నేనే బలాన్ని – టి.ఎన్. సదాలక్ష్మి వ్యక్తిత్వచిత్రణ

కొన్నాళ్ళ క్రితం ముదిగంటి సుజాతారెడ్డిగారి ఆత్మకథ ముసురును ఇక్కడ పరిచయం చేస్తూ, తెలుగులో మహిళల ఆత్మకథలు తక్కువగా ఉన్నాయని వ్రాశాను. ఆ వెంటనే దొరికిన కొన్ని ఆత్మకథలను (పొణకా కనకమ్మ, ఏడిదము సత్యవతి) ఇక్కడ పరిచయం చేస్తూ నేనే బలాన్ని పుస్తకం గురించి కూడా ప్రస్తావించాను. ఐతే, ఈ పుస్తకం టి.ఎన్. సదాలక్ష్మిగారి ఆత్మకథ కాదు. గోగు శ్యామలగారు వ్రాసిన జీవితకథ. కాని, చాలా చోట్ల ఈ కథ టి.ఎన్.సదాలక్ష్మిగారి సొంత గొంతుకలోనే వినిపిస్తుంది.

అన్వేషి సంస్థ ‘రాష్ట్ర రాజకీయాలలో, ఉద్యమాలలో దళిత స్త్రీల పాత్ర ‘ ప్రాజెక్టులో భాగంగా టి.ఎన్.సదాలక్ష్మి జీవితంపై పరిశోధన జరిగి ఈ పుస్తకం వెలువడింది. గోగు శ్యామలగారు సదాలక్ష్మిగారిని ఇంటర్వ్యూ చేసి ఆమె జీవితకథని వ్రాద్దామని చాలాకాలం నుంచి ప్రయత్నించినా, ముందు సదాలక్ష్మిగారు సహకరించలేదట. ఆవిడకు నమ్మకం దొరికి తన అనుభవాల గురించి శ్యామలగారికి చెప్పటం మొదలుబెట్టిన కొన్నిరోజుల్లోనే సదాలక్ష్మిగారు మరణించారట. సదాలక్ష్మిగారి సన్నిహితుల, సహచరుల సహకారంతో ఈ పుస్తకాన్ని పూర్తిచేశానని శ్యామలగారు వ్రాశారు.

టి.ఎన్. సదాలక్ష్మిగారు 1928 డిశెంబరు 25న బొలారం ప్రాంతంలో “అట్టడుగు కులాలన్నింటిలోకీ అడుగు కులంగా కొనసాగుతున్న మెహతర్ కులంలో” జన్మించారు. తండ్రి కంటోన్మెంట్ ప్రాంతంలో సఫాయి పని చేసేవాడు. కానీ ఇంటి దగ్గర వైద్యం చేసేవాడు. తల్లి వడ్డీ వ్యాపారం చేసేది. తమవారిలో ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబంగానే లెక్క. ఆరుగురు పిల్లల తర్వాతి ఆఖరి పిల్ల అని తల్లితండ్రులు సదాలక్ష్మిని గారాబంతో పెంచారు; ఆడపిల్ల అన్న వివక్షత చూపలేదు. అన్నలు కూడా ఆమెను అలాగే చూసేవారట. వీరివంశంలోనే తొలితరంగా, 11వ ఏట, స్కూల్లో చేరింది. బొలారంలో ప్రైమరీ స్కూల్లో, తర్వాత కీస్ హైస్కూల్లో, ఆ తరువాత కొన్నాళ్ళు నిజాం కాలేజీలో చదివారు (రజాకార్ల ఆగడాలు ఎక్కువగా ఉన్న ఆ రోజుల్లో ఈవిడ బొడ్లో కత్తి పెట్టుకొని బస్సులో రోజూ అంత దూరం వెళ్ళి చదువుకొనేదట). కో-ఎడ్యుకేషన్ కాలేజ్ అని పెద్దన్న ఆ కాలేజ్ మాన్పిస్తే, కొంత వ్యవధి తర్వాత మద్రాస్ క్వీన్‌మేరీస్ కాలేజ్‌లో ఎఫ్.ఏ చదివారు. స్కూలురోజుల్లో ఆటలన్నిట్లో ఫస్టు. చదువులోనూ ఫస్టే; నెలకి ఆరు రూపాయలు మెరిట్ స్కాలర్షిప్ వచ్చేది (అప్పుడు ఆమె తండ్రి నెలజీతం ఎనిమిది రూపాయలు). తల్లితండ్రులు ఆ డబ్బు ఆమె ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోమన్నారట. ఆ డబ్బులతో వేరే పిల్లలకు బట్టలు కొనిపెట్టటం, ఫీజులు కట్టటం చేసేదట.

