ద్రౌపది నవల పై చర్చా సమీక్ష (DTLC)
డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్
ద్రౌపది నవల పై చర్చా సమీక్ష
నవలా రచయిత: ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
ప్రచురణ: లోకనాయక్ ఫౌండేషన్, విశాఖపట్నం, Fifth Edition (ముద్రణ?): 2010
చర్చాస్థలం, తేదీ: ఫార్మింగ్టన్ హిల్స్ లైబ్రరీ, నవంబరు 20, 2011
పాల్గొన్నవారు: ఆరి సీతారామయ్య, నర్రా వేంకటేశ్వరరావు, వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, అడుసుమిల్లి శివ, మండవ ప్రసాద్, కొత్త ఝాన్సీలక్ష్మి, రుద్రరాజు సుధ, బూదరాజు కృష్ణమోహన్, మద్దిపాటి కృష్ణారావు (చర్చ సమీక్షకుడు)
*****************
పేరునుబట్టే ఈ నవల ద్రౌపది కథ అని వేరే చెప్పక్కర్లేదు. ఐతే ఈ ద్రౌపది అందరికీ తెలిసిన పేరు గలావిడేనా అన్నది మొదటి ప్రశ్న. నవలను ఆసాంతం చదివి, మహాభారత కథతో పోల్చి చూసుకుంటే నవలా ద్రౌపదీ, కావ్య ద్రౌపది మనిషిగా ఒక్కరేనన్నది నిర్వివాదాశం. నవలా ద్రౌపది జీవిత విశేషాలు, సంఘటనలు, జీవితంలో తారసిల్లే వ్యక్తులు, పరిణామాలు, మొదలైనవన్నీ భారతంలోని ద్రౌపదికి మక్కికి మక్కిగా సరిపోతాయి. ఐతే మరి ఈ నవల ఎందుకు అన్న ప్రశ్న ఉదయించక మానదు.
మహాభారతంలో కర్ణుడి తర్వాత అతి ముఖ్యమైన పాత్ర ద్రౌపదిదేనేమో. ఎన్నో సందర్భాల్లో కనిపిస్తూ, ఒక బృహత్కథా గమనంలో ఇమిడిపోయి ఉన్న పాత్రను వెలికి తీసి, సంఘటనలన్నిటి ఒక గుదిగా గుచ్చి, ఆసక్తికరంగా చదివించే పుస్తకం వ్రాయడంలో రచయిత సఫలీకృతులే. తెలుగు సినిమా పుణ్యమా అని చదవకుండానే భారత, భాగవత, రామాయణ కథలు చాలవరకు ఎక్కువమంది తెలుగు వారికి పరిచయమయ్యాయి. ముఖ్యంగా పాండవ వనవాసం, నర్తనశాల చిత్రాల ద్వారా ద్రౌపది పాత్రతో తెలుగు వారికి పరిచయం ఉంది (మహానటి సావిత్రిని మరొకసారి అభినందించుకోవాలి!). ప్రేక్షకులు ఆసక్తికరంగా చూసేందుకు సినిమాల్లో అసలు కథను మార్పులు, చేర్పులు చేస్తుండడం మామూలే. ఇది నవల కాబట్టి, ఇందులో కూడా చదువరిని ఆకర్షించడం కోసం అసలు కథనేమైనా మార్చారా అనే అనుమానంతో వీలైనంత వరకూ వెదికాము. ఏదో ఒకటి రెండు సందర్భాల్లో తప్పితే మూల కథను మార్చకుండ వ్రాసినందుకు రచయితను అభినందించాలి. మరైతే, భారతంలో అక్కడక్కడా కనిపించే పాత్రను ఒక చోట చేర్చి వ్రాసినంతమాత్రాన అది నవల అవుతుందా?! రచయిత తన ముందుమాటలోనే చెప్పారు, ద్రౌపది మనసును విశ్లేషించి, వ్యక్తిత్వాన్ని చూపించడమే నవల ముఖ్యోద్దేశమని.
