2011 – నా ఆంగ్ల పుస్తక పఠనం

బైటి దేశంలో ఉన్నందుకో ఏమో గానీ, తెలుగు మీదకి గాలి మళ్ళి, అదీ ఇదీ అని తేడా లేకుండా దొరికిన ప్రతి పుస్తకమూ చదివాను. దీనివల్ల, పెద్దగా ఆంగ్ల పుస్తకాలు చదవలేదు కానీ, చదివినంతలో మంచి పుస్తకాలు చదివాను అనుకుంటున్నాను. దాదాపు ప్రతి పుస్తకాన్నీ రెండో సారి చదువుతూ ఉన్నా మరి! చాలా మంది తాము చెబితే ఒకే కానీ, వేరే వాళ్ళు వాళ్ళ పఠన విశేషాలు చెబితే మాత్రం అది సెల్ఫ్-డబ్బా అనడం ఇటీవల తరుచుగా చూస్తున్నాను. ఇవి కేవలం నా పఠనానుభవంలోని విశేషాలు మాత్రమే అని (ఇలాంటి వ్యాసాలు డబ్బా కొట్టడానికి రాయరు అన్న విషయం అర్థం కాని వారికోసం) మరొక్కసారి చెబుతూ, ఇక మొదలుపెడుతున్నాను.

ఆత్మకథలు/జీవిత చరిత్రలు:

ఎంతో కాలంగా వెదుకుతున్న చార్లీ చాప్లిన్ ఆత్మకథ ఎట్టకేలకు ప్యారిస్లో షేక్స్పియర్ అండ్ కొ వారి దుకాణంలో కనబడ్డది. ఆబగా దొరకబుచ్చుకుని చదవడం మొదలుపెట్టాను. చాప్లిన్ అద్భుతమైన కథకుడు అనిపించింది చదువుతూ ఉంటే. అప్పుడొక అనుభవం, ఇప్పుడొక అనుభవం చదువుకుంటూ నెలల తరబడి కొనసాగుతూనే ఉన్నాను. ఇందుకు ఆ చిన్న చిన్న అక్షరాలు మాత్రం కారణం కాదు. పుస్తకం ముగించకూడదు అనిపించీ. ఇలాగే, అప్పుడొకటీ ఇప్పుడొకటీ అనుభవాలు చదువుతూ పూర్తి చేయకుండా ఉంటున్న మరో పుస్తకం – ప్రముఖ స్వీడిష్ దర్శకుడు ఇంగ్మార్ బెర్గ్మాన్(Ingmar Bergman) ఆత్మకథ (The Magic Lantern). బెర్గ్మాన్ సినిమాలు, ఆయన రాసే కథలు, స్క్రీన్ప్లే లు అంటే నాకు చాలా చాలా ఇష్టం. అసలుకి ఈ కథల వెనుక ఉన్న మనిషి కథ ఎలాంటిది? ఎలాంటి నేపథ్యంతో అతను ఈ కథలు సృష్టించాడు? అన్న కుతూహలంతో చదవడం మొదలుపెట్టాను. కొంచెం కొంచెం గా సమాధానాలు దొరుకుతున్నాయి. అయితే, ఇవి కాక, ఆర్ట్ బుక్వాల్డ్ (Art Buchwald) తన చిన్నతనం గురించి రాసిన “Leaving Home” పుస్తకం కూడా నాకు చాలా నచ్చింది. బుక్వాల్డ్ లోని హాస్య చతురతే కాదు… డిప్రెషన్ ని ఎదుర్కుని ఆయన గెలిచినా తీరు కూడా నాకు స్పూర్తివంతంగా ఉంటుంది. ఈ పుస్తకంలో అయన కుటుంబ నేపథ్యం, పరిస్థితుల గురించి చదివాక, ఆయనపై మరింత గౌరవం కలిగింది. ఇది చదివిన ఊపులో ఆయన మరో జ్ఞాపకాల సంకలనం “I’ll always have Paris” చదవడం మొదలుపెట్టి, చాప్లిన్, బెర్గ్మాన్ ల స్వీయ కథనాలలా అప్పుడప్పుడూ ఒక్కో అనుభవం చదువుతూ ఉన్నాను.
ఇవి కాక, మేరీ క్యూరీ గురించి సారా డ్రై రాసిన జీవిత చరిత్రా, ఐన్స్టీన్ గురించి పీటర్ డి.స్మిత్ రాసిన జీవిత చరిత్ర, క్రొయేషియన్ హాస్య రచయిత Marin Drzic గురించి ఎవర్రాసారో తెలియని మరొక జీవిత చరిత్రా చదివాను. క్యూరీ కథ ఒక పక్క స్పూర్తివంతంగానూ, మరోక్కపక్క వర్కహాలిజం వల్ల భయాన్నీ కలిగిస్తే, ఐన్స్టీన్ వ్యక్తిగత జీవితం గురించి చదివాక, బాగా చిరాకు వేసింది. ఇక మారిన్ గురించి తెలుసుకోవడం వల్ల అయన రచనల్ని చదవాలన్న కుతూహలం కలిగింది కానీ, ఆంగ్లానువాదాలు ఎక్కడా దొరకలేదు.