సదాలక్ష్మిగారి చిన్నతనంలోనే ఆర్యసమాజం దళితవాడలకు దగ్గరయ్యింది. ఆమె అన్నలు ఆర్యసమాజంలో చేరారు. సదాలక్ష్మి వారి బాటలోనే చేరింది; శాకాహారిగా మారి, జీవితమంతా అలాగే ఉంది. ఆర్యసమాజ నాయకుడు పులి నర్సింహులు గాంధేయవాది. సదాలక్ష్మి చిన్నతనంలో ఆయన ప్రభావం ఆమెపై చాలా ఉంది. ఆర్యసమాజానికి వచ్చే టీవీ నారాయణ అనే కుర్రవాడు ఆమెకు స్కూల్లో సీనియర్. అతని‌తో లెక్కలు చెప్పించుకునేది. ఆవిధంగా స్నేహితులయ్యారు; జీవితాంతం కలసి సమాజసేవ చేద్దామనుకొన్నారు; తరువాత ఆర్యసమాజం ఆధ్వర్యంలోనే పెళ్ళి చేసుకున్నారు. సామాజికంగా టీవీనారాయణగారిది చెప్పులు కుట్టే కులం; సదాలక్ష్మిగారికన్నా పై కులం. అందుచేత వారి పెళ్ళి ఆయన కుటుంబానికి ఇష్టం లేదు. ఆయన తల్లి బాహాటంగా చూపిన తిరస్కారాన్ని ఆయన స్పష్టంగా వ్యతిరేకించకపోవటం తరువాత ఆలుమగలమధ్య దూరానికి కారణమయ్యింది. ఆయన ఎమ్మే పిహెచ్‌డీ చేసి, ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగాలు చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కమిషనర్‌గా రిటైర్ అయ్యారు. సదాలక్ష్మిగారు మాత్రం తన కుమారుడితో విడిగానే జీవించారు.

స్కూలు రోజులనుంచి సదాలక్ష్మి రాజకీయాల్లో పాల్గొంటుండేవారు. 1952 పార్లమెంటు ఎన్నికలలో టీవీనారాయణగారికి ఒక రిజర్వుడ్ నియోజకవర్గంలో పోటీ చేయమని ఆఫర్ వచ్చిందట. విద్యార్థిగా ఉన్న ఆయన, నేను పోటీ చేయలేను, మా ఆవిడ చేస్తుంది అని చెప్పారట. డాక్టరు అవుదామనుకున్న ఆవిడ రాజకీయాల వైపు మళ్ళింది. ఆ ఎన్నికలలో ఆవిడ ఓడిపోయినా, ఆ తర్వాత ఎస్.సి.నియోజకవర్గాలు కామారెడ్డి (1957), నిజామాబాద్(1960)ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటి ఎన్నికల్లో టీవీనారాయణగారి దగ్గర పాఠాలు నేర్చుకొన్న ఆవిడ ఆ తర్వాత స్వయంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటం మొదలుబెట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్‌గానూ, సంజీవరెడ్డి 1962 మంత్రివర్గంలో ముందు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా, ఆ తర్వాత సాంఘిక సంక్షేమ మంత్రిగా పని చేశారు. 1967 ఎన్నికలలో ఓడిపోయారు. 1969 తెలంగాణా ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించారు. ఆ ఉద్యమం విద్యార్థి ఉద్యమంనుండి రాజకీయ ఉద్యమంగా మారడంలో ప్రముఖ పాత్ర వహించారు. చెన్నారెడ్డి ప్రభృతులు జైలుకి వెళ్ళినప్పుడు ఆమె తెలంగాణా ప్రజాసమితి అధ్యక్షులుగా పనిచేశారు. ఆ సమయంలో పోలీస్ కంట్రోల్‌రూములమీద బాంబులు వేయడం పూర్తిగా ఈవిడ పర్యవేక్షణలోనే జరిగిందట. జైలునుంచి తిరిగివచ్చిన చెన్నారెడ్డితో విభేదాలు వస్తే ఆయన సదాలక్ష్మిని టీపీఎస్‌నుంచి బహిష్కరించారు.