తిరుమల తిరుపతి దేవస్థానం వారి పుణ్యమా అని మహాభారతాన్ని కొంచెం సులువుగా చదువుకునే అవకాశం కలిగింది. ఈ నవలకు సంబంధించినంతవరకు మూల కథను చదవగా తెలిసిందేమిటంటే, మహాభారత రచయితలు సంఘటనలను, పాత్రల ప్రవర్తనలను, వారి సంభాషణలను, వారి ఆకార వికారాది వర్ణనల్ను చేశారే తప్ప విశ్లేషించలేదు. ఆ బాధ్యత పాఠకులకే వదిలినట్లనిపిస్తుంది. (ఇది కేవలం మిడి మిడి జ్ఞానంతో కొద్దిగా చదివి ఏర్పరచుకున్న అభిప్రాయం మాత్రమేనని మనవి.) ఈ అవకాశంతో తనకిష్టమైన ద్రౌపది పాత్రను ఎంచుకుని, కథలో జరిగిన సంఘటనల ఆధారంగా ఆవిడ మనోభావాలను రచయిత వివరించడానికి ప్రయత్నం చేసినట్టు తోస్తుంది. పురాణ పాత్రల జోలికి వెళ్ళడం కత్తిమీద సాములాంటిదని రచయితే చెప్పుకున్నారు. ఏదైనా ఒక కథ చదవగానే పదిమంది పాఠకుల మనసుల్లో పాత్రలు పది రూపాల్లో చోటు చేసుకోవడం సహజం. వేల సంవత్సరాలుగా ప్రజల్లో నానుతున్న కథల్లోని పాత్రల గురించి వేరే చెప్పాలా! అందునా క్లిష్టమైన సాంఘిక, సాంస్కృతిక సంబంధాలతో పెనవేసుకుపోయిన కథల్లోని పాత్రలతో.
మహాభారత కథ ముగింపుతో మొదలై, ద్రౌపది ఒక్కొక్క అనుభవాన్ని నెమరు వేసుకుంటున్నట్టుగా చెప్పిన కథ తీరు, కథనం నవలను చదివింపజేస్తాయి. మూల కథలోని వివరాలను మార్చకుండా కథను నడిపించిన రచయిత అభినందనీయులే. కానీ, ఈ నవలకు ప్రాణమైన ద్రౌపది మనోభావాల విశదీకరణ, విశ్లేషణలతోనే ప్రధానమైన ఇబ్బంది కలిగింది. ఎన్ని రకాలుగా చూసినా, ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాల్లో చదివినా, ద్రౌపదికి మిగిలిన పాత్రలతో ఉన్న మానసిక అనుబంధం కేవలం శారీరక సంబంధాల చుట్టూ, లైంగిక వాంఛల చుట్టూ పరిభ్రమించింనట్టనిపించిందే తప్ప వేరే ఆలోచనలకు తావిచ్చినట్లనిపించలేదు. ద్రౌపది అసాధారణమైన, అమేయమైన సౌందర్యవతి అనుకోవడంలో అనుచితమేమీలేదు. అంతటి సౌందర్యరాశిపై చూపులు నిలిపిన మగవాళ్ళందరూ ఆకర్షితులయ్యారనుకోవడంలోనూ తప్పు లేదు. కానీ, జాత్యంధుడైన ధృతరాష్ట్రుడు కూడా ఆమె సౌందర్యం చూడలేకపోయినందుకు తన గుడ్డితనాన్ని తిట్టుకోవడం (పరోక్షంగా పరిచారిక మాటల్లో చెప్పించినా) వింతగా అనిపించింది. కురువృద్ధుడు, తాతవరుసైన భీష్ముడు, గురుతుల్యుడు, పితృసమానుడైన ద్రోణుణ్ణి కూడా ద్రౌపది సౌందర్యాన్ని చూడాలని కుతూహలపడినట్టు వర్ణించడం సరేసరి, జాత్యంధుడికి రూప సౌందర్యమంటే ఏమి తెలుసో, రచయితే వివరించాలి! ద్రౌపది సౌందర్యానికి మోహితులైనట్టు ప్రత్యక్షంగా అందరినీ వర్ణించి ఉండకపోవచ్చు, కానీ ఈ నవల చదువుతున్నప్పుడు ఆ మోహానికి లొంగని పాత్ర మహాభారతంలో లేదేమోననిపిస్తుంది, ఒక్క ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు తప్ప. ఇంతకు మించి వేరే ఏ దృష్టిలోనూ ద్రౌపది మనోవిశ్లేషణ జరిగినట్టనిపించదు. ఒకవేళ ఎక్కడైనా వేరే దృష్టిలో వివరించబూనినా అది ‘అలవాటులో పొరపాటు’ అనిపిస్తుందే తప్ప బహుముఖ దృష్టితో చేసినట్లనిపించదు.
