The Sound of the Kiss, or The Story That Must Never Be Told

వ్రాసిన వారు: కె.వి.ఎస్.రామారావు
********
by
Velcheru Narayana Rao and David Shulman

(వెల్చేరు నారాయణ రావు గారి రచనల పరిచయ పరంపరలో ఇది చివరిది. తెలుగు సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని, గౌరవాన్ని సాధించటానికి ఆయన చేసిన, చేస్తున్న భగీరథయత్నాన్ని రేఖామాత్రంగా సూచించటం ఈ ప్రయత్న ధ్యేయం. సంప్రదాయ సత్యాల్ని (conventional wisdoms) ప్రశ్నించకుండా శిరసా వహించే సంప్రదాయాన్ని ప్రశ్నించి తెలుగు సాహిత్య సాగరాన్ని నిరంతరం మథిస్తూ ఆలోచనామృతాల్ని అందరికీ పంచుతున్న ఈ రచనల గురించి పాఠకుల్లో కొంత కుతూహలం కలిగినా ఈ ప్రయత్నం సఫలమైనట్టే.)

తెలుగు సాహిత్యంలో పింగళి సూరన్నది ప్రత్యేకస్థానం. పదహారో శతాబ్దం చివరిభాగంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత నివసించిన ఈ కవి ఎన్నో విషయాల్లో అద్వితీయుడు. చిన్నతనంలోనే తొలి తెలుగు ద్వ్యర్థికావ్యం “రాఘవ పాండవీయం” రాశాడు. తర్వాత వచ్చిన అనేక అనేకార్థ కావ్యాల్లా కాకుండా వ్యాఖ్యానాల అవసరం లేకుండా అర్థం చేసుకోగలిగే కావ్యం ఇది. (ఉదాహరణకి ఇతనితో పోటీగా రామరాజభూషణుడు రాసిన “హరిశ్చంద్ర నలోపాఖ్యానం” వ్యాఖ్యానం పక్కన లేకుండా అర్థం చేసుకోవటం పండితులకైనా అసాధ్యం.) ఈ కావ్యం తర్వాత వచ్చింది “కళాపూర్ణోదయం“. మూడోదీ చివరిదీ “ప్రభావతీ ప్రద్యుమ్నం“.

The sound of the kiss
సూరన కళాపూర్ణోదయానికి ఆంగ్లానువాదం. నారాయణ రావు గారి మిగిలిన రచనలమల్లేనే దీన్లో కూడ లోతైన విశ్లేషణలతో, అనిదంపూర్వమైన ఆలోచనల్తో కూడిన ఒక పరిశోధనా వ్యాసాన్ని జతచేశారు.

కళాపూర్ణోదయం కథ సూరన సొంతంగా అల్లింది. కావ్యప్రపంచానికి, భౌతికప్రపంచానికి ఒక అద్భుతమైన సంబంధాన్ని సిద్ధాంతీకరించింది. వశ్యవాక్కుల వాక్కు భౌతికప్రపంచంలో రూపాలుగా సంఘటనలుగా రూపుదిద్దుకుంటుందన్నది ఈ సిద్ధాంతసారం. దీన్ని కొంచెం విస్తరిస్తే ఒక కాలంలోని భౌతికప్రపంచ వ్యవహారాలు వశ్యవాక్కులైన వారు అంతకుముందే పలికిన మాటల భౌతికరూపాలని ప్రతిపాదించొచ్చు.

ఒకప్పుడు ఋషులు అలాటి వశ్యవాక్కులు. తర్వాత ఋషితుల్యులైన కవులు ఆ స్థానం పొందారు. అలాటి ఒక కవిగా తన్నుతను భావించాడు సూరన్న. అలా తన కావ్యప్రపంచంలో అతను సృష్టించిన బ్రహ్మాసరస్వతుల వర్తనలు, వాక్కులు ఆ కావ్యంలోని భౌతికప్రపంచంలో పాత్రలుగా వాటి ప్రవర్తనలుగా ఆకారాలు ధరిస్తాయి. కవులకు ప్రతిపాదించబడ్డ ఈ అతిలౌకికశక్తిని A poem for the right moment సందర్భంలో నారాయణ రావు గారు గుర్తించి వివరించినట్టు ఇదివరకు చెప్పుకున్నాం. సూరన్న తర్వాత వచ్చిన అప్పకవి కూడ ఈ లక్షణాన్ని ఇంకా విస్తరించాడు. కావ్యప్రపంచానికి, భౌతికప్రపంచానికి ఉన్న సంబంధం గురించి ఆ కాలంలో చాలామంది మేధావులు దీర్ఘంగా ఆలోచించారనటానికి ఇవి కొన్ని ఉదాహరణలు. ఆ సంబంధం గురించి పింగళి సూరన ఒక సిద్దాంతాన్ని ప్రతిపాదించటమే కాకుండా దాని చుట్టూ ఒక అనితరసాధ్యమైన కథని అల్లి దాన్ని అసాధారణంగా మలిచాడు.