వ్యాసాలు:

ఆర్ట్ బుక్వాల్డ్ రాసిన కాలమ్స్ సంకలనాలు – “We’ll Laugh Again“, “Beating Around the Bush” చదివాను. మొదటిసారి చదివినప్పుడు అప్పటి అమెరికన్ రాజకీయాల గురించి అవగాహన పూర్తిగా లేకపోయినా కూడా, చాలా మట్టుకు వ్యంగ్యాన్ని అర్థం చేస్కోగలిగాను. తరువాత అప్పుడొకటీ ఇప్పుడొకటీ అని రోజూ చదివి,ఇరు పుస్తకాలలోని దాదాపు ప్రతి వ్యాసాన్ని రెండు మూడుసార్లు చదవడం అయ్యాక మరింతగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాను :). ప్రఖ్యాత జర్మన్ వ్యంగ్య రచయిత కుర్ట్ తుకోల్స్కి(Kurt Tucholsky) వ్యాసాల సంకలనం ఒకటి (“The World is a comedy“) అంగ్లానువాదంలో దొరికింది. ఇది కూడా గత పదినెలల కాలంలో ప్రతి వ్యాసం రెండు సార్లైనా చదివి ఉంటాను 🙂

అమెరికాకి వలస వెళ్ళిన వివిధ జాతుల వారి అనుభవాలు, జనరేషన్ గ్యాప్, సాంఘిక అసమానతలు – వీటి అన్నింటినీ స్పృశిస్తూ ప్రముఖ చరిత్రకారుడు రోనాల్డ్ టొకాకి సంకలనం చేసిన “A Larger Memory” వ్యాసాలను చదువుతూ, భిన్న రకాల ఉద్వేగాలకి లోనయ్యాను. మళ్ళీ మళ్ళీ చదివా చాలా వ్యాసాలని ఇందులో కూడా. ప్రముఖ భాషా శాస్త్రవేత్త గయ్ డాయిషర్(Guy Deutscher -ఆయనతో పుస్తకం.నెట్ ఇంటర్వ్యూ ఇక్కడ చూడవచ్చు.) రాసిన “Through the language glass” పుస్తకం కూడా నా ఆలోచన విధానాన్ని బాగా ప్రభావితం చేసిందనే చెప్పాలి. ఈ కోవలోనే బాగా ఆలోచింపజేసిన మరో పుస్తకం సంవత్సరాంతంలో చదివిన – “వైట్ పేరడైస్: హెల్ ఫర్ ఆఫ్రికా?“. రువాండా నుంచి చదువుకోవడానికి జర్మనీ వచ్చిన Nsekuye Bizimana 1989 లో ఇరు ఖండాల నాగరికతలనూ, ఆర్ధిక సామజిక వ్యవస్థలనూ పోలుస్తూ తన అనుభవాలు పంచుకున్న పుస్తకం. ఒక్కొక్క చోట్ల అభిప్రాయాలు మరీ ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు తోచినా, ఆ అనుభవాలు చెప్పుకోవడంలో ఉన్న నిజాయితీ నాకు చాలా నచ్చింది. అలాగే, ఇది కూడా బాగా ఆలోచింపజేసే పుస్తకం. సరిగ్గా చదవలె కానీ, మంచి శక్తివంతమైన పుస్తకం.

ఇక జర్మనీ దేశం గురించి, స్టీవెన్ సోమర్స్(Steven Somers) రాసిన “Those Crazy Germans“, జర్మనీ దేశంలో పర్యటనలు చేస్తూ ఆ అనుభవాలను రాసిన “Germany: Unraveling an Enigma” (Greg Neeves), “The Bells in their silence” (Michael Gorra) కూడా చదివాను. మొదటిది మరీ తేలిపోయింది. రెండవది కొంచెం అకాడమిక్ గా ఉన్నా కూడా, సులభ గ్రాహ్యంగా ఉంది. మూడవది మాత్రం ఆకడమిక్స్ కోసం రాసినదే..మాములు జనానికి బోరు కొట్టించేది అని నా అభిప్రాయం. చివరగా, డేనిష్ డిజైన్ మ్యూజియం వారు తమ సంగ్రహాలయం గురించి వెలువరించిన: “Beyond all bounds: Art and Craft 1880-1910” అన్న పుస్తకం, స్వీడెన్లోని మాల్మో నగరం కోట గురించి అక్కడి పర్యాటక శాఖ వారు వెలువరించిన “Malmöhus Castle” -రెండూ కూడా, అసలుకి డిజైన్ గురించి ఏమాత్రం సంబంధం లేకపోయినా, కోట అంతగా నచ్చకపోయినా కూడా, ఆపకుండా చదివించాయి (చిన్న పుస్తకాలే అనుకోండి, అది వేరే సంగతి!).

