మనుచరిత్రలో మణిపూసలు

“మనుచరిత్రలో మణిపూసలు” నవతరం కోసం, మనుచరిత్రను పరిచయం చేస్తూ, సి.పి.బ్రౌన్ అకాడెమీ వారు “మల్లాది హనుమంతరావు” గారి వ్యాఖ్యానంతో వెలువరించిన పుస్తకం. ఇలా ప్రబంధ కావ్యాలను వాడుక తెలుగులో పరిచయం చేస్తున్న సి.పి.బ్రౌన్ అకాడెమీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మల్లాది వారి పరిచయానికి నా పరిచయం. (హనుమంతరావు గారే “ఆముక్తమాల్యద” గురించి కూడా పరిచయం చేసారు. దాని గురించి కొన్నాళ్ళ క్రితం పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం ఇదిగో)

పుస్తకం బహు చిన్నది. ప్రధానంగా మూడే భాగాలు. ఒకటి – కవి (అల్లసాని పెద్దన) పరిచయం. ఒకటి మనుచరిత్ర కథా సంగ్రహం. చివరిది అసలు విషయం – మనుచరిత్రలోంచి యాభై రెండు పద్యాలు ఎంచుకుని, వాటి గురించి ప్రతిపదార్థ తాత్పర్యాలతో సహా ఇచ్చిన వివరణ.

మొదటి పద్యం “శ్రీ వక్షోజ కురంగనాభ…” చదువుతూ ఉంటే కళ్ళకి కనబడ్డ దృశ్యం (మల్లాది గారి వివరణ చదివాకే సుమండీ!) అద్భుతంగా అనిపించింది. “ఆహా, ఏం రాసాడూ!” అనుకున్నా. అలాగే, రెండో పద్యం (పరిచయం చేసిన క్రమంలో)… “ఉల్లమునందు అక్కటికమూనుట…” లో “కిరాతకులంలో కూడా దయాగుణం చూస్తున్నాము కదా!” అంటూ శివుడితో పార్వతి పరిహాసమాడ్డం కూడా నాకు చాలా నచ్చింది. “అంకము జేరి శైల తనయా..” చదువుతూ ఉంటే, భలే ఊహ వచ్చిందే ఈయనకీ! అనుకున్నా. ఇలాగ, చెప్పుకుంటూ పోతే, దాదాపుగా ప్రతి పద్యమూ – ఈ పోలికేదో బాగుందే! అనుకుంటూనే చదివాను.

“ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్రా?” అని వరూధిని ప్రవరాఖ్యుడిని అడిగే దృశ్యం అలా చదువుతూ ఉంటే కళ్ళ ముందు సాక్షాత్కరించింది. అలాగే, “ఎందుండి ఎందుబోవుచు ఇందుల కేతెంచినారలిపుడు?” అని ప్రవరుడు సిద్ధుడిని అడిగిన దృశ్యం కూడా. బహూశా, భాష నాకు నేరుగా అర్థమైనందువల్ల కావొచ్చు. మొదట్నుంచీ వీళ్ళిద్దరి కథ భాగం గురించి అవగాహన ఉన్నందుకో, నాకు ఊహా శక్తి ఎక్కువయ్యో కానీ, ఏమిటో, పక్కన నిలబడి ఎవరో ఈ సంభాషణలన్నీ పలుకుతున్నట్లు కూడా అనిపించింది 😉

మామూలుగా ఒక రౌండు చదివేసినా కూడా, కొన్ని రోజులుగా ఎటుపోయినా సంచిలో దీన్ని పెట్టుకునే తిరుగుతున్నా. మా కొలీగ్స్ అందరూ క్రిస్మస్ సెలవులపై పోయిన రోజుల్లో నా మధ్యాహ్న భోజనాలన్నీ పెద్దన గారి పద్యాలూ, హనుమంత రావు గారి వ్యాఖ్యానాలతోనే. అయినా కూడా, ఆలోచించగా, నా అజ్ఞానాన్ని, పొగరునీ రెంటినీ బయటపెట్టేసుకోవడంలో సిగ్గుపడాల్సిందేమీ లేదని అనిపించి, నాకనిపించిన మరి రెండు సంగతులు చెబుతాను:

1) “అచటి విప్రులు మెచ్చరఖిల విద్యా ప్రౌఢి…..అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ” – అని ముగిసిన పద్యం నాకు మరీ అతి వర్ణన అనిపించింది. అయితే, చివర్లో ఉన్న వాక్యం “రుద్రవీణ” సినిమాలోని పాటలో “రండి, రండి రండీ..దయచేయండీ” అన్న పాటలో వినడమే కానీ, అది ఇక్కడిదని ది చదువుతూంటేనే తెలిసింది.

2) “శ్రీరుచిరత్వ భూతి మతి జిత్వర తాకృతి శక్తి కాంతులన్‌
ధీరత సార భోగముల ధీనిధి యీశ్వర నారసింహు డా
వారిజనాభ శంకరుల వారికుమారుల వారితమ్ములన్‌
వారి యనుంగుమామలను వారి విరోధుల బోలు నిమ్మహిన్‌”
– అన్న పద్యం, దాని కింద వివరణా చదివాక, దిమ్మ తిరిగి మైండు బ్లాకైందంటే, మీరు నమ్మాలి. తప్పదు.