మొదటినుంచీ బాబూ జగ్జీవనరాంతో సన్నిహితంగా ఉంటున్న సదాలక్ష్మి ఆయన కాంగ్రెస్‌నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయనతో పాటే ఉన్నారు. ఎన్‌టీరామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అందులో చేరి కొంతకాలం ఆ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఎన్నికలలో మాదిగలకు సీట్లు ఎన్ని ఇవ్వాలి అన్న విషయంలో ఆయనతో విభేదాలు వచ్చి దాన్నుంచి కూడా బయటకు వచ్చారు. దళితుల రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ ఉండాలన్న ప్రతిపాదనకు మద్దతుగా నడచిన మాదిగ దండోరా ఉద్యమానికి స్ఫూర్తిగా నిలచారు. ఎమార్పియెస్ ఉద్యమ నాయకుడు మంద కృష్ణ మాదిగను కొన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుని మరీ శిక్షణ ఇచ్చారట. ఈ తరం మాదిగకులం నాయకులు చాలా మందికి, వారందరూ ‘అమ్మ’ అని పిలచుకొనే, సదాలక్ష్మిగారు గురువు, స్ఫూర్తి. చివరిదాకా ఈ ఉద్యమానికి, తెలంగాణా ఉద్యమానికి కట్టుబడే ఉన్నారు. సదాలక్ష్మి ఊపిరితిత్తుల వ్యాధితో 2004 జులై 24న మరణించారు.

ఈ పుస్తకంలో సదాలక్ష్మిగారు చాలా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, పట్టుదల, మొండితనం ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. ఏ పని చేసినా బాగా చేయాలి అన్న శ్రద్ధ, పట్టుదల ఆవిడ జీవితం అంతా కనిపిస్తాయి – చిన్నతనంలో ఆటల్లో, చదువులో, వివిధ పదవుల నిర్వహణలో, వంట చేయటంలో, సేద్యం చేయటంలో, ఆఖరుకు పంతానికి పోయి జింక బొమ్మ వచ్చేట్లుగా ఈతచాప నేయటంలో కూడా. మీదపడి పొడవబోయిన ఎద్దు ఎద మీద తన్ని తప్పించుకున్న, తాచుపాముని కొట్టిచంపిన ధైర్యవంతురాలు. ఆవిడ ఎక్కడా సర్దుబాటు చేసుకున్నట్టు, ఎవరికీ లొంగిపోయినట్లు కనిపించదు. “మనిషికి క్యారెక్టర్ ఉన్నప్పుడు ఎవ్వడేం జేసుకోలేడు. కొద్దిగా లూజ్ క్యారెక్టరుందనుకో, దాన్ని ఆట పట్టిస్తరు. నా అనుభవంతో జెప్తున్న. మన క్యారెక్టరు సరిగుంటె ఎవ్వడైన నీరుగారి పోతడు. అమ్మో ఆమెనా అందురు”. కొన్నిసార్లు ఆవిడ కోపం, ఆవేశం ఆవిడకి ఇబ్బందులు కలిగించడమే కాకుండా ఆవిడ ఆశయాల సాధనను కష్టతరం చేసినట్లుకూడా అనిపిస్తుంది.