పలువురు స్త్రీలతో సంబంధాలు కలిగి, సంసారాలు చేసిన పురుషులు పురాణాల్లో కోకొల్లలు. ఒకరికంటే ఎక్కువ పురుషులతో సంబంధాలు గల స్త్రీలు కూడా పురాణాల్లో కనిపిస్తారు. పూజార్హులైన పంచకన్యలుగా వర్ణించబడిన అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి, కథలు ఎక్కువ ప్రసిద్ధి పొందినవి. అందరిలోనూ ద్రౌపది పాత్ర విభిన్నమైనది. మిగిలిన నలుగురూ ఏ ఇద్దరు పురుషులతోనూ ఏక కాలంలో సంబంధ బాంధవ్యాలు నడపలేదు. ద్రౌపదికి మాత్రమే అలాంటి పరిస్థితి సంభవించింది. మహావీరులం, మహాపురుషులం అనుకుంటున్న ఐదుగురు భర్తలతో, ఎవరి అహంకారానికీ విఘాతం కలగకుండా సంసారం చెయ్యడం ఒక్క ద్రౌపదికే చెల్లింది. ఇది అత్తగారైన కుంతి గాని, సర్వజ్ఞానియైన వ్యాసుడుగాని ‘జరుగుగాక’ అని దీవించినంతమాత్రాన అయ్యే పనైతే, రచయిత ఈ వస్తువును తీసుకోవడమే అనవసరరం. యుగ ధర్మానుసారం ద్రౌపది ఏక కాలంలో, ఐదుగురు భర్తలనూ మెప్పించి, లాలించాలి, తనకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికి భర్తల్ని ఉద్యుక్తుల్ని చెయ్యాలి, అతిథి, అభ్యాగతులకు తగిన ఏర్పాట్లు చెయ్యాలి, అత్తగారికి, పిల్లలకూ అవసరాలు చూడాలి, సవతులతో సఖ్యత నిలుపుకోవాలి, ఇంకా ఎన్నో …. ఇవన్నీ ఒక కాళిదాసు స్తోత్రాన్ని ఉటంకించడంతో రచయిత బాధ్యత తీరిపోదు. రచయిత ఈ విషయాలు అసలు ప్రస్తావించలేదని కాదు. ధర్మరాజుని ఉసిగొల్పడానికన్న మాటలు కూడా మగణ్ణి సాధించడానికన్నట్టున్నాయే గాని, ద్రౌపది కార్యదీక్షను, పట్టుదలను, అనునయాన్ని చాకచక్యంతో ప్రదర్శించే రీతిలో లేవు. మనోభావాలను చదువుతున్నప్పుడు అన్ని రకాల భావోద్వేగాలకూ సమాన ప్రతిపత్తినివ్వకుండా, ద్రౌపది లావణ్యం, సౌందర్యం, అంగాంగ వర్ణనలకే అత్యధిక భాగం కేటాయిస్తే, ‘మానసిక విశ్లేషణ’ పై రచయిత దృక్పథాన్ని ప్రశ్నించవలసిన అవకాశం వస్తుంది. ఎన్నిసార్లని వక్షోజాల పొంగులు, నితంబాల సొగసుల వర్ణనలను చదివేది?! కృష్ణుడికి ద్రౌపదికి మధ్య అనుబంధాన్ని గురించిన వర్ణనైతే సినిమా హీరో రెండవ హీరోయిన్ని 16 రీళ్ళ రొమాన్సు తరవాత అకస్మాత్తుగా ‘చెల్లీ’ అనేసినట్టుంది.