అలాంటివి మరికొన్ని ఉన్నాయి – అతి పొగడ్తలు అనిపించినవీ, మరీ పనిగట్టుకుని క్లిష్టమైన వర్ణనలు చేసి క్రాస్వర్డ్ పజిళ్ళకి ధీటుగా ఉన్నవీ. అయినా కూడా, చివరగా, అంతకు ముందు “ఆముక్తమాల్యద” పరిచయం చదివాను కనుక, నాకనిపించింది చెబుతాను (పోలికకి కాదు… కానీ, ఏమిటో…నా వెర్రి)… ఆముక్తమాల్యద కథ నాకు నచ్చింది. అక్కడ ఉదహరించిన వర్ణనలూ (అర్థాలూ) అన్నీ నాకు అద్భుతంగా అనిపించాయి. కానీ, మనుచరిత్ర పరిచయంలో కథా సంగ్రహం చదివాక, నిజానికి “ఇదేం కథ!” అనిపించింది నాకు. అలా అనుకుని చదివినందుకో ఏమో కానీ, ఇక్కడ ఎంపిక చేసి వివరించిన పద్యాలు – బాగున్నాయి అనిపించినా కూడా ఆ “అద్భుతం” అన్న భావన కలిగించినవి చాలా తక్కువ. దానికి తోడు – నాకు పుస్తకం కవర్ పేజీ కూడా అంత నచ్చలేదు. ఆముక్తమాల్యద పై చిన్నగానైనా రాయలవారి బొమ్మొకటి పెట్టారు. అలా పెద్దనవారి బొమ్మ ఒకటి ఉంటే బాగుండు అనిపించింది (అఫ్కోర్సు, అసలాయన చిత్రమేదైనా లభ్యమో లేదో నాకు తెలియదనుకోండీ!) కానీ, ఏదేమైనా, హనుమంతరావు గారి ఆధ్వర్యంలో తెలుగు నేర్చుకుంటే నాకు పద్యాలు అర్థమయ్యేంత తెలుగు వచ్చేస్తుందో ఏమిటో…అన్న వెర్రి ఆశ కూడా జనియించింది నాకు!

నా సారాంశం: చిన్నదో, చితకదో ఏదైనా, హనుమంతరావు గారు చాలా సరళంగా వివరిస్తారు కనుక, నేనైతే తప్పకుండా “కొని”, చదివి, ఇంట్లో పెట్టుకొమ్మని చెబుతాను. అలాగే, క్లిష్టంగా ఉన్న చోట్ల సంధి విడగొట్టి ఇచ్చారు ఈ పద్యాల్లో. కనుక, చక్కటి తెలుగు అభ్యాసం కూడానూ. నా మట్టుకు నాకైతే చాలా పదాలు తెలిసాయి ఈ కాస్త పుస్తకంలోనే. అన్నట్లు, ఈ నా సలహా నాలా ప్రబంధాలు చదివేంత “తెలుగు”తేటలు లేని వారికి మాత్రమే.

హనుమంతరావు గారు ఇలాగే ఇంకొన్ని పరిచయాలు చేసారని సి.పి.బ్రౌన్ సైటులో ఉన్న జాబితాను బట్టి తెలుస్తోంది. ఇలా మరిన్ని పుస్తకాలు వచ్చి నాబోటి పామరకోటికి తెలుగు/సంస్కృత ప్రబంధ-కావ్యాలను గురించి అవగాహన కలిగిస్తారని ఆశిస్తున్నాను 🙂
*******************

పుస్తకం వివరాలు:
మనుచరిత్రలో మణిపూసలు
సంకలనం: మల్లాది హనుమంతరావు
ప్రచురణ: సి.పి.బ్రౌన్ అకాడెమీ, 2010
పేజీలు: 46
వెల: 20 రూపాయలు

ప్రతులకు: ఏవీకేఎఫ్ లంకె, సి.పి.బ్రౌన్ వారి సైటు.

You Might Also Like

2 Comments

  1. M.V.Ramanarao

    గోపాలకృష్ణా,చాలామంది వరూధినీ ప్రవరాఖ్యుల కథ దాటి చదవరు.అంత రసవత్తరంగా ఉండదు,తర్వాతి భాగం.కాని తర్వాత కూడా కొన్ని మంచి పద్యాలు ఉన్నాయి .కాని ఓపికగా చదవాలి.పోతనగారి భాగవతం కూడా అంతే కదా.కొన్ని ఘట్టాలే చదువుతారు.అవి చాల బాగుంటాయి కాబట్టీ .బాగా పాపులర్ అయినవి.

  2. పంతుల గోవాల కృష్ణ

    సౌమ్య గారూ, మనుచరిత్ర పుస్తకం లో మొదటి ఆశ్వాసాన్ని నా కాలేజీ రోజుల్నుంచి ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. మొదటి ఆశ్వాసం లోని పద్యాలన్నీ నాకు కంఠతా వచ్చు. నేటికీ కూడా. కాని అది దాటి ఏనాడూ ముందుకు పోలేదు.దాని లోని కథ కాని ఆ పద్యాలు కాని నన్నాకట్టుకో లేక పోయాయి. తెలుగులో అవసరమైన పాండిత్యం లేకపోవడం వల్లకావచ్చు.మొదటి ఆశ్వాసం లోని వచనం కూడా అద్భుతంగా ఉంటుంది. జ్ఞప్తికి తెచ్చినందుకు ధన్యవాదాలు.

Leave a Reply