యాన్ని విస్తరించుకునే వ్యాపారదిగ్గజం అనుభవాలు కావు. నెలజీతం తీసుకుంటూ వ్యాపారస్తుడిలా పనిచేసి లాభాలు సామాన్య పాడి రైతులకి పంచే దేశభక్తుడి జీవితానుభవాలు. కురియన్ తన అంకితంలో ప్రస్తావించినట్టే తెలుసుకున్న అనుభవపాఠాలు సందర్భోచితంగా వ్రాస్తారు బోల్డ్ అక్షరాల్లో.

కొన్ని ఇబ్బందులకి లోను కాకుండా మనం ఏదీ సాధించలేమని నా నమ్మకం. వచ్చిన అవకాశాలు చేజార్చుకోకూడదు. అంటారు ఓ సందర్భంలో. నేను కలసిన ప్రతి వ్యక్తీ నాకు చెప్పేది “ప్రభుత్వం ఈ విషయం చూస్తుంది” అని. బహుశా దీని అర్థం “ఎవరూ ఈ విషయం చూడరు” అని నాలో ఒక దరిద్రమైన అభిప్రాయం మిగిలిపోయింది” అంటారు ప్రభుత్వం నిష్క్రియాపరత్వం గురించి ఘాటుగా, ఆవేదనగా వ్రాస్తూ.

మరికొన్ని వింత విషయాలూ వ్రాస్తారు “ప్రతి ఒక్క పాల ఉత్పత్తిదారుడూ ఒక్క రూపాయి చొప్పున ఇవ్వడం వల్ల, మేం అవసరమైన నిధులు సేకరించగలిగాం. ఈ విధంగా ‘మందన్’ సినిమాని గుజరాత్ డైరీ రైతులు నిర్మించారు. దీని నిర్మాణానికి పదిలక్షలు మాత్రమే ఖర్చయింది”(ఇది సహకార ఉద్యమం గురించిన పూర్తి నిడివి చిత్రం, దర్శకుడు శ్యాం బెనగల్). మనదేశంలో సామాన్యుడు బలపడటాన్ని భరించలేనివాళ్ళు కూడా ఉండటం బాధాకరం. ఇప్పుడున్న అధికార వ్యవస్థకి అది ఇష్టం లేదు. వ్యాపారస్తులకి అసలే సరిపడని సంగతి. ఇలాంటి లోతైన పరిశీలనలు ఎన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో. పుస్తకంలో మధ్యలో కురియన్ వివిధ సందర్భాలలోని నాణ్యమైన ఫోటోలు ఇచ్చారు. అనువాదం చాలా సరళంగా ఉంది.

నా ఉద్దేశంలో ఈ పుస్తకం ఆత్మకథలు ఇష్టపడేవారికి ఆత్మకథ, చరిత్ర తెలుసుకోవాలనుకుంటే చరిత్ర, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు నచ్చేవారికి వ్యక్తిత్వ వికాస గ్రంథం.

****

నాకూ ఉంది ఒక కల (ఆత్మకథ)
(I too had a dream కి అనువాదం)
రచయిత: డా.వర్గీస్ కురియన్
అనువాదం: డా.తుమ్మల పద్మిని, డా.అత్తలూరి నరసింహారావు.
వేల: రూ.125
ప్రచురణ: అలకనంద ప్రచురణ
కాపీలకు: ప్రముఖ బుక్ సెంటర్లు,
ashokbooks@sancharnet.in కు మెయిల్ చేసి తెప్పించికోవచ్చట.

(ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా వరప్రసాద్ గారు చేసిన ప్రసంగ వ్యాసాన్ని (12 జనవరి, 2008) కొన్ని మార్పులతో ఇదివరలో పుస్తకం.నెట్ లో ప్రచురించాము. ఆ వ్యాసం లంకె ఇక్కడ).

You Might Also Like

8 Comments

  1. Purnima

    I’m yet to read this work. After having read this write-up, I chanced upon “Manthan” – a movie by Shyam Benegal based on an idea given by Kurien. And it is simply spell-bounding! It also serves as a great appetizer to know more about the man who revolutionized milk production in India. Needless to say, if you’ve not watched it, GO FOR IT NOW!

  2. SIVARAMAPRASAD KAPPAGANTU

    I am presently in Mumbai. With a view to get the above Authobiography, I gave mail to the address given in the article. Howver, the mail got bounced and I could not contact them.

    Can you please provide me other modes of contact like Telephone etc. or alternate E mail address, enabling me to get the book.

    1. సౌమ్య

      Sivaramaprasad garu:
      Indiaplaza link for English version:
      http://www.indiaplaza.com/i-too-had-dream-gouri-salvi/books/9788174364074.htm

      It seems to be arriving in Flipkart soon again (English version).
      http://www.flipkart.com/too-had-dream-8174364072/p/itmdyu8vyavkgvxx

    2. Alakananda Prachuranalu

      you may use this email id: abcbooksvj@gmail.com
      Phones (0866) 2476966, 2472096

    3. SIVARAMAPRASAD KAPPAGANTU

      Thank you Madam for the clarification and reply.