Umberto Eco రాసిన “The search for the perfect language” మొదలుపెట్టాను కానీ, మొదలుపెట్టినప్పుడే ఇది నా అవగాహన స్థాయికి మించి ఉన్న రచన అని తెలుసు. అందుకని, ఒకటికి రెండుసార్లు చదివిందే చదివి అర్థం చేసుకుంటూ పరమ నెమ్మదిగా సాగుతున్నాను. బహుసా కొన్ని నెలలు పడుతుందేమో ఇది నేను పూర్తి చేసేసరికి!

సాంకేతికం: ఈ ఏడాది నేను ఎక్కువగా చదివినవి సాంకేతిక పుస్తకాలు, వ్యాసాలు, పరిశోధన పత్రాలే. వీటిల్లో “Producing Open Source Software” పుస్తకం బాగా ప్రభావం చూపిన పుస్తకం. కోరాడ మహాదేవశాస్త్రి గారి “Descriptive Grammar and Handbook of Modern Telugu” చదవడం మొదలుపెట్టా కానీ, ఇలా విదేశీయుల కోసం రాసిన పుస్తకాన్ని నేటివ్ స్పీకర్ చదవడంలో ఉన్న పొరపాటు అర్థమయ్యి, ఆపేశాను. ఇక, ఇవి కాక మిగితా పుస్తకాలు ఏవీ పూర్తిగా చదవలేదు. కొన్ని చాప్టర్లు చదవడం దాటి ముందుకు పోలేదు.


నాటికలు, స్క్రీన్ప్లే లు వగైరా:

పైన చెప్పినట్లు ఇంగ్మార్ బెర్గ్మాన్ సినిమాల మీద ఉన్న ఇష్టం కొద్దీ ఆయన స్క్రీన్ప్లే లు కొన్ని (Seventh Seal, The Torment, Wild Strawberries, Persona, The Silence వగైరా) చదివాను. నాకు అద్భుతంగా అనిపించాయి. ఆయన ఆత్మకథ చదువుతూ, ఆయన్ని బాగా ప్రభావితం చేసిన స్వీడిష్ రచయిత ఆగస్ట్ స్త్రిండ్బర్గ్ (August Strindberg) రచనలు కూడా అన్వేషించడం మొదలుపెట్టి, ప్రాజెక్ట్ గుటెన్బర్గ్ పేజీల్లో దొరికిన నాటిక ఒకటి చదివాను (The Father). అది చాలా నచ్చింది. బహుశా నన్ను ఆవరించిన ఇంగ్లీష్ ఫిక్షన్ బ్లాక్ తొలగాక ఈ ఏడాది మరేవన్నా చదువుతానేమో ఆయనవి. ఇవి తప్ప నేను ఈ ఏడాది చదివిన (ఆంగ్లం లో రాసిన) ఫిక్షన్ దాదాపు శూన్యం. విలియన్ సరోయన్ (William Saroyan) కథలు, కేథరిన్ మాన్స్ఫీల్డ్ (Katherine Mansfield) కథలు కొన్ని చదివానంతే. ఒక బాల్కన్ నవల మొదలుపెట్టి వాళ్ళ దేశాలు దాటగానే గాలి మళ్ళి చదవడం ఆపేశాను. ఈ ఏడాదన్నా ఏమన్నా ఫిక్షన్ చదవగలనేమో చూడాలి.

You Might Also Like

2 Comments

  1. ఆ.సౌమ్య

    Great Going!

    చాప్లిన్ స్వీయ చరిత్రకి చదవాలన్నది నా చిరకాల వాంఛ. నాకా పుస్తకం ఎప్పుడు దొరుకుతుందో, నా కల ఎప్పటికి నెరవేరుతుందో!
    అన్నట్టు సౌమ్య…మీరు ఇండియా ఎప్పుడు వస్తారు? 🙂

  2. Phaneendra

    Am jealous of you.
    Though am comfortable in reading Telugu literature, English is still a nightmare for me. I started reading English fiction hardly 2-3 years ago. That too.. Sydney Sheldon, Jeffrey Archer, Dan Brown etc. I know they are hardly just beyond the pulp fiction level. An Agatha drama is in hand but am not yet reading it. My big problem is that I am not at all comfortable with non fiction in non – mother tongue. 🙂

Leave a Reply