పుస్తకం
All about booksఅనువాదాలు

August 3, 2012

తొలి ఉపాధ్యాయుడు – చిన్గీజ్ ఐత్మాతోవ్

More articles by »
Written by: సౌమ్య
Tags: ,

చిన్గీజ్ ఐత్మాతోవ్ – కిర్గిస్తాన్ కు చెందిన ప్రముఖ రచయిత. రష్యన్, కిర్గిజ్ భాషల్లో రచనలు చేసినా, అయన రచనలు వంద పైచిలుకు భాషల్లోకి అనువాదం అయ్యాయి. మొన్న ఒకరోజు కినిగె.కాం వెబ్సైటులో కొత్త పుస్తకాలు ఏమి వచ్చాయా? అని చూస్తున్నప్పుడు “తొలి ఉపాధ్యాయుడు” కనబడ్డది. “ఒక అనామక ప్రాంతంలో అత్యంత అనామకంగా పుట్టి పెరిగి కేవలం తన రచనల ద్వారానే విశ్వ వ్యాప్తినొందుతూ తనతో పాటు, ప్రపంచపటం మీద తన దేశానికీ గుర్తింపు తెచ్చిన అరుదైన మేటి రచయిత చిన్గీజ్ ఐత్మాతోవ్.” అంటూ మొదలైంది ఈ పుస్తకం ముందుమాట. “జమీల్యా” గురించి చదివినా, పుస్తకాన్ని నేను చదవలేదు. ఇప్పుడైనా ఈ పుస్తకం చదవడానికి నన్ను ప్రేరేపించినది ఈ పుస్తకం పేరు. కిర్గిజ్ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో, తొట్టతొలి పాఠశాల నిర్మించిన డూషేన్ అన్న ఉపాధ్యాయుడి కథ ఇది.

కథ ఒక చిత్రకారుడి కథనం తో మొదలవుతుంది. తన ఊరి గురించి చెబుతూ, డూషేన్ బడి గురించి ప్రస్తావిస్తాడు అతను. తన చిన్ననాటికే అది జన బాహుళ్యం లో ప్రచారంలో ఉన్న “కథ”. కనుక, నిజంగా ఆ బడి నడిచిందని కథకుడు అంత నమ్మకం చూపించడు. కొన్నాళ్ళకి ఆ ఊరులో పుట్టి పెరిగి, తరువాత పట్నం వెళ్ళిపోయి, పెద్ద చదువులు చదివి బాగా పేరు తెచ్చుకున్న అల్తినాయ్ అనే ఆవిడ ఈ ఊళ్ళో పాఠశాల ప్రారంభోత్సవం కోసమని చెప్పి చాలా ఏళ్ల తరువాత అక్కడికి వస్తుంది. డూషేన్ అనే అయన అక్కడ ప్రస్తుతం పోస్ట్మెన్ గా పని చేస్తున్నాడు అని తెలుసుకుంటుంది. ఆ తరువాత, అక్కడ అందరూ ఆయన్ని గురించి “అక్షరమాలలోని అక్షరాలూ అన్నీ కూడా తెలియకుండానే” బడి నడిపాడు అని వెటకారంగా మాట్లాడ్డం విన్నాక, ఆవిడ తన పనుల మీద తిరుగుప్రయాణం అవుతుంది. అలా వెళ్ళిపోయాక మన చిత్రకారుడికి ఉత్తరం రాస్తూ, అందులో డూషేన్ గురించి చెబుతుంది. ఇదీ నేపథ్యం. ఇక ముఖ్య విషయం : అసలు చదువు, బడి వంటి మాటలు కూడా విడ్డూరంగా కనబడే ఆ ఊర్లోకి ఒకప్పుడు ఆ గ్రామంలోనే పెరిగిన డూషేన్ వచ్చి ఒక బడిని స్థాపించడం, తొలితరం విద్యార్థులను ఇంటింటికీ తిరిగి సమీకరించడం, వాళ్ళ కోసం ఎంతో శ్రమ పడి (అది శ్రమ అని ఆయన అనుకోడు. వర్ణనలు చదువుతూ ఉంటే మనకే అనేక ఉద్వేగాలు కలుగుతాయి) చదువు చెప్పడం – ఈ తొలితరం విద్యార్థినులలో ఒకరైన అల్తినాయ్ ఆయన స్ఫూర్తితో, ఆయన సాయంతో ఆ ఊరి నుండి బయట పడి, ఆతరువాత గొప్ప పేరు తెచ్చుకోవడం – ఈ నవల కథాంశం.