రచనలో వ్యాకరణంతో రచయితకు పెద్ద శ్రద్ధ ఉన్నట్లు కనిపించదు. ఉత్తమ పురుషలో ప్రారంభమైన వాక్యం ప్రధమ, ద్వితీయ పురుషల్లోకి, తిరిగి వెనక్కి ప్రయాణించిన సందర్భాలు కోకొల్లలు. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి స్థాయి నవలా రచయితకు ఉండవలసిన క్రమశిక్షణ ఇదేనా! అలాగే పదప్రయోగాలు కూడా. ఉదాహరణకు 192 వ పేజీలో, ధర్మరాజు ‘నా దుర్నీతి వల్లే మీ అందరికీ ఈ కడగండ్లు వచ్చాయి’ అంటాడు. ధర్మరాజు జూదం ఆడటంలో ప్రదర్శించింది ‘దుర్వ్యసనం’ ‘దుర్నీతి’ కాదు. ఇతర రచయితలకు ప్రామాణికాలు నిర్దేశించవలసిన ఆచార్యులు ఇంత తేలికగా పదాలను వాడటం విచారకరం.
చివరిగా, కథను చెప్పడంలో కూడా రచయిత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సినిమాల్లో చూపించిన కథలను యధాతథంగా ఈ నవలలో చొప్పించడం నవలా రచయితకు అనవసరంగా కొని తెచ్చుకున్న అపఖ్యాతి. ‘కీచక వధ’ అధ్యాయం చదువుతుంటే మరీ నర్తనశాల సినిమా చూసినట్టుందిగానీ, విరాట పర్వంలోని కథను చదివినట్టు లేదు. సినిమాలోని కీచక పాత్రధారి డైలాగు, ‘తిరస్కారం చేస్తే బలత్కారం తప్పదు’ ను యధాతథంగా దించడం దీనికి పరాకాష్ట. అలాగే, పాండవుల ఆయవార భిక్షలో అర్ధభాగం భీముడికి అన్నది శ్రీకృష్ణపాండవీయం సినిమాలోని పంపకం. కానీ, భారతంలో కుంతీదేవి ద్రౌపదికి చెప్పింది, భిక్షలో సగభాగం అతిథులకు, యాచకులకు, మిగిలిన సగభాగంలో సగం భీమునికి, ….. మూల కథను కూలంకషంగా పరిశోధించి వ్రాసిన రచయిత చెయ్యదగిన తప్పులు కావు ఇవి. మహాభారతంలో ద్రౌపది కథ తెలుసుకోగోరేవారు చదవదగిన పుస్తకమే. కానీ రచయిత ప్రయత్నించిన మనోవిశ్లేషణ, యధాలాపంగా కథకోసం చదివే పాఠకులు ద్రౌపదిని అపార్ధం చేసుకునే అవకాశం కూడా ఎక్కువే!
*******
పుస్తకం ఆన్లైన్ కొనుగోలు లంకె ఇక్కడ.
ఈబుక్ చదవడానికి/కొనడానికి కినిగె లంకె ఇక్కడ.
Jajisarma
ఈ సమీక్షలు చాలా ఆలస్యంగా చదివాను. అన్నీ చదివిన తరువాత నవలను చదవని వారు, ఈ శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చౌదరి గారు “ఆచార్యుడు” అని తెలియని వారు అదృష్టవంతులు. శ్రీ తాడిగడప శ్యామలరావు గారికి అభినందనలు.
vineetha
నాకు కూడా ఈ పుస్తకం చదవాలని వుంది kaani ekkada dorakaledu.meelo evari daggarinaa ebook vunte నాకు share cheyyagalara plz.
Srinivas Nagulapalli
బేతవోలుగారే “నాగరకం” చెయ్యాలి అని చెప్పుకున్న పుస్తకం, ఆయనతో సహా అసలు ఆ పుస్తకానికి అవార్డు ఇవ్వొచ్చని, ఇవ్వాలని, కనీసం ఇచ్చింది సమర్థించడం కాని, ఒక్కరంటే ఒక్కరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఇప్పటిదాకా చెసిన దాఖలాలు లేవు. కొంటె వ్యాఖ్య కంటే మించిన వ్యక్తీకరణలతో “అచ్చేసిన” పుస్తకానికి, గౌరవమే కాదు, ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అవార్డు సైతం ఇవ్వడం భలే ఆశ్చర్యం, అంతకంటే బాధాకరం.
