అందంగా, ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా – ఈశ్వర్ సినిమా పోస్టర్

నా చిన్నతనంలో మా ఊరికి సినిమాబండ్లు వస్తూ ఉండేవి. చుట్టూతా సినిమా తాలుకు రంగురంగుల కటౌట్లతో కప్పేసిన వ్యానో, మినిబస్సో అన్నమాట. పిల్లలమందరం పొలోమని ఆ బండ్ల వెనక వీలైనంతవరకూ పరుగెత్తి, ఆ బండిలోంచి బయటకు విసిరేసిన రంగురంగుల సినిమా కాయితాల్ని ఏరుకునేవాళ్ళం. కొత్త సినిమా వచ్చిందంటే చాలా హడావిడి ఉండేది. సైకిళ్ళమీద, హాండిల్‌కి మైదాపిండి బకెట్టూ, కారేజ్ మీద వాల్‌పోస్టర్ల చుట్టా పెట్టుకుని ఏలూరునుంచి పోస్టరబ్బాయిలు వచ్చేవారు. మా ఊరి కచేరి సావిడి పక్కన కొట్ల దగ్గరో, హైస్కూలు పక్కనో సైకిల్‌కి స్టాండేసి, పోస్టర్ బయటకు తీసి, సాఫు చేసి, దాని వెనకాల మైదాపిండి రాసి, గోడమీద ఉన్న పాతపోస్టర్‌ని పీకేసి, దాని మీద ఈ పోస్టర్ అంటించి, అప్పుడు ఒక మూలనుంచి పర్ర్‌మని మధ్యదాక పోస్టర్ చించేసి మళ్ళీ అతికించి సరిచేస్తుంటే పిల్లలమందరమూ శ్రద్ధగా ఆరాధనాపూర్వకంగా చూస్తూ నుంచునేవాళ్ళం. ఇష్టమున్న సినిమా ఐతే, ఒక పోస్టర్ మనకిస్తే బాగుండు అని ఆశపడుతుండేవారం. ఎప్పుడైనా బెజవాడ వెడితే, ఆర్టీసీ బస్‌స్టాండ్‌నుంచి ఒన్‌టౌన్‌కి వెళ్ళేదారిలో ఇంకా విడుదలకాని సినిమాల పెద్దపెద్ద కటౌట్లని ఆసక్తిగా చూస్తుండేవాళ్ళం. మెడికల్ కాలేజ్‌లో ఉండగా ఎప్పుడైనా బెజవాడ రైల్వే స్టేషన్‌లో బ్రేక్ ఉంటే ప్లాట్‌ఫారమ్ మీద డిస్ప్లే కేసుల్లో నిర్మాణంలో ఉన్న సినిమా పోస్టర్లనీ, లాబీకార్డుల్నీ ఆసక్తిగా చూస్తుండేవాళ్ళం. సంక్రాంతి, దసరాలవంటి పండుగలు వచ్చినప్పుడు, తెలుగు పేపర్లనిండా నిర్మాణంలో ఉన్న, విడుదల కాబోతున్న (ఒకోసారి నిర్మాతల స్వప్నాలలో మాత్రమే ఉన్న) సినిమాల ప్రకటలని ఉత్సాహంగా చూసి చర్చించుకునేవాళ్ళం. స్క్రీన్ పత్రికను హిందీ సినిమాల ప్రకటనలకోసం చూసేవారం. సినిమాల ప్రచార విషయాలు చిన్నతనపు జ్ఞాపకాల్లో ముఖ్యభాగం అయ్యాయి.

చూస్తూ ఉండగానే, సినిమా పోస్టర్ల సైజులు పెరిగిపోవటం మొదలయ్యాయి; రంగుల స్కీముల్లోనూ, స్పేస్ వాడుకలోనూ, అక్షరాల్లోనూ చాలా తేడాలు వచ్చాయి. పోస్టర్ల ఆకర్షణీయత గణనీయంగా పెరిగింది. ఆ మార్పుకు కారణమైన వాళ్ళలో ముఖ్యుడు ఈశ్వర్ అనబడే కాసాని ఈశ్వరరావు. నాలుగుభాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, హిందీ) ప్రేక్షకుల్ని ఆకర్షించి, థియేటర్లకు మళ్ళించిన పోస్టర్లలో ఈశ్వర్ అని ఇంగ్లీషులో విలక్షణమైన సంతకం (లోగో) ఒక తరం ముందటి తెలుగు సినీ అభిమానులకు సుపరిచితమైందే.