      Thank you the Publishers for providing alternate e mail. However I already purchased the English Version here in Mumbai.

  3. NM

    Read this book some time back.

    ” నా ఉద్దేశంలో ఈ పుస్తకం ఆత్మకథలు ఇష్టపడేవారికి ఆత్మకథ,
    చరిత్ర తెలుసుకోవాలనుకుంటే చరిత్ర,
    వ్యక్తిత్వ వికాస పుస్తకాలు నచ్చేవారికి వ్యక్తిత్వ వికాస గ్రంథం.”

    Well Said.

    ” నేను నాకు ఆప్తులైనవారి పుట్టినరోజులకు ఈ పుస్తకాన్ని బహుమతిగా ఇస్తున్నాను.”
    Well done. Doing the same.
    —————————————————
    Here is another person right here in AP who seem to have inspired by Kurien,though works in Pvt Sector,but helps the youth in setting up diaries.

    Unless some one like these take up the baton,the progress stops.
    We need more people who can DO , with the kind of spirit that Kurien has.

    Check out – Mr.Ch.NaraSimha Rao,Diary Farmer.

    An entrepreneur with a difference ////

    విశాఖ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన తన పాతికేళ్ల అనుభవాలను రంగరించి తోటివారికి ఉపయోగపడే పుస్తకాలను రాశారు. పశువుల పెంపకం గురించి, వర్మీకంపోస్టు, సేంద్రియ ఎరువులను తయారుచేసుకోవడం వంటి విషయాలతో ప్రచురించిన ఆ పుస్తకాలను జిల్లాలోని ఐదు వేల మంది రైతులకు పంపిణీ చేశారు.

    ఫుడ్, ఫ్యుయల్ మన చేతిలోనే

    విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటకు చెందిన చిట్టూరి కృష్ణనరసింహారావు.
    ఏడాదికి సగటున నాలుగు లక్షల లీటర్ల పాలు సరఫరా చేస్తున్న అద్భుతమైన డైరీఫామ్ సొంతదారుగానే కాకుండా, తాను నడిచిన బాటనే నిరుద్యోగ యువతనూ న డిపిస్తూ,
    మరో యాభై మినీ డైరీలకు మార్గదర్శిగా వ్యవహరిస్తున్న నరసింహారావును

    ‘నవ్య’ పలకరించింది.
    http://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2012/mar/18/navya/18navya2&more=2012/mar/18/navya/navyamain&date=3/18/2012

    విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న యువ కులకు సొంతంగా మినీడైరీలు పెట్టుకునేలా బ్యాంకు రుణాలకు యాభై లక్షల రూపాయల వరకు పూచీకత్తులిచ్చారు.
    డైరీ రంగంలో ఇంత కృషి చేస్తున్న నరసింహారావు వరంగల్ ఆర్ఈసి నుంచి
    మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రులంటే ఆశ్చర్యమనిపిస్తుంది.

    విశాఖ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన
    తన పాతికేళ్ల అనుభవాలను రంగరించి తోటివారికి ఉపయోగపడే పుస్తకాలను రాశారు. పశువులకు చాలా బలాన్నిచ్చే ‘అజొల్లా’ మొక్క పెంపకం గురించి, వర్మీకంపోస్టు, సేంద్రియ ఎరువులను తయారుచేసుకోవడం వంటి విషయాలతో ప్రచురించిన ఆ పుస్తకాలను జిల్లాలోని ఐదు వేల మంది రైతులకు పంపిణీ చేశారు.

    Integrated training for farmers launched

    http://www.hindu.com/2011/03/09/stories/2011030951070200.htm

    A progressive farmer shows the way

    http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article2864655.ece

    http://calf.co.in/ . An entrepreneur with a difference
    http://www.thehindu.com/business/article2423596.ece

  4. Dr. Mula Ravi Kumar

    Dr.Kurine’s soul never rests in peace as long as Indian Dairy Farmer (for that matter any farmer) is being cheated by excessive politicization of Cooperatives, Red-tapism in farmer support services etc.

    Since everybody know about Dr Kurien, let me tell all of you about a person who arranged to supply one copy of the above book in 3000 villages of three districts.

    He also insisted that each village (where milk collection center is running) should have one-photo of Dr Kurien

    He is Sri Adari Tulasi Rao, Chairman of Visakha Dairy.

    1. pavan santhosh surampudi

      ఆదుర్తి తులసీరావు గారి గురించి తెలిపినందుకు ధన్యవాదాలు. ఆయన చేసినట్టుగా ఇటువంటి ఆత్మకథలు పంచాల్సిన అవసరం ఉంది. నా స్థాయిలో నేను నాకు ఆప్తులైనవారి పుట్టినరోజులకు ఈ పుస్తకాన్ని బహుమతిగా ఇస్తున్నాను.

Leave a Reply