చదవడం చదవకపోవడం కాదు, పైసలిచ్చిన వాళ్ళు మాత్రమే రాళ్ళు వేస్తున్నారు అనిపిస్తుంది. జనాల డబ్బులతో ఇచ్చే అవార్డు పుస్తకానికి ఇవ్వకపోతే రాళ్ళే కాదు, జనాల దృష్టి కూడా పడేది కాదేమో అనిపిస్తుంది. ప్రజల పైసలతో ఇచ్చే సాహిత్య అకాడమీ అవార్డు ఎందుకిచ్చారని ప్రజలే నిస్సంకోచంగా నిలదీయడం వారి హక్కు, ఈ ఉదంతం మిగిల్చిన గుడ్డిలో మెల్ల అనిపిస్తుంది.
—–
విధేయుడు
_శ్రీనివాస్
Jampala Chowdary
భలేI
M.V. Ramanarao గారు ‘మిగతా వారు సంతకం పెట్టారు కాబట్టి నేనూ పెట్టాను అని సమర్థించుకొన్నారు.(రమాదేవిగారు, కాళీపట్నం రామారావుగారు,బేతవోలు రామబ్రహ్మంగారు )’ అన్నారు – వారు ఈ విషయం ఎక్కఢ చదివారో, లేక ఇది తమ చెవిన పడిన విషయమో చెప్పకుండా. శ్యామలరావుగారికి ఇది మింగుడు పడక, ఆ ముగ్గుర్నీకాసిని మాటలన్నారు. బేతవోలు రామబ్రహ్మంగారు ద్రౌపది నవలలో ఆయనకు నచ్చిన అంశాల గురించి ఆంధ్రజ్యోతి వివిధలో వ్రాసిన విపులమైన వ్యాసం వీరి దృష్టికి వచ్చినట్లు లేదు.
కుమారిగారు వారి చెవిన పడిన సంగతి మూడు టలతో ఒక కొంటె వ్యాఖ్యానంతో కలిపి మరీ, ఏ వివరాలు లేకుండా, చెప్పారు. ఆ ‘సత్యా’న్ని చదివి శ్యామలరావుగారు సిగ్గు పడాలి, దారుణం అంటున్నారు.
పుస్తకం చదవక్కర్లేదని తేల్చుకొన్నవారికి, చదవనివారికి పుస్తకంమీద, రచయితమీద రాళ్ళేయటానికి ఏమంత సంకోచం ఉన్నట్టు అనిపించటం లేదు.
“Deja vu all over again!”
తాడిగడప శ్యామలరావు
జంపాలవారు, నాకు రచయితమీద రాళ్ళేయటానికి ఉత్సాహం యేమీలేదని మనవి. చౌర్యం అంటే నా నిరసన తెలిపాను. ప్రసాదుగారు ద్రౌపదిమీద రాళ్ళేయటానికి తమకు ఆక్షేపణ తోచలేదు – అందులో సాహిత్యపు విలువలు, రచయిత స్వేఛ్ఛ కనుపించాయి. సంతోషం.
కుమారి
అయ్యా,
ఈ పుస్తకానికి సంబంధించి ఒక వివాదం నా చెవిన పడింది. ఈ నవల ముందు ఒరియాలో వచ్చిందట. దానికి హిందీ అనువాదం కూడా వచ్చిందట. దానికి అనధికారిక స్వేచ్ఛానువాదమే ఈ ద్రౌపది నవలట. ఈ విషయం తెలిశాక మా టీచర్ “కాపీరైట్ చట్టం అంటే కాపీ కొట్టడం రైటే అని తీర్మానిస్తూ చేసిన చట్టం” అనే కొంటె వ్యాఖ్యానం గుర్తొచ్చింది.