నువ్వు కథంతా చెప్పెసావే, ఇంకెందుకు చదవడం? -అని ఎవరన్నా నన్ను అడగవచ్చు. కానీ, నిజానికి నేనేమీ చెప్పలేదు. డూషేన్ ఈ పిల్లలకి చదువు ఎలా చెప్పాడు? వీళ్ళ కోసం ఏమేమి చేసాడు? బాల అల్తినాయ్ లో అతని గురించి ఎలాంటి అభిప్రాయం ఏర్పడ్డది? – అసలు ఈ కథ మనసుకు హత్తుకునేలా ఉండడానికి కారణం ఈ సంఘటనల కూర్పూ, వాటి వెనుక ఉన్న హృద్యమైన కథనాలే! వాటి గురించి నేను వర్ణించలేదు కదా! వాటికోసం తప్పకుండా ఈ పుస్తకం చదవండి.

డూషేన్ ఎవరన్నా నిజజీవితంలోని వ్యక్తి స్ఫూర్తితో రాసిన కథా? – అని ఎక్కడో ఒక చిన్న సందేహం. అయితే, ఇందుగురించిన సమాచారం నాకు అంతర్జాలంలో లభించలేదు. అలాగే, కథ చదువుతూ ఉంటే, దాదాపు మొదట్నుంచీ – అసలితను ఎవరు? ఎందుకింత శ్రమించాడు? ఎంత లెనిన్ స్ఫూర్తితో మొదలుపెట్టినా కూడా, ఇన్ని అవరోధాలను ఎదుర్కొని ఆ పిల్లలకి చదువు చెప్పి, వాళ్ళని చదివిన్చగలిగాడు అంటే దానికి అతనికి స్ఫూర్తి ఏమిటి? తాను పెద్దగా చదువుకోలేదు అన్న విషయం అతనే ఒప్పుకుంటాడు. అలాంటి మనిషి ఒక ఊరిలో చదువులకి నాంది పలకడానికి పూనుకున్నాడు అంటే అతనిలో ఎంత బలమైన కోరిక కలిగి ఉండాలి? ఎందుకు కలిగింది? అసలు తన మీద తనకి నమ్మకం ఎలా కుదిరింది? అన్న సందేహాలు మన మనస్సులో మెదిలినా, ఈ పుస్తకంలో అతని గతం ఉండదు. ఇటీవలే ఒక టిబెటన్ సెటిల్మెంట్లోని కాన్వెంటు బడిలో సంవత్సరం పాటు స్కూలు పిల్లలకి చదువు చెప్పి వచ్చిన స్నేహితుడితో ఆ అనుభవం గురించి మాట్లాడుతూ ఉండగా అతను – “ఈ పిల్లలకి బొత్తిగా ఏమీ తెలియదు. వీళ్ళకి చదువు చెప్పడం అసలైన ప్రాబ్లెం. ఈ ప్రయత్నంలో ఏది లేకపోయినా, అమితమైన సహనం మాత్రం చాలా అవసరం. పదో తరగతి పిల్లలు కూడా, సైన్ తీటా = ౧ అంటే తీటా ఎంత? అంటే వన్ బై సైన్ అంటారు. పైగా తప్పంటే ఎందుక్కాదు? అని ఎదురు ప్రశ్నిస్తారు” అన్నాడు. మమూలుగా చదువులు, పాఠశాలల ప్రపంచంలో పెరిగిన పిల్లలతోనే ఇలా ఉంటే, మరి అసలు చదువు అన్న కాన్సెప్టే ఎరుగని వారి వద్దకి వెళ్లి చదువు చెప్పాలంటే – ఎంత ఖలేజా ఉండాలి? ఎంత సహనం ఉండాలి? అందుకే డూషేన్ కథలోని పాత్రే అయినా కూడా ఆదర్శప్రాయుడు.