నాలుగు దశాబ్దాలపాటు సినిమాపోస్టర్లని డిజైన్ చేసిన ఈశ్వర్ ఇప్పుడు తన జీవితం గురించీ, సినిమా పోస్టర్ల గురించి, సినిమా ప్రచారకళ గురించి, చిత్రకళ గురించి ఒక విపులమైన, ఆకర్షణీయమైన పుస్తకం వ్రాశారు. 450 రూపాయలు ఖరీదు పెట్టిన ఈ పుస్తకం మొదటి ఎడిషన్ – బంద్‌లూ రైల్‌రోకోలూ అడ్డం వచ్చినా – ఇరవై రోజుల్లో అమ్ముడైపోయిందంటే ముందు ఆశ్చర్యంగానే అనిపించినా, పుస్తకం చూశాక అంత ఆశ్చర్యం అనిపించదు. విజయవాడలో పుస్తక విక్రేత మిత్రులు చెప్పినదానిబట్టి ఈ పుస్తకం మూడో ఎడిషన్‌కూడా వచ్చి, దాదాపు అమ్ముడైపోయిందట. తెలుగు పుస్తకాలకు మార్కెటింగ్ లోపమే కాని మార్కెట్ లోపం లేదని మళ్ళీ నిరూపించింది ఈ పుస్తకం.

పుస్తకంలో మొదటి భాగం ఈశ్వర్ జీవితం గురించి. పాలకొల్లులో లోహశిల్పుల కుటుంబంలో పుట్టిన ఈశ్వర్ చిన్నతనంలోనే కుటుంబం ఆర్థికంగా చితికిపోవటంతో చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. పాలిటెక్నిక్ చదువును అర్థంతరంగా ముగించుకొని, పొట్ట చేతపట్టుకుని, చేతిలో ఉన్న బొమ్మలుగీసే కళను నమ్ముకొని మద్రాసు చేరాడు. స్టూడియో కేతా అధిపతి కేతా సాంబమూర్తి, సరాగం స్టూడియో గంగాధర్ చేయూతనిచ్చి ఆదరించారు. అంచెలంచెలుగా పెరిగి, స్వంత స్టూడియో స్థాపించుకొని, నాలుగుభాషల్లో పెద్దపెద్ద నిర్మాణసంస్థలకూ, నటులకూ ప్రీతిపాత్రుడైన పబ్లిసిటీ ఆర్టిస్టుగా ఎదిగారు. 2000 సంవత్సరంలో దేవుళ్ళు చిత్రం తర్వాత విశ్రాంత జీవితం గడుపుతున్నారు.

ఈశ్వర్ జీవితంలో చాలా నాటకీయత ఉంది. ఐశ్వర్యం, దారిద్ర్యం, విఫల ప్రేమ, బంధుమిత్రుల ద్రోహాలు, అవమానాలు, వీటన్నిటినీ అధిగమించి సఫలం కావడం, తనను అవమానించినవారిని సైతం ఆదరించటం యండమూరి, యద్దనపూడిల నవలలా ఉంటుంది ఆయన కథ. బాపు-రమణల సాక్షి తెలుగులో ఆయన మొదటి చిత్రం. ఆ డిజైన్లు చూసిన విజయాధినేతలు రామ్ ఔర్ శ్యామ్ చిత్రం ఆయనకు అప్పగించారు. దానితర్వాత వచ్చిన పాపకోసం చిత్రానికి ఆయన చేసిన డిజైన్లు ఆయనకు చాలా పేరు తెచ్చాయి. ఈశ్వర్ ప్రస్థానానికి ఇక అడ్డులేకుండా పోయింది. ఒక సంక్రాంతిరోజున తమిళంలో విడుదలైన ఆరుగురు పెద్ద హీరోల సినిమాలకూ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ అంటే ఆయన ఆ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగాడో అర్థం అవుతుంది. ఈ పుస్తకంలో ఆయన డిజైనర్‌గా పని చేసిన 1888 చిత్రాల పట్టిక ఇస్తూ, ఇవి కాక ఆయన పని చేసిన మలయాళం, తుళు, బెంగాలీ, ఒరియా వంటి ఇతర భాషల్లో 500 పైన చిత్రాల వివరాలు ఇందులో చేర్చలేదని చెప్పారు.