తొలిసారి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిణిగా అయినప్పుడు తారాపోర్‌వాలా అనే డబ్బు, పలుకుబడీ కల పెద్దమనిషి ఒక విషయంపై ఆయనకు అనుకూలంగా, ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా ఫైలులో వ్రాయమని కోరితే, ఆయన బ్రతిమాలుడుకూ బెదిరింపులకూ లొంగకుండా ఆవిడ తిరస్కరించారట. అతను నీ లెక్కేమిటి అన్న ఉద్దేశంలో మాట్లాడితే, “ఐ విల్ సీ యు బిహైండ్ బార్స్” అని చెప్పిందట. తరువాత ముఖ్యమంత్రి సంజీవరెడ్డి ఆమెను పిలచి కాంప్రమైజ్ కమ్మని చెప్పినా వినకుండా నేను సంతకం పెట్టను, కావాలంటే మీరే పెట్టుకోండి అని చెప్పిందట. ఆ తర్వాత సంబంధిత మంత్రి సంతకం లేకుండా ముఖ్యమంత్రిగారు ఫైలుపై సంతకం పెట్టటం ఆయన ప్రధానమంత్రిచేత చివాట్లు తిని దాదాపు పదవి పోగొట్టుకొనేంత పెద్దగొడవకు కారణమయ్యిందట. ఈ సంఘటన గురించి చదివినప్పుడు, ఈమధ్య కీలకమైన ఫైళ్ళలో ముఖ్యమంత్రి చెపితే సంతకం పెట్టాం అని నిస్సంకోచంగా చెపుతున్న కొంతమంది మంత్రులనూ గుర్తు తెచ్చుకుంటే ఏమనిపిస్తుంది?

అలాగే, సదాలక్ష్మిగారు చనిపోయేముందు రోజుల్లో ఆమెకూ ఆమె కుటుంబసభ్యులకూ మళ్ళీ దూరం ఏర్పడిందట – ఎందుకంటే ఆమె తన ఆస్థినంతటినీ ఒక ట్రస్టు రూపంలో పెట్టి ఆడవాళ్ళకోసం ఒక ఇండస్ట్రియల్ స్కూల్ పెట్టాలని అనుకున్నారట. “ఇప్పుడు మాకు దీనిమీదే డిఫరెన్సెస్ నడుస్తున్నాయి. ట్రస్ట్ పెడితే వాళ్ళకు ఏమీ రాదు అనుకుంటున్నారు. నాకు చాలా చరిత్ర వుంది. ఎస్.సిల్లో అణగారిపోయినవాళ్ళకు ఒక ట్రస్ట్ పెట్టి సహాయపడాలని అనుకుంటున్నాను. బిడ్డలకు, కూతుళ్ళకు, కోడళ్ళకు ఇవ్వాల్సింది ఏం లేదు. చరిత్ర వుంది. స్ఫూర్తి కావాలె. నేను చనిపోయినా నా ఉద్దేశం చనిపోగూడదు… సేవాట్రస్టులు పెడుతున్నందుకే నా బిడ్దలు నా దగ్గరకు రావడం లేదు. నేను ఒక్కదానినే వుంటున్నాను”. విలువలు గల మనిషి, విలువైన మనిషి సదాలక్ష్మి గారు.

తెలంగాణా దళిత మహిళగా జన్మించిన సదాలక్ష్మిని సామాజికంగా బహుముఖమైన వివక్షలకు గురికాగల పరిస్థితులు ఉన్నా, తనకు వచ్చిన కొన్ని అవకాశాలను ఆమె చక్కగా ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగా ఎదగటమే కాకుండా చాలామందికి స్ఫూర్తిగా నిలిచారు.