“లెనిన్ ని గౌరవించినట్లు సామాన్య వ్యక్తులని గౌరవించే గుణాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకున్నాం?”
-అని అల్తినాయ్ ఈ కథ చివరలో వేసిన ప్రశ్నని మనం అందరం మళ్ళీ మళ్ళీ వేసుకోవాలేమో అనిపించింది. ఇటీవలి కాలంలో ఒకదాని వెంబడి ఒకటిగా, జన బాహుళ్యంలో అద్వితీయ ప్రచారం పొందని మహానుభావుల కథలు చదువుతూ ఉండడం వల్ల కావొచ్చు, ఈ వాక్యం ఆ పుస్తకం మొత్తం మీద నాకు గుర్తు ఉండిపోయిన వాక్యం.

అనువాదం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కృతకంగా ఉన్న వాక్యాలు బోలెడు. గందరగోళంగా ఉన్నవి కొన్ని. వాటికి ఉదాహరణలు ఇవ్వడం మొదలుపెడితే సగం పుస్తకం టైపు చేయాల్సి వస్తుందిక (ఇది నా వ్యక్తిగత వైకల్యం కూడా కావొచ్చు కానీ, నాకు మాత్రం తేజా టీవీలో వచ్చే డబ్బింగ్ సినిమా డైలాగుల్లా అనిపించాయి ఇందులో వాక్యాలు.) అయితే, కథా బలంలో ఇవన్నీ కొట్టుకుపోయాయి అనుకోవాలి – ఈ అనువాదంలో కూడా నేను పుస్తకం పూర్తి చేయగలిగాను కనుక.

అనువాదకుడి పేరు “పుష్పల లక్ష్మణరావు” అని రాయడం మాత్రం దిగ్భ్రాంతి కలిగించే విషయం.

పుస్తకం డిజిటల్ కాపీ కినిగె.కాం లో లభ్యం. ఉచితంగా దిగుమతి చేసుకోగల ప్రివ్యూలో ముందుమాట ఉంది. అది చదివితే చిన్గీజ్ ఐత్మాతోవ్ గురించి, అయన రచనల గురించి ఒక అవగాహన వస్తుంది. అలాగే, తప్పకుండా ఈ పుస్తకం చదవాలి అని కూడా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ముందుమాటలు ముందే చదివేయడం వల్ల కూడా లాభాలు ఉంటాయి అని అర్థమైంది ఇపుడు నాకు 🙂

***

పుస్తకం వివరాలు:
తొలి ఉపాధ్యాయుడు (The First Teacher)
చింగీజ్ ఐత్మాతోవ్ (Chinghiz Aitmatov)
అనువాదం: ఉప్పల లక్ష్మణరావు
ప్రచురణ: హైదరాబాదు బుక్ ట్రస్ట్
వెల: యాభై రూపాయలు
ప్రింటు/డిజిటల్ కాపీల కొనుగోలుకి – ఈ కినిగె.కాం లంకెను సంప్రదించండి.About the Author(s)

సౌమ్య12 Comments


 1. varaprasaad.k

  శివరామప్రసాద్ గారి జ్ఞాపక శక్తికి అభినందనలు.నిజంగా నాటి మంచి పుస్తకాలను గుర్తుంచుకొని నేటి వాళ్లకు గుర్తు చేయటం అభినందనీయం.