సౌమ్య
కృష్ణ కుమారి గారూ: ఆ ఒరియా నవల పేరు ఏమిటి? ఎవరు రాసారు? ఇంతమంది ఈ పుస్తకం గురించి చెబుతూండగా చూస్తున్నా గత కొన్ని నెలల బట్టీ. ఈ సంగతి ఇదివరలో చూసినట్లు గుర్తులేదు…అందుకే కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. ఇందాకే గూగుల్ శోధనలో “జగ్యసేని” అన్న ఒక ఒరియా నవల ద్రౌపది గురించే అనీ, దాని హిందీ అనువాదం పేరు “ద్రౌపది” అని చదివాను. మీరు చెబుతున్నది దాని గురించేనా?
తాడిగడప శ్యామలరావు
ఇది ఇంకా సిగ్గుపడవలసిన సంగతి. మూల గ్రంధకర్తపేరు చెప్పకుండానే స్వేఛ్ఛగా అనువాదమో చౌర్యమో చేసి వ్రాసిన పుస్తకానికి అవార్డు ఇచ్చారంటే అది దారుణం కాదా?
Siva
కుమారి గారు, ఎవరో ఎక్కడో ఏదో అన్నారని మీ చెవిన పడడం,దానిని మీరు దులిపేసుకోకుండా మరి కొంత మసాలా జోడించి రాయడం, దానిపై శ్యామల రావు గారు వ్యాఖ్యానించడం విషయ నిర్ధారణ చేసుకోకుండా ఒక వ్యక్తి శ్రమను కష్టాన్ని,’చౌర్యం’ అనెయ్యడం న్యాయంగా అనిపిస్తోందాండీ?
నేను యాజ్ఙసేని, ద్రౌపది రెండు పుస్తకాలూ కొని చదివాను. ద్రౌపది యాజ్ఙసేని కి కాపీ అనడం నా దృష్టిలో పొరపాటు. రెండింట్లో కూడా చివర్లో మొదలయ్యి, ఫ్లాష్ బాక్ లాగ కథ సాగుతుంది. (ద్రౌపది లో యుద్దం తర్వాత మొదలయితే, యాజ్ఙసేనిలో స్వర్గారోహణం దగ్గర మొదలవుతుంది). ఇలాంటి ఒకట్రెండు చిన్న చిన్న సామ్యాలు ఉన్నాయేమో కాని, కాపీ అనే పెద్ద మాట వాడడం మాత్రం సబబు కాదు.
-శివ
తాడిగడప శ్యామలరావు
శివగారు. మీరు రెండు పుస్తకాలూ కొని చదివి ఇందులో చౌర్యం యేమీలేదని తేల్చటం ముదావహం.
ద్రౌపది అనే పాత్ర ఒక మషాళా కథనం పుణ్యమా అని సెల్లింగ్ టాపిక్ అవటం విచారించవలసిన విషయం అయినప్పుడు అలా ఆ పాత్రని చిత్రవథ చేతటానికి పడిన కష్టాన్ని అర్థం చేసుకోవటమూ అభినందించటమూ నాకు సాధ్యంకాదని మనవి చేసుకుంటున్నాను.
సమ్యక్కథనం అయితే పేచీయే లేదు.
surampudi pavan santhosh
ఈ పుస్తకం “కొని” చదివితే, రచయిత అనుకున్నది మనం చేసినట్టు అవుతుందని నా భావన. well said. that is why i didn’t bought this novel.
శివరామప్రసాదు kappagamtu
Thank you Pavanjee, You just got my point. I too so far not purchased nor read this book.
surampudi pavan santhosh
ఆంధ్రజ్యోతిలో సీరియల్ గా వస్తుంటే పదిహేను పదహారేళ్ల వయసులో మా ఫ్రెండ్సూ(చెప్పుకోపోవడమేం నేనూ) ఆబగా చదివేవాళ్లం. ఒక పచ్చి శృంగారవర్ణనా నవలగా గుర్తు. అలాంటిదానికి సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చిందని విని షాకయ్యాను.
Dr.M.V.Ramanarao
1.