సదాలక్ష్మిగారి గురించి ఇంతకు ముందు నాకు తెలియని విషయాలు ఈ పుస్తకం ద్వారా నాకు తెలిసినా, ఈ పుస్తకం నన్ను కొన్ని విషయాలలో నిరాశపరిచింది. ఈ పుస్తకంలో ఆమె వ్యక్తిత్వం ప్రస్ఫుటమైనట్లుగా, ఆవిడ జీవిత చరిత్ర – ముఖ్యంగా రాజకీయజీవితం – వెల్లడి కాలేదు. రచయిత్రికి సదాలక్ష్మిగారిపట్ల విపరీతమైన ప్రేమ, గౌరవం ఉండటం వల్ల పొగడ్త, మెచ్చుకోళ్ళు ఎక్కువై ఇది జీవిత చరిత్ర (బయోగ్రఫీ) కన్నా పొగడ్తల గ్రంథం (హెజియోగ్రఫీ) అయిపోయింది. చాలా విషయాలు పునరుక్తమౌతాయి; ఒకే విషయం రచయిత్రి మాటల్లో, సదాలక్ష్మి గారి మాటల్లో, ఆమె సన్నిహితుల మాటల్లో మళ్ళీ మళ్ళీ కనిపిస్తాయి. జీవిత చరిత్రలో చారిత్రకంగా నమోదు చేయవలసిన అంశాల పట్ల రచయిత్రి శ్రద్ధ వహించలేదు. ఉదాహరణకు టి.ఎన్. సదాలక్ష్మి అన్న పేరులో మొదటి రెండు అక్షరాలు వేటికి సంకేతాలు? ఆవిడ మొదట పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం ఏది? ఎవరిపై పోటీ చేసి ఓడిపోయారు? ఎంత తేడాతో ఓడివోయారు? ఆ ఓటమికి కారణాలేమిటి? తర్వాత ఎన్నికలలో ఆవిడకు సీటు ఎలా వచ్చింది? ఎవరిపై పోటీ చేసి గెలిచారు? ఆ గెలుపుకు కారణాలేమిటి? ఆవిడకు డిప్యూటీ స్పీకర్ పదవి, మంత్రి పదవి రావటం వెనుక ఉన్న పరిస్థితులూ, కారణాలూ ఏమిటి, తెలుగుదేశంలో ఆవిడ ప్రవేశం వెనుక చారిత్రక నేపథ్యం, ఆ పార్టీలో ఆవిడ నిర్వహించిన పాత్ర వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. ఆవిడకు ఎంతమంది పిల్లలు అన్న విషయం కూడా స్పష్టంగా తెలీదు. వేరే విషయమేదో చెబ్తున్న సదాలక్ష్మి గారు ఉన్నట్లుండి చిన్నకూతురు బాయిలో పడిపోయి శవమయింది అని చెప్తారు. అప్పటివరకు ఆవిఢకు కూతుళ్లు ఉన్నారని మనకు తెలీదు. ఇంత ముఖ్యమైన విషయం గురించి మళ్లీ ఎక్కడా ప్రస్తావన, వివరణ లేవు. ఆమె వ్యక్తిగత చరిత్రను గానీ, ఆమె రాజకీయ చరిత్రను కానీ ఒక క్రమ పద్ధతిలో పాఠకులకు అందించటానికి రచయిత్రి ప్రయత్నించలేదు అనిపించింది. విస్తృత తాత్విక నేపధ్యాలను వివరించడానికి పడ్డ తాపత్రయంతో సమానమైన శ్రద్ధ వ్యక్తిగత చరిత్ర, నేపధ్యాలని వివరించడంలో చూపించకపోవటం ఈ పుస్తకంలో పెద్ద లోపం. (ఇంతకూ సదాలక్ష్మిగారు నేనే బలాన్ని అని ఏ సందర్భంలో అన్నారు అన్న విషయం ఈ పుస్తకంలో ఎక్కడైనా ఉంటే నేను మిస్సయ్యాను).

ఈ పుస్తకంలో సదాలక్ష్మిగారి గురించి చెప్పటానికి ఉపయోగించినంత జాగా కన్నా ఎక్కువ జాగాను రచయిత్రి తన రాజకీయ తాత్విక దృక్పథాలను చర్చించటానికి ఉపయోగించారేమో అన్న అనుమానం చాలాసార్లు వచ్చింది. రచయిత్రి దృక్పథాలకు అనుగుణంగా సదాలక్ష్మిగారిని చూపించటానికి ప్రయత్నించారా అని కూడా అనిపించింది. సదాలక్ష్మిగారి గురించి సరిగా తెలుసుకోవడానికి రచయిత్రి అడ్డం వచ్చారని అనిపించింది. ఈ పుస్తకం వ్రాసినందుకు శ్యామలగారిని, అన్వేషి సంస్థనూ అభినందిస్తున్నా, ఈ పుస్తకం ఇంకా ఆసక్తికరంగా, ఉపయోగకరంగా ఉండే అవకాశం కోల్పోయారని చెప్పకుండా ఉండలేకపోతున్నాను.