 2. SIVARAMAPRASAD KAPPAGANTU

  బీళ్లుదున్నేరు by
  L: Telugu, Y: 1942, S: Religion. Theology, 284 pgs

  Link
  http://tera-3.ul.cs.cmu.edu/cgi-bin/udlcgi/ULIBAdvSearch.cgi?listStart=5110&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&language1=Telugu&perPage=20

  In DLI the book is categorised as Religion and Theology. I do not know whether it is the same book Srinivas Garu. When I tried to read it, its not opening for me in Mumbai.

  If anybody can access it and write a review it would be great. Soumyajee, If you want me to write I may write tonight or write it after 6 months. I am like that.

  Srinivas garu If you can kindly provide a link where you are able to access the novel, it would help to bring this book into public thinking and discussion after a long time. I think it was translated by Shri Mahidhara Ram Mohan Rao


  • సౌమ్య

   Sivaramaprasad garu:
   Try this DLI link. This is opening for me.


  • Sreenivas Paruchuri

   Sivaramaprasad-gaaru: Both the editions of the book are available on-line. Sowmya-gaaru already gave the link to the 2nd edition from 1959. The first edition has quite a publishing history (cf. preface) and was published in two parts. Fortunately both the parts are available on-line. Here are the details:
   Part1 : biil’ludunneiru., 2020050015012. 1942. 284 pgs.
   Part 2: biil’l’u dunneiru., 2020050016544. 1945. 478 pgs.

   Go to DLI site hosted at IISc to access all the three books.

   The translation was done by MRR’s brother Krishnamohanarao.

   Regards, — Sreenivas


  • SIVARAMAPRASAD KAPPAGANTU

   Thank you Srinivas Garu and Soumya garu. I am able to see and read a book which I last read sometime during 1975 or so.


 3. SIVARAMAPRASAD KAPPAGANTU

  Mihai Sholakov book, ఆంగ్లంలో “Soil Upturned గా చదువుకో ప్రార్ధన


 4. SIVARAMAPRASAD KAPPAGANTU

  సొమ్యగారూ, బాగున్నది మీ పుస్తక పరిచయం. ఈ పుస్తకం నా దగ్గర ఉన్నట్టుగా గుర్తు.మా ఊళ్ళో ప్రస్తుతం ఎక్కడో అటకల మీద ఉన్న నా మూడు నాలుగు దశాబ్దాల క్రితపు పుస్తక సేకరణలో భాగం ఇది. ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు వెతకాలి. 1975 ప్రాంతాల్లో విశాలాంధ్ర లో కొని చదివిన పుస్తకాల్లో ఇదొకటి. కాని చిన్నప్పుడు చదివినా, అందులో వ్యాక్యాలు కృతకంగా ఉన్నట్టుగా గుర్తు లేదు. బాలమిత్ర చందమామను కాపీ కొట్టినా బాగున్నది చందమామే అని చిన్నప్పుడే తెలుసుకుని అదే గుర్తుంచుకున్నాము కదా!

  పుస్తకం అంతా అలాగే ఉన్నది అని ఒక స్వీపింగ్ వ్యాఖ్య చెయ్యటం కంటె,(పక్కనే ఇది నా వ్యక్తిగత వైకల్యం కూడా కావొచ్చు అని వివరణ ఇచ్చి మంచి పని చేశారు అనుకోండి) మీ దృష్టిలో కృతకంగా ఉన్నవి గందరగోళంగా ఉన్నవి ఒకటి రెండు ఉదాహరణలు ఇవ్వండి. చదివేవారికి అలాంటి వ్యాక్యాలు ఏమిటి అనేది తెలుస్తాయి, పరిచయకర్తగా మీ బాధ్యత పూర్తిగా నెరవేర్చినట్టుగా ఉంటుంది.