ఈశ్వర్, స్వతస్సిద్ధమైన ప్రతిభ ఉన్న కళాకారుడు. చిన్నతనంలోనే ఆయన నాటకాలు వ్రాసి ప్రదర్శించేవారు; రంగాలంకరణ చేసేవారు. పరిషత్ నాటకపోటీలలో పాల్గొని బహుమతులు గెల్చుకున్నారు. ముందు చదువుకోసం, ఆ తర్వాత బతుకుతెరువుకోసం చిత్రకళను నమ్ముకున్నాక నాటకాలని వదిలేశారుకానీ, ఆ రంగంలో ఆయనకు మంచి భవిష్యత్తు ఉండేది అనిపిస్తుంది. గురు ముఖతా కాక చిత్రకళను స్వయంగానే నేర్చుకున్నారు. చిన్నతనంలో సినిమాపోస్టర్లకి నకళ్ళు గీసేవారట. తన పదవయేట, గాంధీజీ మరణించిన తర్వాత ఆయన వేసిన చిత్రం ఈ పుస్తకంలో ముద్రించారు. ఆ వయసులొనే అతను మంచి నైపుణ్యం ఉన్న చిత్రకారుడు. అంతకన్నా అబ్బురపరిచేది ఆ బొమ్మ వెనుక ఉన్న ఊహాశక్తి. ఈ పువ్వు పుట్టగానే పరిమళించింది. ఆ వయసులోనే అంతటి భావనాశక్తి చూపించిన ఈశ్వర్ ప్రచారరంగంలో ప్రముఖ స్థానాన్ని అలంకరించటంలో ఆశ్చర్యమేమీ లేదు.

సినిమారంగంలో నిర్మాణ సంస్థ లోగో డిజైన్‌తో ప్రారంభమై, సినిమా టైటిల్, పాత్రధారుల విగ్గులు, ఆహార్యం, సినిమా టైటిల్ కార్డ్స్, పత్రికలలో వచ్చే ప్రకటనలు, విడుదల సమయంలో పోస్టర్లూ, హోర్డింగులూ, వారంవారం మారే ప్రకటనలు, పోస్టర్లు, చివరకు విజయోత్సవం షీల్డులు డిజైన్ చేయటంవరకూ పబ్లిసిటీ డిజైనర్ల బాధ్యతలే. కంప్యూటర్లు వచ్చాక ఈ పని బాగా మారిపోయింది. ఒకప్పుడు, చాలా కష్టం, అసంభవం అనుకున్న పనులు ఇప్పుడు అవలీలగా చేయగలుగుతున్నారు. ఈ దశలో అగ్రస్థానంలో కొనసాగాలంటే తాను మళ్ళీ విద్యార్థిగా మారవలసి వస్తుందని, ఆ ఓపికలేక ఈ రంగంనుంచి విరమించుకున్నానని ఈశ్వర్ చెప్పారు.

ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటంటే ఈశ్వర్ కేవలం తన జీవితకథే వ్రాసి ఊరుకోలేదు. 255 పేజీలు (మరి 128 రంగుల బొమ్మల పేజీలు) ఉన్న ఈ పుస్తకంలో ఆత్మకథ 90 పేజీలకు మాత్రమే పరిమితం. మిగతా పుస్తకంలో ప్రచార కళ గురించి, తెలుగు ప్రచారరంగంలో వివిధ శాఖలలో (పబ్లిసిటీ ఆర్టిస్టులు, డిజైనింగ్ సంస్థలు, ముద్రాపకులు, చిత్రనిర్మాణ సంస్థలు, పి.ఆర్.ఓలు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు) ప్రముఖుల గురించి, ఆయనతో మంచి సంబంధాలు ఉన్న నిర్మాతలు, దర్శకులు, నటుల గురించి, ప్రముఖ తెలుగు, భారతీయ చిత్రకారులగురించి చిన్న చిన్న వ్యాసాలున్నాయి. పోస్టర్లు, హోర్డింగుల తయారీ గురించి, కాలక్రమేణా వచ్చిన మార్పుల గురించి వివరణలు ఉన్నాయి.

ఈ పుస్తకంలో తెలిసిన ఇంకో ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు మనం కంప్యూటర్లలో వాడుతున్న తెలుగుఫాంట్లలో చాలాభాగం ఈశ్వర్ తమ్ముడు బ్రహ్మం (బ్రహ్మానందరావు) డిజైన్ చేసినవేనట. ఈశ్వర్ స్టూడియోలో పోస్టర్లు, టైటిల్స్‌కు లెటరింగ్ చేయడంలో స్పెషలిస్ట్ ఐన బ్రహ్మంతో అనూ గ్రాఫిక్స్ మురళీకృష్ణ తెలుగులో వివిధ రకాల ఫాంట్లు డిజైన్ చేయించారట. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ భాషలకూ ఈ అక్షరబ్రహ్మే ఫాంట్లు డిజైన్ చేశారట.

