నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలు
రాసిన వారు: రాంకి
రాంకి – వ్యవసాయశాస్త్రంలో పట్టభద్రులై అభిరుచి కొద్దీ పత్రికారచనలోకి వచ్చారు. ప్రస్తుతం వీక్షణం సహాయ సంపాదకులుగా ఉన్నారు.
ఈ వ్యాసం మొదట వీక్షణం పత్రిక జనవరి 2010 సంచికలో ప్రచురితమైంది. వ్యాసాన్ని పుస్తకం.నెట్లో తిరిగి ప్రచురించడానికి అనుమతించిన వీక్షణం సంపాదకులకి ధన్యవాదాలు – పుస్తకం.నెట్
**************
‘ఆచరణ నుండి జ్ఞానం పుడుతుంది. ఆ జ్ఞానం కొత్త ఆచరణకు దారితీస్తుంది. కొత్త ఆచరణ మరింత కొత్త జ్ఞానానికి మరింత మెరుగైన ఆచరణలకు దారితీస్తుంది. జ్ఞానం అంతిమ ప్రయోజనం ఆచరణను బలోపేతం చేయడానికే’ అన్న మావో మాటలకు భిన్నంగా మన చదువులు ఆచరణకు, జ్ఞానానికి మధ్య ఉన్న సంబంధాన్నే తెగ్గొట్టేశాయి. చదివిన చదువుకు, జీవిస్తున్న బతుక్కు ఎటువంటి సంబంధం లేదు. జీవితంలో శాస్త్రీయ దృష్టి అలవడే పరిస్థితులు లేవు. సి.వి. రామన్ భౌతిక శాస్త్రంలో శాస్త్రవేత్తే అయినా తన నమ్మకాల వలన గంగా నదిలో మునిగిన చదువే. రోదసికి చేరి భూమిని, గ్రహాలను పరిశీలించే రాకెట్ నమూనాను కూడా శాస్త్రవేత్తలు వెంకటేశ్వరుని పాదాల ముందు ఉంచి పూజలు చేసే వెనుకబాటు. మనిషి గుండెను తీసి గుండెను పెట్టే శాస్త్రజ్ఞానం పెరుగుతున్నా, తాయెత్తుతోనే గుండె ధైర్యం పొందే దైన్యంలో ప్రజలు ఈనాటికీ కొనసాగుతున్నారు. శాస్త్రానికీ (జ్ఞానానికీ), ఆచరణకూ సంబంధం లేకుండా చేసి, ఏదీ అర్థమవకుండా చేసి, ప్రశ్నలకు తావులేకుండా చేసి నడిపించే సమాజ రీతిని ఎలా అర్థంచేసుకోవాలి? అర్థం చేసుకోకుండా దాన్ని ఎలా మార్చగలుగుతాం? ఇదంతా ఎందుకంటే, విషయాలకుండే కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకునే స్థాయికి మన సమాజం ఇంకా ఎదగలేదు. ఒక పరికరాన్ని వాడుకోవడవేు తప్ప, ఆ పరికరం వెనుక ఉన్న జ్ఞానం, ఆ జ్ఞానం వెనుక ఉన్న కార్యకారణ సంబంధం మనకర్థం కాలేదు. (అర్థం కాలేదు అనేకంటే అర్థం చేసుకోనీయకుండా ఉంచింది ఈ వ్యవస్థ). మరి వీటికి మనమేం చేయాలి అంటే సరియైన జ్ఞానాన్ని అందుకోవడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నిస్తున్న వారికి సహాయపడాలి.
నన్ను మొదటిసారి బాగా ప్రభావితం చేసిన పుస్తకం శివవర్మ రాసిన ‘సంస్మృతులు’. నేను పెద్దాపురం మహారాణి కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మిత్రుడు మహామ్మద్ ఇబ్రహీం నాచేత ఆ పుస్తకం చదివించాడు. ఆ పుస్తకం వల్ల భగత్‌సింగ్ కలలుగన్న నిజమైన స్వాతంత్య్రం మనకు అందలేదని అర్థమయింది. అందులో భగత్‌సింగ్, చంథ్రేఖర్ ఆజాద్, రాజగురు, సుఖ్‌దేవ్‌ల త్యాగాలు, వారి సాహాసాలు, బలిదానాల గురించి చదివాక దేశ స్వాతంత్య్రం, సమానత్వం, ప్రజల సౌభ్రాతృత్వాల కోసం ప్రాణాలర్పించిన ఆ త్యాగధనుల జీవితాలు నాలో తెలియని అలజడిని రేపాయి. భగత్‌సింగ్ తన తండ్రి తెచ్చిన పెళ్లి ప్రస్తావనను సున్నితంగా తిరస్కరిస్తూ, దేశ స్వాతంత్య్రం కోసం కార్యోన్ముఖుణ్నై ఉన్నానని, తనకు పెళ్లి చేసుకోవాలని లేదని తండ్రికి ఉత్తరం రాయడం, ఆ ఉత్తరం చదివిన తండ్రి భగత్‌సింగ్ లక్ష్యాన్ని గౌరవిస్తూ ఉన్నతాశయం వైపు సాగిపోమ్మని ప్రోత్సహించడం మనచేత కన్నీళ్లు పెట్టించడవేు కాక, సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యత పడేలా చేస్తాయి.