కథనపరంగా కూడ కళాపూర్ణోదయం మార్గం చాలా కొత్తది. అదివరకెప్పుడూ అంతటి సంక్లిష్టత, ఏకసూత్రత, ఉత్కంఠభరితమైన కథనం భారతీయ సాహిత్యంలో రాలేదు. బాణభట్టు “కాదంబరి“తో కొంత బాదరాయణసంబంధం ఉన్నట్టనిపించినా కథాజటిలతలో, కథనగుణంలో రెంటికీ హస్తిమశకాంతరం వుంది. సూరన పాత్రలు, కథనం వైవిధ్యంలో, ప్రవాహగుణంలో వాటికవే సాటి. (ఆసక్తి వున్నవారు సూరన కళాపూర్ణోదయానికి పూర్తిగా మాతృకననుసరిస్తూ నేను కొంతకాలం క్రితం రాసిన తేలిక వాడుకతెలుగు వచనానువాదం ఇక్కడ చదవొచ్చు.)

చివరికి సంప్రదాయ తెలుగు రచనల్లో లెక్కలేని లోపాల్ని చూసిన కట్టమంచి రామలింగారెడ్డి వంటి వారికి కూడ ఎంతగానో నచ్చిన ఏకైక కావ్యం కళాపూర్ణోదయం. పాశ్చాత్య సాహిత్యంలో గొప్ప లక్షణాలనుకున్నవి ఇందులో పుష్కలంగా వుండటం దీనికో ముఖ్య కారణం. ఈ పార్శ్వాన్ని కూలంకషంగా పరిశోధించిన నారాయణ రావు, షుల్మన్ గార్లు కళాపూర్ణోదయాన్ని దక్షిణాసియాలో వచ్చిన తొలి నవలగా నిరూపిస్తారీ The sound of the kiss అన్న గ్రంథంలో. ఒక నవలకుండవలసిన లక్షణాలు స్పష్టంగా ఇందులో ఉన్నట్టు చూపిస్తారు.

ఇందులో ఆధునికత వైపు అడుగులేస్తున్న సమాజం చిత్రితమైనట్టు నిరూపిస్తారు. “ఆధునికత”లో ఒక ముఖ్య లక్షణం వ్యక్తినిష్టత (individuality). కళాపూర్ణోదయ పాత్రల్లో అది కొట్టొచ్చేట్టు కనిపిస్తుంది. పురుష పాత్రలే కాదు స్త్రీ పాత్రలు కూడ వాళ్లకి ఏం కావాలో తెలుసుకుని దాన్ని సాధించటానికి అసాధారణ ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఇందులో పాత్రలు, జంటలన్నీ శృంగారపరంగా ఎంతో విశిష్టమైనవి. బ్రహ్మా సరస్వతుల దైవిక శృంగారం నుంచి సుముఖాసత్తీ మణిస్తంభుల విచిత్ర శృంగారం వరకు ఎంతో వైవిధ్యం చూస్తాం. ఇంకో విచిత్రం ఏమంటే దీన్లో వున్న ఒక నిజమైన “ప్రేమికుడు” రాక్షసుడు కావటం. మామూలుగా రాక్షసుడంటే స్త్రీలని బలాత్కరించేవాడన్న మూస భావానికి విరుద్ధంగా వాణ్ణి ఉదాత్తమైన ప్రేమికుణ్ణి చెయ్యటంలో కూడ ఈ రచన ఆధునికతకి అద్దం పట్టింది. కులంతో గుణం నిశ్చయమై పోదని ప్రతిపాదిస్తుంది. ఇప్పుడిది మామూలు విషయంలా అనిపించినా పదహారో శతాబ్దపు సమాజంలో ఇది విప్లవాత్మకమైన భావన.