ఈ పుస్తకం సెన్సేషన్ కలిగించడానికే రాయబడింది.దీనికి అవార్డు ప్రకటించిన కమిటీ వారిని ప్రశ్నిస్తే మిగతా వారు సంతకం పెట్టారు కాబట్టి నేనూ పెట్టాను అని సమర్థించుకొన్నారు.(రమాదేవిగారు, కాళీపట్నం రామారావుగారు,బేతవోలు రామబ్రహ్మంగారు ) .తనని అవమానించిన దుర్యోధన ,దుశ్శాసన, సైంధవ ,కీచకులపై భీమార్జునులచేత పగ తీర్చుకొన్న ధీరవనిత.పరివారాన్ని ,అతిథుల్ని, బంధుమిత్రుల్ని ఎలా ఆదరించాలో చక్కగా తెలిసిన గృహిణి.తన కుమారులను అశ్వథామ చంపినా గురుపుత్రుడని క్షమించి వదిలి వేసింది.ఇంకా ఎన్నో ఉదాత్త గుణాలు కలిగిన స్త్రీ.ఆమెను కేవలం సెక్సు సింబల్గా వర్ణించిన నవలకి ,పోనీ ఇతర గొప్ప గుణాలైనా లేని నవలకి కేంద్ర సాహిత్య అవార్డు ఎందుకు ఇచ్చారో దురూహ్యం.
2.1970 తర్వాత చారిత్రక,పౌరాణిక అంశాలు ,కథలమీద నవలలు రాయడం మొదలైందనడం సరికాదు.అంతకు కొన్ని దశాబ్దాలముందే అలాటి నవలలు చాలా వెలువడ్డాయి.
తాడిగడప శ్యామలరావు
ఇది నాకు మింగుడు పడటం లేదు. లబ్ధప్రతిష్టులూ విజ్ఞులూ అయిన రమాదేవిగారు, కాళీపట్నం రామారావుగారు,బేతవోలు రామబ్రహ్మంగారు వంటివాళ్ళు యింత బాధ్యతారహితంగా యెలా ఉండగలరు?
దీనికి ఒకటే సమాధానం. చేదైనది అయినా ఒప్పుకుని తీరవలసినది – వారికి బాధ్యత ఒకటి ఉందని మనం అనుకుంటున్నామే కాని వారలా అనుకోవటంలేదు – ఒక అకడమిక్ వ్యవహారం గానే వాళ్ళ దీనిని పరిగణించారు. పాపం బిజీ గదా సాహిత్యోధ్ధరణ కార్యక్రమంలోనూ యితర గొప్ప వ్యవహారాలలోనూ. అందుకే వాళ్ళ తమ ఖరీదయిన మేధస్సును యిలాంటి చిన్నచిన్న పనికమాలిన విషయాలకోసం వెచ్చించటం దండగ అనుకున్నారు.
తెలుగు జాతి గుర్తించలవసినవిషయం: “మన వాళ్ళు వఠ్ఠి వెధవాయలోయ్” అని గురజాడ ఊరకే అనలేదు. మనకున్న మాచెడ్డ గొప్ప నిఖార్సయిన లక్షణం యేమిటంటే మనలో మనం తన్నుకు చావటమే. అందుచేత మనని యెవరు మాత్రం యెందుకు గౌరవిస్తారు? ఎందుకు గౌరవించాలి.
పాపం. బాపు, సుశీల, రజని వంటి గొప్పవాళ్ళు శాపవశాత్తు తెలుగు వాళ్ళుగా పుట్టారు.
తాడిగడప శ్యామలరావు
1970 దశకం రెండో భాగంలో చరిత్రను కథలుగా వ్రాయటం అనే పంథా మొదలయ్యింది అన్నారు శివరామప్రసాదుగారు. కాని నోరివారు, బాపిరాజుగారు 70వ దశకం కన్నాముందుగానే చారిత్రకనవలలు చాలా చక్కగా వ్రాసారు కదా?
శివారామ ప్రసాదు కప్పగంతు
చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా వ్రాయటం వేరు, చారిత్రిక సంఘటనలను తీసుకుని రకరకాల మసాళాలను కలిపి వ్రాయటం వేరు. మసాళాలు వేయటం 1970 లలో నుండి మొదలయ్యిందని, నా తాత్పర్యం.