ఈ పుస్తకంలో 128 రంగులపేజీల్లో ఈశ్వర్ గీసిన సినీ నటీనటుల వర్ణచిత్రాలు, వివిధభాషల్లో చేసిన పోస్టర్లు, లోగోలు, రేఖాచిత్రాలు, అందంగా ఆకర్షణీయంగా ఉండటమే కాక చాలా జ్ఙాపకాలను వెలికితీస్తాయి. పుస్తకం ప్రతిపేజీలోనూ ఉన్న ఫొటొలు, చిత్రాలు పుస్తకాన్ని సమగ్రంగానూ, ఆకర్షణీయంగా చేశాయి. తన స్టూడియోలో పనిచేసినవారందరి ఫొటోలు చేర్చటం ఈశ్వర్ సహృదయతకి తార్కాణం.

ఈశ్వర్ ఈ పుస్తకాన్ని చాలా సరళంగా వ్రాశారు. భాష, పలుకుబడులు, అక్కడక్కడా మెరిసే తత్వపు చణుకులు ఈశ్వర్‌లో మంచి రచయిత ఉన్నాడని సూచిస్తాయి.

ఈశ్వర్ పోస్టర్లలాగే ఈ పుస్తకం కూడా చాలా అందంగా డిజైన్ చేశారు. మంచి కాగితం, ఫాంట్లు, పెద్దమార్జిన్లు, ఫొటోలతో కంటికి ఇంపుగా ఉంది. అచ్చుతప్పులు బహుస్వల్పం; ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. విపులమైన విషయసూచిక ఉంది. ప్రచురణకర్తలు (విజయా పబ్లికేషన్స్ – చందమామ విశ్వం), ముద్రాపకులు (కళాజ్యోతి –బాపన్న) తీసుకున్న శ్రద్ధ అభినందనీయం. పుస్తకం చివర నామసూచిక కూడా ఉంటే ఇంకా ఉపయుక్తంగా ఉండేది. నా దగ్గర ఉన్న రెండవ ముద్రణలో, మొదటి ముద్రణ ఆవిష్కరణ వివరాలు, ఫొటోలు, సమీక్షలు చేర్చారు.

ఒకరకంగా ఈ పుస్తకం తెలుగు చలనచిత్రరంగంలో ప్రచారకళ గురించిన ఎన్‌సైక్లోపేడియా; తెలుగు చిత్రకారుల పరిచయగ్రంథం. సినిమాలు, చిత్రకళలపైన అభిమానం ఉన్నవారి గ్రంథాలయాల్లో తప్పకుండా ఉండవలసిన పుస్తకం. మిగతా తెలుగు పుస్తకాల ధరలతో పోలిస్తే, ఈ చక్కటి బౌండు పుస్తకం 450 రూపాయలు మించిన విలువైన పుస్తకం.

తా.క. సినిమా పోస్టర్ అనగానే నాకెప్పుడూ గుర్తుకు వచ్చే విషయం ఒకటుంది. 1978 ప్రాంతాల్లో గుంటూర్లో భారీ ఎత్తున సంగీతదర్శకుడు చక్రవర్తి సంగీతవిభావరి జరిగింది. చిత్రసంగీత సీమలో ప్రసిద్ధులందరూ వచ్చారు. ఆ సభలో ప్రముఖ రచయిత జాలాది సినీనటుల జీవితాలగురించి ఒక మంచి,చిన్న కవిత చదివారు. అందులో – గోడలకంటుకొన్న పరువులం – అన్న వాక్యం నాకు బలంగా గుర్తుండిపోయింది.

తా.తా.క: ఈ పుస్తకం వ్రాయాలని నిశ్చయించుకున్నాక, నిరాటంకంగా ఏకాగ్రతతో వ్రాయటానికి వీలవుతుందని అమెరికాలో ఉన్న తన పిల్లల దగ్గరకు వచ్చి ఆరునెలల్లో ఈ పుస్తకం పూర్తి చేశానని ఈశ్వర్ చెప్పారు. అందుచేత ఈ పుస్తకాన్ని అమెరికా తెలుగు పుస్తకాల ఖాతాలో జేరుస్తున్నాను 🙂

సినిమా పోస్టర్
ఈశ్వర్
2011 జులై, అక్టోబరు
విజయా పబ్లికేషన్స్
చెన్నై 600 032
ఫోన్: 044-4554 0005
e-mail: vijayapublications@gmail.com
408 పేజీలు (128 పెజీల రంగుల బొమ్మలతో కలిసి)
450 రూ./ 40 డా.

You Might Also Like

2 Comments

  1. ramachary bangaru

    manchi pustakam.librarylo daachukovaalichina pustakam.

  2. సౌమ్య

    ఈ పుస్తకం గురించి నవతరంగం.కాం లో వచ్చిన వ్యాసం:
    http://navatarangam.com/2011/11/cinima-poster/

Leave a Reply