ఆదునికతకి మరో పట్టుగొమ్మ “ఏకాంతం” (privacy). అది ఈ కథలో ఒక అతిముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కలభాషిణి నారదుడితో ఏదో ఏకాంతంగా మాట్లాడాలని చూస్తున్నదని వాళ్ల మాటలు వినబడకుండా వెళ్లి దూరంగా నిలబడతాడు మణికంథరుడు. ఆ తర్వాత అతనికి శాపం రావటానికి, దాన్నుంచి పర్యవసించే సంఘటనలకి, కారణభూతమౌతుందా ప్రవర్తన. మన సమాజంలో ఇప్పటికీ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే కూతవేటు దూరంలో వున్నవాళ్లంతా ఆ సంభాషణని వినొచ్చు, వింటారు. కావాలనుకుంటే వాళ్లెవరైనా ఆ సంభాషణలో పాల్గొనవచ్చు కూడ. ఏకాంతంగా మాట్లాడుకోవాలనుకున్నవారు ఇతరులెవరికీ వినపడని చోటు వాళ్లు చూసుకోవాలే తప్ప చుట్టూ వున్న వారు వారికి ఏకాంతం కల్పించరు. నాలుగొందల ఏళ్ల క్రితమే ఇప్పటికన్నా ఆధునికమైన ప్రవర్తనని చూపించటంలో సూరన్న ఎంతముందు చూపు కలవాడో ఆలోచిస్తే దిగ్భ్రాంతి కలక్కమానదు. ఇదేదో అతను అనాలోచితంగా, కథకోసం తయారుచేసిన ప్రవర్తన కాదు, కళాపూర్ణోదయం తర్వాత చాలాకాలానికి తను రాసిన “ప్రభావతీ ప్రద్యుమ్నం”లో ఈ ఏకాంత భావనని చాలా స్పష్టంగా చూపిస్తాడు. ప్రభావతి కోసం ప్రద్యుమ్నుడు శుచిముఖికి రాసిన ఒక లేఖని, అది తన పేరిట రాసినా ప్రభావతికి ప్రేమలేఖ కనక తను చదవకూడదని సూటిగా చెప్తుంది శుచిముఖి. ఇది ఎంతో అద్భుతమైన, అత్యంత అధునాతనమైన ప్రతిపాదన.

The sound of the kiss అన్న గ్రంథంలో ఇలాటి అనేక విషయాల్ని గుర్తించి “ఆధునికత” మనదేశంలో ఎప్పటినుంచో వున్న భావన అని, కళాపూర్ణోదయాన్ని ఒక గొప్ప నవలగా గుర్తించటానికి ఇది ఒక ముఖ్యమైన అంశమని చూపిస్తారీ అనువాదకులు.

దీన్ని నవలగా నిలబెట్టే మరో పార్శ్వం “ఏకసూత్రత”. సంక్లిషమైన కథైనా దీన్లోని ఏకసూత్రత మిరుమిట్లు గొలుపుతుంది. ప్రతి మాట సాభిప్రాయంగా, ప్రతి పేరు కావ్య-భౌతిక ప్రపంచాల సంబంధాన్ని చూపేలా సూరన్న ఈ కథని తయారు చేసిన తీరు పాఠకులకి ఆనందాశ్చర్యాల్ని కలిగించక మానదు.

అన్ని విధాలుగా ఒక నిఖార్సైన ఆలోచనామృతం కళాపూర్ణోదయం. దాన్ని అంతే చక్కగా ఆంగ్లంలోకి అనువదించటమే కాకుండా అంతర్జాతీయ సాహిత్యంలో దానికొక ప్రత్యేక స్థానం నిర్దేశించే గొప్ప ప్రయత్నం The sound of the kiss. తెలుక్కన్నా ఇంగ్లీషే బాగా అర్థమయే ఈనాటి తరానికి, ఆ పాటి తెలుగు కూడ అర్థం చేసుకోలేని రాబోయే తరాలకి ఇలాటి గ్రంథాలు అవశ్యపఠనీయాలు.

—————
ఇప్పటివరకు పరిచయం చేసిన రచనలే కాకుండా నారాయణ రావు గారు రాసిన పుస్తకాలు –

1. God on the hill – ఎంచి కూర్చిన అన్నమయ్య కీర్తనల అనువాదాలు, అన్నమయ్య గురించిన మౌలిక పరిశోధనలు.
2. When God is a customer – క్షేత్రయ్య, ఇతర పదకవుల శృంగార పదాల అనువాదాలు, విశ్లేషణలు.
3. For the lord of the animals – ధూర్జటి కాళహస్తీశ్వర శతకం అనువాదం, శతకాల, శతక కవుల గురించిన పరిశోధనలు.
4. Classical Telugu Poetry – నన్నయ గారి నుంచి పందొమ్మిదో శతాబ్దం వరకు వచ్చిన తెలుగు కవిత్వంలో ఎంచిన రచనా భాగాల అనువాదాలు, వివరణలు.
5. Hibiscus on the lake: Twentieth century Telugu poetry
6. Siva’s warriors – పాల్కురికి సోమనాథుడు, ఇతర శివకవుల రచనల గురించి.
7. Textures of time: writing history in South India 1600 – 1800.