తాడిగడప శ్యామలరావు
శ్రీయార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి ద్రౌపది నవల పై చర్చా సమీక్ష బాగుంది.
ఈ నవల యెంతగా వివాదాస్పదం అయిందో దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించటం అంతకన్నా యెక్కువ వివాదాస్పదం అయింది.
శ్రీలక్ష్మీప్రసాద్ గారు కాక వేరెవరైనా ఈ నవలను వ్రాసి ఉంటే దానికి ఆదరణా, అవార్డు రెండూ అనుమానాస్పదాలే నన్నది నిర్వివాదం.
అత్యంత గౌరవాన్ని పొందిన భారతపాత్రకు అత్యంత విచిత్రంగా రంగులద్దినందుకు యార్లగడ్డవారిని అభినందించాలో అభిశంసించాలో యెవరికి వారే ఆలోచించుకోవలసిన విషయం.
ఒక గొప్ప పాత్రను సంపూర్ణంగా ఆవిష్కరించాలనుకోవటానికి ప్రయత్నించటం అభినందించదగ్గదే. కాని అటువంటి ప్రయత్నంలో పాత్రగౌరవాన్ని తగ్గించేందుకు ప్రయత్నించి – తద్వివాదం ద్వారా లబ్ధి పొందాలనుకోవటం క్షమార్హం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం.
ఒకరు, లబ్ధప్రతిష్టులు యిటువంటి ప్రయత్నం విజయవంతంగా పూర్తిచేస్తే వారు అటువంటి మరికొన్ని దుష్ప్రయోగాలకు ఆద్యులు కావటం మినహాయించి భారతజాతికి ఒరిగే లాభం యేమీ లేదు.
శివరామప్రసాదు kappagamtu
“….శ్రీలక్ష్మీప్రసాద్ గారు కాక వేరెవరైనా ఈ నవలను వ్రాసి ఉంటే దానికి ఆదరణా, అవార్డు రెండూ అనుమానాస్పదాలే….”
బాగా చెప్పారు శ్యామల రావుగారూ. మన మీడియా కూడా చాలా సెలక్టివ్ గా వాళ్ళ దాడి చేస్తుంటారు. తమను “మానేజి” చెయ్యని లేదా చెయ్యలేని వాళ్ళను ఎంచుకుని దాడికి గురిచేస్తూ ఉంటారు.
శివరామప్రసాదు కప్పగంతు
“…ముందుమాటలోనే చెప్పారు, ద్రౌపది మనసును విశ్లేషించి, వ్యక్తిత్వాన్ని చూపించడమే నవల ముఖ్యోద్దేశమని….”
“…ఏ దృష్టిలోనూ ద్రౌపది మనోవిశ్లేషణ జరిగినట్టనిపించదు…”
మీ సమీక్షలో వ్రాసిన రెండు వ్యాక్యాలు చాలు ఈ పుస్తకం చదవక్కర్లేదని నిర్ణయించుకోవటానికి. కాని సమీక్షల మీద ఆధారపడకుండా మనకు మనం చదివి తెలుసుకోవాలంటే చేతి చమురు వదలక తప్పదు కదా!
మొదటి నుంచి ఈ పుస్తకం గురించి అనవసరపు ప్రచార ఎక్కువ జరిగింది అనిపుస్తున్నది. 1970 దశకం రెండో భాగంలో చరిత్రను కథలుగా వ్రాయటం అనే పంథా మొదలయ్యింది. ఈ పుస్తకం కూడా వ్యాపార దృష్టితో వ్రాసినట్టుగా మీ సమీక్ష చదువుతుంటే అవగతం అవుతున్నది కాని, సాహిత్య దృష్టితో వ్రాసినట్టు అనిపించటం లేదు.
ఏది ఏమైనా దొరికినప్పుడు ఈ పుస్తకం “కొని” చదివితే, రచయిత అనుకున్నది మనం చేసినట్టు అవుతుందని నా భావన.