అదే క్రమంలో నేను చదివిన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ నాలో రేగిన అశాంతికి ప్రాణ వాయువు పోసింది. మహాప్రస్థానంలోని కవితలన్నిటిని చదువుతూ, పాడుతూ, పంచుకుంటూ గడిపిన రోజులవి. ఆ వరుసలోనే జాక్ లండన్ ‘ఉక్కుపాదం’ (English: The Iron Heel). ఈ నవలలో ఎర్నెస్ట్ ఎవర్‌హార్డ్ తన ప్రత్యర్థులతో సూటిగా చేసే చర్చలు, ఒక ఆత్మవిశ్వాసంతో, శాస్త్రీయతతో ప్రజల పక్షం నిలిచి ప్రశ్నించే ధోరణి ప్రతి ఒక్కరిని ఉత్తేజితుల్ని చేస్తుంది.
తగళి శివశంకర్ పిళ్లై ‘కూలిగింజలు’, అలెక్స్ హేలీ ‘ఏడు తరాలు’ (English: Roots) సమాజంలో తరతరాలుగా అణచివేయబడుతున్న వర్గాల ప్రజల ఆక్రందనలను మన కళ్లకు కడతాయి. మాక్జిం గోర్కీ రాసిన ‘అమ్మ’ (English: Mother) నవలలోని అమ్మ తన కొడుకు గురించి బెంగపడి, బాధపడే క్రమం నుంచి తన కొడుకు లాంటి అనేక మంది యువతీ, యువకులకు తల్లిగా మారడవేు కాకుండా, ఆ పిల్లల ఉన్నత లక్ష్యాలను తన లక్ష్యంగా చేసుకోవడం ప్రతి ఒక్కరికీ ఉన్నత సామాజిక లక్ష్యాల వైపుకు నడిచే శక్తినిస్తుంది.
అలాగే రంగనాయకమ్మ గారి ‘జానకివిముక్తి’ నా ఆలోచనలకు స్పష్టతను ఇచ్చింది. మనకోసం మనం అనే ధోరణి మాత్రవేు కాక మన చుట్టూ ఉన్న సమాజం కోసం బాధ్యత పడినప్పుడే, పరిస్థితులు మారతాయనే స్పృహాను పెంచింది. మౌలికంగా మనం మన సమాజాన్ని అర్థం చేసుకోవడానికి డి.డి. కొశాంబి ‘ప్రాచీన భారతదేశ చరిత్ర’ బాలగోపాల్ చేసిన పరిచయం ఎంతో ఉపయోగపడుతుంది. చరిత్రకు సంబంధించి ప్రతి ఒక్కరికి మెరుగైన, స్పష్టమైన దృష్టిని ఇస్తుంది. అలాగే న్యూవిస్టాస్ ‘మార్క్సిస్టు తత్వశాస్త్రం’ సమాజాన్ని వస్తుగతంగా అర్థం చేసుకోవడానికి మనకు అనేక పరికరాలు అందిస్తుంది.
ప్రభావితం చేసిన ఒక్క పుస్తకం గురించి రాయడం బహుశా కష్టవేు. ఈ క్రమంలో చాలా పుస్తకాలే ఉన్నాయి. వివిధ సందర్భాలలో ఆర్.ఎస్. రావు గారు ‘ఒక మంచి పుస్తకం చదవండి, మీ అభిప్రాయం చెప్పండి. ఏదయినా రాయండి, కలిసి చర్చించండి’ అన్న మాటలు మనకు, మన సమాజానికి చాలా అవసరమనిపిస్తాయి. గ్రంథాలయోద్యమం నడిచిన ఈ నేలపైన మనమంతా ప్రతి గ్రామానికో గ్రంథాలయాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ దిశగా మనం నడుం బిగించాలి.
మనమంతా మార్కెట్ సంస్కృతిని పెంచే వస్తువులను కాకుండా, ఆలోచనలను మార్చే మంచి సాహిత్యాన్ని కానుకలుగా ఇచ్చే సంప్రదాయం మొదలుబెడితే సమాజానికి చాలా వేులు జరుగుతుందని అనిపిస్తుంది. మంచి ఆలోచనలు, మనుషులు చేసే చైతన్యపూరితమైన కృషితోనే మనం సమాజాన్ని మార్చగలం అనే విషయం మనకు చరిత్ర గతిని చూస్తే అర్థమవుతుంది.
G K S Raja
Ramki Garu! Good books referred. Contextually I advise to add Che Guvera also to bread. Hope you might have read already.
Raja.