ఈ పుస్తకంలో వివిధ చారిత్రక విషయాల గురించి, వ్యక్తుల గురించి పుస్తకం చివరలో వివరించటానికి ప్రయత్నించటం ముదావహం. కానీ ఆ విషయంలోనూ సమగ్రత, సమతూకం లోపించాయి. అలాంటి పట్టికలు నిర్మించడానికి కొన్ని శాస్త్రీయ విధానాలు ఉన్నాయి. వాటిని పూర్తిగా పాటించి ఉంటే ఇంకా ఉపయోగకరంగా ఉండేది. సదాలక్ష్మిగారి జీవితంలో ముఖ్యఘట్టాలని ఒక క్రమంలో పట్టికగానైనా ఇస్తే బాగుండేది. అలాగే, పుస్తకంలో ఉన్న వ్యక్తుల, సంఘటనల సూచిక ఉంటే ఉపయుక్తంగా ఉండేది (ఈ లోపం తెలుగులో దాదాపుగా ఇటువంటి పుస్తకాలన్నిటిలోనూ ఉంటుందనుకోండి).

సదాలక్ష్మిగారు తన మాటల్లో తనగురించి చెప్పుకొన్నప్పుడు మాత్రం ఈ పుస్తకం నన్ను బలంగా ఆకట్టుకుంది. ఆమె చరిత్ర, వ్యక్తిత్వమూ ఆమె మాటల్లోనే స్పష్టంగా కనిపిస్తాయి. ఆవిడ జీవిత చరిత్ర మొత్తం ఆవిడ మాటల్లోనే మనం చదవలేకపోవడం దురదృష్టం. రచయిత్రి చెప్పినదాన్నిబట్టి ఇంతకు ముందు ఎవరో సదాలక్ష్మిగారి దగ్గర ఇంటర్వ్యూలు రికార్డు చేసుకున్నారట. అవి వెలికి తీయగలిగితే, ఆవిడ జీవితమూ, వ్యక్తిత్వమూ ముందు తరాలవారికి స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. సదాలక్ష్మిగారితో బాగా పరిచయం ఉన్న వై.బి.సత్యనారాయణగారు ఆమె గురించి ఆంగ్లంలో ఒక వ్యాసాన్ని వ్రాశారని ఈ పుస్తకం వల్ల తెలుస్తుంది. ఆ వ్యాసమూ ప్రచురణ కావలసిన అవసరం ఉంది.

ఈ పుస్తకం వ్రాయడానికి 2004లో చాలా హడావుడి పడినట్లు రచయిత్రి మాటల్లో అనిపించింది. 2011వరకూ ఎందుకు ప్రచురణ కాలేదో?

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన ఈ పుస్తకం ముఖచిత్రంపై సదాలక్ష్మిగారి ఛాయాచిత్రం బాగుంది. పుస్తకంలో అచ్చుతప్పులు చాలా తక్కువ. కొన్ని ఎడిటింగ్ తప్పులు చిరాకు పెట్టాయి. ఫాంటు, లైన్ల మధ్య జాగా కంటికి ఇబ్బందిగా అనిపించింది. ఇంకొద్దిగా ఛాయాచిత్రాలుంటే బాగుండేది.

మనం తెలుసుకోవలసిన వ్యక్తి సదాలక్ష్మిగారిగురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగిస్తుంది; కానీ చదవటానికి కష్టపడాలి.

నేనే బలాన్ని – టి.ఎన్. సదాలక్ష్మి బతుకు కథ
గోగు శ్యామల
జులై 2011
హైదరాబాదు బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్
గుడిమల్కాపూర్, హైదరాబాద్ – 500 067
ఫోన్: 40 2352 1849
356 పెజీలు; 180 రూపాయలు
(పుస్తకం ఆన్లైన్ చదువుకు కినిగే.కాం లో కూడా లభ్యం)

You Might Also Like

3 Comments

  1. epass

    Interesting your life story. we also want to write my life story. soon i will write that.

  2. Brig (Dr) C V R Mohan

    1964 -1965 లో నేను మొదటి ఫార్ము (6 వ తరగతి)లో చదివినప్పుడు మా స్కూలు(దేవస్థానం/ యస్విహైస్కూలు) ప్లాటినం జూబిలీ కి, అప్పటి దేవాదాయ మంత్రి శ్రీమతి సదా లక్ష్మిగారు ప్రధాన అతిదిగా వచ్చారు. బాగా మాట్లాడారు.
    good write up! thanks

  3. మహిళావరణం-6 « sowmyawrites ….

    […] ఒక జీవిత చరిత్ర రాశారు. దాని గురించి పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం చదివితే, సదాలక్ష్మి గారి […]

Leave a Reply