  మరొక మంచి పుస్తకం మిహాయిల్ షోలకోవ్ రచించగా, తెలుగులోకి “బీళ్ళు దున్నేరు” గా అనువదించబడిన నవల. ఆంగ్లంలో సొఇల్ ఉప్తుర్నెద్ అనుకుంటాను.

  ఈ పుస్తకం కూడ పుస్తకం డాట్ నెట్ లో పరిచయం వస్తే ఒక మంచి పుస్తకం అందరికీ తెలియచేసినట్టు అవుతుంది. ఈ పుస్తకాన్ని కూడా నేను దాదాపుగా 1975 ప్రాంతాల్లోనే లైబ్రరీలో తీసుకుని, నాలుగైదు సార్లు చదివిన గుర్తు. ప్రస్తుతం ఎక్కడా దొరుకుతున్నట్టుగా నాకు తెల్యదు.

  ద్మీత్రీయ్ మెద్వదేవ్ రచించిన “దిటవు గుండెలు” పుస్తకం లాగానే, ఈ పుస్తకాన్ని మళ్ళి ప్రచురిస్తే ఎంతయినా బాగుండును.

  రష్యన్ విప్లవ పూర్వం కూడి సంవత్సరాల నుంది విప్లవం తరువాత వరకూ వచ్చిన అతి కొద్ది సోవియట్ సాహిత్యం లో మిహాయిల్ షోలకోవ్, మాక్జిం గోర్కీ లు ఇద్దరూ ఉద్దండులు. ఈ విప్లవం వారి జీవన కాలంలో జరిగిన ఒక సంఘటన మాత్రమే. వాళ్ళు అలా తీసుకున్నందువల్లే వారి రచనలకు ప్రాముఖ్యత కలిగించలేదేమో.


  • సౌమ్య

   శివరామప్రసాద్ గారికి:
   వ్యాఖ్య రాసినందుకు ధన్య్వాదాలు.
   “బీళ్ళు దున్నేరు” పుస్తకం ఇపుడు దొరకదేమో అనీ, మీరు చదివాననీ అంటున్నారు కనుక – ఆ పుస్తకం గురించిన పరిచయం మీరే రాసి పుస్తకం.నెట్ కు పంపగలరా?


  • SIVARAMAPRASAD KAPPAGANTU

   సౌమ్య గారూ,

   నేను “బీళ్ళు దున్నేరు” నవల చదివిన విషయం నిజమే కాని, పరిచయం చేసేంతగా విషయాలు గుర్తు లేవు. స్థూలంగా కథ ఏమిటంటే, రష్యాలో ఒక గ్రామం, విప్లవ పూర్వం ఉన్న విశేషాలు, విప్లవం తరువాత కమ్యూన్‌లు వచ్చినాక అక్కడి వాళ్ళ జీవన విధానం లో వచ్చిన మార్పులు, కొన్ని కుటుంబాలను తీసుకుని ఆయా కుటుంబాల్లో జరిగిన సంఘటనలతో కథ నడుపుతూ, షోలకోవ్ అద్బుతంగా వ్రాసిన విషయమే గుర్తుకు వస్తున్నది. పాలగుమ్మి పద్మరాజుగారి చిన్న నవల ఒకటి ఉన్నది పేరు గుర్తుకు రావటం లేదు, అది కృష్ణ ని పెట్టి సినిమా కూడా తీశారు. అది చదువుతుంటె, కొంత ఈ బీళ్ళు దున్నేరు లో కొన్ని సంఘటనలు గుర్తుకు వచ్చాయి. అంతకు మించి బీళ్ళు దున్నేరు గురించి మరే గుర్తు లేదు. ఇలా నెట్ లో ఈ పుస్తకం పేరు వ్రాస్తే తెలిసిన వాళ్ళు, అప్పుడు చదివిన వాళ్ళు, ఒకవేళ వాళ్ళదగ్గర ఆ పుస్తకం ఉంటె మళ్ళి ప్రస్తుత పాఠకులకు దొరికే అవకాశం ఉంటుందేమో అని వ్రాశాను. ఆ పుస్తకం మళ్ళీ చదివే అవకాశం కనుక వస్తే, తప్పకుండా ఆ చక్కటి నవల గురించి నా బ్లాగులో పరిచయం తప్పకుండా వ్రాస్తాను.