ఇవి కాక అసంఖ్యాకమైన పరిశోధనా పత్రాలు అనేక సంకలనాల్లో, జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. తెలుగు రామాయణాల గురించిన ఒక పత్రానికి అనువాదం ఇక్కడ చూడొచ్చు. అలాగే కొన్ని స్త్రీల రామాయణం పాటల గురించి నారాయణ రావు గారు రాసిన వ్యాసాలు ఇక్కడ, ఇక్కడ.

You Might Also Like

5 Comments

  1. ఈమాట » నాకు నచ్చిన పద్యం: ఊయలూగే అమ్మాయిలు

    […] ముఖ్యంగా వెల్చేరు నారాయణ రావు గారు సౌండ్ ఆఫ్ ది కిస్ పేరుతో ఆంగ్లంలో ఈ కథని అనువదించడమే […]

  2. pavan santhosh surampudi

    వేల్చేరు నారాయణరావు గారు చేస్తున్న బృహత్తర ప్రయత్నం గురించి తెలియజెప్పినందుకు ధన్యవాదాలు. ఆంగ్లంలోకి అనువాదం చేస్తూ ఆయా గ్రంధాలపై కొత్తవెలుగు ప్రసరించడం వల్ల ఇది ప్రస్తుత తెలుగు సాహిత్యంలో చాలా అవసరమైన పని.
    అలాంటి గొప్ప పుస్తకాన్ని గురించి పుస్తకం.నెట్లో పరిచయం చేసినందుకు కె.ఎస్.రామారావు గార్కి నా కృతఙ్ఞతలు.

  3. సౌమ్య

    రామారావు గారికి:
    మీ వ్యాసం చదివి ఈమాటలో “కళాపూర్ణోదయం” కు మీరు చేసిన సంక్షిప్త అనువాదం చదవడం మొదలుపెట్టాను. ఆ విధంగా కళాపూర్ణోదయాన్ని నాబోటి వారికి పరిచయం చేసినందుకు మీకు అనేకానేక ధన్యవాదాలు. ఒక్కొక్క కథా-ఉపకథా చాలా క్రియేటివ్ గా ఉన్నాయి. అద్భుతమైన కల్పనలు. కథలో ప్రతి చోటా ఆగి – “ఆహా! ఎంత క్రియేటివ్ గా కథ అల్లాడూ!” అనుకుంటూనే ముందుకుసాగుతున్నాను. అనువాదంలోనే ఇలాగుంటే అసలుకి ఎలా ఉంటాయో! అనుకున్నా, అంత తెలుగు నాకు రాదు కనుక, ఏమీ చేయలేము. కథా-కథనాలు నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మీరు అందించిన తేలిక వచనానికి మరొక్కసారి ధన్యవాదాలు.

    1. K.V.S. Ramarao

      సౌమ్య గారు: కళాపూర్ణోదయం గురించి మీరన్న మాటలు ప్రత్యక్షర సత్యాలు. ఇంత సంక్లిష్టమూ, తార్కికమూ, ఉత్కంఠభరితమూ ఐన కథ ఇంతవరకు ప్రపంచ సాహిత్యంలో రాలేదు, నేను చూసినంతలో. చివరికి ఒక చిలక తనెందుకు నందనవనాన్నుంచి ద్వారకకి వచ్చిందో చెప్పే “పిట్ట”కథ కూడ నమ్మగలిగేదిగా చెయ్యటంలో పింగళి సూరన చూపిన ప్రతిభ అద్వితీయం. తెలుగు చదవగలిగిన వాళ్లందరూ చదవదగ్గది కళాపూర్ణోదయం. తెలుగు రాదు, I only read English books అనే వాళ్లకి నారాయణ రావు గారి అనువాదం వుండనే వుంది. తెలుగు వారై పుట్టి కళాపూర్ణోదయం చదవకపోవటం స్వయంకృతాపరాధమే !

  4. muthevi ravindranath

    రామారావుగారు చేసిన గ్రంథ పరిచయం బాగుంది.వెల్చేరు నారాయణ రావుగారి వ్యాఖ్యాన గ్రంథాలే కాక మూల గ్రంథాలు కూడా చదవాలనే ఆసక్తిని చదువరులలో రేకేత్తింపజేసేలా ఉన్నదీ పరిచయ వ్యాసం.ధన్యవాదాలు.
    –ముత్తేవి రవీంద్రనాథ్, తెనాలి.

Leave a Reply