   ఇలాగే తండ్రులూ కొడుకులూ అనుకుంటాను, మరి ఒక పుస్తకం. ఆ పుస్తకం కూడ బాగుంటుంది. ఇది చైనా వాళ్ళ కథ. వ్రాసినది ఎవరో అస్సలు గుర్తు లేదు.
   మరీ చిన్నప్పుడు చదివినది. ప్రజా శక్తి వాళ్ళు ప్రచురించారు. విశాలాంద్ర్హ వాళ్ళు పూనుకుంటె “బీళ్ళు దున్నేరు” మళ్ళి ప్రింట్ తప్పకుండా తీసుకు రాగలరు.
   వాళ్ళ దగ్గర ఒక్క ప్రింట్ అన్న లేకుండా ఉంటుందా? తండ్రులూ కొడుకులూ చైనా
   వాళ్ళది కాబట్టి, వారి ఎరుపు రంగుకు, విశాలాంధ్ర వారి ఎరుపు రంగుకు
   చుక్కెదురు కాబట్టి ప్రజా శక్తివాళ్ళే వాళ్ళ పాత కాయితాల్లో వైతికితే
   తండ్రులూ కొడుకులూ తప్పక దొరుకుతుంది. కాని వాళ్ళ చైనా బాసులు ఇటువంటి పుస్తకాలను ప్రచురించనిస్తారో లేదో మరి. మరీ పాతకాలము కమ్యూనిస్టు
   గోల మనకెందుకు అనుకుంటారో!


  • Sreenivas Paruchuri

   Sivaramaprasad-gaaru: if interested, “బీళ్ళు దున్నేరు” is available on-line @ DLI.
   Regards, — Sreenivas


  • SIVARAMAPRASAD KAPPAGANTU

   పద్మరాజుగారి చిన్న నవల లేదా పెద్ద కథ “నల్ల రేగడి” చదువుతుంటే నాకు “బీళ్ళు దున్నేరు” జ్ఞాపకం వచ్చింది. పోలిక అంత సమంజసం కాదేమో కాని, పద్మరాజు గారు ఒక పధ్ధతి నుంచి మరొక పధ్ధతి కి సమాజం మారుతుంటే (టెక్నాలజీ పుణ్యమా అని, దిగుమతి చేసుకున్న ఇజం మూలంగా కాదు) ఆ సంధ్యా కాలంలో జరిగే విషయాలు అద్భుతంగా వ్రాశారు. ఆ కథకు మసాళా జోడించి, సూపర్ స్టార్ గా పేరుబడ్డ కృష్ణని పెట్టి సినిమా తీశారని మా కొలీగ్ ఒకాయన సమాచారం అందించారు.

   డి ఎల్ ఐ లో ప్రయత్నిస్తాను శ్రీనివాస్ గారూ. సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు.


 5. murthy

  ithmathov gurinchi yentha cheppina takkuve. ayana rasina jamyla, bhoomi talli vantivi malli chadivisthayi.. marosari ithmathovnu gurthuchesinaduku kruthghnathalu  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 
జమీల్య

జమీల్య

వ్యాసం రాసి పంపినవారు:  నరేష్ నందం ( http://janaj4u.blogspot.com ) “ప్రపంచంలోనే బహు సుందరమైన ప్రేమకథ”...
by నరేష్ నందం
6

 
 

జమీల్యా – నాకు నచ్చిన ప్రేమకథ!

పుస్తకం పై అట్ట మీదేమో ఒక అమ్మాయి బొమ్మ, వెనుకాలేమో “ప్రపంచంలోని బహుసుందరమైన ప్రే...
by Purnima
12